సంద్రాలూ ఎన్నెమ్మా సంవాదము

లేక ఏమి వాదమో ఇది?

సంద్రాలు- ఏటో ఈలగోల, సంపుకతినేస్తన్నరు.

ఎన్నెమ్మ – నీకూ తగిలిందీ ఆ గాలి?

సం. – నీకూ అంట దీర్గాలు తీస్తన్నవు, నీకూ తగిల్నాదా?

ఎ. – ఇంచుమించు అలాటిదేలే.

సం. – ఎవురో రచీత్తిరీ వస్తదన్నవు. వొచ్చినాదా?

ఎ. – ఆ వచ్చేరు, వెళ్లేరు. తల తిరిగిపోయింది.

సం. – ఏటయినాదేటి? నీకూ ఎట్టినాదా అరికత – నివ్వు సుకంగా నేవు, ఆమాట నీకే తెలవదు అంటా?

ఎ. – (నవ్వుతూ) మొదట్లో తెలీలేదులే. నీకు తెలుసు కదా నాకు ఏమాటైనా అర్థం చేసుకోడానికి కొంతసేపు పడుతుంది.

సం. – అసలేటయినాదో సెప్పరాదా?

ఎ. –  తలుపు తీసి నేను వెనక్కి తిరిగి గదిలోకి నడుస్తున్నాను కదా. ఆ బోసిగది చూసి ఆమె ఏమనుకుని ఉంటుందో అని నాకు చాలాసేపటితరవాత అనిపించింది.

సం. – ఇల్లు కాలీ సేసీ పోయినాక ఉండేనాగ ఉంటాది మరి నీఇల్లు.

ఎ. – నీక్కూడా ఆసికంగానే ఉందేంటి నాఇల్లు. హుమ్.

సం. – అదిగాదు. నానిలాటి వోర్ని శానామందినే సూసిన. నేదులే. సెప్పు.

ఎ. – మంచినీళ్లతోనే మొదలయింది. అప్పట్లో నాకు తెలీదులే. ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. రెండో బాటిలు మంచినీళ్లు ఇస్తుంటే ఎందుకండి ఒకటి చాలు అన్నారు.

సం. – అందులో తప్పేముంది. ఈరోజుల్ల నీల్లు జాగర్తగ కర్సు సేసుకోమంటన్నరు గద అందురూను.

ఎ. – మొదట నేనూ అలాగే అనుకున్నాను. కానీ చివరకి అర్థమయింది నేనంత ఖర్చు భరించలేనేమోనని, కేవలం నామీద జాలితోనే రెండోబాటిలు తీసుకోడానికి ఇష్టపడలేదని.

సం. – అద్సరే. రచీతలు కద. ఏం మాటాడుకున్నరు?

ఎ. – అదే నేనూ రచయితలం కద, కథలగురించీ, సాహిత్యంగురించీ మాట్లాడతారని అనుకున్నా. తీరా చూస్తే ఆవిడ అసలు వచ్చిందే వేరే పథకంతో. ఓ బుట్టనిండా తనపుస్తకాలన్నీ తీసుకొచ్చేరు.

సం. – మరి నివ్వు సానామందినే సూసేవు గద దేశం వెల్లి సానామందితో మాటాడినానని సెప్పేవు. ఏం మాటాడినావు?

ఎ. – నేను ఎప్పుడూ నాకథలు చదివేరా అని అడగలేదు. అప్పటికింకా పుస్తకాలేవీ ప్రచురణ కాలేదు. అంచేత నాపుస్తకాలు ఇచ్చే ప్రసక్తే లేదు.

సం. – సరి. ఈయమ్మ తెచ్చినాదంటావు.

ఎ. – అది కాదు. ఈరోజుల్లో అందరూ చేస్తున్నారు. ఎటొచ్చీ వెనకొకసారి ఆమె చేసిన ఇంటర్వ్యూలోనే చెప్పేను నేను ఈకాలం వస్తున్న పుస్తకాలు చదవడంలేదనీ, నాకు వాటిలో ఆసక్తి లేదనీ. పైగా ఆ స్త్రీవాదాలూ అవీ నాకు ఇష్టంలేదని కూడా చెప్పేను.

సం. – నివ్ సెప్పేవులే. ఆరు మాత్తరం – ఎవరికి వారే – తాము ఏరనుకుంతరు.

ఎ. – మరోటి కూడా ఉందిలే. నాకతలు అమెపత్రికలో అచ్చేస్తున్నారు కదా. ఆ అప్పు తీర్చుకోవాలని కూడా కావచ్చు.

సం. – అంతెమరి. ఆరిఈపు ఈరూ ఈరిఈపు ఆరూ గోక్కోడమే గద ఇప్పుడు ధరమమూ, నీతీను. అది నేకపోతె రచీతగా బతుకు నేదు.

ఎ. – ఇంతకీ నాకు మనసు చివుక్కుమన్నది ఎప్పుడంటే …

సం. – ఎప్పుడు?

ఎ. – నేను అమాయకంగానే తలొంచుకుని నిదానంగా నాకో పురస్కారం వచ్చిందన్నాను.

సం. – ఏమి పురస్కారం అని ఆమె అడిగింది.

ఎ. – అలా అడగడంలో తప్పు లేదు కానీ ఆ తరవాతే నాకు షాకు. నేను జవాబు చెప్పకముందే ఏదో చిన్నదైతేనేమీ పెద్దదయితేనేమీ పురస్కారమే అంది.

సం. – సెప్పకముందే? అంటే ఆమెకి తెలుసన్నమాటే గద.

ఎ. – పైగా చిన్నదో … అంటే తక్కువ చేసి మాట్లాడ్డమే కదా.  

సం. – కాద మరి. ఆమెకి పదో ఇరవయ్యో ఉన్నయి. సొంతంగా ఎట్టుకున్నయి ఇంకాఎన్నో.

ఎ. – పోదూ, నువ్వు మరీను. సొంతంగా ఎవరు పెట్టుకుంటారు?

సం. – ఇందుకే నీకేటీ తెల్దు అంటన్న. సెప్పేను గంద ఎల్లమ్మతోటకాడ వోలిండియ(ఆలిండియా) రేడియొనాగే. అక్కడ సెప్పుకోని ఇసయం నేదు.

ఎ. అసలు నేనెవర్నీ ఇంటికి రానీను. ఈమెని రానియ్యడమే నా తప్పు.

సం. మరేల రానిచ్చినవ్ ఈమెగారిని?

ఎ. – అంటే రెండేళ్లగా నారచనలు సీరియలుగా వేస్తున్నారు. ఏవో మెయిళ్లు ఇచ్చుకున్నాం గానీ ఎప్పుడూ నాసొంత విషయాలు అడగలేదు. ఇంటర్వ్యూలో కూడా అడగలేదు. అంచేత సాహిత్యం మాత్రమే మాట్టాడతారు అనుకున్నాను.

సం. – అదే మరి. ఎవురెలాటి ఓరో తెలీటానికి ఒకరకం ప్రత్తేకఁవైన అనుబవాలు కావాల. అయి ఎప్పుడు ఎనాగ వస్తయో సెప్పనేం.

ఎ. – ఇంతకీ గంపెడు పుస్తకాలు తెచ్చేరన్నానా. నాకేమో ఉపయోగంలేని వస్తువులు, పుస్తకాలయినా సరే, ఇంట్లో పెట్టుకోడం ఇష్టం ఉండదు. అంచేత వద్దన్నాను. మరీ మొహమాటపెడితే ఒక్కటి తీసుకున్నాను. అది తీసి చూసేక తెలిసింది. ఆవిడ ఆ గుంపులో మనిషే, తెలీనట్టు నటన అని.

సం. – గుంపేటి? ఎవురిమాట నివ్వంటన్నది?

ఎ. – ఆ అతి చిన్న పురస్కారం ఇచ్చినవారిగుంపు.

సం. – అయ్యోరామా. నివ్వే అనుకున్న. ఆ యమ్మ గూడా అంతే (నవ్వుతూ)

ఎ. – అంతే అంటావేమిటి అదెలా?

సం. – నీకు తెలిసిపోతాదని ఆయమ్మకి తెలీనే లేదనీ(ఇంకా గట్టిగా నవ్వుతూ)

ఎ. – నేనూ ఎంతోమందిని రచయితలనీ, పత్రికాసంపాదకులనీ కలిసేను. ఒక్కరిదగ్గర కూడా కనీసం నాకథలు చదివేరా అని అడగనైనా అడగలేదు.

సం. – మరేటి మాటాడేవు?

ఎ. – వాళ్లని కలవడానికి నేను వెళ్లేను. అంచేత వాళ్లరచనలూ, వాళ్ల అభిప్రాయాలు ఈనాటి సాహిత్యంగురించి అడిగేనంతే. ఈకథకి ఈశీర్షిక ఎలా నప్పుతుంది, ఆకథలో మీరు ఆపాత్రని సృష్టించడానికి స్ఫూర్తి ఏమిటి ఇలా. అంతే గానీ,

సం. – ఆయమ్మ ఏమడిగినాది?

ఎ. – మీపిల్ల మరో ఉద్యోగం చేస్తోందా? 

సం. – సెప్పనేకపోనావా పిల్లకి అదొక్కటే ఉద్దోగం, దాంతోనే ఇల్లు కూడా కొన్నాదని.

ఎ. – అదే అన్నాను. అసలు నాసందేహం కూడా అదే. ఈ స్త్రీవాదులూ, మరో వాదులూ అందరూ గోలెట్టేది ఆడవాళ్లకి తగినగౌరవం ఇవ్వడంలేదూ, స్వేచ్ఛలేదూ, అంటూ అంకమ్మసివాలు. అసలు వీళ్లే మనిషిని మనిషిగా గౌరవించరేమీ అని. అంత గొప్ప స్త్రీవాదీ నేను రచయిత్రిని, తానూ రచయిత్రి, ఆ గౌరవం నాకు ఇవ్వలేదు. తాను నిలుపుకోలేదు.

సం. – అదే గద. నాను ఇందాకా వస్తానే అంటిని ఒకటే గోల అని. ఇదే నానన్నది గూడా. నాకేటి గావాలో నాకు తెల్దంటరు. నాను సుకంగ లేనంటరు, దొరబాబు నాకాయకస్టం దోచేసుకుంటన్నడు అంటరు. మరి ఆరు సేసే ఉద్దోగాలు మాతరం కూలిపన్లు గావా? ఆరు మాతరం కూలికి గాదా పని సేసేది?

ఎ.- కూలికీ, పేరుకీను. వాళ్లు చేసేది గౌరవప్రదం. నువ్వూ నేనూ చేసేది నికృష్టం. నాది అద్దెకొంప. నాఇంట్లో కుర్చీలు బల్లలూ Maceyలో కొన్నవి కావు. నేను తొడుక్కున్నబట్టలు ఫేషను కాదు.

సం. – అదే నీకు సాలని ఆల్లకి అర్తం కాదు. నీకు అదే ఇస్టమని అర్తం కాదు. ఎందుకంటె ఆరికల్లు ఆకాసంలో ఉంటయి. ఆరికి నేలమీద ఉండే నివ్వూ నేనూ కంటికనము. సరిలె. పొద్దోయింది. నానెల్లాల.

ఎ. – అదేమిటి పుస్తకం తీసుకెళ్తున్నావు, ఎందుకూ? చదువుతావా? దొరబాబుకిస్తావా మనవాళ్ల మేధ ఇలా ఉందని చెప్పడానికి?

సం. – ఇందులకే మాయప్ప అంటాది ఈ వోదాలన్ని ఆల్లలో ఆల్లు కుమ్ముకు సవ్వటానికే. అల్లకి అదో కాలచ్చేపం, ఇనోదం. ఆ వోదాలవల్ల మనలాటోల్లకి ఒరిగేదేమీ నేదని.

000

సూత్రధారి:

సంద్రాలు మౌనముగా సింహద్వారమువైపు నడిచెను.

ఎన్నెమ్మ లాపుటాపు ఒడిలో పెట్టుకుని అంతర్జాలములో ఓలలాడుచుండెను.

మరుక్షణము  దబ్బుమని ఒక వస్తువు చెత్తబుట్టలో పడినశబ్దము వినిపించెను.

ఎన్నెమ్మ తలెత్తకనే, అటు చూడకనే తనపనిలో ఉండెను.

అటుపిమ్మట సకల జనులును ఎవరిపద్ధతిని వారు సుఖులై శాంతమనస్కులై శేషజీవితమును గడుపుకొనిరి.

(సెప్టెంబరు 15, 2022)

అయ్యో ఒక్కరైనా చెప్పలేదు కథ Audio

విస్కాన్సిన్ లో మంచుకాలం నాకు ఎంతో ఇష్టమైన కాలం. చాలామందికి మంచు నచ్చదు కానీ నేను మాత్రం అడుగెత్తు మంచు పడ్డప్పుడు కూడా బయట తిరగడానికి వెళ్లేదాన్ని.

1978లో వేసవిలో యూనివర్సిటీలో  తెలుగుపాఠాలు చెప్పడం మొదలుపెట్టేను. అది ప్రత్యేకించి తమ చదువులో భాగంగా ఆంధ్రదేశంలో ఒక ఏడాదిపాటు గడపదలుచుకున్నవారికోసం సృష్టించిన crash course. పదివారాలలో ఏడాది చదువుకి తులతూగగల తెలుగు నేర్పాలి.

అందులో భాగంగా సరదాకి ఈకథ రాసేను. మనం ఎంత సిద్ధం అయేం అనుకున్నా, ఇంకా తెలీకుండా పోయేవి చాలా ఉంటాయని చెప్పడమే ఈ చిన్నికథ ధ్యేయం. ఇది  మొదట ఇంగ్లీషులో Six Blind Men అన్నపేరుతో Wisconsin Review లో ప్రచురించబడింది.

తరవాత తెలుగులోకి నేనే అనువదించుకున్నాను. ఇది కొప్పర్తి రాంబాబుగారి కంఠస్వరంలో వినండి. లింకు ఇక్కడ

ఆగస్ట్ 4, 2022

భండారు అచ్చమాంబ. ధనత్రయోదశికి నా అనువాదం.

ఇంతకుముందు ఈకథ అనువదించేను. ఆ అనువాదం Penscape: An Anthology of Telugu Short Stories సంకలనంలో ప్రచురించబడింది. ఇప్పుడు మళ్లీ చూసుకుని, విస్తృతంగా సంస్కరించి thulika.net ప్రచురించేను.

ఆసక్తి గలవారు ఇక్కడ చూడవచ్చు. లింక్

మామ్మగారి మరణం

1955లో తెలుగు స్వతంత్రలో వచ్చిన నా స్కెచ్ శీలా సుభద్రాదేవిగారు రాస్తున్న వ్యాసంలో చూసేవరకూ నాకు గుర్తే లేదు.

ధన్యవాదాలు సుభద్రాదేవిగారూ, 66 ఏళ్లనాటి స్కెచ్ తవ్వి తీసినందుకు.

కథానిలయంలో ఇక్కడ చూడగలరు.

కథానిలయం నిర్వాహకులకు మనఃపూర్వక ధన్యవాదాలు.

(నవంబరు 15, 2021)

గూడు లేనివాడు (చిన్నకథ)

హేమీకి కోర్టువారినుండి తాఖీదు వచ్చింది.

ఫలానారోజున ఫలానా టైముకి స్థానికకోర్టులో హాజరు కావలసింది అని. లేదు. అతనేమీ నేరం చేయలేదు. అతను ఇచ్చుకున్న ఒక నేరారోపణవిషయంలో అతని సాక్ష్యం అవుసరం కనక కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వవలసిందిగా ఆహ్వానం అది.

నేరారోపణ ఏమిటో చెప్పేముందు, అసలు అంతవరకూ జరిగిన కథ చెప్పాలి.

ఈ హేమీ అనబడువాడు ఉన్న మూడంతస్తుల మేడకి ఎదురుగా ఓ చిన్న ఇల్లుంది. అది పడగొట్టి మరో మేడ లేపే ఉద్దేశంతో ఆఇంటివారు ఆ ఇంటిని నేలమట్టం చేయనున్నారు. ఈలోపున గతిలేని దరిద్రులు ఇద్దరు ఆ ఇంట నివాసం ఏర్పరుచుకున్నారు. అది కంటకప్రాయమయింది పొరుగుమేడలో ఉన్నవారికి. వారు హేమీ ఉంటున్న మేడ మేనేజరుకి ఓ ఘాటయిన నోటిసు పంపించేరు.  

ఆ నోటీసు వివరాలు ఇలా ఉన్నాయి.

— ఆ పడగొట్టబోయే చిన్నఇంటిలో ఉన్న దరిద్రులు (మేనేజరు వాళ్ళని squatters అంటాడు) అడ్డుగోడలు దూకి పొరుగుమేడ ప్రవేశిస్తున్నారు, వీధిలో పాదచారులవెంట బడుతున్నారు.

తమ పరిసరాలు పరిరక్షించుకోవలసిన బాధ్యత ఆప్రాంతంలో ఉన్న అందరికీ ఉంది కనక చుట్టుపక్కల నివసిస్తున్నవారు అందరూ తమ ప్రాంతాన్ని భద్రముగా ఉంచుకోడానికి సాయపడాలి కనక ఆ దరిద్రులను అరికట్టాలనీ, వారిని ఆ ఇంటినుండి బహిష్కరించాలనీ కోరుతూ స్థానిక అధికారులకు ఉత్తరములు  రాయవలసింది. 

ఆ నోటీసులోనే రెండు పేర్లు సూచించబడ్డాయి కానీ అవి ఎవరివి? యింటియజమానులవో, నోటిసుకర్తలవో, ఆ దరిద్రులవో స్పష్టం చేయలేదు.  

ఇహ అసలు విషయానికొస్తే, ప్రజాక్షేమము కోరేవాడూ సమాజసేవకి అంకితమైనవాడూ అయిన హేమీ ఆ నోటీసులో ఆదేశంప్రకారం స్థానిక అధికారులకు ఉత్తరం రాసేడు. ఈ ఉత్తరం ఇలా ఉంది –

 — ఫలానావీధిలో కూలద్రోయనున్న ఇంటి యజమాని ఆఇంటిని కూలద్రోయక తాత్సారము చేయుటవలన ఆ ఇల్లు దిక్కులేనివారికి ఆశ్రమయి ఇరుగుపొరుగులకు ఇబ్బంది కలిగించుచున్నది. ఆ ఇంట చేరిన ఖబ్జాదారులు గోడలు దూకి, మా వీధిన పోయే బాటసారుల వెంటబడి మాప్రాంతమున భయంకరపరిస్థితులు కల్పించుచున్నారు. ఏతత్కారణమున తమరు వారిని బహిష్కరించి, మాప్రాంతమునకు భద్రత పునఃప్రతిష్ఠించవలసినదిగా  ఇందుమూలముగా కోరడమైనది.”

ఆ ఉత్తరం పోస్టు చేసి తనవిధి నిర్వర్తించినందుకు బహువిధాల ఆనందించేడు హేమీ.

అయితే అతను ఎదురు చూడని వాస్తవం స్థానికఅధికారులనుండి రాగల ఆహ్వానం. అతను అనుకోలేదు కానీ అది వచ్చింది, “మీఫిర్యాదు మాకు చేరినది. మేము దానిని కూలంకషముగా పరిశీలించినాము. దురాక్రమణదారులు ఆ నేరమును అంగీకరించలేదు. అందుచేత రెండు పార్టీలను సమావేశపరచి. మాతీర్పు చెప్ప నిశ్చయమైనది. ఫలానారోజున ఫలానా టైముకి హాజరు కావలసినది,” అని ఆ ఉత్తరం ఆదేశం.

ఆ ఫలానారోజు హేమీమహాశయుడు కోర్టులో హాజరయేడు.

అతనిప్రాంతంలో అభద్రపరిస్థితులు కల్పించినట్టు నేరము ఆరోపించబడిన దురాక్రమణదారులు ఇద్దరూ హాజరయేరు. ఇక్కడ వారిని నిందితులుగా గుర్తించడమైనది.

నిందితులలో ఒకడైన మీకో తమకి వేరే న్యాయవాదులు లేరనీ, తానే ఇద్దరితరఫునా మాటాడతాననీ విన్నవించుకున్నాడు. జడ్జీగారు అందులో గల తికమకలు కొంత వివరించి, చివరికి అంగీకరించేరు.

ఇరు పార్టీలవారూ తమతమ వాదనలను ప్రతిపాదించేరు.  

సాక్షులను ప్రశ్నించడం మొదలయింది. -మీకో ప్రశ్నలు, హేమీ సమాధానాలు ఇలా ఉన్నాయి.
“నేను  గోడ దూకుతుండగా నువ్వు చూసేవా?”

“నేను చూడలేదు”

“గోడ దూకుతూండగా చూసేవా?”

“లేదు.”

“నేను వీధిలో ఎవరివెంట బడుతుండగా చూసేవు?”

“ఎవరివెంటబడడం చూడలేదు.”

“నువ్వు మమ్మల్ని మొదటిసారిగా చూసేవు?”

“ఈరోజు ఇక్కడ మొదటిసారిగా చూస్తున్నాను.”

“మరి నువ్వు ఎందుకు ఫిర్యాదు చేసేవు?”

“నాకు మామేనేజరు పంపిన నోటీసులో అలా ఉంది కనక.”

“నువ్వు చూడనివిషయం చూసినట్టు సాక్ష్యం ఇచ్చుట నేరము అని నీకు తెలుసా?”

హేమీకి ఏమని జవాబివ్వలో తెలీలేదు.

“నీకు ఆ నోటీసు పంపినవారింట్లో ఏవస్తువులైనా పోవడం గానీ, ఎవరికైనా హాని కలగడం గానీ జరిగిందా?”

“నాకు తెలీదు.”

మీకో జడ్జివేపు తిరిగి, “యువరానర్, ఈ సాక్ష్యం hearsay కనుక అంగీకారయోగ్యం కాదు. ఆకారణముగా కేసు కొట్టివేయవలసిందిగా కోరుచున్నాము,” అన్నాడు.

కేసు కొట్టివేసేరు వాది నమ్మదగ్గ ఋజువులు చూపించని కారణముగా.

అందరూ బయటికి నడిచేరు.

మిస్టర్ హేమేష్ మళ్లీ ఆ నిందితుడివేపు చూసేడు. ఎవరో పారేసిన కోటూ, అరిగిపోయిన చెప్పులూ, తుప్పజుత్తూ ఇతనికి న్యాయశాస్త్రంగురించి ఇంత ఎలా తెలిసింది అని ఆశ్చర్యం.

ఆమాటే అడిగేడు. “నువ్వు ఏం చదువుకున్నావు?”

“పదోక్లాసు. నువ్వేం చదివేవు?”

“హార్వర్డు లా స్కూల్.” 

“హఁ. Perry Mason చూసేను 5 సీజన్లు.” 

“నీకు ఇల్లు లేదు, ఎక్కడ చూసేవు టీవీ?”

“నేను ఈ కూలబోయే గోడలమధ్యే పుట్టేననుకున్నావా?”

హేమీకి ఆపైన ఏం అడగడానికీ తోచలేదు.

మీకో అన్నాడు, “నాకు ఇల్లు లేదు కానీ బుర్ర ఉంది. నీకు ఇల్లుంది కానీ బుర్ర లేదు.” 

000

చిన్న వివరణ: ఈకథలో ప్రస్తావించిన నోటీసు మేనేజరుద్వారా నాకు వచ్చినమాట నిజం. నేను మాత్రం దానిమీద ఏమీ చర్య తీసుకోలేదు. చెత్తబుట్ట దాఖలా చేసేను. కథలో ఉన్నాయి నాకారణాలు.

Pandemic కారణంగా ఓ మోస్తరు జరుగుబాటు గలవారు చాలామంది వీధిపాలయేరు.

ఈకథ రాయడానికి కారణం కొందరు ఇల్లులేనివారిగురించి ఎంత హేయమైన అభిప్రాయాలు  ఏర్పరుచుకుంటారో, వాటిని ఎలా ప్రచారం చేస్తారో చెప్పడానికే.

(నవంబరు 2, 2021)