ఏకాకి?

కాకీ, కాకీ, ఏకాకీ,

ఏ కాకీ ఏకాకి కాదు.

గుంపులో కాకివే గానీ ఏకాకివి గావు.”

“నేనేకాకినే ఏకాకినే”

“కాదు గాదు. నువ్వేకాకివి కావు.

గుంపులో కాకివే కానీ ఏకాకివి కావు.

– మోసుకొచ్చిన ఊసులు పంచిపెట్టేవు

– కోసుకొచ్చిన చివుళ్ళు మెసవబెట్టేవు.”


”నేనేకాకినే, నేనేకాకినే. నేను మోసుకొచ్చిన ఊసులు వినండి

నేను కోసుకొచ్చిన చివుళ్లు తినండి

నేను రాసుకొచ్చిన కాకివార్తలు వింటే వినండి, లేకుంటే లేదు.

గుంపులో కాకిని మాత్రం కాను గాక కాను

గుంపులో ప్రతికాకీ ఒక కాకి, కాకీ కాకీ కాకీ కాకీ

ఒక్కొక్క కాకీ చేరి ఓ గుంపు, నువ్వొప్పుకున్నా, ఒప్పుకోకున్నా.” 

హ్మ్.

ఏ కాకీ ఏకాకి కాదు. ఒక్కొక్కటే విడివిడిగా ఎగుర్తూ కనిపించినా గుంపులోనూ ఉంటుంది.

000

కూతురికి పెళ్లి సంబందం చూడడానికి పట్నం వచ్చేడు అనంతరావు.

“అందరూ బాగున్నారా?”అన్న ప్రశ్నకి సమాధానం, అనంతరావు ఇంటిసంగతులు చెప్పేడు.

“ఇందుకే నేను పెళ్లి చేసుకోలేదు,” అన్నాడు తమ్ముడు నిరంజనం.

 అనంతరావు కళ్లు చిట్లించేడు. ఆహా అన్నట్టు తలాడించేడు.

నిరంజనం మళ్లీ అందుకున్నాడు, “నాకు నీలాగ సంసారబంధాలు లేవు. నేను పోతే నాభార్య దిక్కులేకుండా పోతుందేమో, పిల్లల చదువులూ, ఉద్యాగాలూ, పెళ్ళిళ్ళూ ఎలా అవుతాయో, వాళ్లు వృద్ధిలోకి వస్తారో రారో అంటూ అతలాకుతలం అయిపోనక్కర్లేదు. బిపీ, గట్రా తెచ్చుకోక్కర్లేదు”.

అనంతరావు చురుగ్గా తమ్ముడివేపు చూస్తూ,“ఎవరికి బీపీ?”అన్నాడు.

నిరంజనం అన్నని తినేసేట్టు చూసి, విసురుగా లేచి వెళ్లిపోయేడు.

000

పదిరోజులయింది. మంచంమీదున్నాడు నిరంజనం.

పదిరోజులక్రితం కాలు జారిపడ్డాడు. మోకాల్లో ఎముకలు విరిగేయి.

ఫోనుమీద ఫోనుమీద కాలులే కాలులు ఆగకుండా …

– అసలేమైందేమైంది? 

– అయ్యయ్యో, బాబుగారెలా ఉన్నారు?

– ఏమైనా కావాలిస్తే చెప్పండి, ఆఘమేఖాలమీద పంపిస్తాను.

– అంకులికి నొప్పి ఎక్కువగా ఉందా?

– మామయ్యగారూ, డబ్బుకి ఇబ్బంది పడకండి, పంపిస్తాం.

– తాతగారు మంచంమీదున్నారనగానే పరుగెత్తుకు వచ్చేసేను.

– మిమ్మల్నిలా చూడ్డం చాలా బాధగా ఉంది, గురూగారూ!

– బెస్టు డాక్టరుని చూడండి. మనీ వేస్టని హెసిటేటు చేయకండి.

– మంచి డాక్టరుని చూడండి, డబ్బుకోసం వెనుదీయకండి.

… … …

సీతకి తల తిరిగిపోయింది వాళ్లందర్నీ చూడగా, వాళ్లమాటలు వినగా వినగా.

000

మంచంపక్కన కూర్చున్న సీత విసుగ్గా ఫోను బల్లమీద పెట్టి, చెయ్యి విదిలించుకుంది. ఈ ఫోనుకాలులతో చెయ్యి పట్టేసింది.

“నీమోకాలు కాదు కానీ నాగూడ పట్టేసింది,”అంది సీత ఎడంచేతో కుడిచెయ్యి ఒత్తుకుంటూ.  

 “వాళ్లకి పాపం నేనంటే అభిమానం. పోనీ వాళ్లనే రమ్మను. ఎవర్ని పిలిచినా ఇట్టే వచ్చి వాల్తారు,”అన్నాడు నిరంజనం.

సీత తీక్ష్ణంగా తమ్ముడివేపు చూసింది. సంసారజంజాటం లేనిది ఎవరికి–వీడికా తనకా?

“ఏమిటి, నవ్వుతున్నావు?”అన్నాడతను.

“నిన్ను చూసే,”

“ఎందుకూ?”

“నాకెవరూ అఖ్ఖర్లేదు, నాకీ సంసారజంజాటం వద్దు, పెళ్ళీ పెటాకులూ అంటూ సంసారం బురదలో ఇరుక్కోను అంటూ ఉపన్యాసాలిచ్చేవు. ఒక ఆడమనిషిమెళ్ళో పుస్తి కట్టలేదేమో కానీ వీళ్ళంతా ఎవరు, వీళ్ళకోసం నువ్వు పడ్డ తాపత్రయం ఏమిటో చెప్పు.  వీళ్ళ కష్టసుఖాలూ, పిల్లలచదువులూ, పెళ్లిళ్ళూ, … అవన్నీజంజాటం కాదా?”అంది చిన్నగా నవ్వుతూ సీత.

“అది వేరూ, వాళ్లకి అవుసరం అయినప్పుడు సాయం చేయడం వేరు, దినదినం, క్షణక్షణం సంసారజంఝాటంలో గిలగిల కొట్టుకుపోవడం వేరూ.”

“అదేరా, బుద్ధిహీనుడా, నేనంటున్నది కూడా. పూర్తిగా సంసారం నెత్తికెత్తుకుని మంచీ చెడ్డా, కష్టం సుఖం అనుభవించే గుండెబలం నీకు లేదు. వాళ్ల అవుసరాలకి, నీకు వీలయినప్పుడు, నిజం చెప్పాలంటే నీకు సరదా అయినప్పుడు వెళ్తావు, వాళ్ళని ఆదుకుంటావు. అంత తేలిగ్గాను తప్పుకోగలవు కూడా. పెళ్ళిప్రమాణాలు లేవు కానీ నీకు సంసారం బాగానే ఉంది. నీకు వాళ్ళొక కాలక్షేపం. లక్షణంగా పెళ్ళి చేసుకుని బాధ్యతలు నెత్తినేసుకునే గుండెల్లేవు. ఇలా ఒక మాయసంసారం ఏర్పరుచుకున్నావు. నీకంటే నేనే నయం. మంచీ చెడ్డా అన్నీ తలకెత్తుకునే నిబ్బరం ఉంది నాకు.”

“హాఁ …”వెర్రిగా అక్కవేపు చూసేడు నిరంజనం.

000

నాకేమీ అక్కర్లేదు అనుకునేవారు కూడా సమాజంలో ఏదో ఒకంగా మమేకం అయిపోయే ఉంటారు. కొందరు ఒప్పుకుంటారు. కొందరు ఒప్పుకోరు, అంతే.

000

(ఫిబ్రవరి 2, 2021)

శీలా సుభద్రాదేవి. కథారామంలో పూలతావులు (వ్యాససంపుటి)

ఈ సంకలనంలో ఇరవైమూడు వ్యాసాలు, ఒక ఇంటర్వ్యూ ఉన్నాయి. వ్యాసకర్త్రి నాదో చిన్నమాట అంటూనే రెండు పెద్దవిషయాలే ప్రస్తావించేరు.

మొదటిది, నవలలు రాస్తేనే రచయితలా, ప్రతిభావంతమైన చిన్నకథలు రాసినవారిని ఎందుకు గమనంలోకి తీసుకోరు సంకలనకర్తలన్నది. ప్రధానంగా తెలుగు కథ 1910-2000, వందేళ్లకథకి వందనాలు వంటి సంకనలనాలలో ఎంపికగురించి ఈ ప్రశ్న. జాగ్రత్తగా పరిశీలించి చూడిండి. ఈ సంకనాలలోనూ, ఇలాటి సంకలనాలలోనూ – అంటే తెలుగు సాహిత్యచరిత్రకి దర్పణాలుగా – సమకూర్చినప్పుడు తెలుగుకథలలోని వైవిధ్యం అంతా కనిపించదు. ఏదో ఒక కోణం- సాంఘికప్రయోజనంలాటిది- మాత్రమే దృష్టిలో పెట్టుకుని సంకలనం చేస్తే, ఆవిషయం పుస్తకంపేరులో తెలియాలి. తెలుగుకథ 1910-2000, సాంఘికప్రయోజనం ఆవిష్కరించిన కథలు అంటే వారి ధ్యేయం స్పష్టంగా తెలుస్తుంది. కానీ కేవలం తెలుగుకథ, 1910-2000 అంటే ఆ కాలంలో మరేవిధమైన కథలూ లేవా అన్న సందేహం కలుగుతుంది. అలాగే నవలలు రాసిన ప్రముఖ రచయిత్రులకథలు రెండో మూడో తీసుకుంటే, చిన్నకథలు మాత్రమే రాసినవారిని నిర్లక్ష్యం చేసేరనే అనుకోవాలి. సుభద్రాదేవిగారి ప్రశ్న కేవలం కథలే రాసినా, అట్టే కథలు రాయకపోయినా, మంచి కథాలక్షణాలు కలిగిన కథలు ఈ సంకలనాలలో ఎందుకు చేర్చుకోలేదని.

 రెండో అంశం సంకలనాలమాట అలా ఉండగా, అసలు తెలుగు కథాసాహిత్యానికి సారథ్యం వహించిన సాహితీవేత్తలు తమ ప్రస్తావనలలో- ఉపన్యాసాలలో, వ్యాసాలలో, విమర్శలలో, చర్చలలో- మంచి కథాలక్షణాలు కలిగిఉండీ స్త్రీలు రాసినకథలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అనేకమంది రచయిత్రులకథలు ఈనాటి పాఠకులకు తెలియకుండా పోతున్నాయి, అంచేత ఈ వ్యాసరచన చేపట్టేనని చెప్పుకున్నారు వ్యాసకర్త్రి. ఈవిషయం ఈనాటి సాహిత్య అతిరథులూ, మహారథులూ ప్రత్యేకంగా గమనించాలి.

తెలుగుకథ చరిత్ర సమగ్రం కావాలంటే ఈ మరుగున పడిపోతున్న కథలు తప్పనిసరిగా ప్రస్తావించవలసిఉంది. ఒక  మంచి ఉదాహరణ – రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు మెచ్చుకున్న ఒక చిన్న కథ చెప్పుకోవచ్చు. ఆ కథపేరు ఆ గదిలోనే. రచయిత్రి యు. సత్యబాల సుశీలాదేవిగారు. ఒకే ఒకపేజీలో ఒక స్త్రీ జీవితచరిత్ర ఆవిష్కరించేరు రచయిత్రి. ఆవిడ రాసిన మరో ఆరు కథలు ఈరోజు కథానిలయంలో కనిపించేయి. అంతకుమించి ఆమెగురించిన వివరాలు ఎక్కడా దొరకలేదు. ఆ ఒక్క కథ గొప్పకథ. రావిశాస్త్రిగారు ప్రస్తావించకపోతే నాకు తెలిసేది కాదు.

సుభద్రాదేవిగారు ఇరవైఇద్దరు రచయిత్రులకథలు (మందరపు పద్మ, లలిత జంటని ఒకరుగా తీసుకుంటే. లేకపోతే 23 అనొచ్చు) సేకరించి, వస్తుతత్వాన్ని పరిశీలించి చూచి, విమర్శనాత్మకంగా ఒకొక రచయిత్రికథలనూ పరిచయం చేసేరు. వ్యాసం చదివేక, పాఠకులకు ఆ రచయిత్రియొక్క భావజాలం విశదమవుతుంది. ఒకొక వ్యాసమూ సమగ్రం.

తెలుగుకథలు ఎక్కువగా చదివేవారికి కొందరిపేర్లు పరిచయం అయిఉండవచ్చు, కొందరిపేర్లు నామమాత్రంగా తెలియొచ్చు, మందరపు పద్మ, లలిత, వేదుల మీనాక్షీదేవి వంటివారి పేర్లు విని ఉండకపోవచ్చు.

మొత్తం సంకలనం అంతా చదివేక, స్త్రీల కథాసాహిత్యం మనకి తెలీనిది ఇంత ఉందా అని ఆశ్చర్యపోతాం. అందుకు సుభద్రాదేవిగారు ఈసంకలనంలో చేర్చిన రెండు వ్యాసాలు – రచయిత్రుల కథాసాహిత్యంలో వెనుకబాటుతనం ప్రభావం, రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం – తోడ్పడతాయి.

సుభద్రాదేవిగారి లక్ష్యందృష్ట్యా ఆలోచిస్తే, ఇప్పటికే బహుళప్రాచుర్యం పొందిన, దాదాపు అన్ని సంకలనాలలోనూ కనిపిస్తున్న సీతాదేవి, కామేశ్వరివంటి రచయిత్రులని ఈసంకలనంలో చేర్చకుండా ఉంటే ప్రధానోద్దేశం మరింత పటిష్ఠంగా ద్యోతకమయేది అనే నాకు అనిపించింది,

సుభద్రాదేవిగారు చేపట్టిన ప్రణాళిక ఎంతైనా హర్షించదగ్గది, శ్రమతో కూడుకున్నది. ఆమేరకు శీలా సుభద్రాదేవిగారిని మెచ్చుకోకతప్పదు.

ఇలాటి సంకలనాలు ఇంకా ఇంకా రావాలి. వస్తాయనీ, సంకలనకర్తలు మరుగున పడిపోతున్న అనేకమంది రచయిత్రులనీ, వారికథలనీ వెలుగులోకి తీసుకురాగల ఆలోచనలు చేస్తారనీ ఆశిస్తున్నాను.

శుభం.

000

  • సంకలనం వివరాలు –

(జనవరి 2, 2021)

నా ఆలోచనలు కొన్ని- 2

  1. అమ్రికా టుర్మిరికా

కొంతకాలంగా అమెరికాలో పసుపు వాడకంగురించి ప్రబోధిస్తున్నారు. ఇంతకుముందే ఉందేమో నాకు తెలీదు. నేనిప్పుడే గమనించేను. మొదటిసారి మోకాలు నొప్పి అని డాక్టరు దగ్గరికి వెళ్తే, పసుపుగుణం తెలిసింది. ఆ డాక్టరుగారు కొనమన్న  పసుపుమందు మన దేశీ దుకాణాల్లో దొరికే పసుపుకి పదింతలుంది వెల. మనవాళ్లలా ప్లాస్టిక్ సంచులలో కాక నీటైన ప్లాస్టిక్ సీసాలలో అందించడమే అధిక సౌకర్యం. ఇంకా ఏవో పోషకపదార్థాలు కూడా కలుపుతారని కూడా తెలిసింది.

ఇంతకీ అసలు చెప్పదల్చుకున్నకత ఏమిటంటే –

నేనీ ఊరొచ్చి ఏడే్ళ్లయింది. ప్రతిరోజూ ఆ వీధులే తిరుగుతున్నాను. ప్రతిరోజూ నాదారిలో ఒకావిడ కనిపిస్తారు. లాటినో అనుకుంటా.

సాధారణంగా నాకొక టైమంటూ లేదు. 8 నుంచి 11.30లోపున ఎప్పుడు తోస్తే అప్పుడు బయల్దేరుతాను.

ఒక దిక్కంటూ లేదు. వీధిలోకి అడుగెట్టేక, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఎటు తోస్తే అటు వెళ్తాను.

ఏ టైంలో ఎటు వెళ్లినా ఆవిడ ఎదురవడమే విశేషం. ఏవో గ్రహాలు మా కార్యక్రమం నిర్ణయించి మమ్మల్ని నడిపిస్తున్నట్టు. అదీ నాకు వింత.

రెండో వింత సాధారణంగా ఇక్కడ నాలుగుసార్లు చూస్తే, అసలు రెండోసారి అయినా, హలో అంటూ పలకరిస్తారు. కొందరు బాగున్నావా అంటారు. ఇంకా కొందరు ఎక్కడున్నావు, ఏంచేస్తున్నావు లాటి ప్రశ్నలు వేస్తారు.

జుత్తు బాగుందని మెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.

ఈవిడ మాత్రం ఎప్పుడూ పలకరించలేదు. మరీ ఒకే sidewalkమీద ఎదురొస్తే, నేనే వినిపించీ వినిపించకుండా హలో అంటాను.

ఆవిడా అలాగే మందరస్వరంలో ఏదో చిన్నశబ్దం చేసి దాటుకుపోతుంది.

ఇప్పుడు అసలు కథకొస్తాను.

ఆమధ్య, రెండు వారాలయినట్టుంది, ఒకరోజు చేతికర్ర పుచ్చుకు బయల్దేరేను. ఆరోజు ఆవిడతో పాటు మరొకాయన ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు కనిపిస్తారు, ఆవిడలా రోజూ కాదు. కానీ కనిపించినప్పుడు తప్పనిసరిగా నన్ను పలకరిస్తారు.

ఆరోజు కూడా పలకరించి, ఈమధ్య కనిపించడంలేదేం అన్నారు.

కాలునొప్పిమూలంగా అట్టే తిరగడంలేదని చెప్పేను.

ఆ పక్కనున్న ఆవిడ, అదే ఈకథలో ప్రధానపాత్ర, We wish you all the best అంది.

నాకు ఆశ్చర్యం. సరే అని కృతజ్ఞతలు చెప్పి ముందుకి సాగిపోయేను.

మళ్ళీ నిన్న కనిపించిందావిడ.

నన్ను దాటుకు పోబోతూ, చటుక్కున వెనుదిరిగి ఎలా ఉన్నావు అని అడిగింది.

నేను రవంత విస్మయము చెందినదానినై, బాగానే ఉన్నాను అన్నాను.

అప్పుడండీ ఆవిడ మొదలుపెట్టి ఆగకుండా పది నిముషాలు మాటాడింది.

తనకి arthritis అనీ, రోజూ నడుస్తాననీ, నడవడం మంచిదనీ, ఎక్కువ చేయకూడదు కానీ ….

ఇలా కొంతసేపయేక, ముక్తాయింపుగా, ‘’పసుపు. పసుపు వాడాలి. ఒంటికి చాలా మంచిది. అలాగే అల్లం కూడా” అని సలహా చెప్పింది.

అంచేత నేనిప్పుడు పసుపు వాడకం హెచ్చించేను. ఉడుకుతున్న బియ్యంలో కూడా అరచెంచాడు పసుపు వేసేస్తున్నాను చేదా ఏమిటి, పులిహోరలో వేసుకోడంలేదా అని నాకు నేనే నచ్చచెప్పుకుని.

ఆలోచిస్తే ఆవిడ నన్ను ఇంతకుముందు పలకరించకపోవడానికీ, నాకు నొప్పి అని తెలిసేక, ఓహో నాలాటి మనిషే అని గుర్తించింది అని స్పష్టమయింది.

ఈ మనిషి కూడా నాలాగే బాధ పడుతోంది అనుకుంటే ఆ ఆనందమే వేరు కదా. ఏ అరమరికలూ లేకుండా మాటాడడానికీ కారణాలు తెలుసొచ్చేయి నాకు.

అదీ కథ.

(నవంబరు 18, 2020)

000

  • గూడు మారినవేళ

నట్టిల్లు మూడోతరగతి బోగీముందు railway platformలా కనిపిస్తుంది

ప్రిజ్ ఖాళీ చేస్తూ లాభనష్టాలు బేరీజు వేసుకు చూసుకుంటుంటే

ఎన్నో జీవనసూత్రాలు.

ఎంతో శ్రమించి పోగు చేసిన అట్టపెట్టలఅవుసరం రేపటితో సరి.

పారేయలేను దాచలేను

పారేయబోతే, మళ్ళీ అవుసరమవుతాయేమో, ఇంకెవరికైనా పనికొస్తాయేమో

దాచబోతే, చచ్చు అట్టపెట్టెలకా ఇంత ఆరాటం అన్న చులకన

మారే రోజున శ్రమ తగ్గడానికి చేసి ప్రిజ్ లో పెట్టుకున్న ఖాద్యపదార్థాలు

ఖాళీ చేస్తుంటే, కొత్తింట్లో అడుగెట్టగానే తినడానికేమీ ఉండదేమోనన్న దిగులు

ఊళ్ళో ఉన్న కూతురు తెచ్చిస్తానన్న భరోసాతో తీరిపోతుంది.

ఇవాళ గిన్నెలూ తప్పేలాలూ, పుస్తకాలూ, బట్టలూ, నానారకాలూ కుక్కి

పకడ్బందీగా మూటలు కట్టిన అట్టపెట్టెలు రేపు విప్పుతాను ఎంతో ఓపిగ్గా.

ఏ వస్తువు ఎక్కడ అమరుతుందో పరీక్షిగా చూసుకుంటాను.

అంతా అయిపోతుంది.

తుఫాను కురిసి వెలిసిపోతుంది.

దినచర్య ఎప్పట్లాగే యథావిధి అయిపోతుంది,

ఈ గదికి బదులు ఆ గది.

ఈ కిటికీలో దృశ్యానికి బదులు ఆ కిటికీలో దృశ్యం

గూడు మారేనోచ్ అంటూ మహోత్సాహంతో అరవాలన్న కోరిక

ఏ గూడయితేనేమి గుండె అలాగే కొట్టుకుంటుందన్న ఆలోచనతో హతమవుతుంది.

జీవనక్రమం సాధారణస్థితికి జారుకుంటుంది.

నవంబరు 27, 2020

000

  • నన్ను చదువుకుంటున్నాను.

జీవితం పంతులమ్మ కాదు

జీవితం వల్లించలేదు కాపీపుస్తకంలోని సుభాషితాలు.

ఋషిలూ తాత్వికులూ బోధించిన పరమసత్యాలు తలకెక్కలేదు.

నేనిరుక్కున్న సంఘటనలు చదువుకుని తెలుసుకున్నాను

నన్ను నేను చదువుకున్నాను.

అందుకేనేమో నాతలపులు నాకు మాత్రమే అర్థమవుతాయి.

000

  • శతాయుష్షు, ఆ పైన మరో 5!

నిన్న అంతర్జాలంలో 105 ఏళ్ళు అని కనిపించింది. అదే నిజమైతే ఏం జరుగుతుందో అని చూసుకుంటే ఇదీ తేలింది–

అంటే మరో 22ఏళ్ళమాట.

అంటే అప్పటికి

నేను రోజుకి ఒక టపా చొప్పున 8,280 టపాలు కనీసం రాయాలి Facebookలో. అసలిప్పటికే రాయడానికేం తోచక తన్నుకుంటున్నాను.

పైగా ఇవాళా రేపూ పుట్టినపిల్లలు కొత్తపాఠకులుగా నాపేజికి వస్తారు. వాళ్ళకి నచ్చినట్టు రాయాలి.

ఇంకా

ఇప్పటి నావస్త్రాలన్నీ పాతబడిపోయి మళ్ళీ కొత్తస్టైలుగా ప్రచారంలోకి వస్తాయి.

ప్రజలు రాజరికాన్ని నిష్పూచీగా అంగీకరిస్తారు. అప్పుడు రాజూ, రాణీ అనరు. ప్రధానమంత్రి, అధ్యక్షుడూలాటి పేర్లయితే ఉంటాయి కానీ వాళ్ళు నెఱిపేది రాజరికమే.

కులాలు పూర్తిగా అంతరిస్తాయి.

వాటిస్థానంలో మూడు తరగతులు– ఉత్తమ, మధ్యమ, అధమతరగతులు అంగీకరింపబడతాయి. వాటికి ఈమధ్యనే శంకుస్థాపనము బహు ఆడంబరమూగా జరిగింది.

తెలివితేటలంటే యంత్రాలనీ అధమతరగతి జనాలనీ వాడుకోగలతెలివి అన్న నిర్వచనం నిర్ధారణ అవుతుంది.

పిల్లలకి చదువులు పాఠశాలలనబడే భవనాల్లో కాక వీధుల్లోనూ బజారుల్లోనూ నేర్పబడతాయి.

కర్ణాటకసంగీతం అంటే హిప్పీగెంతులుగా ప్రజలు ఆమోదిస్తారు.

తెలుగంటే ఇంగ్లీషే అనీ, ఏదో ఒక మారుమూల ఇంగ్లీషుకి తెలుగు అన్నపదం రూపాంతరంగా వాడుతున్నారనీ అందరూ ఒప్పుకుంటారు. తెలుగు వేరేభాష కాదని ప్రభుత్వాలు ఆజ్ఞలు జారీ చేస్తాయి.

000

ఉలిక్కిపడ్డాను ఈ ఆలోచనలు ఎంత భయంకరం. నాఆయుర్దాయం పునః పరిశీలించుకోవాలి. లేదా లోకం మార్చేసే పద్ధతి కనిపెట్టాలి. 105 మాత్రం భయంకరం!

000

(నవంబరు 29, 2020)

స్వార్థం ఒక యోగం

ఇద్దరు వ్యక్తులు నాది నాది అంటూ కొట్టుకుంటే స్వార్థం

రెండు కూటాలు మాది మాది అంటూ

తన్నుకుంటే సామాజికన్యాయం.

కష్టజీవులకు అనుకూలచట్టాలు

భాగ్యవంతులపాలిట దుష్టచర్యలు

తమకి అనుకూలించిన చట్టాలు ఆనందదాయకం.

ప్రతికూలించిన పరమదుర్మార్గం.

దుష్టనాయకులంటూ వేరే లేరు.

ఎవరిదృష్టిలో ఏకారణంగా అన్నదే దుష్టనాయకునికి నిర్వచనం.

తమఆస్తి రక్షించని నాయకుడు అధికారమదాంధుడు.

పరిరక్షించినవాడు మహానాయకుడు.

000

(నవంబరు 10, 2020)