మైత్రికి నిర్వచనం

“నీకు స్నేహితులు లేరా?”

మా బిల్డింగులో ఉన్న, నాకు కొన్నేళ్ళగా పరిచయం ఉన్న ఒక అమ్మాయి అడగడంతో నాకు అసలు స్నేహం అంటే ఏమిటి అన్న సందేహం కలిగింది.

యోగసూత్రాలలో నాకు చాలా నచ్చిన ఒక సూత్రం

మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనాతః చిత్తప్రసాదనమ్.
– పతంజలి యోగసూత్రములు. సాధనపాదం

అని. మైత్రీభావంవల్ల చిత్తం సుప్రసన్నంగా ఉండగలదని.

ఇది ఏ ఒక్కరిపట్లనో మాత్రమే కాక సమస్తజీవరాసులయందు సాదరభావంతో మెలగాలని చెప్తున్నట్టు ఉంది.

మామూలుగా స్నేహితుడనో స్నేహితురాలనో అన్నప్పుడు ఆ వ్యక్తితో తమకి గల ఒక ప్రత్యేక అనుబంధంగానే చెప్పుకుంటారు.

నాకు మాత్రం మైత్రి అంటే మరింత విస్తృతమైన అర్థం ఉందనిపిస్తుంది.

మళ్ళీ పదం అంటే కూడా నాకు ప్రత్యేకార్థం ఉంది.

అప్పుడే వికసించిన పూవు

వీధిలో నరులూ వాహనాలూ కూడా లేనిసమయంలో ఆవరించిన నిశ్శబ్దాలమధ్య కదాచితుగా వినిపించే పిట్టల కలకలారావాలు

చిరుగాలికి ఊగులాడే చివుళ్ళూ

వీధికిరుపక్కలా చిన్న చప్పుళ్ళు చేస్తూ పారే నీరూ

ఇలాటివి కలిగించే మానసికోల్లాసం అనుకుంటాను స్నేహం కూడా.

స్నేహం సాటిమనుషులతో కావచ్చు, ప్రకృతితో కావచ్చు.

పదం కూడా ఇలాటిదే. తెలుగుపదం కానీ సంస్కృతపదం కానీ నాకు అలాటి ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

యోగసూత్రాలు చదివినప్పుడు నేనేదో ఆ సూత్రాలన్నీ పాటించి, కైవల్యం పొందేస్తానని కాదు. నిజానికి నాకంత పరిపక్వత లేదు. కేవలం

ఆ సూత్రాలలో వాక్యనిర్మాణం, పదాలలో శబ్దసౌందర్యం నన్ను ఆకర్షించేయి. ఆమీదట, కొన్ని సూత్రాలలో ఇప్పుడు నిత్యజీవితంలో ఉపయోగించుకోగల సూచనలు కూడా కనిపించేయి.

అలాటిదృక్పథంతో ఆ యోగసూత్రం నిన్న ఉదయం నామనసులో మెదిలింది. అందులో పేర్కొన్న గుణాలన్నీ సుగుణాలే. మనసు ప్రశాంతంగా ఉంచుకోడానికి ఉపయోగపడేవే. అంతవరకే నేను చూసుకున్నాను.

ఇలా మైత్రికి ప్రత్యేకంగా ఒక నిర్వచనం ఇచ్చుకోలేకపోయినా, అది కనిపించిన సందర్భాలు చెప్పుకోగలం కదా.

000

జూడీ నాకు పాతికేళ్ళగా పరిచయం. ఆవిడ మూడు పుస్తకాలు ప్రచురించేరు ఇప్పటికి. వేరేవారి కథలు వాళ్ళతో మాటాడుతూ వారికథనం గ్రంథస్థం  చేసేరు. ఇక్కడ రెండు పుస్తకాలగురించి చెప్తాను

మొదటిపుస్తకం 20ఏళ్ళ క్రితం ప్రచురణ అయింది. నిజంగా జరిగిన కథ. ఒకావిడ కొత్తకారు వాకిట్లో ఉంచి ఇంట్లో పడుకుని ఉండగా, ఇద్దరు కుర్రాళ్ళు -చిన్నవాళ్లే 15, 17- తుపాకీతో ఆమెని కాల్చేసి, కారు తీసుకుని పారిపోయేరు.

ఆవిడ ప్రాణం పోలేదు కానీ శారీరకంగా దారుణహింసకి గురైంది. కాళ్లు పడిపోయేయి. నోరు పడిపోయింది. తుపాకిగుండు తునకలు తలలో ఇరుక్కుపోవడంచేత తరుచూ విపరీతమైన బాధ.

కారు దొంగలించిన కుర్రాళ్ళు పట్టుబడ్డారు. శిక్ష పడింది. 65, 80 సంవత్సరాలు.

ఆవిడకి వాళ్ళంటే కోపం లేదు. వాళ్ళని చూడడానికి జైలుకి వెళ్తుంది ప్రతి ఏడూ. ఇప్పటికి కూడా. అందరూ అడుగుతారు “నీబతుకు నాశనం చేసేరు. ఎలా క్షమించగలవు వాళ్ళని?” అని.

“Because I am Jackie Millar” అని ఆమె సమాధానం. అదే ఆ పుస్తకం పేరు.

ఇది స్నేహం కాదు, క్షమగురించి అని అనిపించవచ్చు. కానీ స్నేహం అలా ఏర్పడింది వాళ్ళమధ్య. పైన యోగసూత్రంలో చెప్పినట్టు దుఃఖాన్ని ఆకట్టుకోడానికి ఉదాసీనంగా ఉండడం మార్గం అంటారు. ఇక్కడ ఆవిడ దుఃఖాన్ని ఉదాసీనతను దాటుకుని, క్షమద్వారా స్నేహాన్ని పెంపు చేసుకుంది అనిపిస్తుంది.

ఆ యువకులు కూడా పశ్చాత్తాపం వెలిబుచ్చేరు. ఎంతవరకంటే, parole hearing సమయంలో ఆవిడని సాక్ష్యం చెప్పమని ఆడగడానికి ఒప్పుకోలేదు. ఆవిడకి ఇష్టమై చెప్తే సరే కానీ మేం అడగడం న్యాయం కాదు అన్నారు అడగమని సూచించినవారితో.

ఏ జీవి అయినా-మనుషులే కాదు పక్షులూ మృగాలూ-సమస్త జీవరాసిలోనూ ఈ గుణం ఉంది. అదే గుంపుతత్వం కూడా. ఎవరిలో ఏరూపంలో కనిపిస్తుందో చెప్పలేం.

నేను ప్రస్తావించదలుచుకున్న రెండో పుస్తకం

In Warm Blood: Privilege and Prison; Hurt and Heart by Judith Gwinn Adrian.

పుస్తకం పేరులోనే కనిపిస్తుంది ప్రధానాంశం. జూడీ (Judy) భాగ్యవంతులబిడ్డ. శ్వేతజాతి స్త్రీ. డెరెన్ (DarRen) ఆజన్మఖైదీ. జమైకాదేశంనుండి వలస వచ్చిన కుటుంబం. స్థూలంగా చూస్తే వారి జీవితాలలో హస్తిమశకాంతరం తేడా. జూడీకి ఖైదీలజీవితాలగురించి ఆసక్తి కలగడానికి కారణం తన తండ్రి ఒక దుకాణం దోచుకోడం. ఎందుకు చేసేడో జూడీకి తెలీదు. అంతా గుంభన.

డెరేన్ దుర్భరపరిస్థితులలో పెరిగినవాడు. పెద్దకుటుంబం. దారిద్ర్యం. పైగా చెముడు. నత్తి. 17వ ఏట జైల్లో పడ్డాడు. ఈ పుస్తకం ప్రచురించేవేళకి 30 ఏళ్లు ఉండొచ్చు. తన పరిస్థితులను మానసికంగా దాటుకుని. తనని తాను రక్షించుకునే ప్రయత్నం డెరెన్  వేసిన చిత్రాలలో కనిపిస్తుంది. (http://www.darrenmorrisart.com/).

ఆ ఇద్దరి వ్యథ, సౌజన్యం ఈ పుస్తకంలో ఉత్తర ప్రత్యురాలరూపంలో ఆవిష్కృతమైయింది. జూడీ ఆతను పెరిగినవాతావరణం, కుటుంబం, పరిస్థితులగురించి ప్రశ్నలు వేస్తుంటే, అతను ఎంతో వివరంగా తన చిన్నతనం, ఇల్లు, కుటుంబంగురించి ఎంతో వివరంగా రాస్తాడు. వాటిలో అతనిధారణ, వివేచన, సూక్ష్మదృష్టి గమనిస్తే మనకి అతనియందు గౌరవం కలుగుతుంది. నాకు అతనంటే గౌరవం కలిగింది.

తన మనసు స్తిమితంగా ఉంచుకోడానికి, మరోలా చెప్పాలంటే పిచ్చేత్తిపోకుండా ఉండడానికి, చిత్రరచన ఒక మార్గం అయితే రెండోది తమజాతి భగవంతుడైన Jahయందు విశ్వాసం కలిగి ఉండడం. అది తాను బతికిఉండడానికి అవుసరం అంటాడు డెరెన్. ఆనమ్మకంలో భాగమే వాళ్ళ అమ్మమ్మ బోధించిన మంత్రం – పెద్దవాళ్లు పిల్లలని రక్షించాలన్నది. తనకుటుంబంలో పెద్దవాళ్లు – తల్లి, అన్నలు- క్రూరంగా తనని హింసించినా, తనకి వీలయినంవరకూ ఇతరులని రక్షించడానికే పూనుకుంటాడు. డ్రగ్స్, దొంగతనాలు హత్యా నాధ్యేయం కాదు. నాకు ఉపాధ్యాయవృత్తి ఇష్టం అంటాడు డెరెన్.

సుమారుగా కథ ఇంతే. డెరెన్ ఉత్తరాలలో వివరాలను తనజీవితంలో సంఘటనలతో, వ్యక్తులతో సరి పోల్చి చూసుకుంటూ వాటిగురించిన అవగాహన పెంచుకోగలగడం జూడీకి ఫలశృతి. ఒక సందర్భంలో తాను అతనిని ప్రశ్నలతో మరింత వ్యథ కలిగిస్తున్నానా, అతను తనగతాన్ని అలా తనకోసం జ్ఠప్తికి తెచ్చుకోడంవల్ల సాంత్వన పొందుతున్నాడా, మరింత వ్యథకి గురి అవుతున్నాడా అన్న సంశయం కలుగుతుంది ఆవిడకి. క్రమంగా మనిద్దరం ఒక కుటుంబం అన్న స్థాయి వస్తారు. అదే మైత్రి.

 

పుస్తకం చివర, సమాజంలో ఖైదీలపట్ల జరుగుతున్న అక్రమాలూ, అన్యాయాలూవిషయంలో మనం వారికి ఏవిదమైన మద్దతు ఇవ్వాలనుకున్నా ఉపయోగపడగల సంస్థలు, అవకాశాలు జాబితా కూడా ఇచ్చేరు.

000

ఈపుస్తకం చదువుతుంటే నాకు కనిపించిన మరొక కోణం ప్రస్తావించడానికే ఈ టపా మొదలు పెట్టేను.

డెరెన్ కుటుంబానికి సంబంధించిన కొన్ని అంశాలు- ఉమ్మడికుటుంబాలలో ఒకరినొకరు ఆదుకునే తీరు, తల్లులు పిల్లలకి ఇచ్చే శిక్షణ, తిండి, బట్టలవిషయంలో మన సంప్రదాయఛాయలు కనిపిస్తాయి.  రెండు, మూడు తరాలక్రితం పెద్దలప్రవర్తన మనదేశంలో కంటే ఇతరదేశాలలో భిన్నం కాదని అర్థమవుతుంది. ఈ కోణం పరిశీలించి చూసుకోడానికి మనవాళ్లు ఈపుస్తకం చదవాలనుకుంటాను. ఇది కాకపోతే ఇలాటిది మరొకటి చూడండి. అమెరికా అంటే మనవాళ్ళలో ఉన్న అపోహలు తొలగడానికి పనికొస్తుంది కొంతవరకూ ఇది.

నాకు జూడీని పాతికేళ్లగా తెలిసినా నాకు తెలీని ఎన్నో సంగతులు ఈ పుస్తకంద్వారా తెలిసేయి. 20 ఏళ్ళక్రితం మేమిద్దరం 11 మంది కాలేజీ విద్యార్థులని గుంటూరులో మంగాదేవిగారి వెంకటేస్వర్ బాలకుటీరికి తీసుకెళ్లేం. అక్కడ రెండు వారాలున్నాం.

చెప్పొచ్చేది అంత దగ్గరగా ఉన్నా ఆవిడగురించి నాకేమీ తెలీదు. స్నేహితులు అనిపించుకోగల దగ్గరతనం ఏర్పడలేదు. ఫేస్పుక్కులో నా మిత్రమండలిలో ఉన్నారు. తెలుగు రాదు కానీ నేను పోస్టు చేసే ఫొటోలు చూసి ఆనందిస్తున్నాను అన్నారు ఒకసారి నాతో.

 

ఈ పుస్తకం In Warm Blood: Privilege and Prison; Hurt and Heart by Judith Gwinn Adrian. అమెజాన్ లో దొరుకుతుంది.

https://www.amazon.com/dp/B00HI31OMK/ref=dp-kindle-redirect?_encoding=UTF8&btkr=1

000

మళ్లీ మొదటి ప్రశ్న”నీకు స్నేహితులు లేరా?” గురించి వ్యాఖ్యానించి ముగిస్తాను.

సుమారు రెండు నెలలక్రితం మా బిల్డింగులో ఉన్న అమ్మాయి ప్రశ్న అది.

నాకు ఆశ్చర్యం. ఎందుకంటే కనిపించినప్పుడల్లా, నడివీధిలోనైనా సరే, కారాపేసి నాలుగు నిముషాలు నాతో మాటాడేది ఆవిడే.

20 ఏళ్ళక్రితం ఏదో పరిస్థితుల్లో తటస్థపడింది. ఏం మాటాడుకున్నామో గుర్తు లేదు. మళ్ళీ నేనిక్కడ నావాటాలో దిగిన రోజున ఎదురై, తనకి తనే వెనకటి పరిచయం గుర్తు చేసింది. కనిపించినప్పుడుల్లా మాటాడుతుంది. నాకు ఏమైనా కావాలా అని అడుగుతుంది. ఒకసారి నాకు ఏదో కావలిసివస్తే ఆవిడనే పిలిచేను. మరి అలాటప్పుడు నాస్నేహితురాలికిందే లెక్క కదా.

“నువ్వు నా స్నేహితురాలివే అనుకున్నాను,” అనో “నువ్వు కాదా?” అనో నేను అడగలేదు. నాకు తోచలేదు. అప్పటికి ఆ సంభాషణ ముగిసింది కానీ నాకు అయోమయం అయిపోయింది. రవంత చిన్నతనంగా కూడా అనిపించింది అనొచ్చు.

నేను మైత్రిగురించి మొదలు పెట్టడానికి పైన చెప్పిన పుస్తకాలు ఒక కారణమయితే,  ఈ ప్రశ్న మరో కారణం. ముఖ్యంగా ఈరోజల్లో ఈ ప్రెండు, బెస్టు ఫ్రెండూ, బెస్టెస్టు ఫ్రెండూ లాటి పదాలు విచ్చలవిడిగా అర్థం లేకుండా వాడేస్తున్నారన్న భావం కూడాను. అంచేత అసలు స్నేహితుడు, స్నేహితురాలు అంటే అర్థం ఏమిటీ అని నాకు ఆలోచనలు.

నాబ్లాగులో కథల్లోనూ కబుర్లలోనూ నాకు స్నేహాలు, ముఖ్యంగా మనవాళ్ళతో, అచ్చిరావు అని తెలివిడి చేసేను కదా.

80లు దాటేవేళకి. ఆసంగతి గ్రహించినదానినై, స్నేహవ్యవసాయం మానేసేను. అసలు నిజానికి నేనెప్పుడూ అలాటి కర్షకప్రక్రియ చేపట్టలేదు. నాకు భయం అవతలివారికి ఇష్టం ఉండదేమో అని. ఇప్పటివరకూ దాదాపు అందరూ వాళ్లకి వాళ్ళే ముందుకి వచ్చినవాళ్ళు. కొంతకాలం టెస్ట్ డ్రైవ్ అయేక, వాళ్ళో నేనో తెగతెంపులు చేసుకోడం జరిగిపోతుంది

000

అమెరికా వచ్చేక, నాకు తటస్థపడ్డ మిత్రులు వేరు. నేను దిగగానే నాకు కనిపించినవాళ్ళందరికీ మనదేశం, మన సంస్కృతి అంటే గౌరవం, ఆసక్తి గలవారే  అవడం నాతత్వానికి సరిపోయింది, అంట్లగిన్నెలు కడిగేటప్పుడు కట్టిన చీరే కూడా వారికి అద్భుతంంగా కనిపించడం చూసి నాకు నవ్వొచ్చేది. వంట ఎలా తగలబడినా బాగుంది బాగుంది అంటూ తినడం చూస్తే నాకు బతుకు చాలా తేలిక అయిపోయింది. అంచేత నా అలవాట్లు మార్చుకుని అమెరికా జీవనవిదానంలో ఇంకిపోయే అవుసరం కలగలేదు. ఆతరవాత నేను తలుగు పాఠాలు చెప్పే ఉద్యోగంతో కూడా నా అలవాట్లకి సరిపోయేయి..

చూసేరు కదా. ఈ వాతావరణంలో నాతో మైత్రి కోరినవారందరితో నా పద్ధతిప్రకారమే సాగించుకున్నాను. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానంగానే, వాళ్ళ ప్రోత్సాహంతోనే అనువాదాలు మొదలు పెట్టేను. మన కథలద్వారా వారికి మన సంస్కృతిగురించి తెలియజేయడం. తూలిక వెబ్ సైటులో నావ్యాసాలు ఇతర అమెరికన్ ప్రొఫెసర్లదృష్టిలో కూడా పడ్డాయి.

క్రమంగా నాకు తృప్తి నిచ్చేవి ఇలాటి స్నేహాలే అని అర్థమయింది. మనవాళ్ళందరికీ నావ్యక్తిగత జీవితంమీదే దృష్టి. అందుకు భిన్నంగా నారచనలద్వారా పరిచయమైన స్నేహాలే నాకు తృప్తినీ ఆనందాన్నీ కలిగించేయి.

అంచేత నా స్నేహాలన్నీ వాటికి పరిమితం చేయడం మొదలు పెట్టేను. ఇప్పుడు మీకు అర్థం అయిందనుకుంటాను ఇక్కడా ముఖపుస్తకంలోనూ కూడా మైత్రిని టపాలకే ఎందుకు పరిమితం చేస్తున్నానో.

మైత్రి అంటే నిర్వచనం చెప్పడం కష్టం. నామటుకు నాకు ఒక నిర్వచనంం – ఎదటివ్యక్తికి ఏది సుఖమో అది చేయడమే కానీ మీకు చేయాలనిపించినది చేయడం కాదు అని.

మిత్ర అంటే సూర్యుడు. మైత్రి బహుశా సూర్యునివంటిదేమో. సూర్యుడు వెలుగు ప్రసాదించినట్టే మైత్రి మనకి మననీ ఎదటివారినీ అర్థం చేసుకోడానికి దోహదమవుతుంది. సూర్యకిరణాలు బహుముఖంగా ప్రసరించినట్టే మైత్రి అనేక కోణాలలో గోచరమవుతుంది.

000

(ఫిబ్రవరి 6, 2020)

 

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.