జగద్గురు శ్రీ శంకరాచార్య. దీనదయాళ్ ఉపాధ్యాయ రచన. సమీక్ష

అనువాదం. పురిపండా అప్పలస్వామి. (1994.)

శంకరాచార్యులవారి జీవితచరిత్ర కాకపోయినా వారిజీవితంలో ముఖ్యఘట్టాలు చాలామందికి సుపరిచితమే. బాల్యదశలోనే వేదాంతగ్రంథాలు పఠించడం, సన్యాసం స్వీకరించడానికి తల్లినుండి అనుమతి పొందడంవంటి అనేక సంఘటనలు కథలుకథలుగా చెప్పుకోడం జరుగుతూనే ఉంది.

నేను ఈపుస్తకం చదవడానికి ప్రధానకారణం పురిపండా అప్పలస్వామిగారి పేరే. ఆయన మహా పండితులని తెలుసు. దేవీభాగవతం, శ్రీమద్భాగవతం, రామాయణంవంటి గ్రంతాథాలు రచించేరని తెలుసు.

అందుచేత శంకరాచార్యులగురించి ఏమి చెప్తారో చూదాం అనిపించింది. ఇది అనువాదం అని చూసి, అసలు అప్పలస్వామిగారివంటి మహాపండితులు శంకరాచార్యులవిషయంలో అనువాదం ఎందుకు చేసేరు అన్న సందేహం మరో కారణం. స్వయంగా తామే వ్రాయగలరు కదా అని.

పుస్తకం చిన్నదే. 154 పుటలు.

“ముందుమాట” అన్నశీర్షకకింద సుదీర్ఘంగా దేశపరిస్థితులు వివరించేరు. సంతకం లేదు కానీ అది అనువాదకుల వాక్కు అనే అనుకుంటున్నాను. ఈభాగంలో ముఖ్యంగా వైదికధర్మాన్ని జాతీయసైమక్యతతో ముడి పెట్టడం జరిగింది.

ప్రధానంగా, బుద్ధుడు, జినుడు, చార్వాకుడు (నాస్తికులు) ఆవిష్కరించిన ధర్మాలలోనూ ఆస్తికవాదులు విశ్వసించిన ధర్మాలలోనూ మౌలికంగా ఏకసూత్రం ఉందని నిరూపించడమే శంకరాచార్యుల ధ్యేయంగా ఆవిష్కరించబడింది ఈ పుస్తకంలో. అయితే సాధారణంగా శంకరాచార్యుల స్తోత్రాలలో కనిపించే ఆత్మార్పణతత్వం ఈ విజయోత్సాహంలో కనిపించదు. ఒకరకంగా శంకరుడు ఇతర ఆచార్యులపై విజయం సాధించడానికి పూనుకోడం మాత్క నిపిస్తుంది. అహమిక అని కూడా అనుకోవచ్చు.

మామూలుగా అన్ని జీవితచరిత్రలలాగే శంకరునిజననం, విద్యాభ్యాసంతో మొదలవుతుంది. ఆ తరువాత, దేశంలో ప్రబలమవుతూన్న వివిధ నాస్తిక సిద్ధాంతాలూ, వాటిని ప్రతిఘటించడానికి ఆస్తికుల ప్రయత్నాలనీ వివరించి, దేశంలో మతసంబంధమైన ఐక్యత సాధించడానికి ప్రజ్ఞానిధి అయిన శంకరాచార్యులుగా ఆయనపాత్రని ఆవిష్కరించేరు. శంకరుడు గురువు గౌడపాదులని ఆశ్రయించి, విద్యాభ్యాసం కొనసాగించి, గురుస్థానం వహించి దేశసంచారం చేస్తూ అద్వైతమతానికి విరుద్ధమైన సిద్ధాంతాలను ఆచరించేవారిపై విజయం సాధించడమే ఈపుస్తకంలో ప్రధానాంశం.

అయితే ఆ విజయాలు సాధించే ప్రయత్నంలో శంకరాచార్యులు చేసిన వాదనలు మాత్రం నాకు నిరుత్సాహం కలిగించేయి.

ఈపుస్తకంలో వేదాంతవిదుడు, తాత్వికుడుగా కాక శంకరుడు దేశసమైక్యతకీ, అద్వైతప్రచారానికీ కంకణం కట్టుకున్న రాజనీతికుశలునిలా దర్శనమిస్తాడు. కొన్ని వాక్యాలు రాజకీయనినాదాలని తలపింపజేస్తాయి.

వంటి వాక్యాలు శంకరునిపరంగా ఊహించుకోలేను కనీసం నేను.

రచయిత అన్ని సంఘటనలనూ ఒకే దృష్టితో కాక, తమవాదనకి అనుకూలంగా సమర్థించుకున్నట్టు కనిపిస్తుంది. ఉదాహరణకి, శంకరుడు నదిలోకి దిగినప్పుడు మొసలి శంకరునికాలు కరిచిపట్టుకోడం, సన్యాసానికి తల్లి అనుమతించేక, వదిలేయడం అసంభవమని వ్యాఖ్యానించి, రచయిత మరొక నమ్మదగ్గ వివరణ ప్రతిపాదిస్తారు. ఇది ఆధునీకరణం. మరొక సందర్భంలో – టిబెట్టులో శాక్తేయులు తాంత్రికవాదాలతో ఎదుర్కున్నప్పుడు – శంకరాచార్యులు “కామరూపంలో ఎన్నో కష్టాలు భరించవలసివచ్చింది” అంటారు. మరి ఈ “కామరూపం” విశ్వాసపాత్రం ఎలా అయింది?

శంకరుడు ఒక ధనవంతుని పొరుగువారికి సహాయం ఎందుకు చేయవని ప్రశ్నించినప్పుడు, ఆ ధనవంతుడు ఆపేదవారిఇంటిని బంగారు ఉసిరికాయలతో నింపేడని కథనం. ఇక్కడ కూడా నాకు పూర్తిగా లౌక్యమే కనిపించింది. ఆ ఇంటియజమానికి ఏరోజుకి ఆరోజు, ఆరోజుకి సరిపడినంత మాత్రమే సంపాదించుకోవాలని నియమం. అంతకంటె ఎక్కువ తెచ్చుకుంటే అది దొంగతనంతో సమానమంటాడుట. మరి వారి ఇల్లు బంగారు ఉసిరికాయలతో నింపడం సమంజసమేనా?

నేనంటున్నది, జీవితచరిత్రలు రాస్తున్నప్పుడు రచయితకి సంయమనం లేకపోవడంవిషయం. ఇలాటివి మూలవస్తువుని నీరసపరుస్తాయి.

మండనమిశ్రునితో, భారతితో శంకరుని సంభాషణలు మరింత విపులంగా వ్రాసి ఉంటే, ఆవాదనలకీ, పుస్తకానికీ కూడా చేవ కూరేది. శంకరుని విచారదృష్టి మరింత స్పష్టంగా విశదమయేది. అందుకు విరుద్ధంగా, రచయిత, అనువాదకుల అభిప్రాయాలకే ఎక్కువ సమయం వెచ్చించారు.

ఆధునికసాహిత్యంలో సీత, శూర్పణఖ, ద్రౌపదివంటి పాత్రలతో తమ వాదాలను ప్రచారం చేయడానికి కొందరు రచయితలు ఉపయోగించుకోడం చూస్తున్నాం.

ఈపుస్తకం పూర్తి చేసేక, నాకు మళ్లీ అదే అభిప్రాయం కలిగింది. ఈపుస్తకం చదువుతుంటే మనకి మనీషాష్టకంవంటి శ్లోకాలు రచించిన శంకరాచార్యులు కనిపించరు. కొందరు సాంఘికప్రవక్తలు తమ ఆలోచనలప్రకారం ఈ శంకరాచార్యులపాత్రని తిరిగి మలచినట్టు కనిపిస్తుంది.

ఇది అందరికీ సమ్మతమేనా? బహుశా పైన చెప్పిన సీత, శూర్పణఖ, ద్రౌపదిపాత్రలను విసృజించినవారికి సమ్మతం కావచ్చు. వాటిని ఆదరించే పాఠకులు కూడా అసంఖ్యాకంగానే ఉండొచ్చు. నాకు మాత్రం రుచించలేదు.

ఆసక్తి గలవారికోసం లింకు ఇదుగో. archive.orgకి కృతజ్ఞతలతో. https://archive.org/details/jagadgurusankara020388mbp

000

(మార్చి 1, 2022)

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు. కాశీయాత్ర. చిన్న పరిచయం.

కాశీయాత్ర అనగానే అందరికీ గుర్తుకి వచ్చేది ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర పుస్తకమే. అది 374 పేజీలు (పీఠిక, ఇతరవివరాలు కాక). అది కేవలం యాత్రాకథనం మాత్రమే కాదు. సాంఘికచరిత్ర కూడా. వీరాస్వామిగారు ఇచ్చిన వివరాలు చూస్తే సురవరం ప్రతాపరెడ్డిగారి ఆంధ్రులసాంఘిక చరిత్రకి సమతుల్యం అనిపిస్తుంది.

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి(1870-1950) గారి పుస్తకం ఆయన విద్యాభ్యాసానికి సంబంధించినది. ఒకవిధంగా సాహిత్యచరిత్ర అనుకోవచ్చు. వేంకటశాస్త్రిగారికి విద్యార్థిదశలో కాశీ వెళ్లాలన్న కోరిక కలిగింది సుమారు 18 ఏళ్ళవయసులో. ఇంట్లోవారు ఆమోదంచరని, వారికి చెప్పకుండా ప్రయాణం సాగించేరు. ఆ ప్రయాణానికి సంపాదనకోసం అవధానాలు చెప్పడంవంటివి చేసేరు. తరవాత కాశీలో తాము నేర్చుకున్న వ్యాకరణాది శాస్త్రాలు, కలుసుకున్న మిత్రులగురించిన వివరాలు ప్రస్తావించేరు. ఈ పుస్తకంలో విషయాలు సూచనప్రాయంగా తెలుసుకోడానికి ఇది చాలు.

ఈపుస్తకంలో నాకు నచ్చిన అంశాలు – ప్రారంభంలోనే రచయిత వ్యావహారికభాషలో రాస్తున్నానని చెప్పేరు కనక ఆ వ్యావహారికభాష ఏమిటో తెలుసుకునే ఉద్దేశంతో మొదలు పెట్టేను. ఇది రచించేసమయానికి తమకి 64 సంవత్సరాలని చెప్పేరు కనక సుమారుగా 1930వ దశకంలో వ్యావహారికంగా చెల్లిన భాష ఇది అనుకోవచ్చు. ఈనాడు మనం వ్యావహారికం అంటున్న భాషకీ ఆభాషకీ సహస్రాంతం తేడా!

నాకు ఆనాటిభాషలో నుడికారం, నానుడులు ఇష్టం కనక పూర్తి చేసేను కానీ లేకపోతే నిజంగా ఆసక్తికరమైన విషయాలు అట్టే లేవనే అనిపించింది పూర్తి చేసేక.

అంటే అస్సలు లేవని కాదు. తల్లిదండ్రులకు చెప్పకుండా కాశీకి వెళ్లడంలో ఆయనకి అధ్యయనంచేయదలుచుకున్న గల విషయాలపట్ల ఆసక్తి, పట్టుదల నాకు ఆసక్తికరంగా అనిపించింది. రెండోది, పెళ్లివిషయం. తల్లిదండ్రులు జీవించిఉండగా గురువుగారు ఆయనవివాహాన్ని నిర్ణయించడం. తల్లీ, తండ్రీ, గురువులు ఆ వరసలో యువకులజీవితాలలో ఎంతటి ముఖ్యమైనపాత్రలుగా వ్యవహరిస్తారో తెలుస్తుంది ఇక్కడ.

బ్రాహ్మణులలోనే కొందరితో భోజనప్రతిభోజనాలు నిషిద్ధం వంటి వివరాలు నాకు కొత్త.

సాధారణంగా విద్యార్థదశలో ఎదుర్కొనే సమస్యలు – భంగు సేవించడం, మిత్రత్వాలు, పండుగలు వంటి ఎన్నో విషయాలు ఆసక్తికరంగా ఉండడమే కాక, ఈనాటి విద్యార్థిజీవితంతో పోల్చి చూసుకోడానికి కూడా ఉపయోగపడతాయి.

నాకు తెలియని పదాలు, తెలిసినా మరిచిపోయిన పదాలు కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. నాకు కూడా జ్ఞాపకం ఉంటాయని.

సర్వాత్మనా – అన్నివిధాలా

శ్రుతపఱచి – వినిపించి, చెప్పి

తథ్యంగా – ఋజువుగా

అనధ్యయనాలు -వేదము చదవకూడని కాలాలు.

శీతలించి – జలుబు చేయు

గ్రహిణి – డయేరియా

అలాగే అసాధారణ వాడుకలు –

సాహిత్యపండితుడు, సాహిత్యపరురాలు.

స్మితపూర్వాభిభాషి

కొన్ని అభిప్రాయాలు –

“అధముడైన వాని కాలగుకంటె నత్యధికునింట దాసి యగుట మేలు” భాగవతంలోనిపద్యం.

ఇక్కడ కాలగుకంటె అన్నది అర్థం చేసుకోడానికి చాలాసేపు పట్టింది వానికి ఆలి అగు కంటే అని.

కాశీగంగ కొత్తగా వచ్చినవాళ్లని పరీక్ష చేస్తుందిట.

రోగనివృత్తికి కవిత్వం చెప్పడం

“మంచి యోగ్యులకు తోచే ఊహలు కూడా వకప్పుడు లోకాపకారకాలు అవుతాయి.”

మరొక చిన్నమాట. చాలాకాలం క్రితం నేను కళ్లు అని రాస్తే, ఒక పాఠకుడు “కళ్లు కాదు కళ్ళు అని రాయాల”ని వ్యాఖ్యానించేరు. అప్పట్నుంచి నేను బుద్ధిగా ‘ళ’ వత్తు గుర్తు పెట్టుకు రాస్తున్నాను.

ఇప్పుడు కళాప్రపూర్ణ బిరుదాంకితులు, శతావధాని అయిన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి ‘ళ’ కింద ‘ల’ వత్తు చూసేక అది సమ్మతమే అని తెలుసుకొంటి. వేంకటశాస్త్రిగారి స్వహస్తంలో చూడండి వారిపేరు.

కళ్లు అని రాస్తే తప్పు కాదు.

నాకు రెండు రోజులు పట్టింది. మీలో చాలామంది ఒకగంటలో పూర్తి చేయవచ్చు. చిన్నపుస్తకం.

archive.org లో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి కాశీయాత్ర ఇక్కడ దొరుకుతుంది.

000

(జనవరి 24, 2022)

తెలుగు తూలికకి 14 సంవత్సరాలు

తెలుగు తూలిక ప్రారంభించి 14 సంవత్సారాలయింది. 2010వరకూ పాఠకుల ఆదరణ బాగానే ఉండేది కానీ తరవాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. అలాగే వ్యాఖ్యలు కూడా బాగా తగ్గిపోయేయి. గత మూడేళ్లగా ఎప్పుడో ఒకటి రెండు తప్ప వ్యాఖ్యలు లేవు. నాక్కూడా రాయాలన్న ఉత్సాహమూ లేదు, రాయడానికి సరుకూ లేదు అనిపించింది.

ఇంక మంగళం పాడేసే సమయం వచ్చిందన్న ఉద్దేశంతో ఏప్రిల్ 2017లో అప్పటివరకూ రాసిన పోస్టులు, అంతకుముందు సంకలనాలలో చేర్చనివి ఇంతే సంగతులు అన్నపేరుతో ఒక సంకలనం వెలువరించేను. కానీ రాసే చెయ్యి ఊరుకోదేమో ఆ సంకలనం వెలువరించిన తరవాత ఇవాళ చూస్తే 200 పైగా పోస్టులు ప్రచురించినవి కనిపించేయి!!

ప్రస్తుతం ముఖపుస్తకంలో కూడా ఇలాగే కృష్ణపక్షచంద్రునిమాడ్కి పాఠకుల ఆదరణ తగ్గుముఖం పట్టడం కనిపిస్తోంది. ఇక్కడ ప్లాట్ ఫారం కూడా వేరు. అంచేత నాకంతగా విచారం లేదు. ఇది కేవలం పొద్దు పుచ్చుకోడానికే అని నిర్ణయించుకున్నాను.

ఆదరిస్తున్న మిత్రులకు మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

తెలుగు తూలిక మీది. మీరే వారసులు ఈ బ్లాగుకి.

మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞురాలిని. ధన్యవాదాలు

ఇట్లు

నిడదవోలు మాలతి వ్రాలు

డిసెంబరు 2, 2021

000

 

వ్యాసంలో ఏమి చెప్పేరు? శీర్షిక ఏమి చెప్తోంది?

(జనవరి 22, 2022. సవరణలతో.)

డా. రమేష్ ప్రసాద్ రావెళ్ళ గారు రచించిన వ్యాసానికి శీర్షిక ఇలా ఉంది.

Aricle Heading in Misimi 11/2021


రచయిత నాకు పంపిన ఈవ్యాసం నిడివి 20 పేజీలు. మొదటి 4 పేజీలలో నిడదవోలు మాలతి రచనావ్యాసంగంగురించి ఉంది. మిగతా 16 పేజీలలో తెలుగుకథలకి ఆంగ్లఅనువాదాల సంకలనాలూ, అనువాదాలు, ఇతర దేశరచయితలకథలు ఉన్నాయి.

నామొదటి సందేహం- 20 పేజీల వ్యాసంలో 4 పేజీలు మాత్రమే నిడదవోలు మాలతి సాహిత్యం గురించిన చర్చ అయినప్పుడు ఆవ్యాసానికి మాలతిపేరూ, ఫొటో సమంజసమా అన్నది. నాఅభిప్రాయంలో సమంజసం కాదు.

రెండవ సందేహం ప్రవాససాహిత్యం అన్న running title గురించి. నిజానికి ఇదే మొదటి సందేహం అనాలేమో.

అసలు ఏది ప్రవాససాహిత్యం అన్నది మొదట ప్రస్తావిస్తాను. ఈవిషయంమీద విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

ఈ ప్రవాససాహిత్యం అన్న నుడికారం ప్రాచుర్యంలోకి వచ్చేక, నిర్వచనం ప్రశ్న తలెత్తింది. ఒక సంస్కృతివారు విదేశాలలో స్థిరపడి మరొక సంస్కృతినీడన నివసిస్తూ ఆ రెండు సంస్కృతులమూలంగా తమలో కలిగిన సంఘర్షణలూ, ఆకారణంగా తమజీవితాలలో కలిగిన మార్పులను ఆవగాహన చేసుకుని, సమన్వయపరుచుకుని మరొక కొత్తపద్ధతిలో ఒక సంస్కృతి సృష్టించుకున్నవారు రాసిన కథలు అని నిర్వచించేరు. అంటే రెండు భిన్నసంస్కృతులను సమన్వయపరుచుకుని ఆ అవగాహనతో చేసిన రచనలు అని.

నేను చాలాకాలం ఈ భిన్నసంస్కృతులు అన్నది రెండు దేశాలయితేనే తమకి ప్రత్యేకమైన సంస్కృతి సృష్టించుకునే పరిస్థితి ఏర్పడుతుందని అనుకున్నాను. కానీ ఈమధ్య మనదేశంలోనే ఒక రాష్ట్రంనుండి మరొకరాష్ట్రానికి తరలివెళ్లి అక్కడ స్థిరపడి రచనలు చేసేవారిని కూడా ప్రవాసులనే అంటున్నారు. ఇంకొంచెం ముందుకి వెళ్లి మరొకఊరులో స్థిరపడినవారి అనుభవాలు కూడా అవే అంటున్నారు. ఇలా మరోఊరికి మరో వీధికీ మారినవారిని కూడా ప్రవాసులంటే తెలుగుదేశంలో ప్రవాసులు కాని రచయితలు అంటూ వేరే ఉండరు. పెళ్లిళ్లూ, ఉద్యోగాలూ, పిల్లలచదువులూ ఇలా ఏదో ఒక కారణంగా ఊరు మారని రచయితలు లేరు. అలాటప్పుడు సాహిత్యమంతా ప్రవాససాహిత్యమే. వేరుగా ప్రవాససాహిత్యం అన్నపేరు అనవసరమే కదా.

ఇన్ని రకాలవాదనలు లేక నిర్వచనాలు ఉన్నప్పుడు సహజంగానే వ్యాసకర్త తనకు తాను ఒక నియమాన్ని విధించుకుని ఆ పరిధిలో వ్యాసం వ్రాస్తాడు. ఈ నియమాన్ని వ్యాసం మొదట్లో వివరించడం రచయితధర్మం.

ఈవ్యాసకర్త, రమేష్ ప్రసాద్ రావెళ్ళ వివరించలేదు. ఇది 14వ వ్యాసం. మొదటి వ్యాసంలో వివరించేరేమో నాకు తెలీదు.

ఈవ్యాసంలో కనిపించినమేరకు రమేష్ ప్రసాద్ గారు ఏవి  ప్రవాసకథలుగా గుర్తించేరు అంటే – వస్తువు, మూలరచయిత అన్న విషయాలు వదిలేసి, స్వగ్రామం వదిలి మరో ఊళ్లో ఉన్న ఏ రచయిత అయినా ఇంగ్లీషులోకి అనువదిస్తే అది ప్రవాసకథే అని. ఉదాహరణకి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అరికాళ్ళకింద మంటలు ఈవ్యాసంలో చోటు చేసుకుంది. అంటే రమేష్ ప్రసాద్ గారి అభిప్రాయంలో అది ప్రవాసకథే అనుకోవాలి!

నిజానికి అది ప్రవాసకథ కాదు. ప్రతి ఆంగ్లానువాదాన్ని ప్రవాసకథ అనువాదకుడు ఊరు మారినంతమాత్రాన ప్రవాసకథ అవదు.

నిడదవోలు మాలతికథలను చెహోవియన్ కథలు అని, చెహోవ్ కథలలో శిల్పంగురించి తరవాత ప్రస్తావిస్తాననీ వ్యాసకర్త మొదట్లో అన్నారు కానీ తరవాత చెహోవ్ కథలు చర్చిస్తున్నప్పుడు మళ్లీ మాలతికథలు ప్రస్తావించి సారూప్యం ఎత్తి చూపడం జరగలేదు. అలా చేసి ఉంటే ప్రధానశీర్షికకి కొంత బలం కలిగేది.

అసలు వ్యాసరచనగురించి ఒకమాట చెప్పుకోవాలి. నిజానికి ఇది ఈ ఒక్క వ్యాసంగురించే కాదు. సాధారణంగా వ్యాసాలు, విమర్శలు, సమీక్షలగురించి ప్రస్తావిస్తున్నాను ఇక్కడ. వ్యాసాలలో విమర్శలలో తమ వాదన లేదా అభిప్రాయానికి అవుసరమైన సన్నివేశమో పాత్రో సూక్ష్మంగా వివరించవచ్చు కానీ కథంతా ఆసాంతం చెప్పడం సమంజసము కాదు. అలా కథంతా చెప్పేయడం మూలరచయితకి అన్యాయమే అవుతుంది. పాఠకులకు మూలకథ చదవాలన్న ఆసక్తి నశిస్తుంది.  

ఈవ్యాసంలో చాలాకథలు అలా సంక్షిప్తంగా చెప్పేయడం జరిగింది. కొన్ని కథలకి రచయిత తమఅభిప్రాయాలు జోడించేరు. కొన్ని కథలకి అది కూడా లేదు.

స్థూలంగా ఈ వ్యాసానికి నిడదవోలు మాలతి అన్నపేరు సమంజసం కాదు. ఒకరకంగా ఇది నన్ను కించపరిచడానికే ఇలా చేసేరేమో అనిపిస్తోంది. ఏడు దశాబ్దాలుగా సాగిస్తున్న రచనావ్యాసంగంగురించి అంతకంటె చెప్పడానికి ఏమీ లేకపోతే, అసలు ఇది తన వ్యాసానికి వస్తువుగా తీసుకోవలసిన అవుసరమే లేదు. లేదా, మాలతిసాహిత్యంగురించిన వ్యాసమే అయితే మిగతా రచయితలచర్చ ఉండకూడదు. తులనకి అయితే తప్పించి. అలాకాక, ప్రవాససాహిత్యంగురించి అయితే, మాలతి కథలలో ప్రవాసజీవితానికి సంబంధించినవి మాత్రమే చర్చించాలి. ఆ రెండూ జరగలేదు ఈవ్యాసంలో.   

ఇప్పుడు నా ప్రశ్నలు –

1. వ్యాసకర్తకి నాప్రశ్న: ఈ వ్యాసానికి నిడదవోలు మాలతి అని పేరు పెట్టడం, నాఫొటో జోడించడాన్ని ఎలా సమర్థిస్తారు? అంతే కాదు. ఈ వ్యాసాలు సంకలనంగా వేస్తే, నాపేరూ, ఫొటో, నాసాహిత్యానికి సంబంధించిన భాగాలు తొలగించవలసిందిగా కోరుతున్నాను.

2. మిసిమి సంపాదకులకు నాసందేహం: మీపత్రిక సాహిత్యపత్రికగా కొందరు గుర్తించడం గమనించేను. ఈ కలగూరగంప వ్యాసాన్ని ప్రచురించడాన్ని ఎలా సమర్థిస్తారు?
000

(నవంబరు 8, 2021)

భారతనారి – నాడూ నేడూ

రచన: ఇల్లిందల సరస్వతీదేవి

ఇది చాలాకాలం క్రితమే చూసేను కానీ ఫేస్బుక్కులో రాస్తున్న పోస్టుకోసం మళ్లీ చూసేను. ఇక్కడ మీతో కూడా పంచుకోవాలనిపించింది.

ఇల్లిందల సరస్వతీదేవిగారి ‘భారతనారి – నాడూ నేడూ’ పుస్తకరూపంలో  మనకి లభించిన సుదీర్ఘవ్యాసం. 40 పేజీలలో  చారిత్ర్యకంగా వేదకాలంనుండీ ఇప్పటివరకూ మనదేశంలో స్త్రీలస్థానం ఎలా ఉండేదో, మనకాలం వచ్చేసరికి ఎలా మారుతూ వచ్చిందో అద్భుతంగా వివరించేరు సరస్వతీదేవిగారు.

ఈరోజుల్లో ఏ హక్కులకోసం పోరాడుతున్నారో అవి వేదకాలంలో ఉండేవిట. ‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి’ అంటూ మనువు ధర్మసూత్రం వల్లిస్తారు కానీ ఎవరూ ఇంట్లోనూ సమాజంలోనూ శ్రుతి, స్మృతులలో ప్రవచించిన స్త్రీలస్థానంగురించి మాటాడరు. వేదకాలంలో స్త్రీలు విద్యావంతులు,  యాజ్ఞవల్క్యుడు స్త్రీలకి ఆస్తిహక్కులు, దత్తత తీసుకునే అధికారం ఉన్నాయంటాడు. అసలు అంతకుముందే కౌటిల్యుడు క్రీ.పూ. 4వ శతాబ్దంలోనే స్త్రీలు వివాహం రద్దు చేసుకోవచ్చునని నిర్ణయించేడు.  కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పునర్వివాహానికి కూడా వీలు కల్పించేడాయన.  

అసలు వివాహసంస్థ విషయంలో కూడా పాశ్చాత్యులకీ మనకీ కొండంత తేడా ఉంది. వాళ్ళది విషయలోలుత పురస్కరించుకుని ఏర్పడ్డది. భారతదేశంలో ధర్మము మూలహేతువు అంటారు సరస్వతీదేవిగారు. విషయలోలుత అంటే భౌతికం అన్న అర్థంలో కావచ్చు. వాళ్లకి వివాహం తను, భార్య, పిల్లలకి పరిమితం. మనకి వివాహం మూడుతరాలకి విస్తరించింది. సామాజికధర్మం కూడా. సంఘసంక్షేమవిషయంలో కూడా గృహస్తుడికి బాధ్యత ఉంది. వివేకానందుడు ఉపన్యాసాలలో మనకీ పాశ్చాత్యులకీ దృష్టిలో తేడాగురించి చెప్తూ, ‘మీరు స్త్రీని స్త్రీగా చూస్తారు, మేం స్త్రీని తల్లిగా పూజిస్తాం’ అంటాడు అందుకే..

మధ్యకాలంలో మహమ్మదీయులకాలంలో స్థితిగతులు మారేయి ఆనాటి అరాచకీయ పరిస్థితులమూలంగా. అసలు ఏ శాస్త్రాలయినా ఆయా కాలాల్లో పరిస్థితులనిబట్టి ఏర్పడతాయి కదా.  మనకి స్వాతంత్ర్యం వచ్చేక రాజ్యాంగచట్టాలు తయారు చేసినప్పుడు స్త్రీలహక్కుల ప్రసక్తి వచ్చింది కానీ న్యాయం జరగలేదు. దానికి సరస్వతీదేవిగారు చెప్పిన కారణం ఆ చట్టాలు చేసినవారికి మనసంస్కృతిలో వేదకాలంనుండి స్త్రీలకి ఉన్న హక్కులగురించిన అవగాహన లేకపోవడం అంటారు. ఇంగ్లీషు చదువులు చదువుకున్న పండితులకి వేదకాలంలో స్త్రీలస్థానంగురించి తెలుసుకోగల సంస్కృత భాషాజ్ఞానం లేదు. వేదశాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్న సంస్కృతపండితులకు ఆ వేదసూత్రాలను వివరించగల ఇంగ్లీషు భాషాజ్ఞానం లేదు. దాంతో అంతా అస్తవ్యస్తం అయిపోయింది.”

సరస్వతీదేవిగారి పుస్తకం archive.org లో ఉంది. ఈపోస్టు చివర్లో లింకు ఇచ్చేను.

ఈవిషయంలో విదేశాలలో స్త్రీలస్థానంగురించి నా ఆలోచనలు కూడా పంచుకుంటున్నాను ఇక్కడ, కొంచెం శాఖాచంక్రమణమే అయినా. పోల్చి చూసుకోడానికి ఉపయోగపడవచ్చు.

“సుమారుగా పద్ధెనిమిదో శతాబ్దం మధ్యలో- అప్పటికి స్త్రీవాదం అన్న పదం వాడుకలో లేదు కానీ ఫ్రాన్సులో కార్మికులతిరుగుబాటు వచ్చింది. ఆ కార్మికులని నిరసిస్తూ Edmund Blake ఓ పుస్తకం రాసేడు. దాన్ని పూర్వపక్షం చేస్తూ, బ్రిటిష్ రచయిత్రి Mary Wollstonecraft మరో పుస్తకం Vindication of Rights of Men అని రాసి ప్రచురించింది 1790లో. ఆతరవాత మరో రెండేళ్ళకి Vindication of Rights of Women అని మరో పుస్తకం రాసింది. సమాజంలోనూ ఇంట్లోనూ స్త్రీలస్థానం, హక్కుల న్యాయాన్యాయవిచారణ చేస్తూ రాసిన ఈ పుస్తకం అనేకమంది మేధావులదృష్టిని ఆకట్టుకుంది. తన తండ్రి తల్లిని హింసించడం, ఆడవారిపట్ల హేయంగా ప్రవర్తించడంలాటివి ఆమె స్వయంగా చూడ్డం, పదిహేడేళ్ళకే స్వయంశక్తితో చదువుకోడం, బతుకుతెరువు చూసుకోడంతో ఆమెకి సమాజాన్నిగురించిన అవగాహన ఏర్పడింది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలించి, విశ్లేషించి స్త్రీల పరిస్థితి మెరుగుపరచడానికి ఉద్యమించింది. స్త్రీలకి చదువు, ఉద్యోగాలు, వివాహచట్టాలలో అన్యాయాలూ లాటి విషయాల్లో విశేషంగా కృషి చేసింది. అయితే మనం ముఖ్యంగా గమనించవలసినవిషయం – స్త్రీస్థానం సమాజంలోనూ, ఇంట్లోనూ కూడా ఘనమైనదే, గౌరవించదగ్గదే అని ఆమె అభిప్రాయం. దీన్ని తొలిదశ స్త్రీవాదంగా పరిగణించేరు తరవాత అంటే “స్త్రీవాదం” అన్న పేరు ప్రచారంలోకి వచ్చినతరవాత. ఈదశలో ఈ సమస్యలచర్చ కేవలం మధ్యతరగతి స్త్రీలకి మాత్రమే పరిమితమయింది, అది కూడా బ్రిటన్లోనే. ఒక దశాబ్దం తరవాత, 1900-1918 మధ్యలో మేధావంతులయిన స్త్రీలు అమెరికాలో వోటు హక్కులకోసం అలజడి లేవదీశారు. క్రమంగా ఇతర అంశాలు కూడా వారి పోరాటంలో చోటు చేసుకున్నాయి. కొంతవరకూ సాధించేరు కూడాను – ఆడవారికి పైచదువులూ, హైస్కూల్ విద్యావిధానంలో ఆడపిల్లలకి అనుగుణమైన మార్పులు, వివాహితులకి ఆస్తిహక్కులు, అలాగే దంపతులు విడిపోయినప్పుడు పిల్లల సంరక్షణలో స్త్రీలస్థానం లాటివి. వోటు హక్కులు మాత్రం మొదటి ప్రపంచయుద్ధం వరకూ రాలేదు.

వోటు హక్కులవిషయంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఇక్కడ ఉన్న తరతమబేధాలు. మనకి 1947వరకూ స్వాతంత్ర్యమే లేదనుకో. కానీ అది వచ్చింతరవాత వోటు హక్కంటూ వచ్చినప్పుడు, అందరికీ ఆడవారికీ మగవారికీ ఒక్కసారే వచ్చింది. అమెరికాలో అలా కాదు. ముందు ఉన్నతవర్గాలలో శ్వేతజాతి స్త్రీలకి మాత్రమే వచ్చింది. ఆతరవాత క్రమంగా, స్త్రీఉద్యమాలవల్ల నల్లవారికీ, వారిలో స్త్రీలకీ, బీదవారికీ … అలా అంచెలంచెలుగా హక్కులకోసం పోరాడవలసి వచ్చింది.

రెండవప్రపంచయుద్ధం సమయంలో మగవారంతా యుద్ధరంగానికి వెళ్ళిపోయినప్పుడు, దేశంలో కర్మాగారాల్లోనూ, ఇతర వ్యాపారాల్లోనూ పని కుంటుపడడంతో స్త్రీలని ఆ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఇది రెండోదశలో చెప్పుకోదగ్గ మలుపు.  ఆరోజుల్లోనే స్త్రీలు ఉద్యోగాల్లో అసాధారణ ప్రతిభ చూపించి, తాము మగవారికి ఏమాత్రమూ తీసిపోమనీ, ఇంకా కొన్నిచోట్ల మగవారికంటే మెరుగ్గానే చేయగలమనీ కూడా నిరూపించుకున్నారు. 60వ దశకంలో బెటీ ఫ్రీడాన్ (Betty Friedan) ప్రచురించిన పుస్తకం Feminine Mystique దేశంలో సంచలనం లేపింది. “స్త్రీలకి కేవలం మాతృత్వం, గృహిణిబాధ్యతలు మాత్రమే పరిపూర్ణమయిన సంతృప్రిని కలిగిస్తాయన్నది భ్రమ” అని ఆమె వాదం. ఈకాలంలో స్త్రీలు రాజకీయాల్లో కూడా పాల్గొనడం ప్రారంభించేరు. మధ్యతరగతిస్త్రీ స్థితిగతులతో మొదలయిన ఉద్యమం దిగువతరగతి స్త్రీలసమస్యలు కూడా తీసుకుంది. దీనికి ప్రధానకారణం ఫోర్డ్ కంపెనీలో పని చేస్తున్న స్త్రీలు తమకి మగవారితో సమానంగా జీతాలు ఇవ్వాలని సమ్మె ప్రారంభించడం. ఇది జరిగింది 1968లో. అప్పటికి బెటీ ఫ్రీడాన్ పుస్తకం వచ్చి ఐదేళ్ళయింది. అది ప్రజలలో గట్టిగా ఆలోచించేలా చేసింది. క్రమంగా ఇంటా బయటా కూడా స్త్రీలకి సంబంధించిన ఇతరవిషయాలు – స్త్రీల ఆరోగ్యసమస్యలు, ముఖ్యంగా గర్భధారణకి సంబంధించిన అంశాలలోనూ తదితరవిషయాల్లోనూ స్త్రీలకి సంపూర్ణ అధికారంవంటివి ఈ ఫెమినిస్టు ఉద్యమం రెండో దశలో చోటు చేసుకున్నాయి. ఈదశలో ప్రముఖ స్థానం వహించింది గ్లోరియా స్టైనమ్ (Gloria Steinem). కాస్త విపరీతధోరణి మొదలయింది కూడా ఇక్కడే. ఈవిడే మొదలు పెట్టిందని ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక వాక్యం “మగవాడిఅండలేని ఆడదానిబతుకు సైకిలులేని చేపబతుకులాటిది” అన్నది. ఆ తరవాత స్టైనమ్ ఆ వాక్యం తాను సృష్టించింది కాదని చెప్పినా, స్థూలంగా మగవారిపట్ల ఆమె ధోరణివల్ల ఆవాక్యం ఆమెదిగానే ప్రచారంలో ఉంది. ఇంతకీ స్త్రీలు తమ తిరుగుబాటుధోరణిని ఎంతవరకూ తీసుకుపోయేరో అన్నది తెలుస్తుంది ఇక్కడ. ఆరోజుల్లోనే ప్రస్తుతం ప్రజలు మాటాడుతున్నది “మగభాష” అనీ, ఆడవాళ్ళకి వేరే భాష కావాలనీ వాదించేరు. Woman అన్న పదంలో man ఉందని దానికి ప్రతిగా womyn అని మార్చడంలాటివి కూడా చేసేరు. 69, 70 దశకాల్లో ఇది ఉధృతంగా సాగింది. ఆ ఊపులోనే గ్లోరియా స్టైనమ్ పెళ్ళికి కూడా విముఖురాలు.

క్రమంగా ఆ ఉధృతం చల్లబడి, 80లు వచ్చేసరికి ఉద్యమం మరొక మలుపు తిరిగింది. ప్రముఖ రచయిత్రి ఆలిస్ వాకర్ (Alice Walker) కూతురు రెబెకా వాకర్ (Rebecca Walker) “నేను మూడో మలుపుని” అన్న శీర్షికతో వ్యాసం రాసి గ్లోరియా స్టైనమ్ నడుపుతున్న Ms Magazine లో ప్రచురించింది. ఆ వ్యాసం అనేకమంది ప్రముఖలనీ, ముఖ్యంగా ఆనాటి యువతనీ ఆకట్టుకుంది. స్ర్రీలు ఎదుర్కొంటున్న అసమానత్వం –  వయసు, లింగబేధం, జాతివివక్షతలు, గే, లెస్బియన్ జీవనవిధానం, దారిద్ర్యం, స్త్రీల విద్యాస్థాయి వంటి అనేక కోణాలు ఆమె ఎత్తి చూపి, సకల రంగాల్లోనూ అందరికీ సమస్థాయి ఉండాలి వంటి అంశాలు ఈ మూడోదశ స్త్రీవాదనలో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. ఈదశలో వెనకటి ఔద్ధత్యం తగ్గి, అందరం మనుషులమే అంటూ కొంత సమతూకంతో ఆలోచించడం కూడా మొదలయింది. ఇది అమెరికా, బ్రిటన్, యూరపులలో నడిచిన కథ.ఈ విషయాలన్నీ కొంతవరకూ మన సమాజంలో స్త్రీలకీ వర్తిస్తాయి అనిపించినా మనకీ వారికీ ఉన్న తేడాలు కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి, కేవలం హక్కులగురించే పోరాటం చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడంలాటిదే. అసలు మనదేశంలో స్త్రీలహక్కులగురించి మరోదారిలో సాగింది.

వ్యత్యాసాలు గమనించాలి మనం. భౌగోళికంగా, సామాజికంగా, జనాభాదృష్ట్యా ఏర్పడిన కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి మనకి. అవి కూడా మన జీవనవిధానాన్ని తీరిచి దిద్దుతాయి. ఇంతకుముందు ఒకసారి మాటాడుకున్నాం అనుకుంటా ఈవిషయాలు. మనకి కుటుంబం అంటే ఒక్క భార్యా, భర్తా, పసి పిల్లలు మాత్రమే కాదు కదా. నిజానికి బ్రిటన్లో కూడా మనసమాజంలో ఉన్నలాటి ఆనవాయితీలు పందొమ్మిదో శతాబ్దంలో కనిపిస్తాయి. జేన్ ఆస్టిన్ నవలలు చూడు. ఇరవయ్యవ శతాబ్దం తొలిపాదంలోనే మన స్త్రీలు స్వాతంత్యోద్యమంలో పాల్గొన్నారు కదా. గాంధీకి సత్యాగ్రహం చేయాలన్న స్ఫూర్తి మన ఆడవారినుండే వచ్చింది అంటారు.      

పాశ్ఛాత్యుల జీవనవిధానం మన జీవనవిధానం కంటె వేరు అయినా సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. అవి భిన్నంగా కనిపించవచ్చు కానీ క్రియాశీలకం కాదు. వారిబాధలు వారు ఎదుర్కొన్న విధానం మనకి ఆ క్షణానికి ఘనంగా కనిపించవచ్చు కానీ ఆచరణీయం కాదు. ఎంచేతంటే మన జీవనవిధానం వేరు. మన సామాజికపరిస్థితులు, కుటుంబపరిస్థితులు, మన వాతావరణం – వీటన్నటి ప్రభావం మన బతుకులమీద ఉంది. మన కుటుంబాలలో స్త్రీకి ఉన్న స్థానం వేరు.

మనం వారిని అనుసరించేముందు ఇవన్నీ అలోచించాలి. గుడ్డిగా అమెరికావో బ్రిటనో ఇలా చేస్తోందని అనుసరించడం అభ్యుదయం కాదు.

000

ఇల్లిందల సరస్వతీదేవి గారి భారతనారి – నాడూ నేడూ వ్యాసానికి లింకు https://archive.org/details/in.ernet.dli.2015.389592

000

(అక్టోబరు 30, 2021)