పదేళ్ళు నిండేయి తెలుగుతూలికకి.

ఈ బ్లాగు మొదలుపెట్టి నిన్నటికి పదేళ్ళయింది. 800 పోస్టులు రాసేను. కొన్ని సరదాగా చదువుకునేవి, కొన్ని పండితుల ఆదరణ పొందిన వ్యాసాలు, కథలు. 36వేల చూపులు కనిపిస్తున్నాయి.  syndicated views లెక్కలు కనిపించడంలేదు కానీ ఇంతకి రెట్టింపు ఉండవచ్చు.

ఈమధ్య నేను రాయడం తగ్గించేసినా, సందర్శకులు ఉన్నట్టే కనిపిస్తోంది గణాంకాలు చూస్తే. కొంతవరకూ ఫేస్బుక్ ప్రవేశం కారణం. అక్కడ కొత్తగా పరిచయమైన మిత్రులు ఇక్కడికొచ్చి కథలూ, వ్యాసాలు చదువుతున్నారు.

ఈ సందర్భంలో మీ అందరి ఆదరాభిమానాలకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

ఈ సందర్భంలోనే మరొక విషయం కూడా ప్రస్తావిస్తాను. ఫేస్బుక్కులో మిత్రులు కొందరు  స్వీయచరిత్ర రాయమని కోరుతున్నారు. వారికి సమాధానంగా రాసిన పోస్టు ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను.

ఒక్కమాటలో చెప్పాలంటే నాకు స్వీయచరిత్ర రాసే ఉద్దేశం లేదు.

అసలు నాకు స్వీయచరిత్రలు అంతగా నచ్చవు. నేను చదివినవి రెండో మూడో. నేను చూసినంతవరకూ స్వీయచరిత్ర కూడా కాల్పనికసాహిత్యమే.  మహానుభావులు తమ దృక్పథాలనీ, తాము నమ్మిన సిద్ధాంతాలనీ ప్రచురించడానికి స్వీయచరిత్రలు రాస్తారు. ఆ స్వీయచరిత్రలలో ఇంట్లో స్త్రీలగురించి నిజాయితీతో రాయరు. అవి వారికోణాన్ని ప్రతిపాస్తాయే తప్ప నిష్పాక్షికం కావు. దాన్ని పఠనీయం చేయడంకోసం తప్పనిసరిగా కాల్పనికసాహిత్యలక్షణాలను ఆశ్రయించవలసి ఉంటుంది కూడా.

ఇంక నేనెందుకు రాయదలుచుకోలేదో చెప్తాను. ఓంప్రథమంగా నాకు అంతటి ఘనమైన చరిత్ర లేదనే నా నమ్మకం. కానీ కొందరైనా అడుగుతున్నారు కనక ఉందనే అనుకుందాం మాటవరసకి. చి.న.

ఈనాటి పాఠకులస్పందనలు, ముఖ్యంగా మహా రచయిత్రుల, రచయితల, విమర్శకుల, సాహిత్యమహాసారథుల స్పందనలు ప్రోత్సాహకరంగా లేవు.

ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. 60వ దశకంనాటికే మంచి కథలు రాస్తున్నానన్న పేరు నాకు వచ్చింది. అప్పట్లో ఈ అంతర్జాలం లేదు. నేను మీటింగులకి వెళ్ళీ, రచయితలతో పరిచయాలు పెంచుకునీ ఏ నెట్వర్కింగూ చేయలేదు. బృహత్గ్రంథాలు చదవనూ లేదు. నాఇంట్లో నేను కూర్చుని నాకు తోచిన ఆలోచనలతో నేను కథలు రాసుకునేదాన్ని. అలాటి పరిస్థితులలోనే ఆంధ్రరచయిత్రులసభలలలో రెండుసార్లు పిలిచి సత్కరించేరు. అంచేతే ధైర్యంగా నాకు పేరుందని చెప్పగలుగుతున్నాను.

ఇప్పుడు నాకు పేరు మరోవిధంగా వచ్చింది, నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథమూలంగా. అయితే అది మంచి కథ అన్న కారణంగా కాదు. నేను ఆకథలో ఆవిష్కరించదలుచుకున్నవి రెండు అంశాలు.

  1. అప్పట్లో అంటే 60, 70 దశకాల్లో అమెరికా వచ్చిన తెలుగువాళ్ళలో తెలుగు సంప్రదాయాలూ, అలవాట్లూ, పురాతన భావాలూ మారకపోవడంచేత కలిగే సంఘర్షణ. 2. కొ్త్తగా ప్రచారంలోకి వస్తున్న స్త్రీవాదం. పాతభావాలూ, కొత్త భావాలు కలగాపులగంగా కలిపేసుకుని, స్త్రీవాదంపేరున ఆడవాళ్ళూ మగవాళ్లూ కూడా ఓ కృత్రిమనడవడి సృష్టించుకోడం. నాకథ స్త్రీవాదకథ కాదు, స్త్రీవాదులని హేళన చేసినకథ.

ఈ రెండు ఆలోచనలూ మన మహారచయిత్రులకీ, రచయితలకీ, విమర్శకులకీ, సాహిత్యసారథులకీ తోచలేదో పట్టించుకోలేదో కానీ నాకథని గాసిప్ కథగా వీళ్ళంతా వాడుకున్నారు. తన్మూలంగా జరిగినదేమిటంటే, కొందరికి నేనంటే జాలి, కొందరికి నేనంటే కక్ష ఏర్పడ్డాయి. ఇది నాకు అసహ్యం.

అసలు కథని కథగా తీసుకుని కథలో ఇతివృత్తం, భాష, శైలి, జాతీయాలు, అలంకారవిశేషాలు గమనించడం తగ్గిపోయింది. మహా అయితే “కథ చదివేను. అక్షరదోషాలున్నాయి” అంటారు మన విమర్శకులిప్పుడు.

ఇలాటి నేపథ్యంలో నేను ఆత్మకథ రాస్తే, జరిగేది కూడా అదే. అందులోనుండి మనం గ్రహించగలిగేది ఏమిటి అని కాక, ఎవరు, ఎక్కడ, ఏమిటి … అంటూ ఆరాలు తీసి, ఉన్నవీ లేనివీ కల్పించి గాసిప్ కథలు ప్రచారం చేస్తారు మన రచయతలూ, విమర్శకులూను. వాళ్ళకి మరిన్ని గడ్డిపరకలు పడవేసే సరదా నాకు లేదు.

అంచేత, నా స్వీయచరిత్రకోసం ఎదురు చూస్తున్నవారికి క్షమాపణలు మాత్రం చెప్పుకుని విరమిస్తాను. అంతకంటె ఆచరణదృష్ట్యా చెప్పాలంటే, అంత భారీ రచనలు రాసే ఓపిక కూడా లేదు.

మరొకసారి ధన్యవాదాలతో,

శలవు తీసుకుంటాను. ఈ బ్లాగు ఇలాగే ఉంటుంది. మీకు చదవాలని తోచినప్పుడు వచ్చి చదువుకోవచ్చు నిశ్చింతగా.

000

(డిసెంబరు 10, 2019)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.