శునకేంద్రభోగాలు

శునకేంద్రభోగాలు

ఈనాడు మానాట
కుక్కలకు గౌరీకల్యాణం
కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు
ఆవులను కోసి కుక్కలను మేపుట సర్వసాధారణం
ఇచట
కుక్కతిండికి వ్యయం ఏటికి పదహారు బిలియనులు
గ్రామసింహాల పళ్లు తోమడానికీ
ఒళ్లు కడగడానికీ
మరో తొమ్మిది బిలియనులు
యజమానులు తీరిచి దిద్దుకుంటున్నారు
ముద్దుకుక్కల ముఖవిలాసం
కుక్కలకున్నాయి
ఫర్‌కోటులూ, ఆభరణాలూ
అందాలపోటీలూ,
ఆరామస్థలాలు
సంఘాలు, సమావేశాలు
వెరసి వ్యయం
యేటికి యాభై బిలియనులు
మాసార్వభౌముల
సలహాదారులు *లోరా, బార్నీ,
వారిలో బార్నీవాక్కులకే అధికప్రాధాన్యం.
సామాన్యజనాలకి కుక్కగతి

మానవజన్మనెత్తి
నానా ఆగచాటులు పడుటేల
అమెరికాలో కుక్కగా
పుట్టిన కలుగు
అష్టశ్వైర్యములు, అనన్యసామాన్య భోగబాగ్యాలు

(* Laura జార్జ్ బుష్ అర్థాంగి, బార్నీ వారి ముద్దుకుక్క అని గ్రహించగలరు)
000

(మా.ని. జనవరి 2008)

ధర్మకాటా

ధర్మకాటా

ఆకలేస్తే అన్నం తిను
చలేస్తే దుప్పటీ కప్పుకోమంటూ
నోటిలెక్కల్లా
బహుతేలిక
ఈనాటి నాగరీకప్రపంచంలో
ప్రతిసమస్యకీ
సిద్ధంగా జవాబు

కంటికానని
అనుభవాలు
పరమాణుల్లా
కోటానుకోట్లు

అణువణువూ
గతానుగతికంగా
ప్రపంచాన్ని పాలిస్తోంది
చట్టాలని సృష్టిస్తోంది

నిజానికి
అంతరాంతరాల్లోంచి
పుట్టుకొచ్చే వణుక్కి
దుప్పట్లెక్కడా దొరకవు
అకాడమీలందిచ్చే
ధర్మనిర్ణయాలు
సామాన్యులకి
సాంత్వన కూర్చవు
వారి తీర్పులు
వీరి బతుకుల
మూసపోసిన అచ్చుల్లా
అమరవు.

(మాలతి, 10-24-1997)

చెట్టు

సౌమ్య వ్యాఖ్యానం చూసినతరవాత తప్పు దిద్దుకుంటున్నాను. ఇస్మాయిల్ గారికి నా క్షమాపణలు.
— మాలతి.

చెట్టు ఆదర్శం?

.
చెట్టు తమ ఆదర్శం
అంటారు మన కవులు
మరి
ఈనాడు మూడులోకాలకూ
పనికొస్తోంది వనచయం
సంచులూ, కంచాలూ కూర్చిపెట్టటానికీ,
ముక్కూ, మూతీ,
ముందూ వెనకా ఒత్తుకోటాని‌కీ
ఇల్లూ వాకిలీ సోకులు జేసుకోటానికీ.

అయ్యో రాతా!
ఇదా నేను ఏరికోరి
వలచి వరించిన బతుకని
కుమిలి కుళ్లిపోతోంది చెట్టు.