నిరీక్షణ

నిరీక్షణ
*

చిన్నప్పుడు స్కూల్ బస్సుకోసం
చల్లని సాయంత్రాలకోసం
ఆ సాయంసమయాల బీచిలో
ఇసకలో కట్టే పిచిగ్గూళ్లకోసం
ఆ గూళ్లలో చేరే పిట్టలకోసం

పెద్దపండుక్కోసం
పట్టుపరికిణీకోసం
గోదావరి ఆనకట్టపై
పరుగుల్తీసే రైలుబండీకోసం
ఆరైలుబండీకమ్మీల్లోంచి
చిమ్మచీకట్లు చీల్చుకుంటూ
వెలుగులు కురుసే దీపాలతోరణాలకోసం

ఏతావాతా
చదువుల్తెచ్చే డిగ్రీలకోసం
ఆ డిగ్రీలిచ్చే ఉద్యోగాలకోసం
ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లకోసం
ఆప్తుల ఆమోదముద్రకోసం

నాలుగువీధులకూడలిలో పచ్చవెలుక్కోసం
మనసిచ్చి మాటాడే మనిషికోసం
అలనాటి ఆప్తురాలు
కాకమ్మచేతనైనా అంపే కబురుకోసం
ఋజువైన చెలిమికోసం

ఎండకోసం
వానకోసం
ఆకురాలు కాలంలో
కొమ్మలు చిమ్మే వింతసొగసులకోసం
తిరిగొచ్చే చివుళ్లకోసం

ఎదురుచూస్తున్నాను అర్ధశతాబ్దిగా
మూడంతస్థులమేడల్లో
ఐదంకెల ఆదాయాల్తో
కోరితెచ్చుకున్న ఈతిబాధల్తో
వాలుకుర్చీల్లో విలాసంగా వెనక్కి వాలి
భారతీయసాంప్రదాయం
వైరాగ్యం ఔన్నత్యం గూర్చి
వివరిస్తుంటే
వింటున్నాను ఓపిగ్గా.

తరంగాలెళ్తే స్నానం చేస్తానంటూ
సముద్రపొడ్డున
ముడుచుక్కూచున్న బడుగుబాపడిలా
ఎదురుచూస్తున్నాను.

ఏ ఉద్గ్రంథానికో
అస్తవ్యస్తంగా రాస్తున్న
నాందీప్రస్తావనలా వుంది
జీవనహేల.
తుదిపలుకు మాటే లేదు మరి.
*

(తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో, తెలుగువెలుగు, 2003, లో ప్రచురితం. )

ప్రకటనలు

జీర్ణతృణం కథ

తల్లులకీ పిల్లలకీ మధ్య అంతరాలు ఏర్పడడం, యాభై దశకంలోనే మొదలయింది. ప్రతిమనిషికీ గుర్తింపు తృప్తినిస్తుంది. ఆగుర్తింపు ఎప్పుడు ఎక్కడినుంచి వస్తుందో చెప్పడం కష్టం.

000

జీర్ణతృణం

 “ఒక తల్లి పదిమంది పిల్లల్ని సాకుతుంది గానీ పదిమంది పిల్లలు ఒక తల్లిని చూసుకోలేకుండా ఉన్నారు,” అంది కనకవల్లి. Continue reading “జీర్ణతృణం కథ”

విధీ, హతవిధీ!

మాకాండోలో రిపేరొచ్చిందని మామానేజరుని పిలిచేవరకూ నాకువిధి వైపరీత్యాలగురించిన ఆలోచనలు రాలేదు.
వంటింట్లో కొళాయి చుక్కలు చుక్కలుగా కారుతుంటే మామానేజరుకి ఫోను చేశాను. నాకసలు ఫోనులో మాటాడ్డం సరిపడదు. నామాట వాళ్లకర్థం కాదు, వాళ్లమాట నాకర్థం కాదు పెళ్లిమంత్రాల్లాగే. మమ అనమన్నప్పుడల్లా మమ అనేసి వూరుకోడమే.
Continue reading “విధీ, హతవిధీ!”

ఊసుపోక – మిరపకాయబజ్జీలు

(ఎన్నెమ్మ కతలు 2)

చలి ..చలి … మంచు బ్లిజర్డూ ముంచుకొచ్చి ముంచేస్తోందీరోజు ఇక్కడ. వీధిలోకెళ్లడం గగనం. వేడివేడిగా కారంగారంగా పచ్చిమిరపకాయ బజ్జీలు చేసుకుని సోఫాలో ముడుకు పడుకుని టీవీ చూసుకోవాలనిపిస్తోంది. Continue reading “ఊసుపోక – మిరపకాయబజ్జీలు”

పాతవాచీ

(ఎన్నెమ్మ కతలు -1)

ఆమధ్య ఓ స్నేహితురాలు చెప్పింది వాళ్ల తాతగారివాచీ టూనింగుకి తీసికెళ్తే ఆకొట్టువాడు అదిరిపడ్డాట్ట, ఇక్ష్వాకులనాటి చేతిగడియారం మీకెక్కడ దొరికిందండీ అంటూ. నిజమే పాతకాలపు వాచీలు ఇప్పటికీ పనిచేసేవి వున్నాయి. నాదగ్గిరో వాచీ వుంది 1968లో Continue reading “పాతవాచీ”

గ్రహబలాబలాలు

గ్రహ బలాబలాలు.

సూర్యమాన గ్రహచారంలో
దలైలామా, అమెరికాఅధ్యక్షడూ కేన్సీరియన్లు
ఉభయులకూ కేంద్రం ఆత్మ.
ఒకరికి ఆదర్శం ఆత్మావలోకనం
రెండోవారు చేస్తున్నారు ఆత్మప్రదక్షిణం
ఒకరికి ఆలంబన విశ్వమానవసౌభ్రాతృత్వం
రెండోవారికి విశ్వం సర్వస్వామ్యసంకలితం.
ధృవాంతరసీమలకు విస్తరిల్లిన
వారి తేజోపుంజాలు
మిరుమిట్లు గొల్పుతున్నాయి
కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
అలివికాని అంధకారంలో
మురికివాడలో
నా ఇరుకుగదిలో
వెతుక్కుంటున్నాను
ఆల్చిప్పంత జాగాకోసం.
మూడోపాదం మోపనున్న వామనుడిలా.
నేను మూడో కేన్సీరియనుని‌.
(జూన్ 23, 2007. ఈమాట.కామ్ లో ప్రచురింపబడింది.)