Chataka Birds

నా నవల చాతకపక్షులు ఇంగ్లీషులోకి అనువదించి thulika.net లో ప్రచురిస్తున్నాను.

మామూలుగా అనువాదం చేసినప్పుడు ఎవరికోసం చేస్తున్నాం అన్నవిషయం గుర్తు పెట్టుకోవాలని నేను చాలా సార్లే చెప్పేను.

అయితే, ఈనవల అనువాదం చేస్తున్నప్పుడు నాకు ఆవిషయం మరింత స్పష్టం అయింది. నా అమెరికన్ స్నేహితురాలు, రచయిత్రి అయిన Judith Ann Adrian కి మొదటి ఆరు పేజీలు చూపించేను. ఆమె ఇచ్చిన సలహాలు చూస్తే నాకు అర్థం అయిన విషయం –

నేను ఈనవల రాసినప్పుడు ప్రధానంగా అపోహలు దృష్టిలో పెట్టుకున్నాను. అమెరినులంటే తెలుగువారికి ఉన్న అపోహలు తెలుగవారంటే అమెరికనులకి ఉన్న అపోహలలాటివే. వాటిని వీలయినంతవరకూ ఎత్తి చూపడంలో తెలుగు నవలలో తెలుగువారినే గుర్తుపెట్టుకున్నాను.

ఇప్పుడు అది ఇంగ్లీషులోకి అనువాదం చేసినప్పుడు, ఇంగ్లీషువారిని గుర్తు పెట్టుకోవాలని మరొకసారి జూడిత్ వ్యాఖ్యానాలవల్ల తెలిసింది. అంటే తెలుగువారికి మనం చెప్పనవసరం లేని విషయాలు అమెరికనులకి మరింత విస్తృతంగా చెప్పవలసివస్తుంది. అదే అభిప్రాయంతో కొన్ని సంభాషణలు, సంఘటనలూ కూడా మార్చవలసి ఉంటుంది.

ఈదృష్టితో ఇంగ్లీషు నవలకీ తెలుగు నవలకీ తేడా బాగానే ఉంది.

ఆసక్తి గలవారు ఇక్కడ చూడవచ్చు.

నిడదవోలు మాలతి

మే 13, 2022.

చాతకపక్షులు, మార్పునవలలమీద సునీత రత్నాకరం సమీక్షలు

ఈరెండు నవలలమీదా ముఖపుస్తకంలో మిత్రులు ఒకొక భాగంమీద తమఆలోచనలు వెలిబుచ్చేరు. ఈసమీక్షలు నవలలు సమగ్రంగా, ఆసాంతం చదివి రాసినవి.

ఇదుగో ఆసమీక్షలు.

చాతకపక్షులు నిడదవోలు మాలతి

ఈ నవల మాలతి గారు ఎనభైయవ్వ దశకంలో రాయడం మొదలుపెట్టారట కానీ కొంతలో ఆపి మళ్లీ పూర్తి చేసింది రెండువేలలో….మొదట 2004 లో ప్రచురించపడి తర్వాత బ్లాగుకి వెళ్లి ఇప్పుడు మళ్లీ నెచ్చెలి.కామ్ లో వస్తుంది.

కథ స్థూలంగా చూసుకుంటే గీత అనే వో అమ్మాయి వివాహబంధంతో అమెరికాలో అడుగుపెట్టి అక్కడి సంస్కృతిని ఆకళింపు చేసుకుంటూ, తను పుట్టిపెరిగిన వాతావరణాన్ని గుర్తుచేసుకుంటూ, తనలాగే ఇక్కడికి చేరిన ఇంకొందరి వ్యవహారాలను దగ్గరగా గమనిస్తూ, తన ఆలోచనలతో వీటన్నింటినీ తరాజు వేసుకుంటూ జీవితం నడిపిస్తున్నట్టుగా ఒక పెద్ద ప్రణాళిక లేకుండా వెళ్లిపోతుండటమే.

ఊరికొకరు అమెరికాకు వెళ్లడం నుంచీ వీధికొకరు మీదుగా ఇప్పుడు ఇంటికొకరు అన్నట్లుగా మారిన కాలం. ఇట్లాంటప్పుడు తెలియనివి ఏం చెప్పారు ఇందులో.. ఇప్పుడీ కథ ఎందుకు చదవాలి అన్న సందేహాలు రావచ్చు. ఈ కథ చెప్పడంలో రచయిత ఒక ట్రావెలాగు లాగానో, అక్కడి వాతావరణ చిత్రణ మీదనో మాత్రం ప్రధానంగా దృష్టి పెట్టి వుంటే ఆ మాట ఒప్పుకోవచ్చు. కానీ, ఈ నవలలో జరిగింది రకరకాల మనస్తత్వ చిత్రణా విశ్లేషణా. అందుకే ఇది తప్పక చదవవలసిన కథగా మారుతుంది. కథలో అతి తక్కువ సమయం కనబడే శివం మామయ్య, కనకమ్మ అత్తయ్య, ఇమ్మాన్యుయేల్, అచల లాంటి పాత్రలనుంచీ ప్రధాన పాత్రలు గీత, హరి, తపతిల దాకా అందరికీ జవజీవాలతో నిండిన వ్యక్తిత్వాలు వున్నాయి. పాత్రల మధ్య సంబంధాలు ఆసక్తికరంగా వాస్తవికంగా వున్నాయి. దాదాపు అందరి జీవితాలలో వచ్చిన మార్పులు గీత కళ్ళలోంచి చూపిస్తారు. గీత మాత్రమే తామరాకుమీదినీటిబొట్టు చందాన బతికేస్తుంది, తను కథానాయిక కనుక సర్వశ్రేష్ఠమైన మనిషిగా చూపాలి అన్న ప్రలోభం రచయితకు వుండకపోవడం గీతకు చేసే మేలు తక్కువ కాదు.

అమెరికాకి చేరాక తెలుగుమూలాలు కాపాడుకోవలనుకునే స్పృహతో చేసే రకరకాల క్రతువులు కార్యక్రమాల నుంచీ సంఘాల ప్రహసనాలదాకా అన్నిటినీ స్పృశించారు రచయిత. అందులోని సొబగు క్లుప్తత, వ్యంగ్యంతో చక్కగా సాధించారు. నేను చదివినంతలో అనవసరపు నాటకీయత లేకుండా సూటిగా రాయడం మాలతి గారి స్పష్టమైన ముద్ర, ఈ నవల మొత్తం ఆ ముద్ర తెలుస్తుంది. అది నాకు ఒక చదువరిగా వ్యక్తిగతంగా కూడా మంచిరచనలో నచ్చే లక్షణం. సాహిత్యరంగపు తీరుతెన్నులపై చేసిన ప్రస్తావనలు కొద్దివైనా చెప్పుకోదగ్గవి.

(ముఖపుస్తకంలో, మార్చి 26, 2022 ప్రచురితం)

——————————

మార్పు నవల

ఇప్పుడే చదవడం పూర్తి చేశాను మాలతిగారూ.

నవల విస్తృతిని ఎంత బాగా వాడుకున్నారో! మీరు చెప్పినట్టే కథగా ఏక వాక్య పరిధిలో వున్నా ఎన్ని విషయాలలో మార్పును ప్రస్తావించారో చూసాక అబ్బురంగా అనిపించింది. స్త్రీపురుష సంబంధాలూ మనిషి వ్యక్తిస్థాయిలో మొదలై సమాజస్థాయి కి మారడమూ కుటుంబ సంబంధ బాంధవ్యాలూ, భారతీయ, అమెరికన్, భారతీయ అమెరికన్ సమాజపు స్థితిగతుల్లో పరిణామాలూ మనిషి జీవితంలో ఆథ్యాత్మికతను చూసే కోణంలో మార్పులూ సాహిత్యపు సంఘాలూ వాటి తీరుతెన్నుల గురించి విపులమైన వ్యాఖ్య చేశారు. ప్రతీ సందర్భంలో దీనిమీద వెంటనే ఒక నిర్ణయం చెప్పేయాలి అన్న ప్రలోభాలకు లోబడలేదు.

నాకు వ్యక్తిగతంగా స్త్రీవాదం ఎదుగుదల మీద రాసిన భాగం చాలా నచ్చింది. ఈ మధ్య కొన్ని ప్రసంగాలు వింటున్నా, కానీ ఇంత సరళంగా మీరే చెప్పారు. ఒకవేళ ఒరిజినల్ లో ఇంకాస్త విపులంగా ఈ విషయం మీద రాసి వుంటే దయచేసి నాకు పంపండి (చాలా ఎడిట్ చేసాను అన్నారు కనుక అడుగుతున్నా)

కొన్ని భాగాల మీద ఫేస్బుక్ లో జరిగిన చర్చ పైపైన చూసాను. చాలా మంచి చర్చ జరిగినట్లే వుంది ఎక్కువ భాగాల మీద. అప్పుడే చదవగలిగితే ఇంకాస్త బావుండేది అనిపించింది 

ఇదే మీ మాగ్నమ్ ఓపస్ అనేసే పిచ్చిపని చేయను కానీ నేను చదివిన నవలల్లో ఉత్తమస్థాయికి చెందిన వాటిపక్కన తప్పక నిలిచే కథ ఈ ‘మార్పు’. ఈ అంశం మీద ఇంత విపులమైన నవల రాసినందుకు ధన్యవాదాలు.

(ముఖపుస్తకంలో మార్చి 28, 2022, ప్రచురితం.)

సునీత రత్నాకరంగారికి ధన్యవాదాలతో – మాలతి.

https://wp.me/p9pVQ-2dB – చాతకపక్షులు నవలమీద లక్ష్మీదేవిగారి సమీక్ష –

(మార్చి, 28, 2022)

వికిపీడియాలో సరికొత్త పేజీ

వికిపీడియాలో నాగురించి వివరాలు చూడండి

https://en.wikipedia.org/wiki/Nidadavolu_Malathi?fbclid=IwAR2nqAe4Pl31Go89MHNVfxK7aew6mJz2xg0CmfDsp3rH2UbwO-fy4LvH4zQ

శివశంకర్ అయ్యలసోమయాజుల గారికి కృతజ్ఞతలతో

నిడదవోలు మాలతి

జనవరి 4, 2022

Status of Women in India, Then and Now.

ఇల్లిందల సరస్వతీదేవిగారి భారతనారి, నాడూ నేడూ అనువాదం మరొకసారి సరి చూసుకుని, పిడియఫ్ ఫార్మటులో ఒకే ఫైలుగా చేసి orchive.org లో పెట్టేను.

లింకు ఇక్కడ