ఫేస్బుక్కులో పోస్టులు 4 (కవితలు)

నన్ను నన్నుగా నిలబెట్టినవి!

గగనసీమలకెగసిన మహావృక్షం

దిగంతాలకు పరుచుకున్న మహార్ణవం

హృదయవైశాల్యాన్ని చాటుతున్న ఆకాశం

భూమిని కరిచిపట్టుకున్న పర్వతశ్రేణి

నాఅస్తిత్వానికి గురుతులయి శోభించేయి

ఉన్నచోట ఉన్నట్టు

 నన్ను నన్నుగా నిలబెట్టేయి.

(ఆగస్టు 5, 2021)

తా.క. మామూలుగా మన అల్పత్వాన్ని గుర్తు చేస్తాయి అనుకోవచ్చు. కానీ నాకు అలా అనిపించదు. వీటిని చూసినప్పుడు మరింత ధైర్యాన్ని, ఆత్మనిగ్రహాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని చెప్పడానికి ప్రయత్నించేను.

000

దుఃఖం

 నన్ను లోలోపలి చీకటిగుహలోకి లాక్కుపోతుంది

నాచూపుని గుండెలోతుల్లోకి మళ్ళిస్తుంది.

శ్రేయోభిలాషుల ఓదార్పుల్లా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది

కుండపోతగా కురిసిన జడివానై, వెల్లువై 

మూలమూలలా నక్కిన కల్మషాన్ని ప్రక్షాళిస్తుంది.

మబ్బు విడినఎండలా తేజోవంతమవుతుంది.

Phoenixలా బుగ్గిలోనించి ఉత్థానిస్తుంది.

విరిగిపడ్డ ఉత్తుంగతరంగంలా మళ్లీ పైకి లేస్తుంది.

దుఃఖానికి మించిన మందు లేదు మనోవికారాల ప్రక్షాళనకి.  

000

(ఆగస్ట్, 2021)

000

నాకలం

మనసుచీకటికోణాల్లో దాగిన “నేను” నాకలం.

ఎదురుపడి చెప్పలేని భావాలు ఒలికిస్తుంది 

నోట పలుకని వేదన రూపిస్తుంది.

ఆప్తమిత్రమై అనునయిస్తుంది.

ఆతెలిమబ్బులచాటున ఎనలేని మర్మాలు

ఆ మొగ్గలు రేపటి రోజాలు

రాత్రినుంచి పగటికీ, పగటినుంచి రాత్రికీ

నిరంతరప్రయాణం.

(ఆగస్ట్ 6, 2021)

000

(ఆగస్ట్ 20, 2021)