భారతనారి – నాడూ నేడూ

రచన: ఇల్లిందల సరస్వతీదేవి

ఇది చాలాకాలం క్రితమే చూసేను కానీ ఫేస్బుక్కులో రాస్తున్న పోస్టుకోసం మళ్లీ చూసేను. ఇక్కడ మీతో కూడా పంచుకోవాలనిపించింది.

ఇల్లిందల సరస్వతీదేవిగారి ‘భారతనారి – నాడూ నేడూ’ పుస్తకరూపంలో  మనకి లభించిన సుదీర్ఘవ్యాసం. 40 పేజీలలో  చారిత్ర్యకంగా వేదకాలంనుండీ ఇప్పటివరకూ మనదేశంలో స్త్రీలస్థానం ఎలా ఉండేదో, మనకాలం వచ్చేసరికి ఎలా మారుతూ వచ్చిందో అద్భుతంగా వివరించేరు సరస్వతీదేవిగారు.

ఈరోజుల్లో ఏ హక్కులకోసం పోరాడుతున్నారో అవి వేదకాలంలో ఉండేవిట. ‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి’ అంటూ మనువు ధర్మసూత్రం వల్లిస్తారు కానీ ఎవరూ ఇంట్లోనూ సమాజంలోనూ శ్రుతి, స్మృతులలో ప్రవచించిన స్త్రీలస్థానంగురించి మాటాడరు. వేదకాలంలో స్త్రీలు విద్యావంతులు,  యాజ్ఞవల్క్యుడు స్త్రీలకి ఆస్తిహక్కులు, దత్తత తీసుకునే అధికారం ఉన్నాయంటాడు. అసలు అంతకుముందే కౌటిల్యుడు క్రీ.పూ. 4వ శతాబ్దంలోనే స్త్రీలు వివాహం రద్దు చేసుకోవచ్చునని నిర్ణయించేడు.  కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పునర్వివాహానికి కూడా వీలు కల్పించేడాయన.  

అసలు వివాహసంస్థ విషయంలో కూడా పాశ్చాత్యులకీ మనకీ కొండంత తేడా ఉంది. వాళ్ళది విషయలోలుత పురస్కరించుకుని ఏర్పడ్డది. భారతదేశంలో ధర్మము మూలహేతువు అంటారు సరస్వతీదేవిగారు. విషయలోలుత అంటే భౌతికం అన్న అర్థంలో కావచ్చు. వాళ్లకి వివాహం తను, భార్య, పిల్లలకి పరిమితం. మనకి వివాహం మూడుతరాలకి విస్తరించింది. సామాజికధర్మం కూడా. సంఘసంక్షేమవిషయంలో కూడా గృహస్తుడికి బాధ్యత ఉంది. వివేకానందుడు ఉపన్యాసాలలో మనకీ పాశ్చాత్యులకీ దృష్టిలో తేడాగురించి చెప్తూ, ‘మీరు స్త్రీని స్త్రీగా చూస్తారు, మేం స్త్రీని తల్లిగా పూజిస్తాం’ అంటాడు అందుకే..

మధ్యకాలంలో మహమ్మదీయులకాలంలో స్థితిగతులు మారేయి ఆనాటి అరాచకీయ పరిస్థితులమూలంగా. అసలు ఏ శాస్త్రాలయినా ఆయా కాలాల్లో పరిస్థితులనిబట్టి ఏర్పడతాయి కదా.  మనకి స్వాతంత్ర్యం వచ్చేక రాజ్యాంగచట్టాలు తయారు చేసినప్పుడు స్త్రీలహక్కుల ప్రసక్తి వచ్చింది కానీ న్యాయం జరగలేదు. దానికి సరస్వతీదేవిగారు చెప్పిన కారణం ఆ చట్టాలు చేసినవారికి మనసంస్కృతిలో వేదకాలంనుండి స్త్రీలకి ఉన్న హక్కులగురించిన అవగాహన లేకపోవడం అంటారు. ఇంగ్లీషు చదువులు చదువుకున్న పండితులకి వేదకాలంలో స్త్రీలస్థానంగురించి తెలుసుకోగల సంస్కృత భాషాజ్ఞానం లేదు. వేదశాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్న సంస్కృతపండితులకు ఆ వేదసూత్రాలను వివరించగల ఇంగ్లీషు భాషాజ్ఞానం లేదు. దాంతో అంతా అస్తవ్యస్తం అయిపోయింది.”

సరస్వతీదేవిగారి పుస్తకం archive.org లో ఉంది. ఈపోస్టు చివర్లో లింకు ఇచ్చేను.

ఈవిషయంలో విదేశాలలో స్త్రీలస్థానంగురించి నా ఆలోచనలు కూడా పంచుకుంటున్నాను ఇక్కడ, కొంచెం శాఖాచంక్రమణమే అయినా. పోల్చి చూసుకోడానికి ఉపయోగపడవచ్చు.

“సుమారుగా పద్ధెనిమిదో శతాబ్దం మధ్యలో- అప్పటికి స్త్రీవాదం అన్న పదం వాడుకలో లేదు కానీ ఫ్రాన్సులో కార్మికులతిరుగుబాటు వచ్చింది. ఆ కార్మికులని నిరసిస్తూ Edmund Blake ఓ పుస్తకం రాసేడు. దాన్ని పూర్వపక్షం చేస్తూ, బ్రిటిష్ రచయిత్రి Mary Wollstonecraft మరో పుస్తకం Vindication of Rights of Men అని రాసి ప్రచురించింది 1790లో. ఆతరవాత మరో రెండేళ్ళకి Vindication of Rights of Women అని మరో పుస్తకం రాసింది. సమాజంలోనూ ఇంట్లోనూ స్త్రీలస్థానం, హక్కుల న్యాయాన్యాయవిచారణ చేస్తూ రాసిన ఈ పుస్తకం అనేకమంది మేధావులదృష్టిని ఆకట్టుకుంది. తన తండ్రి తల్లిని హింసించడం, ఆడవారిపట్ల హేయంగా ప్రవర్తించడంలాటివి ఆమె స్వయంగా చూడ్డం, పదిహేడేళ్ళకే స్వయంశక్తితో చదువుకోడం, బతుకుతెరువు చూసుకోడంతో ఆమెకి సమాజాన్నిగురించిన అవగాహన ఏర్పడింది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలించి, విశ్లేషించి స్త్రీల పరిస్థితి మెరుగుపరచడానికి ఉద్యమించింది. స్త్రీలకి చదువు, ఉద్యోగాలు, వివాహచట్టాలలో అన్యాయాలూ లాటి విషయాల్లో విశేషంగా కృషి చేసింది. అయితే మనం ముఖ్యంగా గమనించవలసినవిషయం – స్త్రీస్థానం సమాజంలోనూ, ఇంట్లోనూ కూడా ఘనమైనదే, గౌరవించదగ్గదే అని ఆమె అభిప్రాయం. దీన్ని తొలిదశ స్త్రీవాదంగా పరిగణించేరు తరవాత అంటే “స్త్రీవాదం” అన్న పేరు ప్రచారంలోకి వచ్చినతరవాత. ఈదశలో ఈ సమస్యలచర్చ కేవలం మధ్యతరగతి స్త్రీలకి మాత్రమే పరిమితమయింది, అది కూడా బ్రిటన్లోనే. ఒక దశాబ్దం తరవాత, 1900-1918 మధ్యలో మేధావంతులయిన స్త్రీలు అమెరికాలో వోటు హక్కులకోసం అలజడి లేవదీశారు. క్రమంగా ఇతర అంశాలు కూడా వారి పోరాటంలో చోటు చేసుకున్నాయి. కొంతవరకూ సాధించేరు కూడాను – ఆడవారికి పైచదువులూ, హైస్కూల్ విద్యావిధానంలో ఆడపిల్లలకి అనుగుణమైన మార్పులు, వివాహితులకి ఆస్తిహక్కులు, అలాగే దంపతులు విడిపోయినప్పుడు పిల్లల సంరక్షణలో స్త్రీలస్థానం లాటివి. వోటు హక్కులు మాత్రం మొదటి ప్రపంచయుద్ధం వరకూ రాలేదు.

వోటు హక్కులవిషయంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఇక్కడ ఉన్న తరతమబేధాలు. మనకి 1947వరకూ స్వాతంత్ర్యమే లేదనుకో. కానీ అది వచ్చింతరవాత వోటు హక్కంటూ వచ్చినప్పుడు, అందరికీ ఆడవారికీ మగవారికీ ఒక్కసారే వచ్చింది. అమెరికాలో అలా కాదు. ముందు ఉన్నతవర్గాలలో శ్వేతజాతి స్త్రీలకి మాత్రమే వచ్చింది. ఆతరవాత క్రమంగా, స్త్రీఉద్యమాలవల్ల నల్లవారికీ, వారిలో స్త్రీలకీ, బీదవారికీ … అలా అంచెలంచెలుగా హక్కులకోసం పోరాడవలసి వచ్చింది.

రెండవప్రపంచయుద్ధం సమయంలో మగవారంతా యుద్ధరంగానికి వెళ్ళిపోయినప్పుడు, దేశంలో కర్మాగారాల్లోనూ, ఇతర వ్యాపారాల్లోనూ పని కుంటుపడడంతో స్త్రీలని ఆ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఇది రెండోదశలో చెప్పుకోదగ్గ మలుపు.  ఆరోజుల్లోనే స్త్రీలు ఉద్యోగాల్లో అసాధారణ ప్రతిభ చూపించి, తాము మగవారికి ఏమాత్రమూ తీసిపోమనీ, ఇంకా కొన్నిచోట్ల మగవారికంటే మెరుగ్గానే చేయగలమనీ కూడా నిరూపించుకున్నారు. 60వ దశకంలో బెటీ ఫ్రీడాన్ (Betty Friedan) ప్రచురించిన పుస్తకం Feminine Mystique దేశంలో సంచలనం లేపింది. “స్త్రీలకి కేవలం మాతృత్వం, గృహిణిబాధ్యతలు మాత్రమే పరిపూర్ణమయిన సంతృప్రిని కలిగిస్తాయన్నది భ్రమ” అని ఆమె వాదం. ఈకాలంలో స్త్రీలు రాజకీయాల్లో కూడా పాల్గొనడం ప్రారంభించేరు. మధ్యతరగతిస్త్రీ స్థితిగతులతో మొదలయిన ఉద్యమం దిగువతరగతి స్త్రీలసమస్యలు కూడా తీసుకుంది. దీనికి ప్రధానకారణం ఫోర్డ్ కంపెనీలో పని చేస్తున్న స్త్రీలు తమకి మగవారితో సమానంగా జీతాలు ఇవ్వాలని సమ్మె ప్రారంభించడం. ఇది జరిగింది 1968లో. అప్పటికి బెటీ ఫ్రీడాన్ పుస్తకం వచ్చి ఐదేళ్ళయింది. అది ప్రజలలో గట్టిగా ఆలోచించేలా చేసింది. క్రమంగా ఇంటా బయటా కూడా స్త్రీలకి సంబంధించిన ఇతరవిషయాలు – స్త్రీల ఆరోగ్యసమస్యలు, ముఖ్యంగా గర్భధారణకి సంబంధించిన అంశాలలోనూ తదితరవిషయాల్లోనూ స్త్రీలకి సంపూర్ణ అధికారంవంటివి ఈ ఫెమినిస్టు ఉద్యమం రెండో దశలో చోటు చేసుకున్నాయి. ఈదశలో ప్రముఖ స్థానం వహించింది గ్లోరియా స్టైనమ్ (Gloria Steinem). కాస్త విపరీతధోరణి మొదలయింది కూడా ఇక్కడే. ఈవిడే మొదలు పెట్టిందని ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక వాక్యం “మగవాడిఅండలేని ఆడదానిబతుకు సైకిలులేని చేపబతుకులాటిది” అన్నది. ఆ తరవాత స్టైనమ్ ఆ వాక్యం తాను సృష్టించింది కాదని చెప్పినా, స్థూలంగా మగవారిపట్ల ఆమె ధోరణివల్ల ఆవాక్యం ఆమెదిగానే ప్రచారంలో ఉంది. ఇంతకీ స్త్రీలు తమ తిరుగుబాటుధోరణిని ఎంతవరకూ తీసుకుపోయేరో అన్నది తెలుస్తుంది ఇక్కడ. ఆరోజుల్లోనే ప్రస్తుతం ప్రజలు మాటాడుతున్నది “మగభాష” అనీ, ఆడవాళ్ళకి వేరే భాష కావాలనీ వాదించేరు. Woman అన్న పదంలో man ఉందని దానికి ప్రతిగా womyn అని మార్చడంలాటివి కూడా చేసేరు. 69, 70 దశకాల్లో ఇది ఉధృతంగా సాగింది. ఆ ఊపులోనే గ్లోరియా స్టైనమ్ పెళ్ళికి కూడా విముఖురాలు.

క్రమంగా ఆ ఉధృతం చల్లబడి, 80లు వచ్చేసరికి ఉద్యమం మరొక మలుపు తిరిగింది. ప్రముఖ రచయిత్రి ఆలిస్ వాకర్ (Alice Walker) కూతురు రెబెకా వాకర్ (Rebecca Walker) “నేను మూడో మలుపుని” అన్న శీర్షికతో వ్యాసం రాసి గ్లోరియా స్టైనమ్ నడుపుతున్న Ms Magazine లో ప్రచురించింది. ఆ వ్యాసం అనేకమంది ప్రముఖలనీ, ముఖ్యంగా ఆనాటి యువతనీ ఆకట్టుకుంది. స్ర్రీలు ఎదుర్కొంటున్న అసమానత్వం –  వయసు, లింగబేధం, జాతివివక్షతలు, గే, లెస్బియన్ జీవనవిధానం, దారిద్ర్యం, స్త్రీల విద్యాస్థాయి వంటి అనేక కోణాలు ఆమె ఎత్తి చూపి, సకల రంగాల్లోనూ అందరికీ సమస్థాయి ఉండాలి వంటి అంశాలు ఈ మూడోదశ స్త్రీవాదనలో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. ఈదశలో వెనకటి ఔద్ధత్యం తగ్గి, అందరం మనుషులమే అంటూ కొంత సమతూకంతో ఆలోచించడం కూడా మొదలయింది. ఇది అమెరికా, బ్రిటన్, యూరపులలో నడిచిన కథ.ఈ విషయాలన్నీ కొంతవరకూ మన సమాజంలో స్త్రీలకీ వర్తిస్తాయి అనిపించినా మనకీ వారికీ ఉన్న తేడాలు కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి, కేవలం హక్కులగురించే పోరాటం చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడంలాటిదే. అసలు మనదేశంలో స్త్రీలహక్కులగురించి మరోదారిలో సాగింది.

వ్యత్యాసాలు గమనించాలి మనం. భౌగోళికంగా, సామాజికంగా, జనాభాదృష్ట్యా ఏర్పడిన కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి మనకి. అవి కూడా మన జీవనవిధానాన్ని తీరిచి దిద్దుతాయి. ఇంతకుముందు ఒకసారి మాటాడుకున్నాం అనుకుంటా ఈవిషయాలు. మనకి కుటుంబం అంటే ఒక్క భార్యా, భర్తా, పసి పిల్లలు మాత్రమే కాదు కదా. నిజానికి బ్రిటన్లో కూడా మనసమాజంలో ఉన్నలాటి ఆనవాయితీలు పందొమ్మిదో శతాబ్దంలో కనిపిస్తాయి. జేన్ ఆస్టిన్ నవలలు చూడు. ఇరవయ్యవ శతాబ్దం తొలిపాదంలోనే మన స్త్రీలు స్వాతంత్యోద్యమంలో పాల్గొన్నారు కదా. గాంధీకి సత్యాగ్రహం చేయాలన్న స్ఫూర్తి మన ఆడవారినుండే వచ్చింది అంటారు.      

పాశ్ఛాత్యుల జీవనవిధానం మన జీవనవిధానం కంటె వేరు అయినా సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. అవి భిన్నంగా కనిపించవచ్చు కానీ క్రియాశీలకం కాదు. వారిబాధలు వారు ఎదుర్కొన్న విధానం మనకి ఆ క్షణానికి ఘనంగా కనిపించవచ్చు కానీ ఆచరణీయం కాదు. ఎంచేతంటే మన జీవనవిధానం వేరు. మన సామాజికపరిస్థితులు, కుటుంబపరిస్థితులు, మన వాతావరణం – వీటన్నటి ప్రభావం మన బతుకులమీద ఉంది. మన కుటుంబాలలో స్త్రీకి ఉన్న స్థానం వేరు.

మనం వారిని అనుసరించేముందు ఇవన్నీ అలోచించాలి. గుడ్డిగా అమెరికావో బ్రిటనో ఇలా చేస్తోందని అనుసరించడం అభ్యుదయం కాదు.

000

ఇల్లిందల సరస్వతీదేవి గారి భారతనారి – నాడూ నేడూ వ్యాసానికి లింకు https://archive.org/details/in.ernet.dli.2015.389592

000

(అక్టోబరు 30, 2021)