హృదయపూర్వక ధన్యవాదములు!

ముందు ఒక మనవి –

పాఠకులు, మిత్రులు కదాచితుగా నాకథలను తమబ్లాగులోనో ముఖపుస్తకం తమపేజీలోనో ప్రస్తావిస్తారు.

అలాటప్పుడు నాకు కలిగే ఆనందం తప్పకుండా బాహాటంగా చెప్పుకుంటాను. వారికి మనఃపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఆ తరవాత సందర్భం తటస్థిస్తే కూడా మళ్లీ చెప్పుకుంటాను. అయితే ఈ కృతజ్ఞత ఎంతవరకూ అన్న ప్రశ్న కలిగింది నాకు ఈమద్య కలిగిన ఒక అనుభవంతో. ఆ సందేహం ఆధారంగా రాసినకథే ఇది. నిజానికి దీన్ని స్కెచ్ అనడం సమంజసం.

హెచ్చరిక- అచ్చంగా ఇలాగే జరగలేదు. కథగా మలచడానికి అనుగుణంగా కొన్ని కల్పనలు చేసేను, అతిశయోక్తులు జోడించేను.  ఈవిషయం గుర్తు పెట్టుకుని స్కెచ్చిని స్కెచ్చిగానూ, అందులో సందేశాన్ని సందేశంగానూ గ్రహించగలరని ఆశిస్తున్నాను.

 ఒక వ్యక్తి మనకి మంచి చేసినప్పుడు, ఆ మంచి ఆధారంగా ఆ వ్యక్తిని గౌరవస్తాం. అదే వ్యక్తిలోని ఇతరగుణాలు కనిపించి ఆ గౌరవం నిలవకుండా పోవచ్చు. రెండూ సహజమేనని నాఅభిప్రాయం.

000

“నా ఐడి మీ స్నేహితుల మందజాబితానుండి తొలగించవలసిందిగా కోరుతున్నాను.”

“హా! తమని చేర్చుకోమని కోరినవారే కానీ వద్దన్నవారు లేరు ఇంతవరకూ. నేను ఇతిహాసపు అట్టడుగున పడిఉన్న రెండు కథలు మీవి తవ్వి తీసి నాబ్లాగులో ప్రచురించినప్పుడు మీరేమీ వ్యతిరేకంగానీ అయిష్టంగానీ చూపలేదు మరి.”

“చిన్నారి పొన్నారి చిరుతకూకటినాడు రాసిన రెండు కార్డుకథలు మీరు వెలికి తీసి ప్రచురించినందుకు అప్పట్లో యథాశక్తి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆ తరవాత సందర్భం వచ్చినప్పుడు కూడా చెప్పినట్టే గుర్తు. లేదంటే ఇప్పుడు మరోసారి ఇదుగో స్వీకరించండి హృదయపూర్వక శతకోటి వందనాలు.

పోతే ఆ తరవాత మీరు నా పోస్టులదగ్గర పెడుతున్న వ్యాఖ్యలు హాస్యం, వ్యంగ్యం, వేళాకోళాలతో కూడుకొని ఉండడం నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదని చెప్పినా మీరు అలాగే కొనసాగించేరు. ఆ తరవాత ఇతరుల పోస్టులదగ్గర మీవ్యాఖ్యలు అర్థవంతంగా ఉండడం, నాపోస్టులకి మాత్రమే మీఎకసక్యాలు పరిమితం కావడం చూసేక వాటిని ఆమోదించడం మానేసాను.

పోతే, ఈ మందపత్రాలవిషయంలో అందరికీ చెప్తున్నదే మీకూ చెప్పేను. వీటివల్ల నాకు ఏమాత్రమూ ఆసక్తిలేని అనేక పత్రాలు వస్తాయి గుంపులో గోవిందా అంటూ. వాటిలో నిజంగా స్నేహం లేదు, అదొక వ్యాపారసరళి. అంతే నా అభిప్రాయంలో.”

“అసలు మీబాధ ఏమిటో నాకు అర్థం కావడంలేదు. నాకు మీరంటేనూ మీరచనలంటేనూ ఇష్టం కనకనే నాలిస్టులో చేర్చుకున్నాను. అయినా చెప్పకతప్పదు. మీరు ఇలా మరిచిపోగలరని నేను అనుకోలేదు.”

“అంటే నేను మీకు ఆజన్మాంత కృతజ్ఞురాలినై ఉండాలని మీఅభిప్రాయం అంటున్నట్టుంది. కథలకి సంబంధించినంతవరకూ నేను కృతజ్ఞురాలినే అని ఏదైనా ప్రముఖపత్రికలో ప్రకటన తీసుకుని ప్రకటించమంటే అలాగే చేయగలను. దానికి అయే ఖర్చులు దయచేసి పంపగలరు.”

“ఇప్పుడు మీవ్యంగ్యం వెటకారం కనిపిస్తున్నాయి. కనీసం ఏదో వ్యాసం రాయవచ్చు కదా. మీకూ తెలుసు ఈనాడు ప్రపంచం అంతా పరస్పర సహకారాలమీదే నడుస్తోందని .”

“మందలిస్టులోంచి నా ఐడీ తొలగించవలసిందిగా కోరుతున్నాను.”

000

“ఏటంత రాద్దాంతం. చెత్తబుట్టలోకి ఇసిరేస్తే పోయేదానికి.”

“అది కాదు సంద్రాలూ, దాంతో ఆ జాబితాలో ఉన్నవాళ్ళంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనమీదకి విసిరేస్తుంటారు. టీబీ లక్షణాలూ, కీళ్లవాతానికి మందులూ, ఎక్కడో ఏడు సముద్రాలవెనక జరిగిన ఘోరం, దానికి మనం తీసుకోవలసిన చర్యలు, మన బాధ్యతలూ, అంటూ. అదేంటో bcc అని పెడతారు కానీ అయినా వస్తూనే ఉంటాయి.   కొన్ని మహ చిరాగ్గా ఉంటాయి. అందుకడిగేను.  అసలు ఈయన నాఐడీ తొలగించేస్తే సరిపోతుంది కదా.

అయినా నాకు తెలీకడుగుతాను. నాకథలు వెలుగులోకి తెచ్చేరే అనుకో, అంతమాత్రంచేత నన్ను కొనేసినట్టేనా? దరిమిలా ఆయనపద్ధతి నాకు నచ్చక, వదిలేసుకుంటే నేరం ఎలా అవుతుంది?”

“అదే మరి. అదేదొ అంటరు గద నొట్టొరుకు అని. ఆరు నిన్ను మెచ్చితె నీవు ఆరిని మెచ్చాల. అదీ ఈకాలం దరమం.”

“నీకు నామాట అర్థం కావడంలేదు. నెట్వర్కుకి ఓ పద్ధతి ఉంది. ఇరువేపులా ఇష్టం ఉండాలి. అర్హతలు ఉండాలి. ఇరువురికి ఉపయోగపడేదిగా ఉండాలి. అలా అయితేనే రాణిస్తుంది. ఇద్దరూ వాళ్ళకృషికి సంబంధించిన విషయాలలోమంచిచెడ్డలు నిర్మొహమాటంగా నిక్కచ్చిగా మాటాడుకుంటే ఫలం. అంతే గానీ మెచ్చుకోళ్లసంత అయితే నాకు గిట్టదు.”

“ఏటో నీగోల. నాకదంతా తెలీదు గానీ వొక్కమాట సెప్తను ఇనుకో. వల్లో సిక్కుకున్న సేప గిలగిల్లాడతాదంతే.” అనేసి లేచి వెళ్ళిపోయింది సంద్రాలు.

నేను దిక్కులు చూస్తూ కూర్చుండిపోయేను, సంద్రాలు తెలిసి మాటాడిందో తెలీక మాటాడిందో తెలీక. నేనంటున్నది అది గాదు కదా. లేక, అదేనా?

000

(ఏప్రిల్ 11, 2020)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “హృదయపూర్వక ధన్యవాదములు!”

  1. సంద్రాలు చెప్పినమాట మహా పదునుగా వుందండీ. మరంతే కదా.. ఇదొక వల. అలా అని మనకు నచ్చకపోతే బలవంతంగా కొనసాగాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.