సిరికోన సభలో వక్తలప్రసంగాలు. నా ప్రతిస్పందనలు.

 ఈ సభగురించిన టపాలు ఈటపాతో సమాప్తం.

సిరికోనసభలో వక్తలకు నేను వెంటనే నాస్పందన చెప్పలేకపోయేను. అంచేత విడియో మళ్ళీ చూసి నేను చెప్పిఉండవలసిన మాటలు ఇక్కడ అక్షరగతం చేస్తున్నాను. నేను వెంటనే మాటకి మాట చెప్పలేను. వారి ప్రసంగాలు ఇలా మరోసారి చూసి, అర్థం చేసుకుని జవాబు చెప్పడానికి నాకు ఇంత సమయం పట్టింది. వక్తలు మన్నిస్తారని ఆశిస్తున్నాను.

ఒకొకరి ప్రసంగంలో కొన్ని అంశాలు సూక్ష్మంగా ఉదహరించి, వాటికి నా ప్రతిస్పందన ఇచ్చేను కింద.

ప్రసంగాలలో అంశాలు వారిమాటలలోనూ, నాప్రతిస్పందన నామాటల్లోనూ ఇచ్చేను.

సిరికోన లక్ష్మీనారాయణగారు.

నేను తిరుపతిలో స్టూడెంటుగా ఉన్నప్పుడు ఒక మిత్రుడు వచ్చి మాలతిగారు మంచి కథ రాసేరు చూసేరా అని అడిగేరు. ఎవరు ఆ మాలతి అంటే లైబ్రరీలో ఉంటారు కదా అన్నారు. ఆమె తనపాటున తాను తలొంచుకుని నిశ్శబ్దంగా పోతూ ఉంటారు. నేను అప్పట్నుంచీ వారికథలను అభిమానిస్తూనే ఉన్నాను.

ఆమె జీవంతమైన సాహితీ సేవ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. Autopush అంటారు. She commands respect. తిరుపతి సాహిత్య వాతావరణం అటువంటిది. బయటికి కనిపించకుండా నిశ్శబ్దమైన ప్రయాణిస్తూనే ఉన్నారు. చాలామందికి ప్రేరణ ఇచ్చిన అరుదైన సాహిత్యమూర్తి.

చాలామంది ఒక దశ దాటినతరవాత ఆ దశమీదే జీవిద్దాం అనుకునేవాళ్లు అలానే సాగిస్తారు. జీవంతమైన అని ఒక పదం ఉంది. అలా జీవంతప్రయాణం సాగించేవాళ్లు ఈ అక్షరప్రపంచంలో చాలా అరుదు. మాలతిగారు అటువంటివారు.

(నా ప్రతిస్పందన) – లక్ష్మీనారాయణగారు నాలుగుమాటల్లో నాచేత యాభై ఏళ్లనాటి మధురలోకం మరొకసారి దర్శంపజేసేరు. నమస్సులు లక్ష్మీనారాయణగారూ. తిరుపతి నాకు చాలా ప్రత్యేకమైన ఊరు. నా85 ఏళ్లజీవితంలో ఆ 9 సంవత్సరాలూ నాకు చాలా ఆనందాన్నీ, తృప్తినీ కలిగించాయి. పోతే, మీ ఇలాటిపరిచయవాక్యాలు నాకు వినబడడం కూడా అరుదే. అంటే నారచనలద్వారా నేను గుర్తున్నానన్నవారు అరుదు. అప్పుడప్పుడు తలుచుకోవలసిన వాక్కులు మీవి. ధన్యవాదాలు.

సిరికోన, కోడూరు పార్వతి స్మారకపురస్కారం ఇవ్వడానికి నాపేరు ఎంపిక ఎలా జరిగిందో తెలుసుకోడం నాకు చాలా ఆనందం కలిగించింది.

సుప్రసిద్ధకవి, అప్పాజోస్యుల పురస్కార గ్రహీత డా. ప్రభాకరరెడ్డిగారు తమ ధర్మపత్ని కీ.శే. పార్వతిగారిపేరున ఈ పురస్కారం అందిస్తూ పద్యమాలతో మాలతిని అభినందించారు.

సాభినందన పద్యసత్కృతి అన్న శీర్షికతో శ్రీ కోడూరు ప్రభాకరరెడ్డిగారు రచించి చదివిన పద్యములు –

ఉత్తమ కథారచనల ఉదాత్త చరిత

భావలహరుల హృదయవిపంచి మీటి

మహిత కథలుగా రచియించి మానవతకు

నెమ్మి కూర్చెను మాలతి నిడదవోలు!

పాఠకానీకలోకమ్ము పరవశింప

స్నేహసౌహార్ద రచయిత్రి స్నిగ్ధమూర్తి!

పార్వతీపురస్కృతి గొంట పండువౌచు

మాకు ముదమును గూర్చును మాత!  నిజము!

— (నా ప్రతిస్పందన) ప్రభాకరరెడ్డిగారూ, మీ పద్యమాల అనుపమసత్కారం నాకు. మీవంటి సాహితీవేత్త ప్రజ్ఞాపాటవాలను నామమాత్రంగానైనా ఈవిధంగా తెలుసుకోవడం నాకు అసాధారణకానుక. హృదయపూర్వక వందనములు, ప్రభాకరరెడ్డిగారూ.

వేలూరి వెంకటేశ్వరరావుగారు

 మాలతిగారు మంచి తెలుగువాక్యం రాస్తారు. అలాగే అందంగా చదివించే ఇంగ్లీషువాక్యం కూడా రాస్తారు. మాలతిగారు ఇంగ్లీషులో వ్రాసిన Telugu Women Writers, 1950-1975 మంచి విమర్శనాత్మక రచన. దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు స్త్రీలు కథలు నవలలు రాసేరు. బయటికి చెప్పుకోలేదు కానీ మాకాలేజీరోజుల్లో మేం దొంగతనంగా అవి చదివేవాళ్లం. అయితే ఆ రచనలను విమర్శకులు ఎందుకు నిర్లక్ష్యం చేసేరు అని మాలతిగారు కొంచెం ఘాటుగానే ప్రశ్నించేరు.

1980లలో మాలతిగారు ఒక కథ రాసి నాకు పంపించేరు. ఆకథ నన్ను ప్రత్యేకంగా  ఆకట్టుకోడానికి కారణం అది సంభాషణలరూపంలో సాగించడం. డయాస్ఫొరా అంటే సరైన నిర్వచనం ఏర్ఫడకముందే, 80వ దశకంలోనే  మాలతిగారు ఈకథ రాసేరు. ఇది ఇంగ్లీషులోకి అనువాదమయిందో లేదో తెలీదు. ఏ నారాయణస్వామిగారో ఈకథ తీసుకుని మరి కొన్ని కథలతో సంకలనం వేస్తే బాగుంటుంది. ఇది డయాస్ఫొరాకథే. కాదని ఎవరైనా అంటే. వారితో వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

— (నా ప్రతిస్పందన). నిజానికీ ఫెమినిజానికీకథ అమెరికాకి కొత్తగా వచ్చినవారికి అనుకోకుండా ఎదురయే కల్చర్ షాక్, తన్మూలంగా సంసారంలో ఎదురయ్యే చిక్కులూ చిత్రించడానికి ప్రయత్నించేను. ఇప్పుడు ఆలోచిస్తే డయాస్ఫొరాకి అదే నిర్వచనం అనిపిస్తోంది. ఈకథ నేను Shortchanging Feminism అన్న శీర్షికతో అనువాదం చేసి నా సైటులో ప్రచురించేను. లింక్. https://wp.me/p3npcR-p1

సంకలనాలమాటకొస్తే, ఎ.కె. ప్రభాకర్ స్త్రీవాదకథలు అన్నపేరుతో ఒక సంకలనం వేసేరు. నన్నే కాదు ఏ రచయిత్రినీ అడక్కుండానే ఆపుస్తకం ప్రచురించేరని తరవాత తెలిసింది. ఫేస్బుక్కులో నా మిత్రులజాబితాలో ఉన్నప్పుడు నేను అడిగేను నన్నడక్కుండా ఎలా వేసుకున్నారని. నేనే వేసేను అన్నారే కానీ సరైన సమాధానం చెప్పలేదు. మరి ఈ వాదులధ్యేయం హక్కుల పరిరక్షణే అయితే రచయితలహక్కులు కూడా గణనలోకి తీసుకోవాలి కదా. తీసుకోరు సరి కదా అలా చేసినందుకు సిగ్గుపడరు కూ. ఇందుకే నేను ఈ స్త్రీవాదులని నిజాయితీ లేనివారంటాను. ఉపన్యాసాల, వ్యాసాల ఆర్భాటమే కానీ నిజంగా వ్యక్తిని వ్యక్తిగా గుర్తించే జ్ఞానం లేనివారు.

వెంకటేశ్వరరావుగారూ, మీవిపుల విశ్లేషణకి ధన్యవాదావలు. ముఖ్యంగా నా Women Writers, 1950-75, an analytical studyమీద మీరు వ్రాసిన సమీక్ష మంచి సమీక్ష. మళ్లీ అలాటి సమీక్ష కానీ పరిచయం గానీ మరొకటి రాలేదు ఆ పుస్తకంమీద. ధన్యవాదాలు వెంకటేశ్వరరావుగారూ.  అంబికా అనంత్ గారు కూడా ఒక చిన్న సమీక్ష రాసేరు.

ఈ పుస్తకం ఇంగ్లీషులో నేను ఇదివరకు చెప్పిన విషయాలు కాక, ఇప్పుడు మరొకటి తోస్తోంది. ఈరోజుల్లో తెలుగు చదవడం రాని, లేదా ఇంగ్లీషులో చదవడానికి ఇష్టపడే తెలుగువారు ఎక్కువయేరు కనక అని.

 సత్యవతిగారు

నిడదవోలు మాలతి రచనాసౌరభాలు పుస్తకాన్ని సుభద్రాదేవి చాలా శ్రద్ధగా చేసేరు. అన్నీ ఛాప్టర్సుగా విడగొట్టి, కథలుగా, నవలలుగా, ఎన్నెమ్మకతలుగా అధ్యాయాలుగా చాలా శ్రద్ధగా చేసేరు. మాలతిగారు ఎంత కృషి చేసేరో సాహిత్యంలో, ఈ పుస్తకం తేవడంలో సుభద్రాదేవిగారు అంత బాగాను అంత శ్రద్ధగాను చక్కగాను చేసేరు. పైగా పుస్తకం కూడా చాలా అందంగా తీసుకొచ్చేరు. చాలా పని చేసేరు ఒక రిసెర్చి స్టూడెంటులాగ.

మాలతిగారంటే నాకు చాలా అభిమానం. ఆవిడని ఒకవ్యక్తిగా నేను చాలా గౌరవిస్తాను. రైటరుగానూ గౌరవిస్తాను. వ్యక్తిగా ఇంకా ఎక్కువ గౌరవిస్తాను.

సుభద్ర శ్రీదేవిగారిమీద మోనోగ్రాఫ్ రాసేరు. కేంద్ర సాహిత్య ఎకాడమీ దాన్ని స్పాన్సర్ చేసేరు. ఒకరచయిత్రిగురించి మరొకరచయిత్రి రాయడం ఇటీవలికాలం చాలా తక్కువ. ఎవరికి వాళ్లే గొప్ప కదా.   

ఇలాగే మిగతారచయిత్రులగురించి కూడా రాయవలసిన అవుసరం ఉంది. ఎంతమంది రచయిత్రులు ఎంతబాగా రాసేరు అన్నది రాబోయే తరాలకి తెలియాలి.

–(నాప్రతిస్పందన). మొదట సత్యవతిగారికి.

సత్యవతిగారూ! మీరంటే నాక్కూడా ప్రత్యేకాభిమానం. మిమ్మల్ని స్త్రీవాదరచయిత్రి అంటారు కానీ నాఉద్దేశంలో మీరు సార్వజనిక రచయిత్రి. పోతే, ఒకొక రచయిత్రిగురించి విడిగా ఒక మోనోగ్రాఫ్ రావలసిన అవుసరం ఉన్నమాట నిజం. ఎంతసేపూ ఆ కుటుంబరావు, ఆ చలంమీదే కుప్పలుతిప్పలుగా రాయడం కాక, రచయిత్రులగురించి పుస్తకాలు రావలసిఉంది. అయితే రచయిత్రులే కాదు రచయితలు కూడా వ్రాయవచ్చు అని నేననుకుంటున్నాను. ఎవరు వ్రాసేరని కాదు ఎవరిగురించి వ్రాసేరు అన్నది ముఖ్యం. ప్రధానంగా చిత్తశుద్ధితో సమతుల్యంగా సమగ్రంగా పరిశీలించి వ్రాసేవారు కావాలి.  

శీలా సుభద్రాదేవి

2010లో కథానికకి వందేళ్లు అయింది అని చాలా సభలూ వ్యాసాలు వచ్చేయి. అయితే వాటిలో 50లనించి 80లవరకూ రాసిన రచయిత్రులగురించి ఏమీ రాలేదు. అది నాకు అసంతృప్తి కలిగింది. 50నించి 70లవరకూ రచయిత్రులయుగం అంటారు. పుంఖానుపుంఖాలుగా చాలామంది రచయిత్రులు రాస్తూ వచ్చేరు. వాళ్లెందుకు గుర్తింపబడలేదు? వాళ్లు మంచికథలు రాయలేదా? వంటింటి సాహిత్యమేనా వాళ్లది? అనే దీంతో నేను కొంత రిసెర్చి చేసేను. ముఖ్యంగా వందేళ్లకథకు వందనాలు అని గొల్లపూడి మారుతీరావుగారు టీవీలో 118మందిని ఇంటర్వ్యూ చేసేరు. అందులో 12మంది మాత్రమే రచయిత్రులు. దాంతో నాకు బాధ కలిగి, 22మంది పాతతరం రచయిత్రులని తీసుకుని వ్యాసాలు రాసేను. ఆసందర్భంలో నిడదవోలు మాలతిగారి కథలు కథానిలయంలో చూసేను. అక్కడ కొంచెమే ఉన్నాయి. తరవాత తెలుగు తూలికకి వెళ్లి చూస్తే అసంఖ్యాకంగా కథలు, రచనలు కనిపించేయి. కేవలం కథలు మాత్రమే తీసుకుని ఒకవ్యాసం రాసేను.

మాడభూషి రంగాచార్య స్మారకసంస్థ ఎవార్డు ప్రతి ఏటా కథకులకి ఇస్తారు. ఈ సంవత్సరం 80 ఏళ్లు దాటిన రచయిత్రులమీద 50 పేజీలకు తక్కువ కాకుండా వ్యాసాలు రాయించి పుస్తకాలుగా వేద్దాం అనుకున్నారు. ఆసందర్భంలో మాలతిగారి పేరు వచ్చింది. నేను వారిమీద రాస్తానన్నాను. 52పేజీలవ్యాసం రాసి వారికి ఇచ్చేను. ఎలాగా ఇంత శ్రమ పడ్డాను కదా. ఆవిడవి ఇంకా వ్యాసాలున్నాయి, అనువాదాలున్నాయి. ఆవిడ అవన్నీ తనబ్లాగులో పెట్టుకున్నారు. అంత అంతర్జాలంలో చదివేవాళ్లకి తెలుస్తాయి. కానీ పుస్తకాలుగా లేవు అని అంతకృషి చేసినప్పుడు పుస్తకాలుగా రాకపోతే ఎలాగ అని నేను చేసేను. tabletలో చదవడం నాకు కష్టం అయినా ఆ పుస్తకాలన్నీ tabletలోకి తీసుకుని చదివేను. చాలా కష్టపడ్డాను రిసెర్చి థీసిస్ కి లాగనే పి. శ్రీదేవిగారి మోనోగ్రాఫ్ లాగే అదే పద్ధతిలో రాసేను. ఈపుస్తకం జూన్ లో ఆవిడ బర్త్ డే సందర్బంగా గిఫ్టుగా ఇద్దాం అనుకున్నాం. ఏమైనా ఒక సందర్భంలో విడుదల చేయడం నాకు సంతోషంగా ఉంది.

— (నా ప్రతిస్పందన)

సుభద్రా! మీకృషి నేను ప్రత్యక్షంగా చూసేను. దాదాపు ఏణ్ణర్థం స్వీయరచనలూ, ఇతర వ్యాపకలమధ్య, ఇంత శ్రమపడి ఈపుస్తకం తీసుకొచ్చేరంటే అది మీ నిష్ఠకీ, శ్రద్ధకీ నిదర్శనం. నాలుగు వాక్యాలైనా సరిగా రాయడంలేదు చాలామంది ఇప్పుడు. అలాటిది మీరు 87 పేజీల పుస్తకం చేత్తో కాగితంమీద రాస్తూ పూర్తి చేసేరు. జోహార్లు. మీ ఆ కృషికి నారచనలు విషయం కావడం నాకు ఎనలేని గౌరవం. గర్వకారణం. సందర్భానుసారం సూచనలిచ్చి మీ ఈకృషిని ప్రోత్సాహించిన శీలా వీర్రాజుగారికి గౌరవపురస్సర నమస్కృతులు.

సరయు బ్లూ ప్రసంగం. నేను ప్రత్యేకంగా స్పందించేది ఏమీ లేదు.

నారాయణస్వామి

నాకు మాలతిగారి సాహిత్యంతో పరిచయం బ్లాగులద్వారా సుమారు 2008లో మొదలయింది, వారిగురించి చెప్పాలంటే 4 పార్శ్వాలుగా చెప్పుకోవాలి.

1. తెలుగులోనూ ఇంగ్లీషులోను రాసిన స్వతంత్రరచనలు

2. అనువాదాలు. చాలామంది తెలుగునించి ఇంగ్లీషులో రకరకాలుగా వారి వారి పంథాలో చేస్తూ వస్తున్నారు. మాలతిగారు చేసిన అనువాదాలలో ఒక నిర్దిష్టమైన లక్ష్యమూ, అలాగే అనువాదాలు చేయటంలో ఒక నిర్దిష్టమైన శైలీ – ఈ రెండూ ఏర్పరుచుకుని ఒక కార్యక్రమం ప్రణాళికగా పొంది అనువాదాలు చేసేరు. అంతే కాక నాలాటివారికి తన సూచనలు చెప్పి ఈలక్ష్యంతోటి అనువాదాలు కావాలని చెప్పి ప్రోత్సహించి అనువాదాలు చేయించేరు.

3. ఆమెలో ఉన్నటువంటి పరిశోధకురాలు, విమర్శకురాలు. సృజనాత్మకరచనలలో సమాజాన్ని గమనించి విషయాల్లోనించి ఆ రసం పిండి తనకథల్లో ఎలా కూర్చుతూ వచ్చేరో అదే విధంగా సాహిత్యంలో కూడా తాను గమనించినవి తన విమర్శలలో పరిచయవ్యాసాలలో రాస్తూ వచ్చేరు. సరయు చెప్పినట్టు మృదువుగానే చెప్తూ ఒక నిక్కచ్చితనం మాలతిగారి విమర్శలక్షణం.  Where she had to spell to all people out, she did without any hesitation. Whether it is people resorting to unjustfied loyalty to .. కాలం చెల్లిపోయిన భావాలు అంటారు అవీ, లేదా justification లేనటువంటివి …

4. ఎప్పటికప్పుడు update అవడం. ఫాంట్సులో మార్పులు, రెండు బ్లాగులోనూ ఫేస్బుక్కులోనూ టెక్నాలజీ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ ఎప్పటికప్పుడు update అవుతూ, తన సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచేరు. ఇవి ఈతరంవారికీ భావితరంవారికీ అధ్యయనానికి, పరిశోధనకీ ఉపయోగపడతాయి.

–(నాస్పందన). మీరు చెప్పినవి అంగీకరించడం తప్ప నేను వేరుగా చెప్పేదీ ఏమీ లేదు, ధన్యవాదాలు చెప్పుకోడం తప్ప. నేను పదే పదే చెప్తున్నట్టు, నాప్రపంచం చిన్నదిగా ఉంచుకున్నందువల్ల, update చేసుకోడంలాటివి నాకు సాధ్యపడుతున్నాయి.

నిక్కచ్చిగా చెప్పగలగడం కూడా అందుచేతే కావచ్చు. పదిమంది మధ్య తిరిగితే, ఎవరేమనుకుంటారో, పుట్టగతుల్లేకుండా పోతానేమో అన్నబాధ. ఏ సంబంధాలూ పెట్టుకోనప్పుడు నిక్కచ్చిగా సూటిగా చెప్పేసి, ఎవరేమనుకుంటే నాకేమి అని ఊరుకోవడం తేలిక కదా 🙂

కల్పన రెంటాల

మాలతిగారితో మాపరిచయం 30ఏళ్లక్రితంనించీ. ఇద్దరం కలిసి ఆడియోలు, విడియోలు చేసేం. ఇంటర్వ్యూలు చేసుకున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే

సాహిత్యం ఆవిడజీవితం, ఆవిడప్రాణం, సాహిత్యం ఆవిడఊపిరి.

డయాస్ఫొరాగురించి మాట్లాడినప్పుడు మాలతిగారిది అగ్రస్థానం అని నేననుకుంటాను.   

ఆమె రెండు నవలలు రాసేరు. ఈరెండు నవలలు రాస్తున్నప్పుడు మేం ఇద్దరం మాట్లాడుకున్నాం ఈనవలలగురించి. అంచేత ఈనవలల్లో నాకు పాలు ఉందనే అనుకుంటున్నాను. చాతకపక్షులు మొదటితరం అంతర్మథనాన్ని సృజించిన నవల. మొట్టమొదట డయాస్ఫొరా లిటరేచర్లో కంప్లీట్ గా women’s point of viewలో వచ్చిన నవల.

మార్పు 2014లో వచ్చింది. రాయడం అయిపోయేక పక్కన పెట్టేయకుండా, మళ్లీ 8ఏళ్లతరవాత చదివి చూసుకుని, సంస్కరించవలసిన అవుసరం ఉందని గుర్తించి చేసేరు. ఎందుకంటే మారిన పరిస్థితులనిబట్టి, ఆమెలో వచ్చినమార్పునిబట్టి సంస్కరించి మళ్లీ కొత్త పాఠాన్ని 2021లో ప్రచురించేరు.

ఈరెండు డయాస్ఫొరాలిటరేచరే అంటే మళ్లీ డయాస్ఫొరాలిటరేచరులో విమెన్స్ లిటరేచర్ అని ఆమెని ఓపక్కన పెట్టడంలేదు. మార్పునవల ప్రత్యేకత పాత్రలకి కాక అభిప్రాయాలకి ప్రాధాన్యత ఇవ్వడం. పాత్రలు కేవలం వాహికలు మాత్రమే. అదీ ఆవిడ శైలీవిన్యాసం.

డయాస్ఫొరా లిటరేచరు ఎవరూ పరిశీలించడం లేదు, అంతా పైపైనే ఉంది అంటారు. మాలతిగారి సమగ్రసాహిత్యం చదివితే ఆవిమర్శ తప్పు అని తెలుస్తుంది. ఆవిడసాహిత్యం పూర్తిగా చదివినప్పుడే డయాస్ఫొరాలిటరేచరులో ఆవిడస్థానం ఇది, ఆవిడ చేసిన కృషి ఇది అని తెలుస్తుంది.

మరొక సంతోషకరమైన విషయం చెప్పి ముగిస్తాను. సాహితీసృజనలో తనదైన ముద్ర వేసిన స్త్రీలకు వారిరచనలను క్షుణ్ణంగా చదివి ఆకళించుకున్న సాహిత్యాభిమానులతరఫునించి ఈ ఏడాదినించీ సత్కారం చేదామని మాకోరిక. ఆ పురస్కారానికి మాలతిగారిసాహిత్యం మా తొలిఎంపిక.   

ఎవరి జీవతాలలోనైనా ఎత్తుపల్లాలుంటాయి. ఒకొకరికి ఒకొకరకమైన సాయం దొరుకుతుంది. మాలతిగారిని తెలుగు సాహిత్యం నిలబెట్టింది. ఎందుకంటే ఆవిడ తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టేరు కనక.

— (నాప్రతిస్పందన), కల్పనా, మన సాహిత్య స్నేహం కనీసం నాజీవితంలో అసామాన్యం. నాకు చాలామంది రచయితలతో పరిచయం ఉన్నా ఎవరితోనూ ఇంత పటిష్టంగా స్నేహం సాగలేదు. బహుశా నీవ్యక్తిత్వంవల్లే మనస్నేహం కొనసాగుతోంది. ఎందుకంటే నాకు ఆగుణం లేదు. అందుకు ధన్యవాదాలు.

నీ సాహితీసదస్సులమాట వినగానే నేను తృళ్లిపడ్డాను. అలాటిచర్చలకోసమే నేను 30ఏళ్లగా ఎదురు చూస్తున్నాను. స్థూలంగా నాకథలమీద, నవలలమీద వ్యాసాలు వచ్చేయి కానీ ఒక కథో ఒక అంశమో తీసుకుని నిశితపరిశీలన చేస్తూ ఎవరూ ఏమీ రాయలేదు ఇంతవరకూ. నవ్వరాదు కథ మీద నీవిశ్లేషణ తప్పిస్తే.

సాహితీసృజనలో తమదైన స్త్రీలకు పురస్కారం ఇవ్వడానికి నిశ్చయించుకోవడం ముదావహం. అది నాతోనే ప్రారంభం కావడం మరింత ఆనందం. శుభమస్తు.

కానీ నాకు కావలసింది చర్చలే, అవే ఎక్కువ ఆనందాన్నిస్తాయని మరువవద్దు.

నువ్వే చెప్పినట్టు నాకు సాహిత్యం తప్పిస్తే వేరే జీవితంలేదు. సాహిత్యం, సరయు నారెండు కళ్లు, ఉచ్ఛ్వాసనిశ్వాసాలు. ధన్యవాదాలు.

 చాతకపక్షులు నేనే ఇంగ్లీషులోకి అనువాదం చేసి http://thulika.net లో ప్రచురిస్తున్నాను. తెలుగు వెర్షనులో తెలుగువారికి అమెరికన్ సంప్రదాయాలు వివరించడం ధ్యేయం అయితే, ఇంగ్లీషు వెర్షనులో తెలుగు సంప్రదాయాలు అమెరికనులకి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఆవిధంగా తెలుగు, ఇంగ్లీషు వెర్షనులమధ్య చెప్పుకోదగ్గ తేడా  ఉంది. మొదటిభాగానికి లింకు ఇక్కడ ఆతరవాత అక్కడే కొనసాగించుకోవచ్చు.

కొలిచాల సురేశ్ గారు.

నాకు కథలగురించి అట్టే తెలీదు. నిడుదవోలు వెంకటరావుగారిగురించి మాత్రమే పరిచయం. ఆయనని ప్రబంధ పరమేశ్వరుడు, జంగమ విజ్ఞానసర్వస్వం అంటారు.

“నీకు తెలీకపోతే నిడుదవోలువారిని అడుగు” అని సామెత. కథలగురించి ఇందాక వెంకటేశ్వరరావుగారు చెప్పేరు. నాకు తెలిసింది అంతే. ఆవిడ చాలా కృషి చేసిన మరో అంశం అనువాదాలు. నాకు బాగా ఆసక్తి ఉన్న అంశం. రెండు భాషలు నేర్చిన ప్రతివారూ అనువాదకులు కాలేరు. అనువాదం ప్రత్యేకమైన కళ. తెలుగుభాషకి అంతర్జాతీయంగా గుర్తింపు రావాలంటే అనువాదాల అవుసరం చాలా ఉంది. కేవలం తెలుగుకథలకే అంకితమైన సైటు. అంతేకాక అనువాదసమస్యలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవిడ Guidelines for translators రాసేరు. నాకు భాషాశాస్త్రం ఇష్టం కనక ఇది చూసేను. ఆవిడకి ఇంగ్లీషు linguistics కూడా ఇంత బాగా తెలుసు అన్నది నాకు తెలిసింది.

శారద బోయినపల్లి

ఆమె రచనాప్రక్రియ వైవిధ్యం, కథలు, వ్యాసరచన, అనువాదాలు, ఎన్నెమ్మకతలు ఇన్ని ప్రక్రియలలో దశాబ్దాలుగా సాహిత్యం సృష్టించడం మాటలు కాదు. భాషాభిమానమూ, క్రమశిక్షణ, ప్రజ్ఞాపాటవాలతోపాటు జీవితంమీద చుట్టూ ఉండే అనుక్షణపరివర్తన చెందుతున్న మానవసమూహంమీద సహజమైన అనురాగం ఉన్నవారికి, జీవితాన్ని దగ్గర్నుంచి చూడగల సునిశిత పరిశీలన, అనుభవించగల భావుకత ఉంటేగానీ సాధ్యం కాదు. సాంకేతికవిప్లవంతో సాగుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ వాడుకుంటూ అందర్నీ తనతోపాటు తీసుకెళ్తూ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న మాలతిగారికి ఈ విశిష్టపురస్కారం రావడం నాకెటువంటి ఆశ్చర్యం కలిగించలేదు.

2. కథాంశాలు – చాలా సున్నితంగా మామూలు బ్రతుకులగురించి మాలతిగారు కథలలో మనలాటి మామూలుమనుషులగురించి లోతైన వ్యాఖ్యానాలు చేస్తారు. చాలాకాలం క్రితం ఒక ఉత్తరంలో మీరు Chekhov లా  రాస్తారు అన్నాను. మామూలు కుటుంబాల్లో ఉండే ఇబ్బందులు, కాలానుగుణంగా వచ్చే మార్పులు విలువలు వారి కథల్లో బాగా కనిపిస్తాయి. అవి స్త్రీలపరంగా ఉండడంవల్ల నామనసుకు బాగా పట్టేయి. ఎవరో కవి చెప్పినట్టు ఇంట్లోకి పురుగు రావడమూ, ఉద్యోగం పోవడమూ, మంచు కురువడమూ, రోజూ వాకింగులో మనుషులతో జరిగే సంభాషణలు, అన్నీ కథావస్తువులే, చూసేమనసూ రాసే చెయ్యి ఉండాలే గానీ.

తనబ్లాగులో ఊసుపోకలలో కూడా లోతైన విషయం ఉందని అందరు అనుకునేదే. హాస్యం, మెత్తని చెప్పుతో కొట్టినట్టుండే వ్యంగ్యమూ ఈఎన్నెమ్మకతలు.

నవలలు మరో ఎత్తు. మార్పుకథలో మార్పులు నాజీవితానికి చాలా దగ్గరగా ఉండడంతో నేను చాలా ప్రభావితమయేను.

సంద్రాలగురించి మొదట మాలతిగారి alter ego కాబోలు అనుకున్నాను. కాలక్రమేణా సంద్రాలు నాకు alter ego అయింది. నాకు ఆ యాస కష్టమే అయినా ఆభాషా యాసా వెటకారమూ – వీటికి అభిమానిని అయిపోయేను.

తూలికకోసం అనువాదాలు చేస్తూ నేను ఎన్నో నేర్చుకున్నాను. నాకథల సంకలనం నీలాంబరం పుస్తకానికి ఆవిడ ముందుమాట రాయడం నాభాగ్యం. మాలతిగారికి అభినందనలు.

–(నా ప్రతిస్పందన)

మొదట, సురేశ్ గారూ,

అనువాదకులకు నేను ఇచ్చిన సూచనలు మీకు నచ్చినందుకు సంతోషం. మీరు ఒక భాషాశాస్త్రవేత్తగా ఆ పోస్టు చదివి స్పందించడంవల్ల దానికి ప్రమాణత్వం వచ్చింది అన్నమాటే కదా. ధన్యవాదాలు.

శారదగారితో పరిచయం అమూల్యమైనది. నా వెబ్ సైటు speciality storeలాటిది. కేవలం తెలుగుకథలకే, అందులో మన సంస్కృతిని ప్రత్యేకంగా వివరించే గుణం గల కథలకే పరిమితం అనడంచేత. అందుచేత నాకు అట్టే అనువాదాలు రావు. మీఅనువాదాలు చాలా సాయం చేసేయి. మీకృషి గణనీయం. ధన్యవాదాలు.  

ఘంటసాల నిర్మల గారు.

దశాబ్దాలుగా ఆమెని అభిమానిస్తున్నాను. కథలు నవలలతో పాఠకులని లోతైన ఆలోచనలవేపు నడిపిస్తారు. తూలికని నిరంతరం నడిపించడానికి కారణం ఆమె అభిమానం. అనువాదం అన్న కళని ఎంత సర్వసమగ్రంగా నిర్వహించవచ్చో అడుగడునా నిరంతరం తెలియజేస్తున్నారు. వారి Guidelines for translators ఔత్సాహికులకీ ఆరితేరిన అనువాదకులకీ గొప్ప వేదం. అన్ని కోణాలనుంచి అన్ని పార్ట్సును తీసుకుని చెప్పడం అనేది అబ్బురపరుస్తుంది. నాకు ఏ సందేహం వచ్చినా ముందు అదే చూసుకుంటాను. Original author is the author of the translation, not the translator -ఒక్కవాక్యంలో అనువాదకళగురించి గొప్పగా నిర్వచించేరు.

వ్యక్తిగతంగా  తాను వేరే. పదిమంది నడిచేదారి తలవంచి నడవడం ఆవిడకి ఎప్పుడూ నచ్చదు. తల ఎత్తుకుని తనదారి తానే నిర్మించుకుని సాహిత్యకృషిగా కానీ అనువాదకళలో గానీ తూలిక నిర్వహించడంలో గానీ అ ఆలనుంచి తానే నేర్చుకుని కొనసాగిస్తారు.

ఒక వ్యాపకం ఎంచుకుని తాను మమేకమై, పాఠకులని మమేకం చేయడం ఆమె చేసేరు. వీటన్నిటికీ మూలకారణం మాలతిగారి ఆత్మధృతి. తన will power, confidenceతో తను సృష్టించిన మైలురాళ్లని తానే అధిగమించారు. అది వ్యాసాలలో తొణికిసలాడుతూ ఉంటుంది.

–(నా ప్రతిస్పందన) నిర్మలగారూ, మీరు ఇంత జాగ్రత్తగా సూక్ష్మపరిశీలనతో నారచనలు చదువుతున్నారంటే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మీరు guidelines for translators చూసేరంటే నాధ్యేయం చక్కగా అర్థం చేసుకున్నవారని తెలుస్తోంది. ఆపరిధిలో మీరు అనువాదాలు చేస్తే నాకు పంపండి. చూస్తాను. ధన్యవాదాలు

కల్యాణి నీలారంభంగారు

పాఠకురాలిగా స్పందిస్తాను. కాలేజీలో చదువుకుంటున్నరోజులనించి, ఆమె తిరుపతిలో పని చేస్తున్నరోజులనించీ ఆమెకథలు చదువుతున్నాను. కథ చెప్పడం అన్నది ఒక కళ. కానీ కథలోకి కథకుడు చొరపడిపోరాదు. కథలో అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలులాగ కనిపించకూడదు. నాకు నచ్చేవిషయం.

ఆమెపాత్రలు గొప్పవి, చిన్నవి, ఎక్కువగా ప్రభావం కలిగినవి అంటూ ఉండవు.

పాత్రలను వాటివాటి స్థానంలో ఆమె మలిచిపెడతారు. ఆ కారణానికి ఆమె బయట నిలబడి పాత్రలలోకి తొంగి చూసి రాస్తున్నట్టు అనిపిస్తుంది. మార్గదర్శిగా తీసుకోవలసినరచయిత్రిగా నేను ఆమెని అభిమానిస్తాను.

ఆమె ఏవాదినీ కానని ఎప్పుడూ చెప్తారు. స్త్రీవాదిని కాను, మరోవాదిని కాను, నాకు ఏవిధమైన రాజకీయలసంగతి లేదు. కానీ ఆమె వ్యక్తివాది. ప్రతివ్యక్తికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, దాన్ని మనం గౌరవించాలి అనుకుని, ఆవిధంగా జీవిస్తున్న, కథల్లో రాస్తున్నటువంటి రచయిత్రి ఆమె.

ఆమె జేబుకథ ఎప్పటికీ మరిచిపోలేం. సమానత్వxని గురించిన పోరాటమే అది. నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథలో కూడా అలాటి పోరాటమే. అది ఉత్తమపురుషలో చెప్పనివ్వండి. కథగా గానీ నిర్వహించనివ్వండి. ఆమెకి కనిపించినది మాత్రం ఆ పాత్రలు మాత్రమే. అది ఆమె achievement అని నేను అనుకుంటున్నాను.

— (నా ప్రతిస్పందన) కల్యాణిగారూ, మీపరిచయం మీరే అన్నట్టు చాలాకాలంనాటిది. 1968లో కె. రామలక్ష్మిగారు సంకలించిన ఆంధ్రరచయిత్రుల సమాచారసూచికలో అప్పుడే మీపేరు, వివరాలు చూసేను. మళ్లీ ఫేస్బుక్ ద్వారా కనిపించడం చాలా సంతోషం.

కథలోకి రచయిత చొరపడిపోకూడదు మంచి సూత్రం. కథ రాస్తున్నఉత్సాహంలో చాలామంది రచయితలు మరిచిపోయే అంశం. తనకి తెలిసిందంతా చెప్పేయాలన్న కోరికని కళ్లేలు వేసి పట్టుకోగలగడం కళే. మీ ఈచిన్ని ప్రసంగంలోనే మీ నిశిత పరిశీలనాదృష్టి తెల్లమయింది. ధన్యవాదాలు.

మెట్టుపల్లి జయదేవ్ గారు.

చికాగో సాహితీమిత్రులు తెలుగుసాహిత్యం అంటే అభిమానం ఉన్నవాళ్లం చిన్న క్లబ్ అనుకోండి ఉంది. చిన్నసంస్థని మాలతిగారు ప్రోత్సహించేరు. 2006లో మేం ఆహ్వానిస్తే వచ్చేరు. భానుమతిగారు చనిపోయినప్పుడు ఆసదస్సుకి వచ్చి భానుమతిగురించి మాట్లాడేరు. తూలిక రెగ్యులర్ గా చూసేవాణ్ణి. మబ్బుల్లో దాగిన వెన్నెలను తిరిగి తెచ్చినందుకు సిలికోనవారికి ప్రత్యేక అభినందనలు.

నిజాయితీనీ ప్రేమిస్తారు. కథల్లో నిజాయితీ ఉంటుంది. వ్యక్తిగా వారు నిజాయితీపరులనే గౌరవిస్తారు. నిజాయితీగా ఉండేవాళ్లనే దగ్గరకి రానిస్తారు. అలాటి వ్యక్తికి ఈ ఎవార్డు ఇవ్వడం సంతోషం.

చిన్నవిషయాన్ని కూడా మొహమాటంలేకుండా విమర్శిస్తారు. నాకు బాగా తెలుసు. ముఖ్యంగా ఇంగ్లీషు మాటల్లో ఉండకూడదు తెలుగే ఉండాలి అన్నరూలు ఖచ్చితంగా పాటిస్తారు.

అనువాదసమస్యలు అంటే రా.రా. యే గుర్తు వస్తారు. తరవాత 30, 40 ఏళ్లతరవాత కొత్తగా వచ్చే సమస్యలకు మంచి సూచనలు ఇచ్చేరు. కొండవీటి చేంతాడు అన్న పదానికి ఆమె ఇచ్చిన సూచన బాగుంది. సాహిత్యసంఘాలుసాహిత్యంకోసమే ఉన్నాయని నేను అనుకోను,  నేను సాహిత్యసంఘాలు అనుకోను. అవి పిలవకపోవడంవల్ల కానీ సన్మానం చేయకపోవడంవల్లగానీ మాలతిగారికి వచ్చిన అపఖ్యాతి ఏమీ లేదు. తగ్గిపోయిన కీర్తి కూడా ఏమీ లేదు. మొహమాటం లేకుండా విమర్శిస్తారని అనడానికి ఒక చిన్న ఉదాహరణ. మాఊరంటే ఎందుకిష్టం అని ఒక చిన్నవ్యాసం రాసి, చివరలో – మాఊరువారు కనపడితే ఇప్పటికీ గుర్తు పడతాను, అది మంచి ఫీలింగ్ ఇస్తుంది – అన్నాను. ఆ ఫీలింగ్ అన్నపదం పాలల్లో ఉప్పుకల్లులా ఉంది అన్నారు. అది ఇప్పటికీ మరిచిపోను.

— (నా ప్రతిస్పందన)

జయదేవ్ గారూ, చాలాకాలంతరవాత, మళ్లీ మీరు ఇలా కనిపించడమే కాక, నేను మీమీటింగులకి వచ్చినసంగతి మళ్లీ ఇలా తలుచుకోడం బాగుంది. నేను తెలుగు పదాలవిషయం ఫేస్బుక్కులో చేరేక ఇంత పట్టుదలగా ఉన్నాను అనుకున్నాను కానీ చాలాకాలంగానే ఇది చేస్తున్నానని అనుకోలేదు ఇప్పుడు మీరు చెప్పేదాకా.

చివరలో మీరు మరొక సూచన చేసేరు. సిరికోన గ్రూపులో అప్పుడప్పుడు ఏదో ఒక అంశంమీద చర్చలు చేదాం అని. అది నాకు ఇష్టమే. మీరే ప్లాను చేసి నాకు చెప్పండి వీలయినప్పుడు. ధన్యవాదాలు.

కొమరవోలు సరోజగారు నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథలో తనకి నచ్చిన వాక్యాలు చదివేరు.

–(నా ప్రతిస్పందన). కథలో వాక్యాలు ఉన్నదున్నట్టు చదివేరు కనక నేను వేరే స్పందించడానికేమీ లేదు. కానీ, అది ఆధారంగా, ఒక విషయం ప్రస్తావిస్తాను.

సాధారణంగా ఏ కథకైనా ఒకొకరు ఒకొకలా స్పందిస్తారు. కొంతవరకూ, వారి అనుభవాలు, పరిస్థితులు, పరిసరాలు, చదివినపుస్తకాల్లోంచి తీసుకొన్న భావజాలం- వీటిప్రభావం వారి అవగాహనమీద ఆధారపడిఉంటుంది. పాఠకులను మూడు వర్గాలుగా విభజిస్తూ, నేను రచయితకూ పాఠకులకూ మధ్యగల అవినాభావసంబంధం అని ఒక సుదీర్ఘవ్యాసం రాసేను. అందులో ఈవిషయం చర్చించేను.

ఇప్పుడు ఈసభలో  మరొకవిషయం స్ఫురించింది. మొదట్లో లక్ష్మీనారాయణగారు రచయితలు ఒకొకప్పుడు ఒకదశ చేరుకున్నతరవాత అక్కడే ఆగిపోతారు అన్నారు. అది పాఠకులకి కూడా వర్తిస్తుంది అని నాకు అనిపిస్తోంది.

అంటే, ఒకకథ చదివి, ఈకథ బాగుంది, ఈరచయిత ఇతరకథలు చదువుదాం అని ముందుకు పోకుండా ఆకథదగ్గరే ఆగిపోతారు అని.

నేను నిజానికీ ఫెమినిజానికీ రాసి 45 ఏళ్లయింది. సరోజగారు ఆ ఒక్కకథలో వాక్యాలనే చదివేరు. ఇంకా కొన్ని కథలు చదివి, ఆకథల్లో వాక్యాలు కూడా ఇలాగే తమని ఆకట్టుకున్నాయి అంటే రచయితగురించి ఒక అవగాహన ఏర్పడినట్టు. అప్పుడే రచయితని అభిమానిస్తున్నాననో లేదనో చెప్పడం జరగగలదు. అలా కాకపోతే, అది కేవలం కథని అభిమానించడమే. రచయిత పులుసులో ముక్క.

రాజేశ్వరి దివాకర్లగారు

సుభద్ర ఎంతో పరిశోధించి వారిగురించి రాయడం చాలా ఆనందమూ, ఒక భావావేశమూ కలిగించింది. ఒక స్త్రీమూర్తిగురించి రాయాలంటే వారిలో ఎంత ఉన్నతమైన ఆదర్శవంతైన వ్యక్తిత్వం ఉండాలి. ఇద్దరికీ అభినందనలు.

–(నా ప్రతిస్పందన) ధన్యవాదాలు రాజేశ్వరిగారూ.

శీలా సుభద్రాదేవి.

చాలాకథలు ఉత్తమపురుషలో రాసేరు. ఆవిడ రచనలన్నిటిలోనూ కూడా కొన్నిపాత్రలు పదే పదే వస్తుంటాయి.  50ఏళ్ల క్రితం ఆంధ్రదేశం వదిలి వెళ్లిపోయారు. ఆవిడ రచనల్లో సజీవంగా ఉండేపాత్రలు ఒక పాత్ర ఉంది సంద్రాలు. ఆపాత్రని చాలా కథల్లో ఉపయోగిస్తారు. ఉత్తరాంధ్రమాండలీకంలో మాట్లాడుతూ ఉంటుంది. ఉత్తమపురుషలో చెప్పలేని వాక్యాలు ఆ అమ్మాయి స్పష్టంగా చెప్తుంది. తాను చెప్పదలుచుకున్న నిజాలని కుండ బద్దలు కొట్టినట్టు

ఆత్మ పరమాత్మ అన్నట్టుగా ఈవిడ ఒక పాత్ర ఉంటుంది. సంద్రాలు ఇంకొకపాత్ర ఉంటుంది. సంద్రాలు విశాఖ సముద్రం అని నేననుకుంటున్నాను. సముద్రం సంపెంగలు ఆవిడకి చాలా ఇష్టం అని నేను అనుకుంటున్నాను. అందుకనే టైటిలుమీద కూడా. మాఅమ్మాయే డిజైన్ చేసింది.

సముద్రపు హోరు కూడా వినిపిస్తుంది.

సంద్రాలు నాకిష్టమైన పాత్ర. అన్నేళ్లయిపోయినతరవాత ఉత్తరాంధ్ర మాండలీకాన్ని ఎంత ప్రేమిస్తారో, ఆవిడ సముద్రాన్నెంత ప్రేమిస్తారో, సంపెంగలనెంత ప్రేమిస్తారో, ఆవిడ రచనలు చదువుతున్నంతసేపూ నాకు తెలుసు. ఒకవేపు అమెరికాజీవితాన్నీ చెప్తారు, అందువల్లే నేను రాయాలనుకున్నానేమో అనుకుంటాను.

–(నా ప్రతిస్పందన) ఈ సంద్రాలు చాలామందికి నచ్చేసింది, నాకంటే సంద్రాలునే ఎక్కువ ప్రేమిస్తున్నారని కూడా అనిపిస్తోంది (చిన్న చిరునవ్వుతో). మీరన్నట్టు నేను ఉత్తమపురుషలో చెప్పలేనివి సంద్రాలుచేత చెప్పిస్తున్నమాట నిజామే కావచ్చు. కానీ నేను ప్రయత్నపూర్వకంగా చేసిన పని – ఒక క్రమపద్ధతిలో చదువుకున్న చదువులు మేధని ఒక చట్రంలో బిగించేస్తాయి. పామరులు అలాటి నిబంధనలకీ, కుహనా నాగరీకానికీ అతీతంగా ఉంటారని నాఅభిప్రాయం. అందుకే నేను ఈ “చదువుకోని”పాత్రలు, ఒక్క సంద్రాలే కాదు, చిరుచక్రంలో వెంకన్న, సింహాచలం, విషప్పురుగులో రోశయ్య వీళ్లందరూ మనసులో మాట ఉన్నదున్నట్టు చెప్పేసేవారే. నిజానికి ఇది నేను మనసా వాచా నమ్ముతాను. పాఠకులకి అదే చెప్తాను. ధన్యవాదాలు.

లక్ష్మి రాయవరపు, గోవర్ధన్(తిరుపతి) నారచనలయందు తమ అభిమానాన్ని వ్యక్తపరిచేరు. అలాగే ఏమీ చెప్పకపోయినా, సభలో కనిపించినవారు కూడా చాలామంది ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు.

—-

నిడదవోలు మాలతి.

సెప్టెంబరు 14, 2022,

—-

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.