ముఖపుస్తకంలో రాసిన కొన్ని పోస్టులు ఇక్కడ దాచుకోవాలనిపించింది.
ఆ కళ్ళే!!
పలకరిస్తాయి, కవ్విస్తాయి, నవ్విస్తాయి
రారమ్మంటూ మురిపిస్తాయి.
స్నేహరుచులు చిప్పిల్లజేస్తాయి
వెక్కిరిస్తాయి. ఉడికిస్తాయి, ఏడిపిస్తాయి,
ఎన్నెన్నో కతలు చెపుతాయి.
కలువలతో, పద్మాలతో, మీనాలతో పోలిక
కామాలూ, వామాలూ, విశాలాలు విశేషణాలతో విస్తరణ!
ఆ కళ్లే
ఇంతచిన్నవి, ఇంత లోతు
అంటూ నర్సులచేత నస పెట్టిస్తాయి.
… … జబ్బు, ఈ మందులు
అంటూ వైద్యులచేత ఉపశమనం కలిగిస్తాయి.
ఒకటి సగం ఉపయోగం, రెండోది పూర్తి నిరర్థకం అయినదినాలలో
ఎందరి మెప్పో “ఆ కళ్ళు” అంటూ ఆశ్చర్యార్థకాలతో.
ఇకమీదట ఏమన్నారు అని చూసుకున్నాక
ఎవరన్నారని చూసుకోవాలి నేను.
000
(మే 27, 2021)
000
కనిపించనిరోజులు
కన్ను కనిపించనిరోజులే మేలు.
పుస్తకం చదవలేదన్నబాధ లేదు
అక్షరాలు తప్పులు పడుతున్నాయన్న యావ లేదు.
దుమ్ము దులపాలన్న దృష్టి లేదు.
అన్నంగిన్నెమసి వదల్లేదన్న జ్ఞానం లేదు.
పైగా
ఫొటోలు కెమెరా చూసుకుంటోంది.
వేలకి వేలు పోసి ఎందుకు సర్జరీ చేయించుకున్నాను దేవుడా!!
(జూన్ 3, 2021)
000
తెల్లవారె
నేను కూయకపోతే తెల్లవారదు అనుకుందో కోడి
నాలా ఎవరు కూయగలరు అనుకుంది మరో కోడి
నాకూతకోసం ఎందరు ఎదురు చూస్తున్నారో అనుకుందింకో కోడి ఒకకన్ను సగం మూసి.
నేను కూయనివాళనంటూ మొండికేసింది ఒక కోడి
బద్ధకంగా ఒళ్లు విరుచుకు కళ్ళు తెరిచి అటూ ఇటూ చూస్తూ చిరునవ్వుతో తీరిగ్గా లేచేడు బాలార్కుడు.
000
భ్రమలు
నాచుట్టూ తిరుగుతున్నాను నేను భూదేవి ఆదర్శమై.
రాత్రీ పగలూ కూడితేనే ఒక రోజు
తప్పూ ఒప్పూ తెలిస్తేనే సమతూకం
వెలుగు చూసి చీకటి లేదనుకుంటావు
ఒకకథ చూసి రచయితమీద ఏర్పరుచుకున్న అభిమానం
మరొకకథ చూసేక సమసిపోతే
అది మెప్పు కాదు, నీభ్రమే.
000
పాండిత్యం
పేర్లు పెట్టడమే పాండిత్యం
మొక్కకి కొమ్మలు
కొమ్మకి రెమ్మలు
రెమ్మకో పూవు
పూవుకి దళాలు
దళంలో ఈనెలు
ఈనెలు చీలిస్తే మరేవో ….
ప్రతీ వస్తువుకీ పేర్లు పెడతారు పండితులు నిశితదృష్టితో.
పూవు చూసి అహో అనుకుంటూ మురిసిపోతాను నేను పాండిత్యం కొరవై.
000
చిత్రమా? పదమా?
చిత్రం తక్షణసౌఖ్యం
పదం అక్షరం
బొమ్మ చూసి, మరో బొమ్మకి వెళ్లిపోతాం
మాట చూసి అక్కడే ఆగిపోతాం ఆలోచనలతో.
మాటకున్న పదును, గాంభీర్యమూ బొ్మ్మకి లేదు.
మాట మనసున ముద్ర వేసినట్టు బొమ్మ వేయదు అంటాన్నేను.
మరి నువ్వు బొమ్మలెట్టటం నేదా అంటాది సంద్రాలు
మరి మనసున ఏసిన ముద్దర బొమ్మే కదా అంటాది సంద్రాలు.
హా హా. ఆ తాత్కాలిక సుఖాలకోసమే బొమ్మలెడుతున్నానంటాన్నేను.
మనసున పడిన ముద్దరో అంటే అది యేరంటాను
ఆ యేరు ఎనాగో సెప్పటం నాకు తెలవదు
000
(గమనిక – అంతర్జాలంలో, ముఖపుస్తకంలో వ్యాఖ్యలు జిఐయఫ్ రూపాలలో చూసి.)
000
సంకరబాస
తెల్లగా ఉంటే నల్లపిల్లేనా?
ఎగ్గు ఎగ్గనతగునా!
బోల్డనుకుంటే బోల్డు ఆనందం
కాల్నొప్పంటూ కాల్చేసేడు.
మండే అంటే ఒళ్లు మండె
(వేరువేరు భాషలలో పదాలు గమనించగలరు.)
(జులై 17, 2021)