ధనం కంటే బలవత్తరం అహం

ఇండియాలో స్త్రీలదుస్థితిగురించి కుప్పలుతిప్పలుగా ఉన్నాయి కథలు. మనదేశంలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం, సరే. విదేశాల్లో కూడా ఇదే అభిప్రాయం చాలా బలంగా ఉంది. అదే అభిప్రాయాన్ని బలపరుస్తూ మనవాళ్ళు అవే కథలు చెప్తారు, అదేదో మనకి మాత్రమే ప్రత్యేకం అయినట్టు. ఇది నిజం కాదు అని అనడం లేదు నేను. Continue reading “ధనం కంటే బలవత్తరం అహం”

ప్రకటనలు

ఈ సంస్కృతి కృత్రిమం.

సాధారణంగా మనం సంస్కృతి అన్నపదం ఒకజాతికో, ఒకదేశానికో చెందిన తినే తిండి, కట్టే బట్టా, తలదాచుకోడానికో ఇల్లూ, ఆచారాలు, పద్ధతులు, నీతినియమాలు వంటి Continue reading “ఈ సంస్కృతి కృత్రిమం.”

మీకు వివక్ష కనిపిస్తోందా?

ఏ విషయమైనా చక్కగా తెలుసుకోవాలంటే మన పరిశీలనాదృష్టి సమగ్రం సమతుల్యం కావాలి. రెండు కథలు చెప్తాను. Continue reading “మీకు వివక్ష కనిపిస్తోందా?”

G.V. Sitapati: History of Telugu Literature. పరిచయం

గిడుగు వెంకట సీతాపతిగారు ఇంగ్లీషులో తెలుగు సాహిత్యచరిత్ర రచించిన గ్రంథం ఇది. Continue reading “G.V. Sitapati: History of Telugu Literature. పరిచయం”

విదుషి బుఱ్ఱా కమలాదేవిగారు

బుఱ్ఱా కమలాదేవిగారి పేరు నాకు చాలాకాలంగా పరిచితమే అయినా దురదృష్టవశాత్తూ వారి పుస్తకాలేమీ నాకు దొరకనందున చదవడం పడలేదు. Continue reading “విదుషి బుఱ్ఱా కమలాదేవిగారు”

నిడుదవోలు వెంకటరావుగారి రచనలు – పరిశీలన. డా. నిష్టల వెంకటరావు.

ఇది డా. నిష్టల వెంకటరావుగారి సిద్దాంత వ్యాసం.

నిడుదవోలు వెంకటరావుగారు బహుముఖ ప్రజ్ఠాశాలి. వారు తెలుగు సాహిత్యానికి చేసిన అద్వితీయమైన కృషి తెలుగు సాహిత్యచరిత్రలో ప్రతిష్ఠాత్మికమైన  మైలురాయి. నిష్టల వెంకటరావుగారు నిడుదవోలువారి సాహిత్యాన్ని సాకల్యంగా పరిశీలించి, వివిధాంశాలను మనముందు ఉంచారు ఈగ్రంథంలో.

నేను ఇంతకుముందు రెండు వ్యాసాలలో నిడుదవోలు వెంకటరావుగారిసాహిత్యాన్ని స్థాలీపులాకన్యాయంగా పరిచయం చేయడానికి ప్రయత్నించేను. అప్పట్లో నిష్టలవారి పుస్తకం చూసినా, వివరంగా చదవడానికి వీలు లేకపోయింది. ఇప్పుడు పుస్తకం సంపూర్ణంగా పిడియఫ్ రూపం‌లో దొరకడంతో మళ్లీ చదివి వివిధ అంశాలు సంగ్రహంగా గ్రహించడానికి అవకాశం కలిగింది. అంచేత ఈ పుస్తకం విడిగా మళ్ళీ పరిచయం చేస్తున్నాను. చదువుతున్నప్పుడు నాకు కలిగిన అభిప్రాయాలు కూడా కొన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. నా పూర్వపు వ్యాసాలకి, ఈపిడియఫ్ రూపానికి లింకులు వ్యాసం చివరలో ఇచ్చేను.

ఇద్దరూ “వెంకటరావు” నామధేయులే కనక, చదువరులసౌకర్యార్థం ఈవ్యాసంలో ఇంటిపేర్లు వాడుతున్నాను.

ఈగ్రంథంలో 10 అధ్యాయాలున్నాయి. మొదటిఅధ్యాయంలో నిడుదవోలువారి జీవితచరిత్ర, చివరి అధ్యాయం ముగింపు. వీటిమద్య నిడుదవోలువారి సాహిత్యకృషి ఎనిమిది అధ్యాయాలుగా విభజించి ఆవిష్కరించేరు. అవి పీఠికలు, వీరశైవ వాఙ్మయము, భాష (వ్యాకరణము, ఛందస్సు), తెలుగు కవుల చరిత్ర, ఆంధ్ర వచనవాఙ్మయము, వాఙ్మయచరిత్ర (ఉదాహరణ వాఙ్మయము, దక్షిణ దేశీయవాఙ్మయము), గ్రంథసంస్కరణలు, నిఘంటురచన. నిష్టలవారు ఒకొక అధ్యాయం సాకల్యంగా పరిశీలించి, విస్తృత ఉదాహరణలతో వివరించేరు. తద్వారా, ఈ గ్రంథం స్వయంప్రతిపత్తి గల రచన అయి నిలిచింది.

నిడుదవోలు వెంకటరావుగారిని “దశదిశాభరణాంకులు” అంటారు. ధీర్ధారణావతీ మేధా, ధారణగల బుద్ధే మేధ అంటారుట పెద్దలు. అటువంటి మేధ నిడుదవోలువారికి పుష్కలంగా ఉందదంటారు. నిజమే మరి. పుస్తకం చదివేనంటే చదవేను అనడం కాదు. అందులో విషయాలను ఆకళించుకును  తమకున్న జ్ఞానంతో సమీకరించి చూసుకోవాలని మాత్రం అనుకుంటాను.

కొత్తపల్లి వీరభద్రరావుగారు ఈ గ్రంథానికి రాసిన “ఆమోదం”లో సి.పి. బ్రౌన్ దొరకీ నిడుదవోలువారికీ గల పోలికని ప్రస్తావిస్తూ, బ్రౌన్ అనేక పండితులసహాయంతో సాదించినది నిడుదవోలు వెంకటరావుగారూ ఒక్కరే సాదించేరని మరువకూడదు అన్నారు.

ఇక్కడ నామాటగా, విదేశీపండితులకీ, స్వదేశీపండితులకీ గల వ్యత్యాసం మనం గమనించాలి.  స్వదేశీయులకి తమచుట్టూ గల సాంస్కృతిక, సామాజిక, కౌటుంబిక వాతావరణం అదనపు సౌకర్యం. ఎంత అడిగి తెలుసుకున్నా, అనేక సూక్ష్మవిషయాలు, ఒకొకప్పుడు మాటలకి అందనివి విదేశీయుల అBగాహనపరిధిలోకి చేరడం వీలు కాకపోవచ్చు.

జి.వి. సుబ్రహ్మణ్యంగారు గత రెండు శతాబ్దాలలో ఆదునిక పరిశోధనావికాసాన్ని నాలుగు వర్గాలుగా విభజించి, నిడుదవోలు వెంకటరావుగారి వ్యాసంగం ఆ నాలుగు వర్గాలనూ క్రోడీకరించిన కృషిగా అభివర్ణించేరు.

పీఠిక అధ్యాయంలో నిడుదవోలువారికి రచయితకంటె రచనమీదే ఎక్కువ దృష్టి అంటారు. ఆకారణంగానే ఆయనపిఠికలకు ప్రత్యేకమైన గౌరవం. అక్కడక్కడ చూసి నాలుగు ముక్కలు రాసి ముగించరు నిడుదవోలువారు. విషయం క్షుణ్ణంగా వివరిస్తారు. ఆయన కాపురమే పీఠికపురము అన్నారుట గంటి సూర్యనారాయణశాస్త్రిగారు. ప్రముఖ కవి దాశరథిగారి దాశరథీశతకం 33 పేజీల పుస్తకానికి నిడుదవోలు వారు 47పేజీల పీఠిక రాసేరు. ఆ పీఠికమూలంగా తమపుస్తకానికి ప్రాచుర్యం వచ్చిందిని ఆయనే నిడుదవోలువారికి ఉత్తరం రాసేరు.

ఈ అధ్యాయంలోనే విక్రమాంకదేవచరిత్ర అనువాదంవిషయంలో నిడుదవోలువారు కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారూ, మాదిరాజు విశ్వనాథరావుగారూ అనువాదం ఆమోదించేరు. అది చారిత్రకంగా తిరుపతి వెంకటకవులతరవాత ప్రచురించినా, ద్వితీయమైనా ఇదే అద్వితీయం అన్నారు. అఁదుకు కారణం లక్ష్మణశాస్త్రిగారూ, విశ్వనాథరావుగారూ మూలంలో ఒక్క పద్యం కూడా విడువకుండా అనువదించేరనీ, సంస్కృతకావ్యం చరిత్రకి సంబంధించినది కనుక పదాలను వదిలేస్తే చరిత్రకు లోపం కలుగుతుందనీ, ఈ అనువాదం చారిత్రకదృష్టితోనే కాక సాహిత్యదృష్టితో చూసినా అద్వితయమే అని మెచ్చుకున్నారుట.

ఇది ఈనాటి అనువాదకులు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన అంశం అని నాఅభిప్రాయం.  అనువాదాలు చేసినప్పుడు వాటికి ఉండగల దీర్ఘకాలికప్రయోజనం ఏమిటి అన్నది పరిశీలించి చూసుకోవాలి అనువాదకులు.

ఈ అధ్యాయంలో మరోవిషయం – విశ్వవిద్యాలయాలలో పాశ్చాత్యవిమర్శనా పద్ధతిమూలంగా, ప్రబంధసాహిత్యాధ్యయనం, ప్రబంధపఠనాభినివేశం అంతరించిపోతున్నందుకు నిడుదవోలువారు చింతించేరన్నది. ఈ సంందర్భంలో తిరుమల రామచంద్రగారు ఒక సభలో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చేరని చెప్పి వారిమాటలు ఉదహరించేరుట.

ఈ వాక్యాలు ఎప్పటివో నాకు తెలీదు కానీ ఈ పరిస్థితిలో ఇప్పటికీ మార్పు లేదు సరి కదా, హీనం కూడా అవుతోందేమో. కొంతకాలంక్రితం చూసేను ఏ సిద్ధాంతగ్రంథమో సరిగా గుర్తు లేదు కానీ తెలుగుకథమీద సిద్దాంతవ్యాసం అది. అందులో ఆంగ్లకవుల, పండితుల అభిప్రాయాలతో పేజీలకు పేజీలు నింపేసారు. అసలు తెలుగు సాహిత్యంలో పరిశోధన అంటే ఆంగ్రవిమర్శకుల అభిప్రాయాలపోగు అనిపించేస్థితికి వచ్చేస్తున్నాం! నిష్టలవారి గ్రంథం సిద్దాంతగ్రంథం పూర్తిగా నిడుదవోలు వెంకటరావుగారి రచనలగురించే. ఈ పుస్తకం నాకు నచ్చడానికి ఇది మరొక ముఖ్యకారణం.

ఈ అధ్యాయంలోనే నన్ను ఒకింత ఆశ్చర్యపరచినది ఆంధ్రసాహిత్యపరిషత్తువంటి ప్రముఖ సాహిత్యసంస్థల కత్తిరింపులు. చిత్రకవి పెద్దన రచించిన లక్షణసార సంగ్రహానికి నిడుదవోలువారు తెలుగులో మొదట నాటకలక్షణం అంటూ చక్కని పీఠిక రాస్తే, ఆంధ్రసాహిత్యపరిషత్తువారు ఆ పీఠిక వదిలేసి పుస్తకం ప్రచురించేరు 1960లో. అలా వదిలేయడం తమవంటి పరిశోధకవిద్యార్థులకు పెక్కు ఇక్కట్టులు తెచ్చి పెడుతుంటాయన్నారు నిష్టలవారు. ఇది కూడా సర్వకాలీనమే. సంపాదకులు, ప్రచురణకర్తలు తమ ఇష్టం వచ్చినట్టు కత్తిరేయడం సాహిత్యానికి అన్యాయమే.

రెండవ అధ్యాయం – వీరశైవవాఙ్మయం-  సి.పి. బ్రౌన్ ప్రాతఃస్మరణీయుడు అంటూ ప్రారంభించి, వీరశైవసాహిత్యానికి ఈ ఇద్దరు ప్రజ్ఞానిధులు చేసిన అపార సాహిత్యసేవలో సామ్యాలను సూక్ష్మంగా ప్రస్తావించి. నిడుదవోలువారి రచనలు పరిశీలనాత్మకంగా వివరించేరు. వీరి జీవితాలలో కూడా సామ్యాలను చూపించారు నిష్టలవారు.

20వ శతాబ్దంలో బసవపురాణం, పండితారాధ్యచరిత్ర ప్రచురణలతో శివకవులయుగంగా స్థిరపడింది, సాహిత్యంలో జాతి, మతవివాదములు కూడదని నిరూపించినవారు శివకవులంటారు. ఈ భాగం చదువుతున్నప్పుడు ఇది హైందవధర్మాలను కాదనడమా అన్న సందేహం నాకు కలిగింది. కానీ వైదికదర్మాలను నిరసించడం ఇంతకు పూర్వమే బుద్ధుడు, జైనులకాలంలో కూడా జరిగింది కదా. ఈమతవిషయికమైన చర్చ ఇక్కడ పెట్టను కానీ నాకు కొన్ని సందేహాలున్నమాట వాస్తవం.

శివతత్త్వసారము చిన్న పుస్తకమే అయినా సాహిత్య చరిత్ర తెలుసుకొనగోరువారికి ఉపయోగపడగల సాధనమని, మతసంబంధమైన చిన్న శతకమన్న అభిప్రాయంతో ఇది  ప్రకటించేమన్నారు కె.వి. లక్ష్మణరావుగారు. పీఠిక, ఉపోద్ఘాతం, లఘుటీక తామే రాసి ప్రకటించేరు. ఆనాటి పండితులశ్రద్ధ, విస్తృతపరిధిలో దాన్నిగురించిన విచారణ గమనిస్తాం ఇక్కడ.

నిడుదవోలువారు ప్రత్యేకించి భాషాశాస్త్ర గ్రంథం అంటూ ఏమీ రాయకపోయినా, భాషాశాస్త్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించేరు వారి వ్యాసాలలోనూ, గ్రంథాలలోనూ. అవి భాషాశాస్త్ర పరిశోధకులకు ఉపయోగపడుతున్నాయి.

వచనవాజ్మయంనుండి తెలుసుకోవలసింది ఎంతో ఉంది. నిడుదవోలువారు గద్య వేరు, వచనం వేరు అని ఆ రెంటివిశేషాలు వివరించేరు సాహిత్యంలో తొలిసారిగా. ప్రజలు నిత్యవ్యవహారంలో ఉపయోగించే మాటలు వచనం. నిత్యవ్యవహారంలో కాక కొంత ఉన్నతస్థాయిలో ఆలోచనాస్థాయిలో వాడేమాట గద్యం అన్నారు. ఛందోబద్ధమైన వాక్యం పద్యం సాలోచనమై, ప్రయత్నపూర్వకమైన కవివచనం గద్యం. ఈ ప్రాతిపదికమీద ప్రాచీనగ్రంథాలలోని గద్యరీతులు విపులంగా చర్చించేరు వచనవాఙ్మయం అధ్యాయంలో.

ఇలాటి కథలు ఆసక్తికరం కదా. తెలుగులో వచనవాఙ్మయచరిత్ర పరిణామం సమగ్రంగా తెలుసుకోవాలంటే నిడుదవోలువారి గ్రంథం చదవాలనుకుంటాను.

వ్యాకరణం అధ్యాయంలో నాకు ప్రత్యేకంగా కనిపించింది తెలుగులో ఋ లేదన్నది. సంస్కృతంలో మాత్రమే ఉందిట. అలాగే శకటరేఫ(ఱ), సాధారణరేఫ(ర)ల చర్చ కూడా నచ్చింది. ప్రధానంగా ఈరోజుల్లో చాలామంది ఈ ఋ, ఱ లు సరిగా రాయడంలేదని లేవదీస్తున్న ఒకర్నొరు తప్పులు పట్టుకోడం మూలంగా.

చాఠు. చాఱు – అర్థాలు వేరు.

ఇంతకీ మరి అన్నంలో కలుపుకునే చారుకీ, చారుశీలే లో చారుకీ అర్థాలలో చాలా దూరం కానీ గుణింతాలలో తేడా లేదు.

యతి ప్రాసలు, ఛందస్సులగురించి నిష్టలవారే ఇంత రాస్తే నిడుదవోలువారి గ్రంథం ఇంకా ఎన్ని విశేషాలు ఉంటాయో అనిపించింది. ఈవిషయాలు నాకు అగమ్యగోచరం కనక ప్రస్తావించబోను కానీ ఆసక్తిగలవారిని తప్పక ఆకట్టుకోగలదు.

వ్యాకరణంవిషయంలో గిడుగు వెంకటసీతాపతిగారు చెప్పిన మరొక విశేషం కూడా ఇక్కడ ప్రస్తావిస్తాను. సీతాపతిగార A History of Telugu Literature అన్న గ్రంథంలో వెలిబుచ్చిన అభిప్రాయం ఇది –

పిడుపర్తి బసవకవి సోమనాథుని ప్రభులింగలీల సంస్కృతంనుండి తెలుగులోనికి అనువాదం చేసేడు, (1510). అందులో వ్యాకరణదోషాలు ఉన్నాయని పండితులు చేసిన విమర్శను ఖండిస్తూ సీతాపతిగారు ఆ విమర్శకులు భాష మారుతుంటుందన్న విషయం గ్రహించలేదన్నారు. భాషలో మార్పులను గ్రహించి, ఆనాటి ప్రయోగాలననుసరించి వ్యాకరణసూత్రాలు మార్చాలనీ, ఆతరవాత వ్యాకరణం ఆమార్పులను అనుసరిస్తుందనీ వచించేరు.

నిడుదవోలువారు కవిప్రయోగాలకి ప్రధానమివ్వాలి. వ్యాకరణమునకు విరుద్ధమైనా కవిప్రయుక్తము కాదనరాదని వాదించేవారని వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు ప్రశంసించేరని నిష్టలవారు రాసేరు.

నిడుదవోలువారిని ఎవరు ప్రయోగమూషిక మార్జాల అన్నారో తెలిసినట్టు లేదు కానీ కృష్ణాపత్రిక ఏటా ప్రకటించే వ్యంగ్యబిరుదాల జాబితాలో చేరిందని ఇప్పుడే తెలిసింది. వెంకటరావుగారి దెబ్బకి ప్రయోగాలే పేజీల్లోంచి వచ్చి ముందు నిలిచేవి అని వ్యాఖ్యానించేరు నిష్టలవారు. అలాగే ఏకసంథాగ్రాహి, పరిశోధన పరమేశ్వరులు అన్న సామర్థ్యచిహ్నలు ప్రసంగవశాత్తు మొదలయి, నిడుదవోలు వెంకటరావుగారికి బిరుదులుగా స్థిరపడిపోయేయి.

చెన్నపురి సర్. త్యాగరాయకళాశాలవారు నిడువోలు వెంకటరావుగారిని సన్మానించినసందర్భంలో నిడుదవోలువారు ప్రత్యభిభాషణములో అన్నమాట, “ఈనాడు విశ్వవిద్యాలయములలో నున్నవారికి నాకును నొకటే బేధమున్నది. బ్యాంకు అంకెలమయము. సాహిత్యము అక్షరమయము” అని. “నేను – అంకెలనుండి అక్షరములలోనికి రాగా – నేటి విశ్వవిద్యాలయములలో నున్నవారు అక్షరములనుండి అంకెలలోనికి వచ్చినారు,” అంటారు నిడుదవోలు వెంకటరావుగారు.

ఈనాడు తెలుగు రాసేవిధానంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. రోజు రోజుకీ మారిపోతున్నాయన్నా ఆశ్చర్యం లేదేమో. కొంత అజ్ఞానం, కొంత నిర్లక్ష్యం, మరికొంత మాండలీకం, ఉచ్చారణలో తేడాలూ, ఆమీదట కీబోర్డు విలక్షణాలు- ఇలా అనేక కారణాలవల్ల అక్షరగుణింతాలు అనేకరూపాలు పొంందుతున్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో కనుక్కోడానికి ప్రయత్నేంచడమే అజ్ఞానం అని కూడా అనిపిస్తోంది ఒకొకప్పుడు.

దక్షిణదేశీయాంధ్ర సాహిత్యం అన్న అధ్యాయంలో ప్రధానంగా చెప్పుకోవలసినవి అభ్యుదయం అన్న పదం నాయకరాజులకాలంలోనే ఉపయోగంలోకి వచ్చిందన్నది. రెండోది రఘునాథరాయలు కొలువులో కవయిత్రులప్రాభవము. ఆనాటి స్త్రీలకు కావ్యరచన నల్లేరుపై బండివలె సాగిందని నిడుదవోలువారు అన్నారుట. నిజానికి ఈనాటి రచయిత్రులకీ అంతే అనుకుంటాను నేను. కావలిస్తే 50, 60 దశకాల్లో వారు సృష్టించిన సాహిత్యం చూడండి.

అంతకంటే ఎక్కువగా చెప్పుకోవలసింది తెలుగుబాషవ్యాప్తి. ఈఅధ్యాయం చదువుతున్నప్పుడు తెలుగుభాషకి ఎల్లలు లేవు అనిపించింది నాకు. అటు మహరాష్ట్ర కన్నడరాజులు, ఇటు మధుర, తంజావూరు, తమిళదేశాలలో తెలుగుసాహిత్యప్రభలు గమనిస్తే, ఈనాడు తెలుగుదేశం అని చెప్పుకుంటున్నది చాలా పరిమితం అనిపించకతప్పదు. ఎటొచ్చీ నాఅభ్యంతరం మాత్రం పొరుగువారు తెలుగుభాషగురించి ఎంత గొప్పగా చెప్పేరో చెప్పడం మాని, తెలుగుభాషని వ్యవహారంలోకి తీసుకురావడానికి పాటు పడుమని. ఎవరోమన్నారో చెప్పడంకంటే మనం తెలుగులో మాటాడడం, రాయడం చేయడం ముఖ్యం.

తెలుగు కవులు అధ్యాయంలో నన్నయకి పూర్వమే శాసనకవులు వ్యాకరణ, ఛందోబద్ధంగా కవితలు రాసేరని చెప్తూ నిడుదవోలువారు తొలిసారిగా వారిని కవులుగా గుర్తించి సోదహరణంగా నిరూపించేరని నిష్టలవారు చూపించేరు. ఇక్కడ మనం గమనించవలసింది శాసనకవులలాగే జానపదసాహిత్యం కూడా భావ తాళ రాగయుక్తమై అనాదిగా ప్రాచుర్యంలో ఉంది. ఎటొచ్చీ జానపదగేయాలకి కర్తలు లేరు. ఆనోటా ఆనోటా వినడమే కానీ ఎవరు మొదట పాడేరు అన్నది నిర్ధారణ చేయలేం కదా. ప్రధానంగా నన్నయ సర్వాంగసుందరగా ఒక సౌష్ఠమైన కావ్యం పొందుపరిచాడు. కవుల మాత్రం మనకీ కొన్నివేల సంవత్సరాలుగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు బ్లాగులలోనూ వివిధ సైటులలోనూ కనిపిస్తున్న రచనలలాగే!

నిఘంటువు అద్యాయంలో నిఘంటువు కూర్పులో క్లిష్టతగురించి వివరించేరు. సూర్యారాయాంధ్ర నిఘంటువుతో ప్రారంభించి, శబ్దరత్నాకరంలో కొన్నివేల పదాలు చేర్చి, ఉన్నపదాలకి ప్రయోగాలు చూపి నిడుదవోలు వారు ఆగ్రంథాన్ని పరిపుష్టం చేసినవిధానం చూస్తాం. నిడుదవోలు వారు శబ్దరత్నాకరం సంస్కరణలో విశేషమైన మార్పులు చేసేరు. వారు చేర్చిన అనుబంధంలో నాలుగు పరిఛ్ఛేదాలు దాదాపు 2500 పదాలు ప్రయోగాలతోసహే ఇచ్చేరుట. ఆ నాలుగు పరిచ్చేదాలు – 1. తత్సమపదములు. 2. సంస్కృతాంధ్ర మిశ్రమపదములు 3. తద్భవదేశ్యపదములు. 4. అన్యదేశ్యములు.

అన్యదేశ్యములు అన్న విభాగంలో అరబ్బీ, ఫార్సీ, తురుష్కభాషాపదములు వేరుగానూ, ఇంగ్లీషుపదాలు వేరుగానూ చూపబడినవి. ఇంగ్లీషుపదాలు శబ్దరత్నాకరము మొదటిముద్రణలో లేవు.

ఈ భాగంలో ఇచ్చిన కొన్ని పదాలు నాకు చాలా నచ్చేయి.

అంకపాళి అన్నపదానికి శబ్దరత్నాకరంలో ఇచ్చిన అర్థాలే కాక, ఒడిపైన ఉన్నది అన్న అర్థం కూడా ఉందనీ, పూర్వకవుల ప్రయోగాలు కూడా ఇచ్చేరు. ఈ ఒడిపైన అన్న అర్థం ఇప్పుడు laptopకి వాడుకోవచ్చు అనుకుంటున్నాను. చేత్తో రాసినప్పుడు కలంపాళీ, కీబోర్డు వాడినప్పుడు అంకపాళీ అన్న ధ్వని.

అలాగే నాకు నచ్చిన మరోపదం గజస్నానం. నిడుదవోలువారు పండితారాధ్యచరిత్రలోని పద్యం ఉదహరించి, దానికి వివరణ ఇలా ఇచ్చేరు.

ఈపదాన్ని మనం నిత్యవ్యవహారంలో వాడుకోవచ్చు అనిపించింది నాకు. మతపరంగా కాకపోయినా, ఊరికే చేసేం అంటే చేసేం అనిపించుకోడానికి చేసేపనులు, గజస్నానాలు, ఈమద్య ఎక్కువయిపోతున్నాయి మరి.

నిడుదవోలువారు తెలుగులో చేరుతున్న ఇతరభాషాపదాలగురించి విస్తృతంగా చర్చించేరు. శబ్దరత్నాకరంలో  సంస్కృతగ్రంథాలలోని అర్థాలు ఇచ్చేరు కానీ తెలుగులో వాడుకలోకి వచ్చిన సంస్కృతపదాలకి తగిన అర్థాలు, ప్రయోగాలు ఇవ్వలేదని, ఆయన అవి చేర్చడానికి పూనుకున్నారు. ఈపుస్తకంలో ఆంగ్లపదాలు లేవు కానీ నిడుదవోలువారు బహుశా బస్సు, స్కూలు, టికెట్టు, రిజర్వేషనులాటివి చేర్చి ఉండవచ్చు.

ప్రస్తుతం ఏ పదాలు ఆదరణీయం, ఏ పదాలు అనవసరం అన్న చర్చ పెడితే, ఈనాడు మనం వాడే అనేక తెలుగుపదాలు అకారణంగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయని నానమ్మకం.

ఇక్కడ నాఅనుభవాలు, ఆలోచనలు చెప్తాను.

నేను ఫేస్బుక్కులో నాపేజీలో తెలుగులో రాయమని ప్రత్యేకంగా కోరుతున్నాను గత రెండేళ్ళగా. నాకోరిక మన్నించి కొందరు తెలుగులిపి తీసుకుని తెలుగులో రాస్తున్నారు. కొందరు అది నచ్చకో చేతకాకో నాపేజీనించి తప్పుకుంటున్నారు. వీటిమధ్య పదే పదే కనిపించే ప్రశ్న – ఏ ఇంగ్లీషుపదాలు వాడవచ్చు, ఏవి అనవసరం అన్నది.

సూక్ష్మంగా నా అభిప్రాయం – మనసంస్కృతిలో లేని పదాలు తీసుకోడం సమంజసమే. కంప్యూటరు, ఫోనువంటివి. రైలుకి పొగబండి అన్న పదం సృష్టించినా అట్టే ప్రాచుర్యం పొందలేదు. మనసంస్కృతిలో భాగం కానివి – కంప్యూటరు, కీబోర్డు, టీవీ, కారు, breakfast, lunchలాటివి. Breakfast వేరు పూర్వకాలంలో తినే చద్దన్నం వేరు. అంచేత ఇవి తెలుగుభాషలో భాగం అయిపోవచ్చు. అయిపోయేయి. అలాగే wow, seriously, of courseలాటివి. వీటికి తగిన సందర్బాలు మనసంస్కృతిలో నిత్యజీవితంలో ఉన్నాయి కానీ మనం ఆ స్పందనలు ప్రకటించేవిధానం మారిపోయింది ముఖ్యంగా మనజీవనవిధానంలో వచ్చిన పెనుమార్పులవల్ల. మన భావాలు, స్పందనలు ప్రకటించే విధానం క్రమంగా మాయమయిపోతోంది.

నా అభ్యంతరం decide అయేను, happyగా feel అయేను, hurt అయేనులాటి ప్రయోగాలకి. Decide అన్న పదానికి నిర్ణయించుకున్నాను గ్రాంథికంలా ధ్వనించవచ్చు కానీ మామూలుగా మనం రోజూ వాడే మాటల్లో ఇలా చెయ్యాలనుకున్నాను, చెప్పాలనిపించింది అని వాడతాం. “నేను వారితో మాటాడాలనుకుంటున్నాను” అన్నది decide చేసుకున్నాను అన్న అర్థంలోనే. అలాగే బ్రదర్, సిస్టర్, పేరెంట్సు, రిలెటివ్స్ లాటి పదాలకి చక్కని తెలుగు పదాలున్నాయి. అందరికీ తెలిసినవే కూడా. అయయినా వాటిని వదిలేసి, ఇంగ్లీషుపదాలు వాడుతున్నారు. మరి వీటికి తెలుగు పదాలు తలీకనేనా? నిత్యజీవితంలో తేలిగ్గా వాడే సాధారణ పదాలు నన్ను ఇప్పటికీ గాభరా పెడుతున్నవి hand ఇవ్వడం, fix అవడంలాటివి.

happyగా feel అయేను అనడానికీ చాలా సంతోషించేను, నాకు హాయిగా అనిపించింది, ఎంతో బాగుందివంటివ తేలిగ్గా వాడొచ్చు.

కొన్ని దశాబ్దాలుగా స్థిరపడిపోయిన అలవాటు తేలిగ్గా వదిలించుకోలేం. కానీ రచయితలు ఓ క్షణం ఆగి, ఈ తెలుగు మాటలు గుర్తు చేసుకుని కథల్లో రాస్తుంటే, చదివేపాఠకులకి క్రమంగా అలవాటవుతుంది. ఏదైనా మప్పొచ్చు కానీ తిప్పలేం అంటారు. ఎంతసేపూ పొరుగు రాజులు, పొరుగుదేశపు పండితులు తెలుగు మెచ్చుకున్నారంటూ దంపుళ్ళపాటలు పాడడంకంటే, మామూలు తెలుగు పదాలను వాడుకలోకి తెచ్చే ప్రయత్నం చేయమని నా మనవి.

మరొక ఆలోచన ప్రయోగాలగురించి. నిడుదవోలు వెంకటరావుగారు శబ్దరత్నాకరం సంస్కరిస్తున్నసమయంలో తాము ఇచ్చిన అర్థాలకు పూర్వకవుల ప్రయోగాలు చూపేరు. నాసందేహం, చిలిపి ఊహే కావచ్చు, ఇలా పూర్వకవులప్రయోగాలు వెనక్కి చూసుకుంటూ పోగా ఏదో ఒకసమయంలో ఒకరు ప్రారంభించినది అయిఉండాలి కదా. బహుశా ఇలాటి సందర్భంలోనే వ్యావహారికం ఆధారమవుతుందేమో. వ్యావహారికానికి మూలం గుర్తించలేం కనక అదెక్కడినుండి వచ్చింది అన్న ప్రశ్న కలుగదు.

మళ్లీ కొంచెం వెనక్కి వెళ్ళి, భాషలో, వ్యాకరణంలో వస్తున్న మార్పులమాట చూదాం. మార్పులు  అంగీకరిస్తే, మరి సవరణల అవుసరం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. సవరణలు అన్న అధ్యాయంలో వెంకటరావుగారు చేసిన సవరణలు ప్రస్ఫుటం చేసేరు నిష్టలవారు.

నిడుదవోలువారు సృష్టించిన సాహిత్యం సూచికే 30 పేజీలుంది. ఆ శీర్షికలపఠనమే చాలు వారికృషి ఎంత విస్తృతమో తెలుసుకోడానికి అంటారు జి.వి. సుబ్రహ్మణ్యంగారు. నిజమే, పుస్తకాలకి శీర్షికలు ఇవ్వడం కూడా ఒక విద్యే.

జంగమవిజ్ఞానసర్వస్వం అంటారు నిడుదవోలు వెంకటరావుగారిని వారిధారణపటిమకి సార్థకంగా. జంగములు అన్నపదం వీరశైవులపరంగా కూడా ఇది సార్థకమే అంటారు నిష్టలవారు. కానీ వెంకటరావుగారు అనేక ఇతర ప్రక్రియలలో కూడా కృషి చేసేరు కనక జంగమ అన్న పదాన్ని శైవసాహిత్యానికి పరిమితం చేయడం సరికాదనే నాకు అనిపిస్తోంది.

నిడుదవోలు వెంకటరావుగారు బ్యాంకు ఉద్యోగంతో ప్రారంభించినా, అచిరకాలంలోనే సాహిత్యరంగానికి మనోవాక్యాకర్మలా తమజీవితాన్ని అంకితం చేసిన ధన్యమూర్తి. అనన్యసామాన్యమైన సాహిత్యం సృష్టించిన నిడుదవోలు వెంకటరావుగారు ఆర్థికంగా సాధించినది లేదు. నిడుదవోలువారి మాటలే ఉదహరిస్తే, అక్షరాలకీ అంకెలకీ పొత్తు లేదు సరస్వతి, లక్ష్మి ఒకచోట ఇముడరని ప్రతీతి. తిరుమల రామచంద్రగారు ఆయనతో ప్రస్తావించినప్పుడు, వెంకటరావుగారిచ్చిన సమాధానం ఇదుగో.

విద్యారత్న, కళాప్రపూర్ణ నిడుదవోలు వెంకటరావుగారు సాహితీరంగంలో అసాధారణప్రజ్ఞ చూపేరు. నిష్టల వెంకటరావుగారు ఈగ్రంథంలో అద్భుతంగా ఆవిష్కరించేరు. డా. నిడుదవోలు వెంకటరావుగారికి అభినందనలు.

000

నావ్యాసాలు

ప్రయోగమూషిక మార్జాల వెంకటరావుగారు https://wp.me/p9pVQ-m2

జంగమ విజ్ఞానసర్వస్వము. https://wp.me/p9pVQ-lL

Archive.org సౌజన్యంతో  నిష్టల వెంకటరావు.   నిడుదవోలు వెంకటరావుగారి రచనలు పరిశీలన

 

000

(డిసెంబరు 7, 2017)

జైమినీభారతం – చిన్న పరిచయం

నేను చూసిన రెండు పాఠాంతరాలూ, రెండు వ్యాసాలు సూక్ష్మంగా పరిచయం చేయడానికి మాత్రమే ఈసమీక్షావ్యాసం. Continue reading “జైమినీభారతం – చిన్న పరిచయం”