కొత్త సీసా, పాత సారా

కొత్తసీసా, పాతసారా

స్థానిక కాలేజీలో నాకు ఉద్యోగం దొరికినప్పుడు కొండనందుకున్నట్టు పొంగిపోయాను. ఎందుకంటే నాకు ప్రాణపదమైన మానవతావిలువలకి సంబంధించిన పని అది. ప్రతి విద్యార్థీ ఒకసెమెస్టరులో పది గంటలసేపు సాంఘికసేవ చెయ్యాలి. దానికి కొన్ని నియమాలు వున్నాయి. ఆనియమాలు వివరించడం, వాళ్లని చక్కని రాజమార్గాన నడపడం నా విధి.
మాడైరెక్టరు నాకు వివరాలు చెప్పినప్పుడు నాకు చిన్న నవ్వొచ్చింది. మేం చిన్నప్పుడు కాపీబుక్కుల్లో రాసేవాళ్లం “ఆడి తప్పరాదు”, “తల్లిదండ్రులు దేవునితో సమానము” లాటివి. దాంతో నీతులూ రాతలూ కూడా నీటుగా నాటుకుంటాయని మాపెద్దల ఉద్దేశం. అలా జరిగిందా అన్నది వేరేకథ అనుకోండి.
అమెరికాలో ఉగ్గుపాలతో “గెలుపు” పాఠాలు నూరిపోసి, ఎదిగిన తరవాత ఈ సన్మార్గాలూ, సంఘసేవా బోధిస్తున్నారు. అమెరికా, ఇండియా భౌగోళికంగా డయమెట్రికల్లీ ఆపోజిట్టు కదా. 000
మికేలా వచ్చింది తను చెయ్యబోయే ప్రాజక్టుగురించి మాటాడడానికి.
“ఏంచేస్తావు?” అని అడిగాను మామూలుగానే.
“ఏమో”
ఇది కూడా మామూలే. వాళ్లకి ప్రపంచంలో సమస్త విషయాలూ తెలుస్తాయి కాని “సాటిమనిషికి నువ్వు చెయ్యగల సాయం ఏమిటి” అంటే చప్పున చెప్పలేరు.
అరగంటసేపు తనకుటుంబం, చదువు, చెయ్యబోయే వుద్యోగం మాటాడినతరవాత ఆవుద్యోగానికి పనికొచ్చే సాంఘికసేవ బోధిస్తాను. అందులో కూడా సొంతలాభం కొంత పొందుపరచకతప్పదు మరి! పుణ్యమనే కదా పూజలూ, వ్రతాలూను.
బిజినెస్ ఎడ్మినిస్ట్రేషన్ మేజరుట.
సరే, ఏబిజినెస్ గానీ మనుషులతో పని- ఎదటివారి తత్త్వాలు అర్థం చేసుకోడం -కదా. అంచేత ఊళ్లో వున్న రెండు సేవాసమాజాలకి వెళ్లి అక్కడ ఏంచేస్తున్నారో, తనక్కడ చెయ్యగలిగిన సాయం ఏమేనా వుందేమో చూడమన్నాను.
ఇప్పుడు ఆమాట చెప్పడానికే వచ్చింది.
“నాకో మంచి ప్రాజక్టు దొరికింది,” అంది హుషారుగా.
ఎక్కడ అని అడిగాను.
ఊరిచివరనున్న నర్సింగుహోంలోనట. “పైగా అక్కడ ఒక ఇండియన్ ఆవిడ వుంది. అంచేత నేను కల్చరల్ డైవర్సిటి కూడా స్టడీ చెయ్యొచ్చు,” అంది మికేలా.
సరే, తాను అక్కడ తన ప్రాజక్టుకి సానుభూతి [compassion], నిస్సహాయులకి సాయము చేయుట [helping the needy], భిన్న సంస్కృతులలో విలువలు [cultural diversity] అను మానవతావిలువల అధ్యయనం చేయుటగా నిర్ణయం అయిపోయింది.
ఆఅమ్మాయి లేవబోతూ, “ఇండియాలో ఉమ్మడికుటుంబాలు కదా, రెండుగదుల్లో పదిమంది వుంటారు. ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చి నర్సింగుహెంలో పెట్టడం ఏమిటి?” అంది.
000
ఇదివరకు ఇలాటివిషయంలోనే తను అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది, “రెండుగదుల్లో ఆరుగురు వుంటే మరి పిల్లల ఎదుటే … చేస్తారా?” అని. ఏమిటి అడుగుతోందో వాచ్యం చెయ్యలేదు నామీద గౌరవంతో. నాకు ఏంచెప్పాలో తోచలేదు. “పిల్లలముందు చెయ్యరు కాని కావాలనుకుంటే దారే వుండదా? జనాభా చూస్తే తెలుస్తోంది కదా” అన్నాను తేలిగ్గా.
ఎవరు ఎలాటిప్రశ్నలు వేస్తారు అన్నది కూడా సాంస్కృతికవిజ్ఞానంలో భాగమే. అదే వయసుగల తెలుగు పిల్లలు ఆప్రశ్న వెయ్యరు అనుకుంటూ.
000
మికేలా నామొహం చూస్తూ నిలబడింది నాజవాబు కోసం. “ఆయన ఇక్కడ ఉండడంతో మారిపోయారా?”
నాక్కూడా ఆఅనుమానం వచ్చింది కాని బయటబడడం నాకు ఇష్టం లేదు. మామూలుగా పెద్దవాళ్లని ఇక్కడికి తీసుకొచ్చింతరవాత ఇంట్లో పెట్టుకోడమే చూశాను కాని నర్సంగుహోంలో పెట్టడం చూడలేదు.
“నీ ప్రోజక్టులో అది కూడా భాగమే. చూడు ఏం నేర్చుకుంటావో,” అన్నాను గోడమీద పిల్లివాటంగా.
సరేనంటూ వెళ్లిపోయింది.
ఆతరవాత మికేలా అప్పుడప్పుడొచ్చి తను కనుగొన్న సరికొత్తవిషయాలు చెప్తూనే వుంది.
ఆశ్చర్యం, ఆవిడ, పూర్ణిమాదేవి పెళ్లి చేసుకోలేదట.
వాళ్లచెల్లెలికి పదకొండుమంది పిల్లలుట.
స్కూలు టీచరుగా పనిచేస్తూ వీళ్లందరికీ చదువులు చెప్పించిందిట.
పెద్దపిల్లలు ఎదిగి ఉద్యోగాల్లో చేరిన తరవాత, చిన్నవాళ్లని చదివించారట.
తాను గ్రహించిన ప్రతివిషయమూ ఆఅమ్మాయికి వింతే. నాకు చాలా మామూలు విషయం.
తాను ఎన్నో సంగతును నేర్చుకున్నానని చెప్పేది మహోత్సాహంతో.
తననిగురించి కూడా చాలా ప్రశ్నలు వేసిందిట ఆవిడ. మొదట చిరాగ్గా అనిపించినా అది వాళ్ల అలవాటు అనుకుని జవాబులు చెప్పిందిట. తన కుటుంబం ఫొటో కూడా ఇచ్చిందిట.
గుడ్, గుడ్ అంటూ వస్తున్నాను నేను నవ్వుతూ.
000
పూర్ణిమాదేవి – అదే నర్సింగ్‌హోంలో మికేలా సందర్సిస్తున్న ఆవిడ – తనకుటుంబంగురించి పదే పదే చెప్తూండడంతో మికేలాకి ఓ ఆలోచన తోచింది.
“నేను ఆవిడకి ఒక కలాజ్ [collage] చెయ్యమని చెప్పాను. ఓపెద్దబోర్డుమీద తనకి అభిమానులయినవాళ్లందరి బొమ్మలూ అమర్చి, దానికి వత్తాసుగా ఓ చిన్నపుస్తకం వాక్చిత్రాలు రాయమని. నేను సాయం చేస్తాను,” అంది.
“చాలా మంచి ఊహ,” అన్నాను, నిజంగానే సంతోషిస్తూ. మనకి దాపరికం లేదు. డాక్యుమెంటేషను చాలా తక్కువ. మన చరిత్ర అంతా మౌఖికమే కదా.
మికేలా సందేహిస్తూ, “ఖర్చులు డిపార్ట్‌మెంటు ఇస్తుందా?” అని అడిగింది నెమ్మదిగా.
“ఎంత?”
“ఏమో.”
కలాజ్‌కి అట్టబోర్డు, గమ్, కథ రాయడానికి ఓ నోట్‌బుక్కు, లేకపోతే తెల్లకాయితాలు – ఎలా చూసినా పది డాలర్లకి మించదు. డిపార్ట్‌మెంటంటే, రసీదులూ, ఫారాలు, అప్రూవలూ, ఎందుకొచ్చిన గొడవ అని నాపర్సు తీసాను.
మికేలా చూసి, నెవర్‌మైండ్ అనేసి శలవు పుచ్చుకు వెళ్లిపోయింది. వెళ్తూ, “వెరీ ఎక్సైటింగ్” అని మరోసారి చెప్పి.
ఆతరవాత నాలుగు వారాలు కనిపించలేదు.
సిమెస్టరు చివరికొచ్చింది. మికేలా తను కనుగొన్న సంగతులూ, దానిమూలంగా తన దృష్టిలో, ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పులూ రిపోర్టివ్వాల్సిన రోజు దగ్గరకొచ్చింది.
ఎపాయింట్మెంటు తీసుకోమని ఈమెయిలు పంపించాను. జవాబుగా తనే వచ్చింది.
“నాకో చిన్న సమస్య వచ్చింది,” అంది రవంత జంకుతో.
ఇది కూడా మామూలే. చాలామంది ఆముగింపు దగ్గరకొచ్చేసరికి కాస్త ఆదుర్దా పడతారు – తాము చేసింది చాలదేమో, ప్రోజక్టు అప్రూవు కాదేమో అని.
“ఫరవాలేదులే. నువ్వు పాసవుతావు,” అన్నాను ధైర్యం చెప్తూ.
“అది కాదు. నేను కాలేజీ చివరిరోజునే వూరు విడిచి పోవాలి. ఈలోపున మూడు పెద్ద పేపర్లు రాయాలి. ..”
నాకు చిరాకేసింది. ఈసోది అంతా ఎందుకు?
“ఏంచెయ్యాలనుకుంటున్నావో చెప్పు” అన్నాను.
“ఆకలాజ్ ఇంకా పూర్తి కాలేదు.”
“అంటే మధ్యలో వదిలేస్తానంటావా?”
“లేదు. చేస్తాను, వచ్చేవారం వెళ్లి పూర్తి చేస్తాను. ఈలోపున మన ఇంటర్వ్యూ చెయ్యొచ్చా అని …”
నాకు ప్రాణం కుదుటపడింది. తొందరపడ్డది నేనే. క్షమాపణలు చెప్పుకోలేదు కాని ఇంటర్వ్యూ చేస్తానన్నాను.
మర్నాడు తొమ్మిది గంటలకి రమ్మన్నాను. సరే అని వెళ్లిపోయింది.
000
మికేలా రిపోర్టు రాయలేదు, ఇంకా పని పూర్తికాలేదు కనక.
అంచేత ప్రస్తుతానికి వాగ్రూపంలోనే.
మామూలుగా ఈ ఇంటర్వ్యూలు టేప్ చేస్తాం తరవాత తగువులేమైనా వస్తే సాక్ష్యం కోసం.
మికేలా దానివేపు చూసి “రికార్డు చెయ్యాలా” అంది. ఆఅమ్మాయికి చెమటలు పడుతున్నాయి.
అది చూసి, “నీకు అభ్యంతరం అయితే చెయ్యను,” అన్నాను.
“నాకు ఇష్టంలేదు.”
“సరే“ అని, స్టూడెంటుకి అభ్యంతరమయినందున టేపురికార్డరు ఆపు చెయ్యడమయినది అని రాసుకున్నాను.
“ఏమిటి నీ ప్రోజక్టు?”
“వయసుమళ్లినవాళ్ల ఆలోచనలు, అభిప్రాయాలూ తెలుసుకోడం, ఇతర సంస్కృతులగురించి తెలుసుకోడం.”
“నీ సబ్జక్టు వయసుమళ్లిన విదేశీ స్త్రీ కదా. అందువల్ల నీకు అధికంగా తెలిసినదేమిటి?”
“చాలా తెలిసింది. నేను ఇండియాలో ఆడవాళ్లగురించి విన్న చాలా సంగతులకీ, విడివిడిగా ఒకో మనిషి జీవితానికీ చాలా తేడాలుంటాయి.”
“ఏమిటి ఆతేడాలు?”
“పెద్దపెద్ద కుటుంబాలు చాలామంది చిన్నయిళ్లలో వున్నప్పుడు రాగల తగువులగురించే నేనెప్పుడూ వింటూ .వచ్చాను. మేం ఇక్కడ అంటుంటాం ఫెమిలియారిటి మితి మీరి కంటెంప్ట్‌కి దారి తీస్తుందని. కాని అదే ఫెమిలియారిటివల్ల ఆత్మీయతలు కూడా పెరుగుతాయేమోననిపించింది ఆమెతో మాటాడినతరవాత. నేను మా కాంపింగ్‌కి వెళ్లినప్పుడు చూసాను కొంచెం. కాని అవి అట్టే కాలం నిలవవు. అక్కడున్నంతసేపే “కేరింగ్ అండ్ షేరింగ్”.
పూర్ణిమాదేవిని ఇక్కడికి తీసుకొచ్చిన మిస్టర్ ప్రనీల్ సొంతకొడుకు కాదు. చెల్లెలి కొడుకు. పదేళ్లకిందట ఇండియా వెళ్లినప్పుడు ఆవిడ చెప్పిందట తనకి జరుగుబాటు కష్టంగా వుందని. చెప్పకోడానికి పదిమంది వున్నా ఎవరిబాధలు వాళ్లవి. అంచేత ప్రనీల్ తనతో తీసుకొచ్చేసాడు. ఆవిడ తనని పెంపకం తీసుకుందని దాఖలా చూపి గ్రీన్‌కార్డు సంపాదించి తనదగ్గరే వుంచుకున్నాడు. కాని ఈమధ్య పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరు పిల్లలతరవాత కలిగిన పిల్లాడికి మల్టిపుల్ సొలరిసిస్‌. ఆపిల్లాడికి తల్లి అవసరం 24 గంటలూను. అంచేత ఆవిడ అత్తగారి అవసరాలు ఆదుకోలేకుండా వుంది. ప్రనీల్‌ ఉద్యోగంవల్ల నెలకి 20 రోజులు రోడ్డుమీదే వుంటాడు. అంచేత ఆదంపతులు మరో దారి లేక, అందుబాటులో వున్న సదుపాయం కాదనలేక ఆవిడని నర్సింగుహోంలో పెట్టారు.”
మికేలా కళ్లు చెమర్చడం చూసి. నాక్కూడా అదోలా అనిపించింది. ఏదేశంలో కానీ ఏజాతిలో కాని మానవత్త్వపు ఛాయలు ఎప్పుడూ ఒక్కలాగే వుంటాయేమో అనిపించింది.
ooo
సెమెస్టరు అయిపోయింది. ఆఖరిరోజు. అమ్మ రాసిన వుత్తరంలో సంగతులు ఆలోచిస్తూ కూర్చున్నాను. అమ్మమ్మకి చాదస్తం ఎక్కువయిపోయింది. మామయ్య కొన్నాళ్లు నీదగ్గర పెట్టుకో అని తీసుకొచ్చి ఇక్కడ దించేసిపోయాడు రెండు నెలలకిందట.
ఆవిడ చిట్టినీ, సుజీనీ చంపుకుతినేస్తోంది ఎక్కడికెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఏ సినిమాకి, చీరలెందుకు కట్టుకోవూ, కట్టుకుంటే అలా కట్టుకున్నావేమిటి, తల దువ్వుకోలేదేం, దువ్వుకుంటే అదేం దువ్వుకోడం … ఏదో ఓ గొడవ రోజూ …..

టైము చూసాను. .అలోచిస్తూండగానే నాలుగున్నర. ఆరోజుకి నా పని అయిపోయింది. కంప్యూటరు ఆఫ్ చేసి, కాయితాలు డ్రాయరులో పడేసి లేవబోతుంటే మికేలా వచ్చింది.
మరోసారి నాకు బై చెప్పడానికి వచ్చిందనుకున్నాను నాబాధ్యత నేను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేను. మరొకసారి నాకు తనకృతజ్ఞతలు చెప్పడానికొచ్చింది. నాకు కించిత్ గర్వం కలిగింది.
“ఇంకా ఇక్కడే వున్నావేమిటి, నీఫ్లైటు టైమయిపోలేదూ?” అన్నాను.
ఆఅమ్మాయిమొహంలో ఏదో తికమక కనిపించింది.
“టైము అయిపోతోంది. కాని ఒకసంగతి మీతో అత్యవసరంగా మాటాడాలనిపించింది.”
“ఏమిటి?”
“అదే కలాజ్‌మాట.”
“కలాజ్? ఏమయింది? బాగా రాలేదా?”
“నేను అన్ని రోజులు గడిపేను ఆవిడతో. నా పనులు మానుకున్న సమయాలు కూడా వున్నాయి. కలాజ్ చూపించి ఆవిడ పరమానందపడిపోతూ థాంక్సు చెప్పింది. అది చూసి నాకు ఆశ్చర్యంతో నాకు నోటమాట రాలేదు.”
“బాగుంది. నీకు గర్వకారణం.”
“అది కాదు. ఆకలాజ్‌లో నాబొమ్మ ….”
“ఏం, లేదా?”
“వుంది” అని ఓక్షణం ఆగి, “పోస్టేజి స్టాంపంత ఓమూల. ఆవిడ నాగడ్డం పుచ్చుకుని ఇదిగో నువ్వు అని నాబొమ్మ చూపించినప్పుడు నాకు అర్థం అయింది ఆవిడ ఎనభై అయిదేళ్లజీవితంలో నా పాత్ర ఎంత చిన్నదో … నేను ఎంతసేపూ నేనెంత సేవ చేస్తున్నానో అనే ఆలోచిస్తూ వచ్చాను ఇంతవరకూ.”
నేను తెల్లబోయాను.
“Very humbling experience. అదే నా ప్రాజక్టులో నేను నేర్చుకున్న నిజమైనపాఠం, మీకు చెప్పాలనిపించింది. బై” అనేసి గబగబా వెళ్లిపోయింది.
నాకు తలతిరిగింది. కుర్చీలో కూలబడ్డాను అచేతనంగా. అమ్మమ్మా, సుజీ, చిట్టీ, పూర్ణిమాదేవీ, కొత్తరంగులు పులుముకుంటున్న పాతకాలపు విలువలూ, “నా”చుట్టూ గిరికీలు కొట్టే “నేను” కలగాపులంగా ఝుమ్మని లేచాయి కందిరీగల్లా నామనసాకాశంలో.

000

(జులై 2007)

విధీ, హతవిధీ!

మాకాండోలో రిపేరొచ్చిందని మామానేజరుని పిలిచేవరకూ నాకువిధి వైపరీత్యాలగురించిన ఆలోచనలు రాలేదు.
వంటింట్లో కొళాయి చుక్కలు చుక్కలుగా కారుతుంటే మామానేజరుకి ఫోను చేశాను. నాకసలు ఫోనులో మాటాడ్డం సరిపడదు. నామాట వాళ్లకర్థం కాదు, వాళ్లమాట నాకర్థం కాదు పెళ్లిమంత్రాల్లాగే. మమ అనమన్నప్పుడల్లా మమ అనేసి వూరుకోడమే.
Continue reading “విధీ, హతవిధీ!”