నే రాసిందీ మీరు చూసిందీ ఒకటేనా, ఒకటే కావాలా?

అమెరికన్ రచయిత్రి, Flannery O’Connor, I write to learn what I know అన్నారు. అంటే తనకి తనే తనకు గల జ్ఞానాన్ని పరీక్షకి పెట్టుకుంటున్నారనుకుంటాను. 

నా డాలరుకో గుప్పెడు రూకలుమీద రాధికగారి వ్యాఖ్య చూసినతరవాత నాకూ అలాటి జిజ్ఞాసే కలిగింది.  రాధికగారి వ్యాఖ్య ఎత్తి చూపిన కోణం నాకు తట్టలేదు నేను ఆకథ రాసినప్పుడు పిల్లల మనస్తత్త్వం ఆవిష్కరించాలనుకోలేదు. కొంతకాలం మనం పుట్టినవూరికి దూరం అయింతరవాత మనదృక్కోణాలలోనే మార్పు వస్తుందని, మనమే మనవాళ్లని నమ్మలేకపోతున్నాం అనీను.  (మీరెవరితాలూకు కథలో సర్దార్జీ ఉదంతం కూడా ఇలాటిదే. నిజంగా జరిగింది కూడాను!)

పై వ్యాఖ్యానం చదివినప్పుడు నాకు మరో విషయం గుర్తొచ్చింది. నేను నాలుగేళ్లకిందట ఒక ప్రముఖ రచయిత్రిగారి కథ అనువాదం చేస్తే, నేను ఆకథని సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు ఆమె. మనం అనుకున్నది ఒకటీ అయిందొకటీ అయినప్పుడు అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందన్న సామెత వాడతాం. కాని ఎల్లవేళలా కోతి కాదేమో, మరో మంచి అయ్యవారే తయారవుతారేమో.🙂

మీరు రచయితలు. మీరేమంటారు మరి?

మీరెవరితాలూకు!

మీరెవరితాలూకు!

“ఆవిడెవరూ? ఒక్కరే వచ్చినట్టున్నారు. ఎక్కడా చూసినట్టు లేదు?” అన్నారొకావిడ వెనకవరసలో కాస్త ఎడంగా కూర్చున్నావిడనుద్దేశించి.
పది కళ్లు అటు తిరిగేయి పొద్దుతిరుగుడుపువ్వుల్లా.
“ఆవిడా? కౌశికిగారు. మీకు తెలీదూ? అదే మన పిచ్చికుంట్ల గారు సుబ్బరామయ్యలేరూ. ఆయనభార్య. నాకూ తెలీదు అంబరీషుగారు చెప్పేవరకూ” అంది అంబరీషుగారి భార్య.

అమెరికాలో అదొక మహానగరం. స్థలం ఒక ఆలయప్రాంగణం. అక్కడ చేరినజనం తెలుగుజాతీయులు.
సందర్భం సంక్రాంతి సంబరాలు.
హాలంతా కోలాహలంగా వుంది – పట్టుచీరెల రెపరెపల్తో, పంజాబీ కుర్తాల్తో, షెర్వాణీలతో, పువ్వులపరికిణీల్లో జీన్లకలవాటుపడ్డ కాళ్లమూలాన కలిగిన తొట్రుపాటుతో, అదిచూసి తలలు నెరిసిన తల్లులనవ్వుల్తో అచ్చంగా మన వూళ్లలోలాగే.
ఆడవారంతా ఓపక్కనా, మగవారు మరోపక్కనా చేరి మంతనాలాడుకుంటున్నారు, ఇంగ్లీషూ, తెలుగూ, హిందీ కలగాపులగంగా, ఉగాదిపచ్చడికి దీటు రాగల నుడికారంతో.
పిల్లలు చిన్నచిన్నగుంపులుగా తమతమ తరగతుల్నిబట్టీ, సరదాల్నిబట్టీ జట్లు జట్లుగా విడిపోయి గలగల తిరిగేస్తున్నారు హుషారుగా.

మగవాళ్లలో మధ్యవయస్కులు పిల్లల కాలేజీచదువులగురించీ, వాటికయే ఖర్చులగురించీ వాదించుకుంటున్నారు. ఆస్థాయి దాటినవారు తాము పెంచి పెద్ద చేసిన పిల్లలు ముందు ముందు తమని ఆదుకుంటారా, …కోరా, …కోకపోతే తమరేం చేయాలి వంటి సాధకబాధకాలు చర్చించుకుంటున్నారు.
మధ్యలో మగవారు తమతాలూకూ ఆడవారిని తాళాలేవీ, పిల్లలేరీ, నీకిచ్చినకాయితాలేవీ లాటివి అడగడానికొచ్చి, ఆపక్కనా ఈపక్కనా వున్నవారు ఎవరో, ఎవరు ఎవరికేమవుతారో తెలుసుకుని
తృప్తిగా వెనక్కి మళ్లుతున్నారు. …
ఆ ప్రజాసమూహం మధ్య, ధ్వజస్థంభంలా కాకపోతే తామరాకుమీద నీటిబొట్టులా అందరిలో కలిసిపోతూ, విడిపోతూ, అందరికీ అయినదానిలాగానూ, ఎవరికీ కానిదానిలాగానూ సీదాగా తిరుగుతున్నారు పంకజంగారు.
సభ మొదలయింది. వేదికమీదికి దీక్షితులుగారు విజయం చేశారు.
“మామూలుగా ఇలాటివేడుకల్లో ఉపన్యాసాలుండవు కాని కార్యదర్శి పెద్దిరాజుగారు సంక్రాంతి విశేషం ఏమిటో నాలుగు ముక్కల్లో చెప్పమన్నారు. అంచేత రంగమ్మీదికొచ్చేను. మీలో చాలామందికి నన్ను సుబ్బలక్ష్మిగారి హబ్బీగానే తెలుసు. మాతల్లితండ్రులు బారసాలనాడు నాకు చేసిన నామకరణం అభిరామదీక్షితులు. …”

మూడోవరసలోంచి ఎవరో విశ్వాదాభిరామ వినురవేమా అంటూ దీర్ఘం తీసారు. దీక్షితులు అటుతిరిగి, “లేదు నాయనా, ఆ అభిరాముణ్ణి కాను. కనీసం దాయాదులం కూడా కాం.” అన్నారు. ప్రేక్షకులు నిశ్శబ్దంగా నవ్వేరు. దీక్షితులుగారు సంక్రాంతి పదానికి అర్థం, విశేషాలు గబగబ నాలుగంటే నాలుగు ముక్కల్లో చెప్పి పరువు దక్కించుకున్నారు.
తరవాత నలుగురు పిల్లలు స్టేజిమీదికొచ్చి మాతెలుగుతల్లికి మల్లెపూదండ పాడేరు. తరవాత వరసగా పిల్లలు స్టేజీ ఎక్కడం, దిగడంతో ఓఅరగంట గడిచింది. స్టేజిమీద పాడుతున్నమరియు ఆడుతున్న పిల్లలు ఎవరు ఎవరితాలూకో స్టేజిముందు తిరగాడుతున్న కెమేరాలనిబట్టీ, స్టేజికీ కాస్త ఎడంగా నిలబడి దిలాసా కబుర్లాడుకుంటున్నవారినిబట్టీ విశదం అవుతోంది. కాస్త చురుకుపాలు ఎక్కువైనవాళ్లు పందేలు కాస్తున్నారు ఎవరెవరితాలూకు అయివుండొచ్చో, అలా అనుకోడానికి కారణాలేమిటో వివరిస్తూ.
మూడోవరసలో వున్న సుందరిగారు, “అదుగో ఆచివరనున్న పాప మాపెదనాయన మూడోకూతురు మనమరాలు,” అంది పక్కననున్నావిణ్ణి మోచేత్తో పొడిచి.
ఆపక్కనున్నావిడ ఉలిక్కిపడి, సర్దుకుని, “ఇటు చూడండి, వీరయ్యగారివెనకాలున్న ఉంగరాలజుత్తు కుర్రాడే నేను మీకు ఇందాకా చెప్పింది. మాపొరుగూరు చంద్రయ్యగారి బామ్మర్ది. మీ చెల్లెలికొడుక్కి ఈడూ జోడూను” అంది మరోచివరున్న చిన్నవాణ్ణి వేలెత్తి చూపుతూ.
అలా చూపబడిన చిన్నవాడు వాళ్లవరస గమనించి పక్కకి తప్పుకున్నాడు అప్రసన్నంగా.
“నేను అభిరామ్‌గారి వైఫుని” అంది సుందరిగారికి అటుపక్కనున్నావిడ కణ్వశ్రీగారి కోడలు.
సుందరిగారు అటుతిరిగి నవ్వింది. “బాగుంది. ఆయనేమో సుబ్బలక్ష్మిగారు హబ్బినన్నారు. మీరేమో అభిరామ్‌గారి వైఫునంటున్నారు.”
“వల్లిగారెక్కడా కనిపించలేదు. ఆమె రాలేదేమి?” అని అడిగారు మరెవరో.
“సరేలెండి. మీకు తెలీదేమో. చక్రిగారు లేకుండా ఆవిడ రారు. ఆయనేమో ఇండియా వెళ్లారు.”.
“మీవారేరీ?” వెనకవరసలో వున్న వినతిగారు ముందుకి వంగి కౌశికిభుజం తట్టి ప్రశ్నించారు.
కౌశికి ఇబ్బందిగా కదిలి, “మీకు తెలీదేమో, మేం విడిపోయి చాలాకాలం అయిందండీ,” అంది.
“అయితేనేం. యూకెన్ ఆల్వేస్ బి ఫ్రెండ్స్, మాఅమ్మాయి ఆల్సో డైవోర్సుడే. ఇప్పటికీ చిలకా గోరింకల్లా కలిసి తిరుగుతారు,” అంది వినతిగారు స్థానికులనుండి ఎరువుతెచ్చుకున్న పొడివాక్కులు వల్లెవేస్తూ. ఎవరిబాధలు వారివి. అందరికీ ఒక్కలా జరగదు అన్నమాట ఆవిడకి చెప్పినా అర్థం కాదు.
స్టేజిమీద అమ్మాయి “చేయెత్తి జేకొట్టు, తెలుగోడా, గతమెంతొ ఘనకీర్తి గలవోడా …” అంటూ అందుకుంది.
కౌశికి పాట వినసాగింది ప్రయత్నంమీద. తాను చిన్నప్పుడు ఆపాట నేర్చుకోడానికి ఎంత తంటాలు పడిందో గుర్తు చేసుకుంటూ. ఆపాటే ఇప్పుడు మనసుని తాకడంలేదు ఎంచేతో మరి. నోరు వెగటుగా వుంది. వినతిగారి వాక్యాలు ఎదలో ముల్లై కెలుకుతున్నాయి. ఆయనే వుంటే మంగలెందుకు అన్న సామెత గుర్తుకొచ్చింది. కౌశికి మొహం కళ తప్పడం పంకజంగారు గమనించి చిన్ననిట్టూర్పు విడిచారు. చెప్పుకు తిరగడానికి నాగరీకదేశంలో వాసం. మాటసొంపు చూస్తే ఇక్ష్వాకులనాటి జాతీయాలు!
ఇంతలో రమాన్‌గారు వచ్చి, “కాఫీ కావాలా?” అని అడిగారు పంకజంగారిని.
“ఎక్కడుంది, నేను తెచ్చుకుంటానులెండి” అని రమణగారికి సమాధానం చెప్పి ఇటుతిరిగి చూస్తే కౌశికి లేదు.
పంకజం లేచి, వరండాలో కాఫీ తీసుకుని, రెండుపంచదార ముక్కలు తీసుకుని, చుట్టూ కలయచూసింది. దూరంగా ఓ స్థంభాన్నానుకుని నిలబడి సూర్యాస్తమయం తిలకిస్తున్నకౌశికి కనిపించింది. దగ్గరికి వెళ్దామా, వద్దా అని తను సందిగ్ధంలో పడి కొట్టుకుండగానే ఆఅమ్మాయే ఇటు తిరిగి చూసి చిన్నగా నవ్వింది. అదే పచ్చజండాగా గుర్తించి, పంకజం అటు నడిచింది.
“ఏం బయటికొచ్చేశారు, ఆపాటలూ, ఆటలూ చూసేలా లేవనా?” అంది నవ్వుతూ.
“అదేం లేదండీ. పిల్లలు, ఏంచేసినా ముద్దుగానే వుంటుంది. అందులోనూ మనదేశానికి ఇంతదూరంలో వుండీ ఆమాత్రం నేర్చుకున్నారంటే గొప్పమాటే కదా.”
కాస్సేపు ఇద్దరూ అస్తమిస్తున్న సూర్యుణ్ణీ, కమ్ముకొస్తున్న చిరుచీకట్లనీ చూస్తూ కూర్చున్నారు.
“అసలు ఇలాటి సమ్మేళనాలకి రావడం నాకంత ఇష్టం ఉండదు. రాను మొర్రో అని మొత్తుకుంటున్నా వినకుండా మామేనత్త మనమరాలు ఈడ్చుకొచ్చింది వాళ్లమ్మాయి డాన్సుచేస్తుంది రమ్మని.”
“ఏరీ ఆవిడ మరి?”
“తెరవెనకుంది. వాళ్లమ్మాయికి ముస్తాబు చేస్తోంది.”
పంకజం తలూపింది.
కౌశికే కొంచెంసేపూరుకుని, మళ్లీ అంది, నెమ్మదిగా తనలో తను మాటాడుకుంటున్నట్టు, “ప్రభావతిగారిని చూడండి. నాసంగతి నాకంటే ఆవిడకే ఎక్కువ తెలుసు. అయినా ప్రతిసారీ మీఆయన్ని ఇక్కడ చూసాను, మీఆయన ఇలా అన్నారు అంటూ ఒకటే సొద. నాకంటె ఆవిడకే ఎక్కువ యావలా వుంది. మళ్లీ తనభర్తనిగురించి మాటాడినప్పుడు మావారు అనదు. సుందరంగారు అంటూ పేరెట్టి మాటాడుతుంది. నాతో మాటాడినప్పుడు మీఆయన అంటుంది. ఎందుకలా చెడిపోయినసంబంధాలగురించి ఎత్తి పొడుస్తున్నట్టు మాటాడ్డం చెప్పండి. అక్కడికి “ఫలానా ఆయన ఒగ్గీసిన ఆడమడిసి”గానే నా అస్తిత్వం అయినట్టు. ప్రతివారికీ ఈకొండగుర్తులు అవసరమా అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు …”
పంకజంగారికి మాట తోచలేదు. ఆసమయంలో తను చేయగలిగిందల్లా వినడమే. మందహాసం చేసారు అర్థమయిందన్నట్టు.
మళ్లీ కౌశికే అంది, “ఇంతకీ మీమాట చెప్పనేలేదు. మీరెవరితాలూకూ?”
ఈసారి ఆవిడ గట్టిగానే నవ్వేశారు. కౌశికి కూడా నవ్వింది ఆపూటకి తొలిసారిగా.
“తాలూకాలూ లేవు, జిల్లాలూ లేవు. ఎవరికి వారే యమునాతీరే,” అంటూ ఆగిపోయారు, లిప్తపాటు తనవునికిని మరచి.
కౌశికి అప్పుడే కొత్తవ్యక్తిని చూసినట్టు ఆవిడమొహంలోకి చూడసాగింది.
“అదికాదండీ. మీరు కూడా ఒక్కరే వచ్చినట్టున్నారు. మీకింత నిబ్బరం ఎలా వచ్చిందనీ.”
“పారలాక్స్ ఎరర్ అనుకో. దృష్టిదోషం అనుకో. కొంతవరకూ మానవనైజం కూడాను. ప్రతిజీవుడికీ మరోమనిషికో, గుంపుకో చెందాలన్న తపన తప్పదనుకుంటాను. ప్రతిమనిషీ మరొక మనిషితో ఓదో ఓరకం చుట్టరికంకోసం అనుక్షణం వెతుక్కుంటూనే వుంటాడు, మావూరువాడూ, మా పొరుగువాడు, మాకులంవాడూ, మాఆఫీసులోవాడూ అంటూ. బీరకాయపీచు చుట్టరికాలు కలుపుకుంటూనే వుంటాడు. ఆదిని గణవిభజనకి కూడా ఇదే ప్రాతిపదికేమో.”
“మీకు మనుషులమీద మహనమ్మకంలా వుంది,” అంది కౌశికి కళ్లు చిట్లించి చూస్తూ.
“ఏమో, అది నమ్మకమో అమాయకత్వమో నాకు తెలీదు. నిజానికి మూఢనమ్మకమేనేమో కూడా. ఒకకథ చెప్తాను. నేను దాదాపు పాతికేళ్లకిందట ఇండియా వెళ్లాను. ఆరోజుల్లో బొంబాయో, మద్రాసో వెళ్లి మావూరు వెళ్లేవాళ్లం. అలా వెళ్లి వస్తూంటే, ఆసారి మాత్రం సవ్యంగా సాగలేదు. పూనాలో మాఅన్నయ్యని చూసి బొంబాయి బయల్దేరుతున్నాను. సరిగ్గా తెల్లారి బయల్దేరేసమయానికి మాపిల్లకి డయేరియా, నాకు నూటనాలుగు జ్వరం. ఏంచెయ్యను? నేనొక్కదాన్నయితే ఏదో తంటాలు పడుదును. చేతిలో మూడేళ్లపిల్ల. మాఅన్నయ్య ఆరోజుకి ఉండిపోమన్నాడు. బొంబేలో ఎయిరిండియాకి ఫోన్ చేశాడు. వాళ్లు టికెట్టు మార్చడానికి ఒప్పుకున్నారు అన్నాడు. సరే రెండురోజులతరవాత, కాస్త స్తిమితపడిన తరవాత, మాయిద్దరినీ టాక్సీ మాట్లాడి పంపించాడు. టాక్సీడ్రైవరుకి మరీ మరీ చెప్పాడు జాగ్రత్తగా తీసుకెళ్లమని. తీరా బొంబాయి చేరినతరవాత ఎయిరిండియా ఆఫీసుకి వెళ్తే నెలరోజులవరకూ ఖాళీ లేదన్నాడు ఆఆఫీసరు. నాకు గుండె గుభేలుమంది. మళ్లీ ఆటాక్సీయే ఎక్కి బ్రిటిష్‌ ఎయిర్‌వేస్ ఆఫీసుకి వెళ్లాను. అక్కడా అంతే. అలా ఆపూటంతా తిరిగాం.
గతరెండు రోజులుగా మాయిద్దరికీ ఒంట్లో బాగులేకపోవడం మూలంగానూ, రోజంతా టాక్సీలో తిరగడం మూలానూ ప్రాణం కడబట్టింది.
బండి తోలుతున్న సర్దార్జీకి కూడా విసుగేసినట్టుంది, “బెహన్జీ, నేను ఉదయంనుంచీ మీతోనే వున్నాను. మీరు ఎక్కడికి వెల్తారో చెప్పండి. మిమ్మల్ని అక్కడ విడిచేసి ఇంటికి పోతాను. మాభార్య, బిడ్డ నాకోసం చూస్తంటారు.” అన్నాడు తనకొచ్చిన ఇంగ్లీషులో.
“సరే, ఏదేనా చిన్న హోటలికి తీసుకెళ్లు,” అన్నాను నాకొచ్చిన హిందీలో.
నాకు మరీ పెద్ద హోటళ్లు పడవు. ఏదో మామూలు హోటలు చూడమన్నాను. అతను ఏవో రెండు మూడు హోటళ్లకి తీసుకెళ్లాడు. ఎక్కడా గదులు లేవు. ఊళ్లో ఏవో మీటింగులూ, సంబరాలూన్ట. రాత్రి తొమ్మదయింది. ఒకహోటల్లో మానేజరు ఒకచిన్నగది చూపించాడు లోపలికి తీసికెళ్లి. చీకటి గుయ్యారం. కిటికీల్లేవు. తలుపు వేసుకుంటే ఇనప్పెట్టెలో వున్నట్టే. మనం సామాన్లకొట్టు అంటాం చూడు అలా వుంది. పగలయినా గాలీ వెల్తురూ తగిలే సూచనల్లేవు. ఆమానేజరు ఎందుకో బయటికి వెళ్లినసమయం చూసి, సర్దార్జీ ”ఈగది బాగులేదు. మీరు వుంటానంటే మీఇష్టం. లేకపోతే వేరే చూద్దాం,” అన్నాడు, ఇంగ్లీషు వదిలేసి తనకలవాటయిన హిందీలో.
మరో రెండు నిముషాలతరవాత ఆమేనేజరు తిరిగి వచ్చాడు.
నేను “మళ్లీ వస్తాను,” అని చెప్పి బయటపడ్డాను. “ఈగది నాకొద్దు” అని స్పష్టంగా చెప్పడానికి బెరుకు. సర్దార్జీ కూడా కాస్త తొట్రుబాటుతో “నాదేంలేదు బహన్జీ ఇష్టం” అన్నాడు.
ముగ్గురం బతుకు జీవుడా అనుకుంటూ బయట పడ్డాం.
కారెక్కాక, సర్దార్జీ అన్నాడు, “భాయిసాబ్ మిమ్ముల్ని జాగర్త అని చెప్పినారు. అంచేత చెప్తన్న బెహన్జీ. మీకు నమ్మిక ఆయితే మాయింటికి పోదాం. మాఅమ్మా, నాన్నా కూడా ఉండారు.”

పంకజం ఒక్క క్షణం ఆగి మళ్లీ మొదలెట్టారు, “నేను అట్టే ఆలోచించలేదు. ఎందుకని అడక్కు. నాకు పూర్తిగా మతి పోయింది. సరే పదమన్నాను. అతనన్నట్టుగానే ఇంటినిండా జనం. ఫాతచుట్టాన్ని ఆదరించినట్టు అదరించారు నన్నూ, మాపిల్లనీ. మర్నాడు బయల్దేరుతూ ఆసర్దార్జీ కూతురుచేతిలో ఓనోటు పెట్టబోయాను కాని వాళ్లు ఒప్పుకోలేదు. మమ్మల్ని తండ్రి ఎయిరిండియా ఆఫీసుకి తీసుకెళ్లాడు. నన్ను కార్లోనే ఉండమని చెప్పి అతను లోపలికెళ్లాడు. పావుగంటలో తిరిగొచ్చాడు. మాకు టికెట్లు దొరికాయి.”
“మంచివాళ్లే. మీకు భయం వెయ్యలేదూ?” అంది కౌశికి విస్తుపోతూ.
“ఏమో అప్పట్లో నాకు తోచినట్టు చేశాను. తర్కానికి దిగితే నేను జవాబులు చెప్పలేను. ఇంటికొచ్చాక మావారికి చెప్తే, ఎవడితో పడితే వాడితే అలా వెళ్లిపోవడమేనా. బుద్ధి లేదూ. వాడు ఏసందులోకో తీసుకెళ్లి నాలుగు తంతే ఏంచేస్తావు అని కేకలేశారు. నాకు మొదట్లో తోచలేదు కాని తరవాత ఆలోచిస్తూంటే నాకే నవ్వొచ్చింది. ఏసందులోకో తీసుకెళ్లడం ఎందుకు. ముందురోజు నేను ఎయిర్‌లైన్స్ ఆఫీసులచుట్టూ తిరుగుతున్నప్పుడు భోషాణాల్లా నాలుగు పెట్టెలు అతని కార్లోనే వదిలేశాను కదా. కావాలనుకుంటే అతను ఆపెట్టెలతో సహా కారు తోలుకుపోలేడా. నేను చేసేదేముంది కనక.”
“నిజంగానా! నాకైతే కాకమ్మకథలా వుంది.”
“నమ్ము, నమ్మకపో, నీఇష్టం. నామటుకు నేను కూడా చాలా ఆలోచించాను ఎందుకలా చేశానా అని. ఇప్పటికీ అనుకుంటూనే వుంటాను ఆసర్దార్జీ రోజూ ఎంతమందిని కారులో ఎక్కించుకుంటాడో, వాళ్లందరినీ తనయింటికి తీసుకెళ్తాడా, ఆరోజు అతనికి ఆబుద్ధి ఎందుకు పుట్టిందీ, నేనెందుకు అతన్ని నమ్మేనూ, మరో ప్రయత్నం గట్టిగా చెయ్యాలని నాకెందుకు తోచలేదూ, …. నాకు ఇప్పటికీ సమాధానాలు లేవు. బహుశా అతను, భాయిసాబ్, బెహన్జీ అంటూ బంధుత్వాలు కలపడంతో మన ఆతిథ్యాలు ఏమూలో మనసున పొడగట్టి పనిచేశాయేమో.”
ఇద్దరు కొంచెసేపు మౌనంగా దిగంతాల్లోకి చూస్తూ కూర్చున్నారు.
“నిజమేనేమోలెండి. నేనందరికీ దూరంగా వుంటాను, ఒంటిపిల్లి రాకాశిని. అయినా ఏకూరల బజారులోనో ఓ తెలుగుపలుకు వినిపిస్తే గిరుక్కున వెనుతిరిగి చూస్తాను అసంకల్ప ప్రతీకారచర్యలాగా” అంది కౌశికి తప్పుచేసినట్టు తలవంచుకుని.
“అయివుండొచ్చు. నువ్వు ఈరోజు ఇక్కడికి రావడం కూడా అలాగే జరిగి వుండొచ్చు. మీమేనత్త మనవరాలు నిమిత్తమాత్రురాలు.”
“మీమాటే నిజమనుకుందాం. నాఇష్టాయిష్టాలు కూడా గమనించాలి గదా జనాలు. నేను ఏబంధాలు పెంచుకున్నానో, ఏవి తెంచుకున్నానో తెలిసినవాళ్లు నాఇష్టాన్ని మన్నించాలి. తెలీనివాళ్లు కనీసం తెలీనట్టు వుండాలి కదా.”
“నా అభిప్రాయం ఏమిటంటే నిజానికి మనిషంత irrational జంతువు మరి లేదు భువిలో. ఎప్పుడు ఏ మాట తోస్తే అప్పుటికామాట అనేస్తారు. ఆవెంటనే మరిచిపోతారు. మళ్లీ వాళ్లే ఏరోడ్డుమీదో నీకు తారసపడితే నిన్ను గుర్తు కూడా పట్టకపోవచ్చు. నీలాటివాళ్లు మాత్రం ఆమాటలు పట్టుక్కూచుని మనసు పాడుచేసుకుని మధనపడతారు,” అన్నారు పంకజంగారు సన్నగా, మందలిస్తున్నట్టు కనిపించకుండా.
ఇంతలో హాల్లోంచి హోరున చప్పట్లు వినిపించాయి.
కౌశికి మొహం చూసి ఏం అడగబోతూందో ఊహించినట్టు, “మరి ఇంకేం మాటాడకు. పద. ఇక్కడ మనం ఇలా ఇక్కడ తలా తోకా లేని కబుర్లతో కాలక్షేపం చేస్తూంటే అక్కడ వాళ్లందరు మంచి మంచి పాటలూ, డాన్సులూ వినీ, చూసీ ఆనందించేస్తున్నారు.”
“పదండి. మామనవరాలి నృత్యం అయిపోయిందంటే నేను ఈపూటంతా నేను పడిన అవస్థకి ఫలితం సున్నా.” అంది కౌశికి కూడా లేస్తూ.

హాల్లో స్టేజిమీద అమ్మాయి “మరియాద గాదయా” అంటూ పాడుతోంది ఓ అమ్మాయి కమ్మని కంఠంతో..

***
(ఫిబ్రవరి 2007 కౌముదిలో ప్రచురితం)

డాలరుకో గుప్పెడు రూకలు

ఎన్నారయ్యొస్తన్నడెన్నారయ్యొస్తన్నడంటూ ఒకటే హడావుడి. ఊరంతా గుప్పుమంది.  Continue reading “డాలరుకో గుప్పెడు రూకలు”

బుచ్చిబాబు చివరకు మిగిలేది

బుచ్చిబాబుగారి చివరకు మిగిలేది (పునరావలోకనం)

తెలుగు నవలాచరిత్రలో ప్రముఖ సాహితీవేత్తలు శాశ్వతస్థానంగలదిగా గుర్తించిన నవల బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది. అయితే గత 10-15 సంవత్సరాలలోనూ పాఠకులలోనూ, విమర్శనాధోరణులలోనూ గణనీయమైన మార్పులు వచ్చేయి. ఆమార్పు దృష్ట్యా కొన్ని ప్రసిద్ధనవలలు పునరావలోకనం చేయాలన్న నాసంకల్పం ఈవ్యాసానికి నాంది. Continue reading “బుచ్చిబాబు చివరకు మిగిలేది”