తాటిచెట్టు నీడ

తాటిచెట్టు నీడ

సైడ్ వాక్ పైన సభలు తీరిన తరుసంతతి
నాతలపై నటరాజతాండవం అనుదినం

తొలిసంజవెలుగులు నడివీధిలో
మలిసంజదీపాలు పొరుగులాన్లపైన
నడిపొద్దు నీడలు కుదురుమట్టాన
నాతల కాయని నీడలు
నాగొడుగుపట్టని వనరులు

పల్లెకో సంత
వూరుకో సదస్సు
వాడకో సంఘం
మనిషికో మతం
వాదాలు, వినాదాలు
నినాదాలు సునాదాల వెన్నంటి
రెడ్డిరాజులు
కమ్మప్రభువులు
సెంటరుఫీల్డులో సుబ్రాహ్మణ్యాలు
పులుసులో ముక్కలు

చిన్నా పెద్దా
తెలుపూ నలుపూ
ఆడేవారూ పాడేవారూ
పక్కతాళాలవారు
చెక్కభజనలవారూ

చీకాకోలునించీ రామకుప్పంవరకూ
వూరిపేర్లనుండీ వారసత్త్వాలవరకూ
ఆరాలు తీయువారు
వేరువేరుపేరులవారు

ఆనామకులకూ అంగుష్ఠమాత్రులకూ
ఆశల్ రేపుతూ దారంట తాళవృక్షాలు.

(కౌముదిలో ప్రచురితం ఆగస్ట్ 2006)

గ్రహబలాబలాలు

గ్రహ బలాబలాలు.

సూర్యమాన గ్రహచారంలో
దలైలామా, అమెరికాఅధ్యక్షడూ కేన్సీరియన్లు
ఉభయులకూ కేంద్రం ఆత్మ.
ఒకరికి ఆదర్శం ఆత్మావలోకనం
రెండోవారు చేస్తున్నారు ఆత్మప్రదక్షిణం
ఒకరికి ఆలంబన విశ్వమానవసౌభ్రాతృత్వం
రెండోవారికి విశ్వం సర్వస్వామ్యసంకలితం.
ధృవాంతరసీమలకు విస్తరిల్లిన
వారి తేజోపుంజాలు
మిరుమిట్లు గొల్పుతున్నాయి
కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
అలివికాని అంధకారంలో
మురికివాడలో
నా ఇరుకుగదిలో
వెతుక్కుంటున్నాను
ఆల్చిప్పంత జాగాకోసం.
మూడోపాదం మోపనున్న వామనుడిలా.
నేను మూడో కేన్సీరియనుని‌.
(జూన్ 23, 2007. ఈమాట.కామ్ లో ప్రచురింపబడింది.)

మూడు కవితలు

  1. చెలగాటం.

షేక్స్‌పియరూ, శ్రీకృష్ణుడూ

జీవితం ఒక నాటకం అన్నారు

నాకు మాత్రం

స్క్రిప్టు లేక

ప్లాటర్థం కావడంలేదు

రూల్సు లేని ఆటలా వుంది

అందుకే ఆడుతున్నాను

అఫెన్సో డిఫెన్సో

ఎదుటివారి ఎత్తుల్నిబట్టి

అంతమాత్రాన నావ్యక్తిత్వానికేమిటి లోపం?

  1. దృష్టిదోషం.

తెలుగువారికి అఖ్కర్లేని సంగతి లేదు

ఎల్లరిబతుకులూ బజారుపాలు

ప్రతివాడికీ పొరుగువాడిగొడవే

అని మా నమ్మకం

 

ఇండియా మారిపోయింది

ఇప్పుడెందుకెళ్లడం

పూర్వపు అభిమానాల్లేవంచూ

వారించిన బంధుమిత్రులనీ, శ్రేయోభిలాషులనీ

కాదు కాదని

ఆకారవిశేషాల్లో

ప్లేను దిగిన నన్ను

ఆప్యాయంగా ఆదరించిన

బంధుమిత్రులని చూసి

ఆనందాతిరేకంతో

అవాక్కయిపోయేను.

ఏంజరిగిందేంజరిగిందంటూ

జనం పొడుచుకు తిన్లేదని

ఉప్పొంగిపోయేను.

 

తీరిగ్గా తరిచ్చూసుకుంటే

ఇప్పుడనిపిస్తోంది

నాగతం గురించెవరూ

అడగలేదని అప్పుడానందించేను

ప్రస్తుతం నాకెలా గడుస్తోందని

ఎవరూ అడగలేదని

ఇప్పుడు కొరతగా ఉంది!

 

 

 

  1. తెలుగు నుడికారం

పాలవాడుకలా

వారాలబ్బాయిలా

క్రమం తప్పకుండా

హలో చెప్పడానికో

డైనింగవుటుకో

డూయింగ్ లంచికో

కాల్చేసి కబుర్లాడి

ఓకేనండంటూ

కర్టెసీ కాలులు ముగించే

మిత్రబృందానిక్కరువు లేదిక్కడ

అమ్మదొంగా అంటూ అలరించి

హుందాతనం ఒలకబోస్తూ

కొడుకూ కోడలి ముచ్చట్లూ.

మనచేతుల్లోని మడుసులూ

కోప్పడేసే మినిష్టర్లగొడవలూ లాటి

ఊసులాడుకోడానికి

మనాళ్లు కావాలంటే మాత్తరం

అంజనంవేసి సూస్కోవాల.

000

(పై మూడు కవితలు ఆంధ్రప్రభలో (15 సెప్టెంబరు 1997) ప్రచురితం.)

 

నావేదనతో కలిసి మేమిద్దరం

నావేదనతో కలిసి మేమిద్దరం

నాస్నేహితురాలు సాయిపద్మమూర్తి రాసిన కవిత, painకి నా అనువాదం. http://www.angelfire.com/realm3/telugu/ లో ప్రచురింపబడింది.

బాధ అనుభవైకవేద్యం. సానుభూతికోసం చెప్పే అనునయవాక్యాలు సాంత్వన చేకూర్చవు సరికదా, అలా చెప్పేవారిని చూస్తే నాకు జాలేస్తుంది అంటుంది మా పద్మ.