ధర్మకాటా

ధర్మకాటా

ఆకలేస్తే అన్నం తిను
చలేస్తే దుప్పటీ కప్పుకోమంటూ
నోటిలెక్కల్లా
బహుతేలిక
ఈనాటి నాగరీకప్రపంచంలో
ప్రతిసమస్యకీ
రెడీమేడ్ జవాబు

కంటికానని
అనుభవాలు
పరమాణుల్లా
కోటానుకోట్లు

అణువణువూ
గతానుగతికంగా
ప్రపంచాన్ని పాలిస్తోంది
చట్టాలని సృష్టిస్తోంది

నిజానికి
అంతరాంతరాల్లోంచి
పుట్టుకొచ్చే వణుక్కి
దుప్పట్లెక్కడా దొరకవు
అకాడమీలందిచ్చే
ధర్మనిర్ణయాలు
సామాన్యులకి
సాంత్వన కూర్చవు
వారి తీర్పులు
వీరి బతుకుల
మూసపోసిన అచ్చుల్లా
అమరవు.

(మాలతి, 10-24-1997)

చెట్టు

సౌమ్య వ్యాఖ్యానం చూసినతరవాత తప్పు దిద్దుకుంటున్నాను. ఇస్మాయిల్ గారికి నా క్షమాపణలు.
— మాలతి.

చెట్టు ఆదర్శం?

.
చెట్టు తమ ఆదర్శం
అంటారు మన కవులు
మరి
ఈనాడు మూడులోకాలకూ
పనికొస్తోంది వనచయం
సంచులూ, కంచాలూ కూర్చిపెట్టటానికీ,
ముక్కూ, మూతీ,
ముందూ వెనకా ఒత్తుకోటాని‌కీ
ఇల్లూ వాకిలీ సోకులు జేసుకోటానికీ.

అయ్యో రాతా!
ఇదా నేను ఏరికోరి
వలచి వరించిన బతుకని
కుమిలి కుళ్లిపోతోంది చెట్టు.

ఊసుపోక – కాఫీ రంగూ రుచీ

ఈమధ్య అమెరికాలో ప్యాచిలఘోష ఎక్కువయిపోయింది. సిగరెట్లు మానేయడానికో ప్యాచీ, పడుకున్నప్పుడు గురక రాకుండా ఓప్యాచీ, పడుకున్నప్పుడే మరేదో రాకుండా మరో ప్యాచీ .. ఇలా నానా రకాలూనూ. కాఫీ మానేయడానికింకా ఏప్యాచీ కనిపెట్టినట్టు లేదు. కాని నాకు మాత్రం ఆ అదృష్టం మరోలా ప్రాప్తించింది.

నాక్కాఫీ యిష్టం. అంటే ఒట్టి ఇష్టం కాదు. పొద్దున్న లేస్తూనే మూడు కప్పుల కాఫీ పడకపోతే కాలకృత్యాలమాట ఒదిలేయండి అసలు తెల్లారినట్టే కాదు నాలెక్కలో. అమెరికాలో రెండేళ్లవాసం, ఒక ఇండియా ట్రిప్పూ సరిపోయాయి నాకాఫీ యావ మాఫీ చెయ్యడానికి.

అసలు మొదలెక్కడంటే, నేను ఓఏడాదిపాటు ఢిల్లీలో చదువ్వెలగబెట్టేను. అక్కడ వున్న ఏడాదిపాటూ ఆ పంజాబీసబ్జీల్లో వాళ్లు గుప్పించే పసుపూ, ధనియాలపొడీ భరించలేక, భోజనం మానేసి, ఎస్ప్రెసో కాఫీలూ గులాబ్‌జాములమీదే బతికేను.

కాఫీలో పాలూ, జాముల్లో పంచదారా హెచ్చయి. సన్నగా ఊచలా వున్న నేను చక్కగా పూరాగా గాలి పోసుకున్న గుమ్మటంలా తయారయేనని మాఅమ్మ మురిసిపోయిందనుకోండి. అది వేరే కథ.

అసలు కాఫీకి పెట్టింది పేరు మద్రాసీలది. కాని దాన్ని అరణం తెచ్చుకు దేశం నలుగడలా ప్రచారంలోకి తెచ్చిన ఘనత తెలుగువారిదే. మద్రాసు తెలుగువారిదే అంటూ ఎంత మొత్తుకున్నా మనకి దక్కలేదు. ఇప్పుడంటే తెలుగుకవులూ, గాయకులూ, నర్తకులూ హైదరాబాదులో తిష్ఠ వేసేరు కానీ మన రచయితలు చాలామంది, పోయినవారు పోగా మిగిలినవారు, ఇంకా ఇప్పటికీ మద్రాసులోనే మఠం వేసుక్కూచోలేదూ. ఎందుకనుకున్నారు? మద్రాసు మనదే కనక. ఐ మీన్ స్పిరిచ్యువల్లీ! మన స్పిరిటంతా ఇంకా అక్కడే వుంది. కాఫీ అందులో ముఖ్యభాగం. ఊరు దక్కించుకోలేకపోయాం కానీ కాఫీనీళ్లు హక్కుభుక్తం చేసేసుకున్నాం.

నాచిన్నప్పుడు తెల్లారగట్ల నాలుగ్గంటలకి లేచి, పాలవాడు గేదెనీ, చేటపెయ్యనీ తోలుకొస్తే, గుమ్మంలో నిలబడి పాలు పితికించుని గిన్నెలో పోయించుకొచ్చి అమ్మకిస్తే, అమ్మ పాలూ నీళ్లూ కలిపి ఇగరగాచి ముందు రాత్రి ఫిల్టరులో పెట్టి వుంచిన చిక్కని కషాయంలాటి డికాక్షను కలిపి స్టీలుగ్లాసులో పోసి అందించిన, పొగలు గక్కుతున్న కాఫీ తలుచుకుంటే నాకిప్పటికీ నాలుకమీద ఆరుచి తగులుతుంది.

ఇప్పుడా పాలూ లేవు, ఆకాఫీ లేదు. అమెరికా రాగానే తెలిసింది ఇక్కడ కాఫీఫిల్టరులు వుండవు కాఫీ మేకరులే కానీ. కాఫీపొడి కూడా మనదేశంలోలా ఘమఘమలాడుతూ వుండదు.. మొదట్లో టీవీలోనూ, పేపరులోనూ కనిపించి ప్రతి ప్రకటనా చూడ్డం, ఇది బావుంటుంది కాబోలనుకుని ఆవురావురంటూ కొనుక్కురావడం, తీరా ముందుసారి కొన్న పొడి కంటె ఇదేం పొడిచేయలేదని ఆలస్యంగా గ్రహించడం, ఇన్ని డాలర్లోసి (అంటే అంతకు ముప్ఫై రెట్లు రూ.లు పోసి) కొన్నాం కదా అని పారేయలేకా, మింగలేకా కొట్టుకుచావడం, ఆపైన ఖర్చులు చూసుకుంటే నేను కొంటున్న కూరా, నారా, ఉప్పూ, పప్పూ కన్నా కాఫీకి తగలేస్తున్న డబ్బే ఎక్కువ అని తెలుసుకోడం జరిగింది.

ఇక్కడికి రాగానే ఎదురయే మరో ప్రశ్న కాఫీ బ్లాకా వైటా అన్నది. కాఫీ కాఫీరంగే కదా అనడక్కండి అమాయకంగా. ఎవరింటికైనా వెళ్తే, చల్లని క్రీము (పాలే) ఇస్తారు. హోటల్లో అయితే వైటెనరు అని ఓపొట్లం ఇస్తారు పాలకి బదులు. ఆపొడి కలుపుకుంటే కాఫీ వైటవదు. చూడ్డానికి బ్రౌనుగానూ, నోట బెడితే తుమ్మజిగురులా అంటుకొస్తూనూ చిరాగ్గా వుంటుంది. కాఫీమీద మమకారం నశించడానికి ఇది ప్రథమపాదం.

రెండోదశ నేను ఇండియా వెళ్లినప్పుడు. అడుగెట్టిన ప్రతి ఇంటా బ్రూయే. అది నాకు మహ గొప్ప హాచ్చెర్యమ్. ఇంట్లో ఎవరూ మామూలు కాఫీ పెట్టుకోరేం అన్నాను రహస్యంగా మాఅన్నయ్యతో.

మాఅన్నయ్య చిదానందుడిలా చిరునవ్వు నవ్వి, నా అమాయకత్వానికి జాలిపడి, మామూలు కాఫీ మామూలు కాఫీయే. నువ్వు అమెరికానుండి వచ్చేవని నీకు స్పెషల్‌గా బ్రూ కలిపి ఇస్తున్నారు. ఈనాడు అదే స్టేటస్‌ చిహ్నం‌అన్నాడు. ఆవిధంగా తాజాగా అమెరికానుండి దిగడిన నాకు నవనాగరీకం తాలూకు సూక్ష్మాలు కూడా అవగతమయేయి ఆరోజు. ఆతరవాత తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నవేళ, మాఅన్నయ్య పండుగపూట వచ్చేవు. నీకు నచ్చినచీర తీసుకో‌అన్నాడు.

చీరేం చేసుకోను, ఏడాదికోమారు కడితే ఘనం. ఓచిన్న ఫిల్టరు కొనియ్యి. రోజూ నీపేరు చెప్పుకు మంచి కాఫీ తాగుతానుఅన్నాను.

పక్కనే వున్న మాచెల్లి రహస్యంగా నాచెవిలో అదేం కోరికే పిచ్చిమొహమా! చీరఖరీదులో ఫిల్టరువెల ఏమూల,అంది.

మాఅన్నయ్య నవ్వి, సరేలే, చీరమీద ఫిల్టరు పెట్టి తాంబూలం ఇచ్చుకుంటా‌అన్నాడు.

తీరా నేను బయల్దేరేవేళ, మాచెల్లి మళ్లీ పక్కన చేరి, నువ్వు చీరెలు కట్టుకోనంటున్నావు కదా, అది పట్టుకెళ్లి ఏంచేస్తావుఅంది. సరే, చీరె వదిలేసి, కాఫీ ఫిల్టరు ఆప్యాయంగా ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాను. తెచ్చేనే కానీ, ఇక్కడ హొమొజినైజుడు పాలూ, అదీ ఫారంలోంచి ఫ్రీజరులోకి వచ్చేసరికే వారం రోజులు ,,, గట్టిగా నిజం చెప్పడానికి మనసొప్పదు కానీ అవి నిలవపాలే. మనగేదెపాల రుచి రమ్మన్నారాదు. ఆకాఫీ రుచి రాదు. ఇప్పటికి కాఫీ వైరాగ్యం రెండోదశకి వచ్చేసాను.

మూడోదశలో చెప్పుకోదగ్గది మాడైరెక్టరుగారి చేతిచలవ. ఆయనని ఓరోజు భోజనానికి పిలిచి, బుద్ధి గడ్డి తిని, మాకాఫీ వేరుఅన్నాను.

మీరెలా చేస్తారు?అని అడిగారాయన సహజంగానే.

ఇక్కడ మీరు ఒక సంగతి గమనించాలి. అమెరికనులు శిష్టావశిష్టులు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ తూకాలూ, కొలతలతో వివరించాలి. అరిటిపండు వొలిచి చేత బెడితే, ఏపక్కనించి కొరకాలని అడుగుతారు, మన మడీ ఆచారాల్లాగే ఇదీను. నీళ్లు కాచి ఫిల్టరులో పోయండి అంటే చాలదు.

మాడైరెక్టరుగారికి కాఫీ చేయు క్రమం చెప్పడం అవస్థ చూడండి..

ఒక క్వార్ట్ గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి కాయాలి

ఎంతసేపు?

నీళ్లు మరిగేవరకూ.

అంటే ఎంతసేపు?

నేను ఆలోచించాను. మామూలుగా నేను నీళ్లు పొయ్యిమీద పెట్టి, నా ఈమెయిలు చూసుకుంటాను, మెయిలు మూట విప్పడానికి మూడు నిముషాలు పడుతుంది. ఇలా లెక్కలు గట్టి, నాలుగు నిముషాలుఅన్నాను.

టెంపరేచర్ ఎంత వుండాలి?

హైలో పెట్టండి. మీడియంలో పెడితే మరో రెండు నిముషాలు పడుతుంది.

ఇదీ ధోరణి. మీకు చెప్పక్కర్లేదు కదా ఈ ప్రొసీజరంతా. ఆపూటంతా నాకాఫీ రెసెపీతోనే కాలక్షేపం అయిపోయింది.

ఆతరవాత మరో నాలుగు నెలలకి ఆయన ఇండియా వెళ్తున్నానన్నారు. ఆనవాయితీ ప్రకారం నేనూ ఏదో సలహా చెప్పాలికదా. అందరిలాగా తాజ్ మహల్ చూడండి, మామల్లపురం చూడండి అంటూ కొట్టినపిండే కొట్టడం ఎందుకని, వెరైటీకోసం, మద్రాసులో ఉడిపీహోటల్లో కాఫీ సేవించడం గొప్ప అనుభవం. అక్కడ సర్వరు చిన్నస్టీలు గిన్నే గ్లాసూ మధ్య కప్పు కాఫీ గజం పొడుగు సాగదియ్యడం మీరు చూసి తీరాలిఅని చెప్పేను.

ఆయన తిరిగొచ్చింతరవాత చెప్పేరు, ఇప్పుడు అన్ని హోటళ్లలోనూ చైనా కప్పులే. నాహోస్టుని బతిమాలి రెండురోజులు ఊరంతా తిరగ్గా, మూడోరోజు మీరు చెప్పిన స్టీలు గిన్నె, గ్లాసుతో కాఫీలిచ్చే అయ్యరు హోటలు కనిపించింది. గొప్ప ఆర్టు. వరసగా మూడు రోజులు వెళ్లి పన్నెండు కప్పులు ఆర్డరు చేసి అబ్జర్వు చేసేను.

నన్ను కాఫీకి పిలిచారు ఆ ఆదివారం, తాను కూడా అలా స్టీలుగిన్నెలో గజం పొడుగు సాగదీసి కాఫీ నాకు సర్వ్ చెయ్యడానకి ముచ్చట పడుతూ. ఎలా కాదంటాను. సరే వస్తానన్నాను. అయన మరోసారి నన్నడిగి రెసెపీ జాగ్రత్తగా రాసుకున్నారు. నేనను మళ్లీ వివరాలు ఊహించుకుంటూ, నీళ్లు కాచడం దగ్గర్నించీ చెప్పేను శ్రాద్ధకర్మలా.

ఆదివారం మధ్యాన్నం టీవేళకి వెళ్లేను. (ఇచ్చేది కాఫీయే అయినా సమయం టీవేళే.)

మా డైరెక్టరు బల్లమీద పొందిగ్గా కాఫీ, బిస్కెట్లూ అమర్చారు. ఆతరవాత తాను కొనుక్కొచ్చిన స్టీలుగిన్నెలూ, గ్లాసులూ తెచ్చి, కాఫీ గిన్నెలో పోసి అచ్చంగా అయ్యరుహోటలులో సర్వరులాగే గజంపొడుగు సాగదీసారు.

నేను ఆశ్చర్యపోయాను ఆయన నేర్పుకి. ఆమాటే అన్నాను ఆయనతో.

ఆయన గంభీరంగా చాలా సాధన చేసేనుఅన్నారు, దిగులుగా కార్పెట్‌వేపు చూస్తూ. కార్పెట్‌మీద కాఫీమరకలు, నేను చిన్నప్పుడు వేసిన ఇండియా మాప్‌లా.

ఆయన నాముందుంచిన కాఫీ తెల్లగా వుంది మాపాపకిచ్చే కాఫీలా. మరీ మల్లెపూవులా కాకపోయినా, నీర్గావి పంచెలా అనుకోండి. మర్యాదగా నవ్వుతూ గ్లాసు నోటబెట్టాను. పంచదార పానకం!

ఎలావుంది అన్నారు ఆయన ఆతురతగా నామొహంలో కళలు పరికిస్తూ, పరీక్షాఫలితాలకోసం ఎదురు చూస్తున్న తొమ్మిదోక్లాసు కుర్రాడిలా. .

షుగరెక్కువయినట్టుందిఅన్నాను తలొంచుకుని కళ్లనీళ్లు దాచుకుంటూ.

మీరు చెప్పిన కొలతలే వేసేను మరి.

ఆఖరికి తేలిందేమిటంటే, ఆయన రాసుకోడంలోనో, రాసింది చూసుకోడంలోనో గల్లంతయి, నీళ్లూ, పంచదారా కొలతలు మారిపోయాయి.

అదే నాజీవితంలో కాఫీగురించి ప్రస్తావించడం. మళ్లీ ఎవరిదగ్గరా, ఎప్పుడూ మాకాఫీ వేరు అన్న పాపాన పోలేదు.

(జనవరి 2004. )

అప్పగింతలు కవిత

అమ్మాయిని ఏవూరిచ్చారు, చిలకలపల్లేనా?

లేదమ్మా, సిలికాన్ వాలీలో పడేశాం. Continue reading “అప్పగింతలు కవిత”

రంగుతోలు

((డయాస్ఫొరా కథ. మనదేశంలో నలుపు సౌందర్యానికి సంబంధించిన చిహ్నం అయితే, అమెరికాలో జాతికి చిహ్నం. రెండు నెగిటివ్ కోణాలే. ఆతేడా విశ్లేషించి చూసినప్పడు పాజిటివ్ స్ఫూర్తి కలిగే అవకాశం వుంది.))
000

ఆదివారం. నీలవేణికి తోచడంలేదు. వూళ్లో నాటకసమాజమొకటి ఏదో నాటకం, భిన్నజాతులసంఘర్షణగురించి వేస్తున్నారని టీవీలో చూసింది. అదేమిటో చూద్దాం అనిపించి సుందరాన్ని అడిగింది. అతను రాబోయే కాన్ఫరెన్సుకోసం సీరియస్గా పేపరు రాసుకుంటున్నాడు. తనకి టైం లేదని అనడంతో ఒక్కతే బయల్దేరింది.

సుందరం కారులో దింపుతాననీ, నాటకం అయేవేళకి మళ్లీ వస్తాననీ చెప్పాడు. థియేటర్ అట్టే దూరం లేదు. అట్టే చలి లేదు, నడిచి వెళ్తానంది నీలవేణి. వచ్చేటప్పుడు మాత్రం తనొచ్చేవరకూ గేటుదగ్గరే వుండమని గట్టిగా చెప్పాడతను.

థియేటర్ దగ్గర జనం బాగానే వున్నారు. టికెట్లు అమ్ముడయిపోయేయి. దిక్కులు చూస్తూ నిలబడ్డ నీలవేణికి ఎవరో సౌంజ్ఞ చేసారు కళ్లతోనే. అటు తిరిగి చూసింది.

ఒక మూడేళ్ల అమ్మాయి ఏడుస్తూ నిలబడింది చేతిలో ఓటికెట్‌తో. ఏ Goodwill Storeలోనో కొన్న సాదా గౌనూ, పాత జోళ్లూ, నల్లని ఉంగరాలు తిరిగిన జుట్టుని చుట్టుకు ఎర్రరిబ్బను. ఎవరో ఓ తెల్లనమ్మ ఆపిల్లని అంటకుండా, గజం దూరంలో నిలబడి ఓదార్చడానికి తంటాలు పడుతోంది. ఆఅమ్మాయి ఏడుపు తప్ప మరే జవాబూ లేదు. “మామీ” అన్నమాట తప్ప మరోమాట లేదు. ఒకరిద్దరు ఆ అమ్మాయికి బాగా దూరంలో నిలబడి, ఏవో నంగిప్రశ్నలేస్తున్నారు. ఓ పెద్దాయన నీలవేణివేపు చూసాడు అర్థవంతంగా. ఆచూపుకి ఎన్నో అర్థాలు లేవు. ఒకే ప్రశ్న “మీపిల్లని మీరు చూసుకోనక్కర్లేదూ?”

నీలవేణికి ఏం అనాలో తోచలేదు. ఆచిన్నదానికి అతనెంత చుట్టమో తనూ అంతే. తన రంగు మూలంగా, తనకీ ఆ పాపకీ చుట్టరికం కలిపాడాయన.

అదే క్షణంలో ఆపాప కూడా నీలవేణిని చూసిందేమో ఒక్కపరుగున వచ్చి, కాళ్లకి చుట్టుకుంది. నీలవేణి దిగ్భ్రమతో అవాక్కయి చుట్టూ చూడసాగింది, ఆపిల్లతలమీద చెయ్యేసి, అసంకల్పప్రతీకారచర్యలా. ఈపాప తనదగ్గరికి పరుగెత్తుకు రావడం తనరంగు చూసే క్షణకాలం అయాచితంగా మనసులో మెదిలిన ఆలోచన అదీ.

“ఇంకా నయం. మిమ్మల్ని నేన్చూడకపోతే, ఎవరోఒకరు సోషల్ సర్విస్‌ని పిలిచేసుండేవాళ్లు,” అన్నాడు తన సమయస్ఫూర్తికి తనే మురిసిపోతూ ఇందాకా తనకి కన్నుగీటినాయన.

నీలవేణికి ఆ సిస్టమ్‌గురించి అట్టే తెలీకపోయినా కోర్టు టీవీ అదేపనిగా చూడ్డంవల్ల తెచ్చుకున్న విజ్ఞానంతో సిస్టమ్‌లో పడితే ఏమవుతుందో త్వరగానే ఊహించుకోగలిగింది. అంచేత గట్టిగా ఆ పిల్ల తనచుట్టం కాదని చెప్పలేకపోయింది. సిస్టమ్ సిస్టమ్ అని కొట్టుకునే చాలామంది బుర్రలకి నిత్యజీవితాల్లోని కటికసత్యాలు ఎక్కవు.

హాల్లో ఆట మొదలయింది. ప్రేక్షకులు లోపలికి వెళ్లిపోయారు. గూడు చేరిన గువ్వలా పాప ఏడుపు మానేసి, జరుగుతున్న నాటకంలో తనకేం భాగం లేనట్టు నోట్లో వేలేసుకు నిలబడింది ఆవిడ కాళ్లమాటున. నీలవేణి మరో అయిదు నిముషాలు దిక్కులు చూస్తూ నిలబడింది

ఆ తరవాత ఏంచెయ్యాలో తోచక, ఆ పాపని తీసుకుని హాల్లోకి వెళ్లి, షాపరాన్ చూపించినసీట్లో కూచుంది పాపని పక్కసీట్లో కూచోపెట్టుకుని.

పావుగంట అయింది. రంగంమీదకి కొత్త పాత్ర ప్రవేశించింది. “మామీ” పాప అరిచింది హఠాత్తుగా. చుట్టూ కూర్చున్నవాళ్లు హుష్ష్ అంటూ తమ అసహనాన్ని వెలిబుచ్చారు. నీలవేణి వాళ్లకి క్షమాపణలు చెప్పుకుని, ఆపాపని మళ్లీ నెమ్మదిగా అడిగింది ఆవిడ మీఅమ్మాఅని. అవును మామీయే. తల్లెవరో నిర్ధారణ అయిపోయింది. నీలవేణిప్రాణం తెరిపిన బడింది. ఆట ముగిసేసరికి ఆపసిదానిబాధ్యత కూడా తీరిపోతుందని.

ఆట అవగానే ఆతల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆపకుండా పావుగంటసేపు క్షమాపణలూ, కృతజ్ఞతలూ చెప్పుకుంది.

ఆతరవాత తెలిసినకథ ఏమిటంటే – ఆతల్లి మహానటి కావాలని మహా తాపత్రయపడుతోంది రెండేళ్లుగా. ఇంతకాలానికి ఓచిన్నఅవకాశం దొరికింది రంగంమీదికెక్కడానికి. బేబీసిటర్లని పెట్టుకునే స్తోమతు లేదు. వచ్చిన ఒక్కఅవకాశం వదులుకోలేక వూళ్లోనే వున్న ఓకజిన్, ఆంట్ కమీలాని అడిగింది పిల్లని చూడమని. ఆవిడ తనకి అట్టే టైము లేదనీ, ధియేటరుదగ్గర కలుసుకుని చూస్తానని మాటిచ్చింది. ప్రతిఫలంగా ఆట చూడ్డానికి ఉచితటికెట్ ఇవ్వడానికి ఒప్పుకుంది తల్లి. ఆటకి టైమయిపోతోంది. ఆకజినుమీద నమ్మకంతో ఆంట్ కమీలా వచ్చేవరకు గేటుదగ్గర నిల్చోమని ఆపాపతో చెప్పి తాను తెరవెనక్కి వెళ్లింది. అదీ కథ.

సుందరంకోసం ఎదురుచూస్తూ నిలబడింది నీలవేణి. ఎంతసేపటికీ అతని జాడ లేదు. మరిచిపోయాడో, వచ్చి వెళ్లిపోయాడో. తెలిసినవాళ్లు ఎవరైనా కనిపించి రైడిచ్చేరేమో అనుకున్నాడో. … తనీపాపగొడవలో పడి అన్నమాటప్రకారం గేటుదగ్గర నిలవడం వెంటనే జరగలేదు. పాపగురించే ఆలోచిస్తూ ఇంటివేపు నడవసాగింది. వీధిలో అట్టే జనం లేరు. జోరుగా దూసుకుపోయే కార్లు, అక్కడా అక్కడా సైకిళ్లూ …

నీలవేణికి ఆతల్లిని తలుచుకుంటే జాలేసింది. సకలజనులూ సమానులే అంటూ గొంతులు చించుకునే ఈదేశంలో కొందరు కొంచెం “ఎక్కువ సమానం” అని తను ఈదేశంవచ్చినకొత్తలో అర్థం అయింది.

ఓరోజు కూరలు తెచ్చుకోడానికి రెండు వీధుల అవతల వున్నషాపుకి వెళ్లింది. ఆరోజు సరదాగా నవ్వుతూ వెళ్లిన నీలవేణి చిరాగ్గా మొహం ముడుచుకు ఇల్లు చేరింది. సీరియస్‌గా పేపరు రాసుకుంటున్న సుందరం తలెత్తి భార్యామణి మొహం చూసి ఏంవైందన్నాడు,

నీలవేణి గ్లాసుడు మంచినీళ్లు తాగి మార్కెట్లో జరిగిన సంగతి చెప్పింది.

. బండిలో తనకి కావలసిన సామానులు వేసుకుని చెకర్‌దగ్గరికొచ్చింది. తనముందున్న తెల్లావిడ బండెడు సామాన్లకి చెక్కు రాస్తే ఏబాధా లేదు. తను ఇరవైడాలర్ల సామాన్లకి చెక్కు రాస్తే, డ్రైవర్స్ లైసెన్స్ చూపించమంది ఆ చెకర్. నీలవేణికి అది లేదు. మామూలుగా సుందరం, తనూ కలిసే వెళ్తారు ఎక్కడికెళ్లినా. అతనే సారధి. ఈఒక్కసారి అట్టే దూరం లేదు, కావలిసినవి అట్టే లేవు, ఆనాటి వాక్ కూడా అయిపోతుందని బయల్దేరింది. ఇరవై డాలర్లసామాన్లకి, తానేదో షాపు దోచుకుపోతున్నట్టు సవాలక్ష ప్రశ్నలేసింది ఆచెకర్. ఆపైన మేనేజరు వచ్చి ఓకార్డుమీద పేరు, ఎడ్రెసూ, తన లేక భర్త వుద్యోగం – అవన్నీ రాయమన్నాడు. నీలవేణికి ఒళ్లు మండింది.

“మీసామాను మీరే వుంచుకోండి. నాకక్కర్లేదు,” అంది, చేతులో బండి వదిలేసి. ఆమేనేజరు ఓనిముషం ఆలోచించి సరే, చెక్కు తీసుకో అన్నాడు ఆతెల్లపిల్ల‌తో.

సుందరం “పోనిద్దూ ఎవరిరంధి వాళ్లది” అన్నాడు.

నీలవేణి అతనివేపు పరీక్షగా చూసింది. నిజమే, తనరంగు విషయం అతన్ని బాధించదు. తనపెళ్లినాడే లేకపోయింది అతనికి ఆయావ.

ఆరోజుల్లో తను ఎన్నిసార్లు చూసుకునేదో తనచేతులు పరీక్షగా. నిగనిగలాడుతూ నీలమేఘశ్యామం.

నాన్నమ్మ ఓదార్పులు – “నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు” అన్నారు కాని తెల్లనివాడు అన్నారా?”

“తెలుపు అసలు రంగే కాదు, ఏడురంగుల పోగు,”  అన్నయ్య సముదాయింపు.

“కాకి నలుపు, కోకిల నలుపు, వసంతవిజయంతో తెలియు అసలు మెరుపు” అంటూ సంస్కృతం మాస్టారి ఓదార్పు.

నీలవేణికివేమీ ఊరట కలిగించలేదు అప్పట్లో.

“ఈనల్లపిల్లకి పెళ్లాడ్డానికి ఎవడొస్తాడో” అంటూ అమ్మ చాటుగా కళ్లొత్తుకోడం చూసినప్పుడు ప్రాణం గిలగిల కొట్టుకుంది. అయితే ఆపిల్లపెళ్లి అతిసుళువుగా అయిపోయింది కాలం, ఖర్మ కలిసొచ్చి.

పొరుగింటి కాముడత్తయ్యగారి సుపుత్రుడు సుందరం నీలవేణిని చేసుకుంటానన్నాడు.

“కోడలు నలుపయితే కులమంతా నలుపు” అంటూ తల్లి మొదట కాస్త గునిసినా, త్వరలోనే సర్దుకుంది, “చిన్నప్పట్నించీ ఎరిగినచిన్నది, ఇంట్లో మనిషిలా మసలినపిల్ల. ఎక్కడ్నుంచో ఏపడుచునో పట్టుకొస్తే ఆవిడగారు నెత్తినెక్కి కదం తొక్కదనేముంది? ఆకోటమ్మకోడల్ని చూడరాదూ. తెల్లగా పిండిబొమ్మలా ఉందన్న మాటే కాని ఆమిడిసిపాటూ, అదీనూ …” అనుకుని.

సుందరం తనకు తానై ముందుకి రావడంతో నీలవేణికి తనతోలురంగు రంధి తగ్గి, కాస్త ఉపశమనం కలిగించింది. తల్లిదండ్రులు తమ నెత్తిన పాలవాన కురిసిందని మురిసిపోయారు.

ఆతరవాత అచిరకాలంలోనే అమెరికా చేరుకున్నారు నూతనదంపతులు.

అమెరికా వచ్చింతరవాత నీలవేణికి తొక్కరంగుగురించి కొత్తసంగతులు క్రమంగా తెలిసొస్తున్నాయి. ఇక్కడ అందం కాదు తోలురంగు జాతిచిహ్నం. తనని ఆఫ్రికననుకుంటున్నారు ఇక్కడితెల్లవారు.

నీలవేణికి తాను కట్టుకునే బట్టలు మార్చేవరకూ ఆసంగతి తెలియలేదు.  నిజానికి అమెరికాకి రాగానే తాను చీరెలు కట్టడం మానేయలేదు. కొంతకాలం చీరెలే కడుతూ వచ్చింది. వాటివల్ల ఎంతసౌఖ్యమో చాలామందికి తెలియచేస్తూ వచ్చింది కూడాను. దరిమిలా, పేంట్లూ, చొక్కాల్లో మొదలెట్టాక, వాటిలోనూ అంత సౌఖ్యమూ వుందనిపించింది. మనం ఏం చెయ్యాలనుకున్నా గాని కారణాలు వాటికి తగ్గట్టు వాటంతటవే దొరుకుతాయన్న సత్యం తెలిసొచ్చింది. వస్త్రధారణతోనే తదితర అలంకరణలూనూ. బొట్టు, గాజులు అన్నీ ఒక్కొక్కటే తీసి పక్కన పెట్టేసింది.

అదుగో అప్పుడే ఎదురైంది కొత్తబాధ. తనని స్థానికులు ఆఫ్రికను అనుకున్నందుకు కాదు కాని, నీలవేణికి దాని వెన్నంటి ప్రచారంలో వున్న స్టీరియోటైపుఅభిప్రాయాలు, వారు చిలకరించే చిర్నవ్వులు – అదో సొద.

ఆమధ్య ఎవరో హాస్యమాడేరు, మనల్నెందుకు అనడం “కలర్డ్” అని.

నిజానికీ వారే వెలుగుతున్నారు నానావర్ణాల్తో.

కోపమొచ్చి హుంకరించినప్పుడు కెంపులు తిరిగినమొహం,

దిక్కుల్తోచనప్పుడు వెలాతెలా పోయే మొహం,

లాగి లెంపకాయొకటి ఇచ్చుకున్నప్పుడు కమిలి నీలిమ పులుముకునే మొహం.

నానావర్ణాలూ ప్రతిఫలించేది తమరి వదనాల్లోనే అంటూ.

అసలు తెలుగొక భాష అనీ, తెలుగువాళ్లు ఒక జాతి అనీ తెలీనివాళ్లు అమెరికాలో చాలామంది వున్నారు. అక్కడక్కడా ఒకటో రెండో ఎంగిలిముక్కలు దొరకపుచ్చుకున్నకొందరు, “అయితే ఇప్పుడు హరిజనుల పరిస్థితేమయినా మెరుగయిందా?” అని జాలిగా అడుగుతున్నారు. ఆప్రశ్న వెనకునున్న అమాయకత్వానికి, బోళాతనానికి నవ్వూ, చిరాకూ కలిగేవి తనకి.

***

నీలవేణి ధియేటరుదగ్గర తనకి తటస్థపడ్డ పాపని గురించే ఆలోచిస్తూ నెమ్మదిగా అడుగులేస్తోంది. ఆకజినెవరో. ఎందుకు రాలేదో … రావడం ఆలస్యమయిందేమో, ఈలోపున తను ఆపాపని హాల్లోకి తీసుకెళ్లిపోలేదు కదా ……. ఇంతలో ఎవరో వెనకనించి తనచేతిలో సంచీ లాక్కోబోయారు. తను హేయ్ అంటూ సంచీ గట్టిగా పట్టుకుంది బెదిరిపోతూ. తిరిగి చూస్తే ఒకరు కాదు ముగ్గురు కుర్రాళ్లు … సంచీ వదిలేసింది ఒణికిపోతూ. అందులో ఒకడు ఏం అనుకున్నాడో తనని గట్టిగా తోసాడు. తను అరుస్తూ కింద పడింది. నుదురు చిట్లింది. వాళ్లేదో అంటున్నారు కాని ఒక్కముక్క కూడా అర్థం కాలేదు, కళ్లు మసకబారుతున్నాయి. ఇంతలో మరెవరిదో గొంతు వినిపించింది.

ఆతరవాత ఏంజరిగిందో స్పష్టంగా తెలీలేదు కాని తనని రక్షించడానికి మరెవరో గట్టిగా ప్రయత్నిస్తున్నారని అర్థం అయింది.

మరికొంతసేపటికి …

వీధిదీపం వెలుగులో నల్లటిమొహంమీద కారుతున్న ఎర్రని రక్తం,

తెల్లటిచొక్కామీద రక్తం,

నీలవేణి గుండెలు గజగజ వణికేయి లేతరెమ్మలా.

అదేసమయంలో అతను కూడా నెమ్మదిగా తనవేపు తిరిగాడు. వంట్లో శక్తిననంతటినీ కూడగట్టుకుని, “హౌవార్యూ” అని అడిగాడు, ఎక్కడో ఏడూళ్లవతలినించి వినిపించింది ఆస్వరం.

నీలవేణి ఫరవాలేదన్నట్టు తలూపింది. అతను గమనించేడో లేదో … కళ్లు మూసుకున్నాడు.

నాప్రాణానికి తనప్రాణం అడ్డం వేసిన ఈమానవుడెవరు చెప్మా? ఎందుకు వేశాడు? చాలామందిలాగే అతను కూడా తనని “తమవారు” అనుకున్నాడా?

దారిన పోతున్న మరోకారు ఆగింది. ఆ పుణ్యాత్ముడు 911కి సందేశం పంపించాడు సెల్లులో.

ఆదరాబాదరా రెండు పోలీసుకార్లు, ఎర్రనిట్రక్కులో పెరమెడిక్కులూ దిగారు. ఇద్దరు పెరమెడిక్కును అతనివేపు నడిచారు. ఒకమ్మాయి తనదగ్గరికొచ్చింది, ఎలా వున్నావంటూ.

”నేను బాగానే వున్నాను. అతనికెలా వుంది?” అంది ఆదుర్దాగా నీలవేణి.

“ఫరవాలేదు. స్పృహ తప్పింది, ప్రమాదం లేదు.”

ఆమెచుట్టూ చెదురుమదురుగా రక్తపు చుక్కలు.

నుదుటిమీంచి గొంగళీపురుగులా జారుతున్నరక్తం,

తెల్లని బ్లౌజుమీద, నల్లనిచేతులమీద చుక్కలు, చుక్కలుగా ఎర్రని రక్తం.

అటుతిరిగి అతనివేపు చూసింది.

స్పృహ లేకుండా పడివున్నాడు. ముక్కులోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి కారి చారలు కడుతున్న ఎర్రనిరక్తం, చొక్కామీద చిందిన రక్తం,

రోడ్డుమీద పారుతున్న రక్తం …

నీలవేణి హృదంతరాలనుండీ తొలిసారిగా తన తోలురంగుతాలుకూ తలపులు తొలగి, ఎర్రని, గోరువెచ్చని అరుణకాంతులు చివ్వున ఎగిసేయి దిగంతాలకు తలకావేరిలా.

****

రంగుతోలు (పిడియఫ్)

(నవంబరు 2006)

ఈమాట.కామ్ లోప్రచురితం.

తృష్ణ

ఆ రోజు తపాల్ తెచ్చి స్టాంపు వేసి ట్రేలో పెట్టి వేళ్ళిపోయేడు బాలయ్య

తెలుగు లెక్చరరు కమల ఎదురుగా కుర్చీలో ఉన్నారు. ఏవో పుస్తకాలు మాలైబ్రరీలోంచి తీసి ఇవ్వమని అడగడానికి వచ్చేరావిడ. Continue reading “తృష్ణ”

చివురుకొమ్మ చేవ

“మామీ,” అంటూ పరిగెట్టుకుంటూ వచ్చింది కింజల్క స్కూలినించి

“అబ్భ ఎందుకలా మీద పడతావు,” అని విసుక్కుని మళ్ళీ చిన్నబోయిన ఆమొహం చూసి, “దా” అంటూ దగ్గరకి తీసుకుంది శారద. Continue reading “చివురుకొమ్మ చేవ”