కొండూరు వీరరాఘవాచార్యులుగారి లేపాక్షి నవల

చారిత్ర్యకమగు నవల అని ఉపశీర్షిక. విజయనగరరాజులకాలంలో జరిగినట్టు చిత్రించేరు.  ప్రచురణ 1969లో.

మనసంస్కృతిలో ప్రసిద్ధమైన చతుష్షష్టికళలలో పాషాణకళగా పేర్కొన్న శిల్పకళ మేధాసంపన్నం. శిల్పాగమ, జ్యోతి, వాస్తు, సంగీత, నాట్య, యాగాది బహువిద్యలను అధ్యయనం చేసి ఆకళించుకుంటారు శిల్పులు. ఈ నవలలో సందర్భానుసారం రచయిత పొందుపరిచిన విషయసంపద చూస్తే అవాక్కయిపోతాం. శిల్పకళకి సంబంధించిన అనేక సూక్ష్మాలు తెలుసుకొనగోరువారికి ఇది మంచి పరిచయం కాగలదు.

ప్రధాన శిల్పాచార్యులు పురుషోత్తమాచార్యులు. వారి మూలపురుషులయిన ఋషులు, వారి వంశక్రమం ప్రస్తావించడం బాగుంది. శిల్పులు విద్యావంతులు. శిల్పశాస్త్రంతోపాటు, జ్యోతిష్కం, వాస్తు, సంగీతం, సాహిత్యం, వేదాంగాలు, ఆగమాలు కూడా చదువుకున్నవారయి ఉంటారు. అనేక గ్రంథాలు సంస్కృతంలో ఉంటాయి కనక సంస్కృతం కూడా నేర్చివారై ఉంటారు. శిల్పశాస్త్రవిద్యాలయాలగురించిన విశేషాలు కూడా చేర్చేరు ఈగ్రంథంలో.

శిల్పం ఎంపికలోనే అనేక సూక్ష్మాలున్నాయి. పురుష, స్త్రీ, తిర్యక్ జీవులకి వేరు వేరు శిలలు కావాలి. దోషం లేని శిల అయిఉండాలి. అలాగే కొలతలవిషయంలోనూ సునిశిత  విషయ పరిజ్ఞానం అవుసరం.

కళలు స్థిరకళ, చరకళ అని రెండు విధాలు. శిల్పం, చిత్రం స్థిరకళలు. సంగీతం, నాట్యం చరకళలు. వీటిలో అంతర్గతంగా రెండు ప్రవాహాలు–దర్శనీయం, ఆధ్యాత్మికం. అన్ని శిల్పాలూ చూడడానికి ఆహ్లాదకరమై మనోరంజకమై అనుభవంలోకి వస్తాయి ఒకస్థాయిలో. మరొక స్థాయిలో ఆధ్యాత్మికపరమైన అర్థాలు గోచరించి, ఆత్మజ్ఞానానికి మార్గదర్శకమవుతాయి.

శిల ఎంపిక స్త్రీ, పురుష, తదితరజీవులనుబట్టి  ఉంటుందిట.

అలాగే కొలతలవిషయంలోనూ శ్రద్ధగా గమనించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి.

నాకు ప్రత్యేకంగా ఇక్కడ కనిపించింది శిల్పాచార్యుని వేలు ప్రమాణంగా తీసుకొనడం. అది ఆ శిల్పికీ శిల్పానికీ మధ్య ఒక అవినాభావసంబంధం కల్పిస్తుందేమో. యజమానివేలు బహుశా వారి సత్సంకల్పానికి ఆనవాలుగానేమో. ఇవి నాఆలోచనలు మాత్రమే.

కథాకాలం విజయనగరసామ్రాజ్యంలో సకలకళలూ అసామాన్యప్రతిభతో విరాజిల్లుతున్నకాలం. కృష్ణదేవరాయలు గతించేక, రఘునాథరాయలు సింహాసనం అధిష్ఠించి, సంగీత, సాహిత్య, నాట్యకళల పూర్వవైభావాన్ని మరింత సుసంపన్నం చేసినకాలం.

వారిఆస్థానంలో కోశాగారిగా ఉన్న విరుపణ్ణను మండలాధిపతిగా నియమించిన తరువాత, లేపాక్షి ఆలయనిర్మాణానికి నియమిస్తాడు రఘునాథరాయలు. విరుపణ్ణ శైవభక్తుడు. తనగురువు టెంకణాచార్యులతో సంప్రదించి, ఆయనసలహాప్రకారం పురుషోత్తమస్థపతిని ప్రధానాచార్యునిగా నియమించుకుని, యోగ్యులయిన తమిళ, కర్ణాటక, మళయాళ శిల్పులను రావించి, శాస్త్రోక్తంగా ఆ దైవకార్యానికి పూనుకుంటాడు.

ఆలయనిర్మాణసమయంలో ప్రతి అడుగునా ఒకొక మూర్తినీ ప్రత్యేకతలనూ, ఆ మూర్తులను రూపించుకోడానికి శిల్పులు చేసిన నిర్ణయాలనూ వివరించడంలో రచయిత తీసుకున్న శ్రద్ధ శ్లాఘనీయం. శిల్ప, చిత్రలేఖనంలోని శాస్త్రపరమైన వివరాలు అందిస్తూనే, నవలను కాల్పనికసాహిత్యంగా తీరిచిదిద్దిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుదనడంలో సందేహం లేదు.

కారణం కేవలం శాస్త్రచర్చలతోనే నడపడం కాక, మానవసంబంధాలను పటుతరంగా చిత్రించడం. పురుషోత్తమాచార్యులకీ వారికుమార్తె లక్ష్మీకి తండ్రీకూతుళ్ల అనుబంధమే కాక గురుశిష్య అనుబంధం కూడా ఎంతో చక్కగా ప్రస్ఫుటమవుతుంది ఈనవలలో. లక్ష్మి అడిగేప్రశ్నలకి సమాధానంగా పురుషోత్తముడు శిల్పాలకూ, చిత్రాలకూ సంబంధించినవిషయాలు వివరించడం పాఠకులకూ ఒక పాఠమే.

సాహిత్యము శబ్దబ్రహ్మము అయితే శిల్పము రూపబ్రహ్మము అంటూ శిల్పములో సాకారానిరాకారబ్రహ్మల తత్త్వమును వివరిస్తారు. లేపాక్షిలో మండపంలో వటపత్రశాయి చిత్రం ఆశ్చర్యజనకమైనది. ఆచిత్రవిశేషం మంటపంలో ఎక్కడ నిలబడి చూసినా ఆ బాలకృష్ణుడు తనవైపే చూస్తున్నట్టు కనిపించడం. శిల్పాచార్యుడు ఈచిత్రంగురించి లౌకికపరంగానూ, ఆధ్యాత్మికంగానూ వివరించడం బాగుంది. ఇలాటి అద్భుతాలు అనేకం ఈనవలలో అడుగడుగునా కనిపించి పాఠకులని అలరిస్తాయి.

అలాగే పురుషోత్తముడు రఘునాథమూర్తివిగ్రహం ఎలా రూపొందించాలన్న సంశయం కలిగినప్పుడు తల్లిని సలహా అడుగుతాడు. ఇలా శాస్త్రప్రధానంగా రచించిన నవలలో మానవీయకోణాలు సమపాళ్ళలో సమకూర్చడంవల్ల ఈగ్రంథం నవలగా పరిపూర్ణత సంతరించుకుంది.

శ్రీకృష్ణదేవరాయలఆస్థానంలో రాజనర్తకి కుప్పాయమ్మ. సంగీత, నాట్య, సాహిత్యాలలో దక్షిణాపథమంతటికి పేరుపొందిన నర్తకి. ఆమె పెంపుడుకొమార్తె పద్మిని తల్లిని మించిన నట్టువరాలు. పద్మినీజాతి స్త్రీలకుండగల సౌందర్యవతి. సకలసల్లక్షణలక్షిత. నిరాధార అయిన పద్మిని విరుపణ్ణ ఇంట చేరుతుంది. ఆఇంట నివశిస్తున్న మరొక యువకుడు,  విరుపణ్ణ, కామాక్షిదంపతుల మేనల్లుడు మాచమూర్తి.

ఈయువతీయువకులు– వీరభద్రప్ప, చెన్నబసప్ప, మాచమూర్తి, పద్మిని, లక్ష్మి, గౌరి–వీరందరూ సంగీతం, శిల్పం, నాట్యకళలలో ఆసక్తి ప్రాతిపదిక ఒకరికొకరు ఆకర్షితులు కావడం, పెద్దలు వారి వివాహాలు చర్చించడం, మొత్తంమీద ఎవరికి ఎవరితో వివాహం కాగలదు వంటివి ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో సదాశివరాయలు ఆస్థానంలోని ఒక రాజపుత్రుడు కృష్ణప్పనాయకుడు పద్మినిని కోరి, ఆమె నిరాకరించినందున పగ బట్టి కుట్రలు పన్నడం ఒక దుర్ఘటన అయితే, ఆ కుట్రలవలన బాధితుడయిన విరుపణ్ణ ఆ పరిస్థితులను ఎదుర్కొన్నవిధానం, వాటికి ప్రతిగా తనజీవితాన్ని మలుచుకున్న విధానం మరొక మంచి పాఠం ఈనవలలో. కష్టాలు అందరికీ అనుభవమే. వాటిని తమజీవితానికి ఎలా అన్వయించుకుని, ఎలా మలుచుకోవాలన్న ఆలోచనే చాలామందికి రాదు. కారులో కాలు పెట్టకుండా వీధి చివరకి నడవనివారు మార్గమధ్యంలో కారు చెడిపోతే, నాలుగు మైళ్లైనా నడిచి ఇంటికి చేరుకోడంలాటిదే.

పద్మినిజన్మవృత్తాంతం, ఆమె సంగీత, నాట్యకళాప్రతిభా, వాటికి సంబంధించిన అనేక ఇతర విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

కొండూరు వీరరాఘవాచార్యులుగారు వివిధఅంశాలకు సంబంధించిన సూక్ష్మవివరాలు సేకరించడంలో చేసినకృషి, వాటిని కథలో పొందు పరిచిన విధానం ఎంతైనా మెచ్చుకోవాలి. ఆయన తమముందుమాటలో ఆవిషయాలను సంగ్రహించడానికి ఏ యే ప్రదేశాలు సందర్శించేరో, ఏ యే గ్రంథాలు సంప్రదించేరో, ఏ యే వ్యక్తులను కలుసుకుని సమాచారం సేకరించేరో చూస్తే చాలు ఈ నవలారచన ఎంత క్లిష్టతరమైనదో తెలుస్తుంది.

ఈ చిరుగ్రంథం (269 పుటలు)లో కొన్ని చోట్ల (అధ్యాయాలు 9, 10)) రాజకీయాలూ,  యుద్ధాలూ చరిత్రపాఠంలా అనిపించినా, అంతకుముందు, ఆ తరవాత కూడా, కథంతా వివిధ ఆకృతుల రూపకల్పనా చమత్కృతులను వర్ణించడంతోనే సాగుతుంది.

ఇంత చెప్పేక, ఇంక చదవడానికేముంది అని అనుకోవద్దు. ఇది కేవలం విషయసూచికలాటిది. సూక్ష్మవిషయాలు, విశేషాలూ తెలుసుకోడానికి పుస్తకం చదవాలి.

గ్రంథకర్త శ్రీ కొండూరు వీరరాఘవాచార్యులుగారికి వీరరాఘవాచార్యులుగారికి నాహృదయపూర్వక కృతజ్ఞతలు. వారికృషిగురించిన వివరాలు తెవికీలో చూడవచ్చు.

ఆర్కైవ్.ఆర్గ్ సౌజన్యంతో, లేపాక్షి నవల leipaaqs-i

000

(సెప్టెంబరు 15, 2019)

 

 

 

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “కొండూరు వీరరాఘవాచార్యులుగారి లేపాక్షి నవల”

 1. లేపాక్షి నవల పూర్తిగా చదివాను. చాలా గొప్ప రచన. విరూపణ్ణ , అచ్యుత రాయలు, పద్మిని, వీరభద్రప్ప, పురుషోత్తమ స్థపతి, లక్ష్మి , కుప్పాయమ్మ, కృష్ణప్ప .. అన్ని పాత్రలు సజీవంగా కళ్ళ ముందు కదలాడతాయి. పాత్రలలోని ఉదాత్తత, కథను కొనసాగించిన తీరు, శిల్ప, ఆధ్యాత్మిక, చిత్ర, లోహ శిల్ప కళ , palace intrigue , విజయ నగర సామ్రాజ్య చరమాంకం సాగుతున్న తీరు, అన్నిటికీ మించి నవల కు ఇచ్చిన ముగింపు అద్భుతం. రచయితా వీర రాఘవాచార్యులు గొప్ప నవలను రచించారు. చిన్న పాత్ర అయిన కన్నప్ప ఉదాత్తత నన్ను అమితంగా ఆకట్టుకుంది.

  శిల్ప కళ ఔన్నత్యం వివరించిన తీరు రచయిత లోతైన పరిశోధన చూపిస్తుంది. భారతీయ కళల గొప్పతనం తెలుసుకొని హృదయం ఉప్పొంగిపోతుంది. ప్రతి సాహిత్యాభిమాని తప్పక చదవాల్సిన రచన.

  ఈ నవల రాజమౌళి వంటి దర్శకుడు అనుకుంటే ఒక అద్భుత చిత్రం కాగలదు.

  మీరు ఈ మహోన్నత రచన పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు మాలతి గారు.

  మెచ్చుకోండి

 2. లేదండి. వాదన లేదు. నేను దేశానికి చాలా దూరంలో ఉండడంవల్ల నాకు అనేక సంగతులు తెలీవు. మీరన్నమాట నిజమే. క్రౌర్యం వేరు. నిర్లక్ష్యం వేరు. ఇప్పుడు కాపాడాలన్న స్పృహ కలగడం చాలా సంతోషించవలసిన విషయం. తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలా కొనసాగించగలరని ఆశిద్దాం.

  మెచ్చుకోండి

 3. కొంత నిర్లక్ష్యం జరిగిన మాట నిజమే. కానీ ఇప్పుడు చాలావరకూ మిగిలిన కట్టడాలను కాపాడుతున్నారు అనిపిస్తుంది. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో శిల్పాలయాల పరిరక్షణ బాగుంది.

  1) నిర్లక్ష్యం వల్లనో, పురాతత్వమ్ వల్లనో సహజంగా శిధిలమ వ్వడం

  2) ద్వేషంతో కరడుగట్టిన క్రూరత్వం తో అద్భుత శిల్ప సౌందర్యాలను విరగ గొట్టడం , హైందవ బౌద్ధ దేవాలయాలు నేలమట్టం చేయడం .

  It is unfair to take them in the same breath.

  Afghanistan లో బమియన్ బుద్ధ విగ్రహాలు 2001 లో ధ్వంసం చేశారు.

  ఇంత మూర్ఖత్వం, క్రూరత్వం ఈ నాటికీ ఉంది.

  40 ఏళ్ల తరువాత హిందువుల పరిస్థితి తలచుకుంటే భయం వేస్తుంది.

  మీతో వాదన చేయాలని కాదండి. నా అభిప్రాయం చెప్పాను అంతే.

  మెచ్చుకోండి

 4. “భలే సమాధానం ఇచ్చారు” అనకండి. నేను Gkk గారి అభిప్రాయాన్ని తక్కువ చేయడంలేదు. వారి మాట నిజమే అన్నాను. ముష్కురులు ధ్వంసం చేసినందుకూ విచారించవలసిందే, ఇప్పుడు మనవాళ్ళే నిర్లక్ష్యం చేస్తున్నందుకూ విచారించవలసిందే.

  మెచ్చుకోండి

 5. భలే సమాధానం ఇచ్చారు మాలతిగారూ….నేను ఎన్నో ఏళ్ళనుండీ అన్వేషిస్తున్న ప్రశ్న అది. మొన్న హంపి గురించి వ్రాసిన వ్యాసాలలో కూడా ద్వంసమైన శిల్ప కళ గురించి ఆవేదన వ్యక్తపరిచారు. కానీ సదరు ప్రదేశాలలో కూడా వారసత్వ సంపదని కాపాడుతున్న దాఖలాలు ఏవీ లేవు. ఉత్తరభారతదేశంలో శిల్పకళ శూన్యం. హిందూత్వం గురించి వాళ్ళే ఎక్కువ మాట్లాడుతుంటారు.

  మెచ్చుకోండి

 6. ధన్యవాదాలు. ముష్కురులు ధ్వంసం చేసినమాట నిజమే. మిగిలిన శిల్పాలను ఇప్పటివారు కూడా ఏమీ జాగ్రత్త చేస్తున్నట్టు కనిపించడం లేదు కదా.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 7. ఇంత గొప్ప దైన భారతీయ శిల్పకళను అర్థం చేసుకోలేని ముష్కర తురక మూకలు అపురూపమైన శిల్పాలను ధ్వంసం చేశారు.

  ప్రపంచ చరిత్ర లోనే ఇది తీర్చలేని విషాదం

  మీ పుస్తక పరిచయ వ్యాసం చాలా బాగుంది మాలతి గారు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.