1960లలో వచ్చిన రెండు సంకలనాలు

ఈరోజు ఉదయం కోడీహళ్ళి మురళీమోహన్ గారు 1960వ దశకంలో ప్రచురించి రెండు సంకలనాలగురించి ప్రస్తావించేరు. మొదటి సంకలనం యువకథామాల. మసూనా సంపాదకత్వంలో ఉత్తరాంధ్ర గ్రంథమాల Continue reading “1960లలో వచ్చిన రెండు సంకలనాలు”

ఇంతే సంగతులు సంకలనం, (లింకు సరిచేసి)

నిన్న పొరపాటున  సంకలనం పూర్తిగా ఇవ్వలేదని ఇవ్వలేదనీ, కేవలం ముఖపత్రం మాత్రమే upload చేసేనని ఇప్పుడు గుర్తించేను. అంచేత ఆ టపా తొలగించి మళ్ళీ సరైన లింకు ఇచ్చాను. నా పొరపాటుకు చింతిస్తున్నాను.

ఇక్కడ నొక్కండి –  ఇంతే సంగతులు

ఇట్లు

నిడదవోలు మాలతి వ్రాలు

 

 

కథామాలతి 3 – మూడోసంకలనం

కథామాలతి 3

ఈ సంకలనంలో తెలుగు స్వతంత్రలో అచ్చయిన నా మొదటిస్కెచ్‌నుండీ 1966లో ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురించిన కాశీరత్నం వరకూ ఇరవైఐదు ఉన్నాయి. ముందు రెండు సంకలనాలకి భిన్నంగా, ఈ కథలని అవి ప్రచురింపబడిన తేదీలవరసలో అమర్చేను. ఇవన్నీ తిరిగి టైపు చేసి ఇలా పెట్టుకుంటే నారాతల్లో నేను ఎక్కడినుండి ఎక్కడి వచ్చేను అన్నది నాకు తెలుస్తోంది.

వీటిలో మొదటి 9 రచనలూ కథలు కావు. ఈనాటి కార్డు కథల్లాటివి – ఒక చిన్న సంఘటన చిత్రించడం మాత్రమే జరిగిందిక్కడ. తరవాతిరచనల్లో కథకి కావలసిన లక్షణాలు ఉన్నాయి. పోతే ప్రత్యేకించి చెప్పుకోవలసింది భాష. నాకు చిన్నప్పటినుండీ కూడా తెలుగుభాష అంటే ప్రత్యేకాభిమానమని చాలాసార్లే చెప్పేను. అధికంగా ఆ విషయం నాకు స్పష్టమయింది నేను అమెరికా వచ్చేక. నా అన్నవాళ్ళు ఇక్కడ లేరన్న భావంకంటే కూడా నాభాష మాటాడేవాళ్ళు లేకపోవడమే నన్ను ఎక్కువగా బాధించింది. ఆ కారణంగానే తూలిక.నెట్ సైటూ, తెలుగు తూలిక బ్లాగూ పుట్టేయి.

ఈ కథలు మళ్ళీ టైపు చేస్తుంటే నాకు కొట్టొచ్చినట్టు కనిపించింది అప్పటికీ ఇప్పటికీ నాభాషలో తేడా. మంచుదెబ్బ, విపర్యయంలాటి కథల్లో నేను నేర్చుకున్న సంస్కృతం అంతా “ప్రదర్శన” అయింది. వాటిలో చాలా పదాలకి ఇప్పుడు అర్థాలడిగితే చెప్పలేను. కానీ ఆనాటి ప్రముఖ రచయితలచేత “మాలతి మంచి కథలు రాస్తుంది” అనిపించిన నామొదటికథ మంచుదెబ్బ. దానికి కొంత కారణం నా సంస్కృతభాషాభేషజమేనేమో నాకు తెలీదు. ఇది నాకు ఇప్పుడు వస్తున్న ఆలోచన.

నా ఇంగ్లీషు అతిగా కనిపించింది ఓటుకోసం అన్న స్కెచ్‌లో. మిగతా కథల్లో అక్కడక్కడ ఇంగ్లీషుమాటలు ఉన్నాయి. కొన్నిచోట్ల అనవసరమే అనిపిస్తోంది ఇప్పుడు చూస్తే. మరి “మీరు రాస్తే ఒప్పూ, మేం రాస్తే తప్పూనా?” అని అడిగేవారికి నా జవాబు, “లేదు. నేను రాసినా తప్పే. ఎటొచ్చీ ఆరోజుల్లో నాకు ‘ఎందుకింత ఇంగ్లీషు”’ అని నన్ను అడిగినవాళ్ళూ, రాయొద్దని చెప్పినవాళ్ళూ లేకపోయేరు. నిజానికి ఈనాటి యువతలాగే నేను కూడా ఉద్యోగాలకోసమే ఇంగ్లీషు యమ్మే చేసేను. ఆదృష్టితో చూస్తే నేను ఇంగ్లీషు తక్కువే వాడేననిపిస్తోంది.

నాకు తోచిన మరోకోణం ఉదాత్తమయిన, గంభీరమయిన విషయాలు చిత్రిస్తున్నప్పుడు సంస్కృతసమాసాలు విరివిగా వాడేను. ఇంగ్లీషుమాటలు హాస్యానికీ, వ్యంగ్యానికీ వాడేను కనీసం కొన్ని చోట్ల. (విషప్పురుగు‌ కథలో ఇంగ్లీషు మాష్టరు తెలుగులోనూ, తెలుగు మేష్టరు ఇంగ్లీషులోనూ మాటాడ్డం మనం అలవరుచుకున్న ఒకరకం కృతకసంస్కృతిని ఎత్తిచూపడానికే).

సాధారణంగా యౌవనదశలో అందరం ఒకరకమైన ఉదాత్తభావాలకి పెద్దపీట వేస్తాం. అవే దరిమిలా ఐడియాలజీలవుతాయి కొందరివిషయంలో. అలాటి ఉదాత్తభావాలూ, కొందరంటే అప్పట్లో నాకు కలిగిన “ఆరాధన” (అతిగా) ప్రాతిపదికగా జీవనమాధుర్యం, మామూలు మనిషిలాటి కథలు రాయడం జరిగింది. ఇప్పుడు అలాటివి రాయను. ఇప్పుడు నా “కంఠస్వరం” అలాటి ఉదాత్తమయిన లేదా ఆర్ద్రమయిన భావాలు చిత్రించడానికి అనువుగా లేదు. నిజానికి ఆకథలు ఇప్పుడు నాకు కాస్త హాస్యాస్పదంగా కూడా కనిపిస్తున్నాయి! ఇది నావ్యక్తిత్వంలో వచ్చిన మార్పు. పెద్దమార్పే. (నిజానికి ఇదే నేను మార్పు రాయడం మొదలు పెట్టడానికి కారణం కూడాను. అది పూర్తి చెయ్యాలి ఎప్పుడో!).

ఒక ప్రసిద్ధరచయిత మంచుదెబ్బ కథకి ముగింపులో వకుళ “ఆత్మహత్య అనవసరం” అన్నారు. అప్పట్లో అది ఆత్మహత్య అని నేను అనుకోలేదు. సాధారణంగా ఇలా చావుని ముగింపుగా చూపడంలో రచయితఅభిప్రాయం ఏమై ఉంటుంది అంటే నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది – నాకథ శీర్షికలోనే కనిపిస్తోంది. మంచుదెబ్బ తిన్న తమ్మిపువ్వు తిరిగి వికసించదు. అతి సున్నితమైన మనసుగల, అమాయకురాలయిన వకుళలాంటి వ్యక్తి ఘోరమైన దెబ్బ తింటే తిరిగి కోలుకోదన్నది. రెండోకారణం – ఆరోజుల్లో చావుతో ముగించిన కథలు కొంచెం ఎక్కువే. రచయితకి ఏం చెయ్యాలో తెలీనప్పుడు పాత్రని చంపేసి పాఠకులని సుఖపెడతారేమో అనిపిస్తోంది. నామటుకు నేను తరవాత రాసినకథల్లో చావుని అంతగా వాడలేదు. (ఇంకా ఒకట్రెండు ఉన్నాయి కానీ వాటిగురించి నాలుగోసంకలనం ముందుమాటలో రాస్తాను). ఈసంకలనానికి సంబంధించినంతవరకూ జీవాతువులో “అరుంధతి జీవిస్తూంది,” అని ముగించేను. నడుస్తున్నచరిత్రలో కల్యాణికి భవిష్యత్తు మరింత ఆశాజనకంగా చూపించేను.

ఇవన్నీ నేను తీరిగ్గా ఆలోచించి అలా రాసేనని చెప్పడం లేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా అనిపిస్తోంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, రచయితలు తమరచనలు అప్పుడప్పుడు తిరిగి చూసుకుని, ఆత్మశోధన చేసుకోడంవల్ల లాభమేనని చెప్పడంకోసం.

ఇప్పటికింతే సంగతులు.

– నిడదవోలు మాలతి

జులై 29, 2011