జగద్గురు శ్రీ శంకరాచార్య. దీనదయాళ్ ఉపాధ్యాయ రచన. సమీక్ష

అనువాదం. పురిపండా అప్పలస్వామి. (1994.)

శంకరాచార్యులవారి జీవితచరిత్ర కాకపోయినా వారిజీవితంలో ముఖ్యఘట్టాలు చాలామందికి సుపరిచితమే. బాల్యదశలోనే వేదాంతగ్రంథాలు పఠించడం, సన్యాసం స్వీకరించడానికి తల్లినుండి అనుమతి పొందడంవంటి అనేక సంఘటనలు కథలుకథలుగా చెప్పుకోడం జరుగుతూనే ఉంది.

నేను ఈపుస్తకం చదవడానికి ప్రధానకారణం పురిపండా అప్పలస్వామిగారి పేరే. ఆయన మహా పండితులని తెలుసు. దేవీభాగవతం, శ్రీమద్భాగవతం, రామాయణంవంటి గ్రంతాథాలు రచించేరని తెలుసు.

అందుచేత శంకరాచార్యులగురించి ఏమి చెప్తారో చూదాం అనిపించింది. ఇది అనువాదం అని చూసి, అసలు అప్పలస్వామిగారివంటి మహాపండితులు శంకరాచార్యులవిషయంలో అనువాదం ఎందుకు చేసేరు అన్న సందేహం మరో కారణం. స్వయంగా తామే వ్రాయగలరు కదా అని.

పుస్తకం చిన్నదే. 154 పుటలు.

“ముందుమాట” అన్నశీర్షకకింద సుదీర్ఘంగా దేశపరిస్థితులు వివరించేరు. సంతకం లేదు కానీ అది అనువాదకుల వాక్కు అనే అనుకుంటున్నాను. ఈభాగంలో ముఖ్యంగా వైదికధర్మాన్ని జాతీయసైమక్యతతో ముడి పెట్టడం జరిగింది.

ప్రధానంగా, బుద్ధుడు, జినుడు, చార్వాకుడు (నాస్తికులు) ఆవిష్కరించిన ధర్మాలలోనూ ఆస్తికవాదులు విశ్వసించిన ధర్మాలలోనూ మౌలికంగా ఏకసూత్రం ఉందని నిరూపించడమే శంకరాచార్యుల ధ్యేయంగా ఆవిష్కరించబడింది ఈ పుస్తకంలో. అయితే సాధారణంగా శంకరాచార్యుల స్తోత్రాలలో కనిపించే ఆత్మార్పణతత్వం ఈ విజయోత్సాహంలో కనిపించదు. ఒకరకంగా శంకరుడు ఇతర ఆచార్యులపై విజయం సాధించడానికి పూనుకోడం మాత్క నిపిస్తుంది. అహమిక అని కూడా అనుకోవచ్చు.

మామూలుగా అన్ని జీవితచరిత్రలలాగే శంకరునిజననం, విద్యాభ్యాసంతో మొదలవుతుంది. ఆ తరువాత, దేశంలో ప్రబలమవుతూన్న వివిధ నాస్తిక సిద్ధాంతాలూ, వాటిని ప్రతిఘటించడానికి ఆస్తికుల ప్రయత్నాలనీ వివరించి, దేశంలో మతసంబంధమైన ఐక్యత సాధించడానికి ప్రజ్ఞానిధి అయిన శంకరాచార్యులుగా ఆయనపాత్రని ఆవిష్కరించేరు. శంకరుడు గురువు గౌడపాదులని ఆశ్రయించి, విద్యాభ్యాసం కొనసాగించి, గురుస్థానం వహించి దేశసంచారం చేస్తూ అద్వైతమతానికి విరుద్ధమైన సిద్ధాంతాలను ఆచరించేవారిపై విజయం సాధించడమే ఈపుస్తకంలో ప్రధానాంశం.

అయితే ఆ విజయాలు సాధించే ప్రయత్నంలో శంకరాచార్యులు చేసిన వాదనలు మాత్రం నాకు నిరుత్సాహం కలిగించేయి.

ఈపుస్తకంలో వేదాంతవిదుడు, తాత్వికుడుగా కాక శంకరుడు దేశసమైక్యతకీ, అద్వైతప్రచారానికీ కంకణం కట్టుకున్న రాజనీతికుశలునిలా దర్శనమిస్తాడు. కొన్ని వాక్యాలు రాజకీయనినాదాలని తలపింపజేస్తాయి.

వంటి వాక్యాలు శంకరునిపరంగా ఊహించుకోలేను కనీసం నేను.

రచయిత అన్ని సంఘటనలనూ ఒకే దృష్టితో కాక, తమవాదనకి అనుకూలంగా సమర్థించుకున్నట్టు కనిపిస్తుంది. ఉదాహరణకి, శంకరుడు నదిలోకి దిగినప్పుడు మొసలి శంకరునికాలు కరిచిపట్టుకోడం, సన్యాసానికి తల్లి అనుమతించేక, వదిలేయడం అసంభవమని వ్యాఖ్యానించి, రచయిత మరొక నమ్మదగ్గ వివరణ ప్రతిపాదిస్తారు. ఇది ఆధునీకరణం. మరొక సందర్భంలో – టిబెట్టులో శాక్తేయులు తాంత్రికవాదాలతో ఎదుర్కున్నప్పుడు – శంకరాచార్యులు “కామరూపంలో ఎన్నో కష్టాలు భరించవలసివచ్చింది” అంటారు. మరి ఈ “కామరూపం” విశ్వాసపాత్రం ఎలా అయింది?

శంకరుడు ఒక ధనవంతుని పొరుగువారికి సహాయం ఎందుకు చేయవని ప్రశ్నించినప్పుడు, ఆ ధనవంతుడు ఆపేదవారిఇంటిని బంగారు ఉసిరికాయలతో నింపేడని కథనం. ఇక్కడ కూడా నాకు పూర్తిగా లౌక్యమే కనిపించింది. ఆ ఇంటియజమానికి ఏరోజుకి ఆరోజు, ఆరోజుకి సరిపడినంత మాత్రమే సంపాదించుకోవాలని నియమం. అంతకంటె ఎక్కువ తెచ్చుకుంటే అది దొంగతనంతో సమానమంటాడుట. మరి వారి ఇల్లు బంగారు ఉసిరికాయలతో నింపడం సమంజసమేనా?

నేనంటున్నది, జీవితచరిత్రలు రాస్తున్నప్పుడు రచయితకి సంయమనం లేకపోవడంవిషయం. ఇలాటివి మూలవస్తువుని నీరసపరుస్తాయి.

మండనమిశ్రునితో, భారతితో శంకరుని సంభాషణలు మరింత విపులంగా వ్రాసి ఉంటే, ఆవాదనలకీ, పుస్తకానికీ కూడా చేవ కూరేది. శంకరుని విచారదృష్టి మరింత స్పష్టంగా విశదమయేది. అందుకు విరుద్ధంగా, రచయిత, అనువాదకుల అభిప్రాయాలకే ఎక్కువ సమయం వెచ్చించారు.

ఆధునికసాహిత్యంలో సీత, శూర్పణఖ, ద్రౌపదివంటి పాత్రలతో తమ వాదాలను ప్రచారం చేయడానికి కొందరు రచయితలు ఉపయోగించుకోడం చూస్తున్నాం.

ఈపుస్తకం పూర్తి చేసేక, నాకు మళ్లీ అదే అభిప్రాయం కలిగింది. ఈపుస్తకం చదువుతుంటే మనకి మనీషాష్టకంవంటి శ్లోకాలు రచించిన శంకరాచార్యులు కనిపించరు. కొందరు సాంఘికప్రవక్తలు తమ ఆలోచనలప్రకారం ఈ శంకరాచార్యులపాత్రని తిరిగి మలచినట్టు కనిపిస్తుంది.

ఇది అందరికీ సమ్మతమేనా? బహుశా పైన చెప్పిన సీత, శూర్పణఖ, ద్రౌపదిపాత్రలను విసృజించినవారికి సమ్మతం కావచ్చు. వాటిని ఆదరించే పాఠకులు కూడా అసంఖ్యాకంగానే ఉండొచ్చు. నాకు మాత్రం రుచించలేదు.

ఆసక్తి గలవారికోసం లింకు ఇదుగో. archive.orgకి కృతజ్ఞతలతో. https://archive.org/details/jagadgurusankara020388mbp

000

(మార్చి 1, 2022)

4 thoughts on “జగద్గురు శ్రీ శంకరాచార్య. దీనదయాళ్ ఉపాధ్యాయ రచన. సమీక్ష

 1. “వైష్ణవాచార్యులు ,విశిష్టాద్వైత, ద్వైత మతావలంబీకులు శంకరాచార్యుల వారిని తగ్గించి చూపే ప్రయత్నం చేస్తుంటారు.” అనేది నిజమే!కానీ, ఎందుకు అలా చేస్తున్నారో వూహించగలరా?

  ఇక్కడ “సత్యం, మిధ్య” అనే పదాలను direct antonyms అనుకుని జగద్గురువుల వారు జగత్తు అనేది బ్రహ్మము కన్న భిన్నమైనది,అసత్యమైనది,నశ్వరమైనది అని చెప్పినట్టు కొందరు పొరపడుతున్నారు.నిజానికి మిధ్య అనే పదానికి ఇక్కడ అసత్యం అనేది సరైన alternative కాదు.వేదం చెప్పిన సత్యాలను axiomic truths అంటారు.అంటే, ఇతరమైన అంశాలను సత్యమా అసత్యమా అని తేల్చుకోవడానికి వేదం చెప్పిన సత్యంతో పోల్చి చెప్పడమే తప్ప వేదం చెప్పిన ఏ సత్యాన్నీ ఇతరమైన అంశాలతో పోల్చి సత్యమా అసత్యమా అని తేల్చి చెప్పటం కుదరదు – ఇది నేను చెప్తున్న కవరింగ్ స్టేట్మెంటు కాదు,వేదం చదివి అర్దం చేసుకుని తమ మాతృభాషలోనికి అనువదించుకుని పరిశోధనలు చేసిన అనేక దేశాల మేధావులు చెప్తున్న సార్వకాలిక సత్యం(axiomic truth).ఇక్కడ సత్యం యొక్క లక్షణాలలో ఉన్న స్వతంత్రతని తీసుకుంటే మిధ్య అనే పదానికి అస్వతంత్రత అనేది మాత్రమే సరైన alternative అవుతుంది.బ్రహ్మ వలెనే బ్రహ్మ నుంచి విడివడిన జగత్తుకి కూడా బ్రహ్మకు ఉన్న తక్కిన అన్ని లక్షణాలూ ఉంటాయి.అయితే జగత్తు బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నట్టు బ్రహ్మ జగత్తు మీద ఆధారపడి లేడు.

  ఇది శంకరుల వారి అసలైన ప్రతిపాదన.జగద్గురువుల వారి అద్వైత సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ, పరబ్రహ్మ, పరమాత్మ, సృష్టికర్త, శివుడు, విష్ణువు, గణేశుడు, పార్వతి వంటి పేర్లతో తను సైతం వర్ణించిన అన్ని దేవతా స్వరూపాల వెనక ఉన్నది అవ్యక్త నిర్గుణ నిష్కామ శుద్ధ చైతన్యమే.రామానుజ, మధ్వ, వల్లభ, కృష్ణ మతాల వారు చెప్తున్న రూపధారులైన విష్ణువు గానీ శివుడు గానీ పవిత్ర స్థలాలు గానీ ఆళ్వారులు గానీ శుద్ధ చైతన్యం కానే కాదు.జగద్గురువు ప్రతిపాదించిన అద్వైతం సత్యమా రామానుజుడు ప్రతిపాదించిన ద్వైతం సత్యమా అనేది తెలియాలంటే ఇప్పటి సైన్సు నిరూపిస్తున్న “Consciousness shapes Universe” అనే చిన్న నిజం తెలుసుకుంటే చాలు.ఇప్పటికీ నేను బ్రహ్మ సత్యం జగన్మిధ్య గురించి చెప్పినది అర్ధం కాక జగద్గురువు ప్రతిపాదించిన అద్వైతం శాస్త్రీయం కాదని వాదించ దల్చుకున్న వాళ్ళు “we have been all wrong. What we have called matter is energy, whose vibration has been so lowered as to be perceptible to the senses. There is no matter” అని Albert Einstein తను కనుక్కున్న సాపేక్ష సిద్ధాంతం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాడు, వినండి!Albert Einstein అనే పాశ్చాత్యుడికి తెలిసినది మనకు తెలియనందుకు సిగ్గుపడాల్సిన పని లేదు – జగత్తునీ బ్రహ్మాన్నీ మాయ, లీల అనే రెండు ముసుగులు ఆవరించుకుని ఉండటమే అందరికీ వెంఠనే పరమసత్యం గోచరించక పోవడానికి కారణం => తపన పడాలి, ప్రయత్నించాలి, చూడాలి ఆనందించాలి, పంచుకోవాలి.

  వేదం గానీ ఉపనిషత్తులు గానీ శంకరుని అద్వైతం గానీ పొరపాటున సైతం మనుషులను “మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు” అని విడగొట్టలేదు.ఈనాటికీ హిందువులలో సైతం కొందరు మనుషుల్ని అలా విడగొట్టటం అవైదిక దర్శనాల ప్రభావమే – “తెలిసిన వారు, తెలియని వారు” అని వైదిక దర్శనం చేసిన విభజన చాలా న్యాయమైనది, కదూ!శంకరుల అద్వైతం మరొక నీ అంతట నువ్వు విప్పుకోలేని చిక్కుముడి లాంటి నువ్వు నమ్మలేని వేదం చెప్పిన నిత్యసత్యాన్ని విప్పి చెప్తుంది – నీ సమస్యని పరిష్కరించుకోవటం కోసం నీ అజ్ఞానాన్ని తొలగించుకోవటం కోసం నీ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఆచార్యులకి సైతం సూచనలు ఇచ్చి ప్రోత్సహించటం వరకే సాధ్యం.కేవలం ధారణకి లోపల ఉన్న లక్ష్యానికే గాక ధారణకి బైట ఉన్న లక్ష్యానికి సైతం నిన్ను చేరుస్తున్న = బీజం, సంకల్పం, దీక్ష, ప్రయత్నం, ఫలితం, అనుభవం, ఆనందం, విషాదం, శిక్ష, రక్ష, వేద్యం అన్నీ నీకు లోపలి నుంచే వస్తాయి.

  ఇంతటి శాస్త్రీయమైన అద్వైతాన్ని “బ్రహ్మ సత్యం జగన్మిధ్య” సూత్రీక్రణలో శంకరాచార్యుల వారు జగత్తుని అసత్యం అన్నాడు అనే పెడర్ధం తీసి ఆ దోషాన్ని ద్వారిస్తున్నట్టు తమది విశిష్టమైన అద్వైతం అని చెప్పుకుంటూ ద్వైతాన్ని మనమీద రుద్దారు.ఇది పచ్చి మోసం!అత్యంత సూక్ష్మమైన పరమాణువులలోని ఎలెక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వంటి అత్యంత సూక్ష్మమైన వాటిలో కూడా అబ్సొలుతె చొన్స్చిఔస్నెస్స్ అనేది ఉండటం వల్లనే Qఊఆణ్టూం డోఊభ్ళే శ్ళీట్ ఏXఫేఋఈంఏణ్ట్ అనే ప్రయోగం మొండి శిఖండి హేతువాద పండితులకి కూడా ఝలక్ ఇచ్చి వాళ్లచేత దేవుడు ఉన్నాడని ఒప్పుకునేలా మృదువర్లని చేసింది.ఒకసారి జగద్గురువు ప్రతిపాదించిన అద్వైతం తలలో దూరితే ఆ క్షణం మొదలు ఇక ఆ మనిషికి భౌతికపరమైన సంపదలకు గానీ మనోగతమైన ఆనందాలకు గానీ కొరత అనేది ఉండదు, ఉండకూడదు – గ్యారెంటీ నేను, వారెంటీ లేదు, అవసరం లేదు!జగద్గురువు చెప్పిన ఒక సత్యంలోని సగమైన “బ్రహ్మసత్యం జగన్మిధ్య” అంటే ఏమిటో చెప్తూ విశ్లేషణని మొదలుపెట్టాను.అదే సత్యంలోని సగమైన “జీవో బ్రహ్మైవ న అపరా” అంటే ఏమిటో కూడా చెప్పాను. ఇక శంకర దర్శనం గురించిన విశ్లేషణని ఇక ఆపేస్తున్నాను.

  ద్వైతం పుట్టిందే శంకరుల “బ్రహ్మ సత్యం, జగన్మిధ్య” వాదాన్ని తప్పు పడుతూ అయినప్పుడు వారు అలా చెయ్యకపోతేనే ఆశ్చర్య పడాలి.

  మెచ్చుకోండి

 2. ఆదిలో జైనులూ మధ్యలో చిత్పవనులూ బ్రిటిషర్లూ ఆఖర్న కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ మన దేశ చరిత్రని చిందర వందర చేసేసి సృష్టించిన గందరగోళం వల్ల మనకు అత్యంత ప్రీతిపాత్రులైన ప్రాతస్మరణీయుల నిజమైన చరిత్ర తెలియడం లేదు.జగద్గురువుకి సంబంధించి పూ.సా.శ 2000 మొదలు సా.శ 788 వరకు నాలుగు జన్మతిధులు కనపడుతున్నాయి.ప్రస్తుతం ప్రభుత్వం వారు సా.శ 788 నాడు ప్రభవించి సా.శ 820 నాడు అస్తమించినట్టు భావిస్తున్నారు.అయితే కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు సా.శ 788 అనేది వాళ్ళ అధిపత్యం కోసం పాశ్చాతులు జీసస్ క్రీస్తు పుట్టిన తేదీ కన్న ముందుకి జరిపారని అంటున్నారు.వాస్తవానికి జగద్గురువు జననం పూ.సా.శ 509 నాడు జరిగిందని చెప్తున్నారు.జగద్గురువు స్థాపించిన నాలుగు పీఠాలలోనూ 70 తరాల పీథాధిపతుల వివరాలు ఉన్నాయని అంటున్నారు.కార్బన్ డేటింగ్ మెధడ్ కాలడి నది 2,500 సంవత్సరాల క్రితం దారిని మళ్ళించుకుని ప్రవహించినట్టు నిరూపించిందని స్వామివారు చెప్తున్నారు.
  స్వామివారు కార్బన్ డేటింగ్ చేయించినది జగద్గురువు తన తల్లి కోసం పూర్ణా నదిని తమ ఇంటి పక్కనుంచి ప్రవహించేలా చేసిన సంఘటన గురించి.వీటన్నిటికన్న పూ.సా.శ 5వ శతాబ్దపు కేరళ చక్రవర్తి సుధన్వుడి పేరున కనబడుతున్న తామ్ర శాసనం బలమైన సాక్ష్యం అవుతుంది.ప్రస్తుతానికి శంకరపీఠాల వారి వాదననే ఒప్పుకోవాలి.జగద్గురువు పూ.సా.శ 509 నాడు ప్రభవించి 32 సంవత్సరాల పాటు జీవించి పూ.సా.శ 477 నాడు అనంతాత్మలో లీనమయ్యారు.
  మనకు తెలిసిన జగద్గురువు జీవిత చిత్రణలో ఎక్కడా తామ్రశాసనంలోని సుధన్వ మహారాజు పేరు వినపడదు.ఆదిశంకర భగవత్పాదులు మండనమిశ్రుని భార్యను ఓడించడం కోసం పరకాయ ప్రవేశం చేసిన రాజు పేరు సుధన్వుడు కాదు, అమరుకుడు.నిజానికి “కామసూత్ర పాండిత్యం కోసం పరకాయ ప్రవేశం చేసి అమరుక మహారాజు భార్యల దగ్గ్గిర కామశాస్త్రం నేర్చుకోవడం” అనేది దుర్మార్గమైన సన్నివేశం అనిపిస్తుంది నాకు.జగద్గురువుల వారి సాహిత్యంలో “జ్ఞానంతో కూడిన శ్రద్ధ” ఎక్కువ కనిపిస్తుంది.పాండిత్యమూ స్పర్ధా వాదనలూ భాషా కాలుష్యమూ కనిపించడం లేదు.
  జగద్గురువుల వారి లక్ష్యం జైన బౌద్ధ మతాల తాకిడికి శిధిలం అయిన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడం అయినప్పుడు వేద శాస్త్రాలకు బాహ్యం అయిన కామ శాస్త్రాన్ని ధార్మిక చర్చలోకి తీసుకు రావడం అసందర్భం అవుతుంది – అంతటి జ్ఞాని అయిన జగద్గురువు ఔచిత్యం లేని వ్యర్ధకార్యం ఎందుకు చేస్తారు?ఇందులోని అసలైన దోషం ఏమిటంటే, దేహధారి యైన అమరుక రాజు ఒక్క భార్యలు ఆత్మరూపుడైన జగద్గురువుకి పరస్త్రీలు అవుతారు.వైదిక ధర్మ స్థాపన కోసం ప్రభవించిన జగద్గురువు వైదిక శాస్త్రం కాని కామసూత్ర పాండిత్యం కోసం ధర్మ విరుద్ధమైన పరస్త్రీ సాంగత్యం చెయ్యడం భావ్యమా, అవసరమా!

  మెచ్చుకోండి

 3. వైష్ణవాచార్యులు ,విశిష్టాద్వైత,
  ద్వైత మతావలంబీకులు శంకరాచార్యుల వారిని తగ్గించి చూపే ప్రయత్నం చేస్తుంటారు.

  నిజానికి శంకర, స్మార్త సంప్రదాయం పాటించేవారు శివ కేశవులకు భేదం చూపరు.
  ఇటీవల జీయర్ స్వామి గారు రామానుజ చార్యులే గొప్ప గురువని శంకరులు జగద్గురువు కాదు అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు. మనిషికి తాను ఉన్న సాధన దశను అనుసరించి ద్వైత, విశిష్టాద్వైత లేక అద్వైత మార్గం లో అనురక్తి కలుగుతుంది. ఇది విస్మరించి గురుస్థానం లో ఉన్నవారు వివాదాలు కల్పించడం సరికాదు.

  My God, my Guru, my faith is only great, all others are inferior or untrue – This narrow minded philosophy will lead to unnecessary controversies.

  మెచ్చుకోండి

 4. ప్రస్థాన త్రయం గ్రంథా లకు వ్రాసిన భాష్యం, ప్రకరణ గ్రంథాలు, దక్షిణామూర్తి స్తోత్రం ఇలా కొన్ని మాత్రమే జగద్గురు శంకరాచార్యులు వ్రాసినట్లు కొందరు అద్వైత ఆచార్యులు చెబుతున్నారు . శంకర విజయము లోని సన్నివేశాలు కల్పితాలు అని శంకరాచార్యులకు ఆపాదించ బడిన భక్తి
  స్తోత్ర వాంగ్మయం వారి రచనలు కావు అని కొందరు పరిశీలకుల అభిప్రాయం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.