నా ఆలోచనలు కొన్ని- 3

  1. అమ్రికా టుర్మిరికా

కొంతకాలంగా అమెరికాలో పసుపు వాడకంగురించి ప్రబోధిస్తున్నారు. ఇంతకుముందే ఉందేమో నాకు తెలీదు. నేనిప్పుడే గమనించేను. మొదటిసారి మోకాలు నొప్పి అని డాక్టరు దగ్గరికి వెళ్తే, పసుపుగుణం తెలిసింది. ఆ డాక్టరుగారు కొనమన్న  పసుపుమందు మన దేశీ దుకాణాల్లో దొరికే పసుపుకి పదింతలుంది వెల. మనవాళ్లలా ప్లాస్టిక్ సంచులలో కాక నీటైన ప్లాస్టిక్ సీసాలలో అందించడమే అధిక సౌకర్యం. ఇంకా ఏవో పోషకపదార్థాలు కూడా కలుపుతారని కూడా తెలిసింది.

ఇంతకీ అసలు చెప్పదల్చుకున్నకత ఏమిటంటే –

నేనీ ఊరొచ్చి ఏడే్ళ్లయింది. ప్రతిరోజూ ఆ వీధులే తిరుగుతున్నాను. ప్రతిరోజూ నాదారిలో ఒకావిడ కనిపిస్తారు. లాటినో అనుకుంటా.

సాధారణంగా నాకొక టైమంటూ లేదు. 8 నుంచి 11.30లోపున ఎప్పుడు తోస్తే అప్పుడు బయల్దేరుతాను.

ఒక దిక్కంటూ లేదు. వీధిలోకి అడుగెట్టేక, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఎటు తోస్తే అటు వెళ్తాను.

ఏ టైంలో ఎటు వెళ్లినా ఆవిడ ఎదురవడమే విశేషం. ఏవో గ్రహాలు మా కార్యక్రమం నిర్ణయించి మమ్మల్ని నడిపిస్తున్నట్టు. అదీ నాకు వింత.

రెండో వింత సాధారణంగా ఇక్కడ నాలుగుసార్లు చూస్తే, అసలు రెండోసారి అయినా, హలో అంటూ పలకరిస్తారు. కొందరు బాగున్నావా అంటారు. ఇంకా కొందరు ఎక్కడున్నావు, ఏంచేస్తున్నావు లాటి ప్రశ్నలు వేస్తారు.

జుత్తు బాగుందని మెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.

ఈవిడ మాత్రం ఎప్పుడూ పలకరించలేదు. మరీ ఒకే sidewalkమీద ఎదురొస్తే, నేనే వినిపించీ వినిపించకుండా హలో అంటాను.

ఆవిడా అలాగే మందరస్వరంలో ఏదో చిన్నశబ్దం చేసి దాటుకుపోతుంది.

ఇప్పుడు అసలు కథకొస్తాను.

ఆమధ్య, రెండు వారాలయినట్టుంది, ఒకరోజు చేతికర్ర పుచ్చుకు బయల్దేరేను. ఆరోజు ఆవిడతో పాటు మరొకాయన ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు కనిపిస్తారు, ఆవిడలా రోజూ కాదు. కానీ కనిపించినప్పుడు తప్పనిసరిగా నన్ను పలకరిస్తారు.

ఆరోజు కూడా పలకరించి, ఈమధ్య కనిపించడంలేదేం అన్నారు.

కాలునొప్పిమూలంగా అట్టే తిరగడంలేదని చెప్పేను.

ఆ పక్కనున్న ఆవిడ, అదే ఈకథలో ప్రధానపాత్ర, We wish you all the best అంది.

నాకు ఆశ్చర్యం. సరే అని కృతజ్ఞతలు చెప్పి ముందుకి సాగిపోయేను.

మళ్ళీ నిన్న కనిపించిందావిడ.

నన్ను దాటుకు పోబోతూ, చటుక్కున వెనుదిరిగి ఎలా ఉన్నావు అని అడిగింది.

నేను రవంత విస్మయము చెందినదానినై, బాగానే ఉన్నాను అన్నాను.

అప్పుడండీ ఆవిడ మొదలుపెట్టి ఆగకుండా పది నిముషాలు మాటాడింది.

తనకి arthritis అనీ, రోజూ నడుస్తాననీ, నడవడం మంచిదనీ, ఎక్కువ చేయకూడదు కానీ ….

ఇలా కొంతసేపయేక, ముక్తాయింపుగా, ‘’పసుపు. పసుపు వాడాలి. ఒంటికి చాలా మంచిది. అలాగే అల్లం కూడా” అని సలహా చెప్పింది.

అంచేత నేనిప్పుడు పసుపు వాడకం హెచ్చించేను. ఉడుకుతున్న బియ్యంలో కూడా అరచెంచాడు పసుపు వేసేస్తున్నాను చేదా ఏమిటి, పులిహోరలో వేసుకోడంలేదా అని నాకు నేనే నచ్చచెప్పుకుని.

ఆలోచిస్తే ఆవిడ నన్ను ఇంతకుముందు పలకరించకపోవడానికీ, నాకు నొప్పి అని తెలిసేక, ఓహో నాలాటి మనిషే అని గుర్తించింది అని స్పష్టమయింది.

ఈ మనిషి కూడా నాలాగే బాధ పడుతోంది అనుకుంటే ఆ ఆనందమే వేరు కదా. ఏ అరమరికలూ లేకుండా మాటాడడానికీ కారణాలు తెలుసొచ్చేయి నాకు.

అదీ కథ.

(నవంబరు 18, 2020)

000

  • గూడు మారినవేళ

నట్టిల్లు మూడోతరగతి బోగీముందు railway platformలా కనిపిస్తుంది

ప్రిజ్ ఖాళీ చేస్తూ లాభనష్టాలు బేరీజు వేసుకు చూసుకుంటుంటే

ఎన్నో జీవనసూత్రాలు.

ఎంతో శ్రమించి పోగు చేసిన అట్టపెట్టలఅవుసరం రేపటితో సరి.

పారేయలేను దాచలేను

పారేయబోతే, మళ్ళీ అవుసరమవుతాయేమో, ఇంకెవరికైనా పనికొస్తాయేమో

దాచబోతే, చచ్చు అట్టపెట్టెలకా ఇంత ఆరాటం అన్న చులకన

మారే రోజున శ్రమ తగ్గడానికి చేసి ప్రిజ్ లో పెట్టుకున్న ఖాద్యపదార్థాలు

ఖాళీ చేస్తుంటే, కొత్తింట్లో అడుగెట్టగానే తినడానికేమీ ఉండదేమోనన్న దిగులు

ఊళ్ళో ఉన్న కూతురు తెచ్చిస్తానన్న భరోసాతో తీరిపోతుంది.

ఇవాళ గిన్నెలూ తప్పేలాలూ, పుస్తకాలూ, బట్టలూ, నానారకాలూ కుక్కి

పకడ్బందీగా మూటలు కట్టిన అట్టపెట్టెలు రేపు విప్పుతాను ఎంతో ఓపిగ్గా.

ఏ వస్తువు ఎక్కడ అమరుతుందో పరీక్షిగా చూసుకుంటాను.

అంతా అయిపోతుంది.

తుఫాను కురిసి వెలిసిపోతుంది.

దినచర్య ఎప్పట్లాగే యథావిధి అయిపోతుంది,

ఈ గదికి బదులు ఆ గది.

ఈ కిటికీలో దృశ్యానికి బదులు ఆ కిటికీలో దృశ్యం

గూడు మారేనోచ్ అంటూ మహోత్సాహంతో అరవాలన్న కోరిక

ఏ గూడయితేనేమి గుండె అలాగే కొట్టుకుంటుందన్న ఆలోచనతో హతమవుతుంది.

జీవనక్రమం సాధారణస్థితికి జారుకుంటుంది.

నవంబరు 27, 2020

000

  • నన్ను చదువుకుంటున్నాను.

జీవితం పంతులమ్మ కాదు

జీవితం వల్లించలేదు కాపీపుస్తకంలోని సుభాషితాలు.

ఋషిలూ తాత్వికులూ బోధించిన పరమసత్యాలు తలకెక్కలేదు.

నేనిరుక్కున్న సంఘటనలు చదువుకుని తెలుసుకున్నాను

నన్ను నేను చదువుకున్నాను.

అందుకేనేమో నాతలపులు నాకు మాత్రమే అర్థమవుతాయి.

000

  • శతాయుష్షు, ఆ పైన మరో 5!

నిన్న అంతర్జాలంలో 105 ఏళ్ళు అని కనిపించింది. అదే నిజమైతే ఏం జరుగుతుందో అని చూసుకుంటే ఇదీ తేలింది–

అంటే మరో 22ఏళ్ళమాట.

అంటే అప్పటికి

నేను రోజుకి ఒక టపా చొప్పున 8,280 టపాలు కనీసం రాయాలి Facebookలో. అసలిప్పటికే రాయడానికేం తోచక తన్నుకుంటున్నాను.

పైగా ఇవాళా రేపూ పుట్టినపిల్లలు కొత్తపాఠకులుగా నాపేజికి వస్తారు. వాళ్ళకి నచ్చినట్టు రాయాలి.

ఇంకా

ఇప్పటి నావస్త్రాలన్నీ పాతబడిపోయి మళ్ళీ కొత్తస్టైలుగా ప్రచారంలోకి వస్తాయి.

ప్రజలు రాజరికాన్ని నిష్పూచీగా అంగీకరిస్తారు. అప్పుడు రాజూ, రాణీ అనరు. ప్రధానమంత్రి, అధ్యక్షుడూలాటి పేర్లయితే ఉంటాయి కానీ వాళ్ళు నెఱిపేది రాజరికమే.

కులాలు పూర్తిగా అంతరిస్తాయి.

వాటిస్థానంలో మూడు తరగతులు– ఉత్తమ, మధ్యమ, అధమతరగతులు అంగీకరింపబడతాయి. వాటికి ఈమధ్యనే శంకుస్థాపనము బహు ఆడంబరమూగా జరిగింది.

తెలివితేటలంటే యంత్రాలనీ అధమతరగతి జనాలనీ వాడుకోగలతెలివి అన్న నిర్వచనం నిర్ధారణ అవుతుంది.

పిల్లలకి చదువులు పాఠశాలలనబడే భవనాల్లో కాక వీధుల్లోనూ బజారుల్లోనూ నేర్పబడతాయి.

కర్ణాటకసంగీతం అంటే హిప్పీగెంతులుగా ప్రజలు ఆమోదిస్తారు.

తెలుగంటే ఇంగ్లీషే అనీ, ఏదో ఒక మారుమూల ఇంగ్లీషుకి తెలుగు అన్నపదం రూపాంతరంగా వాడుతున్నారనీ అందరూ ఒప్పుకుంటారు. తెలుగు వేరేభాష కాదని ప్రభుత్వాలు ఆజ్ఞలు జారీ చేస్తాయి.

000

ఉలిక్కిపడ్డాను ఈ ఆలోచనలు ఎంత భయంకరం. నాఆయుర్దాయం పునః పరిశీలించుకోవాలి. లేదా లోకం మార్చేసే పద్ధతి కనిపెట్టాలి. 105 మాత్రం భయంకరం!

000

(నవంబరు 29, 2020)

నాఆలోచనలు కొన్ని 2

ఇంతకుమునుపు ఒకసారి పెట్టినట్టే, ఫేస్బుక్కులో పెట్టిన కొన్ని ఆలోచనలు ఇక్కడ మళ్ళీ పోస్టు చేస్తున్నాను.

000

రాయడం నిత్యకర్మ

రచయిత నిర్విరామంగా రాస్తూనే ఉంటాడు

మనసులోనో కాయితమ్మీదో

మనసులో మనసుతడికోసం

కాయితమ్మీద స్పందించేపాఠకుడికోసం.

000

నీమాట

నువ్వాడిన ప్రతిమాట వెనకా చెప్పనికథ ఒకటుంటుంది.
అదేమిటో నాకు తెలీక జవాబు చెప్పలేను నేను.
గుండె చిక్కబట్టుకు చెప్పినా నప్పదు.
నప్పకున్న మాట చెప్ననేల అని ఊరుకుంటాను

000

భ్రమ

అంతర్జాలంలో మనగురించిన భ్రమలు సృష్టించడం ఎంత తేలికో కదా

ఒక పుస్తకం ప్రస్తావిస్తే చాలు, అబ్భ పుస్తకాలగురించి ఎంత తెలుసో అనిపించడానికి

ఒక రచయితగురించి రాస్తే గొప్ప విమర్శకురాలు

ఒకకథ తమకి నచ్చితే, ఆహో మహా రచయిత్రి

కవిత అనిపించుకోగల నాలుగు వాక్యాలు రాస్తే కవయిత్రి

ఒక మంచి ఫొటో పోస్టు చేస్తే గొప్ప ఫొటోగ్రాఫరు

ఆ తరవాత
అనేకులు ఆ ఒక్కఫొస్టుకి పొంగిపోయి, రిక్వెస్టులు పంపుతారు.
అట్టేకాలం పట్టదు

మనప్రతిభ ఆ ఒక్కపోస్టుతోనే
ఆదే ఆదీ అంతమూ అని తెలుసుకోడానకి.

000

మిత్రమా,

ఇష్టమైనంతకాలం నువ్వు నాకు చేసిన మేలే తలుచుకుంటూ వచ్చేను.

కష్టమయేక, నీవల్ల నాకు కలిగిన నొప్పి మాత్రమే నిరంతరం మనసులో మెదుల్తోంది.

000

సందేశం

కొన్నివేలమందికి ఇచ్చిన సందేశం
ఎంతమందినో ఒప్పించేనన్న సంతుష్టికన్నా

ఏ ఒక్కరినో నోప్పించేనన్న చింతనే
హెచ్చు సౌశీల్యునికి

000

అయ్యా, తమకొక నమస్కారం

ఏజాతి మానవుడికైనా అర్థమయే సౌంజ్ఞ నమస్కారం.

నిన్న ఒకచోట రోడ్డు రిపేరు నాలుగువీధులకూడలిలో ఇరుక్కున్నాను. తారువాసన, పొగలు చిమ్ముతూ నాదారికి అడ్డంగా ముందుకీ వెనక్కీ ఆసులో కండెలా తిరుగుతున్న మెషినరీ.
నాకు తలపుకొచ్చిన దేవతలనందర్నీ తలుచుకుంటూ కూర్చున్నాను స్టీరింగువీలుని పిడికిళ్ళలో బిగించి.

మూడుసార్లు పచ్చదీపం వెలిగినా నన్ను వెళ్ళనివ్వడు stopsign పుచ్చుకు నిలబడ్డ పనివాడు. మిగతా మూడువైపుల కార్లు సాగిపోతూనే ఉన్నాయి వీలయినప్పుడల్లా..

నాలుగోసారి పచ్చదీవం వెలగ్గానే నాకు అడ్డుగా నిలుచున్నవాడికి నమస్కారం చేసి, వెళ్ళనియ్యి తండ్రీ అన్న్ను మొహం పెట్టేను..

సరే, పొమ్మన్నాడు, ఐరావతంలాటి road rollerని  ఆపి.

000

(ఏప్రిల్ 30, 2019)

ఏజాతి మానవుడికైనా అర్థమయే సౌంజ్ఞ నమస్కారం.

నిన్న ఒకచోట రోడ్డు రిపేరు నాలుగువీధులకూడలిలో ఇరుక్కున్నాను. తారువాసన, పొగలు చిమ్ముతూ నాదారికి అడ్డంగా ముందుకీ వెనక్కీ ఆసులో కండెలా తిరుగుతున్న మెషినరీ.
నాకు తలపుకొచ్చిన దేవతలనందర్నీ తలుచుకుంటూ కూర్చున్నాను స్టీరింగువీలుని పిడికిళ్ళలో బిగించి.

మూడుసార్లు పచ్చదీపం వెలిగినా నన్ను వెళ్ళనివ్వడు stopsign పుచ్చుకు నిలబడ్డ పనివాడు. మిగతా మూడువైపుల కార్లు సాగిపోతూనే ఉన్నాయి వీలయినప్పుడల్లా..

నాలుగోసారి పచ్చదీవం వెలగ్గానే నాకు అడ్డుగా నిలుచున్నవాడికి నమస్కారం చేసి, వెళ్ళనియ్యి తండ్రీ అన్న్ను మొహం పెట్టేను..

సరే, పొమ్మన్నాడు, ఐరావతంలాటి road rollerని  ఆపి.

000

(ఏప్రిల్ 30, 2019)

నాఆలోచనలు కొన్ని

నాకు సకృతుగా తోచిన ఆలోచనలు, ఫేస్బుక్కులో ప్రచురించినవి, పాఠకులఆదరణ పొందినవి Continue reading “నాఆలోచనలు కొన్ని”