మాలతి పదాలు

ఓనమాలు కెలక ఓ నమశివాయ

చిత్తరాలె రాతలు

వెన్నాడువారి ఊచకోతలు

వదరు విద్దెలు తామలీ!

ఓకేయన సరే

బెటరే నయము

వాటరే నీరు

బ్యూటిఫులు కాదె బహుసుందరమ్ము తామలీ!

రాతిలో నాతి చూచె

కోతి నేత చేసె

సుమతుల కానడాయె తామలీ!

000

మీకందరికీ తెలిసేఉంటుంది ఆరుద్రగారి కూనలమ్మపదాలు. ఆయన కూనలమ్మపదాలకి ఈ ప్రాచీనకవిత స్ఫూర్తి అని చెప్పుకున్నారు తమ ఉపోద్ఘాతంలో.

కుండలే భాండములు

కుక్కలే శునకాలు

ఆడువారే స్త్రీలు ఓ కూనలమ్మా

అలాటివి రాయ ప్రయత్నం ఇది. తామలి అన్నపదం మాలతి లో అక్షరాల కలగాపులగం.

000

పాఠకులలో ఒత్తు లేక

పాటకులయేరు

ఆపైన పాతకులు కాగలరు

తస్మాత్ జాగ్రత్త!

000

భూర్జపత్రములనుండి

తాటాకులకెక్కి

కాగితాలధిష్ఠించి

కంప్యూటరులో ‘కీ’లుగా రూపొంది.

దస్తూరి కుక్కలు చింపిన విస్తరయింది.

000

అక్షరాలు గుర్తుపట్టగలవారు చదువరులై

నిశాని ముద్రలు వేయగలవారు నాయకులై

అంతర్జాలం పారాయణగ్రంథమై

నవ్యనూతననాగరికత అలరారుతోంది

జనులారా, రండి రండి ఉత్తుత్తి దినాలు శాస్త్రోక్తంగా జరుపుకుందాం

000

(ఫిబ్రవరి 10, 2021)

ధర్మవిజయం?

మహాభారతయుద్ధంలో నేలకొరిగిన దుర్యోధనుడు ధర్మరాజుతో పలికిన పలుకులు-

  దేశసౌభాగ్యం నాకు అనుభవం, నీకు మిగిలింది స్మశానము అని.

దుష్టునివిజయంతో తెలిసింది దౌష్ట్యాన్ని వరించేజనాళి ఆయతనం.

ముందు ముందు దేనికోసం నానిరీక్షణ అన్న చింత!

మరో నేరారోపణ, మరో తీర్పు కలిగించునా నాకు ఓదార్పు?

(ఫిబ్రవరి 14, 2021)

000

(14 ఫిబ్రవరి 2021

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.