మసక వెలుగులో మండపం.
తను సరిగ్గా మండపం నట్టనడిమి నుంచుని ఉంది.
నరసంచారం లేదు సరి, నరవాసన లేదు, నరుడు అడుగిడిన జాడ లేదు
ఏదో పురాతన కట్టడం కాబోలు.
తూరుపుదిక్కున చీకటి గుయ్యారం.
లోపల ఎక్కడో ఏ శిలావిగ్రహమో సుప్రతిష్ఠితమై ఉంది కాబోలు.
కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారం.
తనని చుట్టుకుని పట్టువలువ గోముగా కప్పినట్టు నిశ్శబ్దం.
తలెత్తి చూసింది మళ్ళీ.
కనిపించనంత ఎత్తుకి దూసుకుపోతూ గోపురం
అక్కడ పావురాళ్ళే కాపురాలు పెట్టేయో
గుడ్లగూబలే స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయో
… …
గదిలో చీకటి విడుతోంది, కళ్ళు తెరిచి చూసింది తను.
అదే మంచం, అదే గది.
అదే కల. అదే ప్రశాంతం, ఎన్నిరాత్రులో.
ఆ కలకి అర్థం ఏమిటో
సందేశం ఏమిటో.
అయోమయం.
ఆకల వచ్చినరోజు సుఖనిద్ర అనుభవం మాత్రం నిజం.
కొంతకాలం అయేక మరో కల
గండ్రశిలమీద తను. అష్టదిక్కులా జలమయం.
కనుచూపుమేర ఎటు చూసినా మిలమిల మెరుస్తూ తరంగాలు
ప్రళయం అంటే ఇదేనా
మూడు నిలువులఎత్తు తరంగాలు మహోధృతితో మింటికెగసి విరుచుకుపడుతున్నాయి
అంత వేగంతోనూ తనని దాటి దూసుకుపోతున్నాయి
తనపాదాలమీంచి, తాను నిలుచున్న బండరాతిమీంచి ఒరుసుకుపోతూంటే
ఏ పుణ్యస్త్రీనో ఆదరభావంతో, నిండుమనసుతో పాదాలు కడుగుతున్నస్పృహ.
స్పచ్ఛమైన పావనగంగలో జలకమాడినప్పటి ఆహ్లాదం
పైన ఆకాశం గొడుగు పట్టినట్టు పరుచుకునుంది. నిర్మలంగా ఉంది.
ఎక్కడ ఇది, ఇది ఏప్రదేశం. ఎక్కడుంది తను.
పిట్టా పురుగూ, మనిషీ, మృగమూ ఏమీ లేవేమీ
ఇల్లూ వాకిలీ, చెట్టూ చేమా ఏవీ, భూమేదీ
ఇదేనా ప్రళయం?
భయమో, బాధో, విచారమో, సంతోషమో ఏ స్పందనా లేదేమీ
నేను నేనేనా?
కొన్ని రోజులు కనిపించి ఆగిపోయిన కల.
ఆ తరవాత నాలుగేళ్లకి కాబోలు మరో కల.
సాయంసమయం
చెదురుమదురుగా అక్కడా అక్కడా ఓ మనిషి
ఎక్కడుంది తను, ఇది ఏఊరు
వీధివార ఏదో టీదుకాణంలా ఉంది.
అరచొక్కా, అడ్డ పంచె, పట్టినామాలు, చిన్నబొజ్జ యజమాని కాబోలు
ఓవార చిరుగుల చొక్కాలో చిక్కుకున్నవాడు ఊదుకుంటూ నెమ్మదిగా టీ సేవిస్తున్నాడు
తను కారులోనే ఉంది. ఇది తనకారే
కారులో ఉన్నవాడెవరో
ఎవరతను, తనకారులో ఎందుకున్నాడు
తనెందుకు కారు తోలడం లేదు.
ఇదుగో, అబ్బాయ్, ఈదారి ఎటు వెళ్తుంది
అదేంటమ్మా. ఆదారి అటే వెళ్తుంది, మీరెటెళ్తే అటే వెళ్తుంది
అది కాదయ్యా, ఆవేపు ఏఊరుందని
ఇదుగో Amerillo ఇటు కాదు
పర్లేదండి ఇది దగ్గరదారి
ఇతను తెలుగు మాటాడుతున్నాడేమిటి
ఇక్కడికెలా వచ్చేను చెప్మా
Kohl’sలో కూరలకోసం కదా బయల్దేరేను.
చీకటి పడుతున్నట్టుంది, తనసలెప్పుడూ ఈవేళ ఎక్కడికీ బయల్దేరదు.
ఎందుకు కారులో ఉంది, తోలుతున్నవాడెవరు
దారి తప్పిపోయినట్టుంది.
సర్, సర్, Amerillo street అటువేపు
ఈ లెక్కన ఇల్లు చేరేదెప్పుడో
అసలు ఇల్లు చేరుతుందా
… … …
కనురెప్పలు నిదానంగా విచ్చుకున్నాయి
తనమంచంమీదే ఉంది. తనఇంట్లోనే ఉంది.
తనెప్పుడూ తప్పిపోలేదు.
కలలో తప్పిపోవడం ఏమిటి
అదే కల మళ్ళీ మళ్లీ
ఎన్ని రాత్రులో …
ఒకదాని తరవాత ఒకటి
మధ్యలో కలల్లేని నిద్ర
మళ్లీ కల
ఎన్ని రాత్రులో
మళ్లీ కొంత విరామం
ఎన్ని రాత్రులో
మళ్లీ మరో కల.
ఇది మూడో స్వప్నం.
ఏ రాత్రీ ఏకలలోనూ వెరుపు లేదు.
అబ్బురమైన ప్రశాంతత. బుద్ధి శూన్యం.
మనిషిజాడ లేదన్న చింత లేదు
బహుశా పరిసరాలగురించిన చిన్న కుతూహలం అనుభవమైందేమో, అంతే.
మూడుముక్కల్లో చెప్పాలంటే
చింతన
స్వాంతన
పొంతన
000
(పతంజలి యోగసూత్రాలలో కలలను విశ్లేషిచుకోడం కూడా యోగసాధనలో భాగంగానే చెప్పేరు.
మొదటికలలో చింతన, రెండొకలలో స్వాంతన, మూడో కలలో పొంతన అంటే మళ్లీ సమాజంలో కలిసిపోవడం అనుకోవచ్చు)
000
(అక్టోబరు 21, 2020)