వ్యాసంలో ఏమి చెప్పేరు? శీర్షిక ఏమి చెప్తోంది?

(జనవరి 22, 2022. సవరణలతో.)

డా. రమేష్ ప్రసాద్ రావెళ్ళ గారు రచించిన వ్యాసానికి శీర్షిక ఇలా ఉంది.

Aricle Heading in Misimi 11/2021


రచయిత నాకు పంపిన ఈవ్యాసం నిడివి 20 పేజీలు. మొదటి 4 పేజీలలో నిడదవోలు మాలతి రచనావ్యాసంగంగురించి ఉంది. మిగతా 16 పేజీలలో తెలుగుకథలకి ఆంగ్లఅనువాదాల సంకలనాలూ, అనువాదాలు, ఇతర దేశరచయితలకథలు ఉన్నాయి.

నామొదటి సందేహం- 20 పేజీల వ్యాసంలో 4 పేజీలు మాత్రమే నిడదవోలు మాలతి సాహిత్యం గురించిన చర్చ అయినప్పుడు ఆవ్యాసానికి మాలతిపేరూ, ఫొటో సమంజసమా అన్నది. నాఅభిప్రాయంలో సమంజసం కాదు.

రెండవ సందేహం ప్రవాససాహిత్యం అన్న running title గురించి. నిజానికి ఇదే మొదటి సందేహం అనాలేమో.

అసలు ఏది ప్రవాససాహిత్యం అన్నది మొదట ప్రస్తావిస్తాను. ఈవిషయంమీద విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

ఈ ప్రవాససాహిత్యం అన్న నుడికారం ప్రాచుర్యంలోకి వచ్చేక, నిర్వచనం ప్రశ్న తలెత్తింది. ఒక సంస్కృతివారు విదేశాలలో స్థిరపడి మరొక సంస్కృతినీడన నివసిస్తూ ఆ రెండు సంస్కృతులమూలంగా తమలో కలిగిన సంఘర్షణలూ, ఆకారణంగా తమజీవితాలలో కలిగిన మార్పులను ఆవగాహన చేసుకుని, సమన్వయపరుచుకుని మరొక కొత్తపద్ధతిలో ఒక సంస్కృతి సృష్టించుకున్నవారు రాసిన కథలు అని నిర్వచించేరు. అంటే రెండు భిన్నసంస్కృతులను సమన్వయపరుచుకుని ఆ అవగాహనతో చేసిన రచనలు అని.

నేను చాలాకాలం ఈ భిన్నసంస్కృతులు అన్నది రెండు దేశాలయితేనే తమకి ప్రత్యేకమైన సంస్కృతి సృష్టించుకునే పరిస్థితి ఏర్పడుతుందని అనుకున్నాను. కానీ ఈమధ్య మనదేశంలోనే ఒక రాష్ట్రంనుండి మరొకరాష్ట్రానికి తరలివెళ్లి అక్కడ స్థిరపడి రచనలు చేసేవారిని కూడా ప్రవాసులనే అంటున్నారు. ఇంకొంచెం ముందుకి వెళ్లి మరొకఊరులో స్థిరపడినవారి అనుభవాలు కూడా అవే అంటున్నారు. ఇలా మరోఊరికి మరో వీధికీ మారినవారిని కూడా ప్రవాసులంటే తెలుగుదేశంలో ప్రవాసులు కాని రచయితలు అంటూ వేరే ఉండరు. పెళ్లిళ్లూ, ఉద్యోగాలూ, పిల్లలచదువులూ ఇలా ఏదో ఒక కారణంగా ఊరు మారని రచయితలు లేరు. అలాటప్పుడు సాహిత్యమంతా ప్రవాససాహిత్యమే. వేరుగా ప్రవాససాహిత్యం అన్నపేరు అనవసరమే కదా.

ఇన్ని రకాలవాదనలు లేక నిర్వచనాలు ఉన్నప్పుడు సహజంగానే వ్యాసకర్త తనకు తాను ఒక నియమాన్ని విధించుకుని ఆ పరిధిలో వ్యాసం వ్రాస్తాడు. ఈ నియమాన్ని వ్యాసం మొదట్లో వివరించడం రచయితధర్మం.

ఈవ్యాసకర్త, రమేష్ ప్రసాద్ రావెళ్ళ వివరించలేదు. ఇది 14వ వ్యాసం. మొదటి వ్యాసంలో వివరించేరేమో నాకు తెలీదు.

ఈవ్యాసంలో కనిపించినమేరకు రమేష్ ప్రసాద్ గారు ఏవి  ప్రవాసకథలుగా గుర్తించేరు అంటే – వస్తువు, మూలరచయిత అన్న విషయాలు వదిలేసి, స్వగ్రామం వదిలి మరో ఊళ్లో ఉన్న ఏ రచయిత అయినా ఇంగ్లీషులోకి అనువదిస్తే అది ప్రవాసకథే అని. ఉదాహరణకి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అరికాళ్ళకింద మంటలు ఈవ్యాసంలో చోటు చేసుకుంది. అంటే రమేష్ ప్రసాద్ గారి అభిప్రాయంలో అది ప్రవాసకథే అనుకోవాలి!

నిజానికి అది ప్రవాసకథ కాదు. ప్రతి ఆంగ్లానువాదాన్ని ప్రవాసకథ అనువాదకుడు ఊరు మారినంతమాత్రాన ప్రవాసకథ అవదు.

నిడదవోలు మాలతికథలను చెహోవియన్ కథలు అని, చెహోవ్ కథలలో శిల్పంగురించి తరవాత ప్రస్తావిస్తాననీ వ్యాసకర్త మొదట్లో అన్నారు కానీ తరవాత చెహోవ్ కథలు చర్చిస్తున్నప్పుడు మళ్లీ మాలతికథలు ప్రస్తావించి సారూప్యం ఎత్తి చూపడం జరగలేదు. అలా చేసి ఉంటే ప్రధానశీర్షికకి కొంత బలం కలిగేది.

అసలు వ్యాసరచనగురించి ఒకమాట చెప్పుకోవాలి. నిజానికి ఇది ఈ ఒక్క వ్యాసంగురించే కాదు. సాధారణంగా వ్యాసాలు, విమర్శలు, సమీక్షలగురించి ప్రస్తావిస్తున్నాను ఇక్కడ. వ్యాసాలలో విమర్శలలో తమ వాదన లేదా అభిప్రాయానికి అవుసరమైన సన్నివేశమో పాత్రో సూక్ష్మంగా వివరించవచ్చు కానీ కథంతా ఆసాంతం చెప్పడం సమంజసము కాదు. అలా కథంతా చెప్పేయడం మూలరచయితకి అన్యాయమే అవుతుంది. పాఠకులకు మూలకథ చదవాలన్న ఆసక్తి నశిస్తుంది.  

ఈవ్యాసంలో చాలాకథలు అలా సంక్షిప్తంగా చెప్పేయడం జరిగింది. కొన్ని కథలకి రచయిత తమఅభిప్రాయాలు జోడించేరు. కొన్ని కథలకి అది కూడా లేదు.

స్థూలంగా ఈ వ్యాసానికి నిడదవోలు మాలతి అన్నపేరు సమంజసం కాదు. ఒకరకంగా ఇది నన్ను కించపరిచడానికే ఇలా చేసేరేమో అనిపిస్తోంది. ఏడు దశాబ్దాలుగా సాగిస్తున్న రచనావ్యాసంగంగురించి అంతకంటె చెప్పడానికి ఏమీ లేకపోతే, అసలు ఇది తన వ్యాసానికి వస్తువుగా తీసుకోవలసిన అవుసరమే లేదు. లేదా, మాలతిసాహిత్యంగురించిన వ్యాసమే అయితే మిగతా రచయితలచర్చ ఉండకూడదు. తులనకి అయితే తప్పించి. అలాకాక, ప్రవాససాహిత్యంగురించి అయితే, మాలతి కథలలో ప్రవాసజీవితానికి సంబంధించినవి మాత్రమే చర్చించాలి. ఆ రెండూ జరగలేదు ఈవ్యాసంలో.   

ఇప్పుడు నా ప్రశ్నలు –

1. వ్యాసకర్తకి నాప్రశ్న: ఈ వ్యాసానికి నిడదవోలు మాలతి అని పేరు పెట్టడం, నాఫొటో జోడించడాన్ని ఎలా సమర్థిస్తారు? అంతే కాదు. ఈ వ్యాసాలు సంకలనంగా వేస్తే, నాపేరూ, ఫొటో, నాసాహిత్యానికి సంబంధించిన భాగాలు తొలగించవలసిందిగా కోరుతున్నాను.

2. మిసిమి సంపాదకులకు నాసందేహం: మీపత్రిక సాహిత్యపత్రికగా కొందరు గుర్తించడం గమనించేను. ఈ కలగూరగంప వ్యాసాన్ని ప్రచురించడాన్ని ఎలా సమర్థిస్తారు?
000

(నవంబరు 8, 2021)

2 thoughts on “వ్యాసంలో ఏమి చెప్పేరు? శీర్షిక ఏమి చెప్తోంది?

 1. మీ ఆదరాభిమానాలకి ధన్యవాదాలు. వ్యాసం రాస్తున్నట్టు రచయిత నాకు మెయిలు ఇచ్చేరు. సాధారణంగా వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు రాయడానికి అనుమతి అవుసరం లేదు. మర్యాదకి చెప్పవచ్చు. అంతే. మరో 3 వ్యాసాలు కూడా పంపేరు మచ్చుకి.
  నేను ఆవ్యాసాలు చదవలేదు నాకు ఆసక్తి లేకపోవడంచేత.

  ప్రధానంగా రమేష్ ప్రసాద్ రావెళ్లగారికి ప్రవాససాహిత్యానికీ అనువాద సాహిత్యానికీ తేడా తెలీదని వ్యాసం చూసేక అర్థమయింది. వ్యాసం ఇంత గందరగోళంగా రాయడం ప్రచురించడం జరగగలదని నేను ఊహించలేదు.

  నాపేరూ, ఫొటో ఆవ్యాసానికి ఎలా సమర్థిస్తారని రచయితనీ, సంపాదకులనూ అడిగేను. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. కానీ రెండోభాగం డిసెంబరులో వచ్చింది. నాపేరూ, ప్రవాససాహిత్యం అన్న running title తొలగించేరు.

  పోతే కోర్టుకి ఎక్కేవిషయం – లేదండి, నాకు కోర్టుకి ఎక్కడం ఇష్టం లేదు. రచయితలూ, సంపాదకులూ, పాఠకులూ ఈవిషయంగురించి తీవ్రంగా ఆలోచించాలని నాఅభిప్రాయం.

  మీవంటి సాహితీవేత్తలు ఇలాటి బాధ్యతారహిత రచయితలనీ, పత్రిక సంపాదకులనూ నిరసించగలరని మాత్రం ఆశిస్తున్నాను.

  మెచ్చుకోండి

 2. ఎవరండీ వాళ్ళూ? ఇదేం పాడుపనీ? మిమ్మల్ని సంప్రదించలేదు. మీతో చర్చించలేదు. అసలు మీరచనల గురించి వారికి సరైన అవగాహన ఉందని కూడా అనిపించటం లేదు. మీపేరుని వాడుకుంటున్నప్పుడు మీ అనుమతి తీసుకోవాలన్న కనీస స్పృహ కూడా ఉన్నట్లు అనిపించదు. ఇదంతా మిమ్మల్ని అక్షరాలా లోకువకట్టటమే. ఇలా మిమ్మల్ని కించపరచే అధికారం వారి కెవ్వరు ఇచ్చారు? ఆపుస్తకం వెలువరించిన సంస్థపై న్యాయపరమైన చర్యలను తీసుకొనే అధికారం మీకు సంపూర్ణంగా ఉంది. ఇలా చిత్తం వచ్చినట్లు ఇతర రచయితల రచనలను వాడుకొన్న పక్షంలో చదువరులకు అసమగ్రమైనవీ అమోదయోగ్యం కానివీ ఐన అభిప్రాయాలను ఆ వాడకం ద్వారా కలిగించే‌ ప్రమాదం పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు చర్యలకు ఉపక్రమించటం వలన ఇలాంటి వేషాలకు చెక్ పెట్టేందుకు అవకాశం ఉంది. మీలా అన్యాయానికి గురైన ఇతరరచయితలూ ముందుకు వచ్చేందుకూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అది కొంత కట్టడి చేస్తుంది ఇలాంటి జబర్దస్తీ నాటకాలని. కాబట్టి చర్యలు తీసుకొనే విషయం పరిశీలించండి వెంటనే.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.