రససిద్ధి

రాజారావుకి ఆ రోజు చిరాగ్గా తెల్లవారింది.

అప్పటికి ఇరవై రోజులక్రితం మామూలుగా తెల్లవారిన ఓ ఉదయం కాలేజీలో మామూలుగా పొద్దు పోలేదు. అతనికీ ఓ కుర్రలెక్చరరుకీ ఘర్షణ జరిగింది. అసలు సంగతి ఎవరికీ అంతు బట్టలేదు కానీ పిల్లలంతా పొలోమంటూ వీధిన పడ్డారు.

సమ్మె ప్రారంభమయింది. పిల్లలందరూ పుస్తకాలు మూలన పడేసి బాకాలూ బేనర్లూ పట్టుకుని తిరగడం మొదలెట్టేరు. ఎక్కడ చూసినా “డౌన్, డౌన్, నిరంకుశత్వం నశించాలి, కామేశ్వరరావుని తొలగించాలి, విద్యార్థుల న్యాయమైన కోర్కెను మన్నించాలి …”గా ఉంది వ్యవహారం.

విద్యార్థులలో ఉద్రిక్తత హెచ్చుగానే ఉన్నా పరిస్థితి ప్ర‌శాంతంగానే ఉందని అభిజ్ఞవర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఇది లోపల్లోపల ఉడుకుతున్న లావా కాదనీ, టైమిస్తే చల్లారిపోయే చితుకులమంట అనీ ఊరుకున్నారు అధిష్ఠానవర్గంవారు.

 సమ్మెకారణం చాలామందికి తెలీదు. తెలిసిన కొద్దిమందీ పది రోజులయేసరికి మరిచిపోయేరు. ఊరేగింపులూ, నిరసనప్రదర్శనలూ నీరు గారిపోయేయి.

చాలామంది వాళ్ళ వాళ్ళ ఊళ్ళకెళ్ళిపోయేరు. మిగతావాళ్లు పేకాటల్లోకీ పచ్చీసుల్లోకీ దిగేరు. ఎవరు ఎవరికెదురు పడినా “ఎందుకొచ్చిన సంత” అన్న మొహాల్తో  ముభావంగానే ప్రశ్నించుకుంటున్నారు. తెల్లార్తే ఎలా పొద్దు పోతుందన్న ప్రశ్న ప్రతివాడిమొహంలోనూ అచ్చు గుద్దినట్టు అవుపిస్తోంది.

రాజారావు చిరాగ్గా లేచేడు. న్యూస్‌పేపరుతోనూ ట్రాన్సిస్టరుతోనూ మధ్యాహ్నంవరకూ లాక్కొచ్చినా ఆ పైన కాలం మొండికేసి కదల్డం మానేసింది. మ్యాటినీకి పోదాం అన్నా అప్పటికే ఉన్నవన్నీ రెండేస్సార్లు చూడ్డం అయిపోయింది. రామకృష్ణగదికెళ్తే రమ్మీ ఆడొచ్చు కానీ అది ఊరుకాచివరినుంది. కానియ్, కాలం గడవడమే కదా కావల్సింది, బ్రిడ్జిమీదుగా నడిచి వెళ్తే అది కొ్ంత కలిసివస్తుంది.

ఆ ఊళ్ళో బ్రిడ్జి పడింతరవాత చాలామంది కుర్రకారుకి అదే పార్కూ, బీచీ, నాటకం, టౌనుహాలూ అన్నీ అయిపోయింది. ఇటు జార్జిపేటా అటు రామనగరూ పాతూరూనించి నడిచి రావడం, బ్రిడ్జినడిబొడ్డున నిలబడి బ్రిడ్జికింద వచ్చేపోయే జనాన్నీ జనానానీ చూస్తూ వీలయితే ఈలలేస్తూ, అలా ఈలలేసినందుకు చీవాట్లు తింటూ, కాలినడకన పోయే చరిత్రహీనులని హేళన చేస్తూ కాలక్షేపం చేయడం మామూలయిపోయింది.

ఈమధ్యనే అలా నిలబడ్డం కూడా విసుగ్గానే ఉంటోంది. దానికి కారణం ఆడపిల్లల కాలేజీ ఊరికి దూరంగా కట్టేసి, ఆ పక్కనే ఓ పెద్ద హాస్టలు కూడా కట్టేయడం, ఊళ్ళో ఉన్న సాఢేతీన్ సారసాక్షులకోసం బస్సులు వేసేయడంతో ఆ ఓవర్‌బ్రిడ్జి అమావాస్యముందు ద్వాదశి చంద్రుడిలా ఒకటి రెండు కళలతో వెలవెల బోతూంది.

రాజారావు ఆలోచిస్తూ రామకృష్ణగది చేరుకున్నాడు. తీరా చూస్తే అతను లేడక్కడ. టైము చూస్తే మూడయింది. వెనుదిరిగి గంటస్తంభందగ్గరకొచ్చేసరికి కాఫీ తాగుదాం అనిపించింది. అలాగయినా ఓ పావుగంట గడుస్తుంది కదా అనుకుని కాఫీ తాగి, సిగరెట్టు వెలిగించి నాలుగురోడ్లకూడలిలో నిలబడి మళ్ళీ ఎటు వెళ్ళడమా అని ఆలోచిస్తూంటే జనార్దనం జ్ఞాపకం వచ్చేడు. తమ ఊరివాడే. కొత్తగా కాలేజీలో చేరేడు. కానీ పాతూరు వెళ్ళాలి. కానీలే చూదాం అనుకుంటూ అటు తిరిగి నడక సాగించేడు. జనార్దనంగది చేరుకునేసరికి నాలుగయింది. అతనూ లేడు.

“సినివారాలు చేస్తున్నాడు కదండీ టికెట్టు దొరకదేమోనని ముందే వెళ్ళిపోయేడు,” అన్నాడు అతని రూమ్మేటు.

“సినివారాలేమిటి?” అడిగేడు రాజారావు తనకి తెలీని కాలేజీవ్రతాలు కూడా ఉన్నందుకు రవంత అక్కజపడుతూ.

“కొత్తగా ప్రారంభించేంలెండి. కాలేజీలో అడుగెడుతూనే ఈవ్రతం పడతాం. సోంవారంనించీ శనివారంవరకూ క్రమం తప్పకుండా రోజుకొక సినిమా – ముఖ్యంగా కొత్త రిలీజు – తప్పనిసరిగా చూడడం, ఆదివారం మ్యాటినీతో మూడాటలూ చూసి ఉద్యాపన చేసుకోడం. ఆ తరవాత తాను ఏ అభిమానసంఘంలో చేరతాడో నిర్ణయించుని యథాశక్తి మూడో అయిదో టికెట్లు పెట్టి ఆ సంఘసభ్యులకి వాయినాలు ఇచ్చుకుంటాడు. దీనికే కలియుగంలో సినివారవ్రతమని పేరు,” అన్నాడు తొల్లి నారదులవారి హావభావాలని అనుకరిస్తూ.

రాజారావు తన జూనియర్ల తెలివితేటలకి అప్రతిభుడై, అక్కడినుంచి బయటపడ్డాడు. మరి కొంతసేపు అలా తిరిగి తిరిగి రైల్వే స్టేషనుకి చేరుకున్నాడు. బెంగుళూరునించి వచ్చేవాళ్ళూ బెంగుళూరికి వెళ్ళేవాళ్ళూ వెళ్ళిపోయేక వాచీ చూస్తే ఇంకా ఆరున్నరే. అవతల లైనులో గుడ్సుబండి ఆంధ్రనాయకుల్లా ముందుకీ వెనక్కీ ఊగుతోందే కానీ స్టేషను వదిలే సూచనల్లేవు. ప్లాట్ఫారం అతని ఆశయాల్లాగే బోసిగా ఉంది.

ఇప్పుడేం చెయ్యాలో అతనికి తెలీడం లేదు. ఇదే అమెరికాలో అయితే హిప్పీలవుతారు. బ్రిటన్లో అయితే తోటపనో పాకీపనో మొదలెడతారేమో. కొరియాలోనో చైనోలోనో అయితే కత్తుల్నూరుకుంటూనో తుపాకులు తుడుచుకుంటూనో ఉంటారు కాబోలు. … భారతదేశపు పక్షి నెమలి. జాతీయమృగం సింహం. జాతీయక్రీడ హాకీ. జాతీయ కాలక్షేపం?

దిక్కులు చూస్తున్న రాజారావుకి ఎక్కడ్నుంచో సుస్వరగానం వినిపించింది. మునిసిపల్ స్కూలు ఆవరణలో కచేరీ జరుగుతోంది. రాజారావు అప్రయత్నంగానే అటువేపు నడక సాగించేడు.

విశాఖలోనూ మద్రాసులోనూ పదిహేనూ, ఇరవై, నూరూ, నూటయాభై రూపాయలకి టికెట్లు అమ్మజూపే సంగీతం రాయలసీమలో ఉచితంగా పంచిపెట్టబడుతోంది.

రాజారావు సంగీతజ్ఞుడు కాడు.

సంగీతప్రియుడూ కాడు.

కనీసం సంగీతాభిమాని అయినా కాడు.

ఆ ఆవరణలో అడుగు పెడుతున్నప్పుడు అతడి అభిప్రాయం ఒక్కటే – ఇంతమంది జనం ఇలా ఇక్కడ పోగయేరు కదా, వీళ్ళందరికీ నిజంగా సంగీతంలో స్వారస్యం తెలిసే వచ్చేరా? నాలాగే కాలం గడవక దిగబడ్డారా? మరో చెలుడో, తల్లో, చెల్లో లాక్కొస్తే వచ్చేరా? పాడే ఆడమనిషి ఎలా ఉంటుందో చూద్దాం అని వచ్చేరా?

రాజారావు ఓ వారగా నిలబడి కొత్తగా ఉద్యోగంలో చేరిన జర్నలిస్టులా జనాన్ని పరిశీలించసాగేడు. చాలారోజులుగా కనపడనివాళ్ళూ, ఆడవాళ్లూ, వాళ్ళతో వాళ్ళతాలూకు పిల్లలూ, కాలేజీ గరల్సూ, కాలేజీ బాయ్సూ, పెద్దవాళ్లూ, చిన్నవాళ్లూ, అరవ్వాళ్లూ, సింధీవాళ్లూ, వార్తాపత్రికలవాళ్లూ, వర్తకశ్రేష్ఠులూ, చదువు రానివాళ్లూ, చదివే ఉద్దేశం లేనివాళ్ళూ, ఎప్పుడూ సినిమాలకెళ్ళనివాళ్లూ – వీళ్ళంతా నిజంగా సంగీతంకోసం వచ్చేరా లేక హరికథ అనుకుని పొరబడ్డారా? తలలు మాత్రం గంగడోలులా ఊపుతున్నారు!

“ప్చ్.”

రాజారావు ఉలిక్కిపడ్డాడు. కుడివేపు తనచెవిదగ్గర ప్చరించిన అమ్మాయి అతన్ని దూసుకుని ముందుకెళ్ళి ఆ పక్కనున్నఅమ్మాయిని అడుగుతోంది, “ఇదేనా మొదలు?” కాదంటే, ముందు ఏం పాడిందని అడిగింది.

రంగంమీద జానెడు జరీఅంచున్నఎరుపురంగు పట్టుచీరె కట్టుకుని కంచి కామాక్షీదేవిలా ఆసీనురాలయి ఉన్న గాయకురాలిమొహం ఫొటోజెనిగ్గానే ఉంది. తాంబూలమో లిప్‌స్టిక్కో స్పష్టంగా తెలీడంలేదు కానీ సగం చాలు అనిపిస్తోంది. తాళం వేస్తున్న చేతివేలుమీద వజ్రం కాబోలు ధగధగ మెరుస్తోంది. కుడివేపు కూచున్న మృదంగవాద్యగాడు మరీ కుర్రకారులా ఉన్నాడు. మృదంగం వాయింపులతో సమంగా మెలికలు తిరిగిపోతున్నాడు నిప్పులమీద కూర్చున్నట్టు కానీ మొహంమీద చిర్నవ్వు చెక్కు చెదరలేదు. అలా దరహాసంతో వాయించాలని రూలు కాబోలు.

మధ్య మధ్య గాయని అతనివేపు అప్రూవింగ్‌గా చూసి తలూపుతోంది.

ఎడమవేపున్న బట్టతలమనిషి వాయులీనవిద్వాంసుడిలా కాక ఏ కుందేలుపిల్లనో చిత్రహింస చేస్తున్న భల్లూకంలా అవుపిస్తున్నాడు. కమానుతో తన భూభాగాన్ని పరిరక్షించుకుంటున్న సైనికుడిలా విజృంభిస్తున్నాడు. అతను ఎడమవేపు కాక కుడివేపు కూర్చుని ఉంటే ఏమగునో? అసలు అతను తెరవెనక కూర్చుని వాయించవచ్చునే!

ఆ  గాయనీమణి మటుకు మృదంగిస్టువేపు చూసినంత ప్రసన్నంగానూ వైలనిస్టువేపు కూడా చూస్తోంది. వయలిన్ కూడా అంత బాగానూ వాయిస్తున్నాడనో, తన నిష్పాక్షికతని నిరూపించుకుంటోందో తెలుసుకోడం ఎలాగో తెలీడం లేదు రాజారావుకి.

గాయని జుత్తుముడికీ వైలిన్ బట్టతలకీ మధ్య నేనూ ఉన్నాను స్మీ అంటూ మొహం ముందుకి పెట్టి మోర్సింగు వాయిస్తున్న కుర్రాడు మరీ గింజ పట్టని పింజలాగున్నాడు. నూరు కాండిల్ వాట్ బల్బులు ఆరు పెట్టి చూసినా మూతిమీద మీసాలు మొలిచిన జాడలు కనిపించవు. తనకి ఇరవైలు నడుస్తున్నా సరిగమలే తెలీవే హాఫ్ పాంటులో తిరిగే ఈ బాలుడికి మోర్సింగు ఎలా వచ్చి ఉంటుంది చెప్మా? అదొక వింతగా ఉంటుందని రంగస్థలంమీదికి ఎక్కించేయలేదు గదా.

పదిమందిలో కలవని కొందరూ, స్టేజికి దగ్గరగా కూచుంటే గోల బాబూ అని కొందరూ అండమాన్ నికొబర్ దీవుల్లా దూరంగా చెదురుమదురుగా కూచుని రాజకీయాలు చర్చించుకుంటున్నారు.

“ఏఁవిటో డల్‌గా ఉంది,” అంది ఓ పిల్ల ఆ వారం నేర్చుకున్న రంగవల్లి ఇసకలో దిద్దుతూ.

“ఆవిడ ఇంకా ఫామ్‌లోకి రాలేదు,” అంది పక్కనున్న చిన్నది.

 “కప్పనో బొద్దెంకనో కోసినట్టు అదే పాట అన్ని సంవత్సరాలు పాడుతుంటే మెకానికల్ ప్రెసిషన్ ఎందుకు రాదూ?” అని ప్రశ్నిస్తోంది మరో సుందరి, జూవాలజీ లెక్చరరు కాబోలు.

“అభ్భ, మాటాడకు గోల.”

ఆ కసురుకి రాజారావు తృళ్ళిపడ్డాడు

“శ్రీరఘుకులమందు బుట్టి … అయేవరకూ ఎవరేనా కిక్కురుమంటే చంపేస్తాను,” ఇంచుమించు నాయకురాలిలా కనిపించే నారీమణి ఆంక్ష పెట్టింది.

“ఈపాట అద్భుతంగా ఉంటుంది. విని చూస్తాను,” అనుకున్నాడు రాజారావు.

కొంచెం దూరంలో గుడ్సుబండి గుక్కపట్టి రెండు నిముషాలు కేక పెట్టి ఊసరవెల్లిలా సాగిపోయింది.

“ … వీడర … ఆరామమందు … మునుల …”

ఎంత శ్రద్ధగా విన్నా మాటలు స్పష్టంగా తెలియడంలేదు. కుడివేపు గుంపులోంచి కిసుక్కుమని నవ్వులూ, గుప్పిళ్ళతో ఇసక విసురుకుంటున్న కుర్రకుంకలూ, “అల్లరి చెయ్యకండిరా వెధవల్లారా” అంటూ ఓ మోస్తరు పైస్థాయిలోనే అరుస్తున్న పెద్దవాళ్లూ … … రాజారావుకి అయోమయంగా ఉంది. నిజంగా ఆ సంగీతం తను అర్థం చేసుకోలేకుండా ఉన్నాడా? ఆవిడ హృద్యంగా పాడ్డం లేదా? “ఫామ్”లోకి వచ్చిందా? లేదా?

“శ్రీరఘుకులమందు” పూర్తి చేసి, తనముందున్న కప్పులోది ఓమారు చప్పరించి ఆలాపన ప్రారంభించింది. కప్పులోది మంచినీళ్ళా? కాఫీనా?

“సురలు సేవించునది.”

“ఛ, నిజంగానే?”

“ నిజం.”

“నీకెలా తెలుసు?”

“మా అన్నయ్య చెప్పేడు. స్టేజిమీద ఉంచమని ఆవిడ సెక్రటరీకి చెప్పిందిట.”

“పోనిద్దూ గొడవ. పాట వినడానికొచ్చేవా? ఆవిడ అలవాట్లు చర్చించడానికొచ్చేవా?

“ఆహా, ఆ అతులితమాధురీధురీమ ఎలా కలిగిందో వివరిస్తున్నానంతే.”

రాజారావు ప్రయత్నంమీద ఆ సంభాషణమీంచి దృష్టి మళ్ళించేడు. ముందు వరసలో అధీనరేఖకి అటువేపున్న ఒక నడివయసావిడ ఇటున్న కొడుకునుద్దేశించి “ఒరేయ్, మోహనరాగం” అంది. అలా అంతమందిలో తనని ఒరే అని సంబోధించినందుకు ఆ అబ్బాయి మొహం ముడుచుకుని తలెగరేశాడు తనకి తెలుసన్నట్టు.

కమ్మెచ్చులో పోసి సాగదీసినట్టు చెస్ట్ ఎక్స్‌పేన్డరుతో ఎక్సర్సైజు చేస్తున్నట్టు ఆలాపన సాగిపోతోంది. మందరస్థాయిలో ఎత్తుకుని పైస్థాయిల్లోకి విస్తరిస్తూ పోతూంటే ఎవరో చెయ్యి పట్టుకుని అలా అలా … నడిపించుకుపోతున్నట్టుంది. వైలనిస్టు ఆవిణ్ణి అనుసరిస్తున్నట్టు కాక పోటీ పడుతున్నట్టు వాయించేస్తున్నాడు. ఆ సంగీతం వింటుంటే ఆయనమొహం అందంగా లేదన్న సంగతి గుర్తుకి రాడం లేదు.

“ఏఁవండీ, అది మోహనంవా? కల్యాణా?” అనడిగింది ఓ పదేళ్ళపిల్ల రాజారావుని చొక్కా చివర్ల పట్టుకు లాగుతూ.

ఆ పిల్ల అడుగుతున్నది రాగంగురించనీ, ఆ రెండూ రాగాలపేర్లనీ అతను గుర్తించేశాడు కానీ తనకి సంగీతజ్ఞానం బొత్తిగా లేదని చెప్పడానికి చాలా అవస్థ పడాల్సివచ్చింది.

స్టేజిమీద ఆవిడ ఆలాపన అయిపోయింది కాబోలు “ఎవరురా …” ఎత్తుకుంది.

“నే చెప్పలే అది మోహనమే,” అందాపిల్లే మళ్ళీ.

ఎప్పుడు ఎవరికి చెప్పిందో అతనికి అర్థం కాలేదు కానీ మోహనరాగం ఇలా ఉంటుందని గుర్తు పెట్టుకోడానికి తంటాలు పడుతున్నాడు.

“ఎవరురా … నిను వినా … గతి …మా  … కు …”

పిల్లలగోల చాలా మటుకు తగ్గిపోయింది. చాలామంది ఏకతాళం వేస్తూ తలలూపుతున్నారు.

“సవనరక్షక … ఆ … ఆ … నిత్యోత్సవ …”

“మీరు తాళం తప్పు వేస్తున్నారండీ,” అంది పక్కనున్న పిల్లే మళ్ళీ.

రాజారావు అంతవరకూ గ్రహించనేలేదు తనవేళ్ళు లయకనుగుణంగా కదుల్తున్నాయని. ఆపిల్లమీద కోపం వచ్చింది. నువ్వు నాకేం చెప్పఖ్ఖర్లేదంటూ కసురుకోబోయేడు.

ఆ అమ్మాయి పాపాయిలా నవ్వుతూ, “ఆదితాళం వెయ్యాలండీ,” అంది.

రాజారావు కూడా చిన్న నవ్వు నవ్వేసి, కొంచెం ముందుకి వెళ్ళి కూచున్నాడు. ఆ క్షణంలో అతను శాస్త్రీయసంగీతం ఎంత బాగుంటుందో, తనకి సంగీతం ఎలా తెలిసిపోతోందో, ఆవిడ ఫామ్‌లోకి వచ్చిందో లేదో తర్కించడం లేదు.

“ఎవరూ … రా … దసా … దసగరిసా …”

“అయితే అమ్మాయిని పురిటికి తీసుకురారన్నమాట.”

“లేదండీ, మా అల్లుడు …”

గాగగాగరిరిగస ..ఆ …

“అవేనా సంగతులంటే?”

“కాదండీ. కీర్తనలో ఒకపదం తీసుకుని మళ్ళీ మళ్ళీ పాడుతారు చూడండి, అదీ సంగతంటే. ఇది స్వరకల్పన.”

“సంగతులింకేం ఉండవా?”

“ఉంటాయి. అవి ఉత్తరాల్లో రాసుకుంటారు,” అటుపక్కనున్న పిల్ల జవాబిచ్చింది.

రాజారావుకి మాచెడ్డ కోపం వచ్చేసింది, “తల్లీ, మీరు సంగీతం వినడానికొచ్చేరా లేక …” అని అడగబోయి, మానేసి, విసురుగా గబగబా ముందుకెళ్ళి ఓవార నిలబడ్డాడు.

ఎవరురా.. అంటూ మరోసారి సాగదీసి గాయని వదిలేసింతరవాత వైలనిస్టు అందుకున్నాడు. ఆవిడ వేసిన స్వరాలు గుండెల్లో ధ్వనిస్తున్నాయి. అతనివేళ్ళు పదాలు పలుకుతున్నాయి.

ఆ గాయకురాలు ఎంతగా హృదయానికి హత్తుకునేట్టు పాడిందో ఆ వైలనిస్టు అంత గొప్పగానూ వాయిస్తున్నాడు!

“ఒరేయ్.” ఆంజనేయులు ఎప్పుడొచ్చేడో పక్కనించి మోచేత్తో పొడిచి ఇకిలిస్తూ మొదటివరసలో కూచున్న కొత్త లెక్చరరు కామేశ్వరరావుని చూపించేడు.

ఆయన్ని గుర్తించడానికి క్షణకాలం పట్టింది రాజారావుకి. ఇరవై రోజులక్రితం బ్రిల్ క్రీం జుత్తుతో, పాండ్స్ క్రీం మొహంతో అమెరికన్ బుష్షర్టుతో మెళ్ళో టైతో రుసరుసలాడుతూ క్లాసు వదిలేసిన కామేశ్వరరావుకీ –

చెదిరిన జుత్తుతో, నుదుట చిన్న విభూతిరేఖతో, రెండు సైజులు పెద్దగా తోచే జుబ్బాతో నేలమీద పద్మాసనం వేసుక్కూచున్న ఈ కామేశ్వరరావుకీ పోలికే లేదు.

“మరోపట్టు పడదాఁవేవిటి?” అన్నాడు ఆంజనేయులు హుషారుగా కళ్ళెగరేస్తూ.

“ఇక్కడా?” ఔచితిని గూర్చిన ఆలోచన వచ్చింది రాజారావుకి తొలిసారిగా.

వైలిన్, మృదంగం ఛాన్సులు అయిపోయేయి కాబోలు ఎవరురా అంటూ గాయని మరోసారి ఎత్తుకుని ముగించింది.

రసజ్ఞులూ, కానివారూ కూడా చప్పట్లు కొట్టేరు గట్టిగా.

ఆంజనేయులు రాజారావుచెయ్యి పుచ్చుకు లాక్కుంటూ పోయి కొత్తమాష్టారిపక్కనే చతికిలబడ్డాడు.

ఆయన వాళ్ళిద్దర్నీ ఓమారు చూసి మందహాసం చేసేరు. అది మనోహరంగా ఉంది.

“సంగీతజ్ఞానము వినా … భక్తిమార్గము…”

“ఇదేం రాగం సార్?” ఆంజనేయులు రాజారావుభుజంమీదుగా ఒంగి, కామేశ్వరరావుని ప్రశ్నించేడు.

“ధన్యాసి.”

“ఓహో. ఏం తాళవండీ?”

“ఆదితాళం. తెలీకపోతే తాళం వెయ్యొద్దు.”

రాజారావు విసుగ్గా, “ఒరేయ్, నువ్వు నోరు మూసుక్కూచో. లేకపోతే వెళ్ళిపో,” అన్నాడు.

ఆంజనేయులు తలూపుతూ తాళం వేస్తున్నాడు.

“భృంగినటేశ సమీరజ …”

ఈసారి కామేశ్వరావే ఆంజనేయుల్తో, “కావలిస్తే నేను కూడా తాళం వేయడం మానేస్తాను. నువ్వు తప్పులేస్తే పాడేవారికి కష్టం,” అన్నాడు.

రాజారావు ఆంజనేయుల్ని అక్కడ్నుంచి పొమ్మన్నాడు. ఈ సతాయింపులు భరించలేక అతను వెళ్ళిపోయేడు.

“న్యాయాన్యాయములు తెలుసును …”

తనకి తెలియకుండానే పదం హృదయాన్ని తాకుతోంది. అతనిహృదయం తదనుగుణంగా స్పందిస్తోంది.

“… షడ్రిపుల జయించే …”

కీర్తన పూర్తయేసరికి అతనికి గుండెల్లో పట్టేసినట్టయింది.

గాయకురాలు మీరా భజనా, జావళీ పాడి పవమానసుతుడు బట్టు పాదారవిందములతో కచేరీ ముగించింది.

రాజారావు టైం చూసుకున్నాడు. పదకొండు. సాపాసాలు పాడే సభలో తానింతసేపు కూచోగలడని ఎవరైనా పందెం వేసినా తాను నమ్మి ఉండేవాడు కాడు.

“మంచి విద్వత్తు.”

రాజారావు అటు తిరిగి చూసేడు. కామేశ్వరరావు తనపక్కనే నడుస్తున్నాడు.

“ఏంటన్నారు?”

“మంచి కళ ఉంది ఆవిడదగ్గర అన్నాను.”

రాజారావుకి కళ ఏమిటో విద్వత్తంటే ఏమిటో తెలీలేదు. ఇందాకట్నుంచీ తనని వేధిస్తున్న ప్రశ్న వేరే ఉంది. ఆఖరికి తెగించి అడిగేశాడు, “పాట పాడేవాళ్ళు ఎందుకండీ మొహం అలా వికృతంగా పెడతారు?”

కామేశ్వరరావు చిన్నగా నవ్వేడు, “ఆవిడమొహం ఎలా పెట్టినా నువ్వింతసేపూ కూచున్నావు కదా! సంగీతానికి అనుభూతి ప్రధానం. అనుభూతిప్రకటనలో ముఖం ఒక అంగం. గాయకులేదో విపరీతమైన అంగవిన్యాసం చేస్తున్నారని మనం అనుకుంటాం కానీ అది వారి రసానుభూతికీ, భావప్రకటనకీ అనుగుణంగానే ఉంటుంది. అంతెందుకూ, పెదిమలు మాత్రమే కదిలిస్తూ నాలుగు వాక్యాలు చెప్పి చూడు. అతి సాధారణమైన సంభాషణలలో కూడా మనం కళ్ళూ చేతులూ తిప్పుతూ మాటాడతాం కదా. సంగీతంలో నాభిహృత్కంఠరసనాది స్థాయీభేదాలతో, ద్వాదశ శృతిభేదాలతో నాదం వెలువడాలంటే ఎంత కృషి కావాలి. కొందరు అతి చేస్తారనుకో. కానీ ఈ అతి చెయ్యడం ఒక్క గాయకులకే అన్వయించి హేళన చేయడం తగదు.

శాస్త్రరీత్యా కొన్ని నియమాలున్నమాట కూడా నిజమే. శ్రోతలదృష్టిని గానం నించి మళ్ళించే ఏ చేష్ట గానీ నిషిద్ధమే. అలాగే శిష్యప్రశిష్యులు ప్రచారం చెయ్యవలసిన స్వీయరచనలను సభలలో గానం చేయడం కూడా అనౌచిత్యమేనంటారు. కానీ ఇవన్నీ ఎవరు పాటిస్తున్నారిప్పుడు? శాస్త్రబద్ధమయిన సంగీతంకన్నా సినిమాసంగీతమే చాలామందికి నచ్చుతున్న ఈ రోజుల్లో ఓ మోస్తరు అభిరుచి ఉన్నవాళ్ళు ఓ గుప్పెడు స్వరకల్పనలతో, చీమతలకాయంత ఆలాపనలతో ఏసినిమాల్లోనో చొప్పించే త్యాగరాజకీర్తనలతోనే సరిపెట్టేస్తున్నారే కానీ ఇలాటి సభల్లో కూచుని శ్రద్ధగా వినేవారేరీ? ఇవాళ ఇంతమంది వచ్చేరు కదా వాళ్ళలో ఎంతమందికి ఎంతసేపు ఆ మధురగానంమీద దృష్టి ఉందంటావు?”

“అరె,” అంటూ రాజారావు ఆగడంతో కామేశ్వరరావు కూడా ఆగేడు.

“మాటల్లో పడి చాలాదూరం వచ్చేశావండీ. నేను వెనక్కి వెళ్తాను.”

“అలాగా, నేనూ గమనించలేదు. సరే, వెళ్ళు. చూడు. చిన్నమాట. మీరూమ్మేటు ఆంజనేయులికి మేగ్నటిజం పుస్తకం ఇచ్చేను. అది రేపు తెచ్చి ఇచ్చేయమని చెప్తావా?”

“అలాగేనండీ. రేపు క్లాసుకి తెమ్మని చెప్తాను,” అన్నాడు రాజారావు. అనేసింతరవాత తానన్నదేమిటో తెలిసింది అతనికి.

ఆమాటే ఆయనా అడిగేరు, “రేపు క్లాసంటున్నావు. సమ్మె విరమించేరా?”

“ఆఁ,” అన్నాడు రాజారావు వెనక్కి తిరిగి గబగబ అడుగులేస్తూ.

కామేశ్వరరావు అతనివేపు రెండు క్షణాలు చూసి తనయింటివేపు నడక సాగించేరు.

                                                                                    000

రాజారావు తారస్థాయి నిద్రలో ఉన్న ఆంజనేయుల్ని లేపి, “ఒరేయ్, ఈ సమ్మెలూ గట్రా నాకు నచ్చలేదు. రేపట్నుంచి కాలేజీకి పొదాం,” అన్నాడు.

“ఓ ర్నాయనా! నీకోసమే మేంవందరం మొదలెట్టాం ఈ సమ్మె. ఇప్పుడాయన క్షమాపణ ఇచ్చుకున్నాడా? నువ్వు గానీ మందు పుచ్చుకున్నావా?” ఆంజనేయులు మంచంమధ్యన మఠం వేసుక్కూచుని ప్రశ్నించేడు.

రాజారావు లుంగీ చుట్టుకుని మంచంమీద వాలిపోతూ, “ఈ రోజు రాజావారు కులాసాగా ఉన్నారు. అంచేత మనమే వారిని మన్నించేసేం,” అన్నాడు గోడవేపు తిరిగి నిద్రకొరుగుతూ.

                                                                                    000

(ఈ కథ జులై 13, 1973 ఆంధ్రజ్యోతిలో ప్రచురితం. హెచ్చరికః ఇక్కడ సంగీతానికి సంబంధించినవిశేషాలుసీరియస్‌గా తీసుకోకండి. అక్కడక్కడ విన్న మాటలు ఇక్కడ రాసేనే కానీ నాకు సంగీతజ్ఞానం బొత్తిగా లేదు.)

తెలుగు అబిమానులకు పిలుపు

తెలుగుపాఠకలోకానికి స్వాగతం.

మీఆదరణ, అభిమానాలకోసం నాకథలు ఇక్కడ పెడుతున్నాను. ఇది నా తెలుగుతూలిక.

మీకు తోచిన సలహాలు, సహృదయంతో ఇవ్వగలరని ఆశిస్తూ.

https://tethulika.wordpress.com చూడండి.

మాలతి