కథపరిధి దాటి స్వయంప్రతిపత్తి సాధించుకున్న సజీవపాత్రలు

నేను ముఖపత్రంలో “రచయిత జీవితకాలం దాటి సజీవంగా ఉన్న పాత్రలు మీకు తెలిసినవి చెప్పండి” అని అడిగేను. అక్కడ నేను నాప్రశ్న సరిగా వ్యక్తం చేయలేదు అనుకుంటాను. అంచేత ఇక్కడ వివరంగా రాస్తున్నాను. నేను అంటున్నది రచయితజీవితకాలం అని కాదు. సాధారణంగా కథలూ, పాత్రలూ కూడా రచయితకి ప్రాముఖ్యం తెస్తాయి. కదాచితుగా కొన్ని పాత్రలు మాత్రం రచయితని వదిలేసి స్వయంప్రతిపత్తిని సంతరించుకుంటాయి. ఉదాహరణకి, గిరీశాన్ని చెప్పుకోవచ్చు. “డామిట్ కథ అడ్డం తిరిగింది,” “నాతో మాటాడ్డమే ఓ education,‘’లాటి వాక్యాలు కన్యాశుల్కం రాయకముందు కూడా వ్యావహారికంలో లేకపోలేదు. కానీ ఆ వాక్యాలు ఆ పాత్ర పలికిన వాక్యాలుగా సమాజంలోకి చొచ్చుకుపోయి. అసాధారణమైన ప్రాచుర్యం పొందింది ఆ నాటకం వచ్చిన తరవాతే. దానికి ప్రధానకారణం అప్పారావుగారు ఆ పాత్రని అత్యంత వాస్తవికతతో అసామాన్యమైన నిబద్ధతతో తీరిచి దిద్దడం అని వేరే చెప్పఖ్ఖర్లేదు. అయితే గిరీశం పాత్ర తెలుగువారికి ఒక వాస్తవంగా పరిణమించింది అన్నది కూడా అంతే వాస్తవం. అలాగే మధురవాణి, బుడుగు, సీగేనపెసూనాంబా, రెండు జెళ్ళసీత, బారిష్టరు పార్వతీశం, కాంతం, ఎంకి కూడా. ఈవ్యాసంలో రచయితలపేర్లు, ఆయా కథల లేదా నవలలపేర్లు బుద్ధిపూర్వకంగానే వదిలేస్తున్నాను. ఇక్కడ ఉదహరించిన పేర్లు మీరు గుర్తించలేకపోతే ఆ పాత్రలకి స్వయంప్రతిపత్తి రాలేదనే నా నిర్ణయం. ఇక్కడ మనం గమనించవలసిన మరో ముఖ్యమైన కోణం ఈ పాత్రలన్నీ ఏదో ఒక కోణానికి మాత్రమే ప్రతీకలుగా నిలిచేయన్నది.

ఇప్పుడు నాదగ్గర ఈ పుస్తకాలేవీ లేవు కనక వీటికి సంబంధించిన ఉదాహరణలేమీ ఇవ్వలేను. అందరికీ తెలిసిన పురాణాల్లోంచి తీసుకుంటే, “ఆయన ధర్మరాజులాటివాడు” అన్న వాక్యం చూడండి. ధర్మరాజు ఉత్తముడు, ధర్మరక్షకుడు అనే ప్రతీతి. ఆయన చేసిన అధర్మనిర్ణయాలు కానీ చర్యలు కానీ మనం గమనంలోకి తీసుకోం పై వాక్యం పలికినప్పుడు. అలాగే “హరిశ్చంద్రుడు” అంటే నిత్యసత్యవ్రతుడు అనే కానీ చంద్రమతినీ, లోహితాస్యుడినీ నానాబాధలకూ గురి చేసినవాడు అన్న ఆలోచన రాదు. నాప్రశ్న అలాటి పాత్రలు ఆధునికసాహిత్యంలో ఉన్నాయా, ఉంటే అవి ఏవి అని.

నేను యాథాలాపంగానే అడిగేను. ఆ క్షణంలో నాకు తోచినవి కాంతం, ఎంకి, సీత. నిజానికి సీత అనడం నా పొరపాటే. నేను పురాణం సీత అనుకున్నాను కానీ రెండు జెళ్ళ సీత కూడా కావచ్చు కదా. అంచేత ఒఠ్ఠి సీత అన్న పేరు కుదరదు. పోతే, ఈ పేర్లు చెప్పేక మళ్లీ మునిమాణిక్యం, నండూరి, పురాణం సృష్టించిన పాత్రలు ఇవి అని చెప్పఖ్ఖర్లేదు. అలా ఉండాలన్నమాట నాప్రశ్నకి సమాదానాలు.

నాకు వెంటనే మనసులోకి రాని మరికొన్ని పాత్రలు గిరీశం, మధురవాణి. బుడుగు, బాపూబొమ్మ, పక్కించి లావుపాటి పిన్నిగారు. వీళ్ళందరూ వాస్తవ సమాజంలోకి చొచ్చుకుపోయినవాళ్ళు. ఈ పేర్లు ఇతరకథల్లోనూ, నలుగురు కూడినప్పుడు చెప్పుకునే కబుర్లలోనూ వినిపిస్తాయి. ఆ పేర్లు విన్నప్పుడు ఆ రూపాలు మనసులో మెదుల్తాయి వాళ్ళు నిజజీవితంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ కనిపించినట్టే అనిపిస్తుంది. ఆ పాత్రలని అలా తీరిచి దిద్దిన ఘనత ఆ యా రచయితలదే నిస్సందేహంగా. పాత్రసృష్టి జరిగిన తరవాత, ఆ పాత్రలు ప్రాణం పోసుకుని ప్రజల్లోకి చొచ్చుకుపోయి, స్వయంప్రతిపత్తిని సంతరించుకోడం ఆ పాత్రల ప్రతిభే.

నా ప్రశ్నకి సమాధానంగా, నాముఖపత్ర మిత్రులు సూచించిన పేర్లలో కొన్ని – అమృతం, కోమలి, దయానిధి, కల్యాణి, ఇందిర, బారిష్టరు పార్వతీశం, నిగమశర్మ అక్క, విష్ణుశర్మ, గిరిక, ధర్మారావు, సీగేనపెసూనంబు, డుంబు, భానుమతి అత్తగారు, అప్పారావు. బహుశా వీరిని కూడా పైన చెప్పిన కోవలోకి చేర్చవచ్చు.

మిగతా పేర్లు – యుగంధర్, గణపతి, బుచ్చమ్మ, లుబ్ధావదానులు, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, పసిరిక, రత్నావళి, కిన్నెరసాని, జయద్రథుడు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, రాధాగోపాలం, రత్తాలు, రాంబాబు – నేను సూచించిన పరిధిలో రాగల పాత్రలుగా నాకు అనిపించలేదు.

ఇక్కడే మరోవిషయం కూడా నేను ఒప్పుకుంటాను. గత 40 ఏళ్ళలో నేను చదివిన కథలూ, నవలలూ చాలా చాలా తక్కువ. చదివినవి జ్ఞాపకం కూడా లేవు. అంచేత నా నిర్ణయాలు సాధికారికం కాదు. మీరు నాతో ఏకీభవించకపోతే తప్పులేదు.

అలాగే, గీత, జానకి, శారద, లీల, ఉషరాణి, రవి, శాస్త్రి, శాంతం, ముత్యాలమ్మ, శింగరాజు లింగరాజు, అప్పల్రాముడు, మూర్తి, స్వప్నరాగలీన, భగవంతం లాటి పాత్రలు గొప్పగా చిత్రించబడిన పాత్రలే అయినా అవి సమాజంలో భాగం అయేయని నాకు అనిపించలేదు.

ఈ పాత్రలన్నీ సుప్రసిద్ధ రచయితలు రాసిన కథల్లో నవలల్లో ప్రసిద్ది పొందిన పాత్రలు. అనేకమంది పాఠకుల హృదయాల్లో వాటి ప్రవృత్తి, స్వభావంమూలంగా శాశ్వతముద్ర వేసిన పాత్రలు. ఉదాహరణకి కథ అడ్డం తిరిగిందనో, నాతో మాటాడ్డమే ఒక ఎడ్యుకేషను అనో ఎవరైనా అంటే గిరీశం జ్ఞాపకం వస్తాడు. నిజానికి ఆ మాటలు తెలుగులో లేకపోలేదు. కానీ గిరీశం పాత్ర వాటికి మరో కోణం కూడా ఆపాదించింది. అలాగే బుడుగు కూడా. సాధారణంగా అలా ముద్ర పడడానికి వారి వైయక్తిక స్పందన. పాఠకులు తమ సామాజిక స్పృహ, ఊహలు, అనుభవాలమూలంగా కొన్నిపాత్రలను అభిమానిస్తారు. కథాంశం, భాష, నడవడి, చేతలు వెరసి పాఠకుడిమనసులో నిలిచిపోతాయి. అయితే ఆ కథో నవలో చదవనివారికి ఈ పాత్రలగురించి ఏమైనా తెలుసా అన్న ప్రశ్నకి సమాధానం సుముఖంగా వస్తేనే అవి రచయితనీ, ఆ పుస్తకాన్నీ దాటి సమాజంలో స్థానం సంపాదించుకున్నట్టు అని నా అభిప్రాయం. ఇతర పాత్రలు – వీరిగాడు, సంద్రాలు, వకుళ, నూకాలు, కొత్తావకాయగారి అమ్మాయి, కథల అత్తయ్యగారు విషయంలో కూడా నా అభిప్రాయం ముందు చెప్పినలాటిదే. కథలపరిధి దాటి, ఆ కథో నవలో చదవని పాఠకులకి ఈపాత్రలగురించి ఏమాత్రం తెలుసు? ఇతరత్రా ఇవి సమాజంలోనూ సాహిత్యంలోనూ కనిపిస్తున్నాయా అని ప్రశ్నించుకుంటే సమాధానం ఏమని వస్తుంది?

ఈ ప్రశ్నలకి జవాబు నాకు తెలీదు కానీ మీకు ఇది ఆలోచించదగ్గ విషయం అనిపిస్తే ఆలోచించి చెప్పండి.

000

(మార్చి 22, 2016)