మూడు కవితలు

  1. చెలగాటం.

షేక్స్‌పియరూ, శ్రీకృష్ణుడూ

జీవితం ఒక నాటకం అన్నారు

నాకు మాత్రం

స్క్రిప్టు లేక

ప్లాటర్థం కావడంలేదు

రూల్సు లేని ఆటలా వుంది

అందుకే ఆడుతున్నాను

అఫెన్సో డిఫెన్సో

ఎదుటివారి ఎత్తుల్నిబట్టి

అంతమాత్రాన నావ్యక్తిత్వానికేమిటి లోపం?

  1. దృష్టిదోషం.

తెలుగువారికి అఖ్కర్లేని సంగతి లేదు

ఎల్లరిబతుకులూ బజారుపాలు

ప్రతివాడికీ పొరుగువాడిగొడవే

అని మా నమ్మకం

 

ఇండియా మారిపోయింది

ఇప్పుడెందుకెళ్లడం

పూర్వపు అభిమానాల్లేవంచూ

వారించిన బంధుమిత్రులనీ, శ్రేయోభిలాషులనీ

కాదు కాదని

ఆకారవిశేషాల్లో

ప్లేను దిగిన నన్ను

ఆప్యాయంగా ఆదరించిన

బంధుమిత్రులని చూసి

ఆనందాతిరేకంతో

అవాక్కయిపోయేను.

ఏంజరిగిందేంజరిగిందంటూ

జనం పొడుచుకు తిన్లేదని

ఉప్పొంగిపోయేను.

 

తీరిగ్గా తరిచ్చూసుకుంటే

ఇప్పుడనిపిస్తోంది

నాగతం గురించెవరూ

అడగలేదని అప్పుడానందించేను

ప్రస్తుతం నాకెలా గడుస్తోందని

ఎవరూ అడగలేదని

ఇప్పుడు కొరతగా ఉంది!

 

 

 

  1. తెలుగు నుడికారం

పాలవాడుకలా

వారాలబ్బాయిలా

క్రమం తప్పకుండా

హలో చెప్పడానికో

డైనింగవుటుకో

డూయింగ్ లంచికో

కాల్చేసి కబుర్లాడి

ఓకేనండంటూ

కర్టెసీ కాలులు ముగించే

మిత్రబృందానిక్కరువు లేదిక్కడ

అమ్మదొంగా అంటూ అలరించి

హుందాతనం ఒలకబోస్తూ

కొడుకూ కోడలి ముచ్చట్లూ.

మనచేతుల్లోని మడుసులూ

కోప్పడేసే మినిష్టర్లగొడవలూ లాటి

ఊసులాడుకోడానికి

మనాళ్లు కావాలంటే మాత్తరం

అంజనంవేసి సూస్కోవాల.

000

(పై మూడు కవితలు ఆంధ్రప్రభలో (15 సెప్టెంబరు 1997) ప్రచురితం.)

 

ప్రకటనలు

నావేదనతో కలిసి మేమిద్దరం

నావేదనతో కలిసి మేమిద్దరం

నాస్నేహితురాలు సాయిపద్మమూర్తి రాసిన కవిత, painకి నా అనువాదం. http://www.angelfire.com/realm3/telugu/ లో ప్రచురింపబడింది.

బాధ అనుభవైకవేద్యం. సానుభూతికోసం చెప్పే అనునయవాక్యాలు సాంత్వన చేకూర్చవు సరికదా, అలా చెప్పేవారిని చూస్తే నాకు జాలేస్తుంది అంటుంది మా పద్మ.

ఉభయభాషాప్రవీణ

ఈనాటి రెండు కథలు (టపాలు) గురించి ఒకమాట. నేను ఈరెండు కథలు రాసినప్పుడున్న అభిప్రాయాలు కేవలం పాక్షికమని గత రెండు నెలలోనూ నాకు స్పష్టమయింది. అందరిలాగే నేనూ తెలుగు సమసిపోతోందనీ, ఈనాటి యువత తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్నారనీ అనుకున్నపుడు రాసిన కధలివి. కాని కొన్ని బ్లాగులు చూసాక, ఎంతోచక్కని తెలుగు రాయగల, తెలుగంటే అభిమానంగల తెలుగువాళ్లు చాలామంది వున్నారని అర్థం అయింది. మీఅభిప్రాయాలు రాసినప్పుడు నాదృష్టిలో వచ్చిన ఈమార్పుని గమనించవలసిందిగా నాకోరిక.

ఉభయభాషాప్రవీణ

ఈకథ ఇంగ్లీషులో ప్రచురించినతరవాత, నాకు కొన్ని టపాలొచ్చేయి ఇంగ్లీషుబడిలో చదువుకున్న తెలుగుపిల్లలు రాసినవి. దానిమీద నేను అమెరికాలో నేటివ్ ఇండియన్సుని తెల్లవారు ఎలా హింసించేరో కూడా తెలుసుకున్నాను. ఆదృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది. వివరాలు కావలసివారు నా తూలిక.నెట్ లో చూడొచ్చు బైలింగ్వల్ చదువులమీద.

కొనేమనిషి

కొనేమనిషి

నేను అమెరికా వచ్చినతరవాత 1976లో రాసిన తొలికథ. మానవసంబంధాలన్నీ ఆర్థికప్రతిపత్తి పైనే ఆధారపడి వుంటాయన్న ఆలోచనకి మరొక కోణం.

శునకేంద్రభోగాలు

శునకేంద్రభోగాలు

ఈనాడు మానాట
కుక్కలకు గౌరీకల్యాణం
కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు
ఆవులను కోసి కుక్కలను మేపుట సర్వసాధారణం
ఇచట
కుక్కతిండికి వ్యయం ఏటికి పదహారు బిలియనులు
గ్రామసింహాల పళ్లు తోమడానికీ
ఒళ్లు కడగడానికీ
మరో తొమ్మిది బిలియనులు
యజమానులు తీరిచి దిద్దుకుంటున్నారు
ముద్దుకుక్కల ముఖవిలాసం
కుక్కలకున్నాయి
ఫర్‌కోటులూ, ఆభరణాలూ
అందాలపోటీలూ,
ఆరామస్థలాలు
సంఘాలు, సమావేశాలు
వెరసి వ్యయం
యేటికి యాభై బిలియనులు
మాసార్వభౌముల
సలహాదారులు *లోరా, బార్నీ,
వారిలో బార్నీవాక్కులకే అధికప్రాధాన్యం.
సామాన్యజనాలకి కుక్కగతి

మానవజన్మనెత్తి
నానా ఆగచాటులు పడుటేల
అమెరికాలో కుక్కగా
పుట్టిన కలుగు
అష్టశ్వైర్యములు, అనన్యసామాన్య భోగబాగ్యాలు

(* Laura జార్జ్ బుష్ అర్థాంగి, బార్నీ వారి ముద్దుకుక్క అని గ్రహించగలరు)
000

(మా.ని. జనవరి 2008)

ధర్మకాటా

ధర్మకాటా

ఆకలేస్తే అన్నం తిను
చలేస్తే దుప్పటీ కప్పుకోమంటూ
నోటిలెక్కల్లా
బహుతేలిక
ఈనాటి నాగరీకప్రపంచంలో
ప్రతిసమస్యకీ
రెడీమేడ్ జవాబు

కంటికానని
అనుభవాలు
పరమాణుల్లా
కోటానుకోట్లు

అణువణువూ
గతానుగతికంగా
ప్రపంచాన్ని పాలిస్తోంది
చట్టాలని సృష్టిస్తోంది

నిజానికి
అంతరాంతరాల్లోంచి
పుట్టుకొచ్చే వణుక్కి
దుప్పట్లెక్కడా దొరకవు
అకాడమీలందిచ్చే
ధర్మనిర్ణయాలు
సామాన్యులకి
సాంత్వన కూర్చవు
వారి తీర్పులు
వీరి బతుకుల
మూసపోసిన అచ్చుల్లా
అమరవు.

(మాలతి, 10-24-1997)