నిరీక్షణ

చిన్నప్పుడు స్కూల్ బస్సుకోసం
చల్లని సాయంత్రాలకోసం
ఆ సాయంకాలం సముద్రతీరాన
ఇసుకలో కట్టే పిచిగ్గూళ్లకోసం
ఆ గూళ్లలో చేరే పిట్టలకోసం

పెద్దపండుక్కోసం
పట్టుపరికిణీకోసం
గోదావరి ఆనకట్టపై
పరుగుల్తీసే రైలుబండీకోసం
ఆరైలుబండీకమ్మీల్లోంచి
చిమ్మచీకట్లు చీల్చుకుంటూ
వెలుగులు కురుసే దీపాలతోరణాలకోసం

ఏతావాతా
చదువుల్తెచ్చే డిగ్రీలకోసం
ఆ డిగ్రీలిచ్చే ఉద్యోగాలకోసం
ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లకోసం
ఆప్తుల ఆమోదముద్రకోసం

నాలుగువీధులకూడలిలో పచ్చవెలుక్కోసం
మనసిచ్చి మాటాడే మనిషికోసం
అలనాటి మిత్రము కాకమ్మచేతనైన పంపే ఊసులకోసం
ఋజువైన చెలిమికోసం

ఎండకోసం
వానకోసం
ఆకురాలు కాలంలో
కొమ్మలు చిమ్మే చిత్రవిచిత్ర సోయగాలకోసం
మళ్లీ మళ్ళీ మొలకెత్తే చివుళ్లకోసం

ఎదురుచూస్తున్నాను అర్ధశతాబ్దిగా
మూడంతస్తులమేడల్లో
ఐదంకెల ఆదాయాల్తో
కోరితెచ్చుకున్న ఈతిబాధల్తో
వాలుకుర్చీల్లో విలాసంగా వెనక్కి  వాలి
భారతీయసాంప్రదాయం
వైరాగ్యం ఔన్నత్యం గూర్చి
వివరిస్తుంటే వింటున్నాను ఓపిగ్గా.

తరంగాలెళ్తే స్నానం చేస్తానంటూ
సముద్రపొడ్డున ముడుచుక్కూచున్న  బడుగుబాపడిలా
ఎదురుచూస్తున్నాను.

ఏ ఉద్గ్రంథానికో
అస్తవ్యస్తంగా రాస్తున్న
నాందీప్రస్తావనలా వుంది జీవనహేల.
తుదిపలుకు వ్రాయడం మొదలు పెట్టాలింక.
*

(తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో, తెలుగువెలుగు, 2003, లో ప్రచురితం.

చిన్న చిన్న మార్పులతో సంస్కరించి.  27 జులై 2019)

హరివిల్లులు రెండు విరిసేముందు

ఏభావం, ఏభాష – కొన్ని తెలుగులో బాగుంటాయి. కొన్ని ఇంగ్లీషులో బాగుంటాయి. కొందరికి ఇంగ్లీషులో చెప్తే ఇష్టం. కొందరికి తెలుగులో చెప్తే ఇష్టం. Continue reading “హరివిల్లులు రెండు విరిసేముందు”

ఇంద్రజాలం (కవిత)

మిత్రమా!

చూడమంటూ నువ్వంపిన ఫైలు

తెరవబోతున్న క్షణంలో

తటాలున కిటికీలో వెలిగిన తటిల్లత

Continue reading “ఇంద్రజాలం (కవిత)”

మళ్లీ నాగురించే

పొద్దున్నే, లచ్చిమి నీగురించి చెప్పూ అని అడుగుతోంది. మరిపాపం ఆపిల్ల పుట్టకముందే నేను రాయడం మొదలు పెట్టేను కదా. అంచేత మళ్లీ చెపుతున్నా. చాలామందికి తెలిసిన సంగతులే. హీహీహీ.

మరో అసలు నిజం కారణం లక్ష్మీకాన్తమ్మగారి మీద రాసిన వ్యాసం నలుగురికళ్లా పడలేదేమోనని అనుమానంగా వుంది. అంచేత ఇది టెస్టు డ్రైవు కూడా.

వ్యాఖ్యలు చూసి సవరించబడింది 🙂

000

సరే మళ్లీ చెపతా

మరోసారి నాగురించి.

పేరు మాలతి

ఇంటిపేరు నిడదవోలు.

కన్ఫ్యూజనవకండి మరే మాలతితోనూ

పుట్టింది ఇసాపట్టనంలో

పబ్బము గడుపుకుంటున్నది విస్కాన్సిను లో.

వయసు చెపితే ఝడుసుకుంటారేమో

వున్నాయి డెబ్భైకి పైనే

నాకుంది ఒక అమ్మాయి

పేరు సరయు, వృత్తి -హాలివుడ్ తార

పోతే

నారాతలు నాకాలక్షేపం,

కంప్యూటరు నా నేస్తం

కీబోర్డే నా సమస్తం

ప్రింటరు స్థిరాస్తి

ఫ్లాష్ డ్రైవు చరాస్తి

టీవీ ఇష్టసఖి

ఇష్టమొచ్చినపుడు

ఇష్టమయినవి తినడం నా సరదా

ఇష్టమొచ్చినట్టు తిరగడం మరో సరదా

దేవుడు బొత్తిగా లేడనను కానీ

he is minding his business

and I am minding mine.

I think I missed the common ground

somewhere along the way.

వ్యసనాల్లేవనుకోడం నా వ్యసనం

చేస్తుంది నా మొహం నిండా మోసం

నాగూట్లో నేను

ముడుచుకు పడుకోడమే

నాకు పరమానందం.

నామటుకు నాకు అదే పరమయోగసారం.

(ఫస్టోబరు 2008. )

(నోటు-  ఫస్టోబరు అన్నపదం ఆరుద్ర సృష్టించింది )

నీడ, సంతాపసభ

ఇది నా నూరో పోస్టు కావడం విశేషం!

 

నీడ

 

నేనెవరికీ కనిపించను

వాగొంతెవరికీ వినిపంచదు.

నాకోసమెవరూ

పరితపించరు

ఏనాడో.

ప్రపంచం మరిచినవెనుక

అగపడగలను

పుట్టలోనో

చెట్టుమీనో

కొండవాగులోనో

కోనసీమలోనో

ఛాయామాత్రంగా

ఎదురు కావచ్చు..

ఆనాడు

కళ్లు పొడుచుకు చూడు

సావధానుడవై విను

నా వునికీ, గళమూ

కోరుకున్నవారికి

మాత్రమే వేద్యం.

 

 

సంతాపసభ

 

ఈమధ్య ఎంచేతో

ఒబిచ్యురీలు చూసినప్పుడల్లా

ఇవే ఆలోచనలు నాకు.

నా దుకాణం ఎత్తేస్తే

ఎవరేమంటారా అని..

ఇప్పుడే తెలిసింది

అయ్యో కొట్టు మూతపడింది

నాణ్యమైన సరుకు

అందించిన షాపు

తెలుగురుచులు

విదేశాల చాటిన మేటి షాపు

మరి లేదిక మనకి

అంటారని.

దిక్కులు చూస్తున్నా

నాకొట్లో కూచుని.

ఎలా చెప్పను

 

నేనింకా బతికే వున్నానని

నాగుండె ఇంకా కొట్టుకుంటూనే వుందని

బతికుండగానే నన్ను పాతిపెట్టేయకండని

 

మీ మెప్పుకోళ్లకిది

సమయం కాదు.

ఇంకా అంతరించలేదు కనక

అనివార్యకారణాలు అసలే లేవు.

దుప్పట్లు కప్పడానికీ

పుష్పగుచ్ఛాలందించడానికీ

సంతాపసభలకీ

ఇంకా టైముంది.

తొందరపడకండని

 

(ప్రాణహితులకి కృతజ్ఞతలతో, సెప్టెంబరు, 2008. )