భాష – సిరికోనసభలో నాప్రసంగం

నిన్న, సెప్టెంబరు 10, 2022, జరిగిన సిరికోన, కోడూరు పార్వతి స్మారక పురస్కారం సందర్భంలో నాప్రసంగం సమగ్రపాఠం ఇది

భాష

 భాషకీ సంస్కృతికీ అవినాభావసంబంధం ఉంది. అసలుసంస్కృతికి భాష ప్రాతిపదిక కూడా. సంస్కృతిని నిర్వచించేది భాషే. మనిషిని మనిషితో జత కూర్చేది భాష. అదే సాహిత్యంగానో వాఞ్మయంనో పదిలపరుచుకుంటున్నాం.

స్థూలంగా చూస్తే సాహిత్యం  రెండు పాయలుగా ప్రవహిస్తోంది అని నాకు అనిపిస్తుంది.

 పండితులు సృష్టించినది, పామరులు సృష్టించినది.

ఇక్కడ పండితులంటే యూనివర్సిటీడిగ్రీలున్నవారనే కాదు. పామరులంటే అక్షరప్ముక్క రానివారు అనీ కాదు. పామరులు అంటే అజ్ఞులు, మూర్ఖులు అని ఆంధ్రభారతి నిర్వచనం. నేను ఆ అర్థంలో వాడడం లేదు. కాగితంమీద వ్రాయనివారు అని మాత్రమే నా ఉద్దేశం.

ఈరెండు పాయలను ఖచ్చితంగా నిర్వచించలేను కానీ ఈప్రసంగం పూర్తయేవేళకి నాఆలోచన మీకు కొంతైనా తెలుస్తుందని ఆశిస్తున్నాను.

1. పండితుల రచనలు మేధకి సంబంధించినవి. వారు వ్యాకరణం, ఛందస్సు, అలంకారశాస్త్రం క్షుణ్ణంగా చదువుకుని, ఆ నియమాలకి తమ ప్రౌఢిమ జోడించి రచనలు చేస్తారు. ఆరచనల్లో చమత్కారం, భాష ప్రౌఢత, అన్నీ కవుల, పండితుల భావాలనే కాక, మేధోసంపత్తిని కూడా వెల్లడి చేస్తాయి. ఈవిషయానికి మళ్లీ వస్తాను.

2. పామరుల రచనల్లో ఈవ్యాకరణం, ఛందస్సువంటి అంశాలఆలోచన ఉండదు. చమత్కారం  ఉంటుంది. శాస్త్రాల్లో చెప్పినట్టు అని వారు పట్టు పట్టకపోవచ్చు కానీ ఆపాటల్లో లయ ఉంటుంది, ఊపు ఉంటుంది. వారికథల్లో అనేక జాతీయాలు, నానుడులు చోటు చేసుకుంటాయి. ఆ సాహిత్యం ప్రధానంగా నిత్యజీవితంలో తమఅనుభవాలు, ఆశలనూ, ఈతిబాధలనూ ప్రకటించేదిగా ఉంటుంది. పండితులలా వారు యతిప్రాసలూ, గణాలూ లెక్కలు చూసుకోకపోయినా ఆశువుగా తోచినది చెప్పుకుంటూపోతారు.  

ఈ రెండు సాహిత్యాలమధ్య తేడాకి ఒక చిన్న ఉదాహరణ ఒక కూనలమ్మపదం.

కుక్కలే శునకాలు

కుండలే భాండమ్ములు

ఆడువారే స్త్రీలు ఓ కూనలమ్మా.

కుక్కలు, కుండలూ, ఆడువారు అన్నపదాలు పామరులు రాస్తారు. శునకాలు, భాండాలు, స్త్రీలు పండితులూ రాస్తారు. ఇది స్త్రీలని హేళన చేయడమేనని ఆచార్య మలయవాసినిగారు అన్నారు. నాకు మాత్రం ఎవరు ఏభాష వాడుతారు అన్న కోణం చూడడానికి కూడా పనికొచ్చింది.

పండితులరచనలతో పామరులరచనలు పోల్చి ఎక్కువతక్కువలు నిర్ణయం చేయడంలేదు నేను.  మౌలికమైన ఒక వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతున్నాను. మనసుకి బుద్ధికీ మధ్యగల వ్యత్యాసం అనవచ్చు. కేవలం రెండు వర్గాలజనాలలో సృజనాత్మకతలో తేడా అనొచ్చు.

ఈ తేడా ఇప్పటికీ కొనసాగుతోందని నాఅభిప్రాయం.  

స్వాతంత్ర్యపోరాటం నేపథ్యంలో స్త్రీలను విద్యావంతులుగా చేసే ప్రయత్నంలో పత్రికలు వచ్చేయి.

గృహలక్ష్మి, హిందూసుందరిలాటి స్త్రీలపత్రికలు స్త్రీలరచనలని ప్రోత్సహించడం వచ్చేక, అక్షరాలు రానివారు కూడా అక్షరాలు నేర్చుకుని ఈపత్రికలకి వ్రాస్తూ వచ్చేరు అని లక్ష్మణరెడ్డిగారు తెలుగు జర్నలిజం సిద్ధాంతగ్రంథంలో వ్రాసేరు. ఆ స్త్రీలరచనలలో మూలతత్వం ఆ పామర రచయితలవంటిదే అంటాను నేను. వీరు కూడా లక్షణగ్రంథాలూ, కథనవిధానంసూత్రాలూ ఏవి పట్టించుకోకుండా కేవలం తాము చూసినవీ, అనుభవించినవీ రాసేరు కనక.

 మార్పు.

భాష సజీవం కనక మార్పు సహజం. కొత్తపదాలు వచ్చి చేరుతాయి, వాడుకలో లేని కొన్ని పదాలు నశిస్తాయి అనను కానీ వాడుకలో లేకుండా పోతాయి. భాష మారుతుందన్నదన్న విషయంలో ఎలాటివివాదం లేదు. అయితే, ఈ మార్పు ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుంది, తెలుగులో ఎలా వచ్చింది అని ఆలోచిస్తే నాకు తోచిన  అభిప్రాయాలు ఇవి.

నాకు కనిపించినంతవరకూ భాషలో మార్పుకి భావాలలో మార్పుకి సంబంధం ఉంది.

ఈనాడు సాంఘికప్రయోజనం, సామాజికస్పృహ. అభ్యుదయభావాలు కథలలో ఉండాలని సాహితీవేత్తలు అంటున్నారు. ఆ ప్రాతిపదికమీదే కథలు వ్రాయడం, సంపాదకులూ విమర్శకులూ కథలని ఆమోదించడం లేదా నిరసించడం, విలువ కట్టడం జరుగుతోంది.

నిజానికి ప్రాచీనసాహిత్యంలో ఈవిలువలు లేవా అంటే ఉన్నాయి. సంఘంలో ధర్మం పునఃప్రతిష్ఠించడానికే నన్నయ భారతం వ్రాయడం జరిగింది అంటారు. అయితే భారతాన్ని అదే దృష్టితో ఇప్పుడు చదవడం లేదు. అల్లసానివాని అల్లిక జిగిబిగి అంటారు. మరో కవిగ్రంథంగురించి ద్రాక్షాపాకం, నారికేళపాకం అంటారు. అంచే అక్కడ కేవలం సాంఘికప్రయోజనంమాట కాదు కదా మాట్లాడుతున్నది. కవిత్వం ఒక సాహిత్యప్రక్రియగా ఆదరించి, చేసినవ్యాఖ్యానాలు అవి. కేవలం సందేశం లేక ఇతివృత్తం మాత్రమే కాక, ఇతరకోణాలగురించి చేసిన విమర్శలవి.

ఇప్పుడు కథలవిమర్శలలో ఇలాటి వివిధ కోణాలపరిశీలన కనిపించదు. స్త్రీవాదం అనో మరోటో పేరు పెట్టి ఆ రచన సంఘాన్ని ఉద్ధరించడానికి ఏమాత్రం ఉపయోగపడుతోంది అన్న దృష్టితో మాత్రమే విమర్శించడం, విలువ కట్టడం జరుగుతోంది. అంటే కథని సాహిత్యప్రక్రియగా కాక రోగాలు కుదిర్చే మందుగా వాడుతున్నారు. కాల్పనికరచనకీ వాస్తవమైన వార్తాకథనానికి తేడా తెలీకుండా పోయింది.

మాలతి కాదన్నా అవి స్త్రీవాదకథలే అని నాకథలగురించి అనేవారు కూడా ఈకోవలోకే వస్తారు.  ఆకథలో గల ఇతరఅంశాలు – భాష, శైలి, పాత్రచిత్రణ, జాతీయాలు, సంస్కృతిపరమైన అంశాలు, శీర్షిక కథకి నప్పిందా లేదా- ఇలాటివేవి పట్టించుకోనివారు మాత్రమే అలా అనగలరు. కథని సాహిత్యప్రక్రియగా కాక రాజకీయనినాదంగా పరిగణిస్తేనే అలా లేబుల్ అంటగట్టడం జరుగుతుంది.  

భాషలో వస్తున్న పరిణామం గమనిస్తే కనిపించేవి

1. ఒక కొత్తపదం చేరడానికో, ఉన్నపదం వాడుకలోంచి తప్పుకోడానికో సుమారు రెండు దశాబ్దాలు పట్టినట్ట్టు కనిపిస్తోంది ప్రాచీనగ్రంథాలు చూస్తే. అంటే ఒకొక పదం మారడానికో, కొత్తపదం చేరి నిలదొక్కుకోడానికో అంత సమయం పడుతుంది అంటున్నా. ఇప్పుడు ఆ పట్టేసమయం 2, 3 తరాలకి తగ్గిపోయింది. మనకి తొందర ఎక్కువయిపోతోంది కాబోలు.  
2. అలాగే పదాలు మాయమవడం కూడా జరుగుతోంది. ఇక్కడ కూడా వాడుకలో ఉన్న పదాలు రెండు తరాలలో కనిపించకుండా పోతున్నాయి. నాకాలంలో నిత్యజీవితంలో ఉన్నపదాలకి ఇప్పుడు “అంటే ఏమిటి” అని అడుగుతున్నారు. 

మనభాషలో కొత్తపదాలు చేరడానికి కొంతవరకూ కారణం ఇంగ్లీషుపాలన అని అనడం పూర్తిగా న్యాయం కాదు. ఇంగ్లీషువాళ్లు దేశాన్ని వదిలిపోయేముందు, మీరు మాభాషని నెత్తికెత్తుకోవాలి అని నియమాలు పెట్టలేదు. పాలనావిధానం తెలియడానికి ఇంగ్లీషు నేర్చుకోండి అన్నారు. అది IAS చదువులతో మొదలయింది.

 గెలటీ A dictionary of the current Telugu తయారు చేసేక, వారికుమారుడు ఆర్. గెలటీ ఆ నిఘంటువు తయారు చేయడానికి కారణం ఇంగ్లీషువారు వెళ్లిపోయేక మనం మనదేశాన్ని పాలించుకోడానికి మనభాషలో ఆ పదాలు అవుసరం అనిట.  అది మనవాళ్ల తలకెక్కలేదు. వారికి వారై మీరు మాభాషే వాడాలి అని చెప్పకపోయినా, మనవాళ్లు ఆ భాషా, భావాలూ కూడా వదిలిపెట్టలేదు. అందుకే మన స్వేచ్ఛ వాగాడంబరంగానే మిగిలిపోయింది.

 

గిడుగు వెంకట సీతాపతి  A History of Telugu Literature అన్నపుస్తకంలో ఇతరభాషాపదాలు మనభాషలో కలవడానికి కారణం ఆవస్తువులో భావాలో మనభాషలో లేకపోవడమే అంటారు.  

ముస్లిములు పరిపాలనకాలంలో అనేక అరబ్బీ, పెర్షియన్, హిందుస్థానీ పదాలు తెలుగులో చేరడం మొదలయింది. పోర్చుగీస్ వారి రాకతో ఇతర భాషాపదాలు మరింత విస్తరించేయి, ప్రధానంగా అధికారపత్రాలలో. కృష్ణదేవరాయలు, పెద్దనవంటి కవుల ప్రబంధాలలో పార్శీపదాలు ఉన్నాయిట.

పరిశీలించి చూస్తే, అవన్నీ ఆనాటి పరిపాలనకి సంబంధించినవీ, నిత్యజీవితంలో మనసంస్కృతిలో లేనివీ అన్నది స్పష్టం అవుతుంది.జిల్లా, తాలూకా, జిలేబీ, టాంగా,

వీటిలో కొన్నిపదాలు తెలుగులో ఎంతగా కలిసిపోయేయంటే కొందరు తెలుగువారికి అవి తెలుగు పదాలు కావని తెలీదు కూడా అన్నారు.నిజమే. నాకూ తెలీదు. కిటికీ, దుప్పటీ లాటిపదాలు తెలుగు పదాలు కావు అని నేను అనుకోలేదు.

మరి, ఏ పదాలు ఆమోదిస్తున్నాం, ఏకారణంగా ఆమోదిస్తున్నాం, ఎందుకు అన్ని పదాలూ ఆమోదయోగ్యం కాదు అని ఆలోచిస్తే నాకు తోచినవిషయాలు.

బహుశా 1930, 40 దశకాల్లో మొదలయినట్టుంది తెలుగంటే మనకి నిరసనభావం.

భమిడిపాటి కామేశ్వరరావు రెండు పుస్తకాలు – మన తెలుగు. 1938లో, తెలుగు రెండోభాష 1941లో- ప్రచురించేరు.

కామేశ్వరరావుగారి మాటల్లో –

అది తెలుగుదేశంలో ఒక బడి. తెలుగువారు ప్రారంభించిన బడి.

తెలుగువారు ప్రారంభించిన ఇంగ్లీషుమీడియం బడి.

తెలుగుదేశంలో తెలుగువారు ప్రారంభించిన ఇంగ్లీషుమీడియం బడి.

ఆబడిలో తెలుగు రెండోభాష.

తెలుగుదేశంలో తెలుగువారు ప్రారంభించిన ఇంగ్లీషుమీడియంబడిలో తెలుగు రెండోభాషగా బోధించే తెలుగుపండితుడు ఆయన.

ఆ తెలుగుపండితుడి అనుభవాలు ఎంత హాస్యరసస్ఫోరకంగా ఉంటాయో అంత బలంగానూ కటికవాస్తవాన్ని కూడా ఆవిష్కరిస్తాయి.

తెలుగులో ఇతర భాషాపదాలు చేరడానికి కారణాలు –

1. కొన్ని యథాతథంగా తెచ్చుకున్నవి – మనసంప్రదాయంలో లేని పదాలు.

సీతాపతిగారే చెప్పినట్టు, విదేశీ సంప్రదాయాలు, విదేశీ వస్తువులూ మనవి చేసుకున్నప్పుడు ఆభాషలో పదాలు మనవి చేసుకోడం న్యాయం. కంప్యూటరు, కెమెరా, లాటి వస్తువులకి తెలుగు పదాలు సృష్టించక్కర్లేదు. సృష్టించినా కాలానికి నిలబడవు. దీనికి దృష్టాంతంగా పొగబండి, ధూమశకటం చెప్పుకోవచ్చు.

2. శంఖంలో పో సి తీర్థంగా స్వీకరించిన పదాలు.

మన సంప్రదాయంలో ఉన్నపదాలను పాశ్చాత్యులు, ముఖ్యంగా అమెరికనులు, చిన్నమార్పులతో తీసుకుని వాడుకుంటుంటే, మనం కూడా ఆవాడుకనే అంగీకరించడం.  

యోగా – యోగవిద్య, యోగాసనాలు, రాజయోగం ఇలా ఉంటాయి తెలుగుల వాడుకలో. వీటిలో ప్రధానంగా ధార్మికపరమైన కోణం ఉంది. అమెరికనులకి అది వ్యాయామం మాత్రమే. మనవాళ్లు యోగాభ్యాసం చేస్తున్నప్పటి మనస్తత్వం వేరు. కానీ ప్రస్తుతం విపరీతంగా వాడుకలో ఉన్న పదం మాత్రం అమెరికనులు ప్రసాదించిన యోగా మాత్రమే.

 3. అలవాటయిపోయిందంటూ తెచ్చుకున్నవి. ఇక్కడ తెచ్చుకున్నతరవాత అలవాటయిందా, అలవాటయేక తెచ్చుకున్నామా అన్నది భేతాళప్రశ్న.

ఉదా. try చేస్తాను. కొందరు ప్రయత్నిస్తాను అంటున్నారు. ఇది కొంతవరకూ గ్రాంథికఛాయే. నిజానికి ఆసందర్భంలో వెనకటిరోజుల్లో “అలాగే” “చేసి చూస్తాను” అనేవాళ్లం, నాతో సహా. నేను అలాటిదాన్నే. ఇది గ్రామ్యభాషకి ఉదాహరణ. అంటే మాట్లాడేవారికి డిగ్రీలున్నాయా లేవా అని కాదు. ఆ వేళకి ఏమాట నోట వస్తుందన్నది.

 అలాగే 1 నించి 4 వరకూ నానబెట్టాలి – ఇది తెలుగు ప్రయోగం కాదు. తెలుగువాళ్లం మామూలుగా అయితే 3,4 గంటలసేపు నానబెట్టాలి అంటాం.

మరో ఉదాహరణ. కంచుతో చేసిన విగ్రహాలు. మీ అమ్మమ్మని అడిగి చూడండి. ఆవిడ కంచుతో చేసినవిగ్రహాలు అంటారు. కంచుతో “చేయబడిన” అనరు. ఈ “బడు” ప్రత్యయంగురించి నాకు చాలా అనుమానాలున్నాయి కానీ ఇప్పుడు కాదు.

4, ఇంగ్లీషులో ఆలోచించి, తెలుగులో వాటిని తర్జుమా చేసుకుని, ఓ కృత్రిమతెలుగు సృష్టించడం. ఇదే ఎక్కువ ప్రమాదం. ఉదా. నిన్ను విన్నాను, I hear you.  తెలుగులో “నీమాట నాకర్థం అయింది”. అలాగే “ఆయన్ని చదివేను”. ఇది తెలుగు కాదు. I read him ఆయనతీరే అంత అంటాం మామూలుగా. ఆయన్ని పుస్తకంలా చదివేస్తాను అన్నది కూడా ఇంగ్లీషువాక్యాన్ని తెనుగీకరించడమే. ట

ఇక bath take చేసేరా, fruit throw చెయ్యకండి లాటివాక్యాలని ఏమనలో నాకు తెలీదు. ఇవి భాషాభివృద్దికి దోహదం చేస్తున్నాయా? స్నానం చేసేరా, పళ్లు పారేయకండి అంటే ఏమి తక్కువయింది?

నేను మొదట్లో చెప్పిన పండిత పామర లేక గ్రామ్యభాష ఛాయలు రెండుపాయలుగా  ఇప్పటిసాహిత్యంలో కొనసాగుతూనే ఉన్నాయి.

ఆనాటి పండితులలో శాస్త్రనియమాలూ, చర్చలూ ఈనాడు స్త్రీవాదంలాటి వాదాల్లోనూ, సాంఘికప్రయోజనం, సామాజికస్పృహ రచనలుగా పరిణమించేయి. అంటే ఈవివాదాలు పండితులమధ్యే ఉంటున్నాయి. సామాన్యప్రజలకి అందుతున్నాయా, వారు చూస్తున్నారా, వారికి వీటివల్ల ఏమైనా లాభం కలిగిందా అంటే నాకు అనుమానమే.

అలా కాక కేవలం తాము చూసినలోకం, తమఅనుభవాలు తమకి తెలిసినభాషలో కథలు రాస్తున్నవారు ఉన్నారు. ఇది పారమజనులగుణం అంటున్నాను నేను. ఈరచనలు ఎక్కువగా బ్లాగుల్లోను, ఫేస్బుక్ టపాలలోనూ, ఈమధ్య కొన్ని జాలపత్రికలలోనూ కూడా కనిపిస్తున్నాయి.

ఈరచనల్లో రాజకీయనినాదాలను ప్రచారంచేసే ధోరణి ఉండదు. పేరుప్రఖ్యాతులకోసం వెంపర్లాట ఉండదు. మరోరకంగా చెప్పాలంటే తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుంది కానీ మరొకరికోసం రాస్తున్నట్టుండదు.

భాష దగ్గరకొచ్చేసరికి మాత్రం అన్నిరచనల్లోనూ ఇంగ్లీషు విపరీతంగా ఉంటోంది. ఒకొకప్పుడు మొత్తం వాక్యం ఇంగ్లీషులోనూ చివర అండి అనో కదా అనో చేర్చడం జరుగుతోంది

ఇది వ్యావహారికభాషావాదానికి దీటుగా ఉందని కొందరివాదన. ఇలా మాట్లాడుతున్నాం కనక ఇలా రాస్తున్నాం, ఇలాగే రాయాలి అని.

నాకు ఈమాత్రం భాష పట్టుబడడానికి కారణం ఆరోజుల్లో – 1940, 50, 60 దశకాల్లో భారతి, ఆంధ్రపత్రిక, సాహితి వంటి పత్రికలలో నోరి నరసింహశాస్త్రిగారు, వేలూరి శివరామశాస్త్రిగారూ, వేటూరి ప్రభాకరశాస్త్రిగారివంటి పండితులు వ్రాసిన కథలే కాక, వ్యాసాలు కూడా చదివేదాన్ని, అర్థం అయినా కాకపోయినా. ఈనాడు పత్రికలలో వస్తున్నకథలు చదివి నాతెలుగు మెరుగుపడింది అని చెప్పుకోగల పాఠకులు ఎవరైనా ఉన్నారా?

కొంతకాలంగా తెలుగు వినిపించక, నాకు అదొక పెద్ద సమస్య అయేక, ఫేస్బుక్కులో చేరేను. తెలుగుపదాలు వినడంకోసం పెట్టుకున్న పేజీ కనక తెలుగులో అంటే తెలుగుపదాలు తెలుగులిపిలో వ్రాయగలవారిని మాత్రమే నామిత్రమండలిలో చేర్చుకుంటున్నాను. అది కొందరికి కష్టంగా ఉందని తెలుసు కానీ నాకు కావలసింది తెలుగే మరి. అది దొరక్కపోతే నేను అక్కడ ఉండవలసిన అవుసరమే లేదు. చాలామంది టపాల్లో నాకు అర్థమయిందీ, ఆసక్తి కలిగించేదీ ఆవగింజంతైనా లేదు. క్రమంగా నా తెలుగుమూలంగానే నాపేజీకి వస్తున్నారని తెలిసింది. అసలు కొందరు కేవలం నాపేజీలో ఉండడంకోసం తెలుగుఫాంట్స్ తీసుకుని కంప్యూటరులో తెలుగు వ్రాయడం నేర్చుకున్నాం అన్నారు.

నాతెలుగంతా పండితులు వ్రాసినకథలు చదివి నేర్చుకున్నది అన్నాను కదా. అంటే కొన్నిమాటలకి అర్థాలు సందర్భాన్నిబట్టి నాకు నేను అర్థం చెప్పుకున్నవి. అలా చెప్పుకోడంలో పొరపాట్లు కూడా జరిగేయని ఫేస్బుక్కులో చేరేకే తెలిసింది. అలా కూడా నాతెలుగు మెరుగు పరుచుకోడానికి దోహదమవుతోంది. ఇంకా కొందరు సంస్కృతశ్లోకాలకి అర్థాలు చెప్తున్నారు. అదీ పనికొచ్చింది. అలా ఎన్నో విధాల నాకూ, నాతెలుగుకీ ఫేస్బుక్ మేలే చేసింది. ఆకారణంగా కూడా నాకు తెలుగుభాషమీద ఆసక్తి పెరిగింది. అందుకే అంటున్నాను. వ్రాస్తూఉంటేనే నిలుస్తుంది అని.

సమాజంలో, మనజీవనవిధానంలో, మనం ఉన్న వాతావరణంలో వస్తున్న మార్పులమూలంగా మనం మాట్లాడే భాష మారుతుంది. నిజమే. ఇద్దరు ఇంజినీర్లు వాళ్లవృత్తివిశేషాలు మాట్లాడుకున్నప్పుడు ఇంజినీరింగుమాటలు రావడం సహజమే కదా.

అలాగే వంటల్లోనూ. గ్రైండరులో గ్రైండ్ చేయడంలో ఆశ్చర్యంలేదు. గ్రైండ్ చేయడానికీ రుబ్బడానికీ తేడా పెద్దదే. ఒప్పుకుంటాను.

కాని నీళ్లకీ, ఉప్పుకీ, సాయంత్రానికీ, కిందటేడుకీ water, salt, evening, last year అనవలసిన అవుసరం ఏమిటి? దీనివల్ల భాషాభివృద్ధి జరుగుతోందా? నష్టం జరుగుతోందా?

ఇలాటిపదాలు కనీసం కథల్లోనైనా వాడుతుంటేనే భాష నిలుస్తుంది. అది రచయితలబాధ్యత

నేను రచయితలని కోరుతున్నది ఇదే. దేశాభిమానంలాగే దేశాభిమానం నాకు కద్దని భాషాదినాలు చేస్తే చాలదు. దేశాభిమానంలాటిదే భాషాభిమానం కూడా. ప్రస్తుతం మాటల్లో ఎలాగా లేదు, కనీసం రాతల్లోనైనా తెలుగు నిలబెట్టండి. మనతరవాతి తరాలు తెలుగు అంటే ఇదీ అని తెలుసుకోగలిగేది కథల్లోనే.. సామాజికస్పృహలాగే, నిజానికి ఇంకా ఎక్కువగా, భాష స్పృహ కూడా ఉండాలని నేను దృఢంగా నమ్ముతాను.

సభలో పాల్గొన్న పాఠక మిత్రులకూ, విలువైన అభిప్రాయాలు వెలిబుచ్చిన వక్తలకూ, సిరికోన పీఠం నిర్వాహకులకూ, కోడూరు ప్రభాకరరెడ్డిగారికీ హృదయపూర్వక ధన్యవాదములతో ఈ ప్రసంగం ముగిస్తున్నాను.

కోడూరు పార్వతి స్మారక పురస్కారం

నిడదవోలు మాలతి

సెప్టెంబరు 11, 2022.

2 thoughts on “భాష – సిరికోనసభలో నాప్రసంగం

 1. అవునండి ఈవిషయంమీద చర్చ జరగాలి. ఎటొచ్చీ ప్రతివారూ పైన నేను ఇచ్చిన ఉదాహరణలలాటి ఉదాహరణలు మరో పది పెడతారే తప్ప అలా మాట్లాడకుండా, రాయకుండా ఉండడానికి తాము ఏమి చేస్తున్నారో చెప్పరు. తెలుగుపదాలు వాడుకలోకి తెచ్చే కోరిక ఎవరికీ లేదు. మీరు రాసి మీబ్లాగులో పెట్టండి. మరో పదిమంది చూస్తారు. అక్కడ మీరు ఇదే చెప్పండి. మనకి కావలసింది మరిన్ని ఉదాహరణలు కావు, తెలుగు వాడుకలోకి తేవడానికి తాము ఏమి చేస్తున్నారో చెప్పాలి అని.

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ,

  ముందుగా మీకు లభించిన ప్రతిష్ఠాత్మకపురస్కారాన్ని పురస్కరించుకొని మీకు అనేక శుభాభినందనలు.

  మీ వ్యాసం అసక్తికరంగా ఉంది. మీలాగే నేనూ తెలుగుకోసం తపించేవాడినే కాని మీకు నేను బహుశః తెలియకపోవచ్చును. వీలుచూసుకొని మీ యీ వ్యాసంపైన ఒక సమీక్షను వ్రాయాలని అనుకుంటున్నాను. ఆసమీక్షను నా శ్యామలీయం బ్లాగులో ప్రకటిస్తాను. ఒకవాక్యంలో చెప్పాలంటే తెలుగుభాష దీనస్థితిలోనికి కూరుకొనిపోతూ ఉండటానికి కారణం తెలుగుప్రజల అనాసక్తి తప్ప మరొకటి ముఖ్యకారణం కాదు.పిల్లల మేలుకోరి అని చెప్పి ఇంట్లో కూడా ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే కుటుంబాలనూ చూస్తున్నాను నేను!

  -తాడిగడప శ్యామల రావు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.