ఎలుకని జయించేను కథ

శాంతియుత సహజీవనము

లేక

ఎలుకని జయించేను కథ

రెండోఅంతస్తునించి మొదటి అంతస్తులోకి మారిపోయేక నాకు పట్టలేనంత ఆనందం కలిగింది.  

మెట్లు ఎక్కీదిగే కర్మ తప్పింది కానీ మరోరకం వైపరీత్యాలు ఎదురవగలవనుకోలేదు.

మొదటిది – పైఅంతస్తులో వారు పిట్టలకోసం విసిరే గింజలు. అవి తినే పిట్టలు కనిపించలేదు కానీ ఆ గింజలు ఎత్తిపోసుకోడం నాపనయింది. నాపంచలోనే కాక, మొత్తం ఆవరణలో గచ్చు గింజలమయం. అవి ఎత్తిపోసుకోడం మామేనేజరు పనయింది.  దాంతో ఆవిడ పైవారికి తాఖీదు ఇచ్చి, నాకు కూడా విముక్తి కలిగించింది.

రెండోది బొద్దెంకలు. బహుశా బహువచనం తగదు. ఎందుకంటే నాకు కనిపించినవి మూడు అయినా అన్నీ ఒకే సమయంలో కనిపించలేదు. 2, 3 వారాలకి ఒకటి చొప్పున దర్శనమిచ్చేయి  వంతులవారీగానేమో నాకు తెలీదు.

సరే, వాటిగురించి అంతర్జాలంలో వెతికితే కనిపించినసలహాల్లో ఒకటి నాకు నచ్చింది. ఉల్లిపాయముక్కలమీద baking soda చల్లి అది కనిపించినచోట పెట్టాలిట. దీన్లో తర్కం నాకు సరిగా అర్థం కాలేదు కానీ తేలిక గదా అని పెట్టేను ఓ చిన్నపళ్లెంలో.

మర్నాడు నాటీవీ ముందు ఓ బొద్దెంక చచ్చి పడి ఉంది ఆఫ్ఘనిస్తానులో అల్లకల్లోలానికో నా ఉల్లిఘాటుకో తెలీదు మరి. దాన్ని తీసి పారేసేక ఆ ఘట్టం ముగిసింది.

ఈ రోజు patioవేపు గాజుతలుపూ, జల్లితలుపూ తీసి, వంటింట్లోకి వెళ్లేను మొక్కలకి నీళ్ళు తీసుకురావడానికి. మామూలుగా జల్లి తలుపు వేసేస్తాను కానీ ఎంతసేపులే అని వదిలేసేను. తిరిగి వచ్చేసరికి, హాల్లో టీవీముందు ఓ ఎలుక! 

కెవ్్్్్్్్్్

అరిపాదాల్లో రక్తం గుండెలకి ఎగదన్నింది.

ఇప్పుడేమి చేతునా అని ఒఖ్ఖక్షణం, ఒఖ్ఖటంటే ఒఖ్ఖటే క్షణం ఆలోచించి, మళ్ళీ అటు తిరిగి చూస్తే ఆ ఎలుక వీధిగుమ్మంవేపు పరిగెడుతోంది.

అది శుభసూచకం. వంటింట్లోకో పడగ్గదిలోకో అయితే మరీ కష్టం కదా.

అది వీధిగుమ్మంవేపు కొనసాగడంతో మాఇద్దరి అభిప్రాయాలూ ఒకటే అని తెలుస్తోంది. 

 ఎలుకకి నాఇంట ఉండడం ఇష్టంలేదు. నాక్కూడా అంతే.

ఇంక తలుపు తీసి వీడ్కోలు చెప్పడమే నావంతు. గబుక్కున కొండచీపురు అందుకుని, ఎలుకకి వీలయినంతదూరంలోను, తలుపుకి వీలయినంత దగ్గరగానూ ఒంగి, తలుపు నెమ్మదిగా తీసి, దయచేయమన్నాను ఎలుకతో.

అది తిరిగి చూడకుండా, శలవనైనా చెప్పకుండా పారిపోయింది.  

బ్రతుకు జీవుడా అని నన్ను సముదాయించుకున్నాను. 

సుదీర్ఘంగా నిట్టూర్చేను.

అంత తేలిగ్గా అయిపోయినందుకు ఆనందించేను.  

నన్ను నేను అభినందించుకున్నాను కూడా.

000

ఆతరవాత మేనేజరు కనిపించినప్పుడు చెప్పేను “మాఇంట్లోకి rat వచ్చింద”ని.

ఆవిడ, “అది rat కాదు, mouse,” అంది.

“ఏమో rat or mouse. Elephant అయినా నాకొద్దు. అసలు ఇప్పుడు జాతులూ, పదప్రయోగాలూ చర్చించు సమయము కాదు. నాకు వాటితో సహజీవనం చేసే సరదా లేదు అని తమరు గ్రహించవలెను. పోనీ, ఈ జీవులు అద్దె ఏమైనా సాయం చేస్తాయా అంటే అదీ లేదు కదా,” అన్నాను.

00ద

ఈకథలో నీతి ఏమి? జాతినిర్ణయాలకీ, పదప్రయోగాల చర్చకీ సమయాసమయాలుంటాయి.

(ఆగస్ట్ 26, 2021)