స్త్రీవాదముద్ర నాకు తగదు

ఈవిషయం ఇతరటపాలలో అక్కడక్కడ నామమాత్రంగా ప్రస్తావించేను. ఇప్పుడు స్త్రీవాదరచయిత్రి అన్న ముద్ర నేను అంగీకరించను అని నిర్ద్వందంగా విశదం చేయాలని నిశ్చయించుకున్నాను. ఈ టపాలో కొంత పునరుక్తి ఉండొచ్చు.

ప్రధానంగా నాకు labels సమ్మతం కాదు. నేను ఒక వ్యక్తిని. ఒక వ్యక్తిగానే నా అస్తిత్వం అన్నది ఒక కారణం. రెండోది  labels వ్యక్తిని, అభిప్రాయాలనీ, రచనలనీ ఒక చట్రానికి పరిమితం చేసేస్తాయి. ఆ పరిమితులమూలంగా కొన్ని కోణాలు కనిపించకుండా పోతాయి. ముఖ్యంగా కథల్లో ఒక సందేశాన్నో సిద్ధాంతాన్నో ఆవిష్కరించినప్పుడు, ఆ కథలో ఇతర కథాలక్షణాలు లేదా అంగాలు అంటే భాష, నడక, ఊపు, పాత్రపోషణ వంటి అంశాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అది రచయితా, పాఠకులూ కూడా చేస్తారు. అంటే కథ కాక ఒక సిద్ధాంతాన్ని ఆవిష్కరించే రచన అయిపోతుంది. అటువంటి రచనలని నేను కథ అనలేను. ఎవరో ఓ దానయ్య ఉన్నాడనుకోండి అంటూ పేర్లు పెట్టి తమ సిద్దాంతాలని ప్రచారం చేసే సాధనగా ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. అసలు, ఈరోజుల్లో సాహిత్యచర్చలన్నీ కథలో ఇతివృత్తానికే పరిమితమయిపోతున్నాయి. రచయిత సృజనాత్మకతకి ఆదరణ కనిపించడంలేదు.

స్త్రీవాదం, అస్తిత్వవాదం, దళితవాదం ఇవన్నీ రాజకీయాలకి సంబంధించినవి. నేను చూసినంతవరకూ ఈ స్త్రీవాదం label ఈనాడు అన్ని సాంఘిక కార్యకలాపాలలాగే చర్చలకీ, వాగ్వివాదాలకీ ఉపయోగపడుతోంది. అన్ని రంగాలలోలాగే సమాజంలో పేరుప్రతిష్ఠలూ, పురస్కారాలూ సంపాదించుకోడం సుగమం అవుతోంది వీటివల్ల. ఈనాడు బహుమతులు, పురస్కారాలూ, తెలుగుకథ, 20వ శాతబ్దపు తెలుగు రచయిత్రులు వంటి సంకలనాలు చూసినా ఇదే కనిపిస్తుంది. కథని కథగా అన్ని కోణాలు సమగ్రంగా పరిశీలించి, ఇది మంచికథ అని నిర్ణయించడం ఎక్కడైనా ఉంటే నాకు కనిపించలేదు.

నేను సమాజంలో ప్రముఖంగా తిరుగుతున్నదాన్ని కాను. నేను కథలూ కవితలూ స్త్రీవాదాన్ని సమర్థించడానికి గానీ  ప్రోత్సహించడానికి గానీ రాయలేదు.  

నేను వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తాను. ప్రతి వ్యక్తీ విడిగా ఒకే ఒక వ్యక్తి. ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. నాకథలూ కవితలూ ఒక వ్యక్తి కథే కానీ స్త్రీవాదంలో ఒక మచ్చుగా కాదు. నేను మనస్తత్త్వాలు చిత్రించడానికి ప్రయత్నిస్తాను. మనిషిని మనిషిగా గుర్తించడం ఒక నైతిక విలువ. అదే నాకథలకి మూలం. నాకథల్లో స్త్రీపాత్రలని వ్యక్తిత్వంగల మనుషులుగా చిత్రిస్తాను. వాళ్లు పడుతున్న బాధలని కాక, వాటిని ఎదుర్కొని తమ వ్యక్తిత్వాలని నిలుపుకున్నవారుగానే చూపడానికి ప్రయత్నిస్తాను. స్త్రీవాదరచనలకీ నారచనలకీ ఇది ప్రధాన వ్యత్యాసం.

నవ్వరాదులో కమలిని, జీర్ణతృణంలో కనకవల్లి, చిరుచక్రంలో సింహాచలం, నిజనికీ ఫెమినిజానికీ మధ్యలో సీత – వీళ్లందరూ నిజజీవితాల్లోంచి వచ్చిన మనుషులు. జీవితపు విలువల్ని అర్థం చేసుకుని తమ వ్యక్తిత్వాలని నిలబెట్టుకున్నవారు. నా పాత్రలంటే నాకు గౌరవమే కాని జాలి కాదు. పాఠకులు కూడా అలాగే గౌరవించాలని ఆశిస్తాను.

 నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథ ఆధారంగా నన్ను స్త్రీవాదరచయిత్రి అంటున్నారు. నిజానికి ఇతివృత్యం దృష్ట్యా ఒక సామాజికసమస్యని తీసుకు రాసిన కథ మంచుదెబ్బ 1964లో రాసేను. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎవరూ ఆ కథగురించి ప్రస్తావించరు. అలా కేవలం ఒక అంశం లేదా కోణం తీసుకుని ఈ వాదాలు అంటగట్టాలంటే, విషప్పురుగు, చిరుచక్రం లాటి కథలు దళితకథలు అనుకోవచ్చు. గుడ్డిగవ్వలో ప్రధానపాత్ర ముత్యంని ఆడపిల్లగా ఆవిష్కరిస్తే అది కూడా స్త్రీవాదకథగానే చెల్లుతుంది. నిజానికి అలాటి భావం కలిగించకూడదనే, ముత్యాన్ని అబ్బాయిగా రాసేను. నేను కథలు మొదలు పెట్టిన రోజుల్లో ఇలాటి సందేహం నాకు ఉండేది కాదు.

 నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథ నేను స్త్రీవాదకథగా రాయలేదు. స్త్రీవాదంపేరున స్వప్రయోజనాలకోసం ఒకరినొకరు వాడుకునేవిధానం ఎత్తి చూపడం ఒక అంశం, రెండోది కొత్తగా అమెరికా వచ్చిన తెలుగువారికి మరొకసంస్కృతిలో ఇమడలేక పడే ఈతిబాధలు. అది ఆడవారికి మాత్రమే కాదు మగవారికి కూడా ఉంటాయని స్పష్టంగానే కథలో ఉంది.

మరెందుకు ఆకథ ఇంత భారీఎత్తు చర్చలకి గురైంది అంటే నాకు తోచిన సమాధానం ఇది – కథని కథగా చదవకుండా తమకి పరిచయం ఉన్న వ్యక్తులని ఆ కథలో పాత్రలుగా గుర్తించి వాదోపవాదాలు చేసుకోడానికి పనికొచ్చింది కనక అని. నేను రాసిన ఇతరకథలలో బాధలకు గురైన స్త్రీలున్నా ఈ విమర్శకులకళ్ళకి ఆనలేదు. కథాకథనవిధానం దృష్టిలో పెట్టుకుని ఆకథలో పాత్రలు, భాష, శిల్పంవంటి అంశాలు విశ్లేషించినవారు లేరు. అంతే కాదు. ఈ చర్చలు చేస్తున్నవారందరూ  స్త్రీవాదులే. వారు మాత్రమే నాకథలో కొన్ని సంఘటనలు మాత్రం తీసుకుని గాసిప్ కాలంలా వాడుకున్నారు. ఇంత ఖ్యాతి గడించిన ఈ కథకి ఒక్క బహుమతి కూడా రాలేదు.

ఇలా పాత్రలని నిజజీవితాలలో మనుషులుగా గుర్తించని అనేకమంది పాఠకులకి ఈ కథ ఏమీ ప్రత్యేకంగా తోచలేదు. ఆమాట నాతోనే అన్నవారున్నారు. అందుకే నన్ను స్త్రీవాదరచయిత్రి అనడం నాకు సమ్మతం కాదు అంటున్నాను. ఒక్క తరంగంతో వెల్లువ కానట్టే ఒక్క కథతో ఎవరూ ఏదో ఒక “వాదులు” అయిపోరు.

నాకథలు చదివే పాఠకులలాగే నా పాత్రలు కూడా అనేక నేపథ్యాలలోంచి వచ్చినవి. ప్రతి పాత్రా ఒక కల్పిత వ్యక్తి. పాఠకులు తమ తమ పరిస్థితులు, అనుభవాలు, ఆలోచనలనుబట్టి తమని ఆకట్టుకున్న అంశాలు స్వీకరిస్తారు. నాకు నేనై, రచయితగా ఎవరికీ సలహాలు చెప్పను, సందేశాలు ఇవ్వను. అలా చెప్పడం అంటే “నీబతుకుగురించి నీకంటే నాకు ఎక్కువ తెలుసు, నువ్విలా ఉండాలి, ఇలా చెయ్యాలి” అని చెప్పడమే. అది వ్యక్తిని వ్యక్తిగా గౌరవించకపోవడమే. ఇది స్త్రీవాదంలో మరో కోణం. ఇది కూడా నాకు సమ్మతం కాదు.

స్థూలంగా చూస్తే అనాదిగా సాహిత్యంలో రెండు శాఖలు కనిపిస్తాయి – జానపద సాహిత్యం, మేధావుల సాహిత్యం.

ఈనాడు జానపదసాహత్యానికి దీటు రాగలసాహిత్యం బ్లాగులలోనూ, ముఖపుస్తకంవంటి అంతర్జాల మాధ్యమాలలోనూ కనిపిస్తోంది. అంటే తమకి తోచింది తోచినట్టు రాసుకుపోతున్నారు. అప్పుడు మౌఖికం, ఇప్పుడు లిఖితం. అంతే కానీ వ్యక్తీకరణలో భేదం లేదు.

పండితులు, మేధావులు రాసే రచనలు, చేసే చర్చలు చదువుకున్నవారిమధ్య జరుగుతున్నాయి. అప్పుడు రాజసభల్లోనూ ఇప్పుడు పత్రికలలోనూ, అంతర్జాలంలోను. వీరే ఆ వాదాలపేరుతో చర్చలు జరిపేవారు కూడాను. సామాజికస్పృహ, సామాజికప్రయోజనం అనో మరోటో పేరు పెట్టి చేసే ఈ చర్చలూ, వాదనలూ మేధావులమధ్యనే ఉంటున్నాయి కానీ లక్షలాది సామాన్యపాఠకులకు చేరనూ చేరవు. చేరినా పట్టించుకోనూ పట్టించుకోరు. వీటికి అంతకంటే ప్రయోజనం ఉంటే నాకు తెలీదు. వీటివల్ల సామాన్యమానవుడు ఎంతవరకూ ప్రయోజనం పొందుతున్నాడు అన్నది నాకు సందేహమే.

వాదనలు వాదనలకే పనికొస్తాయి. ఆచరణలో పనికొస్తాయో లేదో చెప్పలేం. ఈఅంశం కూడా నాకథలో ఉంది – సీత తనసమస్యను ఎవరితో చెప్తే ఎలాటి సలహాలు వస్తాయో ఊహించుకుంటుంది. అలా ఊహించుకోగలగడం చాలా తేలిక. ఎందుకంటే అందరి సలహాలు పడికట్టురాళ్లలా పదిమంది చెప్పేవే అయిఉంటాయి కానీ ఏ ఒక్కరిపరిస్థితి ఏమిటో ఆలోచించి చెప్పేవి అయి ఉండవు.

చివరిమాటగా స్త్రీవాద రచయిత్రులందరూ నాకథలో సీతాపతీ, శోభాకుమారిలాటివారే అనడం లేదని గమనించగలరు. నేను మొదట్లోనే చెప్పేను ప్రతి వ్యక్తీ ఒక వ్యక్తి. మూసలో పోసి తీసిన పంచదారచిలక కాదు. అన్నివాదాల్లోలాగే  స్త్రీవాదంలో సాధారణీకరణం పాలు హెచ్చు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికిరానట్టే ఈ సాధాకరణీకరించిన సూత్రాలు విడిగా ఏ ఒక్కరికీ పనికిరావు అందరి పరిస్థితులూ, శక్తిసామర్థ్యాలూ  ఒకేలా ఉండవు కనక.  

నేను ఈ సాధారణీకరాలకి మించి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగా మాత్రమే దర్శించడానికే ఇష్టపడతాను. ప్రయత్నిస్తాను. నేను స్త్రీవాదమే కాదు ఏవాదానికి కట్టుబడి రచనలు చేయడంలేదు. అందుచేత నన్ను స్త్రీవాదరచయిత్రి అనడం సముచితం కాదు.

స్త్రీవాద కానీ మరొకటి కానీ నాకు ఏ విశేషణాలు ఇష్టమూ లేదు. అవుసరమూ లేదు.

నేను ఉత్త రచయిత్రిని. అంతే.

తా.క. నేను ఇలా చెప్పినంతమాత్రాన పాఠకులు, విమర్శకులు ఈ పేర్లు పెట్టడం మానేస్తారా అని అడగొచ్చు మీరు. మానేస్తారు అనుకునేంత అమాయకత్వం నాకు లేదు కానీ ఇంటర్వ్యూలలో అడుగుతారు కదా మీరు మీరచనలగురించి ఏమనుకుంటున్నారు అని. ఇది ఒకరకంగా అలాటి ఇంటర్వ్యూ కి జవాబు అనుకోండి.

(సెప్టెంబరు 1, 2021)