సోది

సోది సెపుతానమ్మ సోది సెపుతా
నీబతుకేటో సెపుతా
నీవేడ నుంటివో సెపుత
ఏ పుటోలు ఏడ తీస్తివో సెపుత
ఏమి తింటివో
ఏ షాపుల ఏమి కొంటివో సెపుత
నీఆనుపానులన్ని సెపుత
నీగుట్టుమట్టులు సక్కంగ వివరిస్త
నీకెవురెవురు ఎరికో
ఏ మందల కలిస్తె నీకేటి ఒరుగుతాదో
సొది సెపుత,
ఆమీన
నీ జలమదినాలు రెండొ మూడొ ఇట్టె కనిపెట్టి సెపుత
నీబుక్తి యుక్తులు సక్కంగ ఇడమరిసి పలుకుత
సోది సెపుతానమ్మ సోది సెపుత
బాగున్నాది తల్లో నీసోది, అవుతే మరి ఓ సోదెమ్మా
 ఇంకా నా స్నేహితులలో బందుగులమాట చెప్పవైతివి. అన్నదమ్ములు, ఆలుమగలు, అక్కసెల్లెళ్లు, వదినామరదళ్లు, తల్లిబిడ్డలు ఆనవాలు గట్టవైతివేమి? అని నేను ప్రశ్నించగా,
సోదెమ్మ ఇట్లు వాక్రుచ్చెను, ఓ యమ్మ, ఎవురు ఎవురికేమైన నాకేమి ఒరిగేను, నీకేమి కలిగేను కొత్తంగ. వస్తారు పోతారు ఆరు, నిశ్చలముగ ఈడనుండేది నీవు అని.
ఫలశృతిః ఈసోది నిత్యం వల్లిస్తూ జకర్బర్గ్ ఈఏడు “made $23,415,973 in total compensation”. ఉచితలంచి అనునది లేదు. ఒకొకప్పుడు ఈ ఇచ్చిపుచ్చుకోడాలలో ఒకవైపువారు అమాయకంగా తాము ఏమీ ఇవ్వడంలేదనుకుంటారు.

(సెప్టెంబరు 13, 2020)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

%d bloggers like this: