పూర్వకవులు-అడిదము సూరకవి

అడిదము సూరకవి (1720-1785)

క. ఊరెయ్యది? చీపురుపల్లె
పేరో? సూరకవి యింటిపేర డిదమువార్
మీరాజు? విజయరామ మ
హారాజ తడేమి సరసుడా? భోజుడయా..

నాచిన్నతనంలో నాకు చాలా నచ్చిన పద్యాల్లో ఇదొకటి. మనం రోజూ ఆడుకునే మాటలు – వూరూ, పేరూ – ఇలా అతిసామాన్యమైనవి పద్యంలో పొందుపరచడం నాకు మనసున బాగా నాటుకుంది.

చినవిజయరామరాజు భోజుడని చెప్పుకోడానకి ముందు సూరన ఆర్థికంగా చాలా బాధలు పడ్డాడు. ఆయన తండ్రి భాస్కరయ్య లక్షణసారం రాసేడని చెప్పుకోడమే కాని ఇప్పుడు అందుబాటులో లేదు.
18వ శాతాబ్దం తొలి పాదంలో జన్మించిన సూరన తండ్రిదగ్గరే ఛందస్సూ, అలంకారశాస్త్రం, సంస్కృతవ్యాకరణం చదువుకుని, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఏదో చిన్న మడిచెక్క వున్నా పంటలు లేక, ఆయన వూరూరా తిరిగి ఆశువుగా కవిత్వం చెప్పి ఆనాటి భత్యం సంపాదించుకునేవాడు. గడియకి (24 నిముషాలు) వంద పద్యాలు ఆశువుగా చెప్పగలదిట్టనని తనే చెప్పుకున్నాడు. సూరన దినవెచ్చాలకి పద్యాలు చెప్పడం “ఇచ్చినవాడిని ఇంద్రుడనీ చంద్రుడనీ మెచ్చుకోడం, ఇవ్వనివాడిని చెడామడా తిట్టడం” చేసేవాడని సమగ్రాంధ్రసాహిత్యంలో (3 సం.) ఆరుద్ర రాశారు. అట్టే భాషాజ్ఞానంలేని పామరులకోసం రాయడంచేత తేలికభాషలో చాటువులు రాసేడు అన్నారు. అయితే చందోబద్ధంగా కవిత్వంలో వింతపోకడలు పోతూ చమత్కారం, ఎత్తిపొడుపూ మేళవించి రాయడంవల్ల ఈ చాటువులు పామరజనరంజకమే కాక పండితులఆదరణకి కూడా అంతగానూ నోచుకున్నాయి.

సంస్థానాలు తిరుగుతూ, జీవనభృతి సంపాదించుకునే రోజులలో విజయనగరం వచ్చినప్పుడు పెదసీతారామరాజు ఆయనని ఆదరించలేదు. ఆసమయంలో సూరకవి చెప్పిన పద్యం –
గీ. మెత్తనై యున్న యరటాకు మీదఁ గాక
మంటమీఁదనుఁ జెల్లునే ముంటివాడి
బీదలైయున్న మాబోంట్ల మీదఁ గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీఁద.

చేవ వుంటే బాధుల్లాఖానుమీద చూపించు నీప్రతాపం, అంతే కాని కూటికి గతిలేని నామీద ఏమిటి అంటూ ఎత్తిపొడిచాడు. ఈపద్యానికి చారిత్ర్యక నేపథ్యం అడిదము రామారావుగారి పుస్తకంలో విపులంగా వుంది. చూడండి.

ఒకసారి సూరన విజయరామరాజుగారి సభలో ఈపద్యం చదివాడు రాజుగారి కీర్తిని మెచ్చుకుంటూ..
ఉ. రాజు కళంకమూర్తి, రతిరాజు శరీర విహీనుండంబికా
రాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతరసీమవర్తి వి,
భ్రాజిత పూసపాడ్విజయరామ నృపాఁలుడె రాజు గాక, యీ
రాజులు రాజులే పెనుతరాజులు గాక ధరాతలంబునన్. (పు. 53)

చంద్రుడికి మచ్చ, మన్మథుడికి శరీరమే లేదు, శివుడికి కట్ట బట్టల్లేవు, సింహం గుహల్లో నివాసం, వీళ్లందరూ రాజులేమిటి, విజమరామరాజు మాత్రమే నిజంగా రాజు ఈభూమ్మీద అంటాడు సూరకవి.
సభలో రాజులు ఈ రాజులు అన్నపదం తమని వుద్దేశించే అన్నాడని కినుక వహించగా, సూరకవి అది నిజం కాదనీ, తాను పద్యంలో పేర్కొన్న రాజులగురించి అన్నాననీ సమర్థించుకున్నాడు.

సూరన ఎంత దారిద్ర్యం అనుభవించినా, ఆత్మగౌరవం కాపాడుకుంటూనే వచ్చేడు కానీ అధికారులకి తల ఒగ్గలేదు.

పైపద్యం ఆశువుగా చదివినప్పుడే సూరన కవితా ప్రౌఢిమకి మెచ్చి విజయరామరాజు ఆయనకి కనకాభిషేకం చేయించారు. ఆ తరవాత, ఆనాటి ఆనవాయితీ ఏమో మరి, సభలోని వారు సూరన ఆ బంగారునాణేలను తీసుకుంటాడని ఎదురుచూశారు. అయితే సూరన మాత్రం తనకి జరిగిన సత్కారానికి మాత్రం సంతోషం వెలిబుచ్చి వూరుకున్నాడు. అఫ్పుడు రాజుగారు ఆనాణెములు నీవే అని స్పష్టం చేసారు.
దానికి సమాధానంగా సూరన, మీదయవల్ల ఇంతవరకూ “స్నానము చేసిన యుదకమును పానము చేయలేదు” అని జవాబిచ్చాడు. (డబ్బు నీళ్లలో వాడడం అన్ననానుడి ఇలాగే వచ్చిందేమో మరి).
చినవిజయరామరాజు సూరన వ్యక్తిత్వానికి ముగ్ధుడియి, ఆయనకి తగినవిధంగా సత్కరించి పంపించాడు.
చినవిజయరామరాజు సూరనని ఆదరించిన తరవాత, రాజుగారి సవతి అన్నగారు అధికారం వహించి, సూరనని ఉప్పూ, పప్పూకోసం కోమటులని పొగడడం మానుకోమని ఆంక్ష పెట్టారు కానీ సూరన ఆఆజ్ఞని తలకెత్తుకోక, తన అభీష్టంప్రకారమే జీవనసరళి సాగించుకున్నాడు..

మామూలుగా మనఇళ్లలో నిత్యం అనుభవమే, భార్య భర్తని వూళ్లో అందరికీ చేస్తారూ, అందరినీ పొగుడుతారు, మనవాడిని కూడా ఓమంచిమాట అనొచ్చు కదా అని.

అలాటిదే ఈ చాటువు. సూరన సతి సీతమ్మ ఒకసారి “అందరిమీదా పద్యాలు రాస్తారు, మనఅబ్బాయిమీద రాయరేం” అని అడిగిందిట. అందుకు సూరకవి తన సహజధోరణిలో
క. బాచా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్లుం దానున్
బూచంటే రాత్రి వెఱతురు
బాచన్నంటే పట్ట పగలే వెఱతుర్
అని చదివాడట. తన కుమారుడు రూపసి కాడని స్పష్టం చేస్తూ. సీతమ్మ చాల్లెండి మీవేళాకోళం అని ఆయన్ని మందలించిందిట.
అలాగే మరోసారి ఆయన చీపురుపల్లినుండి ఆదపాకకి వెళ్తుంటే, దారిలో ఒక సాలెవారి చిన్నది కనిపించింది. ఆయనే పలకరించేరు ఎక్కడికి అని. అదపాక అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పి, బాబూ, నామీద ఒక పద్యం చెప్పండి అని అడిగింది. ఆయన వెంటనే తన సహజధోరణిలో ఆశువుగా చెప్పినపద్యం.

క. అదపాక మామిడాకులు
పొదుపుగా నొక విస్తరంట బొడినవాఁడే
ముదమొప్ప విక్రమార్కుఁడు
అదపాకా అత్తవారు ఔనే పాపా.
ఇక్కడ కవిగారు మామిడాకుల ప్రసక్తి తేవడానికి కారణం అదపాకలో మామిడాకులు విస్తరాకులు కుట్టడానికి వెడల్పులేనివి, విస్తరాకులు కుట్టడానికి వీలుగా వుండవు అనిట.

పండితులని చెప్పి కొండకొమ్మున కూర్చోబెట్టిన మహాకవులని భూమ్మీదకి దింపే ఇలాటి కథలు, కవులని మామూలు మనుషులుగా కూడా చూపించే ఇలాటి కథలు నాకు సరదాగా వుంటాయి.

ఎవరిని నువ్వు అనొచ్చు. ఎవరిని గౌరవపురస్సరంగా మీరు అనాలి అన్న వాదన ఈమధ్యనే వచ్చింది గాదు. ఈకింది పద్యం, దానిమీద జరిగిన చిన్న చర్చ చూడండి. సూరన చినవిజయరామరాజు శౌర్యపటిమని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం.

ఉ. పంతమున నీకుఁజెల్లు నొకపాటి యమీరుఁడు నీకు లక్ష్మమా
కుంతము గేలు బూని నిను గొల్వనివాడు ధరిత్రిలోన భూ
కాంతుఁడొకండు లేడు కటకంబు మొదల్కొని గోల్కొండ ప
ర్యంతము నీవెకా విజయరామనరేంద్ర! సురేంద్రవైభవా. (పు. 58)

కటకం నించీ గోల్కొండ వరకూ కత్తి చేత పట్టి నీకు సలాములు చెయ్యని రాజు ఒక్కడు కూడా లేడు, నీకు నీవే సాటి అన్నాడు సూరన. సభికులు భళీ అంటూ కరతాళధ్వనులు చేశారు. రాజు గారు కూడా మెచ్చుకున్నారు కానీ నొచ్చుకోకుండా వుండలేకపోయారు. తనంతటి ప్రభువుని నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించడం బాగులేదు అన్నారు.
సూరకవి వెంటనే,
క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలోనన్ యుద్ధములోనన్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!
పిల్లలవిషయంలో, పడగ్గదిలో, కవిత్వంచెప్పినప్పుడు, యుద్ధంచేసే అప్పుడూ ఏకవచనం వాడితే తప్పులేదు అంటూ రాజుగారిని సమాధాన పరిచాడు. ఇంచుమించు ఇదే అర్థాన్నిచ్చే శ్లోకం ఒకటి సంస్కృతంలో వుందిట.

సాహిత్యం సిరిగలవారిళ్ల రసజ్ఞులకోసం మాత్రమే అనుకునే రోజుల్లో సామాన్యులని తనకవితా మాధురితో చమత్కారంతో అలరించిన కవి అడిదము సూరకవి.

ఇలాటివి ఇంకా కావాలంటే అడిదం రామారావుగారి పుస్తకం, (1919 ప్రచురణ) చూడండి. ఇంటర్నెట్ డిజిటల్ లైబ్రరీలో చూసుకోవచ్చు. వారి చిరునామా http://www.archive.org/details/adidamusurakavi025641mbp. ఈవ్యాసానికి ఆధారం ఈపుస్తకంతో పాటు మహావాది వెంకటరత్నంగారి పూర్వకవులకథలు (1950 ప్రచురణ), ఆరుద్రగారి సమగ్రాంధ్రసాహిత్యం (సాహిత్య ఎకాడమీ ప్రచురణ, 2002).

(మా.ని. మే 20008.)

ప్రకటనలు