ఫేస్బుక్కులో పోస్టులు 4 (కవితలు)

నన్ను నన్నుగా నిలబెట్టినవి!

గగనసీమలకెగసిన మహావృక్షం

దిగంతాలకు పరుచుకున్న మహార్ణవం

హృదయవైశాల్యాన్ని చాటుతున్న ఆకాశం

భూమిని కరిచిపట్టుకున్న పర్వతశ్రేణి

నాఅస్తిత్వానికి గురుతులయి శోభించేయి

ఉన్నచోట ఉన్నట్టు

 నన్ను నన్నుగా నిలబెట్టేయి.

(ఆగస్టు 5, 2021)

తా.క. మామూలుగా మన అల్పత్వాన్ని గుర్తు చేస్తాయి అనుకోవచ్చు. కానీ నాకు అలా అనిపించదు. వీటిని చూసినప్పుడు మరింత ధైర్యాన్ని, ఆత్మనిగ్రహాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని చెప్పడానికి ప్రయత్నించేను.

000

దుఃఖం

 నన్ను లోలోపలి చీకటిగుహలోకి లాక్కుపోతుంది

నాచూపుని గుండెలోతుల్లోకి మళ్ళిస్తుంది.

శ్రేయోభిలాషుల ఓదార్పుల్లా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది

కుండపోతగా కురిసిన జడివానై, వెల్లువై 

మూలమూలలా నక్కిన కల్మషాన్ని ప్రక్షాళిస్తుంది.

మబ్బు విడినఎండలా తేజోవంతమవుతుంది.

Phoenixలా బుగ్గిలోనించి ఉత్థానిస్తుంది.

విరిగిపడ్డ ఉత్తుంగతరంగంలా మళ్లీ పైకి లేస్తుంది.

దుఃఖానికి మించిన మందు లేదు మనోవికారాల ప్రక్షాళనకి.  

000

(ఆగస్ట్, 2021)

000

నాకలం

మనసుచీకటికోణాల్లో దాగిన “నేను” నాకలం.

ఎదురుపడి చెప్పలేని భావాలు ఒలికిస్తుంది 

నోట పలుకని వేదన రూపిస్తుంది.

ఆప్తమిత్రమై అనునయిస్తుంది.

ఆతెలిమబ్బులచాటున ఎనలేని మర్మాలు

ఆ మొగ్గలు రేపటి రోజాలు

రాత్రినుంచి పగటికీ, పగటినుంచి రాత్రికీ

నిరంతరప్రయాణం.

(ఆగస్ట్ 6, 2021)

000

(ఆగస్ట్ 20, 2021)

ఫేస్బుక్కులో పోస్టులు 3

చర్చముఖం మారిపోయింది

అవునన్నది కాదనడమే నీతి

ఆకతాయిపిల్లాడిలా అరుపులు, కారుకూతలే నిబంధనలు

 కుతర్కమే తర్కం

మేధోపేత చర్చల్లేవు, వేటకుక్కల్లా కాట్లాడుకోలే తప్ప.

(జూలై 30, 2021)

000

తిరస్కారమే యథార్థవాది.

నువ్వు నన్ను పొగిడినప్పుడు

    అవును కాబోలు అనుకుని మురిసిపోయేను.

తిట్టిపోసినప్పుడు

పోనీలే మరేదో బాధ అనుకుని సమాధానపడ్డాను.

చూసీ చూడనట్టు నాపక్కనించి పోతూన్నప్పుడు మాత్రం

తెలిసింది నీదృష్టిలో నేనేమిటో!

నా అస్తిత్వానికి విలువ కట్టిన షరాబు నీతిరస్కారం.

(జులై 30, 2021)

000

లోకంలో అభిప్రాయాలు ఎన్నో లేవు.

చెప్పే వారినిబట్టీ, తీరునుబట్టీ

దూషణ భూషణ తిరస్కారాలు.

(జులై 22, 2021)

000

ప్రతి పత్రికకీ – అచ్చుపత్రికైనా జాలపత్రికైనా – కొందరు రచయితలూ, పాఠకులూ, వ్యాఖ్యాతలూ సుస్థిరంగా ఉంటారు ఆకాశవాణివారి నిలయవిద్వాంసులలాగే.

(జులై 19, 2021)

000

ముఖపుస్తకము

ముఖపుస్తకం బొమ్మలపుస్తకమై

ఓనమాలరోజులు గుర్తుకు తెస్తోంది.

అ – అమ్మ

ఆ – ఆవు

ఇ – ఇల్లు

ఈ – ఈగ

ము – ముఖపుస్తకము

నా – నాముఖపుస్తకము .

(జులై 19, 2021)

000

సంఘజీవి

సంఘమ్ శరణమ్ గచ్ఛామి

కుతర్కంతో

కువిమర్శలతో

కుళ్ళు భావాలతో

అసంబద్ధపు ప్రలాపాలతో

అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలతో

వికటాట్టహాసాలతో

వినయపూర్వకం కాని అభ్యర్థనలతో

విసిగిపోతున్నవారి వేదనాలాపాలతో

విసిగించే వాచాలురతో

విరాట్ స్వరూపమై విజృంభించిన ఆ సంఘాన్నే ఆశ్రయించేను.

ఆ సంఘంలోనే నా ఉనికీ మనికీ.

ఆ సంఘమే నాకు రోజు వెళ్ళదీస్తున్నది.

ఆ సంఘమే నాకు ఉపశమనం

ఆ సంఘమే నాకు శ్రీరామరక్ష!

(జులై 18, 2021)

000

అహంభావసారూప్యం

ధనంకంటె

అధికారంకంటె

బలమైనది అహం.

ఈనాడు ప్రపంచం సమస్తాన్ని

నడిపిస్తున్న ఏకైక సూత్రం

దీనివల్ల నాకేమిటి లాభం?

స్నేహాలు, ద్వేషాలు,

చేతులు కలపడాలూ

తన్నుకు చావడాలూ అన్నీ

ఏదో ఒక స్వప్రయోజనం ఆశించే.

సాహిత్యంలో భావసారూప్యం సహితం

అహంభావసారూప్యం అయిపోతోందేమో

(జులై 12, 2021)

000

ఫేస్బుక్కులో పోస్టులు 2

చిలక్కొయ్య

నెలలతరబడి అదే ధ్యాస

నీమీద నాకక్ష ఎలా తీర్చుకోవాలో

ఏఏ భాషల్లో చెప్పొచ్చో

ఎన్నివిధాల చెప్పగలనో …

… … …

నిన్న మరొకరిమీద కోపం పుంజుకుంది.

నిన్ను మర్చిపోయేను.

ఇప్పుడర్థమయింది

నువ్వు కేవలం నా కోపభావాలు

తగిలించుకోడానికి పనికొచ్చిన చిలక్కొయ్యవని.

(మే 28, 2021)

స్నేహలక్షణం విలక్షణం.

స్వభావాలనుబట్టి స్నేహం

స్పర్ధలొస్తే

శిష్టులు ఎవరిదారిన వారు పోతారు

దుష్టులు కక్షగట్టి, ఒకరినొకరు సాధించుకుంటారు.

(మే 31, 2021)

000

శీర్షికలు

కథకి పేరు పెట్టడం కూడా కళే.

ఇది కథ కాదు, జరిగినకథ, నిజంగా జరిగిన కథలాటి పేర్లు రచయిత చెప్పదల్చుకున్నదేమిటో చెప్పవు.

శీర్షిక గుంభనగా చెప్పీ చెప్పనట్టు కథలో మూలభావాన్ని అందించాలి.

ఆరుద్ర త్వమేవాహం కృతికి మొదట తెలంగాణా అని పేరు పెట్టేరుట. శ్రీశ్రీ అది చూసి, ఏనుగుబొమ్మ గీసి ఏనుగు అని పేరు పెట్టినట్టుంది, అని చెప్పి పేరు మార్చమన్నారుట.

కథలయినా అంతే. ఏనుగుబొమ్మ దేనికి ప్రతీకో అదీ మీకథలో మీరు ఆవిష్కరించుకున్న భావం.

(జూన్ 19, 2021)

000

వస్తుసంచయం

అందరిళ్లలో ఉన్నాయని కొన్ని

ఎవరింట్లోనూ లేదని కొన్ని

కొని, కొని కొని కొని

ఇల్లు నిండిపోయింది పెరవారి అభిరుచులతో.

నేను నేనుగా నాకేం కావాలో చూసుకునేవేళకి

bankఖాతా ఖాళీ !!

ఇల్లు దివాణం, నేను దివాలా.

(జూన్ 11, 2021)

000

ప్రగతి?

అశోకుడు చెట్లు నాటించెను, బావులు తవ్వించెను

మేం గోతులు తవ్వుకుంటున్నాం.

జయజయజయహో మనం సాధించిన ప్రగతికి.

(జూన్ 10, 2021)

000

శ్రద్ధ

దవడాడుతున్నంతసేపూ మెదడాడదు.

టీవీ చూస్తున్నాను. ఒక్కముక్క తలకెక్కడం లేదు

(జూన్ 10, 2021)

000

.

కుతర్కం

కొత్తబట్టలు కొంటే మర్నాడే చస్తే ఆ ఖర్చు వృథా అని వెఱపు

ఎటు పోబోయినా దారిలో ప్రమాదమయితే ఇంటికెలా వస్తానన్న జడుపు

ఏ చెట్టు కాయ కోసి తింటే ఏ జబ్బొస్తుందో అని బెరుకు

ప్రాణభయం నాకు లేదు, బంధుమిత్రులకి వేదన అన్న పిరికితనం

ఏ పని చేయబోయినా ఏదో ఒకరకమైన భయం ఏపనీ చేయనీయకుండా.

ఆ మనిషికే భీరువు అని పేరు.

000

పిరికితనానికి ఇన్ని పదాలు!!

000

(జులై 17, 2021)

000

ప్రతిపత్రికకీ – అచ్చు అయినా జాలపత్రిక అయినా – కొందరు రచయితలూ, పాఠకులూ, వ్యాఖ్యాతలూ సుస్థిరం, ఆకాశవాణివారి నిలయవిద్వాంసులలాగే.

ఏ వ్యాఖ్యాత ఏ రచనమీద ఏమని వ్యాఖ్యానిస్తారో తేలిగ్గానే ఊహించుకోగలం.

(జులై 18, 2021)

ఫేస్బుక్కులో పోస్టులు 1

ముఖపుస్తకంలో రాసిన కొన్ని పోస్టులు ఇక్కడ దాచుకోవాలనిపించింది.

ఆ కళ్ళే!!

పలకరిస్తాయి, కవ్విస్తాయి, నవ్విస్తాయి 

రారమ్మంటూ మురిపిస్తాయి.

స్నేహరుచులు చిప్పిల్లజేస్తాయి

వెక్కిరిస్తాయి. ఉడికిస్తాయి, ఏడిపిస్తాయి,

ఎన్నెన్నో కతలు చెపుతాయి.

 కలువలతో, పద్మాలతో, మీనాలతో పోలిక

కామాలూ, వామాలూ, విశాలాలు విశేషణాలతో విస్తరణ!

ఆ కళ్లే

ఇంతచిన్నవి, ఇంత లోతు

అంటూ నర్సులచేత నస పెట్టిస్తాయి.

… … జబ్బు, ఈ మందులు

అంటూ వైద్యులచేత ఉపశమనం కలిగిస్తాయి.

ఒకటి సగం ఉపయోగం, రెండోది పూర్తి నిరర్థకం అయినదినాలలో

ఎందరి మెప్పో “ఆ కళ్ళు” అంటూ ఆశ్చర్యార్థకాలతో.

ఇకమీదట ఏమన్నారు అని చూసుకున్నాక

ఎవరన్నారని చూసుకోవాలి నేను.

000

(మే 27, 2021)

000

కనిపించనిరోజులు

కన్ను కనిపించనిరోజులే మేలు.

పుస్తకం చదవలేదన్నబాధ లేదు

అక్షరాలు తప్పులు పడుతున్నాయన్న యావ లేదు.

దుమ్ము దులపాలన్న దృష్టి లేదు.

అన్నంగిన్నెమసి వదల్లేదన్న జ్ఞానం లేదు.

పైగా

ఫొటోలు కెమెరా చూసుకుంటోంది.

వేలకి వేలు పోసి ఎందుకు సర్జరీ చేయించుకున్నాను దేవుడా!!

(జూన్ 3, 2021)

000

తెల్లవారె

నేను కూయకపోతే తెల్లవారదు అనుకుందో కోడి

నాలా ఎవరు కూయగలరు అనుకుంది మరో కోడి

నాకూతకోసం ఎందరు ఎదురు చూస్తున్నారో అనుకుందింకో కోడి ఒకకన్ను సగం మూసి.

నేను కూయనివాళనంటూ మొండికేసింది ఒక కోడి

బద్ధకంగా ఒళ్లు విరుచుకు కళ్ళు తెరిచి అటూ ఇటూ చూస్తూ చిరునవ్వుతో తీరిగ్గా లేచేడు బాలార్కుడు.

000

భ్రమలు

నాచుట్టూ తిరుగుతున్నాను నేను భూదేవి ఆదర్శమై.

రాత్రీ పగలూ కూడితేనే ఒక రోజు

తప్పూ ఒప్పూ తెలిస్తేనే సమతూకం

వెలుగు చూసి చీకటి లేదనుకుంటావు

ఒకకథ చూసి రచయితమీద ఏర్పరుచుకున్న అభిమానం

మరొకకథ చూసేక సమసిపోతే

అది మెప్పు కాదు, నీభ్రమే.

000

పాండిత్యం

పేర్లు పెట్టడమే పాండిత్యం

మొక్కకి కొమ్మలు

కొమ్మకి రెమ్మలు

రెమ్మకో పూవు

పూవుకి దళాలు

దళంలో ఈనెలు

ఈనెలు చీలిస్తే మరేవో ….

ప్రతీ వస్తువుకీ పేర్లు పెడతారు పండితులు నిశితదృష్టితో.

పూవు చూసి అహో అనుకుంటూ మురిసిపోతాను నేను పాండిత్యం కొరవై.

000

చిత్రమా? పదమా?

చిత్రం తక్షణసౌఖ్యం

పదం అక్షరం

బొమ్మ చూసి, మరో బొమ్మకి వెళ్లిపోతాం

మాట చూసి అక్కడే ఆగిపోతాం ఆలోచనలతో.

మాటకున్న పదును, గాంభీర్యమూ బొ్మ్మకి లేదు.

మాట మనసున ముద్ర వేసినట్టు బొమ్మ వేయదు అంటాన్నేను.

మరి నువ్వు బొమ్మలెట్టటం నేదా అంటాది సంద్రాలు

మరి మనసున ఏసిన ముద్దర బొమ్మే కదా అంటాది సంద్రాలు.

హా హా. ఆ తాత్కాలిక సుఖాలకోసమే బొమ్మలెడుతున్నానంటాన్నేను.

మనసున పడిన ముద్దరో అంటే అది యేరంటాను

ఆ యేరు ఎనాగో సెప్పటం నాకు తెలవదు

000

(గమనిక – అంతర్జాలంలో, ముఖపుస్తకంలో వ్యాఖ్యలు జిఐయఫ్ రూపాలలో చూసి.)

000

సంకరబాస

తెల్లగా ఉంటే నల్లపిల్లేనా?

ఎగ్గు ఎగ్గనతగునా!

బోల్డనుకుంటే బోల్డు ఆనందం

కాల్నొప్పంటూ కాల్చేసేడు.

మండే అంటే ఒళ్లు మండె

(వేరువేరు భాషలలో పదాలు గమనించగలరు.)

(జులై 17, 2021)