కథకులూ పాఠకులూ – ఎవరు ఎవరికి స్ఫూర్తి‌?‌‌‌‌‌

1950, 60 దశకాలలో నేను చదివిన పాఠకులఅభిప్రాయాలను ఇప్పుడు పాఠకులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలతో పోల్చి చూసినప్పుడు నాకు కలిగినఅభిప్రాయాలే ఈవ్యాసంలో సారాంశం.

సామాన్యపాఠకులు కథ చదివినప్పుడు తమఅనుభవాలు ఆధారంగా స్పందించి వెలిబుచ్చే అభిప్రాయాలు ఈనాటికథని ఎలా తీర్చిదిద్దుతాయి అన్నది నన్ను వేధిస్తున్నసమస్య. ఆదృష్టితో నేను గమనించిన కొన్ని విషయాలు ఇక్కడ మీముందుంచుతున్నాను.

స్వాతంత్ర్యానంతరం, పత్రికలసంఖ్యతోపాటు పాఠకులసంఖ్య కనివిని ఎరగనంత విస్తృతంగా పెరిగింది. పాఠకుల విద్యాస్థాయి పెరిగింది. కథలో, కథనంలోలాగానే పాఠకులలో, వారి దృక్పథాలలో, వారు స్పందించే విధానంలో అనేక మార్పులు వచ్చేయి. భిన్నకోణాలూ, భిన్నరీతులూ వ్యక్తమయినట్టే, పాఠకులదృష్టిలో కూడా పరిణామాత్మకమయిన మార్పులు కనిపిస్తున్నాయి. పాఠకులు కథని ఎలా విశ్లేషిస్తున్నారు, తమకి ఎలా అన్వయించుకుంటున్నారు, రచయితనుండీ, రచననుండీ ఏమిటి ఆశిస్తున్నారు అన్న అంశాలను పరిశీలించి క్రోడికరించగా తేలినఅంశాలు ఇవి.

తమ అభిప్రాయాలను వెలిబుచ్చే పాఠకులని స్థూలంగా మూడువర్గాలుగా విభజించవచ్చు.

1. ఒకథ చదివి తమఅనుభవాలపరిమితిలో తత్క్షణమే స్పందించేవారు.

2. కథలో లీనమైపోయి, కథలోని ఒకపాత్రనో, ఒక సన్నివేశాన్నో, సంఘర్షణనో తమకి అన్వయించుకుని, తదనుగుణంగా స్పందించేవారు.

3. వర్ణన, వాస్తవికత, భాషలకి సంబంధించి కథని శల్యపరీక్ష చేసేవారు.

వీరిలో మొదటివర్గం పాఠకులు స్థాలీపులాకన్యాయంగా కథ అక్కడక్కడా చదివేసి, కథలో ముఖ్యమయిన అంశాన్ని సూచనప్రాయంగా గ్రహించేస్తారు. అలా కప్పదాటుగా చదవడంలో కొన్ని విషయాలు తెలిసో  తెలియకో గమనించరు కూడా. వారు వెలిబుచ్చే అభిప్రాయాల్లో అది బాగానే తెలుస్తుంది. వారికి తమఅభిప్రాయం వెలిబుచ్చాలన్న కోరిక కలిగించడమే ఆకథ సాధించినవిజయంగా భావించుకోవచ్చు కథకుడు.

ఇలాటి అభిప్రాయాలలో ఒకొకప్పుడు దూషణ, భూషణ, తిరస్కారాలు మితిమీరినా ఆశ్చర్యంలేదు. ఇక్కడే మనం మరోమాట కూడా చెప్పుకోవాలి. వ్యక్తిగత విమర్శ మనకి కొత్త కాదు. వెనక అల్లసాని పెద్దన “అమవసినిశి” అని వాడినందుకు, తెనాలి రామకృష్ణుడు

ఎమి దిని సెపితివి కపితము

బెమ పడి వెరి పుచ్చకయ దిని సెపితివొ

ఉమెతః దిని సెపితివొ

అమవసనిశి యనుచు అలసని పెదన

అంటూ, ఒత్తులూ, దీర్ఘాలూ తీసేసి హేళన చేస్తాడు.  ఈమధ్యనే నాయని కృష్ణకుమారిగారి వ్యాసం ఒకటి కనిపించింది. వీరేశలింగంగారూ, కొక్కొండ వెంకటరత్నంపంతులుగారూ ఒకరినొకరు తమతమ పత్రికలలో హేళన చేసుకోడంగురించి కృష్ణకుమారిగారు “వారిలాటి మహానుభావులకే చెల్లింది” అంటారు అన్యాపదేశంగా అది అభిలషణీయం కాదని తెలియజేస్తూ (యుగపురుషుఢు వీరేశలింగం.)

మనకి హాస్యంపాలు ఎక్కువ. మన వ్యవస్థలో బావామరుదులూ, వదినామరదళ్లే కాక భార్యాభర్తలు కూడా వేళాకోళాలాడుకుంటారు. పాశ్చాత్యదేశాలలో అభ్యంతరకరమయిన హాస్యాలు మనకి నిత్యోత్సవాలు. ఈనాడు ఎన్నారైలలో కూడా అలాటి చనువు ఏర్పడింది. (ప్రస్తుతం బ్లాగులలో కూడా కొంతవరకూ కనిపిస్తోంది.) ఇది మరొకరకం కుటుంబవ్యవస్థ అనుకోవచ్చు. వీరు కథనీ, కథకుడినీ వదిలేసి, స్వకీయమయిన హాస్యాలలోకి దిగిపోవడం కూడా చూస్తున్నాం. నామటుకు నాకు ఇటువంటి అభిప్రాయాలని రచయితలు సీరియ‌స్‌‌గా తీసుకోరనే అనిపిస్తుంది.

రెండోరకం పాఠకులు, కథలో లీనమయిపోయి, కథలో తామొక పాత్ర అయినట్టు వ్యాఖ్యానాలు చేస్తారు. ఫలానా పాత్ర అలా అనకూడదు, ఇలా అనాలి, అలా చెయ్యకుండా ఉండవలసింది, ఇలా జరిగి ఉంటే బాగుండును వంటి అభిప్రాయాలు ప్రకటించడంలో ఆంతర్యం ఇదే – కథలో లీనమయిపోయి, అది కథ అని మరిచిపోవడం. ఆ పాఠకుడు తనవైన అనుభవాలు ఆధారంగా చేసే వ్యాఖ్యలు అవి.

కథ ప్రచురణ నీటిలో రాయి విసరడంలాటిది. ఆరాయి తాకిడికి లేచే చిరుతరగలవంటివే పాఠకుడిలో కలిగే స్పందనలు. అంటే, పాఠకుడిలో కలిగే స్పందనలకి రచయిత జవాబుదారీ కాడు. ఎలాటి స్పందనలు రాగలవో రచయిత ఊహించలేడు. ఆ పాఠకుడు తనఅనుభవాలూ, పరిస్థితులపరిధిలో తన అభిప్రాయాలు వెలిబుచ్చినప్పుడు, అవి రచయిత ఆశయానికి భిన్నంగా ఉంటే, ఆపాఠకుడు రచయితఅభిప్రాయాన్ని అర్థం చేసుకోలేదు అనుకోడం కన్నా మరొకకథకి నాంది పలుకుతున్నాడు అనుకోడం మేలు. పాఠకుడు ఎప్పుడయితే, “ఇలా కాదు, అలా జరిగిఉండాలి” అంటాడో, అప్పుడే మరోకథ మొదలవుతుంది. మొదటికథకి సంబంధించినంతవరకూ, ఆకథ సాధించింది అదే. పాఠకుడిలో అలాటి ఆలోచనలు రేకెత్తించడం. ఏడు చేపలకథలో “చేపా, చేపా, ఎందుకు ఎండలేదు?” అని అడిగితేనే కదా కథ ముందుకు సాగేది. చేపని అడిగేదేమిటి, తీసి ఎండ ఉన్నచోట పడేస్తే సరిపోతుంది అనుకుంటే, మరింక కథ లేదు!

మూడోరకం పాఠకులు ఇంకొంచెం ముందుకి వెళ్లి, కథని శల్యపరీక్ష చేస్తారు. కథలో భాష, శైలీ, పాత్రచిత్రణా, వాస్తవికత వంటి అంశాలను విశ్లేషిస్తారు. ఒకొకప్పుడు తాము చదివిన పాశ్చాత్యరచయితలతో పోల్చుకునో, వారివిమర్శలని ఆధారం చేసుకునో వ్యాఖ్యానాలు కూడా చేస్తారు.

ప్రతిపాఠకుడూ తప్పనిసరిగా ఈమూడు వర్గాల్లో ఏదో ఒకకోవకి చెందివుంటాడని నేను అనడంలేదు. సుమారుగా ఇలాటివిభజనకి ఆస్కారం ఉంది అని చెప్పడమే నా ఉద్దేశ్యం. పాఠకులందరూ పత్రికాముఖంగా తమఅభిప్రాయాలు వెలిబుచ్చరు కదా. అంచేత, వారి స్పందనలేమిటో మనకి తెలిసే అవకాశంలేదు.

నాచిన్నప్పుడు, అంటే 50, 60 దశకాల్లో కథలు చాలామటుకు కాలక్షేపమే అయినా, కథలో ఒక పాత్రతోనో సంఘటనతోనో తమ అనుభవాలు పోల్చుకుని, ఆకథని “తమకథ”గా మలుచుకోడం, ఆకథలో సంఘర్షణలకి తమ బాధలని అన్వయించుకుని, పరిష్కారాలు వెతుక్కోడం జరిగింది.   

కె. వసుంధరాదేవి “తెలుగుకథ తీరుతెన్నులు” అన్నవ్యాసంలో ఒకసంఘటనగురించి రాసేరు.

ఆవిడ ఒక క్షయరోగిగురించి కథ రాశారుట. కథలో ప్రధానపాత్ర క్షయరోగి. కొంతకాలం ఆజబ్బుతో బాధ పడి చివరకి చనిపోతాడు. ఆ కథ చదివిన ఒక పాఠకుడు ఆమెని కలుసుకుని, తాను క్షయరోగి ప్రధానపాత్రగా మూడు కథలు చదివేననీ, మూడు కథల్లోనూ ప్రధానపాత్ర చనిపోతాడు అని చెప్పి, తనసందేహం వెలిబుచ్చుతాడు. అతనికి క్షయ ఉంది. అతను రచయిత్రిని అడిగినప్రశ్న -క్షయరోగులందరూ చనిపోతారా, వారికి బతికే అవకాశం లేదా? అని. వసుంధరాదేవి రచయితలందరితరుఫునా అతనికి క్షమాపణలు చెప్పుకున్నాననీ, మళ్లీ జన్మలో చావుని పరిష్కారంగా రాయకూడదని నిశ్చయించుకున్నాననీ, అయినా ఆపాఠకుడిప్రశ్న తనని వేధిస్తూనే ఉందనీ రాశారు.

ఈకథ ఇక్కడ ఉదహరించడానికి కారణం ఆనాడు పాఠకులకి కథలంటేనూ, రచయితలంటేనూ ఉన్న నమ్మకం ఎత్తిచూపడానికే. అనూచానంగా మనం జ్ఞానానికి ఇస్తున్న గౌరవం అదీ. రచయితకి ఏదో తెలుసని నమ్మి, ఆయన రాసినకథలో తాను కొత్తగా తెలుకోగలిగినది ఏదో ఉందన్నఆశతో కథ చదివేడు పాఠకుడు. అది గురుశిష్యసంబంధం. ఈనాడు ఈ సంబంధంలో మార్పు వచ్చింది. ఆనాడు ఎదటివారిమాట స్వీకరించడం నీతి అయితే, ఈనాడు ప్రశ్నించడం నీతి. ఈమార్పే ఈనాటి పాఠకులలో చూస్తున్నాం.

ఈనాడు పాఠకులఅభిప్రాయాలు చూస్తే, వారిని విశేషంగా ఆకర్షిస్తున్నవి వస్తువు, సంఘర్షణ, పరిష్కారం. ఆపైన కొంతవరకూ భాష. వాటికి అనుబంధంగా వాస్తవికత, ప్రయోజనంగురించిన ప్రశ్నలు తలెత్తుతాయి.

కథకి ముఖ్యమయిన ప్రయోజనం ఒక దృక్కోణాన్ని జనబాహుళ్యానికి అందించడమని దాదాపు అందరం గుర్తించాం. లేదా ఎవరూ గమనించని, గమనించినా పట్టించుకోని కోణం కావచ్చు. సామాజికప్రయోజనం అంచే సమాజంలో లోపాలు గర్హించేదీ, పరిష్కారాలను సూచించేదీ అని చెప్పుకున్నాం. నిజానికి ఈ వివరణే ప్రమాణం అయిపోయినట్టు కనిపిస్తోంది ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్న, బహుమతులు పొందుతున్న, విమర్శకులమన్ననలు పొందుతున్న కథలు చూస్తుంటే. ఇది కూడా విమర్శకుల, పాఠకులదృష్టిలో వచ్చిన మార్పుకి చిహ్నమే.

వస్తువుకి ఈనాటి పాఠకులు ఇస్తున్న ప్రాధాన్యతకి మంచి ఉదాహరణ ఈమధ్య ఆంధ్రజ్యోతిలో (ఆంధ్రజ్యోతి ఆదివారం జనవరి 16, 2005) వచ్చిన “కడలూరు వెళ్లాలి ఒకనీలిమకోసం” అన్న కథ. సునామీ భీభత్సానికి సమస్త ప్రపంచం స్పందించింది నీ, నా అన్న వివక్ష లేకుండా. ఆకథలో విశేషం వస్తువు. రచయిత దాన్ని మానవసంబంధిగా మలచడం. చాలామంది పాఠకులు ఆ భాగానికే ఎక్కువగా స్పందించారు. అయితే, కథలో ఒక సన్నివేశం – ప్రాధానపాత్ర ఫోన్ చెయ్యాలనుకున్న సందర్భం స్పష్టంగా లేదు. ఎవరికి, ఏమని ఫోన్ చెయ్యాలనుకున్నాడు, చేశాడా, లేదా అన్న వివరాలు లేవు. ఇది పాఠకులెవరినీ బాధించినట్టు కూడా లేదు ప్రచురించబడిన అభిప్రాయాలు చూసినప్పుడు.

కథావస్తువు, సంఘర్షణ  1970 దశకంలో తెలుగుకథలో సాంఘికప్రయోజనం ప్రధానాంశంగా విశేషాదరణ పొందిది. నాచర్చకి నేను 1950దశకానికి పూర్వపుకథలు మూడు తీసుకుంటున్నాను. కారణం ఆనాటి పాఠకులు అడగనిప్రశ్నలు విశదం చెయ్యడంలో సౌలభ్యం.

ఏది వాస్తవికత, ఏది వాస్తవికత కాదు అన్నప్రశ్నకి ఉదాహరణగా ఈకథ చూద్దాం.

ఒకాయన సానివాడల తిరుగుతుంటాడు. ఆయనని దారిలో పెట్టాలనుకుంటుంది భార్య. ఒకరోజు ఆయన అలవాటు ప్రకారం చాంద్రాయణం ముగించుకుని ఇంటికి వస్తాడు. అమ్మగారేరీ అని పనివాడిని అడుగుతాడు. అతను అమ్మగారు పుట్టింటికి వెళ్లిపోయారని చెబుతాడు. దాంతో ఆయన కంగారు పడిపోయి, బుద్ధి తెచ్చేసుకుంటాడు. పాఠకులు గ్రహించే ఉంటారు. ఇది గురజాడ అప్పారావుగారి దిద్దుబాటు కథ. ఇది తెలుగులో తొలికథగా, అంటే మంచికథకి ఉండవలసిన లక్షణాలు ఉన్నకథగా గుర్తింపబడింది. కాని ఇదే కథని ఈరోజుల్లో నాలాటి రచయిత రాస్తే, ఈనాటి పాఠకులు సంఘర్షణకి తగినబలం ముగింపులో లేదు అంటారు. దానిమీద అనేకప్రశ్నలు లేవదీయొచ్చు. భార్య పుట్టింటికి పోతే స్త్రీలోలుడయిన మగాడికి అంత త్వరగా బుద్ధి వచ్చేస్తుందా? నిజానికి అతగాడికి భార్య ఎదురుగా లేకపోతే మరింత ఆటవిడుపు కదా అని అడుగుతాడు ఈనాటి పాఠకుడు.

ఆతరవాత వచ్చిన కథల్లో కుటుంబరావుగారి కథ, ఆడజన్మ చూడండి. ఇందులో లక్ష్మి ప్రధానపాత్ర. ఆమె తండ్రి పోతే, ఆతని అన్నగారు లక్ష్మినీ, తల్లినీ చేరదీసి, ఆఅమ్మాయిని ఒక రెండోపెళ్లి ముసలాయనకిచ్చి చేతులు దులుపుకుంటాడు. ఆ ముసలాయనకి అనుమానం లక్ష్మి సవతికొడుకుతో సంబంధం పెట్టుకుందేమోనని. ఆ బాధలమధ్య లక్ష్మి ఒక కూతురిని కంటుంది. ఆకూతురు పెరిగి పెద్దదయిన తరవాత ఎవరితోనో లేచిపోవడం, గర్భవతి అయి తిరిగిరావడం – ఇంతే కథ. ముప్ఫై ఏళ్లు నిండని లక్ష్మికి మూడుతరాల బాధలు అనుభవమయేయి. ఆపైన ఇంకా ఏం జరగనున్నదో అనుకుంటుంది ఏడుస్తూ.

ఈకథలో పరిష్కారం లేదు. ఆరోజుల్లో ఒక దిక్కుమాలిన ఆడదాని సాంఘికదుస్థితిని చిత్రించడం మాత్రమే జరిగింది. నిజానికి ఈకథ చదువుతున్నప్పుడు నాకు అదొక కథలా అనిపించలేదు. మాటవరసకి పాత్రలకి పేర్లు పెట్టి ఒక సాంఘికసమస్యని వివరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఇద్దరు స్త్రీలు ఎట్టి సాహసానికీ పాల్పడరు. సాహసించి పారిపోయిన చిన్నది మోసపోయి మళ్లీ ఇల్లు చేరుతుంది. ఈకథే ఈనాడు పత్రికలో కనిపిస్తే, ఈనాటిపాఠకులు వేసే ప్రశ్నలు సుళువుగానే ఊహించుకోవచ్చు, లక్ష్మి ఎందుకు తిరగబడలేదూ? తనకి సవతికొడుకుతో సంబంధం లేదని ఎందుకు ఋజువు చెయ్యలేదూ? కనీసం అలా చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదూ? సాహసించి పారిపోయిన చిన్నది అయినా సుఖపడినట్టు రచయిత ఎందుకు చిత్రించలేదూ? అంటే ఇది పాఠకులలో సామాజికస్పృహ కలిగించడానికి మాత్రమే అని జవాబు చెప్పుకోవాలిసివస్తుంది. అంటే సంఘంలో జరుగుతున్న అత్యాచారాలు చూసీ చూడనట్టు దాటుకు పోయేవారికి హెచ్చరికగా మరొకసారి ఎత్తి చూపడానికీ, జనసామాన్యంలో ఆలోచనలు రేకెత్తించడానికీ మాత్రమే అని. అంతే కాక దారిద్ర్యానికీ నైతికవిలువలకీ మధ్య గల అనుబంధం కూడా తెలియచేస్తుంది ఈకథ.  

కనుపర్తి వరలక్ష్మమ్మగారి కుటీరలక్ష్మి ఇంచుమించు అదే పరిస్థితిలో ఉన్న మరొక స్త్రీ ప్రవృత్తినీ, మరొక దృక్కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఆకథలో ప్రధానపాత్ర రామలక్ష్మి కలిమిలేములు అనుభవించి, భర్త పోయినతరవాత, కేవలం మనోబలంతో జీవితంతో పోరాడుతూ, పిల్లలని సాకుతూ ఉంటుంది. అయితే ఇందులో కూడా ఆమె సాధించిన ఘనవిజయమేమీ లేదు .పాఠకుడు కథ అయిపోయిన తరవాత హమ్మయ్య సుఖపడింది అనుకుని ఆనందించే అవకాశంలేదు. చివరంటా ఆమెకి దినదినగండమే. కాని, ఇందులో నమ్మదగ్గ పరిష్కారం ఉంది. గుండెబలం గల ఆడది నాఖర్మ అంటూ చేతులు ముడుచుకు కూచోదు. కడవరకూ పోరు సలుపుతూనే ఉంటుంది. వరలక్ష్మమ్మ ఈకథలో వెల్లడి చేసిన మరొకవిషయం ఆరోజుల్లో తెలుగుదేశంలో కనీసం ఒక నియమితపరిధిలో స్త్రీలకి గల సామాజికస్ఫూర్తి. ఆరోజుల్లో ఐరోపా మహాసంగ్రామంమూలంగా సామాన్యులమనుగడ, కుటీరపరిశ్రమలమీద ఆధారపడినవారి జీవితాలు ఎంతగా అల్లకల్లోలం అయిపోయేయో వివరిస్తుంది ఈకథ. ఆనాటి తెలుగురచయిత్రులకి సాంఘికసరిస్థితులపట్ల గల అవగాహన, అది కథగా మలచగల నైపుణ్యం చూస్తాం ఈకథలో. అయితే ఇందులో రచయిత్రి చాదస్తంగా ఉపన్యాసాలు జొప్పించరు. బహుశా ఆకారణంగానే దానిని మంచికథగా గుర్తించారు ఆనాటి విమర్శకులు. అద్ ఇప్పుడయితే, స్త్రీవాదరచనగానో, దళితవాద రచనగానో ముద్రపడి, అనేకచర్చలకి దారి తీసేది. అటువంటి విస్తృతమయిన చర్చ లేకపోతే, రచయిత్రికి సాంఘికపరమయిన అవగాహన లేదని కథని పక్కన పెట్టేస్తారు కూడా.

ఉదాహరణకి, రచయిత చెప్పకుండా వదిలేసిన అంశాలు – ప్రధానపాత్ర రామలక్ష్మి కొడుకులు పెరిగి పెద్దవారయారా, చదువుకున్నారా, లేదా, ఆతరవాత తల్లిని ఆదుకున్నారా లేదా వంటివి అడగవచ్చు. లక్ష్మి సుఖపడేరోజు వచ్చిందా లేదా? రాకపోతే, ఈకథ విషాదాంతం అనుకోవాలా? విషాదాంతం అయితే, ఎందుకు ఇలాటికథలు రాయడం అన్నప్రశ్నలు కూడా అడుగుతారు. కానీ, ఆనాడు (ఇంకా కొందరు నాలాటి రచయితలు యీనాటికీను) కథ ఎంతవరకూ చెప్పాలన్న నిర్ణయం రచయితదిగానే భావించారు. ఇతివృత్తానికీ, కథ నడవడానికీ పనికొచ్చే సన్నివేశాలు, పాత్రలు ఎంచుకోడం మాత్రమే జరుగుతుంది. అంతకంటె ఎక్కువ వివరాలు ఎందుకు ఇవ్వలేదు అన్నప్రశ్న లేదు అప్పట్లో.

సూక్ష్మాతిసూక్ష్మ వివరణలు, స్పష్టత, poetic license. వివరాలు, స్పష్టత విషయాలలో ఈనాడు పాఠకులు చూపుతున్నశ్రద్ధ అపూర్వం. నాకు వస్తున్న ప్రశ్నలలో పదే పదే కనిపించేవి స్థల, కాలనిర్ణయాలూ, కదాచితుగా పాత్రల ప్రవర్తనలమీదాను. 

మొదట రచయితగా నాఅభిప్రాయం చెప్తాను. రచయితలూ, పాఠకులూ కూడా తమ అనుభవాలు, అవగాహన (perception) పరిధిలోనే రాయడం చదవడం, విశ్లేషించడం జరుగుతుందని మనందరికీ తెలుసు. బడిపంతులు కథలు పంతుళ్లపిల్లలదృష్టిని ఆకట్టుకుంటే, సాఫ్టువేర్ ఇంజినీర్లకథలు సాఫ్టువేర్ ఇంజినీర్లకి బావుంటాయి స్థూలంగా. పోతే, రచయితకి సంబంధించినంతవరకూ ఏకథలోనైనా ప్రధానాంశం సాధారణంగా తాను గమనించిన ఒక సాంఘిక లేక మానసిక ప్రవృత్తి అయివుంటుంది. ఆ అంశానికి అనుగుణంగా పాత్రలూ, స్థల, కాలాలూ ఎంచుకుంటాడతను, అంటే తాను గమనించిన విషయాన్ని తనస్ఫూర్తికి ఆనినంతవరకూ తాను చెప్పదలుచుకున్న విషయానికి ఎంత అవసరమో అంతే ఎంచుకోడం జరుగుతుంది. స్థూలంగా, ఒక మానసికప్రవృత్తిని ఆవిష్కరించ దలుచుకున్నప్పుడు, ఏ ఊళ్లో అన్న ప్రస్తావన అనవసరంగా తోచవచ్చు. ఒక సామూహికప్రవృత్తిని ఆవిష్కరిస్తున్నప్పుడు, సోమవారమా, శుక్రవారమా అన్నది అస్పష్టంగా వదిలేయవచ్చు. లేదా, పొరపాటునే, సోమవారం తరవాతిరోజు శుక్రవారం అని రాయొచ్చు. ఇది ఒకరకంగా సినిమాల్లో మొదటిసీనులో పసిబాలుడు మూడోసీనులో నవయువకుడిగా సాక్షాత్కరించడంలాటిదే. సినిమాలోలాగే కథ కూడా స్థల, కాలాల్లో చిన్న చిన్న కప్పదాట్లు వేయొచ్చు. ఇటువంటి లోపాలను పూర్వం పాఠకులు పట్టించుకోలేదు. ఆనాటికథల్లో నేను ఇలాటిపొరపాట్లు చాలానే చూసేను. కానీ ఇప్పుడు పాఠకులు, సోమవారానికీ శుక్రవారానికీ మధ్య మూడురోజులున్నాయి కదండీ అని ఎత్తి చూపుతున్నారు. అది తప్పని అనడంలేదు నేను. పాఠకులు ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తున్నారో అని అనిపించినా, నిజానికి ఆ పాఠకుడు ప్రధానాంశాన్ని గుర్తించలేదనే అనుకోవాలి. బహుశా సూక్ష్మపరిశీలనమూలంగా రచయితలు వాస్తవికతవిషయంలో మరింత శ్రద్ధ చూపవలసిన అగత్యం ఏర్పడింది అనుకోవాలేమో. ఇది ఒక కోణం.

స్థల, కాలవిషయాలలోలాగే వస్తువువిషయంలో వివరణలు కోరడం కూడా. కథని కథగా కాక, అందులో స్థలంగురించో, ఇతరవివరాలు తెలుసుకోడానికో చదువుతున్నట్టు కనిపిస్తుంది కొన్ని అభిప్రాయాలు చదువుతుంటే. కొందరు రచయితలు ఆ పాఠకులస్థాయికి ఎదిగి, సుదీర్ఘంగా విషయచర్చ చెయ్యడం కూడా కథల్లో కనిపిస్తోంది. ఒకకథలో ఒక జబ్బు ప్రసక్తి వస్తే, ఆ జబ్బు లక్షణాలూ, వాటికి వాడే మందులూ, మోతాదులూ, సత్ లేక దుష్ఫలితాలూ వంటివి రెండుపేజీల పొడవున చర్చించడం కొందరికి నచ్చుతుందేమో కానీ, నేను మటుకు చిన్నకథకి ఉండవలసిన క్లుప్తత దెబ్బతింటుందనే అనుకుంటాను. ఆకథలో అదే ప్రధానాంశం అయితే తప్ప. అలాగే డయాస్ఫొరా కథల్లో, అమెరికాకథల్లో, అమెరికాలో జీవనసరళిమీద విస్తృతంగా చర్చించడం. కథ అంటే కథే. అమెరికాకథలు చదివితే అమెరికాలో జీవనవిధానం కొంత తెలియొచ్చు కానీ అది జాగ్రఫీపాఠమో, సాంఘికచరిత్ర పాఠమో కాదు. కేవలం విషయసంగ్రహణకోసం ఎవరూ కూడా కథలమీద ఆధారపడకూడదు. కథలో వివరణ మోతాదు మించితే అది కథ అనిపించుకోదు.

కథారచయితకి స్వేచ్ఛ అవుసరం. అంటే అక్షరాలా ఉన్నదున్నట్టు, చూసింది చూసినట్టు కాక, కథ చిక్కగా నడపడానికి అనువుగా కల్పన చేసుకోవాలి. కథకి కేంద్రం కథాంశమే. ఇతరవివరాలు ప్రధానాంశాన్ని తినేయకూడదు. చిన్నకథకి ముఖ్యలక్షణాల్లో ఒకటి క్లుప్తత. ఇటు రచయితకి స్వేచ్ఛ, అటు పాఠకుడిని ఆకట్టుకోడానికి తగినట్టు స్పష్టత, వాస్తవికత – వీటిమధ్య పొత్తు కూర్చగల మధ్యేమార్గం కావాలి. అభిప్రాయాలు వెలిబుచ్చే పాఠకులూ, ఆ అభిప్రాయాలని గౌరవించే రచయితలూ కూడా గమనించవలసినవిషయం ఇది.

అసలు పాఠకులదృష్టిలో ఈమార్పు – ప్రతిచిన్నవిషయం రచయిత వాచ్యం చెయ్యాలి అని కోరుకోడం అభిలషణీయమేనా? మరీ అంత చాదస్తంగా ప్రతి చిన్నవిషయం అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు వివరించుకుంటూ పోతే నిజంగా పాఠకుడికి తృప్తి కలుగుతుందా? అన్నది ఆలోచించవలసిన విషయం.

ప్రసిద్ధవిమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య అభిప్రాయం చూడండి. రచయిత పాఠకులవూహకి ఏమీ వదిలిపెట్టకుండా, ప్రతి చిన్నవిషయం వివరించుకుంటూ పోతే, అది పాఠకుడి మేధస్సుని అవమానించినట్టే అంటారాయన. (“కథ చదవడం ఎలా?” తెలుగువెలుగు. టి.ఎ.జి.సి. వార్షికసంచిక, 2004). కానీ ఈనాడు వస్తున్న వ్యాఖ్యలు చూస్తే, కనీసం కొందరు వల్లంపాటివారి అభిప్రాయంతో ఏకీభవించినట్టు కనిపించదు.

నేను మాత్రం ఇది కథకీ వ్యాసానికీ మధ్యగల ఒక ముఖ్యమయిన వ్యత్యాసంగా గుర్తిస్తాను. పాఠకుడిలో ఆలోచనలూ, ఉత్కంఠ రేకెత్తించేగుణం కథకి అవసరం. ఋజువులూ, సాక్ష్యాలతో పాఠకుడిని నమ్మించవలసిన అవుసరం వ్యాసానికి మాత్రమే ఉంది కానీ కథకి కాదు.

వర్ణనలవిషయంలో కూడా ఇటువంటి సందర్భమే తటస్థపడుతోంది ఈనాడు. కథకి తగిన వాతావరణానికీ, పాత్రచిత్రణకీ పాఠకుడిమనసులో రూపు కట్టడానికి కావలసిన వివరాలు లేక వర్ణనలు కథలో చొప్పించడం సహజం. మన ముందుతరాలవారి కథల్లో, ఉదాహరణకి మధురాంతకం రాజారాం, కాళీపట్నం రామారావుకథల్లో, ఇలా వాతావరణం కళ్లకి కట్టినట్టు వర్ణించడం చూస్తాం. కానీ, రాను రాను కథలో కేవలం వస్తువు లేక సందేశానికే ప్రాముఖ్యత పెరిగిపోవడంవల్లా, ఒకొకప్పుడు నిడివిమీద పత్రికల ఆంక్షలవల్లా ఈవివరాలు తగ్గిపోతున్నాయి. ఇక్కడే మరొక కాంట్రడిక్షన్. పెద్దకథలు చదవడానికి పాఠకులకి తీరికలేదు. చాలామంది గబగబా ముగిసిపోయే కథలమీదే ఆసక్తి చూపుతున్నారు. మరి వివరాలు కావాలంటే కథ పెంచకతప్పదు. అలా పెంచడంమూలంగా కొందరికి సంతృప్తి కలగొచ్చు మరికొందరికి విసుగ్గా కనిపించవచ్చు. ఎలా చూసినా ఎంత వివరంగా రాయాలి అన్నది కత్తిమీద సాము అనిపించమానదు.

కథల్లో ఇలాటి లోపాలకి కొంతవరకూ మన మౌఖికసాహిత్య లక్షణాలు గుర్తించాలి. మనం వాటికి అలవాటు పడిఉండడం కావచ్చు.  60వ దశకం పాఠకుల, రచయితలమధ్య సంబంధం ఈ అలవాటుకి సంబంధించినదిగా కనిపిస్తుంది కథనరీతుల్లో. కథ ఎదురుగా ఉన్నవారికి చెప్పేటప్పుడు వారి ముఖకవళికలను బట్టి మార్పులూ, చేర్పులూ చేస్తూ వారి అవగాహనకి తోడ్పడతాడు. కానీ కాగితంమీద రాస్తున్నప్పుడు ఆ వెసులుబాటు లేదు. రచయితకి తనపాఠకులు ఎదురుగా లేరన్న స్పృహ లేకపోవడం కూడా జరగొచ్చు. అసలు సాధ్యం కూడా కాదు. ఈనాడు పాఠకులు ప్రపంచవ్యాప్తం. వారి అభిరుచులూ, అవగాహనస్థాయీ అనంతం. ఇది వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది. ఒకరు చాలాబాగుందన్న కథనే మరొకరు గందరగోళంగా ఉంది అనడం చూస్తూనే ఉన్నాం కదా.

ఇన్ని పరిమితులమధ్య ఈనాటి రచయిత తనకు తానే కొన్ని పరిధులు నిర్మించుకుని, తనకి అర్థమయినరీతిలో పాఠకులఅభిరుచులని ఊహించుకుని రాస్తున్నాడు. అతని వర్ణనలూ, వివరణలూ  ఆ పరిధిలోనే ఉంటాయి. కానీ ఇందులో ప్రమాదం ఏమిటంటే ఎప్పుడు ఆ పరిధులు మితి మీరుతాయో, ఎప్పుడు కథ సోదిగా మారిపోతుందో అన్నబాధ రచయితకి.

సాధారణంగా ఎప్పుడయితే పాఠకుడు “అలాటి సంఘటన జరిగివుండదు, అలాటి పాత్ర ఉండదు,” అంటాడో, అప్పుడే ఆ పాఠకుడు తనకి సుపరిచితమయిన ప్రపంచాన్ని అధిగమించి చూడడానికి ప్రయత్నం చెయ్యడం లేదు అన్నమాట. రచయిత అలాటి సంఘటనో, పాత్రో చూడడంచేతే రాసేడు అని పాఠకుడు అంగీకరించడంలేదు ఇక్కడ.

1960లో వచ్చిన “మారినవిలువలు” (ద్వివేదుల విశాలాక్షి) నవలలో చివర జానకి తల్లి, అన్నగారు, తదితరులజీవితాలు ఏమయిపోయేయో చెప్పలేదు కనక నవల అసంపూర్ణంగా ఉంది” అని ఒక పాఠకుడు రచయిత్రికి ఉత్తరం రాసేడుట. దానికి సమాధానంగా, విశాలాక్షిగారు “ఈనవల ఒక వ్యక్తికథ కాదు. ఇది ఒక కుటుంబచరిత్ర. ఎంతరాసినా అసమగ్రమే” అని జవాబిచ్చారు (మారినవిలువలు. ముందుమాట.)

నిజానికి ఈవివరణ అన్ని కథలకీ, నవలలకీ వర్తిస్తుంది. రచయిత తాను ఆవిష్కరించిన సందేశానికి తగినంతవరకే పాత్రలూ, సన్నివేశాలూ సమకూర్చుకోడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ చెప్తే, కథ పక్కదారి పట్టి, అసలు విషయం నీరసించిపోయే అవకాశం ఉంది. అలాగే అసాధారణసంఘటనలూ, సన్నివేశాలూ సృష్టించడం కూడా. ఒక మనిషి కోపంతో “తాడెత్తున లేచాడ“నో “తాట వొలిచేశాడ”నో అంటే నిజంగా అలా చేశాడని కాదు కదా. ఆవాక్యాల్లో వాస్తవికతలాటిదే కథల్లో వాస్తవికత కూడా.

మరొక ఉదాహరణ చూద్దాం. నానవల “చాతకపక్షులు“లో న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో తొలిసారిగా దిగిన కొత్తపెళ్లికూతురు కన్వేయర్ బెల్టుమీద సాగిపోతున్న సూట్‌కేసుని అందుకోబోతుంది ఆతురతగా. పక్కనున్న అమెరికన్ దాన్‌ని అందుకుని, తీసి ఆమెకి ఇస్తాడు. దీనిమీద ఒక పాఠకుడి వ్యాఖ్య “కొత్తవ్యక్తి అమెరికన్ చేతిలోనుండి ఆమె తనపెట్టె ఎలా అందుకుంది?” అని. అంటే ఆ అమెరికన్ పరపురుషుడనా? నాకు అర్థం కాలేదు. ఇదేదో నేను కనివిని ఎరగని సూడో కల్చరల్ కాన్సెప్టు అనుపించింది. ఇదే సన్నివేశంమీద మరొక పాఠకుడు వెలిబుచ్చిన అభిప్రాయంలో అతడు కథలో ప్రధానాంశంమీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అతని వ్యాఖ్య “న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్ చాలా హడావుడిగా ఉంటుంది. మనవారందరికీ వాళ్ల, వాళ్ల పిల్లా, మేకా చూసుకోడంతోనే సరిపోతుంది. రెండోఅంశం, మనదేశంలో అమెరినులగురించి ఉన్న అభిప్రాయం – వాళ్లు సొంతలాభం లేనిదే పొరుగువారికి సాయపడరన్నమాట – నూటికి నూరుపాళ్లూ నిజం కాదని చెప్పడానికీ, నవలలో దరిమిలా వచ్చే సంఘటనలకి సూచనప్రాయంగానూ కనిపిస్తోంది అని. నేను ఈ సన్నివేశం సృష్టించినప్పుడు నాఆలోచన కూడా ఈ రెండోపాఠకుడు చెప్పిందే. మొదటిఅభిప్రాయంలో పాఠకుడు తన వ్యక్తిగత, తెలుగు సాంప్రదాయకవిలువలని కథలో పాత్రలకి ఆపాదించేడు.

కొంతకాలం క్రితం ఉపాధ్యాయుల సూర్యకుమారి రాసిన “అమ్మ పెళ్లి” కథమీద కూడా ఇలాటివ్యాఖ్యలే వచ్చేయని రచయిత్రి నాకు రాసేరు. ఈకథ నాకు నచ్చింది. కారణం మామూలుగా డయాస్ఫొరాకథల్లో అట్టే కనిపించని ఒక కోణం – మన ఎన్నారై కుటుంబాల్లో తల్లి, కూతుళ్లమధ్య సాంస్కృతికపరమైన విలువలగురించిన సంఘర్షణ. ఇది పశ్చిమదేశాల్లో ఉన్న తెలుగువారి పరస్పర విరుద్ధభావాలకి మచ్చుతునక. నిర్దుష్టత లోపించినందువల్ల కావచ్చు.

పాఠకుడు తనకి తాను ఆలోచించుకోడం మానేసి, వివరణలకోసం పూర్తిగా రచయితమీదే ఆధారపడితే ఆకథ కథగా రక్తి కట్టదనే నేను నమ్ముతాను. నేను ఆలోచించుకోడానికి అవకాశం కల్పించే కథలే నాకు నచ్చుతాయి. కథ పాఠకుడిలో వాస్తవికతకి సంబంధించిన అల్పవిషయాలు కాక మౌలికంగా రచయిత ఆవిష్కరించిన అంశానికి సంబంధించిన ఆలోచనలు పాఠకుడిలో రేకెత్తించగలిగినప్పుడే అది మంచికథ అవుతుంది.

భాషవిషయం. కథనంలోనూ, విమర్శల్లోనూ కూడా కనివిని ఎరగని మార్పులొచ్చేయి. గత ఇరవై ఏళ్లలోనూ ఇంగ్లీషు తెలుగుని విపరీతంగా ఆక్రమించేసింది. డయాస్ఫొరాకథల్లోనూ, తెలుగుదేశంలో బస్తీలూ, ఆఫీసులూ నేపథ్యంగా గల కథల్లోనూ అయితే సగానికి సగం ఇంగ్లీషు మాటలే. వాటికి  అనువాదాలంటే, డు, ము, వు, లు లాటి ధాతువులు మార్చి, ఇంగ్లీషులో రాసేయడమే.

మనకి వివిధ ప్రాంతాల, కులాల, వృత్తులకి సంబంధించిన పదసముదాయం, ఒకొక పదానికి ఆనేక రూపాలు ఉన్నాయి. 80వ దశకంలో వచ్చిన మాండలీకం కథలు, పాటకజనం మాటాడుకునే భాషలలో వస్తున్నకథలమూలంగా కేవలం స్థానికులకి మాత్రమే తెలిసిన వాడుకపదాలు వేలకొద్దీ కథల్లో చోటు చేసుకుంటున్నాయి. పాఠకులకి భాషని గురించిన ఆలోచన ఉండడం ఎంతైనా హర్షించదగ్గ విషయం. కానీ వారు ఈ బేధాలని కూడా గమనించాలి.

నిజానికి నేను తెలుగులో రాస్తున్నప్పుడు కొంత శ్రమ పడవలసి వస్తోంది అమెరికాలో నేనున్నచోట తెలుగు వాడే అవకాశం లేనందున, భాష మర్చిపోతున్నాను. అలాగే ఏదో ఒక మాండలీకంలో రాసినకథ అర్థం చేసుకోడానికి కూడా అవస్థ పడాల్సివస్తోంది. నాతెలుగుని నిలబెట్టుకోవాలంటేనూ, విస్తృతపరుచుకోవాలంటేనూ అదొక్కటే మార్గం నాకు. మరి ఈనాటి పాఠకులకి ఆ ఓపిక లేదా? లేక, అసలాదృష్టి లేదా?

చివరిమాటగా, ఫెమినిజంగురించి ఒకమాట చెప్పి ముగిస్తాను. ఈమధ్య ఏకథలో ఒక స్త్రీపాత్ర ఏ అభిప్రాయం వెలిబుచ్చినా, అదుగో ఫెమినిజం, అనీ ఆరచయితని ఫెమినిస్ట్ అనీ ముద్ర వేసేయడం పరిపాటి అయిపోయింది. ఉదాహరణకి, ఒక కథలో భర్త “నాభార్య గిన్నెలు తీసి పెడుతుందిలెండి” అంటాడు. ఆమాటగురించి ఆ భార్య “నేను చేస్తాను” అనడానికీ “మాఆవిడ చేస్తుందనడానికీ” మధ్యగల తేడాగురించిన విచారణలో పడుతుంది. మరి ఈవాక్యంమూలంగా మొత్తం కథ అంతా ఫెమినిస్ట్ కథ అయిపోతుందా? అదే ఆ భార్యే, “మాఆయన చేస్తాడులెండి” అంటే బాగుండునా? ఇది ఒక సందేహం. ఇప్పుడు మరోకథ, “గుడ్డిగవ్వ” (వార్త. జనవరి 9, 2005) చూడండి. అమెరికాలో ఉన్న అన్నగారు గొంతు పూడుకుపోయిన తమ్ముడిని ఆపరేషను చేయించడానికి అమెరికా తీసుకువస్తాడు. వాళ్లింటికి, స్నేహితులు వచ్చినప్పుడు, కారులోంచి సూట్‌కేసులు తీసుకురావాలి. “నేను తెస్తాలెండి” అంటాడు అన్నగారు, ఉన్నచోటునించి కదలకుండా. తమ్ముడికి “తీసుకురా” అని చెప్పడు. తమ్ముడే వెళ్లి అందుకుంటాడు. ఈరెండు సన్నివేశాల్లోనూ రచయితగా నా అభిప్రాయం ఒకటే – ఒక మనిషి మరొకమనిషిచేత మరొకరిసేవకి ఉదారంగా  చేయించడం. అంతే. ఇందులో లింగభేదం కన్నా ఎక్కువగా కనిపించేది ఎవరు ఎవరిని వాడుకోగలిగితే, ఎలా వాడుకోగలిగితే అలా వాడుకోడం. అదీ నేను చెప్పదలుచుకున్నది. ముఖ్యంగా ఈ ఆచారం మనఇళ్లలోనే కానీ అమెరికన్ సాంప్రదాయంలో లేదు. ఇక్కడ ఎన్నారై మనస్తత్త్వాలూ, మారుతున్న కుటుంబవిలువలవిషయంలో అయోమయం కనిపిస్తుంది.      

మరొక విశేషం. వార్త తరవాత మరొక పత్రిక ఇది ప్రచురించుకున్నారు. వారు “నేను తెస్తాను” అన్న వాక్యాన్ని “ముత్యం (తమ్ముడు) తెస్తాడులెండి” అని మార్చేశారు, నన్ను అడక్కుండానే! అలా మార్చడంచేత కథలో భావం మారిపోయింది. ఒకరు మరొకరిని ఎంత నాజూగ్గా మరొకరిని సేవలోకి తోస్తారో చూపించదలుచుకున్న నాధ్యేయం మాయమయిపోయింది.

నాసందేహాలు – ఈ ఇజాలముద్ర వేయడంలో పాఠకులు తొందరపాటు చూపుతున్నారా? లేక, రచయితలే తాము ఆవిష్కరించదలుచుకున్నవిషయాన్ని స్పష్టం చేయలేకపోతున్నారా? అది అలా ఉంచి, అసలు ఈవాదాలకి అతీతంగా “కథకోసం కథ” (art for art’s sake) చదువుకోడం సాధ్యం కాదా? పోతన గానీ వేమన గానీ ఎవరిమెప్పుకోసమో, ఏ సాంఘికప్రయోజనం ఆశించో రాయలేదు కదా. కథారచయితలు, కనీసం కొందరు, కూడా అంతే అనుకోడానికి అవకాశం ఉందా? లేదా?

(ఫిబ్రవరి, 2005. కొన్ని మార్పులు, చేర్పులతో పునర్ముద్రణ, ఫిబ్రవరి 11, 2022)

Who Opposed Women’s Education? Why?

Who Opposed Women’s Education? Why?

స్త్రీవిద్య ఎవరు వద్దన్నారు అని ఇంతకుముందు రాసిన వ్యాసానికి వచ్చిన స్పందన బాగుంది. ఆవ్యాసం ఏదైనా పత్రికకి ఇచ్చి ఉంటే బాగుండేదని మిత్రుల సూచనను అనుసరించి,

ఇంగ్లీషులో, మరి కొంత విపులంగా చర్చిస్తూ, నేను సంప్రదించిన పుస్తకాల జాబితాతో సహా సారంగ సాహిత్య పత్రికకి పంపించేను.

వ్యాసం ప్రచురించిన సారంగ సంపాదకులకూ, ప్రోత్సహించిన మిత్రులకూ ధన్యవాదాలు.

వ్యాసానికి లింకు – ఇక్కడ

మీ వ్యాఖ్యలు సారంగ పత్రికలో గానీ ఇక్కడ గానీ తెలుపగలరు.

స్త్రీవిద్య కావాలి సరే, మరి ఎవరు ఎప్పుడు ఎందుకు వద్దన్నారో‌? 

నేను లెక్క లేనన్ని పుస్తకాలు చదవలేదు కానీ నాకు ఏదోవిధంగా దొరికిన పుస్తకాలూ, సమాచారమూ చూసేక, నాకు కలిగిన ఆలోచనలు లేక సందేహాలు సూక్ష్మంగా ఇక్కడ ప్రస్తావిస్తాను.

వేదకాలంలో స్త్రీలు చదువుకున్నవారే అనడానికి నిదర్శనంగా గార్గి, మైత్రేయి, లోపాముద్ర చాలామందికి తెలిసిన పేర్లే కాక అపాల, విశ్వవర వంటి అట్టే ప్రచారంలో లేనిపేర్లు కూడా  కనిపించేయి తెవికీలో. వారు వేదచర్చలలో పాల్గొని మహావిద్వాంసులతో వాదించగల సామర్థ్యం ఉన్నట్టు పండితులు అంగీకరించేరు. అయితే ఈ నాలుగురో పదిమందో మాత్రమేనా, ఇంకా ఉన్నారా అంటే మనకి స్పష్టంగా తెలీడంలేదు.

కదాచితుగా కవులు, చారిత్ర్యక పరిశోధకులూ ప్రకటిస్తున్న వ్యాసాలు చూసినప్పుడు ఒక సాధారణసత్యం కనిపిస్తోంది. ఈ విద్వత్తు గల స్త్రీలు రాజవంశాలలోనూ, ధనికవర్గాలలోనూ జన్మించినవారు అని. రాజపుత్రికలు, కలవారింటి స్త్రీలు సంస్కృతం నేర్చుకుని కవిత్వం వ్రాసేరు. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారి ఆంధ్రకవయిత్రులు పుస్తకంలో 283 కవయిత్రుల చరిత్రలు ఉన్నాయి.

అలాగే భండారు అచ్చమాంబగారి అబలా సచ్చరిత్ర రత్నమాలలోనూ అనేకమంది స్త్రిలరచనలు ప్రస్తావించేరు. అచ్చమాంబగారు భవభూతి సువాక్కు ఒకటి ఉదహరించేరు

అంటే

[[నా స్నేహితురాలు రమ నీలకంఠంగారిని ఈ వాక్యం సందర్భంగురించి అడిగితే వారు ఇచ్చిన సమాధానం ఇది. – శిశుర్వా శిష్యావా యదసి మమ తత్తిష్ఠతు తథా విశుద్ధేరుత్కర్షః త్వయి తు మమ భక్తిం ద్రఢయతి, శిశుత్వం వా స్త్రైణం వా భవతు నను వంద్యాసి జగతాం గుణాః పూజాస్థానం గుణిషు నా చ లింగం నుంచి వయః.

ఉత్తర రామచరితం లో చతుర్థోంకం లో అరుంధతి కౌసల్య వాల్మీకి ఆశ్రమంలో కలుసుకున్న సందర్భంలో సీత అగ్ని ప్రవేశం గురించిన ప్రస్తావన వస్తుంది. ఆ సందర్భంలో సీత ను తలుచుకుంటూ అరుంధతి కౌసల్య తో అన్న మాట ఇది. ఓ సీతా, నువ్వు నాకు శిశువువో శిష్యురాలివో ఆ సంగతి అలా ఉండనీ. నువ్వు పొందిన అగ్ని శుద్ధి గురించి విన్నాక నీ మీద నాకు మరింత భక్తి ధృఢమైంది. పసిదానివో ఆడదానివో ఎవరైతేనేమి? గుణవంతుల్లో గుణాలే వందనీయాలు. వాళ్ళు స్త్రీలా పురుషులా , అని కానీ, వయసు తో కానీ ప్రమేయం లేదు. – రమ నీలకంఠంగారికి ధన్యవాదాలు.]]

పోతే బడుగువర్గాలలో చదువులు ఆడపిల్లలకే కాదు మగపిల్లలకీ లేవు. ఇలా చూస్తే, అసలు ఎవరిచదువు అయినా వారి వారి ఆర్థికపరిస్థితులమీద ఆధారపడి ఉన్నట్టు కనిపిస్తోంది. విద్య కూడదు అన్నప్పుడు వివక్ష స్త్రీలపట్ల మాత్రమే కాదు. అది  స్త్రీ పురుషులిద్దరికీ  వర్తించింది.

వీరేశలింగంగారివంటి ప్రముఖ సాహిత్యచరిత్రకారులు సమకూర్చిన కవులచరిత్ర పుస్తకాలలో తాళ్లపాక తిమ్మక్క, మొల్ల వంటి బహుళప్రచారం పొందిన నాలుగైదు పేర్లు తప్ప మరే పేర్లూ కనిపించవు. నిడుదవోలు వెంకటరావుగారి తెనుగు కవుల చరిత్రలో శాసనాలు కవిత్వరూపంలో రచించిన స్త్రీలను అనేకమందిని ఉదహరించేరు. అయితే వీరు కేవలం శాసనాలేనా, వేరే ఏమైనా రాసేరా అన్నది నాకు స్పష్టం కాలేదు.

ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు సమకూర్చిన ఆంధ్రకవయిత్రులు గ్రంథానికి ముందుమాటలో ఈవిషయం విపులంగా చర్చించేరు. “లభ్యమైన రచనలను నిర్లక్ష్యం చేసి, స్త్రీలు వ్రాయలేదు అని ప్రచారం చేసేరు. పరోక్షంగా స్త్రీలు విద్యావంతులు కారు కనక స్త్రీలరచనలు లేవు అన్నభావం ప్రచారంలోకి తెచ్చేరు,” అంటారు లక్ష్మీకాన్తమ్మగారు.

ఈ కవయిత్రులచరిత్ర చదివినప్పుడు మనకి అట్టేమంది చెప్పని మరొక సత్యం – చదువు అంటే ఇచ్చుకున్న నిర్వచనం. చదువు అంటే పుస్తకాలు పుచ్చుకు పాఠశాలకి వెళ్తేనే చదువు అవుతుంది అని. ఇంట్లోనే ఉండి, తల్లిదండ్రులదగ్గరా, ఇతర గురువుల, పండితులదగ్గర నేర్చుకున్నది, స్వయంకృషితో శ్రమించి పుస్తకాలు చదివి సంపాదించుకున్న జ్ఞానం చదువు కాదు అన్న భావమే స్థిరపడింది మనసమాజంలో. కొంతవరకూ దీనికి కారణం ఆంగ్లప్రభువులు. ఇంగ్లీషువాళ్లు మొదట క్రైస్తవప్రచారంకోసమూ, తరవాత తమ పరిపాలనావిధానం మనకి “నేర్పడానికి” స్కూళ్లు స్థాపించడం. ఇది 20వ శతాబ్దపు తొలిపాదంలో జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని మన పండితులూ, సంఘసంస్కర్తలూ కూడా స్కూళ్లలో నేర్చుకున్నదే చదువు అని ప్రచారం చేసేరు. అలా ఇంట్దో ఉండి తండ్రులు నేర్పిన చదువు చదువు కాకుండా పోయింది. ఇది విద్యగురించి మనలో పాదుకున్న మొదటి తప్పుడు ఆలోచన అని నాఅభిప్రాయం.

రెండోది ఆడపిల్లలకి చాలా చిన్నతనంలోనే పెళ్లిళ్లు. ఇవి మధ్యయుగం, మహమ్మదీయ పరిపాలనకాలంలో వచ్చిందని ఒక అభిప్రాయం. చదివే వయసు వచ్చేలోపున పెళ్లిళ్లు చేసేయడంతో చదివే సమయమే లేకపోయింది వారిజీవితాలలో. ఈ చిన్నవయసులో పెళ్లిళ్లకి కారణం భద్రత అని ఒక వాదం.

క్రమంగా పెళ్లివయసు వాయిదా పడుతూ రావడంతో చదువులు కూడా మళ్లీ మొదలయేయి. ఎటొచ్చీ ఈ చదువు పాఠశాలల్లోనే ఎక్కువగా జరిగింది. ఇంట్లో చదువుకున్నవారు లేకపోలేదు కానీ చాలా తక్కువ. 50వ దశకంలో సుప్రసిద్ధులయిన రచయిత్రులలో కొంతమంది ఇంట్లో స్వయంకృషితో చదువుకున్నవాళ్లే.

ఇలా స్త్రీలు చదువుకోలేదు, స్త్రీలలో విద్యావంతులు లేరు అని మొదలు పెట్టి, స్త్రీలకి విద్య అవుసరం, స్త్రీవిద్య ప్రోత్సహించాలి అంటూ నినాదాలు ప్రారంభించింది 19వ శతాబ్దం మలిపాదంలో. వీరేశలింగంగారు స్త్రీవిద్య ప్రోత్సహిస్తూ ఆడపిల్లలికి వేరే పాఠశాలలు పెట్టేరు. అయితే పాఠశాలలో వారి విద్య మాత్రం పురోభివృద్ధి కోరేది కాదు. ఆ పాఠశాలలో సిలబస్ పూర్వకాలపు, ఈనాడు  మూర్ఖవాదాలుగా కనిపించే సతీధర్మాలూ, పతిసేవ, పిల్లలపెంపకమే. ఆడవాళ్ళు చదువులు లేకపోవడంవల్లే “కలహించుచు, తిట్టుకొనుచు కాలము వెళ్ళబుచ్చుకొందురు,” అన్నారు స్వీయచరిత్రలో. ఆయన అలాటి అభిప్రాయానికి రావడానికి కారణం బహుశా ఆయనచిన్నతనంలో ఆయనని పెంచేవిధానంలో తల్లీ, పెదతల్లీ కలహించుకోడం కావచ్చు.

సంస్కరణ, పురోభివృద్ధి అంటూనే స్త్రీలవిషయంలో ఆయన ప్రచారం చేసింది మాత్రం సనాతనభావాలే.  ఈనాడు ఎవరూ అంగీకరించనివే. వీరేశలింగంగారు స్త్రీవిద్యకి కృషి చేసేరని మెచ్చుకునేవారు కూడా ఈ సిలబస్ అంగీకరించరనే అనుకుంటాను.

వీరేశలింగంగారికి వ్యతిరేకం కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు. వెంకటరత్నం పంతులుగారు స్త్రీవిద్యకి వ్యతిరేకులు. ఆయనజీవితచరిత్రకోసం అంతర్జాలంలో చూసేను కానీ అట్టే వివరాలు కనిపించడంలేదు. స్త్రీవిద్యని వ్యతిరేకించడానికి ఆయన చెప్పుకున్న కారణాలు తెలియడం లేదు. స్వతహాగా ఆయన పండితులే కనక వేదకాలంనాటి విదుషీమణులగురించి ఆయనకి తెలిసే ఉండాలి మరి. ముష్టాముష్టి, బాహాబాహీ  కాదేమో కానీ తమ భాషాప్రాభవంతోనే వీరేశలింగంగారూ వెంకటరత్నంపంతులుగారూ  బాగానే  వాదించుకున్నారు. అలాగే చెళ్లపిళ్ల తిరుపతిశాస్త్రిగారూ  వేదం వెంకటరాయశాస్త్రిగారూ. అంటే, ఇలా కలహించుకోడానికీ, తిట్టుకోడానికీ  ఆడవాళ్లే కానక్కర్లేదు.  రామకృష్ణకవులు, తిరుపతి వెంకటకవులమధ్య వాదోపవాదాలగురించి వ్రాస్తూ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వీరిలో ఎవరిని గురువుగా ఎంచుకోవాలన్న  సంశయంతో సతమతమయేనని తమ అనుభవాలు జ్ఞాపకాలు లో వ్రాసేరు. ఇక్కడ విషాదం ఏమిటంటే “కలహించుచు, తిట్టుకొనుచు కాలము వ్యర్థపుచ్చుకొను”  వారు మగవారిలో కూడా ఉండడం! ఈనాటి రాజకీయనాయకులలోనూ మన మహాపండితులలో కూడా ఉన్నారు. నేనంటున్నది ఇలా కలహించుకోడానికీ, తిట్టుకోడానికీ ఆడవాళ్లే కానక్కర్లేదు. అలాగే చదువుకోనక్కర్లేదు కూడా. 

కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. రామకృష్ణకవులు, తిరుపతి వెంకటకవులవాదనలు జ్ఞానదాయకంగా ఉండేవి అని కూడా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు రాసేరు.

అసలు విద్యకి నిర్వచనం ఏమిటి అన్నది నా రెండో సందేహం.

వేదకాలంలో కూడా పండితురాండ్రు ఉన్నారు కదా. పలకలో పుస్తకాలో పుచ్చుకు స్కూళ్లకీ కాలేజీలకీ వెళ్తేనే చదువుకున్నట్టు లెఖ్ఖ అనడం సమంజసమేనా? విద్యకీ సంస్కారానికి ముడి పెట్టడం న్యాయమేనా‌? అలాగే నిజమైన విద్యకీ ఈనాడు “చదువుల”పేరున సాగుతున్న తతంగానికీ సంబంధం ఉందా? 

విద్య విద్ అన్న ధాతువులోంచి వచ్చినపదం. విద్ అంటే తెలుసుకోడం. అంతే. వినయంబు ఒసగు విద్య వస్తే మంచిదే. దానికి స్కూళ్లూ, కాలేజీలే కావాలనుకోడం మాత్రం నాకు నమ్మదగ్గదిగా అనిపించడంలేదు. ఈనాడు స్కూళ్లూ కాలేజీలూ ఇస్తున్నది సమాజంలో వృద్ధిలోకి రావడానికి. నిజమైన విద్య వ్యక్తివికాసం కలిగించేది. ప్రహ్లాదుడు చదువుకున్న, “చదువులలోని సారమెల్ల” గ్రహించేనని చెప్పుకోగల చదువు ఇప్పుడు లేదు.

స్త్రీలకి విద్య కావాలంటూ గొంతులు చించుకోనక్కర్లేదు. అసలు విద్య అంటే ఏమిటో తెలుసుకుని, ఆ నిజమైన విద్య బోధించేవారు కావాలి. ఆవిధమైన విద్యార్జనకి స్త్రీ పురుష బేధం లేదు అని నానమ్మకం.

 000

 (జనవరి 14, 2022)

The Status of Women in India, Then and Now by Illindila Saraswati Devi

ఇల్లిందల సరస్వతీదేవి గారి భారతనారి, నాడూ-నేడూ పుస్తకానికి నాఇంగ్లీషు అనువాదం తూలిక.నెట్ లో చూడగలరు.

పుస్తకం నిడివి దృష్ట్యా రెండు భాగాలుగా ప్రచురించదలుచుకున్నాను. మొదటిభాగం లింకు ఇక్కడ ఇచ్చేను.

https://thulika.net/?p=8595

డిసెంబర్ 22, 2021)

ఆర్తికథ అనువాదం – నాఅనుభవాలు

(ఇంతకుముందు లింకు ఇచ్చేను. ఇక్కడ పూర్తిపాఠం ఇస్తున్నాను, సారంగ మేగజైన్ వెబ్ పత్రిక అధిపతులకు కృతజ్ఞతలు.)

000

కాళీపట్నం రామారావుగారి ఆర్తి కథ గురించి, కథలో ఈనాటి వ్యవస్థగురించి రచయితఅవగాహన, భావజాలం – వీటిమీద చాలా చర్చలు జరిగేయి,  జరుగుతున్నాయి. కానీ శిల్పం, శైలిగురించిన ప్రస్తావన నేను చూడలేదు. బహుశా సిద్ధాంతవ్యాసాల్లోనో ఉపన్యాసాల్లోనో ఎవరైనా ప్రస్తావించేరేమో నాకు తెలీదు.

ఈ అనువాదం మొదలు పెట్టేక నాకు కొన్ని విషయాలు తోచేయి. ముఖ్యంగా నేను అనువాదాలు చేసి చాలాకాలం అయినందున కూడా మళ్లీ హరిః ఓం అని మొదటికొచ్చినట్టు అనిపించింది.

 హెచ్చరిక. నేను కాళీపట్నం రామారావుగారి కథలో లోపాలుగా వీటినిగురించి చర్చిడంలేదు. ప్రస్తుతానికి అనువాదాంకోసం ఈకథ సూక్ష్మంగా పరిశీలించడం జరిగింది కనక ఈకథని ఉదాహరణగా తీసుకున్నాను కానీ అనేక తెలుగుకథలలో ఈ అంశాలు కనిపిస్తాయి.

ఆర్తికథ చదువుతుంటేనూ, అనువాదం చేస్తుంటేనూ ఇందులో కథనం మౌఖికసాహిత్యంలో కథనంలా తోచింది నాకు. మౌఖికసాహిత్యంలో కథనం మనలో మనం మాటాడుకుంటున్నట్టు సాగుతుంది. అచ్చంగా అలాగే కాదు కానీ కొంతవరకూ stream of cosciousness శైలి అని కూడా అనొచ్చు. అంటే నాఅభిప్రాయం, కథ నడక (flow) విషయంలో రాతకీ మాటకీ తేడా. రాస్తున్నప్పుడు కట్టుదిట్టంగా పదం తరవాత పదం, వాక్యంతరవాత వాక్యం గోడ కట్టడానికి ఇటుకలు పేర్చినట్టు సాగాలి. ఆ నడకలో తర్కం కనిపిస్తుంది. ముఖాముఖీ మాటాడుతున్నప్పుడు అలా కాదు. నెమ్మదిగా ఆలోచిస్తూ మనసులోకి వచ్చినమాటలు ఒకదానితరవాత ఒకటి చెప్తాం. ఆవరసలో విషయానికి సంబంధించని మాటలు రావచ్చు. ముందు ఆడిన నాలుగు మాటలూ ఆ తరవాత ఆడిన నాలుగుమాటలు తూచి వేసినట్టు పడవు. అదే రాసినప్పుడు అయితే అనవసర పదాలో విషయాలో అయినట్టు కనిపిస్తాయి.

ఈకథ అనువదిస్తున్నపుడు నాకు కలిగిన సందేహాలు చెప్తాను. కొన్నిచోట్ల, ఆలోచించి నేను నిర్ణయం తీసుకోవలసిన అవస్థ అనుకోవచ్చు.

అసలు అనువాదం అంటేనే మరొకరికథ చెప్పడం. నాకథ అయితే నేనేం అనుకుంటున్నానో నాకు తెలుస్తుంది. మరొకరికథ చెప్తున్నప్పుడు నాకు ఎలా అర్థం అయిందో అలా మాత్రమే చెప్పడం జరుగుతుంది. అనేక సందేహాలకి ఆస్కారం ఉంది. అనువాదకులు నిర్ణయించుకోవలసిన సందర్భాలు ఉంటాయి. రచయితని అడగొచ్చు కానీ మనరచయితలు మీకు అవుసరమైనట్టు మార్చుకోండి అని ఒక blanket అనుమతి ఇచ్చేసందర్భాలే ఎక్కువ. నాకు అలా చాలాసార్లు జరిగింది.

 మొదటిది భాష. అందులో మాండలీకం మరొకస్థాయి. మామూలుగా ఏ మాండలీకం గానీ, ఆ మాండలీకంలోని సొగసులు అనువాదంలో రావనే నేను అనుకుంటున్నాను. అమెరికాలో పల్లెల్లో రైతులు వాడే మాండలీకం ఉంది కానీ అది నాకు పరిచయం లేదు. అలా పరిచయం ఉండి ఆ ప్రత్యేక వ్యావహారికంలో అనువాదాలు ఎవరైనా చేసేరేమో కూడా నాకు తెలీదు. నాకు మాత్రం తెలీదు కనక నాకు తెలిసిన శిష్టజనవ్యావహారికాన్నే నేను ఆశ్రియించేను.

 అనువాదం మూలం చదవలేనివారికోసం మాత్రమే. అందునా నాలాటి కొందరు మనసంస్కృతిని విదేశీయులకి పరిచయం చేయడంకోసం చేస్తారు. (ఈ తెలీనివారిలో ఇంగ్లీషు చదువులు చదివిన తెలుగువారు ఉండడం విశేషం.). అంటే కథలో వస్తువుకీ, భావాలకే పెద్దపీట. శైలి నామమాత్రమే. భాషాశాస్త్రవేత్తలు కవిత్వస్థాయిలో శైలి పట్టుకోగలరేమో నాకు తెలీదు.

ఆర్తి కళింగాంధ్రలో ఒక వర్గం -రైతులు, మాలవారు, నాయుళ్లు – మాటాడుకునేభాషలో రాయడం జరిగింది. ఈభాష ఇప్పుడు ఎంతమంది ఇంకా వాడుతున్నారో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ప్రతిపదం కుస్తీపట్లే అయింది. దీంతో నేను తెలుగూ, ఇంగ్లీషూ కూడా ఎంత మర్చిపోయేనో అర్థం అయింది. ఇది వైయక్తం అనుకోండి. అది వేరే కథ. కళింగాంధ్ర నిఘంటువులు మూడు చూసేను కానీ దాదాపు అన్ని సందర్భాలలోనూ నేను వెతికినపదం కనిపించలేదు! అంచేత ఏ ఒక్క పదానికైనా అనువాదం సరి కాదనుకుంటే తెలియజేయగలరు. దిద్దుకుంటాను. కానీ కథానువాదం పదానువాదం కాదు అని గమనించాలి. కొన్నిపదాలు తప్పనిసరిగా వదిలేయవలసివచ్చింది నాకు.

మొదట్లో చెప్పినట్టు ఆర్తికథలో శైలిగురించి చర్చలు జరిగేయో లేదో నాకు తెలీదు. కానీ కొన్ని సందర్భాలు అనువాదపరంగా నన్ను ఆలోచించుకునేలా చేసేయి.

ఆర్తి కథలో కోటయ్య “సన్నిని రెక్కపట్టుకు చూరుకిందనించి లాక్కొచ్చి ఒక్కతోపు తోసేడు.” అని ఒకచోట ఉంది. ఆ తరవాత, “సన్నిని ముట్టుకోవలసిన పనిలేకుండా తుండుగుడ్డ ఆమె నడుంకి చుట్టి గొరగొర ఈడ్చుకుపోతున్నాడు.” అని ఉంది. Edgar Ellen Poe, వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారివంటి సాహితీవేత్తల సూత్రాలు పాటించేవారు ఇది శిల్పంలో ఒక లోపమనే అంటారు. కానీ తెలుగుపాఠకులకి ఇదేమంత పట్టించుకోవలసినవిషయంగా తోచదు.

ఇక్కడ నాసందేహం విదేశీపాఠకులు ఎలా స్పందిస్తారనే. రెక్క పుచ్చుకు లాగినప్పుడు ముట్టుకోడం జరిగింది కదా అని అడుగుతారు. కోటయ్య పట్టలేని ఆవేశంలో మొదట రెక్క పుచ్చుకు లాగేడు కానీ తరవాత నిగ్రహించుకున్నాడు అని సమర్థించుకోవచ్చు. సమర్థించుకుంటాం మనం. సాధారణంగా ఇది విదేశీపాఠకులకి గందరగోళంగానే ఉంటుంది. నేను అనువాదాలు మొదలుపెట్టిన రోజులలో నా అమెరికన్ స్నేహితులని సంప్రదించేను కనక గట్టిగా చెప్పగలుగుతున్నాను.

సందేహాలూ సందిగ్ధాలూ. కొన్నిచోట్ల రచయిత చెప్పింది నాకు సరిగా అర్థం అయిందా అన్న సందేహం. కొన్నిచోట్ల రచయిత చెప్పింది అర్థం అయింది కానీ ఉద్దిష్ట పాఠకులకోణంలోనుంచి చూస్తే ఇది కథకి ఏమాత్రం అవుసరం, నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్న సందిగ్ధం.

”గొప్పవాళ్లలో గొప్పవాళ్లూ, చాలాగొప్పవాళ్లూ, అతిగొప్పవాళ్లూ ఉన్నట్టే పేదవాళ్లలో కడుపేదలు, నిరుపేదలు ఉంటారు” అని వాక్యం. ఇది చదవగానే నాకు తోచిన మొదటి ఆలోచన పేదవాళ్లలో రెండే వర్గాలని. కానీ ఆ తరవాత కథకుడు ఎర్రెమ్మ ఆస్తి లెక్కగట్టి “ఆమె నిరుపేద, … కడుపేదల కోవలోకి చేర్చరాదు” అంటారు. “ఆమెతో తైపారువేస్తే, బంగారి వొత్తి పేదరాలు మాత్రమే అవుతుంది”.  ఇక్కడికొచ్చేక కానీ నాకు అర్థం కాలేదు పేదరాలు వర్గం, నిరుపేద, కడుపేద కాక మరొక వర్గం అని. తదనుగుణంగా అనువాదంలో చిన్నమార్పు చేయవలసివచ్చింది. ఇది సందిగ్ధం అన్నమాట, నేను నిర్ణయించుకోవలసిన సందర్భం.

బారికి రామయ్య పైడయ్యని పట్నంలో కలుసుకున్నప్పుడు పైడయ్య తనకి ఇల్లు లేదనీ, పెద్ద బజారులోనే ఓ మూల పడుకుంటానని చెప్తాడు. ఆ తరవాత మురికివాడకి తీసుకువెళ్తాడు. మరి పైడయ్యకి గది ఉన్నట్టా లేనట్టా? ఈ సందేహం అలాగే వదిలేసి, ఉన్నదున్నట్టు అనువాదం చేసేను పాఠకులే నిర్ణయించుకుంటారని.

అలాగే, రామయ్య వచ్చి వెళ్లిపోయేక, పైడయ్య తనగది గురించి ఆలోచనలో పడతాడు. “పది రాళ్ళు జేబులో ఉన్నప్పుడల్లా ఫరవాలేదనిపించినా డబ్బులు తక్కువైనప్పుడల్లా ఆమాటలు గుర్తుకొచ్చేవి” అంటాడు కథకుడు. ఇక్కడ రామయ్యమాటలు గుర్తు తెచ్చుకోవాలి. అలాటిగదిలో ఉండడంకన్నా “తిండి నేక ఏ గడ్డో కరిసి సావడం మేలు” అంటాడు రామయ్య. అతను తిండిమాట అన్నా, పైడయ్య దాన్ని తను ఉంటున్న గదికే అన్వయించుకున్నట్టు కనిపిస్తోంది. నాసందేహం – ఆ గది అంత అధ్వాన్నంగా ఉంటే, డబ్బులు ఉన్నప్పుడు అది ఫరవాలేదని ఎలా అనిపిస్తుంది అని. వాక్యం అర్థమవుతూనే ఉన్న అన్వయించుకునేతీరులో సందిగ్ధత ఉంది. ఈవాక్యం నేను మార్చలేదు. ఉన్నదున్నట్టు అనువదించేను, అన్వయం పాఠకులకి వదిలేసి.

కథలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. మనం మామూలుగా కథలో క్రియాపదం ఏకాలంలో ఉన్నా అంతగా పట్టించుకోం. కథలన్నీ చాలామటుకు భూతకాలంలో చెప్పడంతోనే మొదలవుతుంది కానీ వర్తమాన, భవిష్యత్ ప్రత్యయాలు కూడా వాడేస్తాం. అలాగే కథలో అంతకుముందు జరిగిన మరో సంఘటన చెప్తున్నప్పుడు కూడా అదే ప్రత్యయం వాడుతాం. ఏ ఒక్కకాలం తీసుకున్నా, ఆకాలంలో కాలక్రమ నిర్ణయం చేయగల తేడా తెలుగుకథలో లేదు.

ఇంగ్లీషులో అలా కాదు. కథ భూతకాలంలో చెప్తే, అంతకుముందు జరిగిన సంఘటన తప్పనిసరిగా past perfectలో ఉండాలి. ఒక వాక్యం అయితే ఫరవాలేదు కానీ పది వాక్యాలలో ఒక సంఘటన వివరించవలసివస్తే, అన్ని వాక్యాలు past perfect లో రాస్తే చదవడానికి ఇంపుగా ఉండదు. మరోలా స్పష్టం చేయాలి. అందుకు చిన్నమార్పులు చేయవలసిరావచ్చు.

ఆర్తి కథలో పైడయ్య సాయంకాలంపూట ఏటిఒడ్డున సన్నికోసం ఎదురు చూస్తూ ఆలోచనల్లో పడతాడు. ఆ సమయంలో తాను వెనక ఎప్పుడో మాదిగప్పయ్యకూతురుమీద జరిపిన అత్యాచారం, ఆ మధ్యాహ్నం కోటప్పతో మాటాడినమాటలు ఆలోచిస్తుంటాడు. ఆ ఆలోచనల్లోనే కోటయ్య చెప్పిన ఇంకా వెనకటి ఉదంతం- రామయ్యకోడలికీ తనకీ మధ్య జరిగిన ఉదంతం తలుచుకుంటాడు. ఇవన్నీ కథలో కథ, ఆ కథలో అంతకుముందు జరిగిన కథ, ఇంకా వెనకటికథగా మూడు స్థాయిలలో ఉంది. ఇంగ్లీషులో past, past perfect రెండే ఉన్నాయి. నిజానికి తెలుగులో వెనక, ఆవెనక, అంతకంటె వెనక అంటూ కాలనిర్ణయం క్రియాపద ప్రత్యయాలలో లేదు. అయినా మనకి ఏది ఎప్పుడు జరిగిందో తెలుస్తుంది. నాకు కొంత సమయం పట్టిందనుకోండి ఇది తెలుసుకోడానికి. అది వేరేసంగతి. నేను అంటున్నది ఇది మౌఖికసాహిత్య లక్షణం అని. మనసంస్కృతి తెలీనివారికోసం అనువాదం చేస్తున్నప్పుడు ఇది మాటలలో స్పష్టం చేయాలి. దీనికి కొన్ని కిటుకులు ఏదో సైటులో చూసేను కానీ ఇక్కడ నేను పాఠాలు పెట్టబోవడంలేదు. మీదృష్టికి తీసుకువచ్చేవరకే నాపని.

క్లుప్తతవిషయంలో చెహోవ్ సూత్రం – గదిలో తుపాకీ ఉందని రాస్తే కథ ముగిసేలోపున అది పేలాలి అన్న సిద్ధాంతం ఆశ్రయించే విమర్శకులు ఎంచడానికి వీలయిన వాక్యాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి పెద్దమ్మ ఊరు వర్ణిస్తూ ఊరుమధ్య “చిక్కని కొబ్బరిచెట్లనీడ మధ్యని ఎత్తుగా దేవాలయం” ఉందంటాడు కథకుడు. ఆతరవాత ఆ దేవాలయం ప్రసక్తి లేదు. అది ఉందని తెలిసినా తెలియకపోయినా పాఠకుడికి ఒకటే. కథ నడకకి ఆవాక్యం దోహదం చేయదు. అనువాదంలో తొలగించేసేను నేను. అంటే చెహోవ్ సూత్రం పాటిస్తున్నానని కాదు. కథ అయోమయానికి తావీయకుండా ఉండాలి, కథ పటిష్టంగా చిక్కగా ఉండాలనుకునే పాఠకుల సౌకర్యార్థం అనే ఉద్దేశ్యంతో.

ఏమైనా ఈ కథ అనువాదం నాకు చాలా పెద్దపాఠమేనని చెప్పుకోవాలి. రచయిత కాళీపట్నం రామారావుగారికి కృతజ్ఞతలు.

000

The Yearning link: https://thulika.net/?p=1691

తెలుగుమూలం కథానిలయంలో ఉంది.

(జులై 30, 2021)