బతుకు విభవం (కవితలు)

బతుకువిభవం

కొన్ని దశాబ్దాలు గడిచేక

జీవనసూత్రాలు మారిపోతాయి.

ఒంటికి మంచిది కాదంటూ తినకూడనివి ఉండవింక

జిహ్వ కోరే రుచులే ముఖ్యం.

కిటికీలూ తలుపులూ మూసుకున్నగదుల్లో నాలుగ్గోడలమధ్య

బిగుసుకున్నగాలి భరించలేక, చల్లని మంచిగాలికోసం బయటికి వెళ్తే

దారిపొడుగునా చెత్తబండీలు, leaf blowersతో నిలువెత్తు దుమ్మురేపేపనివాళ్లు

నా పాదయాత్రలని రద్దు చేయలేరు.

నూనె మంచిది కాదు, నెయ్యి మంచిది కాదు

కాఫీ పైత్యం, కారం పైత్యం, అరటికాయ కస,

వంకాయ కనరు, బెండకాయ జిగురు, కాకరకాయ చేదు

అంటూ పక్కన పెట్టేయడం జరగదింక.

రెండూళ్ల అవతల అడవులు తగలబడిపోయి

air quality చెడి, దగ్గులూ తుమ్ములూ …

దగ్గుతూ, తుమ్ముతూనే తిరుగుతాను కానీ మానడం లేదు.

హంసలా ఆర్నెల్లు బతకాలన్న సూక్తి పదే పదే తల్చుకుంటాను.

నాలుగోపాదం అంత హాయి మరి లేదు.

నిజంగా బతుకు విభవం తెలిసేది అప్పుడేనేమో.

000

(అక్టోబరు 15, 2019)

000

అంతర్జాలం

ఊహాలను రేకెత్తించే ఒకే ఒకసాధనం

నానావిధప్రసూనాల సువాసనలు
నోరూరించే వంటకాలు
పారే సెలయేరుహోరులు
నక్షత్రాల మిలమిలలు
చందమామవెన్నెలవెలుగురేఖలు
మార్తాండుని వేడిమిపోకడలు

నీలితెరమీద కళ్ళకి ఉత్తుత్తివిందులు.
ఊహలలో అనుభవించమంటూ.

మెదళ్లను పదును పెట్టు ఈ సానరాయి నవ్యాధునికసృష్టి
అపరవిశ్వామిత్రునిలా.

000

(సెప్టంబరు 29, 2019)

000

అస్పష్టం

మనసులో మెదిలిన ఆలోచనలు అస్పష్టంగా
నీడల్లా నీటిలో చిరుతరగల్లా కదుల్తూ మెదుల్తూ సాగిపోతున్నాయి.
గురుతుపట్టి అభివర్ణించేలోపున
స్వరూపాలు మారిపోతున్నాయి.

పావుగంటక్రితం చూసినదృశ్యం ఇప్పుడు లేదు.
వాటిని వివరించడానికి అవుసరమైన పదాలు కకావికలై చెదిరిపడిపోతున్నాయి.

అందుకే వివరించే ప్రయత్నం మానుకుని
నాలో నేనే మురిసిపోతున్నాను,

000

(సెప్టెంబరు 28, 2019)

000

కారణాలు లేవు.

చీకటిలో తడుముకుంటూ తిరుగుతాను
దీపం వెలిగించుకోవచ్చు కదా
అంటే చెప్పలేను.

మాటలకి అర్థాలకోసం నాబుర్లలో వెతుక్కుంటాను.
అడగొచ్చు, నిఘంటువులో చూడొచ్చు కదా
అంటే చెప్పలేను.

మొండితనమో, మూర్ఖత్వమో
మరేదో దానికదే నన్ను నడిపిస్తుంది
నాకు సంతృప్తినిస్తుంది.
నాకు బలాన్నీ, మనోధర్యాన్నీ ప్రసాదిస్తుంది

000

(సెప్టంబరు 21, 2019)

(Facebook లో ప్రచురించిన కవితలు. )

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.