ఆచంట శారదాదేవి కథల్లో శిల్పసౌందర్యం -మొదటిభాగం

రాసినవి చిన్నకథలే అయినా, అవి ఆరు డజన్లకి మించకపోయినా, తెలుగు కథాసాహిత్యంలో ఒక విశిష్ఠ స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి ఆచంట శారదాదేవి. రాసి కాదు వాసి ప్రధానం అనడానికి సాక్ష్యం ఆవిడ సాహితీ ప్రస్థానం. “ఆచంట శారదాదేవి కథల్లో శిల్పసౌందర్యం -మొదటిభాగం” ‌చదవడం కొనసాగించండి

సిలకమ్మ కథలసంకలనం సమీక్ష

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి డా. వాసా ప్రభావతిగారి కథల సంకలనం, సిలకమ్మ కథలమీద నా  సమీక్ష పుస్తకం.నెట్ లో చూడండి.

http://pustakam.net/?p=728

ఊసుపోక – మరో యేడూ, కొత్త ప్రమాణాలూ

 (ఎన్నెమ్మ కతలు 26)

మామూలుగానే వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగడం నాఅలవాటు. కానీ నూతనసంవత్సరం నాడు అందరూ ప్రతిజ్ఞలు చేస్తారు కదా. అంచేత ఈసారి నేనూ చేద్దాం అనుకున్నాను. చూసారా ఇది కూడా ఒక ఆలోచనకి ఆరంభమే!

వెనకటిరోజుల్లో కాశీ వెళ్లినవాళ్లు “ఊసుపోక – మరో యేడూ, కొత్త ప్రమాణాలూ” ‌చదవడం కొనసాగించండి

ఊసుపోక – “కలం బలం” అంటే నవ్విపోయే రోజు వచ్చెనా?

(ఎన్నెమ్ కతలు 25)

 నాచిన్నప్పుడు స్కూళ్లలో వక్తృత్వపోటీలకి కలం బలమా కత్తి బలమా అన్న విషయం తరుచూ తీసుకునేవారు. విద్యార్థులు అమాయకత్వంచేతా, పంతులిగారి కటాక్షం ఆశించీ కలం బలం అన్నవాదనకే ఎక్కువగా మొగ్గు చూపేవారు. “ఊసుపోక – “కలం బలం” అంటే నవ్విపోయే రోజు వచ్చెనా?” ‌చదవడం కొనసాగించండి

రచయితలు పాత్రల్ని ఎందుకు చంపుతారు?

 కథల్లో చావుగురించి చాలాకాలంగా రాయాలనుకుంటున్నాను. నాకు మొదటిసారిగా ఈ ఆలోచన వచ్చింది తెలుగు రచయిత్రులమీద నేను పుస్తకం రాయడంకోసం కథలూ, నవలలూ చదువుతున్నప్పుడు. ఆరోజుల్లోనే నాకథల్లో ఎంతమందిని హత్య చేశానో కూడా చూసుకున్నాను. అదృష్టవశాత్తు అట్టే లేవు. ప్రధానపాత్రలే చనిపోయినవి మూడు కథలు. 

నేను 2002లో తురగా జానకీరాణిగారిని కలిసినప్పుడు, మాటలసందర్భంలో, ఒక పేరుగల రచయిత్రి సుబ్బయ్య చచ్చిపోయాడు అంటూ మొదలుపెట్టారు. చచ్చిపోయింతరవాత కథ ఏముంటుంది? కథ అలా మొదలపెట్టకూడదు, అన్నారావిడ..

నేను అప్పుడు ఆవిడతో వాదించలేదు కానీ తరవాత ఆలోచిస్తే మానవసమాజంలో చావు కథకి ముగింపు మాత్రమే కానక్కరలేదు అనిపించింది. ఒకరోజు నేను ఇల్లిందల సరస్వతీదేవిగారి సంకలనం చూస్తుంటే ఒక కథ కనిపించింది రంగయ్య చచ్చిపోయాడు అన్నవాక్యంతో కథ మొదలవుతుంది. ఒకకుంటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినతరవాత, ఆస్తికోసం కుటుంబంలో వచ్చే కలహాల మీద కథ అది. అంటే ఆ చావు జరిగితేనే ఆకథ నడుస్తుంది. లేకపోతే కథ లేదు.

అలాగే కాళీపట్నం రామారావుగారు రాసిన చావు కథలో ఒక కటికదరిద్రుల కుటుంబంలో ఓ ముసలమ్మ చనిపోతే, శవాన్ని తగలపెట్టడానికి కట్టెలకోసం పడే అవస్థలు. అంటే మళ్లీ ఇక్కడ కూడా చావు లేకపోతే కథ లేదు.

బండి నారాయణస్వామి కథ సావుకూడు, పురాణం సూర్యప్రకాశరావు కథ కాకులు కూడా ఒక మనిషి పోయినతరవాత జరిగే, జరపవలసిన కర్మకాండ.

ఒకొకపుడు కథల్లో చావు ప్రధానాంశం కాకపోయినా, ముఖ్యభాగం కావచ్చు.

నాకథలు మంచుదెబ్బలో వకుళ, నవ్వరాదులో కమలిని చనిపోతారు. ఈపాత్రలని ఎందుకు చంపేను అంటే నిర్దుష్టంగా ఇదీ కారణం అని చెప్పలేను కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కారణాలుగా తోచినవి చెప్తాను.

మంచుదెబ్బ కథలో ప్రధానపాత్రకి ఆధారమయిన అమ్మాయి నిజజీవితంలో చనిపోలేదు. ఆతరవాత బిడ్డతల్లి అయిందని కూడా విన్నాను.  ఆవిషయంమీద కూడా ఆమెని కించపరచే భాషణలు కొన్ని విన్నాను. నిజంగా ఏంజరిగిందో నాకు తెలీదు. కేవలం పుకార్లు ఆధారంగా ఒక మనిషిని కించపరచడం నాకు ఇష్టం లేకపోయింది. అది ఒక కారణం కావచ్చు.  నేను సృష్టించిన పాత్రమీద నాకు కలిగిన గౌరవం, అభిమానం కావచ్చు. పోతే, వరసగా కొన్ని సంఘటనలలో నిస్సారమయిన జీవితాన్ని చూపించిన తరవాత కథ ఎలా ముగించడం? ఆపాత్ర గడుపుతున్న జీవితం దృష్ట్యా చూస్తే ఆమె జీవచ్ఛవం. బతికున్నా చచ్చినమనిషితో సమానం. ఇక్కడ చావు ఒక ముగింపుగా చూపడం ఒక ప్రతీకగా మాత్రమే అని చెప్పుకోవాలి. దాన్ని సాంఘికప్రయోజనంకథ చెయ్యాలంటే, వకుళ భర్త తన తప్పుని గ్రహించి, ఆ అమ్మాయికి విడాకులిచ్చి, ఇంకా కావాలంటే తనే మరో పెళ్లి కూడా చేయించేయొచ్చు. సుమారుగా అదే అర్థం వచ్చే కథ ఒకటి నేను ఈమధ్యనే చదివేను. అందులో నాకు తోచిన లోపం ఏమిటంటే వకుళపాత్రలాటి పాత్రని వ్యక్తిగా గౌరవించి ఆమె అభిప్రాయం అడక్కపోవడం. సంఘసంస్కరణపేరుతో సంస్కర్తే నిర్ణయాలు చేసేయడం. ఇంతకీ నాకథలో అలా చెయ్యకపోవడానికి కారణం 60వ దశకంలో అది వాస్తవం కాదు నేను చూసిన ప్రపంచంలో.

నవ్వరాదు కథలోనూ అంతే. కమలిని తాను అందర్నీ నవ్వించడమే కానీ తనని నవ్వించేవాళ్లు ఎవరూ లేరు అని తెలుసుకున్న తరవాత కథ ఎలా నడపడం? ఎంతదూరం నడపగలం? ఎంత రాసినా అదే సందేశం. అలాటి సంఘటనలే మళ్లీ మళ్లీ రాయాలి. వకుళ లాగే, కమలిని కూడా బతికున్నా చచ్చినవారితో సమానం. మరో కారణం ఆపాత్రసృష్టికి ఆధారమయిన వ్యక్తి నిజజీవితంలో చనిపోవడం. అంచేతే ఆముగింపు ఇవ్వడం జరిగింది అనుకుంటాను. రెడీమేడ్ జవాబు వుండడంచేత నేను ఎక్కువగా ఆలోచించలేదేమో.

మరొక కోణం ఏమిటంటే ఆరోజుల్లోఅంటే 50, 60 దశకాల్లో చాలా కథల్లో చావు కనిపిస్తుంది. ఒకొకప్పుడు అనవసరంగానే. ఆనాటికీ ఈనాటికీ కాలగతిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. సంఘంలో, స్త్రీచైతన్యంలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ మార్పు కథలని తీర్చి దిద్దడంలో,  ముగింపులు ఇవ్వడంలో కూడా కనిపిస్తుంది.

సుజాత (మనసులోమాట) రాసిన నీలమ్మకథ చూడండి. అదే కథ మాకాలంలో (50, 60 దశకంలో) రాసివుంటే, నీలమ్మ ఆత్మహత్య చేసుకున్నట్టు  ముగించే అవకాశాలే ఎక్కువ. ఈనాడు నీలమ్మ తాను బతికి వుండి, తనపిల్లలికి ఒక మార్గం కల్పించడానికి నిర్ణయించుకున్నట్టు చూపించడం జరిగింది. అలా చిత్రించడంలో సంఘాన్ని ధిక్కరించగల మనోదారుఢ్యం ఆపాత్రకి కల్పించడం జరిగింది. దాన్ని నైతికపతనం అనను నేను. ఆవిధమయిన నిర్ణయం తీసుకోడానికి తగిన వాతావరణం కూడా ఈనాడు వుంది. ముఖ్యంగా ఈరోజుల్లో స్వేచ్ఛపేరుతో పదవీవ్యామోహాలతో హైక్లాస్ జనాల్లో  జరుగుతున్న నాటకాలు చూస్తే, వాళ్లకంటే నీలమ్మే నయం అనిపిస్తుంది.

ఒకొకపుడు చావే ప్రధానఘట్టం కాకపోయినా, కథలో ఒక ముఖ్యమయిన సంఘటన అవుతుంది. అంటే ఆ పాత్ర చనిపోతే కథ ఓ దారిలో నడుస్తుంది. చనిపోకపోతే మరోరకంగా నడుస్తుంది అన్నమాట.

శివుడాజ్ఞ కథ చూడండి. చావు ఒక ముగింపుగా రాద్దాం అన్న ఆలోచన నాకు మొదటినుండీ వుంది. మీరేం అంటారో చూద్దాం అని మిమ్మల్ని అడిగేను. 

చదువరి అత్తయ్యగారి మరణం సూచించినా, అది శాడిస్టిక్గా వుంటుందేమో అని సందేహం కూడా వెలిబుచ్చారు వెంటనే. దారిలో కారుప్రమాదం జరిగి సుమన అత్తయ్యగారిని చూడడం పడకపోయివుండొచ్చు అని ఒక పాఠకురాలు సూచించారు. ఇది నామొదటి కథకి అనుగుణంగా వుంది. ఒక సన్నివేశం కథలో సుమన అత్తయ్యగారల సమావేశం జరగకపోవడానికి కారణాలు అనేకం. అమెరికాలో ప్రమాదాలు సర్వసాధారణం.

 శివుడాజ్ఞ కథ రెండోకథలో అత్తయ్యగారు చనిపోయినట్టే రాసి తెలుగుజ్యోతిలో ప్రచురణకోసం, సంపాదకవర్గంలో ఒకరైన వైదేహికి పంపించేను.

తను వెంటనే ఫోను చేసి, అదేంటండీ అత్తయ్యగార్ని అలా చేసారు. చదవగానే కొంచెం బాధేసింది” అంది.

ఆపైన ఇంకో కారణం కూడా చెప్పింది. అత్తయ్యగారు ఇంకా వున్నట్టే చూపిస్తే, ఆవిడతో ఇంకా చాలా కథలు రాయొచ్చు కదా. ఇప్పుడే ముగించేస్తే తరవాతేం చేస్తారు? అంది.

నేను సీరీస్ రాయాలనుకోడంలేదు. ఒకవేళ రాయాలనుకుంటే, సుమన గతాన్ని నెమరు వేసుకుంటున్నట్టు ఫ్లాష్బాక్లో రాయొచ్చు కదా అన్నాను.

అవుననుకోండి. అయినా నాకు బాధేసింది,అంది వైదేహి.

 పై సమాధానం ఇచ్చానే కానీ నాకు ఒక అభిమాన పాఠకురాలిని నొప్పించడం ఇష్టం లేకపోయింది. అంచేత అత్తయ్యగారిని ఆస్పత్రిలో పెట్టేశాను. కర్ర విరక్కుండా, పాము చావకుండా.

నాలుగురోజులతరవాత మళ్లీ మాటాడుకుంటున్నాం. వైదేహి మాటలసందర్భంలో మా చిన్న మేనత్త చాలా బాగా కధలు చెప్పేవారు, ముఖ్యంగా కాశీమజిలీలు, బొమ్మలు చెప్పిన కధలూ. ఆవిడ ప్రతి చిన్న విషయాన్ని వివరంగా వర్ణిస్తూ,కధలో కధ ,కధలో కధ గా ఎన్నో కధలు చెప్పేవారు. మేం పిల్లలందరం చెవులు రిక్కించుకుని కదలకుండా బొమ్మల్లాగా వినేవాళ్ళం” అంటూ ఒక్క క్షణం ఆగింది.

అందుకే నీకు అత్తయ్యగారంటే అంత ఇష్టం అయింది,అన్నాను నేను.

ఓ, కావచ్చుఅంది తను.

కథల అత్తయ్యగారి పాత్రద్వారా Unconsciousగానే కావచ్చు తనకి ఆ మేనత్త తాలూకూ జ్ఞాపకాలు  మనసులో మెదిలేయి. అంచేత నాకథలో పాత్ర తనకి ప్రేమపాత్రురాలయింది. సాధారణంగా పాఠకులు పాత్రలకి చేరువ కావడం, పాత్రలమీద అభిమానాలు పెంచుకోడం, ఇలాగే కదా జరుగుతుంది.

ఇహ పోతే, నేను ఎందుకు అత్తయ్యగారు చనిపోయినట్టు చూపాలనుకున్నానో కూడా సూక్ష్మంగా చెప్తాను. మానవనైజం ఒకటుంది. కథలు చదువుతున్నప్పుడు పాఠకులస్పందన ఏస్థాయిలో వుంటుందన్నది సంఘటనని బట్టి వుంటుంది. సంఘటన ఎంత బలంగా వుంటే, ముద్ర అంత బలంగా పడుతుంది. అందుకే సినిమాల్లో, టీవీలో హింస పెరిగిపోతోంది. ప్రతి డైరెక్టరూ మరింత భయానకంగా, మరింత భీభత్సంగా సీనులు సృష్టిస్తున్నారు.

ఒక పాత్ర చావు కూడా అలాటిదే. కేవలం చర్చకోసమే అనుకోండి. రెండో శివుడాజ్ఞకథలో ఇద్దరూ కలుసుకున్నారు, సంతోషంగా ఆపూట గడిపేశారు అంటే బాగానే వుంటుంది. మరో వ్యాఖ్యాతని తృప్తి పరచడానికి అత్తయ్యగారు సుమనని నొప్పించే ప్రశ్నలేవీ అడగలేదని కూడా రాయగలను. కానీ నాదృష్టిలో అది కథ కాదు. వెబ్లాగ్ అవుతుంది. పాఠకులని చావు కదిలించినట్టు అది కదిలించదు. అందులో కథ అయిపోయింతరవాత పాఠకులని కదిలించే గుణం, పట్టుకు వదలని గుణం వుండదు.

నాకథలో సుమనా, అత్తయ్యగారూ పదే పదే కలుసుకునే పరిస్థితులు లేవు. జీవితంలో కొన్ని సంఘటనలు ఒకసారి మాత్రమే జరుగుతాయి. ఒకవేళ అత్తయ్యగారు గ్రీన్ కార్డు తెచ్చుకుని అమెరికాలో స్థిరపడిపోయినా, దరిమిలా ఇక్కడి నాగరీకానికి కూడా ఆవిడ అలవాటు పడిపోతారు. మరోరకంగా వారిద్దరిమధ్యా  అభిమానాలు తిరిగీ మొదలవొచ్చు కానీ అచ్చంగా అలనాటి ఆప్యాయతలు పునరుద్ధరింపబడడం జరగదు. ఆనాటి స్నేహం శాశ్వతంగా ముగిసిపోయింది అత్తయ్యగారి మరణంతో అని చెప్పడం నాఅభిప్రాయం.

చావు ఒక ముగింపు అన్న విషయానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా మరోవిషయం కూడా చెప్పాలి.   

నేను కథ ఎందుకు రాస్తానంటే రెండు కారణాలు. మొదటిది అందరికీ తెలిసినవిషయమే అయినా చాలామంది పట్టించుకోనిది పాఠకులదృష్టికి మరోసారి తీసుకురావాలి అనుకున్నప్పుడు.

రెండోది ఒక కొత్త కోణం ఆవిష్కరించాలనుకున్నప్పుడు. అంటే, ఈనాటి మనస్తతత్త్వాల దృష్ట్యా ఒక విషయం ఎవరూ గమనించడంలేదు అని అనిపించినప్పుడు.

ఉదాహరణకి, ఈనాటి నాగరీకతలో మ నం మాటాడుకునే తీరులో చాలా గొప్ప మార్పు వచ్చింది. ఎవరు ఏం మాటాడాలో ఎలా మాటాడాలో టీవీగురువులు చెప్తున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంటు పుస్తకాలు నేర్పుతున్నాయి.

రెండు తరాలకి ముందులాగ, అమాయకంగా, నిష్కల్మషంగా మనసు విప్పి మాటాడుకోడం తగ్గిపోతోంది. కానీ ఇంకా అక్కడా అక్కడా అలాటివారు వున్నారు. వారు తమకి తోచిన విషయాలు తమకి తెలిసిన భాషలో మాటాడతారు. వాళ్ల ప్రపంచం చిన్నదే కావచ్చు. వారి భాష నవనాగరీకం కాకపోవచ్చు. అంతమాత్రంచేత వాళ్లని పరమదుర్మార్గులనో మూర్ఖులనో అనుకోడం న్యాయం కాదు అని చెప్పాలనిపించినప్పుడు రాస్తాను.

నాకథలో జరిగింది అదే.  సుమన అది అర్థం చేసుకుంది అని చెప్పాను అత్తయ్యగారు రాసివుండగల ఉత్తరం తనే రాయడం ద్వారా.

 

 

(డిసెంబరు 2008.)