పెద్దతనం (కథ)

ఎవరో తట్టిలేపినట్టు ఉలిక్కిపడి కళ్లు తెరిచి చుట్టూ చూసింది కాంచన. ఎదురుగా బల్లమీద వాచీ పదకొండు దాటి పావుగంట అయిందంటోంది. అబ్భ! ఇంత వెలుగేమిటి? అనుకుంటూ

మళ్లీ చుట్టూ చూసింది. రెండు నిముషాలు పట్టింది ఇది పగలే అని అర్థమవడానికి. కిటికీలకి కట్టినతెరల నీలిరంగు వెలవెలా బోతోంది ఆవెనకనున్న వెలుగుతో.

తెల్లారుతూనే అలవాటుప్రకారం నాలుగ్గంటలకి లేచి, రెండు కప్పులు కాఫీ తాగి, ఈమెయిళ్లు చూసుకుంది. ఇంకా మత్తుగానే వుంది. అసలు దేశంనుంచి తిరిగొచ్చినదగ్గర్నుంచీ ఏం బాగుండడంలేదు.  లాప్‌టాప్ కుక్కుపిల్లలా ఒళ్లో పొదువుకుని అదేపనిగా రాసేసుకు పోతుంటే, దానివేడికి ఒళ్లు ఆర్చుకుపోతోంది. దానికి తోడు చిక్కటి కషాయంలాటి కాఫీలు మూడు కప్పులు తాగి తెచ్చుకున్న పైత్యం. .. దాంతో దగ్గూ ..

పోనీ, కెఫీను కాస్త తగ్గించి చూదాం అని ఈరోజు డికాఫ్ తాగితే, కాఫీ తాగినట్టు లేదు. కప్పు కడిగిననీళ్లు తాగినట్టుంది కానీ… ఒళ్లో వున్న లాప్‌టాప్ ఎదురుగావున్న కాఫీబల్లమీద పెట్టి వెనక్కి వాలింది కాంచన.

దేశంలో వున్నన్నాళ్లూ బాగానే అనిపించింది. వెళ్లిన ప్రతిచోటా, కనపడిన ప్రతివారూ “పెద్దవారు, అమ్మగారు, మేడమ్” అంటుంటే అప్పటికి బాగానే వుంది కానీ ఇంటికొచ్చేక పదే పదే అదేమాట మనసులో మెదిలి, నువ్వు పెద్దదాని అయిపోయేవు అని ఎవరో రెండుచెవుల్లోనూ బాకాలెట్టుకుని మరీ హోరు పెడుతున్నారు!

ఇంతవరకూ “మీరింత పెద్దవారనుకోలేదు” “you don’t look that old” అన్నమాటే వుంటూ వచ్చింది మరి. సినిమాకెళ్తే, నువ్వు సీనియర్ సిటిజన్‌వా అని మరోసారి అడుగుతారు డిస్కౌంటివ్వడానికి.

“హుమ్. వీళ్లందరూ కలిసి నాకు లేనిఆలోచన నాబుర్రలో పెట్టేశారు అదేదో నల్లమేకా, నలుగురు దొంగలు కథలోలాగ,” అనుకుంది కాంచన నోరు కుక్కమూతిపింజెలా పెట్టి. లేదా, “నాకు దిష్టి తగిలివుండాలి” అని కూడా అనుకుంది. పెదాలు చిలిపిగా విచ్చుకున్నాయి.

000

తను విశాఖపట్నం వచ్చేనని తెలియగానే ఒరిస్సాలో వున్న ప్రమీల రెక్కలు కట్టుకు వాలింది, కూతుర్ని చూడాలన్న వంకతో. కాలేజీలో వున్న నాలుగేళ్లు కవలల్లా కలిసి తిరిగేవారు. రోజూ క్లాసులయేక, సాయంత్రం తనింటికి వచ్చేసేది. ఇద్దరూ డాబామీద కూర్చునేవారు పుస్తకాలు ముందేసుకుని. ఏంమాటాడకపోయినా ఏదో హాయి. మనసునిండా నింపుకుని. ప్రమీలది కమ్మని కంఠం. చక్కగా గొంతెత్తి “రావోయి చందమామా” అనో “లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే” అనో పాడుతుంటే తను వింటూ … అలా ఎంతసేపో. కిందనించి అమ్మ అన్నాలకి రమ్మని పిలిచేదాకా టైము తెలిసేదే కాదు.

“అబ్బ, నువ్వలాగే వున్నావే .. ఏం మారలేదే,” అని ప్రమీల అంటుంటే, కాంచనకి నవ్వొచ్చింది.

“మారని రూపాయిని” అంది కాంచన చిలిపిగా కళ్లు చిట్లించి.

“పోదూ, నువ్వు మరీనూ.. హాయిగా అమెరికాలో స్థిరపడిపోయేవు. గొప్పరచయిత్రివయిపోయేవు. నీకు గుర్తున్నారా, కామేశ్వరీ, అహల్యా .. మేం నీపేరు పత్రికలో కనిపించినప్పుడల్లా ఎంతో మురిసిపోతాం.”

“నువ్వూ ఏం మారలేదు” అంటూ కాంచన ప్రమీలవేపు చూసింది. నిజానికి ప్రమీల బాగానే ఒళ్లు చేసింది. మాటలు సాగదీస్తూ నెమ్మదిగా పలుకుతోంది. కాస్త ఆయాసం కూడా. ఎందుకో తనకంటే పదేళ్లు పెద్దదానిలా అనిపించింది. మాటతీరూ, మనిషితీరూ కూడా బాగానే మారింది.

“నీకేం హాయిగా ఒక్క పిల్లతో సరిపుచ్చుకున్నావు. నాకు ముగ్గురాడపిల్లలు. తరవాత ఇద్దరు మగపిల్లలు. మాఅత్తగారికి మగపిల్లాడు లేకపోతే వంశం ఏమైపోతుందోనని బెంగ. ఆతరవాతివాడు అనుకోలేదులే. … “

కాంచనకి ఏం చెప్పాలో తోచలేదు.

“నీఆరోగ్యం బాగానే వుందా?” అడిగింది ప్రమీలే మళ్లీ.

“బాగుంది. నాకున్నదదొక్కొటే.” అంది కాంచన వెల్తి నవ్వుతో.

“అదే మహద్భాగ్యం. నీకు తెలుసు కదా. అప్పట్లో నాకు 19ఏళ్లు. పెళ్లి చేసేశారు. వరసగా పిల్లలూ. తెల్లారి నాలుగ్గంటలకి లేస్తే, రాత్రి పదకొండుకి పడక. ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాలి. నేను లేకపోతే ఒక్కక్షణం జరగదు మావారికి. ఆయనే కాదు మామామగారు కూడా , అమ్మాయీ నా కలం కనిపించలేదు చూడూ, కాగితాలు కాస్త చూసి పెడుదూ, అంటూ .. కాపురానికొచ్చేక పుట్టింటికి వెళ్లలేదు తెలుసా. నువ్వు లేకపోతే ఇల్లు ఎలా నడుస్తుంది అనేవారు మాఅత్తగారు కూడాను. పిల్లలబట్టలన్నీ నేనే కుట్టేను. ఆవకాయ పెట్టాలంటే కాయలు తెప్పించడం, కారాలూ, ఆవపిండి కొట్టించడం అన్నీ నేనే చూసుకోవాలి. మాఅత్తగారికి ఏమీ తెలీదు. మరి ఆవిడెలా చేసేరో కాపురం,” ప్రమీల నవ్వుతూ చెప్తూంటే కాంచన చూస్తూ కూర్చుంది.

ప్రమీల సమర్థవంతంగా ఇల్లు నిర్వహించేనని గర్వపడుతోంది. తను సంతోషించాలి. కానీ మనసులో ఏదో వెల్తి. తామిద్దరిమధ్యా ఎడం ఎంతో … మరోసారి ప్రమీలవేపు చూసింది.

మోకాళ్లు ఆపరేషను చేయించుకుందిట. రోజూ గంటసేపు ఎక్సర్‌సైజు చెయ్యాలి. ఆమధ్య గుండెల్లో చిన్న నొప్పిలాటిది వచ్చింది కానీ సమయానికి మూడోకూతురు డాక్టరుదగ్గరికి తీసికెళ్లింది. ఇప్పుడు నయంగానే వుంది. పిల్లలు చక్కగా చూసుకుంటున్నారు. ఒకొకరిదగ్గర రెండేసి నెలలుంటుందిట. .

“ఆడది ఇంటికి మూలస్థంభంలాటిది. మంచికీ చెడుకీ నిలదొక్కుకుని, సంసారం చక్కదిద్దుతూ, పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురాగల ధైర్యస్థైర్యాలు ఒక్క ఆడదానికే వుంటాయి,” అంది ప్రమీల ఆయాసపడుతూ.

తల్లిని తీసుకొచ్చిన మూడోకూతురు, రజని, “పదమ్మా, ఆలస్యం అవుతోంది. వేళకి తిని పడుకోపోతే మళ్లీ రేపు లేవలేవు” అని, “వస్తామండీ” అంది కాంచనవేపు తిరిగి.

“వుంటావా నాలుగురోజులు?”

“లేదు. పెద్దమ్మాయిదగ్గర వుంటున్నాను కదా. ఈనెలాఖరువరకూ అక్కడే వుంటాను. వచ్చేనెల అబ్బాయిదగ్గరికి వెళ్తాను.”

000

కాంచన నిట్టూర్చింది. ఎక్కడికి వెళ్లినా, ఎవరు కనిపించినా అదే ధోరణి. ఇరుగింటా, పొరుగింటా, బజారులో, సభల్లో, సన్నివేశాల్లో – మేడమ్, అమ్మగారు, అమ్మమ్మగారు, … తనకిచ్చే గౌరవవాచకాలు. ఆసంబోధనలలో మనసంస్కృతి గుర్తొచ్చి మనసు మృదువుగా స్పందించింది. వెనక ఎవరో బామ్మగారంటే తనని అలా అనొద్దని చెప్పినమాట గుర్తొచ్చింది.

హాల్లో కూర్చుని ఆరోజు పేపరు చూస్తున్న కాంచనకి గుమ్మందగ్గర ఎవరో నిలిచినట్టనిపించి తలెత్తి చూసింది.

రజని “పన్లో వున్నారా? వేరే పనిమీద ఇటొచ్చి, మీరేం చేస్తున్నారో అని ఆగేనిక్కడ” అంది.

కాంచన పేపరు మడిచి పక్కన పెడుతూ, “లేదు, పనేంలేదు. రా.” అంటూ ఆహ్వానించింది సాదరంగా.

రజని లోపలికొచ్చి కాస్త ఎడంగా కుర్చీ లాక్కుని కూర్చుంది.

“మీఅమ్మ వెళ్లిపోయిందా?”

“ఆఁ, నిన్నరాత్రి రైలెక్కించేను. మీరంటే మాఅమ్మకి చాలా ఇష్టం. మొన్న మీరు వెళ్లిపోయింతరవాత రోజంతా మీగురించే చెప్తూనే వుండింది,” అంది రజని కళ్లనిండా అభిమానం నింపుకుని.

కాంచన చిన్నగా నవ్వింది, “అవును, ఆరోజుల్లో ఇద్దరం చాలా స్నేహంగా వుండేవాళ్లం, ఏ అరమరికలూ లేవు. మళ్లీ ఆరోజులు రావు,” అంది. ఆతలపు రవంత నిస్పృహ కలిగించి, మొహంలో కళ తప్పింది.

ఇద్దరికీ క్షణకాలం మాట తోచలేదు. కాంచన చిన్నగా నవ్వి, “మా అమ్మ కూడా ఇలాగే ..” అంది.

“అంటే?”

“అదే, ఇలా మాటా పలుకూ లేకుండా కూర్చునేవాళ్లం ఇద్దరం గంటలతరబడి డాబామీద. మాకెందుకో అలా ఏమాటా లేకపోయినా ఏం వెలితుండేది కాదు,” అని “రా, డాబా చూపిస్తాను” అంటూ లేచింది.

ఇద్దరూ డాబామీదికెళ్లేరు. పిట్టగోడమీదికి వాలినకొమ్మలతో, విరగబూసిన సంపెంగచెట్టూ, చుట్టుగోడకి దగ్గరగా గుత్తులు గుత్తులుగా గంగాబోండాలతో, పింజలతో, సుతారంగా వాలిన మట్టలతో కొబ్బరిచెట్లూ, పెరటిమధ్యలో దానిమ్మచెట్టూ, పారిజాతం చెట్టూ, దూరంగా మహోధృతంగా ఎగసిపడుతున్న అలలతో దిగంతాలకి పరుచుకున్న సముద్రమూ, ఏరాడకొండమీద లైట్ హౌసూ… కాంచనకి పాతజ్ఞాపకాలు పొంగుకొస్తుంటే, రజనికి కొత్త తలపులు రూపు దిద్దుకుంటున్నాయి.

“మేం ఇద్దరం ఇక్కడ చాప పరుచుకు పడుకుని, ఇరవై సెకనులకొకసారి గోడమీద వెలిగే లైట్‌హోస్ కిరణాలు ఎన్నిసార్లు లెక్కపెట్టేమో .. ఇప్పుడు తలుచుకుంటే సిల్లీగా వుంటుంది …” అంది కాంచన దూరతీరాల్లోకి చూస్తూ.

“మాఅమ్మకీ మీకూ కూడా ఇలాటి సాయంత్రాలు మాటల్లేకుండా గడిచేయంటే నాకు ఇప్పుడు అర్థం అవుతోంది,” అంటుంటే రజనికళ్లలో రవంత ఈర్ష్యఛాయలు తోచేయి కాంచనకి. ఆవిడ చిన్నగా నవ్వుకుంది ఈకాలపుపిల్లలు అనుకుంటూ.

మరోపావుగంట వుండి, “ఆదివారం మాయింటికి లంచికి రండి,” అంది రజని కాంచనవేపు తిరిగి.

“లంచికా?” కాంచనకి ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్లమ్మ ఉన్నప్పుడు పిలవలేదు. ఇప్పుడిదేమిటి?

“మీకు వేరే పనుంటే మరోరోజు చూద్దాంలెండి. మీరింకా ఎన్నాళ్లుంటారిక్కడ?”

“లేదులే. ఆదివారం వస్తాను. ఎన్నాళ్లో లేదు. సోంవారం వెళ్లిపోతున్నాను.”

“కారు పంపిస్తాను. లేకపోతే నేనే వస్తాను” అని గుమ్మందాకా వచ్చి, “మిమ్మల్ని ఏమని పిలవమంటారు. మొన్న మాఅమ్మతో వచ్చినప్పుడు, మీకు ఆంటీ అంటే ఇష్టంలేదన్నారు కదా” అంది రజని చిరునవ్వు కళ్లలో మెరుస్తుండగా.

కాంచన కూడా నవ్వింది, “నీఇష్టం.”

రజని వెళ్లిపోయేక, చాలాసేపు కాంచన ఆలోచిస్తూనే వుంది తనని ఏమని పిలవడం? “ఏమే కాంచనా” అంటూ నోరారా పిలిచింది ప్రమీల ఒక్కర్తే. మిగిలినవారందరికీ అయితే మేడమ్, అమ్మగారు, అమ్మమ్మగారు. .. కదాచితుగా డాక్టర్ కాంచన, ప్రొఫెసర్ కాంచన … నాకవేవీ లేవని చెప్పేసరికి ప్రాణం సాలుకొచ్చింది.

000

ఆదివారం పదిగంటలకి రజని ఫోన్ చేసింది, “బసంతో ఏదో పనిమీద కారు తీసుకువెళ్లేడనీ, పదకొండున్నరకి తనింటికొచ్చి వాళ్లింటికి తీసుకెళ్తాడని.

సరేనంది కాంచన.

రజని యమ్మెస్సీ బయాలజీ చేసేక, వుద్యోగరీత్యా కలకత్తాలో వుండగా బసంతో చటర్జీతో పరిచయం అయింది. పెళ్లయి పదిహేనేళ్లయింది. ఇద్దరు పిల్లలు. విశాఖపట్నానికి మారి రెండేళ్లయింది.

అన్నట్టుగానే బసంతో పదకొండున్నరకల్లా వచ్చేడు. తొందరగానే వచ్చేస్తానని ఇంట్లో తమ్ముడికీ మరదలికీ చెప్పి కాంచన కారెక్కింది.

ఇల్లు చూడముచ్చటగా వుంది. మూడుగదుల ఫ్లాటు. చక్కగా అమర్చేరు. హాల్లో సోఫాసెట్టూ, గోడలమీద బాపిరాజుగారి చిత్రాలూ, వంటగదికి ఎదురుగా రోజ్‌వుడ్ బోజనాలబల్లా వారి స్తోమతు తెలియజేస్తున్నాయి. ఆరేళ్ల అమ్మాయీ, పదేళ్ల అబ్బాయీ నీటుగా వున్నారు. తెలుగుదేశం వచ్చి రెండేళ్లయినా బెంగాలీ మర్చిపోలేదు. చక్కగా బెంగాలీ, ఇంగ్లీషూ కూడా మాటాడుతున్నారు. తెలుగు కూడా నాలుగుముక్కలు వల్లిస్తున్నారు.

“ఇంగ్లీషుమీడియంస్కూల్లో వేసేం. తెలుగు నేర్పాలని నాకయితే వుంది కానీ ఎక్కడ .. ఏపనికీ తీరికుండదు నావుద్యోగం. ఆయన వుద్యోగం …” రజని అంటుంటే కాంచన అడ్డు పడింది.

“బెంగాలీ వాళ్లనాన్న భాష అని నేర్పేవు. బతుకుతెరువుకి అని ఇంగ్లీషు నేర్పేవు. తల్లిభాష తెలుగు మాత్రం నేర్పడానికి టైము లేదంటున్నావు” అంది చిన్నగా నవ్వుతూ.

“లేదండీ. నాకయితే నేర్పాలనే వుంది. చెప్పేను కదా. ముందు నాకు వస్తే కదా. నాచిన్నతనం భువనేశ్వర్‌లో గడిచింది కనక నాకూ తెలుగు అట్టే ఒంటబట్టలేదు. ఏదో మాఅమ్మవెనక తిరుగుతూ నాలుగు ముక్కలు మాట్లాడ్డం వచ్చింది కానీ చదవడం, రాయడం రాదు.”

రజని కాంచనతో మాటాడుతుంటే. బసంతో వచ్చి అప్పడాలు వేయించనా అనడిగేడు. రజని తలూపి, తను కూడా లేచింది కంచాలు పెట్టడానికి. అబ్బాయి హరీష్ మంచినీళ్లు పెడుతుంటే, కాంచనకి ఎదురుగా ఒదిగి కూర్చుంది రుమ.

“కాయితం, కలం తీసుకురా. నీపేరు తెలుగులో రాయడం నేర్పుతాను” అంది కాంచన రుమతో.

రుమ హుషారుగా లేచి వెళ్లి కాగితం తీసుకొచ్చింది.

కాంచన “a circle, a check on top, a hook to the right” అని వర్ణిస్తూ అక్షరాలు రాస్తూంటే రజని భోజనాలబల్లమీద కంచాలూ, గిన్నెలూ అమరుస్తూ ఓరకంట వాళ్లని చూస్తోంది మురిపెంగా.

కాంచన రాయడం పూర్తవగానే, రుమ ఆ అక్షరాలవేపు చూసి, “అవి నావేపునించా, నీవేపునించా?” అనడిగింది.

కాంచన “నీవేపునించే” అని చెప్పి, “చురుకుపాలు ఎక్కువే” అంది రజనితో. రజని నవ్వింది సంతృప్తిగా.

రుమ తనపేరు తేలిగ్గానే రాసేసి, అన్నపేరూ, అమ్మపేరూ, నాన్నపేరూ కూడా రాయమంది.

రజని, “రండి. తినడం అయినతరవాత మిగతా పాఠం,” అంది.

కాంచన మరోమారు రుమని మెచ్చుకుని, భోజనానికి లేచింది.

కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటే. కాంచన “నాకు బెంగాలీ చెప్పు. నీపేరేమిటి అని ఎలా అడుగుతారు?” అనడిగింది రుమని..

రుమ చెప్పింది కానీ కాంచనకి ఆవాక్యం పట్టుబడలేదు. మూడు చుట్లయేక, “I will tell you yes and no” అంది.

కాంచనకి నవ్వొచ్చింది.

బసంతో, “You are down to LKG,” అన్నాడు నవ్వుతూ.

అందరం నవ్వుకున్నాం. భోజనాలయేక, రజనీ, కాంచనా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. బసంతో, పిల్లలూ, బల్లమీదున్న కంచాలూ, గ్లాసులూ ఎత్తిపెడుతుంటే, కాంచనకి ముచ్చటేసింది. రజనివేపు చూసింది ఏ అమ్మాయి మాత్రం ఇంతకంటే ఏం కోరుకుంటుంది అనిపిస్తోంది వాళ్లని చూస్తుంటే.

“మీరేమైనా షాపింగ్ చేస్తారా?” అనడిగింది రజని.

“లేదులే. నాషాపింగంతా హైదరాబాదులో అయిపోయింది. మీరు వెళ్లండి. నేనింటికెళ్తాను.”

“లేదండీ, నాకేం పనిలేదు. బసంతో వాళ్లిద్దర్నీ టెన్నిస్ ప్రాక్టీసుకి తీసుకెళ్తాడు. మనం కైలాసగిరికి వెళ్దాం మీకు ఫరవాలేదంటే. చాలా బాగుంటుంది” అంది రజని.

తండ్రినీ పిల్లల్నీ టెన్నిస్ కోర్టులో దింపేసి, రజని కాంచనతో కైలాసగిరివేపు సాగింది.

దారిలో కాంచనకి చాలా విషయాలు తెలిశాయి. “నేను ఏం సాధించాలనుకున్నానో నాకిప్పుడు అర్థం కావడంలేదు. బయాలజీ చదువుతున్నరోజుల్లో రిసెర్చ్ చేసి లోకంలో రోగాలన్నిటికీ కారణాలు కనిపెట్టేసి మందులు కనిపెట్టేసి, బాధలన్నీ తీర్చేయాలనుకునేదాన్ని. రిసెర్చ్ సాగలేదు. బసంతో‌తో స్నేహం, పెళ్లీ, అతనిఉద్యోగంలో అవకతవకలూ, పిల్లలూ, మధ్యలో ఒక మిస్కేరేజీ  .. ఎప్పటికప్పుడు ఏదో ఒక అనుకోని అవాంతరం. .. నా పిహెచ్‌డీకి. నేను ఎవర్నో తప్పు పడుతున్నానని కాదు. బసంతో సహకారంలో లోపం లేదు. పిల్లలు పుట్టేరంటే దానికి వాళ్ళని తప్పుపట్టలేం కదా.. “ అంది రజని చిన్నగా నవ్వి.

కాంచనకి ఏమనాలో తోచలేదు.

“అమ్మ మాకోసం ఎంత త్యాగం చేసిందో చూడండి. ఏపూటకాపూట భోజనం దగ్గర్నుంచీ, పుస్తకాలూ, బట్టలూ, చదువులూ అంతా తనే చూసుకుంది. క్షణం విరామం లేకుండా మాకందరికీ సేవలు చేసింది. మాకు బాగా జ్ఞానం వచ్చి మేమే వెళ్లు, వెళ్లంటూ తోలేవరకూ పుట్టింటికి కూడా వెళ్లలేదు. మానాన్నగారు ఉన్నారన్నమాటే కానీ అసలు మేం ఇంట్లో వున్నామో లేమో కూడా స్పృహ వుండేది కాదాయనకి. అసలు మేం ఆయనపిల్లలన్న స్పృహ కూడా వుందో లేదో అనుమానమే. ఆయన ఫైళ్లే ఆయనలోకం. ఖర్మం చాలక అమ్మ ఎప్పుడయినా ఓమాట అడిగినా, అవన్నీ తల్లి చూసుకోవాలి. అది నీకర్తవ్యం అనేవారు.”

ఈపిల్ల ఇవన్నీ తనకి ఇప్పుడు ఎందుకు చెప్తోందో కాంచనకి అర్థం కాలేదు.

“అప్పట్లో నాకు మహ చిరాకేసేది కానీ ఇప్పుడు అర్థం అవుతోంది కొంతయినా. నాకు నిజంగా చెప్పుకోదగ్గ బాధలేమీ లేవు. మంచివుద్యోగమే. చిన్నకంపెనీ అయినా మంచి పేరుంది. నేను సీనియర్ సైంటిస్టుని. బసంతో యూనివర్సిటీలో రీడరు. నాకు అప్పుడప్పుడూ ప్రయాణాలుంటాయి. బసంతో చూసుకుంటాడు ఇంటినీ పిల్లల్నీ. దేనికీ విసుక్కోడు. నాకే ఎందుకిదంతా అనిపిస్తోంది. బాగా సంపాదిస్తే సుఖపడొచ్చు అంటారు. మరి సుఖపడడానికి టైము కావాలి కదా. అందుకే నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను.”

“మానేసి ఏం చేస్తావు?”

“ఏమో తెలీదు. ఏవో ఒకటి రెండు ఇండిపెండెంటు ప్రాజెక్టులు వున్నాయి, ఆలోచిస్తున్నాను. కొడైకెనాల్‌‌లో ఇల్లు కట్టిస్తున్నాం.” రజని కారు పార్క్ చేసి, దిగింది. కాంచన కూడా కారు దిగి చుట్టూ చూడసాగింది. దూరంగా శివపార్వతులు కొలువు తీరి వున్నారు. పాలరాతివిగ్రహం అనంతాల్లోకి చొచ్చుకుని ఇదే కైలాసమమేమోనన్న భ్రమ కలిగిస్తోంది. కాలిబాటకి ఇరువైపులా పువ్వులమొక్కలు అందంగా, ఆహ్లాదకరంగా వున్నాయి. బంగాళాఖాతం తన ఉత్తుంగతరంగాలతో నేపథ్యసంగీతాన్నందిస్తోంది ఉచితంగా.

కాంచన సముద్రంవేపు చూస్తూ నిలబడిపోయింది. బంగాళాఖాతంలో కనిపించని సుడిగుండాలు వుంటాయంటారు.  … అప్పట్లో ఈ శిల్పం లేదు. ఈ ఉద్యానవనాలు లేవు. దిగంతాల ప్రతిధ్వనిస్తూ సాగరసంగీతం మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒక్కలాగే వుంది.

“అసలు ఎవరైనా పెళ్లెందుకు చేసుకుంటారండీ?”

కాంచన తృళ్లిపడి రజనిమొహంలోకి పరీక్షగా చూసింది. ఇంతవరకూ చెప్పినవిషయాల్లో తనసంసారంలో ఒడుదుడుకులేం వున్నట్టు కనిపించలేదు. అనుకూలుడయిన భర్తా, బుద్ధిమంతులయిన పిల్లలూ, చెప్పుకోదగ్గ ఆర్థికస్థాయీ – సాధారణంగా ఒక మనిషి కోరుకునే అన్ని వైభవాలూ అమరినట్టే వున్నాయి. మరి ఆ ప్రశ్నేమిటి?

రజని కూడా ఆమాటే అంది. “నేనిలా అడిగేనని మరోలా అనుకోకండి. అనుభవం వున్నవారూ, విస్తృతంగా లోకం చూసినవారూ కనక అడుగుతున్నాను. ఈనాటి సామాజికవ్యవస్థలో పెళ్లికి గల ‘విలువ’ అనాలో ‘స్థానం’ అనాలో తెలీదు – ఏదో అది ఏమిటి అని?”

“నాఅనుభవాలు పెళ్లి సౌభాగ్యం వివరించడానికి పనికిరావులే” అంది కాంచన తేలిగ్గా నవ్వేసి.

రజని రెండు క్షణాలు వూరుకుని, “ఇప్పుడు నాకు పెళ్లిగురించి తెలిసినసంగతులు పదిహేనేళ్లక్రితం తెలిసివుంటే, నేను పెళ్లి చేసుకునేదాన్ని కాను,” అంది.

కాంచన నిశ్చలంగా కళ్లప్పగించి చూస్తోంది. సముద్రంలో అలలు విరుచుకుపడుతున్నాయి సమరోత్సాహంతో ఉరకలేస్తున్న యుద్ధాశ్వాల్లా. కాంచనమనసులో మరొక ప్రశ్న అడగాలన్న కోరిక క్షణకాలం రేగి వెనుదిరింది ఆ అలల్లాగే. రజని ఒకవేళ ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా వుండివుంటే, ఇప్పుడు పెళ్లినిగూర్చి తెలిసిన విషయాలు అప్పుడు తెలిసివుంటే, పెళ్లి కావాలనే అనుకునేదా? కాంచన పెదిమలు ఆచి పట్టుకుంది. ఆ ప్రశ్న ఒట్టి తర్కానికి పనికొస్తుందే గానీ ఇప్పుడు అడగదగినది కాదు. … ప్రస్తుతం రజని ప్రస్తావిస్తున్నది పదిహేనేళ్ల సాంసారికజీవనం తరచి చూసుకున్నతరవాత తనకి కలిగిన అవగాహన. అది తనతో పంచుకుంటోంది. ఆఅమ్మాయికి కావలసింది జవాబు కాదు. వినేవాళ్లు! అంతే.

మరో గంటసేపు తిరిగి ఇంటికి మళ్లేరు. కాంచనఇంటిముందు కారు ఆపి, దిగింది రజని. అటుతిరిగి తను వచ్చేలోపున, కాంచన తలుపు తెరుచుకుని దిగింది.

రజని ఆమెదగ్గరికి వచ్చి, ఎదురుగా నిలబడి, “మీతో మాటాడడం చాలా తేలిక కాంచనగారూ” అంది.

కాంచన తెల్లబోయింది. ఇదే అమెరికాలో అయితే ఆశ్చర్యం లేదు. మోకాలెత్తు లేని పిల్లలు కూడా పేరు పెట్టి పిలుస్తారు కొత్తలో తనకి అది ఎబ్బెట్టుగా తోచేది కూడాను. మన సంస్కృతిలో పెద్దవాళ్లని పేరు పెట్టి పిలవడం మర్యాద కాదు. రజని తనని పేరు పెట్టి పిలవడానికి కారణం వయసుమాట వదిలేసి, కేవలం ఒక స్నేహితురాలిగా తనని గుర్తించడమా? లేదా వాళ్లమ్మకీ తనకీ దృక్పథాలలో గల తేడా గమనించడంవల్లనా? ఇదే తొలిసారి ఆఅమ్మాయి తనని పేరు పెట్టి పిలవడం! ఇంతవరకూ ఏ సంబోధనా లేకుండా జరుపుకుంటూ వచ్చింది దాగుడుమూతలాడుతున్నట్టు. కాంచనకి మాత్రం హాయిగా అనిపించింది ఆపిలుపు.

రజని అదేమీ గమనించనట్టు, చిన్నగా నవ్వి వెనుదిరిగి వెళ్లిపోయింది.

000

గాజుతలుపుమీద దబ్ దబ్మంటూ వడగళ్లు చప్పుళ్లు చేయడంతో కాంచన తృళ్లిపడి బయటికి చూసింది. ఆకాశంలో నల్లటి చిక్కటి మబ్బులు దట్టంగా కమ్ముకుని రాత్రి అయిపోయిందేమో అనిపిస్తోంది. మధ్య మధ్యలో మెరుపులు తళుక్కున మెరిసి క్షణకాలం గదినిండా వెలుగు నింపి వెళ్లిపోతున్నాయి. కాంచన అలా చూస్తూ కూర్చుండిపోయింది రజనిని తలుచుకుంటూ చాలాసేపు.

ఆపిల్లకీ, తనకీ సమస్య ఒకటేనా? పరస్పరం వ్యతిరేకమయిన అనుభవాలనీ, పరిస్థితులనీ ఎలా సమన్వయపరుచుకోవడం? పెళ్లీ, పిల్లలూ, స్నేహాలూ. వయసులో తారతమ్యాలూ, అవి తెచ్చే ప్రత్యేకపరిస్థితులూ … ఏది కావాలి? కావలసింది సాధించుకున్న తరవాత ఏమిటి చేయాలి? దినదినం మనం చేసేవన్నీ రోజు గడవడానికా, మరేదో సాధించడానికా?

కాంచన తనవయసెప్పుడూ దాచుకోలేదు. ఇప్పుడు పెద్దదాన్నన్నబాధ కంటే ఆతలపువల్ల వచ్చే ఈతిబాధ ఎక్కువగా వుంది. దానికి కారణం మాత్రం ఇదమిత్థంగా చెప్పలేకపోతోంది.

పెద్దపెట్టున మరో మేఘం గర్జించింది. కాంచన నెమ్మదిగా ముందుకి ఒంగి లాప్‌టాప్ అందుకుని తెరిచింది. నీలితెర‌మీద పెద్దతనంనీడలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బుద్ధి పని చేయడంలేదు. సినిమాకి వెళ్తేనో అనిపించింది. ఆమధ్య ఎవరో అన్నారు జూలీ-జూలియా బాగుందని. జూలియా ఛైల్డ్‌గురించి చాలా వింది. వాన .. ఎలాగా వాకింగుకి వెళ్లడం పడదు. వానకోటు అందుకుని సినమాకి బయల్దేరింది.

కౌంటరుదగ్గర పదిడాలర్లనోటు అందించింది, “సీనియర్ సిటిజన్” అంటూ.

అమ్మాయి క్షణకాలం కాంచనమొహంలోకి చూసి, “యూ డోంట్ లుక్ ..” అంది ఆరు డాలర్లు అందిస్తూ.

కాంచన టికెట్టూ, డబ్బూ తీసుకుని థియేటర్‌వైపు నడిచింది నేలకి జానెడెత్తున గాలిలో తేలిపోతూ – పెద్దదాన్నని చెప్పుకోగలిగినందుకో, మూడు డాలర్లు మిగుల్చుకున్నందుకో, అనువయినచోట అంగీకరించడం తేలికో  …

(11-23-09)

13 thoughts on “పెద్దతనం (కథ)

 1. @ ఉషా, మళ్ళీ కొన్ని వరసలు చదువుతాను. – మీఅభిప్రాయాలకోసం ఎదురు చూస్తున్నాను ముఖ్యంగా రజనివంటి అమ్మాయికి సరి తూగగల అమ్మాయికి అమెరికాలో ఎలాటి ఆలోచనలు వస్తాయి అని తెలుసుకోవాలనీ నేనూ, కొందరు పాఠకులూ కూడా అనుకుంటున్నాం. అంచేత మీ input చాలా ఉపకరిస్తుంది (నానవలకి కూడానేమో …). మీఅభిప్రాయాలకోసం ఎదురు చూస్తూ …
  మాలతి

  మెచ్చుకోండి

 2. “పరస్పరం వ్యతిరేకమయిన అనుభవాలనీ, పరిస్థితులనీ ఎలా సమన్వయపరుచుకోవడం? పెళ్లీ, పిల్లలూ, స్నేహాలూ. వయసులో తారతమ్యాలూ, అవి తెచ్చే ప్రత్యేకపరిస్థితులూ … ఏది కావాలి? కావలసింది సాధించుకున్న తరవాత ఏమిటి చేయాలి? దినదినం మనం చేసేవన్నీ రోజు గడవడానికా, మరేదో సాధించడానికా?”

  ఈ ప్రశ్న ఎవరికైనా తప్పదేమో!

  “అప్పుడయినా చదివించేలా వుందా లేదా అన్నది నాప్రశ్న” అని వ్యాఖ్యలో అడిగారు. తప్పక మళ్ళీ కొన్ని వరసలు చదువుతాను.

  మెచ్చుకోండి

 3. @ శ్రీలలితగారూ, చాలా బాగా వివరించేరు పెద్దతనం గురించిన తలపులగురించి. ఇందులో వినడానికి బాధ ఏంలేదండీ. నిజంగా నాకు చాలా సంతోషంగా వుంది మీరు శ్రమ తీసుకుని ఇంత వివరంగా రాసినందుకు. మీరన్నది నిజమే. పెద్దతనం మనసుకు సంబంధించినదీ, జీవనదృక్పథానికి సంబంధించినదీ కూడా. మీరే అన్నట్టు – మరొక మనసు ఈ “పెద్దతనం” ని ఎలా స్వీకరిస్తుందో మరొక మనసుతో – అన్న వాక్యం ఆధారంగా మరొక టపా రాస్తున్నా.

  @ భావనగారూ, మీరు మరొక కోణం ఆవిష్కరించేరు. నిజమే, ప్రశ్నే మనుగడకి మూలం. మార్పుకి మూలం. ప్రశ్నించడం అనవసరం కాదు. నిజానికి అది తప్పనిసరి. రాబోయే టపాలో ఈవిషయం కూడా ప్రస్తావిస్తావిస్తాను సవిస్తరంగా, నాకు చేతనయినంతవరకూ.
  మీ ఇద్దరికీ కూడా చక్కటి ఆలోచనలు రేపినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. మాలతిగారూ,
  మీరు చెప్పింది నిజం. కథ మధ్యలో ఇతర విషయాలు ప్రస్తావిస్తే కథ పక్కదారి పడుతుంది. ఫోకస్ పోతుంది. కథ వరకూ మీరు చెప్పింది కరెక్టే. రజని తన మనసు విప్పి చెప్పుకోవడం కాంచనకి నచ్చింది. ఎందుకంటే తల్లి వయసు గల పెద్దావిడ అని ఊరుకోకుండా పేరు పెట్టి పిలవడం వలన కాంచనకి అందరూ పిలిచినప్పుడు ఇబ్బంది పెట్టినట్టు అనిపించక హాయిగా అనిపించింది.
  అదే కాంచన మళ్ళీ థియేటర్ కి వెళ్ళి సీనియర్ సిటిజన్ ని అనే చెప్పుకుంది. వాళ్ళు అలా కనిపించటం లేదంటే సంతోషించింది.
  కాని ఈ విషయాన్ని కాస్త విడిగా ఆలోచిస్తేనో అనిపించింది. అందుకే నా భావాలని మీతో పంచుకుంటున్నాను.
  కాలం అనంతం. చిన్నతనం విడిచి పెట్టి వయసులో కొస్తున్నప్పుడు ఒక రకమైన ఆనందం. అప్పుడు వయసు దాచుకోబుధ్ధవదు. యవ్వనం దాటి మధ్య వయసు కొచ్చేక మరో రకమైన అందం. అందరికీ సలహాలు ఇవ్వడం లో ఉన్న గొప్పతనం తెలుస్తుందేమో అప్పుడూ వయసు దాచుకోం. ఆఫీస్ లో సెక్షన్ కి హెడ్ అయినప్పుడు ఫీల్ అయినట్టు ఫీల్ అవుతాం. ఆడవాళ్ళు అసలు వయసు చెప్పరని నానుడి ఉందనుకోండి. కాని దానిని నేను ఒప్పుకోను. ఎందుకంటే సర్టిఫికెట్స్ లో స్పష్టంగా ఉంటుంది. చుట్టాలకీ, స్నేహితులకీ తెలిసే ఉంటుంది. కాని నడివయసు దాటి మీరన్నారే “పెద్దతనం” అది వచ్చినప్పుడు అంత తేలికగా దానిని అంగీకరించలేమేమో అనిపిస్తుంది. అదే ఎందుకనీ అని అలోచిస్తే నడివయసులో ఉన్న శరీరదారుఢ్యం పెద్దతన మొచ్చేక తగ్గడం వలన ఏర్పడే అభద్రతాభావం ఒక కారణం అనిపిస్తుంది. ఆ బలహీనత ఒక్క శరీరానికేనా లేక మనసుకి కూడానా అని ఆలోచిస్తే శరీరం కన్న మనసు మీదే దాని ప్రభావం ఎక్కువేమో అనిపిస్తుంది.
  చాలామందిని చూస్తుంటాం. వయసు దాచుకోడానికి జుట్టుకి రంగులు వేసుకుంటారు. చూడగానే చిన్న గా కనిపిస్తామని వాళ్ళ అభిప్రాయం. కాని అందరూ వేసుకోరు. ఎందుకు? దీనికి కూడా మనసుకే ప్రాధాన్యం.
  ఇండియా లో పెద్దతనం వచ్చిందని చెప్పే వయసు అరవైయేళ్ళనుకుంటే అమెరికాలో కాస్త తేడాగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో పెద్దతనాన్ని గౌరవిస్తే మరికొన్ని కుటుంబాల్లో చాదస్తం గాళ్ళని విసుక్కుంటారు. ఇవన్నీ కూడా ఆయా మనుషుల మనసుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మనసు ని గురించి ఇలా ఆలోచించుకుంటూ పోతే “పెద్దతనం” అనే విషయం మీద బోలెడు కథలు రాయొచ్చుకదా. మీ కథని చూస్తే నాకు అదే అనిపించింది. మంచి టాపిక్ తీసుకున్నారు. మనం ఇంకా చిన్న వాళ్ళమే అనుకుంటుంటె అందరూ పెద్దతనం ఆపాదించేస్తే ఎలా ఉంటుందో కాంచన భావాల్లో చాలా బాగా చెప్పారు. వాళ్ళ మాటలు బుర్రలో తిరుగుతూ టికెట్ తీసుకుంటే “అలా కనిపించటం లేద”ని విన్నప్పుడు కాంచన సంతోషం తో గాలిలో తేలిపోవడం చక్కటి ముగింపు.
  ఈ వయసు మీదపడి “పెద్దతనం” రావడమన్నది ఎవ్వరికీ తప్పనిది. కాని ఒక్కొక్క మనసుకి ఒక్కొక్కలాగ అనిపిస్తుంది. అలాగ మనసు చెప్పిన మాటని బాగా చెప్పారు. సంతోషంగా ఉంది. మరొక మనసు ఈ “పెద్దతనం” ని ఎలా స్వీకరిస్తుందో మరొక మనసుతో ఆలోచిద్దాం.
  కష్టపడి నా బాధ విన్నందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. శ్రీ లలిత గారు: బలే సమీకరించారే… అందుకే మీరు రజని ప్రశ్న ను ప్రశ్న లా వదిలేసేరా మాలతి గారు. అవునా? హ్మ్మ్… ప్రశ్నించుకోవటం అనే ప్రాసెస్ లేక పోతే జీవితం లో సమాజం లో మార్పు రాదేమో… ప్రశ్నించుకోవటం ఒక జీవన విధానమవ్వక పోతే జీవించే జీవనం మనదవుతుందా.. ప్రశ్నించుకున్నాక అసంతృప్తి తో లేదా సుఖం, దుఖం తరాజు లో కొలిచి చూడటం అనవసరమేమో కాని ప్రశ్నిచటం అనవసరమా?

  మెచ్చుకోండి

 6. @శ్రీలలిత గారూ, జీవితంలో ప్రశ్నించుకునే వ్యక్తులని మీరు సమీకరించినవిధానం బాగుంది. అవును, ప్రశ్నించుకోడం, తరిచి చూచుకోడం చాలామందిలో తక్కువనే నేను కూడా అనుకుంటాను. రజని ప్రశ్నతో వదిలేయడానికి కారణం మీరన్నది కూడా సమంజసమే. నేను కథాకథనవిధానం దృష్ట్యా అది పొడిగించడం మంచిది కాదనుకున్నాను. కాంచనకి సంబంధించినంతవరకూ, వయోబేధాన్ని పక్కన పెట్టి, రజని ఆమెతో మనసు విప్పి మాటాడిన ప్రభావం ఆమె చివర ఆ వలయంలోనుండి బయటపడడానికి దోహదం చేసింది. ప్రారంభం, ముగింపుతో కలపాలి కదా మరి. 🙂 మధ్యలో సన్నివేశాలన్నీ ఆముగింపుకి తోడ్పడాలి. అలా చెయ్యలేకపోతే, నాకథ లోపమే. మీ వ్యాఖ్య నన్ను కూడా చాలా ఆలోచింప జేసింది. మనఃపూర్వక ధన్యవాదాలు.

  @ మురళీమోహన్ గారూ, తప్పకుండా పంపుతాను త్వరలోనే. మీ ఆదరణకి కృతజ్ఞతలు
  మాలతి

  మెచ్చుకోండి

 7. మాలతిగారూ,
  కథ చాలా బాగుంది. అలోచింపచేసింది. కొంతమంది మనుషులుంటారు. వాళ్ళు ప్రతి చిన్న విషయాన్నీ ప్రశ్నించుకుంటారు. ఆ సంఘటన జరిగిన సమయంలో కాకపోయినా తరవాత అయినా “ఎందుకిలా జరిగిందా” అని ఆలోచిస్తారు. జరిగిపోయినది వాళ్ళకి తృప్తిని కలిగించదు. ఆ విషయం ఆలస్యంగా తెలుస్తుంది. ఇలాంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాంటి కోవలోకే మీ కథలో రజని వస్తుందేమో అనిపిస్తోంది. కాని జీవితం లో జరిగిపోయిన సంఘటనలన్నీ సహజమే అనుకునే వాళ్ళ సంఖ్యే ఎక్కువేమో అనిపిస్తుంది. అటువంటి వారిలోకి మీ కథలో ప్రమీలలాంటి వాళ్ళు వస్తారు. దేనినైనా ప్రశ్నించుకుంటేనే మంచి, చెడు, సుఖం, దుఃఖం, ఎక్కువ, తక్కువ అనే ఆలోచనలు వస్తాయి.
  కాని ఒక విషయం మాత్రం సత్యం. ప్రశ్నించుకోవడం, బాధపడడం మాత్రమే మనం చేయగలిగింది. అందుకే మీరు రజని ప్రశ్న ని ప్రశ్నలాగే వదిలేసారనిపించింది. కథ మధ్యలో రజని ప్రశ్న తో మీరు జీవితాన్ని ప్రశ్నించేరు.
  చివర మళ్ళీ మామూలుగా వయసు మీదపడడం, పెద్దతనం అనే మాట దగ్గరికి వచ్చేసి మామూలు లోకరీతి ని చెప్పేరు.
  మొత్తానికి కథ చదివాక ఒక మంచి కథ చదివానన్న అనుభూతి కలిగింది. అభివందనములతో, శ్రీలలిత.

  మెచ్చుకోండి

 8. మాలతి గారు,
  చాలా బాగుందండి కధ. చాలా ఆలోచన లో పడేసేరు. మార్పు మార్పు మార్పు…. మార్పు అనివార్యం, ఒప్పుకోవటమా…. లేదా………. కాదు ప్రశ్న.. మార్పు గమనించటమా….? ఏమో బలే కన్ఫ్యూజన్ లో పెట్టేరు..

  మెచ్చుకోండి

 9. @ సౌమ్య, :))
  @ పరిమళం, మీరు (నిజంగా చూడని) నారూపాన్ని ఊహించుకోడానికి కారణం మీకు నాయందుగల అభిమానమే. మరొకరు రజనిలో తనని చూసుకున్నాను అన్నారు. వాస్తవానికి రచయిత వేరూ, కథకుడు వేరూ. మీరు చెప్పినరెండుకథల్లో నాఅనుభవం కొంత వుంది. దాన్ని సాగదీసి పదిమందికి వర్తించేలా చేయడం రచయితగా నాపని. అలా చేయలేకపోతే అది కథ అనిపించుకోదు. ఆత్మకథ అనొచ్చేమో. అప్పుడయినా చదివించేలా వుందా లేదా అన్నది నాప్రశ్న. 🙂

  మెచ్చుకోండి

 10. అప్పుడప్పుడూ మీ కధల్లో ముఖ్యపాత్ర మీరేనేమో( జేబు కధలో పరిమళ కూడా ) అనిపిస్తుంది …నేనైతే మీ రూపాన్నే ఊహించేసుకుంటాను….అది కరెక్టో కాదో తెలీదు కాని …అసంకల్పితంగానే మీ రూపం కళ్ళముందుకొచ్చేస్తుంది మరి !ఇప్పుడు కాంచన పాత్రలో మీరు 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.