నాకు ఒకావిడమీద చాలా కోపం వచ్చింది. నా పెంపకం అలాటిదేమో ఎవరైనా ఓ ప్రశ్న అడిగితే జవా బు చెప్పకుండా ఊరుకోలేను. అదే నాప్రాణాలమీదికి తెచ్చింది అయినా మానుకోలేకపోయేను.
ఎక్కడుంటావు, ఏం తింటావు, ఏం పని, ఎన్నేళ్ళు దగ్గర్నుంచి, కళ్లు బాగున్నాయా, పళ్ళు తోముకుంటావా వరకూ అన్నిటికీ ఓపిగ్గా జవాబులు చెప్తూనే వచ్చేను. ఊరుకోలేకపోయేరా అని అడక్కండి. అలా జరిగిందని చెప్తున్నానంతే.
ఆఖరికి కొంతకాలానికి తెలివొచ్చింది.
జవాబులు చెప్పకుండా ఊరుకోడమే కాదు. ఎదురు ప్రశ్నలు వదాం అని కూడా అనుకున్నాను.
నువ్వెక్కడున్నావు, ఏంచేస్తున్నావు, ఏం తిన్నావు …
ఇంకా అనేక స్క్రిప్టులు రాసుకున్నాను.
– నాసంగతి నీకెందుకు,
– నీపనేదో నువ్వు చూస
– నాజోలికి రాకు, నేను నీజోలికి రాను
– నీధోరణి నాకు మహ చిరాకుగా ఉంది
– నీతో మాటాడ్డం నాకిష్టం లేదు సిద
—–
– ఇంకా ఏవేవో … వంద స్క్రిప్టులతో సిద్ధం అయేను
ఆతరవాత ఆవిడకోసం ఎదురు చూస్తున్నాను.
అదేం ఖర్మమో, నేను సిద్ధం ఆయేక ఆవిడ కనిపించడం మానేసింది.
ఇదేదో దేవుడు నాపాలిట చేసిన ఏర్పాటేమో.
ఆవిడ కనిపించకపోతే నేను నా స్క్రిప్టు పయోగించే అవుసరం ఉండదు.
నాదెంత కుత్సితబుద్ధో వెలియజేసే అవకాశం లేదు.
నేను నాఅలవాటుప్రకారం మంచిదాన్నిగానే ఉండిపోతాను హాహాహా.
—
ఆతరవాత నాలుగు నెలలకి కాబోలు ….
“గుడ్ మార్నింగ్”
ఉలిక్కిపడి అటు చూసేను. ఆవిడే!!
ఒక్కక్షణం అటు చూసి మళ్ళీ కూరలు ఎంచుకోడంలో పడిపోయేను.
నేను రాసుకున్న ఒక్క స్క్రిప్టూ గుర్తుకి రాలేదు!!!
అసలు మనిషికి మాటలు రాకపోతే ఎంత బాగుండునో అనిపించింది.
ఆవిడ నన్ను ఆ ప్రశ్నలు అడిగే అవకాశం ఉండేది కాదు.
నేను జవాబులు చెప్పే అవుసరం ఉండేది కాదు.
నాకు కోపం వచ్చేది కాదు.
నేను స్క్రిప్టులు రాసుకుంటూ అంతకాలం వృథా చేసుకోడం అస్సలు జరిగేదే కాదు!!
000
(మార్చి 2, 2021)