మీఅభిప్రాయాలకోసం

సాహిత్యసృష్టి నిష్కామకర్మ.

2010నించీ నా సాహిత్యం PDF రూపంలో నారచనలు అన్నీ సంకలనాలరూపంలో మీకు లభ్యం.

నాసంకలనాలతో పాటు ఇతర ప్రముఖ కవుల, రచయితల గ్రంథాలు కూడా ఈ పేజీలో మీకు లభ్యం. నేను ఆ గ్రంథాలు చదివి నాఅభిప్రాయాలు వ్రాసి, నావ్యాసంక్రింద ఆ పుస్తకం PDF

సాహిత్యసృష్టి నిష్కామకర్మ.

వనజ తాతినేనిగారు కొత్తగా ప్రచురించినపుస్తకం ఉచితపంపకం లేదని అన్నాక, నాకు ఈ ఊహ వచ్చింది.

నాపుస్తకాలన్నీ పేరుగల ప్రచురణసంస్థలు ప్రచురించినవే. అమ్మకాలు ఏమాత్రమో నాకు తెలీదు. వాటిమీద అట్టే సమీక్షలు రాలేదు. ఏవీ రెెండో ప్రచురణకి నోచుకోలేదు.

ఆ తరవాత అవి out of print అని కనిపించేక, నేనే నాబ్లాగులో PDF FORMATలో అందించేను.

నా సంకలనాలన్నీ సగటున రోజుకు 4, 5 downloads కనిపిస్తాయి. గత 12 ఏళ్లలోనూ డౌన్లోడ్ కాని రోజు లేదు. 4 నుంచి 8 వరకూ ఉంటాయి ఏరోజు చూసినా.

విశేషం ఏమిటంటే, ఒక్కరైనా, ఈ పుస్తకం చదివేం, మాఅభిప్రాయం ఇదీ అని తెలియజేయలేదు !!!!

అలాటప్పుడు నేను ఏమి అనుకోవాలంటే,

1. చదివే ఉద్దేశంతోనే తీసుకున్నారు కానీ ఇంకా చదవలేదు.

2. చదివేరు కానీ చెప్పడానికేమీ లేదు.

3. ఆయనో ఆవిడో చదవలేదు కానీ వాళ్లావిడో ఆయనో చదివేరు.

4. ఊరికే దొరుకుతున్నాయి కనక తీసుకున్నారు.

అస్సలు లేవనను. సత్యవతిగారు విస్తృతమైన వ్యాసమే రాసేరు నాకథలమీద. శీలా సుభద్రాదేవిగారు నామొత్తం సాహిత్యం పూర్తిగా చదివి, నిశితంగా పరిశీలించి సాధికారమైన విమర్శనాత్మకగ్రంథాలు రెండు రాస్తున్నారు – ఒకటి కథలమీద, రెండోది వ్యాసాలు, నవలలమీద. ఈ ఇద్దరు రచయిత్రులకి సదా కృతజ్ఝురాలిని.

మీరు కూడా మీ అభిప్రాయాలు ఆ యా పుస్తకాలలో అంశాలగురించి వ్యాఖ్యానిస్తే చర్చకి అవకాశం ఉంటుంది. నాకృషికి సార్థకత.

ధన్యవాదాలు

నిడదవోలు మాలతి.

జులై 12, 2022

“నేను” కథ – నాగజ్యోతి రమణ సుసర్లగారి సుస్వరంలో కథనం, చర్చ కథాకళవేదికమీద.

మొన్న, ఆదివారం మే 28, 2022, కథాకళవారు నిర్వహించిన వేదికమీద నాకథ నేను శ్రీమతి సుసర్ల నాగజ్యోతి రమణగారు మనసుని ఆకట్టుకునేలా వినిపించేరు.

కథాకళ నిర్వాకులు – ప్రసాద్ జోస్యుల

చర్చలో పాల్గొన్నవారు – ప్రసాద్ జోస్యుల, చాగంటి కృష్ణకుమారి, రాజేష్ యాళ్ల, నాగజ్యోతి రమణ సుసర్ల. శ్రోతలు.

మంచి చర్చ జరిగింది. చర్చలో వచ్చిన కొన్ని వ్యాఖ్యలు నాకు స్ఫూర్తిదాయకం. కొన్ని ప్రశ్నలూ, నా అభిప్రాయాలూ ఇక్కడ వెలిబుచ్చాలనుకుంటున్నాను.

1. ప్రసాద్ జోస్యుల వెలిబుచ్చిన సందేహం – కథకుడు పేరు చెప్పలేదు అన్నది. మంచి పరిశీలన. నేను చాలాకథలే ఉత్తమపురుషలో వ్రాసేను. నిజానికి ఇది నన్ను చాలా తికమకవిషయమే కథ వ్రాస్తున్నప్పుడు. కారణం – నాపేరే మాలతి అని పెట్టడం ఇష్టం ఉండదు నాకు. పాఠకులకి నా స్వవిషయం అనిపిస్తుందని. రెండోవైపు, మరోపేరు పెడితే నన్ను నేనే మోసం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పలేను కానీ నాధోరణి అది. అంచేత చాలావరకూ సందిగ్ధంగా వదిలేస్తున్నాను. లేకపోతే మేడమ్, అమ్మగారు, అంటూ ఏదో సర్వనామం వాడుతున్నాను. ఒకరికైనా ఈ సందేహం వచ్చింది కనక ముందు ముందు వ్రాసే కథల్లో ఏమి చేయాలి అన్నది నేను ఆలోచించుకోవాలి. (చిరునవ్వు).

2. చాగంటి కృష్ణకుమారి వెలిబుచ్చిన సందేహం – అన్ని హేళనలు అంతకాలం భరించిన సత్యానికి అంత కోపం వచ్చింది అని.

రాజేష్ యాళ్ల సమాధానం – తనని అన్నప్పుడు ఊరుకున్నా తనవాళ్లని (కాబోయే భార్య, పుట్టబోయే పిల్లలు) అంటే భరించలేకపోయేడు అని. మంచి అవగాహన.

మరోలా కూడా అనుకోవచ్చు. ఎంతటి మెతకవాడైనా, ఎంతకాలం భరించినా, ఏదో ఒకనాటికి తిరగబడతాడు అదేపనిగా లాగుతుంటే తాడు తెగినట్టు. ఇది మానవనైజం. పైగా, కథ ముగించడానికి మలుపు కావాలి కదా. కనకరాజు వెక్కిరిస్తూనే ఉన్నాడు, సత్యం భరిస్తూనే ఉన్నాడు అంటూ ఎంతసేపు వ్రాయగలం?

కథ నాగజ్యోతిగారి స్వరంలో కథ వినడానికి, మొత్తం చర్చ పూర్తిగా వినడానికి విడియో చూడండి.

లింకు చివరలో ఇచ్చేను.

నాగజ్యోతి రమణగారి వ్యాఖ్య సారాంశం ఇక్కడ పంచుకుంటున్నాను.

————-

మాలతి గారి “నేను” కథలో కథానాయకుడు సత్యం భౌతికంగా కాకపోయినా మానసికంగా అందమైనవాడు. ఎన్నో రోజులనుండీ తనను మాటలతో తూట్లు పొడిచే కనకరాజుని అందుకే తిరిగి మాటలతో గాయపరచకుండా ఒక చిన్న దెబ్బ వేస్తాడు. కోపాన్నీ తట్టుకోలేని క్షణంలో. అయితే ఇక్కడ న్యాయనిర్ణయానికి సాక్ష్యం అవసరం. వారిద్దరి మధ్యా జరిగిన సంఘటనకు, సంఘర్షణకూ ప్రత్యక్ష సాక్షి వారి సెక్షన్ హెడ్. కాబట్టి ఆవిడనే వారి ఆఫీసర్ గారు జరిగిన సంఘటనపై సాక్ష్యం అడుగుతారు. ఆవిడ ఎవ్వబోయే రిపోర్ట్ (సాక్ష్యం) కూడా ఆవిడ మానసిక పరిణితినీ, సత్యాన్నీ నిరూపిస్తుంది ఇక్కడ కొట్టడమనేది నేరం అవునా కాదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే కొట్టడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో ఆవిడ బలంగా వినిపించగలరు. ఒకరిని హేళన చేసినప్పుడు తమవరకూ తాము క్షమించగలిగినా, తమద్వారా రాబోయే తరం వారిని కూదా హేళన చేయబోవటం ఎవరూ జీర్ణించుకోలేనిది , అందుకే ఎప్పుడూ ఓర్పుగా ఉండే సత్యానికి ఆవేశం వచ్చింది అని నాకు అనిపించింది. మాలతి గారి కథలకు ఇంకా ప్రాచుర్యం రావలసిన అవసరం చాలా ఉంది. సున్నితమైన అంశాలను చక్కని కథలుగా, నేర్పుగా మలచటం మాలతి గారి ప్రత్యేకత.

“వరమాల” పేరుతో మరొక శ్రోత వ్యాఖ్య (నాగజ్యోతి రమణ సుసర్లగారిద్వారా నాకు పంపించినది) కూడా ఇక్కడ పంచుకుంటున్నాను.

మూడో కథ శ్రీమతి సుసర్ల నాగజ్యోతి గారి సమర్పణ నేను. రచయిత శ్రీమతి నిడదవోలు మాలతి గారు.ఈ కథ నాగ జ్యోతి గారు చదివారు అనే కన్నా ఏక పాత్రాభినయం చేశారు అనడం సబబు గా ఉంటుంది. తన వాక్చాతుర్యంతో, అపారమైన ప్రతిభతో ఆ కథకి మరింత వన్నె తెచ్చారు.ఈ కథలో రచయిత్రి గారు రెండు పార్శ్వాలను స్పృశించారు అనిపించింది. మొదటి పార్శ్వంగా ఎవరిని తప్పు కోమంటారు నన్నా నా ఆత్మనా అని అడిగిన చండాలునికి దండం పెట్టి మనీషా పంచకం చేసిన శ్రీ ఆది శంకరుల వారు గుర్తుకి వచ్చారు . అంతటి కారణ జన్ములే బాహ్య సౌందర్యం బాహ్య విషయానికి  ప్రభావితులై ఎంతలా మానవ ప్రపంచం ప్రభావితమవుతుంది చూపించినపుడు కథలోని సాధారణ మనిషి పాత్రలు అలా శారీరక లోపాలను ఎత్తి చెప్పడంలో, చూపడంలో అతిశయోక్తి ఏముంది?   నాటి శంకరుల మనీషా పంచకం ఆ ఆత్మ పరిశీలన లోంచి పుట్టిన పంచ రత్నం అయితే ఈ కథలో తాను ఇవ్వ బోయే నివేదిక నేను అందంగా లేనా? అని అడిగిన ప్రశ్న లోంచి పుట్టిన ఆధునిక మనీషా పంచకం అవుతుంది. ఇంక రెండో పార్శ్వం ‘ఱంపపు కోతల్ కోసి నదిలే గాయంబు కాకుండినన్’ అన్నది మాట పైన పెద్దల మాట. పరుషమైన మాట ఎంతటి పెద్ద గాయం చేస్తుంది ఏ విధంగా విచక్షణని చంపి మనిషిలో కోపాన్ని బాధని అన్ని విధములైన న్యూనతలని కలుగ చేస్తుంది తెలియ చేసిన పార్శ్వం. రచయిత గారు ‘నేను’ అని పేరు పెట్టడంలో నే ఆ కథకి గొప్పతనం వచ్చేసింది. అందరూ ఆనందంగా వినేయండి. మీకు ఆ కథతో పాటు పాల్గొన్న నలుగురూ చేసిన విశ్లేషణ బహుమానంగా దొరుకుతుంది.

——————-

కథాకళ 05-28-2022 నిర్వాహకులు ప్రసాద్ జోస్యులగారికీ, కథ వినిపించిన నాగజ్యోతి సుసర్లగారికీ, వ్యాఖ్యాతలకూ ధన్యవాదాలతో

“నేను” కథ లింకు

కథాకళ విడి.యో లింకు ఇక్కడ. గమనిక – నేను కథ ప్రస్తావన, కథనం 1.21.40 దగ్గర ప్రారంభమవుతుంది.

బాలతూలిక Facebookలో

Facebook లో బాలతూలిక గ్రూపు ప్రారంభించేను. ఇక్కడ బాలబాలికలే రచయితలు. పిల్లలకోసం పెద్దలు రాసే కథలకోసం కాదు ఈ గ్రూపు.

ఇది కేవలం తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన పిల్లలు తమ రచనలను ప్రచురించుకోడానికి అవకాశం ఇస్తుంది ఈ గ్రూపు. ఫేస్బుక్ లో పిల్లలకి ఖాతా ఉండదు కనక ఖాతా ఉన్న పెద్దలు, ఆ బాల రచయితల పేర్లతో పంపవచ్చు. అలాగే ప్రచురింపబడతాయి.

తెలుగు అక్షరాలు రాయలేని పిల్లలు ఇంగ్లీషు లిపి వాడవచ్చు కానీ తెలుగు ఉచ్చారణ సరిగా ఉండాలి.

రచయితలకు సూచనలు –

  1. స్వయంగా మీకు తోచిన కథలు, కవితలు రాయండి.
  2. విన్నవి, కానీ చదివినవి కానీ కావచ్చు. ఇలా అయితే, ఎవరిదగ్గర విన్నారో చెప్పాలి. మరొకరు రాసినకథ అయితే, ఆ కథ మీ మాటల్లో తిరిగి చెప్పడానికి అనుమతి తీసుకుని, మాకు పంపాలి.
  3. పిల్లలపేరుమీద పెద్దలు వ్రాయవద్దు.
  4. రచన తెలుగుమాటలు మాకు ముఖ్యం. వీలయినంతవరకూ తెలుగు మాటలే వాడాలి. స్కూలు, బోర్జు, ఐఫోను వంటి ఇంగ్లీషు మాటలు వాడవచ్చు కానీ మార్నింగు, మండే, ఫోరో క్లాక్ వంటి మాటలు మాకు బాగుండవు. వాటికి బదులు తెలుగు మాటలు కొంచెం ఆలోచించి రాయండి.

ఫేస్బుక్కులో బాలతూలిక లింకు –

https://www.facebook.com/groups/balathulika

జనవరి 12, 2022

స్త్రీవిద్యమీద వీరేశలింగంగారి అభిప్రాయాలు

ఇంతకుముందు వీరేశలింగంగారు స్త్రీలకి విద్య అవుసరం అని చెప్తూ కారణాలు, చదువు లేకపోతే వాళ్లు ఒకరినొకరు తిట్టుకుంటూ, దెబ్బలాడుకుంటూ కాలక్షేపం చేస్తారనీ, అంచేత వాళ్లకి చదువు అవుసరమనీ.

వికీసోర్స్ లో లో వీరేశలింగంగారు స్త్రీవిద్యమీద రాసిన పద్యాలు కనిపించేయి. కానీ నాకు అర్థం కాలేదు. మీరెవరైనా ఆయన అభిప్రాయం ఏమిటో చెప్పగలరా? ప్రతిపదార్థం అక్కర్లేదు. సుమారుగా ఆయన అభిప్రాయం ఏమిటో చెప్తే కృతజ్ఞురాలిని.

లింకు ఇక్కడ

పైన ఇచ్చిన లింకు కాపీ చేసినవారి పొరపాటు అని, రహ్మానుద్దీన్ షేక్ గారు మూలపాఠం దారి చూపించేరు. లింకు ఇక్కడ చూడండి.

పాఠకులసౌకర్యార్థం మూలపాఠం ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను.

వికీసోర్స్ వారికి, రహ్మానుద్దీన్ షేక్ గారికీ ధన్యవాదాలు.

  • నిడదవోలు మాలతి
  • జనవరి 5, 2022

స్త్రీవాదముద్ర నాకు తగదు

ఈవిషయం ఇతరటపాలలో అక్కడక్కడ నామమాత్రంగా ప్రస్తావించేను. ఇప్పుడు స్త్రీవాదరచయిత్రి అన్న ముద్ర నేను అంగీకరించను అని నిర్ద్వందంగా విశదం చేయాలని నిశ్చయించుకున్నాను. ఈ టపాలో కొంత పునరుక్తి ఉండొచ్చు.

ప్రధానంగా నాకు labels సమ్మతం కాదు. నేను ఒక వ్యక్తిని. ఒక వ్యక్తిగానే నా అస్తిత్వం అన్నది ఒక కారణం. రెండోది  labels వ్యక్తిని, అభిప్రాయాలనీ, రచనలనీ ఒక చట్రానికి పరిమితం చేసేస్తాయి. ఆ పరిమితులమూలంగా కొన్ని కోణాలు కనిపించకుండా పోతాయి. ముఖ్యంగా కథల్లో ఒక సందేశాన్నో సిద్ధాంతాన్నో ఆవిష్కరించినప్పుడు, ఆ కథలో ఇతర కథాలక్షణాలు లేదా అంగాలు అంటే భాష, నడక, ఊపు, పాత్రపోషణ వంటి అంశాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అది రచయితా, పాఠకులూ కూడా చేస్తారు. అంటే కథ కాక ఒక సిద్ధాంతాన్ని ఆవిష్కరించే రచన అయిపోతుంది. అటువంటి రచనలని నేను కథ అనలేను. ఎవరో ఓ దానయ్య ఉన్నాడనుకోండి అంటూ పేర్లు పెట్టి తమ సిద్దాంతాలని ప్రచారం చేసే సాధనగా ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. అసలు, ఈరోజుల్లో సాహిత్యచర్చలన్నీ కథలో ఇతివృత్తానికే పరిమితమయిపోతున్నాయి. రచయిత సృజనాత్మకతకి ఆదరణ కనిపించడంలేదు.

స్త్రీవాదం, అస్తిత్వవాదం, దళితవాదం ఇవన్నీ రాజకీయాలకి సంబంధించినవి. నేను చూసినంతవరకూ ఈ స్త్రీవాదం label ఈనాడు అన్ని సాంఘిక కార్యకలాపాలలాగే చర్చలకీ, వాగ్వివాదాలకీ ఉపయోగపడుతోంది. అన్ని రంగాలలోలాగే సమాజంలో పేరుప్రతిష్ఠలూ, పురస్కారాలూ సంపాదించుకోడం సుగమం అవుతోంది వీటివల్ల. ఈనాడు బహుమతులు, పురస్కారాలూ, తెలుగుకథ, 20వ శాతబ్దపు తెలుగు రచయిత్రులు వంటి సంకలనాలు చూసినా ఇదే కనిపిస్తుంది. కథని కథగా అన్ని కోణాలు సమగ్రంగా పరిశీలించి, ఇది మంచికథ అని నిర్ణయించడం ఎక్కడైనా ఉంటే నాకు కనిపించలేదు.

నేను సమాజంలో ప్రముఖంగా తిరుగుతున్నదాన్ని కాను. నేను కథలూ కవితలూ స్త్రీవాదాన్ని సమర్థించడానికి గానీ  ప్రోత్సహించడానికి గానీ రాయలేదు.  

నేను వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తాను. ప్రతి వ్యక్తీ విడిగా ఒకే ఒక వ్యక్తి. ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. నాకథలూ కవితలూ ఒక వ్యక్తి కథే కానీ స్త్రీవాదంలో ఒక మచ్చుగా కాదు. నేను మనస్తత్త్వాలు చిత్రించడానికి ప్రయత్నిస్తాను. మనిషిని మనిషిగా గుర్తించడం ఒక నైతిక విలువ. అదే నాకథలకి మూలం. నాకథల్లో స్త్రీపాత్రలని వ్యక్తిత్వంగల మనుషులుగా చిత్రిస్తాను. వాళ్లు పడుతున్న బాధలని కాక, వాటిని ఎదుర్కొని తమ వ్యక్తిత్వాలని నిలుపుకున్నవారుగానే చూపడానికి ప్రయత్నిస్తాను. స్త్రీవాదరచనలకీ నారచనలకీ ఇది ప్రధాన వ్యత్యాసం.

నవ్వరాదులో కమలిని, జీర్ణతృణంలో కనకవల్లి, చిరుచక్రంలో సింహాచలం, నిజనికీ ఫెమినిజానికీ మధ్యలో సీత – వీళ్లందరూ నిజజీవితాల్లోంచి వచ్చిన మనుషులు. జీవితపు విలువల్ని అర్థం చేసుకుని తమ వ్యక్తిత్వాలని నిలబెట్టుకున్నవారు. నా పాత్రలంటే నాకు గౌరవమే కాని జాలి కాదు. పాఠకులు కూడా అలాగే గౌరవించాలని ఆశిస్తాను.

 నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథ ఆధారంగా నన్ను స్త్రీవాదరచయిత్రి అంటున్నారు. నిజానికి ఇతివృత్యం దృష్ట్యా ఒక సామాజికసమస్యని తీసుకు రాసిన కథ మంచుదెబ్బ 1964లో రాసేను. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎవరూ ఆ కథగురించి ప్రస్తావించరు. అలా కేవలం ఒక అంశం లేదా కోణం తీసుకుని ఈ వాదాలు అంటగట్టాలంటే, విషప్పురుగు, చిరుచక్రం లాటి కథలు దళితకథలు అనుకోవచ్చు. గుడ్డిగవ్వలో ప్రధానపాత్ర ముత్యంని ఆడపిల్లగా ఆవిష్కరిస్తే అది కూడా స్త్రీవాదకథగానే చెల్లుతుంది. నిజానికి అలాటి భావం కలిగించకూడదనే, ముత్యాన్ని అబ్బాయిగా రాసేను. నేను కథలు మొదలు పెట్టిన రోజుల్లో ఇలాటి సందేహం నాకు ఉండేది కాదు.

 నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథ నేను స్త్రీవాదకథగా రాయలేదు. స్త్రీవాదంపేరున స్వప్రయోజనాలకోసం ఒకరినొకరు వాడుకునేవిధానం ఎత్తి చూపడం ఒక అంశం, రెండోది కొత్తగా అమెరికా వచ్చిన తెలుగువారికి మరొకసంస్కృతిలో ఇమడలేక పడే ఈతిబాధలు. అది ఆడవారికి మాత్రమే కాదు మగవారికి కూడా ఉంటాయని స్పష్టంగానే కథలో ఉంది.

మరెందుకు ఆకథ ఇంత భారీఎత్తు చర్చలకి గురైంది అంటే నాకు తోచిన సమాధానం ఇది – కథని కథగా చదవకుండా తమకి పరిచయం ఉన్న వ్యక్తులని ఆ కథలో పాత్రలుగా గుర్తించి వాదోపవాదాలు చేసుకోడానికి పనికొచ్చింది కనక అని. నేను రాసిన ఇతరకథలలో బాధలకు గురైన స్త్రీలున్నా ఈ విమర్శకులకళ్ళకి ఆనలేదు. కథాకథనవిధానం దృష్టిలో పెట్టుకుని ఆకథలో పాత్రలు, భాష, శిల్పంవంటి అంశాలు విశ్లేషించినవారు లేరు. అంతే కాదు. ఈ చర్చలు చేస్తున్నవారందరూ  స్త్రీవాదులే. వారు మాత్రమే నాకథలో కొన్ని సంఘటనలు మాత్రం తీసుకుని గాసిప్ కాలంలా వాడుకున్నారు. ఇంత ఖ్యాతి గడించిన ఈ కథకి ఒక్క బహుమతి కూడా రాలేదు.

ఇలా పాత్రలని నిజజీవితాలలో మనుషులుగా గుర్తించని అనేకమంది పాఠకులకి ఈ కథ ఏమీ ప్రత్యేకంగా తోచలేదు. ఆమాట నాతోనే అన్నవారున్నారు. అందుకే నన్ను స్త్రీవాదరచయిత్రి అనడం నాకు సమ్మతం కాదు అంటున్నాను. ఒక్క తరంగంతో వెల్లువ కానట్టే ఒక్క కథతో ఎవరూ ఏదో ఒక “వాదులు” అయిపోరు.

నాకథలు చదివే పాఠకులలాగే నా పాత్రలు కూడా అనేక నేపథ్యాలలోంచి వచ్చినవి. ప్రతి పాత్రా ఒక కల్పిత వ్యక్తి. పాఠకులు తమ తమ పరిస్థితులు, అనుభవాలు, ఆలోచనలనుబట్టి తమని ఆకట్టుకున్న అంశాలు స్వీకరిస్తారు. నాకు నేనై, రచయితగా ఎవరికీ సలహాలు చెప్పను, సందేశాలు ఇవ్వను. అలా చెప్పడం అంటే “నీబతుకుగురించి నీకంటే నాకు ఎక్కువ తెలుసు, నువ్విలా ఉండాలి, ఇలా చెయ్యాలి” అని చెప్పడమే. అది వ్యక్తిని వ్యక్తిగా గౌరవించకపోవడమే. ఇది స్త్రీవాదంలో మరో కోణం. ఇది కూడా నాకు సమ్మతం కాదు.

స్థూలంగా చూస్తే అనాదిగా సాహిత్యంలో రెండు శాఖలు కనిపిస్తాయి – జానపద సాహిత్యం, మేధావుల సాహిత్యం.

ఈనాడు జానపదసాహత్యానికి దీటు రాగలసాహిత్యం బ్లాగులలోనూ, ముఖపుస్తకంవంటి అంతర్జాల మాధ్యమాలలోనూ కనిపిస్తోంది. అంటే తమకి తోచింది తోచినట్టు రాసుకుపోతున్నారు. అప్పుడు మౌఖికం, ఇప్పుడు లిఖితం. అంతే కానీ వ్యక్తీకరణలో భేదం లేదు.

పండితులు, మేధావులు రాసే రచనలు, చేసే చర్చలు చదువుకున్నవారిమధ్య జరుగుతున్నాయి. అప్పుడు రాజసభల్లోనూ ఇప్పుడు పత్రికలలోనూ, అంతర్జాలంలోను. వీరే ఆ వాదాలపేరుతో చర్చలు జరిపేవారు కూడాను. సామాజికస్పృహ, సామాజికప్రయోజనం అనో మరోటో పేరు పెట్టి చేసే ఈ చర్చలూ, వాదనలూ మేధావులమధ్యనే ఉంటున్నాయి కానీ లక్షలాది సామాన్యపాఠకులకు చేరనూ చేరవు. చేరినా పట్టించుకోనూ పట్టించుకోరు. వీటికి అంతకంటే ప్రయోజనం ఉంటే నాకు తెలీదు. వీటివల్ల సామాన్యమానవుడు ఎంతవరకూ ప్రయోజనం పొందుతున్నాడు అన్నది నాకు సందేహమే.

వాదనలు వాదనలకే పనికొస్తాయి. ఆచరణలో పనికొస్తాయో లేదో చెప్పలేం. ఈఅంశం కూడా నాకథలో ఉంది – సీత తనసమస్యను ఎవరితో చెప్తే ఎలాటి సలహాలు వస్తాయో ఊహించుకుంటుంది. అలా ఊహించుకోగలగడం చాలా తేలిక. ఎందుకంటే అందరి సలహాలు పడికట్టురాళ్లలా పదిమంది చెప్పేవే అయిఉంటాయి కానీ ఏ ఒక్కరిపరిస్థితి ఏమిటో ఆలోచించి చెప్పేవి అయి ఉండవు.

చివరిమాటగా స్త్రీవాద రచయిత్రులందరూ నాకథలో సీతాపతీ, శోభాకుమారిలాటివారే అనడం లేదని గమనించగలరు. నేను మొదట్లోనే చెప్పేను ప్రతి వ్యక్తీ ఒక వ్యక్తి. మూసలో పోసి తీసిన పంచదారచిలక కాదు. అన్నివాదాల్లోలాగే  స్త్రీవాదంలో సాధారణీకరణం పాలు హెచ్చు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికిరానట్టే ఈ సాధాకరణీకరించిన సూత్రాలు విడిగా ఏ ఒక్కరికీ పనికిరావు అందరి పరిస్థితులూ, శక్తిసామర్థ్యాలూ  ఒకేలా ఉండవు కనక.  

నేను ఈ సాధారణీకరాలకి మించి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగా మాత్రమే దర్శించడానికే ఇష్టపడతాను. ప్రయత్నిస్తాను. నేను స్త్రీవాదమే కాదు ఏవాదానికి కట్టుబడి రచనలు చేయడంలేదు. అందుచేత నన్ను స్త్రీవాదరచయిత్రి అనడం సముచితం కాదు.

స్త్రీవాద కానీ మరొకటి కానీ నాకు ఏ విశేషణాలు ఇష్టమూ లేదు. అవుసరమూ లేదు.

నేను ఉత్త రచయిత్రిని. అంతే.

తా.క. నేను ఇలా చెప్పినంతమాత్రాన పాఠకులు, విమర్శకులు ఈ పేర్లు పెట్టడం మానేస్తారా అని అడగొచ్చు మీరు. మానేస్తారు అనుకునేంత అమాయకత్వం నాకు లేదు కానీ ఇంటర్వ్యూలలో అడుగుతారు కదా మీరు మీరచనలగురించి ఏమనుకుంటున్నారు అని. ఇది ఒకరకంగా అలాటి ఇంటర్వ్యూ కి జవాబు అనుకోండి.

(సెప్టెంబరు 1, 2021)