మన రచయిత్రులు – ఒక పరిశీలన

మహిళాదినోత్సవం సందర్భంగా మరొకసారి ముందుకు తెస్తున్నాను ఈవ్యాసం, కొత్తగా నాబ్లాగు చదవడం మొదలు  పెట్టినవారికోసం.

000

నేను ఇంగ్లీషులో రాసిన  Telugu Women Writers, 1950-75 అన్న పుస్తకానికి  నేపథ్యం వివరించడానికి ఈ వ్యాసం. ఈవ్యాసంలో కొంతభాగం స్త్రీల రచనలు – ఒక చారిత్ర్యక పరిశీలన” అన్న శీర్షికతో రచన, అక్టోబరు 2002,లో ప్రచురింపబడింది.

ఈవ్యాసం ధ్యేయం సాంఘిక, సామాజిక పరిస్థితుల పరిశీలినే గానీ రచనల పరిశీలన కాదని గమనించగలరు.

                                      000

1950-1975 మధ్య కాలంలో రచయిత్రులు కధానికా, నవలాసాహిత్యంలో ప్రముఖపాత్ర వహించారన్నది అందరూ ఒప్పుకుంటారు. ఆ ప్రాముఖ్యతకి కారణాలు కూడా స్థూలంగా ఆనాటి సాంఘికపరిస్థితులూ, రాజకీయ పరిస్థితులూ అని కూడా అందరూ అంగీకరించిందే..

గత 11 శతాబ్దాలు స్థూలంగా కాక, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సంఘటన తీసుకుని పరిశీలిస్తే బోధపడే సత్యాలను పరామర్శించడం ఈ వ్యాసంలో నా లక్ష్యం.

జానపద సాహిత్యం, బాగా ప్రాచుర్యంలో వున్న వాఙ్మయంమాట ఆటుంచి, ఇంట కూర్చుని కాలక్షేపానికే కలం పుచ్చుకుని రచనలు చేసిన స్త్రీలు ఎవరు అంటే  ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారి “ఆంధ్ర కవయిత్రులు” చూడాలి. లక్ష్మీకాన్తమ్మగారు తమ గ్రంథంలో రెండువందలమందికి పైగా మహిళలు సృష్టించిన సాహిత్యం గురించి ప్రస్తావించారు. వీరందరూ కవిత్వమే రాయడం ఆనాటి సాంప్రదాయాన్ననుసరించి జరిగింది.

ఆధునిక కథావాఙ్మయంలో నాచర్చదృష్ట్యా నేను పరిశీలిస్తున్న అంశాలు మూడు. 1. సాంఘికంగా రచయిత్రులు తమకి తాముగా సంతరించుకున్న స్థానం. 2. వారి విద్యాపరిమితులు, 3. సంఘంలో కాలక్రమాన వచ్చిన మార్పులు. ఇవన్నీ ఒకదానినుండి మరొకటి విడదీయలేనంతగా పెనవేసుకుని ఉన్నాయన్నది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.

స్త్రీలకి తరతరాలుగా విద్యాసదుపాయాలు లేవని పదేపదే చెప్పుకుంటున్నాం స్థూలంగా. కానీ అది అందరిపట్ల నిజం కాదని తేలిగ్గానే తెలుస్తోంది. లక్ష్మీకాన్తమ్మగారు ఉల్లేఖించిన 200మందికి పైగా వున్న కవయిత్రులని గమనిస్తే. అయితే వారందరూ ఉన్నతకుటుంబాలకి చెందినవారు. రాజులూ, బ్రాహ్మణులూ, ఇతర ధనికవర్గాలు. 12-19 శతాబ్దాలమధ్య, తాళ్లపాక తిమ్మక్కనుండీ కిందటితరం ముద్దుపళని వరకూ కవిత్వం చెప్పగలవారే. ఆకాలంలో విద్య వున్నత కుటుంబాలలోవారికే పరిమితమయింది. ఉన్నతకుటుంబాలలో స్త్రీలు చదువుకున్నవారే.

ఈవాతావరణానికి కారణం సాంప్రదాయం. ఇది తప్పా ఒప్పా అన్నది కాదు నాచర్చ. జరిగినకథ అర్థం చేసుకోవాలన్న యత్నంలో భాగం మాత్రమే ఇది. ఆనాటిసాంఘికపరిస్థితులలో -రాచపుట్టుక అయినా కాకపోయినా- జరుగుబాటుగల అన్ని కుటుంబాలలోనూ స్త్రీలకి రాణివాసం వుండేది. తద్వారా వారికి ఓపలేనంత తీరిక. రచన ఒక కాలక్షేపం. వారి కథావస్తువులు దైవచింతనా, ధార్మికచింతనా, లేదా వీరగాథలూ, కదాచితుగా శృంగారం. ఆ కార్యక్రమంలో వ్యవస్థని ప్రతిఘటించే తత్త్వం లేకపోవడం గమనార్హం. అంచేతే అప్పట్లో స్త్రీలరచనావ్యాసంగానికి మగవారు అభ్యంతరపెట్టలేదు.

ఉదాహరణకి శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె, రచయిత్రి అయిన మోహనాంగి కథలో సందేశం చూడండి.

రాయలవారు ఆలోచనాధీన అయిన కుమార్తెను చూచి, “ఎట్టి గట్టి సమస్య పట్టుకొంటి”వని అడిగితే, ఆమె ఇచ్చిన సమాధానం,

“తండ్రీ, సమస్యపూర్తికి నెదం దలపోయుటలేదు

మీరలేమండ్రొ! మదీయ సాహసము నారసి

అని, “కావ్యమొనర్ప బూనితి … గేలి సేయు జనులందరు మెచ్చెడునట్టి శైలితో” అంటుంది. ఇక్కడ నాకు పాదం పూర్తిగా జ్ఞాపకం లేదు కానీ, ఆడవారు వంటయింటిలో నుండక ఈరాతలెందుకు అని గేలి సేయు జనులకి అని చెబుతుంది.

ఆమాటకి రాయలువారి సమాధానం, “పలుకవమ్మ మరొక్క తరిని…. ఎంతచెప్పిన వినకయుంటివింత దనుక”అంటూ పరమానందం వెలిబుచ్చడమే కాక, “నీ మృదుకవితాశైలి కొమ్ములు తిరిగిన మదవత్కవి పుంగవులకును గలుగవు” అని అభినందించాడు (లక్ష్మీకాన్తమ్మ. పు.30-31).

నావ్యాసం ప్రచురించిన తరవాత, నేను నాయని కృష్ణకుమారిగారినీ, కోలవెన్ను మలయవాసినిగారినీ కలవడం జరిగింది. వారిద్దరూ కూడా కృష్ణదేవరాయలికి మోహనాంగి అన్న కుమార్తె వున్నట్టు  ఆధారాలు లేవనీ, ఆమె రాసింది అని చెప్పుకుంటున్న మరీచీపరిణయకర్త ఎవరో నిర్ధారణగా తెలియదనీ అన్నారు నాతో. ఇద్దరూ కూడా సాహిత్యంలో విశేషమైన కృషి చేసిన విదుషీమణులు కనక వారి మాట గౌరవిస్తాను.  మోహనాంగి కథ కట్టుకథే అనుకున్న తరవాత, నాకు తోచిన అభిప్రాయం ఇలాటి కథ పుట్టడానికి కారణాలు వెతికినప్పుడు ఆనాటి సాంఘికపరిస్థితులు తెల్లమవుతాయని.

ఉదాహరణకి, ఒక రచయిత కానీ రచయిత్రి కానీ ఒక సాధారణకుటుంబంలోని తండ్రీ కూతుళ్లమధ్య జరిగిన కథని ప్రభువులకథగా మలిచివుండవచ్చు ఆఅంశానికి సాహిత్యస్థాయి కల్పించడంకోసం. అలాగే అందులో “గేలి సేయు జనులందరు మెచ్చెడు రీతిలో” కవితలు అల్లాలి అంటే ఆనాడు గేలి సేయు జనులున్నప్పుడే కదా అలాటి ఆలోచన కలిగేది. సమాజంలో అట్టే గౌరవప్రతిపత్తులు లేని ఒకసామాన్య కవయిత్రి ఇలాటి కథ కల్పించివుండవచ్చు. ఇది పరిశోధకులు చేపట్టవలసిన అంశం.

ఇది 16వ శతాబ్దపుకథగా చెప్పుకుంటారు. అంతకు పూర్వం 11వ శతాబ్దంలో భాస్కరాచార్యుడు తనకుమార్తె లీలావతి వితంతువు కాగలదని జ్యోతిశ్శాస్త్రంమూలంగా గ్రహించి, ఆమెని గణితశాస్త్రవిశారదని చేసినకథ చాలామందికి తెలిసిందే. లీలావతి ఆయన కుమార్తె కాదనీ, భార్య అనీ, ఆయనే లీలావతీగణితం రాసి, భార్య పేరు పెట్టేరనీ కూడా ఒకకథ ప్రచారంలో వుంది. దీనివెనక గల చరిత్రకూడా ఎవరూ అట్టే పరిశీలించినట్టు కనిపించదు.

చారిత్ర్యకంగా మనకి ఆట్టే దూరం కాని కథ భండారు అచ్చమాంబకథ. ఆమె తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావుగారు వీరేశలింగంగారిద్వారా ప్రభావితుడైన సంఘసంస్కర్త, ప్రముఖ పాత్రికేయుడు. ఆయన ప్రోత్సాహంతోనే అచ్చమాంబగారు ఓనమాలతో మొదలుపెట్టి మహా రచయిత్రి స్థాయికి చేరుకున్నారు. ఆవిడ మొదట చదువుపట్ల ఉదాసీనంగానే వున్నారనీ, తమ్ముడు ప్రోత్సహిస్తూంటే ఇతర కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారనీ, అప్పుడు అచ్చమాంబగారే ఆఇతరసభ్యులని ఒప్పించి. చదువుకున్నారనీ లక్ష్మీకాన్తమ్మగారు రాశారు. ఆరోజుల్లో అది సామాన్యమైన విషయమేమీ కాదు. అచ్చమాంబ తెలుగులోనే కాక సంస్కృతంలోనూ ఇంగ్లీషులోనూ కూడా నిష్ణాతురాలై, అబలాసచ్చరిత్రవంటి గ్రంధాలూ, కథలూ రాసి చరిత్రలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. (లక్ష్మీకాన్తమ్మ, 105-06)

20వ శతాబ్దం తొలిదశకంలో బెంగుళూరు నాగరత్నమ్మ గారు ముద్దుపళని రాసిన రాధికాస్వాంతనం ప్రచురించడానికి ప్రయత్నించినపుడు, ప్రభుత్వం (అదీ బ్రిటిష్ వారు!, వీరేశలింగంగారూ ) నిషేధించేరనీ, తరవాత, కొందరు తెలుగు పండితులు పూనుకుని ఆనిషేధాజ్ఞను శ్రమ పడి తొలగించారని ఆరుద్ర సాధికాస్వాంతనం పీఠికలో రాసారు. (పు.20-21).

ఈకథలన్నిటిలోనూ సూత్రప్రాయంగా స్పష్టమవుతున్న విషయం ఉన్నతకుటుంబాల్లో మగవారు ఆడవారి విద్యార్జనకీ రచనావ్యాసంగానికీ చేయూతనివ్వడం. ఇందులో పరిమితులు నేను కాదనడం లేదు. ఇది కలవారి కుటుంబాల్లోనే జరిగింది. రెండోది ఆటంకాలు లేకపోవడం స్త్రీలు ఇంట్లోనే వుండి చదువుకున్నారు కనక.

ఈసందర్భంలో వీరేశలింగంగారి కృషి ప్రస్తావించక తప్పదు. ఆయనకాలంలో స్త్రీపునర్వివాహ చర్చల్లో ఆడవారూ, మగవారూ ఇరుపక్షాలా వుండడం గమనార్హం. అంటే మనదేశంలో ఇది జండర్ సమస్యగా కాక సాంఘికసమస్య అని అంగీకరించాలి. మౌలికంగా ఆయన కృషిని హర్షించిన స్త్రీలలో కొన్ని విషయాల్లో ఆయన్ని ప్రతిఘటించిన వారున్నారు,. వీరేశలింగంగారు ప్రచారం చేసిన స్త్రీపునర్వివాహాలను నిరసిస్తూ పులుగుర్త లక్ష్మీనరసమాంబగారు“సావిత్రి” అనే మాసపత్రిక స్థాపించి నడిపారు కొంతకాలం. (లక్ష్మణరెడ్డి. తెలుగులో పత్రికారచన. పు.121).

పులుగుర్త లక్ష్మీనరసమాంబగారి మనుమరాలు నాస్నేహితురాలు. మేం ఆంధ్రాయూనివర్సిటీలో కలిసి చదువుకున్నాం. తనవివాహవిషయంలో తాను స్వతంత్రించి నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారనీ (అబ్బాయి కమ్యూనిస్టు కావడం ఒక అభ్యంతరం), నాయనమ్మ లక్ష్మీనరసమాంబగారు మాత్రం మనసారా దీవించి, పెళ్లి చేసుకోమని చెప్పి పంపించారనీ చెప్పింది నాతో. అంటే స్థూలంగా మనం చెప్పుకునే సాంఘిక న్యాయాలకీ, ధర్మాలకీ, నిత్యజీవితంలో మనకోరికలకీ, కార్యసాధనకీ అనుగుణంగా మనం చేసుకునే నిర్ణయాలకీ ఎడం వుంటుంది. ఆ ఎడం గుర్తించినపుడు, సాంఘికపరిస్థితుల అవగాహనలో స్పష్టత ధృధతరం కాగలదు. ఒకచిత్రంలో ప్రతిరేఖా మరొక కోణాన్ని అందించినట్టే.

ఇటువంటిదే మరొక కథ. వీరేశలింగంగారి చివరిదశలో బత్తుల కామాక్షమ్మ గారు రెండు పదులు నిండని బాలిక. వితంతువు. ఆమె రాసిన తన “స్మృతులు, అనుభవములు” అన్న చిన్న వ్యాసం (నాలుగుపేజీలే) చదువుతుంటే నాకు కనులు చెమ్మగిల్లేయి.. ఆనాటి సాంఘికపరిస్థితులలో తాను ఏవిధంగా నెగ్గుకొచ్చారో వివరించారు ఆవ్యాసంలో.

వారి వ్యాసంలో ప్రధానాంశాలు సూక్ష్మంగా – ఆమె దీక్ష, స్ఫూర్తి, కార్యదక్షత, ఆమెకి ఎదురైన ప్రతిబంధకాలూ, తాను వాటిని ఎదుర్కొని తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొన్న తీరు సూటిగా, నిరాడంబరంగా వివరించారు. (యుగపురుషుడు వీరేశలింగం. వీరేశలింగం స్మారకోత్సవముల సంచిక. హైదరాబాదు. పు. 69-72). అది చదువుతుంటే “చూడండి నేనెంత కష్టాలు పడ్డానో” అన్నట్టుండదు. “నాకున్న పరిధిలో నేనిలా మలుచుకున్నాను నాజీవితం” అంటూ అమాయకంగా చెబుతున్న భావన కలుగుతుంది మనకి అది చదువుతూంటే. ఉదాహరణకి, ఆమె శ్రేయోభిలాషీ, వీరేశలింగంగారి అనుయాయి అయిన కొటికలపూడి సీతమ్మగారు కామాక్షమ్మగారిని పునర్వివాహం చేసుకొమ్మని ప్రోత్సహించారు. కాని కామాక్షమ్మగారికి పునర్వివాహేఛ్చ లేదు. అయితే ఆమె పునర్వివాహాలకి వ్యతిరేకి కారు. తాను చేసుకోలేదు కాని పునర్వివాహాలకి వుద్యమించిన స్త్రీలకి అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించారు. అది ఆమె వ్యక్తిత్వానికి గీటురాయి. ఈవ్యాసం ఇక్కడ.

వీరేశలింగంగారు ఉద్దేశించిన విద్యకీ, కామాక్షమ్మగారు తీర్చి దిద్దుకున్న జీవనసరళికీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. విద్యార్జన ఒక ఎత్తు. దాన్ని తమ దృక్పథాలకి అనుగుణంగా తీర్చి దిద్దుకోడం మరొక ఎత్తు.

1950ల నాటి తెలుగు పడుచులు ఈసత్యాన్ని సంపూర్ణంగా గ్రహించి వినియోగించుకున్నారు. ఈ సాంఘికవాతావరణం – అంటే కలిగినవారిళ్ల ఆడవారు నాలుగ్గోడలమధ్యా వుంటూనే – చదువుకుని, కథలు రాసుకోడం, ఇంటా బయటా వారి వ్యాసంగానికి అభ్యంతరం లేకపోవడం – 1950-60లలో కూడా జరిగింది. అధికంగా ఆనాటి పత్రికలు వారికి పుష్కలంగా ప్రోత్సాహమిచ్చాయి. అది ఆసరాగా ఇంట కూర్చునే రచయిత్రులు (ఈనాడు బ్లూస్క్రీన్ వెనక దోబూచులాడినట్టే) తమ ఇష్టాయిష్టాలనీ, కోరికలనీ, సంప్రదాయ విరుద్ధమైన అభిప్రాయాలనీ స్వేచ్ఛగా రాసేరు. పాఠకుల మన్ననలను పొందేరు.

అయితే ఈమెప్పులతోపాటు అపహాస్యాలూ, అపనిందలూ కూడా నెత్తినేసుకున్నారు ఆనాటి రచయిత్రులలో కనీసం కొందరు. బహుశా అనూచానంగా మనసాంప్రదాయంలో వుండే తిట్టుకవిత్వపు పోకడలు కావచ్చు. 1970వ దశకం తిరిగేసరికి, రచయిత్రులమీద కార్టూనులూ, జోకులూ బాగానే పుంజుకున్నాయి. ఇందులో సాహిత్యచర్చ ఎంత? సాంఘిపరమైన వేళాకోళాలూ, హాస్యాలూ, ఎత్తిపొడుపులూ ఎంత అన్నది చర్చనీయాంశం.

తెనాలి రామకృష్ణుడు శ్లేషతో మొల్లని ప్రశ్నించడం, మొల్ల కూడా అతనకి తగినట్టు శ్లేషతోనే జవాబు చెప్పి తన పరువు నిలబెట్టుకోడమే కాక అతని గౌరవాన్ని కూడా పొందడం చాలామందికి తెలిసిన కథే. అసలు వారిద్దరూ సమకాలీనులు కారు అన్నారు లక్ష్మీకాన్తమ్మగారు తన ఆంధ్రరచయిత్రులు గ్రంథంలో. అంచేత ఇది కట్టుకథే అనుకున్నా అలాటి కథ కల్పించడానకి కారణభూతులు ఎవరు, కారణాలు ఏమయి వుంటాయి అని ఆలోచించినప్పుడు మనకి ఆనాటి ఆచారాలూ, అలవాట్లూ, దృక్కోణాలూ తెలుస్తాయి.

అలాగే మరో కథ మొల్ల ప్రతాపసింహుని ఆస్థానానికి వెళ్లి తన రామాయణం కావ్యగానం చేసిందన్నది. చరిత్రకారుడు ఏకామ్రనాథుని కథనం ప్రకారం మొల్ల ప్రతాపసింహుని ఆస్థానంలో తనరామాయణం గానం చేసి, ఆమహరాజుకి అంకితం ఇవ్వబోయింది. ఆసభలోని పండితులు అది శూద్రకవిత్వం కనక నిషిద్ధమని, రాజుని అంకితం పుచ్చుకోనివ్వలేదు. వారిమాట కాదనలేక, ప్రతాపసింహుడు మొల్లరామాయణం అంకితం పుచ్చుకోకుండా, సత్కరించి రాణివాసానికి అంపాడుట. (ఆరుద్ర. సమగ్రాంధ్ర సాహిత్యం. సం.8. పు. 113-114)

ఈకథ చదివినతరవాత నాకు కలిగిన సందేహాలుః  శూద్రవనిత అయిన మొల్లకి అసలు ఆస్థానప్రవేశం ఎలా కలిగింది? కావ్యగానం ఎలా చేయగలిగింది? కావ్యగానం అయినతరవాత కాని అది శూద్రకవిత్వమని తెలియలేదా ఆపండితవరులకు? రాజుగారు పండితులమాట కాదనలేక .. అన్నది కూడా హాస్యాస్పదంగానే వుంది నాకు. మొల్ల కవిత్వం నిషిద్ధం అనిపించుకోడానికి కారణం జండర్ కాదు, పాండిత్యలేమి కాదు. ఆమె కుమ్మరి కులంలో పుట్టడం. ఈకథ కూడా నిజం కాకాపోవచ్చు. సాహిత్యచరిత్రకారులు పరిశీలించవలసినది ఈకథకి ప్రేరణ ఏమయివుంటుందనే.

ఇంతటి చరిత్ర వెనకేసుకుని, 1960 దశకంలో ప్రత్యేకంగా మన కథారచయిత్రులు, తమ పూర్వులకంటే భిన్నంగా సాధించినది ఏమైనా వుందా అంటే చాలా వుంది అంటాను నేను.

చరిత్ర సజీవం. ప్రతితరంలోనూ కొత్తదనం వుంటూనే వుంది. ఏ సాహిత్యమైనా ఆదేశ, కాల, పరిస్థితులమీద ఆధారపడి తనదైన ప్రత్యేక వాతావరణంలో పుట్టి వృద్ధి చెందుతుంది. ఆదృష్టితో చూస్తే, 1950, 60 దశకాల్లో మన స్త్రీలు సృష్టించిన సాహిత్యం ఆనాటి సాంఘికపరిస్థితులని ప్రతిఫలించడంలో సఫలీకృతమయిందనే చెప్పుకోవాలి.

కాని మన విమర్శకులు రచయిత్రులు సాధించింది ఏమీ లేదనే అంటున్నారు. “తెలుగులో ఉత్తమశ్రేణి రచయిత్రులు – శ్రీదేవి, సరళాదేవి, పవని నిర్మలప్రభావతి, వాసిరెడ్డి సీతాదేవి, తురగా జానకీరాణి,  కల్యాణసుందరీ జగన్నాథ్, వాసిరెడ్డి సీతాదేవి, ఆచంట శారదాదేవి, పవని నిర్మలప్రభావతి, నిడదవోలు మాలతి, రంగనాయకమ్మ వంటివారు కూడా కాథరీన్ మాన్స్‌ఫీల్డ్‌లా కథాశిల్పంలో సాధించిన ప్రత్యేకత ఏమీ లేదు” అన్నారు కేతు విశ్వనాథరెడ్డి తమ “దృష్టి”లో (పు. 73, 1998.) (అవునండీ నాపేరు కూడా చేర్చారు!).

మన రచయిత్రులు మాన్స్‌ఫీల్డ్‌లా రాయలేదు. మన వాతావరణానికీ, సంస్కృతికీ అనువైన “మనం”గా రాసేరు. మన పలుకుబడీ, మన పాఠకలోకం, మన వాతావరణం, మన సామాజిక, సాంస్కృతిక దృక్పథాలకి అనుగుణంగా రాశారు (రాశాం) అని నాఅభిప్రాయం.  కథాశిల్పంలో ప్రత్యేకత వుండబట్టే అంతటి ఘనమైన పాఠకలోకాన్ని సృష్టించగలిగారు. ఆశిల్పం ఏమిటి అంటే మన సాహిత్యచరిత్రలోనే వెతుక్కోవాలి గానీ ఇతరసంస్కృతులతో పోల్చి కాదనుకుంటాను.

అలాగే కొంతకాలం క్రితం ఇంటర్నెట్‌లో మన తెలుగు రచయిత్రులు నొబెల్ ప్రైజుకి తగుదురా తగరా అని ఒక చర్చ మొదలుపెట్టి అసలు వారు జ్ఞానపీఠ్ అవార్డుకి కూడా తగరని తేల్చేరు. నాకు ఈబహుమతులు ఏప్రాతిపదికమీద ఇస్తారో తెలీదు కనక నేను ఈవిషయం చర్చించదలుచుకోలేదు. మీకెవరికైనా ఓపిక వుంటే చూడండి.

నేను ఆదిలోనే చెప్పినట్టు ఇది నేపథ్యం మాత్రమే. నాపుస్తకంలో సవిస్తరంగా చర్చించాను ఆధునిక కథాసాహిత్యంలో  50, 60 దశకాలనాటి రచయిత్రుల కృషి.

000

000

తా.క.  ఈ వ్యాసం నాపాతకేళ్ల తపస్సు అన్న శీర్షికతో ప్రచురించడంతో నాకే దొరక్కుండా పోయింది. అంచేత ఆసక్తిగల పాఠకులసౌకర్యార్థం విడిగా మళ్ళీ ప్రచురిస్తున్నాను.

(ఆగస్ట్ 2008. అక్టొబరు 2018)

భండారు అచ్చమాంబగారి జీవిత చరిత్ర సంగిసెట్టి శ్రీనివాస్ గారు అచ్చమాంబగారి పది కథలతో పాటు ఎంతో వివరంగా రాసేరు. ఆ పుస్తకంలోనే సుజాతారెడ్డిగారి విపులవ్యాసం కూడా ఉంది.

లింకు ఇక్కడ 

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “మన రచయిత్రులు – ఒక పరిశీలన”

 1. >>ఈ బహుమతులు ఏప్రాతిపదికమీద ఇస్తారో తెలీదు >>>
  మొన్నొక ఇంటర్వ్యూలో సినీనటి జయసుధ కూడా మీలాగే పద్మశ్రీ ఎలా ఇస్తారో తెలియదని చెప్పారు. ఆవిడ ఎంఎల్యే కూడా…ఆవిడకే ప్రోసెస్ తెలియలేదు అంటే మామూలువాళ్ళకి ఎంత కష్టమో కదా ? జ్ఞాన్ పీఠ్ కి అర్హత సంపాదించేటటువంటి గొప్ప రచనలు చేసిన ఆడవాళ్ళు నాకు కనపడలేదు.(ఏమో నేను చదవలేదేమో)నోబెల్ ఆశించడం అత్యాసేమో ?
  ఆడవాళ్ళ రచనలు వంటగది దాటవు…పూవులూ,చందమామలూ,పాటలూ వర్షాలూ,ఎండలూ, మన్నూ మశానమే గానీ దేశాన్ని గానీ,రాష్ట్రాన్ని గానీ ఆలోచింపజేసే రచనలు ఏవైనా మీకు కనిపిస్తే మాకు తెలియచేయండి.
  ఏదైనా రచన కొన్ని కోట్లమందిని ప్రభావితం చేయగలిగితే అది కొన్ని యుగాలపాటు ప్రజల మనసులో నిలబడగలిగితే నోబెల్ ఆశించవచ్చేమో !

  మెచ్చుకోండి

 2. ధన్యవాదాలు మీ స్పందనకి. కామాక్షమ్మగారి విషయంో మరింత విస్త్ృతంగా పరిశోదన జరగవలసిఉంది. యుగపురుషుడు వీరేశలింగం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు. నేను లైబ్రరీలో తీసుకుని చదవేను.
  వ్యాసం చూసుకోలేదు. చూపినందుకు ధన్యవాదాలు. దిద్దుతాను.

  నేను గౌతమీ ఫాంట్స్ వాడుతున్నాను. విండోస్ లో వచ్చినది.

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,
  కామాక్షమ్మ గారి వ్యాసం చదివుతుంటే కన్నులు చెమ్మగిల్లాయి. వందేళ్ళలో ఎంత దూరం ప్రయాణించామో తలచుకుంటే ఆనందమూ వేస్తుంది.

  నాకయితే అమెలో పునర్వివాహ కాంక్ష లేదు అని ఎక్కడా అనిపించలేదు గానీ ఆనాటి సాంఘిక కట్టుబాట్లకు, సంఘానికి ఆమె భయపడింది అని మాత్రమే స్పష్టంగా తెలుస్తున్నది. ఆమె పంతులుగారి ప్రసంగాలు తెప్పించుకుంటూనే ఆయన పునర్వివాహ సంబంద పుస్తకాలు తెప్పించుకునేందుకు జంకింది. పంతులు గరి మిద ఎంత ఆరాధన వున్నా ఆయనను దూరం నుండీ చూచిందే గానీ మాట్లాడడానికి సాహసించలేదు. వీటి అన్నిటినీ బట్టి ఆమెకు కాంక్ష వుందో లేదో చెప్పలేం. ఒకవేళ లేకపోతే ఆ లేకపోవడానికి సంప్రదాయం పట్ల, సంఘం పట్ల వెరపే గానీ సహజమైన విరక్తి కాదు అని నాకు అనిపించింది.

  “యుగపురుషుడు వీరేశలింగం. వీరేశలింగం స్మారకోత్సవముల సంచిక.” ఇది ఆన్‌లైనులో వుంటే దాని అచూకూ చెబుతారా? చదవాలని వుంది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. మాలతి గారూ,
  మీరీ వ్యాసంలో చర్చించిన విషయాలు ఆలోచింపదగినవి. మొల్ల – ప్రతాపసింహుని కథ గురించి మీకు అనుమానాలు ఎందుకు కలిగాయి అని నాకనుమానం కలిగింది. అలా జరగడానికి ఆస్కారం వుందనే నాకు అనిపించింది.

  మీ ఈ వ్యాసంలో పునరుక్తి వుంది. వ్యాసం అంతా మళ్ళీ రిపీట్ అయింది గమనించగలరు.
  మీరు లేఖిని వుపయోగిస్తుంటే “చారిత్య్రక” అని రాయాలంటే chArityraka అని రాస్తే అది సరిగ్గా తెలుగులిపిలోకి మారుస్తుంది. ఇది లేఖినిలో నేను గమనించిన సమస్య.

  మెచ్చుకోండి

 5. సాహిత్య రంగాన్ని పురుషులు గుప్పిట బిగించి శాసించినంతకాలమూ నోబెల్ బహుమతికి నామినేట్ కూడా కాలేరు. అంతెందుకు కథా సంపుటిలో కథలు కూడా యెంపిక కావు. మీ వ్యాసం చాలా విలువైనది. ధన్యవాదాలు మాలతి గారూ .

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.