ధైర్యం

“నాసంగతి మీకు తెలీదు,” అన్నాడతను విసురుగా గేటుతలుపు తోసుకుని లోపలికొస్తూ.

వరండాలో వాలుకుర్చీలో కూర్చునిఉన్నాను. తలెత్తి అతనివేపు చూసేను.

“ఆమాత్రం ధైర్యం లేకుండానే ఇంతదూరం వచ్చేనా?” అన్నాను మెల్లిగా.

హ్మ్ అని, “చూద్దురుగాని,” అనేసి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయేడు.

నిలువెత్తు మనిషి. సన్నగా ఉన్నా దృఢంగా ఉన్నాడు.

నేను పిసరంత మనిషిని. అతనిపక్కన నిలబడితే జబ్బలవరకూ వస్తానేమో.

ఆక్షణంలో అతను నన్ను ఊచిపుచ్చుకు ఒక్కటిచ్చుకుంటే అక్కడ నన్ను రక్షించే నాథుడెవరూ లేడు.

మెతకమనిషిని. మాటకి మాట టకటక జవాబులు చెప్పగల చేవ లేదు నాకు.  చెప్పలేను. ఆక్షణంలో మాత్రం నానోట ఆమాట వచ్చింది, “ఆమాత్రం ధైర్యం లేకుండానే ఇంతదూరం వస్తానా?”

అయిదువందల మైళ్ళు. కాలం, ఖర్మం కలిసొచ్చి పెద్ద ఉద్యోగమే, పాతికమందిమీద అజమాయిషీ, వచ్చింది కానీ  నాకు అంత వయసూ లేదు, అనుభవమూ లేదు.

అతనికి అంత కోపం రావడంలో తప్పు లేదు.

విషజ్వరంతో ఆస్పత్రిలో చేరిన నాలుగోరోజు మరో గుమాస్తా వచ్చి అతను పోయేడని చెప్పేడు. సంతాపసూచకంగా నేను ఆఫీసు మూసేసేను ఆరోజుకి.

ఆస్పత్రికి ఫోను చేసి వివరాలు కనుక్కోకపోవడం, పరిస్థితి నిర్ధారించుకోకపోవడం నాతప్పు.

అనుభవం లేక పొరపాటు జరిగిపోయింది.

ఆతరవాత అతను కోలుకుని ఆఫీసుకొచ్చేడు.

ఆసాయంత్రం మాఇంటికొచ్చేడు.

అతను కోపంగా అన్నాడు.

నేను మెల్లిగా జవాబిచ్చేను.

అమ్మ పక్కగదిలో ఉంది. ఏమయిందని అమ్మ అడగలేదు. నేను చెప్పలేదు.

మర్నాడు మామూలుగా ఆఫీసుకి వెళ్ళేను.

అతను ఆఫీసుకి వచ్చేడు.

ఇద్దరం మామూలుగా ఎవరిపని వారు చేసుకుంటూ పోయేం.

మరే విపరీతాలూ జరగలేదు.

000

మరో వారంరోజులుండి అమ్మ మాఊరు వెళ్లిపోయింది.

మరో రెణ్ణెల్లతరవాత శలవులకి మాఊరు వెళ్లేను.

అమ్మ హాల్లో ఎవరితోనో మాటాడుతోంది. నేను పక్కగదిలో ఉన్నాను. అమ్మమాటలు వినిపిస్తున్నాయి.

“… … …  అంది. దానికి చాలా ధైర్యం. నాకు దాన్నిగురించి చింతలేదు.”

నామాటతో అమ్మబెంగ తీరిపోయింది.

అమ్మమాటతో నాకు మరింత బలం వచ్చింది.

 

అమ్మకి నాగురించి బెంగలేదింక అనుకుంటే అదో తృప్తి, మరింత ధైర్యం.

000

(డిసెంబరు 14, 2019)

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ధైర్యం”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.