బహుభాషాకోవిదులు అయిన తెలుగు రచయితలు

ఇంగ్లీషు ప్రాచుర్యం హెచ్చి, తెలుగు రాని తెలుగువారిసంఖ్య ఎక్కువవుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది ఇంగ్లీషుమాధ్యమంలో చదువు కారణంగా చెప్తున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాల్లోనూ  పెరగడం కారణం అంటారు.

నేను కాలేజీచదువు మొదలయేనాటికే ఇలాటి కారణాలు ప్రాచుర్యం మొదలయేయి. అయితే చిన్న తేడా  ఉంది. అప్పట్లో కూటికోసం ఇంగ్లీషు చదివినా తెలుగు మనభాష కాకుండా పోదు అనే అనుకున్నాం. అలా  అనుకోని వాళ్ళు కూడా కొందరు ఉన్నారేమో. ఆ తరంలో అలా అనుకోని తల్లిందడ్రులు పిల్లలకి ఇంగ్లీషు  తప్పనిసరిగా అలవాటు చేయాలనో, ఇంగ్లీషు రాజభాష అనో తెలుగుని నిర్లక్ష్యం చేసేరు. ఇది స్పష్టంగా  తెలిసింది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి  ఎ-ఖ్ఖ-డా లంగరందలేదు కథ  చదివినప్పుడు.  “ఎక్కడా” గుణింతాలకి నన్ను  తప్పు పట్టకండి, రచయిత అలాగే రాసేరు.

పది రోజులక్రితం ప్రముఖరచయితలలో ఇతరభాషలు నేర్చినవారి సమాచారం తరిచి చూసేను. ఒక తరం  రచయితలు చాలామంది ఇతరభాషలలో శ్లాఘించదగ్గ ప్రావీణ్యం సంపాదించేరు. నాకు తెలిసినవారు,  ముఖపుస్తకంలో నేస్తాలు ఇచ్చిన సమాచారం ఇక్కడ ఇస్తున్నాను. నిజానికి వీరిలో కొందరు ఇంకా ఎక్కువ భాషలు కూడా నేర్చి ఉండవచ్చు. మీకు తెలిసిన ఇతర రచయితలగురించి వ్యాఖ్య పెట్టెలో పెట్టవచ్చు.  దయచేసి  తెలుగులో రాయండి.  ఇంగ్లీషు లిపిలో  రాసినవి మళ్ళీ  తెలుగులోకి  అనువదించుకున్నప్పుడు  పొరపాట్లు  వచ్చే  అవకాశం ఎక్కువ.

పోతే, వెనకటి తరాలరచయితలు వేరే భాషలు అంత పట్టుదలతో ఎలా నేర్చుకోగలిగేరు అని కూడా  ఆలోచించేను. నాకు తోచిన విషయం – పురిపండా అప్పలస్వామిగారు, పుట్టపర్తి నారాయణాచార్యులుగారి వంటి  కోవిదులు సాహిత్యానికి తమ జీవితాలను సంపూర్ణంగా అంకితం చేసినవారు. సాహిత్యమే జీవితంగా  జీవించినవారు. వారి మిత్రులు సాహితీమిత్రులు మాత్రమే కూడా కావచ్చు. ఇది ఖచ్చితంగా చెప్పలేను కానీ నాకు అలా అనిపిస్తోంది. వారు బహుముఖ ప్రజ్ఞాధురీణులే కానీ ఈనాడు చెప్పుకున్నట్టు multi-taskers కారు.

ఇంచుమించు అదే తరంలో మొదలు పెట్టినా, చలం, కుటుంబరావు వంటివారు పాశ్చాత్యభావజాలంమీద  దృష్టి పెట్టి, భాషకి వేరే రకమైన ప్రాధాన్యం ఇచ్చేరు. వ్యావహారిక భాష వారికి అభిమానభాష అయింది కానీ అది తెలుగే.

కింద ఇచ్చిన జాబితాలో పి.వి. నరసింహారావుగారు అత్యున్నత పదవిలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ  అనేక భాషలు నేర్చి తమ సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు. అలాగే  బలివాడ కాంతారావుగారు Indian Naval Serviceలో ఉద్యోగం చేస్తూ ఇతర భాషలు నేర్చినవారు.

20వ శతాబ్దం ఉత్తరార్థంలో మొదలయిందనుకోవచ్చు, ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు హెచ్చిపోవడం,  తెలుగు మాటాడితే తంతాం అనడమూను.

ఇవన్నీ నాకు తోచిన అభిప్రాయాలు. నేను పరిశోధనలు జరపలేదు, ఎలాటి ఋజువులూ సాక్ష్యాలూ లేవు. సాధికారకంగా ఎవరైనా చెప్పగలిగితే, వారికి ముందే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

ఇంతవరకూ నాకు అందిన సమాచారం ఇది. ఈ జాబితాలో ఇంగ్లీషు వచ్చినవారిని చేర్చలేదు. ఇంగ్లీషు ఇప్పుడు చాలామందికి అలవాటయిపోయింది కనక, వారిపేర్లు చేరిస్తే జాబితా అలివి కానంతగా పొడుగు అయిపోవడమే తప్ప నేను ప్రతిపాదిస్తున్న వాదనకి అధికంగా బలం చేకూరదన్న ఆలోచనతో.

ఇతర భాషలలో ప్రావీణ్యం సంపాదించిన రచయితలజాబితా –

– భండారు అచ్చమాంబ – తెలుగు, ఇంగ్లీషు హిందీ, గుజరాతీ.

– ఇల్లిందల సరస్వతీదేవి – ఇంగ్లీషు, హిందీ

– పి.వి. నరసింహారావు – ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17భాషలు  వచ్చు. COBOL, BASIC and Unix programming వంటి మెషీను భాషలు కూడా నేర్చారు.

– పుట్టపర్తి నారాయణాచార్యులు – తమిళ, కన్నడ, మళయాళం, తుళు, ఫ్రెంచ్, పెర్షియన్.

— నారాయణాచార్యులుగారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మినిగారు అందించిన సమాచారం ప్రకారం “పైనుటంకించిన భాషలేకాక, అవధీ (తులసీదాస్ రామయణం) బ్రజ్ (సూరదాస్, రసఖాన్ మొదలైన వారు) కబీర్ దోహాల హిందీ (పాత అవధీ, బ్రజ్, భోజ్ పురీ భాషల మిశ్రమం ) పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషల్లో  కూడా మంచి ప్రావీణ్యం ఉండేది. అయ్య యెటువంటి అవకాశాలూ, ఆధారాలూ లేని ఆ రోజుల్లోనే ఇన్ని  భాషల్లో ప్రావీణ్యం సంపాదించటం అత్యంతాశ్చర్యకరం కదా !” (పుట్టపర్తి నాగపద్మిని లేఖ)

– రోణంకి అప్పలస్వామి – ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక్, హిబ్రూ, ఇటాలియన్.

– సూర్యదేవర సంజీవదేవ్ – హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచ్, జపానీస్.

– బలివాడ కాంతారావు – తెలుగు, ఇంగ్లీష్, బెంగాలి, హిందీ, ఒరియా.-

–  మధురాంతకం రాజారాం , కథా రచయిత. కన్నదాసన్ గారి అర్థముళ్ళ హిందూమతం పుస్తకాన్ని తమిళంనించి తెలుగు లోకి అనువదించిన వారు.  (జిలేబీ గారిద్వారా ఈరోజు అందిన సమాచారం. 8-16-2016)

ఇతర ప్రాంతాలలో నివశిస్తున్న తెలుగువారు అక్కడి భాష నేర్చుకుని అనువాదాలు చేసినవారున్నారు.  వాసిరెడ్డి సీతాదేవి హిందీలోకి అనువదించేరనుకుంటాను. సరిగా జ్ఞాపకం లేదు. శర్వాణి కన్నడనుంచి తెలుగులోకి చేసిన అనువాదాలు సుప్రసిద్ధం. ఆర్. శాంతసుందరి తెలుగులోంచి తమిళంలోకి అనువదిస్తున్నారు.  ఇటీవల బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి కథలు హిందీ, కన్నడ, తమిళం భాషలనుండి తెలుగులోకీ, తెలుగు కథలు ఆ హిందీ, కన్నడలోకీ అనువదిస్తున్నారు.  ఆచంట హైమావతి  కన్నడనుంచి తెలుగులోకి  అనువదిస్తున్నారు. ఇంకా అనేకులు ఉండవచ్చు.  రాధ మండువ తమిళకావ్యాలు తెలుగులో పరిచయం చేస్తున్నారు.  బ్లాగరు జిలేబీ తెలుగు, తమిళ భాషలలో బ్లాగు నడుపుతున్నారు.

ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది భాషాభిమానం ఉండాలే కానీ నేర్చుకోడం కష్టం కాదనే. నిజానికి  ముఖపుస్తకం ప్రవేశించేకే తెలిసింది అట్టే పెద్ద చదువులు చదవనివారు కూడా కంప్యూటరులో తెలుగులిపి నేర్చుకుని తెలుగులో టైపు చేస్తున్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, డెవలపర్లు మాకు తెలుగు రాదంటున్నారు, విచిత్రం!

ఇంకా ఇతరభాషలవారు తెలుగు నేర్చుకుని తెలుగులో సాహిత్య చేసిన వారు శారద కలంపేరున రచనలు చేసిన తమిళుడు నటరాజన్, తెలుగులో రచనలు చేస్తున్న తమిళుడు యల్. ఆర్. స్వామి.

తెల్లారితే స్వతంత్రదినం కదా. మాదీ స్వతంత్రభారతదేశం అని పాడుకుంటే సరే, కానీ భాషాదాస్యంనుండి విముక్తి కూడా ప్రకటించకూడదూ?

ఈ విషయంలో సరస్వతీపుత్రులు పుట్టపర్తి నారాయణాచార్యులుగారి వాక్కు ఇక్కడ

ఇప్పటికీ టంగుటూరి సూర్యకుమారిగళంనుండి ఈ గీతం వింటే నాగుండె ఝల్లుంటుంది.  చాలామంది మాతెలుగుతల్లికి మల్లెపూదండ చెప్తారు కానీ నన్ను ఆకట్టుకున్నది ఈ గీతమే. https://www.youtube.com/watch?v=RKG-ZosQIa4

స్వాతంత్ర్యదినం కనక మాదీ స్వతంత్రదేశం మరోమారు తలుచుకుంందాం. బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఇక్కడ కనిపించడం చాలా ఆనందంగా ఉంది.

https://www.youtube.com/watch?v=MFiGCHeDkqM

000

గమనిక – ఎంత ప్రయత్నించినా ఫార్మాటింగ్ సరిగా కుదరడం లేదు. పెద్దమనసు చేసుకుని మన్నించగలరు.

(ఆగస్ట్ 14, 2016)