నాకవితలసంకలనం!

నాకవితలు సంకలనం చేయడానికి సంకోచించేను చాలా కాలం. కానీ కనీసం వీటిలో కొన్నిటిని కొందరు ఆదరించేరు. కొన్ని పత్రికలు ప్రచురించేయి. అంచేత, సాహసించి, కవితామాలతి కూడా నాసంకలనాల పుటలో పెట్టడానికి నిశ్చయించేను. ఈ పుస్తకానికి మాలతీలత ఫొటో వేయాలని ఉంది కానీ నాకెక్కడా దొరకలేదు. ప్చ్.

కవితామాలతి

ప్రకటనలు

కిండిల్ పుస్తకాలు – ప్రచురణలో నా అనుభవాలు.

ఆ మధ్య కొందరు నేను ప్రచురించుకున్న పుస్తకాలగురించి అడిగేరు. మీలో కొందరికైనా తెలిసే ఉంటుంది నా పుస్తకాలు రెండు అమెజాన్.కాంలో ఉన్నాయని. అవి నేను CreateSpace.com ద్వారా కూర్చి ప్రచురించేను. నిజానికి All I Wanted was to read సంకలనం నామొదటి ప్రయత్నం. అది పి.ఓ.డి. (publish on demand) ప్రచురణ. ఎలా పని చేస్తుందో చూడ్డానికి మాత్రమే తయారు చేసింది అది. Continue reading “కిండిల్ పుస్తకాలు – ప్రచురణలో నా అనుభవాలు.”

ఎన్నెమ్మకతలు – 2 (పిడియఫ్)

ఎన్నెమ్మ కతలు పేరుతో, కొత్తపాళీ ముందుమాటతో ఒక సంకలనం వెలువడింది ఇదివరలో. నాసాహిత్యం పిడియఫ్ లో పేజీ చూడండి.

ఇది రెండో సంకలనం. యథాశక్తి అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు దిద్ది, 32 కతలు ఈ సంకలనంగా కూర్చేను. అన్నట్టు ఇందులో లింకులు కూడా పని చేస్తున్నాయి మీ సౌకర్యార్థం!

ఎన్నెమ్మకతలు 2

కథామాలతి 3 – మూడోసంకలనం

కథామాలతి 3

ఈ సంకలనంలో తెలుగు స్వతంత్రలో అచ్చయిన నా మొదటిస్కెచ్‌నుండీ 1966లో ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురించిన కాశీరత్నం వరకూ ఇరవైఐదు ఉన్నాయి. ముందు రెండు సంకలనాలకి భిన్నంగా, ఈ కథలని అవి ప్రచురింపబడిన తేదీలవరసలో అమర్చేను. ఇవన్నీ తిరిగి టైపు చేసి ఇలా పెట్టుకుంటే నారాతల్లో నేను ఎక్కడినుండి ఎక్కడి వచ్చేను అన్నది నాకు తెలుస్తోంది.

వీటిలో మొదటి 9 రచనలూ కథలు కావు. ఈనాటి కార్డు కథల్లాటివి – ఒక చిన్న సంఘటన చిత్రించడం మాత్రమే జరిగిందిక్కడ. తరవాతిరచనల్లో కథకి కావలసిన లక్షణాలు ఉన్నాయి. పోతే ప్రత్యేకించి చెప్పుకోవలసింది భాష. నాకు చిన్నప్పటినుండీ కూడా తెలుగుభాష అంటే ప్రత్యేకాభిమానమని చాలాసార్లే చెప్పేను. అధికంగా ఆ విషయం నాకు స్పష్టమయింది నేను అమెరికా వచ్చేక. నా అన్నవాళ్ళు ఇక్కడ లేరన్న భావంకంటే కూడా నాభాష మాటాడేవాళ్ళు లేకపోవడమే నన్ను ఎక్కువగా బాధించింది. ఆ కారణంగానే తూలిక.నెట్ సైటూ, తెలుగు తూలిక బ్లాగూ పుట్టేయి.

ఈ కథలు మళ్ళీ టైపు చేస్తుంటే నాకు కొట్టొచ్చినట్టు కనిపించింది అప్పటికీ ఇప్పటికీ నాభాషలో తేడా. మంచుదెబ్బ, విపర్యయంలాటి కథల్లో నేను నేర్చుకున్న సంస్కృతం అంతా “ప్రదర్శన” అయింది. వాటిలో చాలా పదాలకి ఇప్పుడు అర్థాలడిగితే చెప్పలేను. కానీ ఆనాటి ప్రముఖ రచయితలచేత “మాలతి మంచి కథలు రాస్తుంది” అనిపించిన నామొదటికథ మంచుదెబ్బ. దానికి కొంత కారణం నా సంస్కృతభాషాభేషజమేనేమో నాకు తెలీదు. ఇది నాకు ఇప్పుడు వస్తున్న ఆలోచన.

నా ఇంగ్లీషు అతిగా కనిపించింది ఓటుకోసం అన్న స్కెచ్‌లో. మిగతా కథల్లో అక్కడక్కడ ఇంగ్లీషుమాటలు ఉన్నాయి. కొన్నిచోట్ల అనవసరమే అనిపిస్తోంది ఇప్పుడు చూస్తే. మరి “మీరు రాస్తే ఒప్పూ, మేం రాస్తే తప్పూనా?” అని అడిగేవారికి నా జవాబు, “లేదు. నేను రాసినా తప్పే. ఎటొచ్చీ ఆరోజుల్లో నాకు ‘ఎందుకింత ఇంగ్లీషు”’ అని నన్ను అడిగినవాళ్ళూ, రాయొద్దని చెప్పినవాళ్ళూ లేకపోయేరు. నిజానికి ఈనాటి యువతలాగే నేను కూడా ఉద్యోగాలకోసమే ఇంగ్లీషు యమ్మే చేసేను. ఆదృష్టితో చూస్తే నేను ఇంగ్లీషు తక్కువే వాడేననిపిస్తోంది.

నాకు తోచిన మరోకోణం ఉదాత్తమయిన, గంభీరమయిన విషయాలు చిత్రిస్తున్నప్పుడు సంస్కృతసమాసాలు విరివిగా వాడేను. ఇంగ్లీషుమాటలు హాస్యానికీ, వ్యంగ్యానికీ వాడేను కనీసం కొన్ని చోట్ల. (విషప్పురుగు‌ కథలో ఇంగ్లీషు మాష్టరు తెలుగులోనూ, తెలుగు మేష్టరు ఇంగ్లీషులోనూ మాటాడ్డం మనం అలవరుచుకున్న ఒకరకం కృతకసంస్కృతిని ఎత్తిచూపడానికే).

సాధారణంగా యౌవనదశలో అందరం ఒకరకమైన ఉదాత్తభావాలకి పెద్దపీట వేస్తాం. అవే దరిమిలా ఐడియాలజీలవుతాయి కొందరివిషయంలో. అలాటి ఉదాత్తభావాలూ, కొందరంటే అప్పట్లో నాకు కలిగిన “ఆరాధన” (అతిగా) ప్రాతిపదికగా జీవనమాధుర్యం, మామూలు మనిషిలాటి కథలు రాయడం జరిగింది. ఇప్పుడు అలాటివి రాయను. ఇప్పుడు నా “కంఠస్వరం” అలాటి ఉదాత్తమయిన లేదా ఆర్ద్రమయిన భావాలు చిత్రించడానికి అనువుగా లేదు. నిజానికి ఆకథలు ఇప్పుడు నాకు కాస్త హాస్యాస్పదంగా కూడా కనిపిస్తున్నాయి! ఇది నావ్యక్తిత్వంలో వచ్చిన మార్పు. పెద్దమార్పే. (నిజానికి ఇదే నేను మార్పు రాయడం మొదలు పెట్టడానికి కారణం కూడాను. అది పూర్తి చెయ్యాలి ఎప్పుడో!).

ఒక ప్రసిద్ధరచయిత మంచుదెబ్బ కథకి ముగింపులో వకుళ “ఆత్మహత్య అనవసరం” అన్నారు. అప్పట్లో అది ఆత్మహత్య అని నేను అనుకోలేదు. సాధారణంగా ఇలా చావుని ముగింపుగా చూపడంలో రచయితఅభిప్రాయం ఏమై ఉంటుంది అంటే నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది – నాకథ శీర్షికలోనే కనిపిస్తోంది. మంచుదెబ్బ తిన్న తమ్మిపువ్వు తిరిగి వికసించదు. అతి సున్నితమైన మనసుగల, అమాయకురాలయిన వకుళలాంటి వ్యక్తి ఘోరమైన దెబ్బ తింటే తిరిగి కోలుకోదన్నది. రెండోకారణం – ఆరోజుల్లో చావుతో ముగించిన కథలు కొంచెం ఎక్కువే. రచయితకి ఏం చెయ్యాలో తెలీనప్పుడు పాత్రని చంపేసి పాఠకులని సుఖపెడతారేమో అనిపిస్తోంది. నామటుకు నేను తరవాత రాసినకథల్లో చావుని అంతగా వాడలేదు. (ఇంకా ఒకట్రెండు ఉన్నాయి కానీ వాటిగురించి నాలుగోసంకలనం ముందుమాటలో రాస్తాను). ఈసంకలనానికి సంబంధించినంతవరకూ జీవాతువులో “అరుంధతి జీవిస్తూంది,” అని ముగించేను. నడుస్తున్నచరిత్రలో కల్యాణికి భవిష్యత్తు మరింత ఆశాజనకంగా చూపించేను.

ఇవన్నీ నేను తీరిగ్గా ఆలోచించి అలా రాసేనని చెప్పడం లేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా అనిపిస్తోంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, రచయితలు తమరచనలు అప్పుడప్పుడు తిరిగి చూసుకుని, ఆత్మశోధన చేసుకోడంవల్ల లాభమేనని చెప్పడంకోసం.

ఇప్పటికింతే సంగతులు.

– నిడదవోలు మాలతి

జులై 29, 2011

కథామాలతి 2 (రెండో సంకలనం)

ఇది నాకథల రెండో సంకలనం.

కథామాలతి 2

ఇందులో కథలు కూడా అన్నీ నేను అమెరికా వచ్చేక రాసినవే. కొన్ని జాలపత్రికలలో ప్రచురించబడ్డాయి. ప్రతికథకీ చివర ప్రచురణ వివరాలు ఇచ్చేను. అంతే కాక, కథలకి సంబంధించిన ఇతర వివరాలు కూడా ఇచ్చేను అవసరమనిపించిన చోట.

ఈమధ్య కొంతకాలంగా నేను నాకథలు ఇతర పత్రికలకి పంపడం మానేశాను, వారి పాలసీలు నాకు నచ్చక.

మొదటి సంకలనంలాగే ఈ సంకలనం కూడా పాఠకులు ఆదరించగలరని ఆశిస్తున్నాను.

మీ అభిప్రాయాలు నిర్మొహమాటంగానే రాయవచ్చు ఇక్కడ గానీ మీ మీ బ్లాగులలో గానీ, ఇతర పత్రికలలో గానీ. విపులా చ సాహిత్యక్షేత్రమ్!

కొందరు అనుకుంటున్నట్టు నేను మెప్పులు మాత్రమే అంగీకరిస్తానన్న అపోహ తొలగించడానికే వ్రాతమూలకంగా ఈ disclaimer!

(జులై 13, 2011)

కథామాలతి – సంకలనం

ఈ సంకలనంగురించి

నా ముందు టపాలో మాధురికీ, నాకథలు ఆదరించే తదితర పాఠకులకి మాటిచ్చాను నా కథలు వీలయినంత పఠనయోగ్యంగా చేసి ఇ-బుక్ రూపంలో అందించగలనని.

(కథలు చదువుకోడానికి కథలమాలతి 1నొక్కండి)

ఆ ప్రయత్నంలో ఇది తొలి సంకలనం. నేను అమెరికా వచ్చేక రాసినవే ఇవన్నీ. Continue reading “కథామాలతి – సంకలనం”