మహాకవయిత్రి ఆతుకూరి మొల్ల – 2వ భాగం

నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. “మహాకవయిత్రి ఆతుకూరి మొల్ల – 2వ భాగం” ‌చదవడం కొనసాగించండి

మహాకవయిత్రి ఆతుకూరి మొల్ల

“కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. మొల్ల రామాయణంలో అవతారికలో మొల్ల స్వయంగా చెప్పుకున్వవి “మహాకవయిత్రి ఆతుకూరి మొల్ల” ‌చదవడం కొనసాగించండి

కళాప్రపూర్ణ డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు

కళాప్రపూర్ణ డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు (డిసెంబరు 21, 1917-డిసెంబరు 1, 1996)

ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ అధ్యక్షులు దేవులపల్లి రామానుజరావుగారిచేత సాహితీరుద్రమఅనిపించుకున్న కళాప్రపూర్ణ, ఆంధ్రసరస్వతి, ధర్మప్రచారభారతి,  డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారికి రుద్రమ అన్న బిరుదు స్వభావోక్తి. కాకతి రుద్రమ కత్తి ఝళిపించినట్టే లక్ష్మీకాన్తమ్మగారు కలం ఝళిపించారు అని మాత్రమే కాదు. క్షాత్రధర్మాలయిన కత్తిసామూ, కర్రసామూ, గుర్రపుస్వారీ వంటి విద్యలు కూడా నేర్చి ధైర్యమూ, స్థైర్యమూ కూడా సంతరించుకున్న విదుషి. 

ఏడవ ఏటనే అన్నగారితో పాటు గాత్రం, వీణా ప్రారంభించిన లక్ష్మీకాన్తమ్మగారు పదిహానేళ్లు నిండేవేళకి, కవితలల్లుతూనే, కుట్టుపనీ, ఎంబ్రాయిడరీ, నాట్యంవంటి కళలు నేర్చినా, వంట మాత్రం నేర్వలేదట. బాపట్లలో కాపురం పెట్టినతరువాత భర్త హయగ్రీవగుప్తగారు నేర్పేరని రాసుకున్నారు స్వీయచరిత్రలో.

 

బాల్యంలో అన్నదమ్ములతో గోళీకాయలూ, కోతికొమ్మచ్చీ అడుతూ స్వేచ్ఛగా ఆరుబయట గడిపిన ఆమెకి సభల్లో, సాంఘికసేవలో పాల్గొనడానికి కావలసిన చిత్తస్థైర్యం తేలిగ్గానే అలవడినట్టు కనిపిస్తోంది. 

ఆమె పన్నెండవయేటనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, ఉపన్యాసాలు ఇవ్వడం, ఉత్తేజపూరితమయిన దేశభక్తిగేయాలు పాడడం చేసేవారుట.

 

బంగారురేకులు అద్దిన పెరుగన్నం, కుంకుమపువ్వు రంగరించిన వేడిపాలు తాగించే నాయనమ్మగారిదగ్గర అల్లారుముద్దుగా పెరిగారు. చిన్నప్పడే కామాక్షమ్మగారి ప్రోత్సాహంతో ఆంధ్రయువతీ సంస్కృత కళాశాల (ముందు చెప్పుకున్న ఆర్యవైశ్యసేవా సదనం ఇదే) లో సంస్కృతం చదువుకున్నారు. 18వ యేట ఉభయభాషా ప్రవీణ పట్టాతో పాటు తెలుగుమొలక, విద్వత్కవయిత్రి బిరుదులు కూడా అందుకున్నారు.  దాదాపు ఆరుదశాబ్దాల సాహిత్యకృషి చేసి పన్నెండు బిరుదులూ, ఇరవై ఘనసత్కారాలూ పొందిన కవయిత్రి. ఆధునిక తెలుగు రచయిత్రులలో కనకాభిషేకం, గజారోహణం వంటి ఘనసన్మానాలు పొందిన కవయిత్రి నాకు తెలిసినంతవరకూ లక్ష్మీకాన్తమ్మగారు ఒక్కరే.

 

 13వ యేట ఊటుకూరి హయగ్రీవ గుప్తగారితో లక్ష్మీకాన్తమ్మగారి వివాహం జరిగింది. 18వ ఏట తొలిసంతానం  కలిగింది కానీ ఆరునెలలు మాత్రమే బతికిందిట ఆపాప. పదకొండుమంది పిల్లలలో ఇప్పుడువున్నవారు ఇద్దరు అమ్మాయిలూ, ముగ్గురు అబ్బాయిలూ.  మంచి చదువులు చక్కగా చదివి జీవితాలలో స్థిరపడ్డారు.

 

లక్ష్మీకాన్తమ్మగారు ప్రముఖ కవి, బ్రహ్మసమాజ మతావలంబి, మధురకవి బిరుదాంకితులు నాళం కృష్ణారావుగారి రెండవసంతానం. తల్లి నాళం సుశీలమ్మగారు వైదికధర్మానురక్త, సంఘసేవాతత్పరురాలు. ఆంధ్ర మహిళా గానసభ స్థాపకురాలు. వరసకి పినతల్లి అయిన బత్తుల కామాక్షమ్మగారు వీరేశలింగంగారి చివరిదశలో 15 ఏళ్ల బాలిక. రాజమండ్రిలో ఆర్యసేవా సదనం స్థాపించి విశేషమయిన ఖ్యాతి వడసిన మహామనీషి. ఈసేవాసదనం తరవాత బాలికా సంస్కృతపాఠశాలగా మార్చబడింది. ఇలాటి వాతావరణంలో పెరిగిన లక్ష్మీకాన్తమ్మగారికి, సాహిత్యం, సంగీతం, సంఘసేవ అక్షరాలా వెన్నతో పెట్టిన విద్యలు అంటే ఆశ్చర్యంలేదు.

 

ఆరుద్రగారు సమగ్రాంధ్రసాహిత్యంలో మోహనాంగీ మొల్లవంటి రచయిత్రులగురించిన సమాచారం లక్ష్మీకాన్తమ్మగారి ఆంధ్రకవయిత్రులు గ్రంథంనుండి స్వీకరించారు. ఆధునికయుగం సంపుటం చివర ఉపయుక్తగ్రంథాల జాబితాలో లక్ష్మీకాన్తమ్మగారిపేరూ, గ్రంథం పేరూ పేర్కొన్నారు. కానీ సమగ్రాంధ్రసాహిత్యం ఆధునికయుగం సంపుటిలో లక్ష్మీకాన్తమ్మగారి సాహిత్యకృషి గురించి గానీ,ఆంధ్రకవయిత్రులు గ్రంథం గురించిన ప్రస్తావన లేదు. నేను ఆరుద్రగారిని తప్పుపట్టడం లేదు. వారి కారణాలు వారికి వుంటాయి. కానీ నేను ఈవ్యాసం రాయడానికి మాత్రం అది ఒక కారణమయింది. ఇంగ్లీషులో ఇంకా వివరంగా రాసి తూలిక.నెట్ లో ప్రచురిస్తాను త్వరలోనే.

 

 ఆరుద్రగారు లక్ష్మీకాన్తమ్మగారి సంస్మృతి సంచికలో సంగీతవిద్రుమ సాహతీరుద్రమ అన్న వ్యాసంలో ఈతరం ఆంధ్రరచయిత్రులందరికీ ఇష్టమయిన అత్తగారు అని ప్రశంసిస్తూ, ఆమె స్వీయచరిత్ర ఈశతాబ్దపు తొలిదశకాలంలో సంగీత సాహిత్యాభిరచులతో జాతీయోద్యమపు చైతన్యంగల వున్నత వర్గాల లోగిళ్లలో ఆడపిల్లలు ఎలా పెరిగి పెద్దవారై దేశసేవకు, సంఘసేవకు సాహితీసేవకు అంకితమయ్యారో విశదం చేస్తున్నాయి అంటారు. ఇది పదునైన వాక్యం. అందుకే రాయడం ఈబ్లాగు నేను.

 

ఆమె స్వీయచరిత్ర,సాహితీరుద్రమ అన్న గ్రంథం తొలిపలుకులో తెరిచిన పొత్తంబిది, నా జీవితమందున జరిగిన ఘటనల మొత్తంబిది అని రాసుకున్నారు. నిజానికి ఈపుస్తకం చదివితే కేవలం ఆమెజీవితంలో జరిగిన ఘటనలు మాత్రమే కాదు, ఆనాటి సాంఘికోద్యమాలలో స్త్రీల పాత్రా, సమాజికధర్మాలూ కూడా మనకి అర్థం అవుతాయి. 

 

లక్ష్మీకాంతమ్మ గారి తొలి సంపూర్ణగ్రంధం,ఆంధ్రకవయిత్రులు, ఆమె ఇది రచించడానికి కారణం తెలుగు భాషా సమితి, మద్రాసు, వారు 1953లో ప్రకటించిన పోటీ. మొదట తాను ఆపుస్తకం రచించడానికి సుముఖంగా లేరట. కారణం – వీరేశలింగంగారే తమ కవులచరిత్రలో ఐదారువందలమంది రచయితలని పేర్కొనగా, అందులో ఐదారుగురు మాత్రమే స్త్రీలు. పరిశీలించి చూస్తే నిజంగా వందమంది ఎన్నదగినవారుంటారు. అందులో చెప్పుకోదగ్గ రచయిత్రి ఒక్కరే వుండొచ్చు. అలా ఏ ఒక్కరినో తీసుకుని ఒకగ్రంథం రాయడం నిజంగా రచయిత్రులు లేరని బయట పెట్టుకోడమే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పుడు బొడ్డుపల్లి పురుషోత్తంగారు మీరు పరిశోధించి మరో పదిమంది వున్నారేమో చూడవచ్చు కదా అంటే, సరేనని పూనుకుని పరిశోధన సాగించారు. గౌతమీగ్రంథాలయం (రాజమండ్రి), సారస్వతనికేతనం (వేటపాలెం), ఒరియంటల్ లైబ్రరీ (మద్రాసు), సరస్వతీ మహల్ (తంజావూరు) లాటి లైబ్రరీలు తిరిగి, ఆనాటి వివిధ పత్రికలూ, గృహలక్ష్మీ, భారతి, హిందూసుందరి వంటి పత్రికలు వందలకొద్దీ తిరగేసి, 264 మంది రచయిత్రులని కనుగొని, గ్రంథస్థం చేసారు లక్ష్మీకాన్తమ్మగారు. తెలుగు సాహిత్యచరిత్రలో సాధికారికంగా ఇంతమంది రచయిత్రులవిశేషాలు పొందుపరిచిన ఘనత లక్ష్మీకాన్తమ్మగారిదే. ఆవిడ రచించిన తొలిగ్రంథం ప్రథమ బహుమతి గెలుచుకోవటం మరొక విశేషం. ఇక్కడే మరోమాట కూడా చెప్పాలి. విజ్ఞాన్ కుమార్ నాకు ఆంధ్రకవయిత్రులు ప్రతిలో 86 మంది రచయిత్రులు మాత్రమే వున్నారు. లక్ష్మీకాన్తమ్మగారు తమ ముందుమాటలో రెండవ ముద్రణకి లో ప్రచురణ ఖర్చులూ, కాగితంధరలగురించి రాశారు. కానీ భావి పరిశోధనలకి ఎంతో ఉపయోగకరమైన ఇటువంటి గ్రంథాన్ని ఖర్చులకి వెరచి 264మంది రచయిత్రులనుండీ 86 మందికి కుదించడం విచారించవలసిన విషయం. సాహిత్య ఎకాడమీవంటి సంస్థలు ఇది గుర్తించాలి.

 బాపట్లో కాపురం పెట్టినతరవాత ఒకొక్కప్పుడు అలివికాని వేవిళ్లు అనుభవిస్తూ కూడా భర్త గుప్తగారి సహకారంతో, కుటుంబం సంభాళించుకుంటూనే, వెయ్యి వరకూ ప్రసంగాలు చేశారు. వందలకొలదీ సభల్లో పాల్గొన్నారు. సెనేట్ సభ్యత్వాలూ, అధ్యక్షపదవులూ వంటివి అనేకం అలంకరించారు. అనేక సాంఘికసేవా కార్యక్రమాలు చేపట్టి నిర్వహించారు. ఆమె సాహిత్యకృషి జాబితా ఎనిమిది పేజీలుంది. ఆపైన జాబితాకి ఎక్కనివి ఎన్నో!  

 

బత్తుల కామాక్షమ్మగారు వీరేశలింగంగారి రచనలవల్ల ఉత్తేజితులయి, సంఘసేవకి పూనుకున్నారు. ఆవిడ ప్రేరణతో, లక్ష్మీకాన్తమ్మగారు వైశ్యసేవా సదనం సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్ష్మీకాన్తమ్మగారి సాన్నిహిత్యంలో నాయని కృష్ణకుమారిగారి వంటి ప్రముఖులు ఎంతో సాహిత్యసేవ చేసారు. లక్ష్మీకాన్తమ్మగారి పరిచయంభాగ్యం నాకు 1968, 1969లలో ఆంధ్రరచయిత్రులసభలలో కలిగింది. ఇలా సజీవమూర్తులనిగురించి ఆలోచించినప్పుడు మన సాహిత్యం, సంస్కృతి నిరంతరంగా ప్రవహించే ఏరు అన్నవాక్యం అర్థవంతమయి తోస్తుంది. (నాకు తెలిసినవారికి తెలిసినవారికి తెలిసినవారికి తెలిసిన వారు అని చెప్పుకుంటాం చూడండి అలాగన్నమాట).. చరిత్ర పాఠాల్లో వీరేశలింగం యుగం, ఆధునిక యుగం అంటూ ఛిన్నాభిన్నంగా, అతుకులబొంతలా కనిపించే సంస్కృతి, ఇలా ఒకొక్క వ్యక్తిని గురించి తెలుసుకున్నప్పుడు, అనుస్యూతమయి సజీవస్రవంతియయై గలగల పారే సెలయేరయి  స్ఫురిస్తుంది. 

 

లక్ష్మీకాన్తమ్మగారి ధార్మికజీవితంగురించి కొంచెం ప్రస్తావించాలి. మొదట్లో తండ్రిని అనుసరిస్తూ బ్రహ్మమతం అభిమానించారు. అత్తవారింట వైదిక ఆచారాలను పాటిస్తారు. ఒకసారి వారింటికి అతిథిగా వచ్చిన వైష్ణవభక్తుడు ఆదివరాహాచార్యులవారి బోధనలతో లక్ష్మీకాన్తమ్మగూరు కూడా వైదిక మతాచారాలను పాటించటం ప్రారంభించారని కుమార్తె సుహాసిని సంస్మృతిలో రాసేరు. లక్ష్మీకాన్తమ్మగారు తాను కఠిననియమాలతో కూడిన పూజలూ వ్రతాలూ ఆచరించాననీ, దైవసాక్షాత్కారాలు పొందాననీ స్వీయచరిత్రలో చెప్పుకున్నారు.

 

1988లో గుప్తగారు చనిపోయినతరవాత, భర్తృవియోగం తాలూకు దుర్భరవేదన అనుభవిస్తూ కూడా, సాహితీమిత్రుల మాట కాదనక, సభలకి హాజరయి ఉత్తేజకరమైన ఉపన్యాసాలు ఇస్తూ వచ్చేరు. కెనడా, అమెరికా, జపాన్, జకొస్లేవికియా వంటి అనేక దేశాలు సందర్శించి, ప్రముఖ విదేశీపండితులతో సాహిత్య చర్చలు, తనకి వచ్చీ రాని ఇంగ్లీషులోనే చర్చలు జరిపి, వారి మన్ననలు పొందేనని రాశారు స్వీయచరిత్రలో. 

 

తన జీవితం తెరిచిన పొత్తంబిది అని చెప్పుకున్న లక్ష్మీకాన్తమ్మగారి జీవితంలో సామాన్యులకి సైతం తటస్థపడే ఘట్టాలు ఒకటి రెండు కనిపిస్తున్నాయి.

ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో ప్రతిసారీ తనకే ప్రధమస్థానం రావడం గిట్టని విద్యార్థులు కొందరు కామాక్షమ్మగారితో ఆమెమీద చాడీలు చెప్పేరుట. అవి విని కామాక్షమ్మగారు లక్ష్మీకాన్తమ్మగారిమీద  కోపం తెచ్చుకున్నారుట. ఇలా మొదలయిన మనస్ఫర్థ చివరివరకూ కొనసాగడం విచారకరం. అలాగే, కనుపర్తి వరలక్ష్మమ్మగారు తన మహిళా హితైక మండలిలో ఒక సభ్యురాలు సమయానికి చందా కట్టలేదని, ఆమె సభ్యత్వం రద్దు చేసినప్పుడు, లక్ష్మీకాన్తమ్మగారు అది అన్యాయమని ఉద్యమం లేవదీసి, వరలక్ష్మమ్మగారిమీద విశ్వాసరాహిత్యతీర్మానం ప్రతిపాదించేవరకూ పోయింది. ఊరిలో పెద్దలందరూ కల్పించుకుని వారిద్దరిమధ్య తిరిగి సయోధ్య కలిగించడానికి ప్రయత్నిందారు కానీ పూర్వమున్న ఆత్మీయత మళ్లీ ఎన్నటికీ తిరిగి రాలేదని రాసారు లక్ష్మీకాన్తమ్మ గారు.

 

విశిష్టవ్యక్తిత్వంగల మహితాత్ముల్లో కార్యం సాధించాలన్న దీక్షతో పాటు, పట్టుదలలు కూడా మంకుపట్టుదల అనిపించే స్థాయిలోనే వుంటాయేమో ఒకొకపుడు. పట్టూ విడుపూ వుండాలి వంటి మాటలు మనలాటి సామాన్యులకే కానీ పెద్దలకి వర్తించవేమోననిపిస్తుంది ఇలాటి కధలు విన్నపుడు. కానీ ఇలాటికథలమూలంగానే, ఒకరకమైన తృప్తి కూడా కలుగుతుంది. మానవనైజం అనుకుని సాంత్వన పొందుతాం.  (ఇలాటివి నాకూ అనుభవమే మరి)

 

లక్ష్మీకాన్తమ్మగారు చిన్నతనంనుండీ ఘనాపాఠీ పండితులమధ్య పెరిగారు. చిన్నవయసులోనే మనుచరిత్ర, వసుచరిత్ర, కుమారసంభవం వంటి ప్రబంధాలూ, మహా కావ్యాలు చదివారు. అమె అర్థవివరణలకి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేవారట.

ఆమె సదా నవ్వుతుంటారుట. పిలకా గణపతిశాస్త్రిగారు, అప్పటికింకా చిన్నవారు, క్లాసులో ఆమె నవ్వు చూసి తికమక పడ్డారుట. తరవాత లక్ష్మీకాన్తమ్మగారి నవ్వుని గురించి వ్యాఖ్యానిస్తూ ఆనవ్వులో నేను కాళిదాసమహాకవి ప్రదర్శించిన గంభీరార్థాలను, సౌందర్యాలనూ ఏరుకొని ఆ అమ్మాయ తెలివితేటలను మనసులోనే ఆశీర్వదించేవాణ్ణి అన్నారాయన ఆమెతండ్రి కృష్ణారావుగారితో.

 

ప్రముఖ కళాకారుడు, కవి సంజీవదేవ్ ఒకసారి లక్ష్మీకాన్తమ్మగారితో మాటాడుతూ,నాదృక్పథాలలో మీరు సమర్థించనివేవో ఒకటి, రెండు చెప్పమని ఆమెని అడిగారట. అప్పుడు కూడా లక్ష్మీకాన్తమ్మగారు గంభీరతతో కూడుకున్న నవ్వు నవ్వేరుట. అప్పుడు సంజీవదేవ్‌‌గారికి కూడా నవ్వొచ్చింది. అలా వాళ్లిద్దరూ కొంచెంసేపు నవ్వులు నవ్వుకున్న తరవాత,మీరు భౌతికవాదులా, అంతర్మఖవాదులా తెలుసుకోవాలని వుంది అని లక్ష్మీకాన్తమ్మగారు అడిగారు. సంజీవదేవ్ గారు వివరించిన తరవాత,ఇప్పుడు అర్థం అయింది, మీరు ఉభయవాదులు అన్నారుట లక్ష్మీకాన్తమ్మగారు. ఇంతకన్నా వివరంగా ఇక్కడ రాయడం కష్టం. సంస్మృతి సంచిక పుటలు 143-45 చూడండి.  

 

లక్ష్మీకాన్తమ్మగారు రాసిన గ్రంథాల్లో కొత్తదనం చూపిన రచన సరస్వతీసామ్రాజ్య వైభవము. ఇది లక్ష్మీకాన్తమ్మగారి ఊహాజనిత నాటిక. మొల్ల, తిమ్మక్క, మోహనాంగి, రంగాజమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి పలువురు ప్రముఖ రచయిత్రులు చేసిన సభ. అందులో లక్ష్మీకాన్తమ్మగారు సరస్వతిపాత్ర ధరించారు. తొలిసారి ఆలిండియా రేడియోలో ప్రసారమయింది.

 ఆమె రచించిన కన్యకమ్మనివాళి పేరులో సాంప్రదాయక రచన అనిపించినా, నిజానికి ఈనాటి సామాజికధోరణుమీద విసుర్లతో కూడిన వ్యంగ్యాత్మక రచన. దీనికి స్ఫూర్తి ఆరుద్రగారి కూనలమ్మపదాలు అని రాశారు ఆమె.

 

          పద్యకవితలు బూజు

          పదకవిత్వమె మోజు

          కథలు వ్రాస్తే ప్రైజు

                   ఓ కన్యకమ్మా.

          తిండి చాలక శోష

          భాషకోసం ఘోష

          ఎందుకు కంఠశోష

                   ఓ కన్యకమ్మా

 

          తాగుతాడు హమేషా

          వాగుతాడు తమాషా

          వాడేను షా హంషా

                   ఓ కన్యకమ్మా

 

లక్ష్మీకాన్తమ్మగారి కృతులగురించి రాయవలసింది ఎంతో వుంది.

ఆవిడ స్వీయచరిత్ర చదివి పక్కన పెట్టిన తరవాత నాకు, పైన వుదహరించిన ఆరుద్రగారివ్యాఖ్యానం మరొకసారి స్ఫురణకి వచ్చింది. పుట్టినిల్లూ మెట్టినిల్లూ కూడా జమీందారులు. అంచేతే వారి రచనా, జీవనసరళీ కూడా ఒక ప్రత్యేకత సాధించుకున్నాయి. లక్ష్మీకాన్తమ్మగారి సాహిత్యకృషి, సంఘసేవలలో సాంప్రదాయకవైభవంతో పాటు ఆధునికమైన భావజాలం కొంతవరకూ కనిపిస్తాయి.  

సాహితీరుద్రమ చదివితే, లక్ష్మీకాన్తమ్మగారు ఆవిష్కరించుకున్న లక్ష్మీకాన్తమ్మగారు గోచరమవుతారు. సంస్మృతి చదివితే, బంధువర్గం, సాహిత్యంలో, సంఘంలో ఆప్తులు గ్రహించిన లక్ష్మీకాన్తమ్మగారు కనిపిస్తారు. లక్ష్మీకాన్తమ్మగారి కృతులు చదివితే మీకే తెలుస్తుంది లక్ష్మీకాన్తమ్మగారి పరిపూర్ణ వ్యక్తిత్వం.

లక్ష్మీకాన్తమ్మగారి పుస్తకాలు archive.org లో దొరుకుతాయి. లింకు ఇక్కడ

 (అడిగిన వెంటనే లక్ష్మీకాన్తమ్మగారి పుస్తకాలు పంపిన విజ్ఞాన్ కుమార్‌గారికి కృతజ్ఞతలు).

 

(తూలిక.నెట్ అక్టోబరు, 2008 లో తొలిసాగి ప్రచురితం.)

 

పూర్వకవులు-అడిదము సూరకవి

అడిదము సూరకవి (1720-1785)

క. ఊరెయ్యది? చీపురుపల్లె
పేరో? సూరకవి యింటిపేర డిదమువార్
మీరాజు? విజయరామ మ
హారాజ తడేమి సరసుడా? భోజుడయా..

నాచిన్నతనంలో నాకు చాలా నచ్చిన పద్యాల్లో ఇదొకటి. మనం రోజూ ఆడుకునే మాటలు – వూరూ, పేరూ – ఇలా అతిసామాన్యమైనవి పద్యంలో పొందుపరచడం నాకు మనసున బాగా నాటుకుంది.

చినవిజయరామరాజు భోజుడని చెప్పుకోడానకి ముందు సూరన ఆర్థికంగా చాలా బాధలు పడ్డాడు. ఆయన తండ్రి భాస్కరయ్య లక్షణసారం రాసేడని చెప్పుకోడమే కాని ఇప్పుడు అందుబాటులో లేదు.
18వ శాతాబ్దం తొలి పాదంలో జన్మించిన సూరన తండ్రిదగ్గరే ఛందస్సూ, అలంకారశాస్త్రం, సంస్కృతవ్యాకరణం చదువుకుని, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఏదో చిన్న మడిచెక్క వున్నా పంటలు లేక, ఆయన వూరూరా తిరిగి ఆశువుగా కవిత్వం చెప్పి ఆనాటి భత్యం సంపాదించుకునేవాడు. గడియకి (24 నిముషాలు) వంద పద్యాలు ఆశువుగా చెప్పగలదిట్టనని తనే చెప్పుకున్నాడు. సూరన దినవెచ్చాలకి పద్యాలు చెప్పడం “ఇచ్చినవాడిని ఇంద్రుడనీ చంద్రుడనీ మెచ్చుకోడం, ఇవ్వనివాడిని చెడామడా తిట్టడం” చేసేవాడని సమగ్రాంధ్రసాహిత్యంలో (3 సం.) ఆరుద్ర రాశారు. అట్టే భాషాజ్ఞానంలేని పామరులకోసం రాయడంచేత తేలికభాషలో చాటువులు రాసేడు అన్నారు. అయితే చందోబద్ధంగా కవిత్వంలో వింతపోకడలు పోతూ చమత్కారం, ఎత్తిపొడుపూ మేళవించి రాయడంవల్ల ఈ చాటువులు పామరజనరంజకమే కాక పండితులఆదరణకి కూడా అంతగానూ నోచుకున్నాయి.

సంస్థానాలు తిరుగుతూ, జీవనభృతి సంపాదించుకునే రోజులలో విజయనగరం వచ్చినప్పుడు పెదసీతారామరాజు ఆయనని ఆదరించలేదు. ఆసమయంలో సూరకవి చెప్పిన పద్యం –
గీ. మెత్తనై యున్న యరటాకు మీదఁ గాక
మంటమీఁదనుఁ జెల్లునే ముంటివాడి
బీదలైయున్న మాబోంట్ల మీదఁ గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీఁద.

చేవ వుంటే బాధుల్లాఖానుమీద చూపించు నీప్రతాపం, అంతే కాని కూటికి గతిలేని నామీద ఏమిటి అంటూ ఎత్తిపొడిచాడు. ఈపద్యానికి చారిత్ర్యక నేపథ్యం అడిదము రామారావుగారి పుస్తకంలో విపులంగా వుంది. చూడండి.

ఒకసారి సూరన విజయరామరాజుగారి సభలో ఈపద్యం చదివాడు రాజుగారి కీర్తిని మెచ్చుకుంటూ..
ఉ. రాజు కళంకమూర్తి, రతిరాజు శరీర విహీనుండంబికా
రాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతరసీమవర్తి వి,
భ్రాజిత పూసపాడ్విజయరామ నృపాఁలుడె రాజు గాక, యీ
రాజులు రాజులే పెనుతరాజులు గాక ధరాతలంబునన్. (పు. 53)

చంద్రుడికి మచ్చ, మన్మథుడికి శరీరమే లేదు, శివుడికి కట్ట బట్టల్లేవు, సింహం గుహల్లో నివాసం, వీళ్లందరూ రాజులేమిటి, విజమరామరాజు మాత్రమే నిజంగా రాజు ఈభూమ్మీద అంటాడు సూరకవి.
సభలో రాజులు ఈ రాజులు అన్నపదం తమని వుద్దేశించే అన్నాడని కినుక వహించగా, సూరకవి అది నిజం కాదనీ, తాను పద్యంలో పేర్కొన్న రాజులగురించి అన్నాననీ సమర్థించుకున్నాడు.

సూరన ఎంత దారిద్ర్యం అనుభవించినా, ఆత్మగౌరవం కాపాడుకుంటూనే వచ్చేడు కానీ అధికారులకి తల ఒగ్గలేదు.

పైపద్యం ఆశువుగా చదివినప్పుడే సూరన కవితా ప్రౌఢిమకి మెచ్చి విజయరామరాజు ఆయనకి కనకాభిషేకం చేయించారు. ఆ తరవాత, ఆనాటి ఆనవాయితీ ఏమో మరి, సభలోని వారు సూరన ఆ బంగారునాణేలను తీసుకుంటాడని ఎదురుచూశారు. అయితే సూరన మాత్రం తనకి జరిగిన సత్కారానికి మాత్రం సంతోషం వెలిబుచ్చి వూరుకున్నాడు. అఫ్పుడు రాజుగారు ఆనాణెములు నీవే అని స్పష్టం చేసారు.
దానికి సమాధానంగా సూరన, మీదయవల్ల ఇంతవరకూ “స్నానము చేసిన యుదకమును పానము చేయలేదు” అని జవాబిచ్చాడు. (డబ్బు నీళ్లలో వాడడం అన్ననానుడి ఇలాగే వచ్చిందేమో మరి).
చినవిజయరామరాజు సూరన వ్యక్తిత్వానికి ముగ్ధుడియి, ఆయనకి తగినవిధంగా సత్కరించి పంపించాడు.
చినవిజయరామరాజు సూరనని ఆదరించిన తరవాత, రాజుగారి సవతి అన్నగారు అధికారం వహించి, సూరనని ఉప్పూ, పప్పూకోసం కోమటులని పొగడడం మానుకోమని ఆంక్ష పెట్టారు కానీ సూరన ఆఆజ్ఞని తలకెత్తుకోక, తన అభీష్టంప్రకారమే జీవనసరళి సాగించుకున్నాడు..

మామూలుగా మనఇళ్లలో నిత్యం అనుభవమే, భార్య భర్తని వూళ్లో అందరికీ చేస్తారూ, అందరినీ పొగుడుతారు, మనవాడిని కూడా ఓమంచిమాట అనొచ్చు కదా అని.

అలాటిదే ఈ చాటువు. సూరన సతి సీతమ్మ ఒకసారి “అందరిమీదా పద్యాలు రాస్తారు, మనఅబ్బాయిమీద రాయరేం” అని అడిగిందిట. అందుకు సూరకవి తన సహజధోరణిలో
క. బాచా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్లుం దానున్
బూచంటే రాత్రి వెఱతురు
బాచన్నంటే పట్ట పగలే వెఱతుర్
అని చదివాడట. తన కుమారుడు రూపసి కాడని స్పష్టం చేస్తూ. సీతమ్మ చాల్లెండి మీవేళాకోళం అని ఆయన్ని మందలించిందిట.
అలాగే మరోసారి ఆయన చీపురుపల్లినుండి ఆదపాకకి వెళ్తుంటే, దారిలో ఒక సాలెవారి చిన్నది కనిపించింది. ఆయనే పలకరించేరు ఎక్కడికి అని. అదపాక అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పి, బాబూ, నామీద ఒక పద్యం చెప్పండి అని అడిగింది. ఆయన వెంటనే తన సహజధోరణిలో ఆశువుగా చెప్పినపద్యం.

క. అదపాక మామిడాకులు
పొదుపుగా నొక విస్తరంట బొడినవాఁడే
ముదమొప్ప విక్రమార్కుఁడు
అదపాకా అత్తవారు ఔనే పాపా.
ఇక్కడ కవిగారు మామిడాకుల ప్రసక్తి తేవడానికి కారణం అదపాకలో మామిడాకులు విస్తరాకులు కుట్టడానికి వెడల్పులేనివి, విస్తరాకులు కుట్టడానికి వీలుగా వుండవు అనిట.

పండితులని చెప్పి కొండకొమ్మున కూర్చోబెట్టిన మహాకవులని భూమ్మీదకి దింపే ఇలాటి కథలు, కవులని మామూలు మనుషులుగా కూడా చూపించే ఇలాటి కథలు నాకు సరదాగా వుంటాయి.

ఎవరిని నువ్వు అనొచ్చు. ఎవరిని గౌరవపురస్సరంగా మీరు అనాలి అన్న వాదన ఈమధ్యనే వచ్చింది గాదు. ఈకింది పద్యం, దానిమీద జరిగిన చిన్న చర్చ చూడండి. సూరన చినవిజయరామరాజు శౌర్యపటిమని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం.

ఉ. పంతమున నీకుఁజెల్లు నొకపాటి యమీరుఁడు నీకు లక్ష్మమా
కుంతము గేలు బూని నిను గొల్వనివాడు ధరిత్రిలోన భూ
కాంతుఁడొకండు లేడు కటకంబు మొదల్కొని గోల్కొండ ప
ర్యంతము నీవెకా విజయరామనరేంద్ర! సురేంద్రవైభవా. (పు. 58)

కటకం నించీ గోల్కొండ వరకూ కత్తి చేత పట్టి నీకు సలాములు చెయ్యని రాజు ఒక్కడు కూడా లేడు, నీకు నీవే సాటి అన్నాడు సూరన. సభికులు భళీ అంటూ కరతాళధ్వనులు చేశారు. రాజు గారు కూడా మెచ్చుకున్నారు కానీ నొచ్చుకోకుండా వుండలేకపోయారు. తనంతటి ప్రభువుని నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించడం బాగులేదు అన్నారు.
సూరకవి వెంటనే,
క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలోనన్ యుద్ధములోనన్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!
పిల్లలవిషయంలో, పడగ్గదిలో, కవిత్వంచెప్పినప్పుడు, యుద్ధంచేసే అప్పుడూ ఏకవచనం వాడితే తప్పులేదు అంటూ రాజుగారిని సమాధాన పరిచాడు. ఇంచుమించు ఇదే అర్థాన్నిచ్చే శ్లోకం ఒకటి సంస్కృతంలో వుందిట.

సాహిత్యం సిరిగలవారిళ్ల రసజ్ఞులకోసం మాత్రమే అనుకునే రోజుల్లో సామాన్యులని తనకవితా మాధురితో చమత్కారంతో అలరించిన కవి అడిదము సూరకవి.

ఇలాటివి ఇంకా కావాలంటే అడిదం రామారావుగారి పుస్తకం, (1919 ప్రచురణ) చూడండి. ఇంటర్నెట్ డిజిటల్ లైబ్రరీలో చూసుకోవచ్చు. వారి చిరునామా http://www.archive.org/details/adidamusurakavi025641mbp. ఈవ్యాసానికి ఆధారం ఈపుస్తకంతో పాటు మహావాది వెంకటరత్నంగారి పూర్వకవులకథలు (1950 ప్రచురణ), ఆరుద్రగారి సమగ్రాంధ్రసాహిత్యం (సాహిత్య ఎకాడమీ ప్రచురణ, 2002).

(మా.ని. మే 20008.)

పూర్వకవులు-వేములవాడ భీమకవి

పూర్వకవులకథలు – వేములవాడ భీమకవి

హయమది సీత పోతవసుధాధిపుఁడారయ రావణుండు ని
శ్చయముగ నేను రాఘవుఁడ వహ్యజవారిధి మారుఁడంజనా
ప్రియతనయుండు లచ్చన విభీషుణుఁడా గుడిమెట్ట లంక నా
జయమును బోతరక్కసుని చావును నేడవనాడు చూడుడీ!

ఇది పూర్వకవులలో ప్రముఖుడయిన వేములవాడ భీమకవి చెప్పిన పద్యం.

భీమకవి కాలం ఇంతవరకూ ఎవరూ నిర్ధారణ చేయలేదు కాని ఆయనగురించి చెప్పుకునే కథలు చాలా వున్నాయి. ముఖ్యంగా జననం గురించి. గోదావరిమండలంలో ద్రాక్షారామ భీమేశ్వరాలయం ప్రాంతంవాడని ఒకకథనం. ఆయన తల్లి బాలవితంతువు, సాటి చెలులతో కలిసి భీమేశ్వరస్వామి దర్శనసమయంలో స్త్రీలకోరికలు వింటూ నాకు నీవంటిపుత్రునివ్వమని కోరిందిట. స్వామి ఆవిడ అభీష్టం నెరవేర్చాడు. ఆవిడ తనముద్దుబిడ్డకి భీమన అని పేరు పెట్టుకుని పెంచుకుంటూంది. వూళ్లో ప్రజలు మాత్రం ఆమె మాట నమ్మక, వెలివేశారు. అ పిల్లవాడిని సాటిపిల్లలు రండాపుత్రుడని గేలి చేయగా, అతడు వచ్చి తల్లిని తనతండ్రి ఎవరని అడిగితే, ఆమె భీమేశ్వరుడేనని చెప్పిందిట. అంతట, ఆ చిన్నవాడు భీమేశ్వరాలయానికి వెళ్లి, “నన్ను వూళ్లో అందరూ తండ్రి లేనివాడని గేలి చేస్తున్నారు. నువ్వు నిజంగా నాతండ్రివవునో కాదో చెప్పకపోతే ఇక్కడే తలపగలగొట్టుకు చస్తాను” అని పట్టు బట్టాడు. అప్పుడు భీమేశ్వరుడు ప్రత్యక్షమయి, అతనితల్లిమాట నిజమేననీ, తానే తండ్రిననీ చెప్పి, అందుకు నిదర్శనంగా భీమన ఆడినమాట సత్యమవుతుందని వరం ఇచ్చాడుట.

పైన వుదహరించిన పద్యానికి పూర్వకథ. భీమకవి తనకవితావైభావన్ని ప్రదర్శిస్తూ దేశదేశాలు సందర్శిస్తూ, గుడిమెట్ట ఆస్థానానికి వచ్చాడు. ఆసంస్థాధీశుడయిన మాగి పోతరాజు భీమకవిని గౌరవించకపోగా, అతని గుర్రాన్ని తీసుకుని, తరిమికొట్టాడు. భీమకవి కోపగించుకుని, పైపద్యం ఆశువుగా చెప్పి పోతరాజుని శపించాడు.
భీమనమాట ఋజువయి, పోతరాజు శత్రువులచేతిలో ఓడిపోయి, రాజ్యసంపదలూ, ప్రాణాలూ కూడ పోగొట్టుకున్నాడు. ఆతరవాత మరణించిన పోతరాజుకోసం అతడి బంధువర్గం విచారిస్తుండగా, భీమన ఆదారిన పోతూ వారిని చూసి, జాలిపడి, మరొక పద్యంతో పోతరాజుని బతికించాడట. ఆపద్యం. –

నాఁటి రఘురాము తమ్ముఁడు, పాటిగ సంజీవి చేత బ్రతికినభంగిన్
గాటికిఁ బో నీకేటికి, లేటవరపు పోతరాజ లెమ్మా, రమ్మా!

ఇలాగే మరొకకథ. రాజ కళింగగంగు భీమనని అవమానించినప్పుడు, ఆయన కోపించి, శపించి మళ్లీ కోపం తగ్గాక, మరొకపద్యంతో గంగుని రాజుగా చేసినకథ వుంది.

ఒకసారి, రాజ కళింగగంగుని చూడడానికి భీమన విజయనగరం వెళ్ళి, తాను వచ్చినట్టు కబురంపాడు. కళింగగంగు తాను వేరే పనిలో వున్నానని మరొకసారి రమ్మని జవాబు పంపాడు. భీమన అప్రసన్నతతో,

వేములవాఁడ భీమకవి వేగమె చూచి కళింగగంగు దా
సామము మాను కోపమున సందడి దీరిన రమ్ము పొమ్మననెన్
మోమునుజూడ దోసమిఁక ముప్పదిరెండు దినంబు లావలం
జామున కర్థంమందతని సంపద శత్రులపాలు గావుతన్

అని శపించాడు. శాపగ్రస్తుడయిన ఆరాజు సర్వస్వం కోల్పోయి. బిచ్చగాడయి వూరూరా తిరుగుతూ వేములవాడకి వచ్చి అక్కడ చీకటిలో గోతిలో పడ్డాడు. ఆదారిన పోతున్న భీమకవి అలికిడి విని ఎవరది అని అడగితే, కళింగగంగు, “వేములవాడ భీమకవి చేసిన జోగిని” అని జవాబు చెప్పాడు. అప్పుడు భీమకవి అతనిని గుర్తించి, నీరాజ్యం నీకు తిరిగి ప్రాప్తిస్తుందని దీవించి పంపాడట. తరవాత భీమకవి వాక్కునిజమై, కళింగగంగు సైన్యంములను సమకూర్చుకుని రాయలమీదికి దండయాత్రచేసి తిరగి తన రాజ్యం స్వాధినం చేసుకున్నాడు.

ఇలాటికథలలో నిజానిజాల తర్కం నాకంత సమంజసంగా అనిపించదు. అందులో కవిచాతుర్యం, భాషావైభవం నన్ను ఎంతగానో అలరిస్తాయి.

(మా. ని. ఫిబ్రవరి 2008)