ఊసుపోక 29 – టెనిస్ చూడ్డం ఓ తమాషా

(ఎన్నెమ్మ కతలు 29)

ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ .. ఆస్ట్రేలియాలో పగలు ఆడినవి మాకు పగలు మళ్లీ కొత్తగా చూపుతారు. నేను నాలుగ్గంటలకే లేస్తాను కనక చివరి నాలుగు సెట్లు ఆడుతున్నప్పుడే (అంటే వాళ్ల రాత్రివేళ) చూస్తాను. మళ్లీ మధ్యాన్నం టీవీ పెడితే తెలిసింది అది నేను అంతకుముందే చూసేశానని. అలా చూస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారో ముందే తెలుసు కనక అట్టే సరదాగా వుండదు.

Continue reading “ఊసుపోక 29 – టెనిస్ చూడ్డం ఓ తమాషా”

ఊసుపోక -శ్రోతలు కోరని పాటలు

(ఎన్నెమ్మ కతలు 24)

నాకు సంగీతం ఇష్టం, నేను సంగీతం నేర్చుకోడం మాఅమ్మకి ఇష్టం. రేడియోలో లలితసంగీతం వచ్చినప్పుడల్లా నేను రేడియోకి అంటుకుపోవడం చూసి గాత్రంతో మొదలు పెట్టించింది నాచేత. అప్పట్లో రేడియోలో లలితసంగీతం పాఠాలు కూడా వచ్చేవి. నేనొకసారి అలా ఆరేడియో పెట్టెతో సాధన చేస్తుంటే Continue reading “ఊసుపోక -శ్రోతలు కోరని పాటలు”

ఊసుపోక – ఒక చెత్త క్షోభ

(ఎన్నెమ్ కతలు 21)

నా చెత్తభ్రమణం టపాతో ఈ సీరీస్ ముగించేద్దాం అనుకుంటుండగా, నిన్ననే ఓ వాఖ్య నాకళ్ల బడింది.

అమెరికా, అమెరికా అంటూ చెత్త రాసింది మూర్ఖురాలు.

నాచెత్తభ్రమణం మీద ఓ చిన్నవాడి చిత్తక్షోభ ఇదీ!

అపార్థానికి తావులేదులెండి. నా చిత్తభ్రమణం టపాకి లింకిచ్చారు. కాగా నాకు ఒరిగిందేమిటంటే మరో పది హిట్లు అధికంగా తగిలేయి. అందుచేత ఆ చిన్నవాడికి, ఎడ్మినిస్ట్రేటరుకి కృతజ్ఞతలు.

రమణి రాసినట్టు కొందరు అనామక నామధేయాలతో వ్యాఖ్యలు మనబ్లాగుల్లో పెడితేనూ, పెట్టడానికి ప్రయత్నిస్తేనూ, మరి కొందరు వేరే సైటుల్లో రాసుకుంటారు. ఆ బుద్దిమంతుడి ధర్మమా అని నాకు మరోటపా రాయడానికి మరో సరుకు దొరికింది. హీ హీ.

ఆలోచిస్తుంటే నాకు రెండు సందేహాలూ, ఒక అనుమానం కలిగేయి. చెప్తాను.

నా ఐక్యూ చాలా లో అని నాలో నేనే కాక మీలో ఎవులేనా అనినా ఒప్పేసుగుంటాను. అయితే ఈ చెత్త భ్రమణంలాటి పదాలు నాబుర్రలో పుట్టడం నా మూర్ఖత్వం మూలానే అనుకుందామా? ఇది మొదటి సందేహం.

రెండోది ఈ చెత్త రాయడం నేను మూర్ఖురాలిని కావడంచేతే అనే అనుకుందాం కేవలం వాదించడానికే.

నాకు అర్థం కాని సంగతి ఆ కుర్రవాడు పైన రాసిన అభిప్రాయంతో పాటు ప్రకటించుకున్న తన మేధాసంపత్తి. ఇలాటివి చదివే నేను అమెరికా చెత్త కాబోలు అనుకుని ఇండియా వెళ్లిపోయి… అంటూ రాస్తే నాకు ఆశ్యర్యంగా వుంది. ఇక్కడే నాకు తికమకగా వుంది. నాలాటి మూర్ఖులు రాసిన బ్లాగులు చూసి తమ జీవనసరళికి అతిముఖ్యమైన నిర్ణయాలు చేసేసుకునేవారు వున్నారంటేనే ఆశ్చర్యంగా లేదూ .

ఆలోచనలతో తల వేడెక్కి చిన్న మగత నిద్ర పట్టినట్టుంది. ఏటి సిన్నమ్మా! బెగులెట్టుకు కూకుడుండిపోనావు అంటూ సంద్రాలు నవ్వుతూ ఎదట ప్రత్యక్షమయింది.

నిట్టూర్చి, నేనెంత ఘోరఁవైన పన్జేసేసేనో చెప్పేను సంద్రాలుకి, ఇలా వుర్దిలోకి రావాల్సిన చిన్నవాడు పాపం నాకత చదివి ఛస్ ఇది కాదు సొరగం అదీ, అది కాదు సొరగం ఇదీ అనుకుంటూ ముందుకీ వెనక్కీ తిరుగుతున్నాడంట అని చెప్పి ఆపాపం నాదేనని చెప్పాను చెప్పలేని బాధతో.

అవుతే మరేటి సేస్తవు? అనడిగింది సంద్రాలు.

ఏవుందీ. ఇహ మీద ఆ రిసెర్చిలేవో నేనే జేసేసి, ఎవరు ఎక్కడ బతకాలో, ఎవరెలాటి ఉజ్జోగాలు చూసుకోవాలో, ఏం తినాలో అన్నీ నేనే నిర్ణయాలు చేసేస్తూ రాసేస్తాను అన్నాను.

గఁయ్యిమని లేసింది సంద్రాలు, నీకేటి మతి పోనాదేటి. ఆయనెవురో బుద్ది బుగ్గయి నీకతల్ల అవుపిచ్చిన మాట లట్టుకుని దేసిం ఎల్లిపోనాడా. మాపటేల మరో యమ్మ విసాపట్టంవెల్లి సేపలమ్ముకోమంటాది. వుంకో బాబు ముంబయెల్లి యాపారం ఎట్టుకో అంతడు. ఈ పెద్ద పెద్ద సదూలు సదూకున్న బాబు ఆలమాటా ఈలమాటా యినుకుంటా బొంగరంల్ల తిరగతడా. ఆయన సదూకున్న సదూలేటయిపోనాయి. “ఏది ఆసికాలు, ఇందలో నిజివెంతున్నదీ, నాను సదూకున్నాను, నానెక్కడుండలో, ఏటి సెయ్యాలో నాకు తెలవాల అని ఆ బాబుకుండాల గానీ నీమాటా నీమాటా ఇనుకుంటా ఎంతదనిక ఎల్తడు. ఇనాల్నుంటే ఆలెవరో కవున్సిలీరున్నరు గంద. ఆల్నడగాల. రెండొందలుచ్చుకుని నీకు ఏది బాగున్నదో అది సెయ్యి అన్సప్తరు. జలుబొదిలిపోతది. అయినా దేసింలో వున్నడు ఆడికి తెలీదేటి దేసిం ఎలాగున్నదో. నివ్వు సెప్పీదేటి. ఆరి యవ్వారం ఆరిది. నీ యవ్వారం నీది. అంది.

అంతేనంటావా అన్నాను ఆమాత్రం దన్ను దొరికినందుకు గుండె కూడదీసుకుని. సంద్రాలు మాయమయిపోయింది.

ఇంకా ఆలోచిస్తూనే వున్నాను. ఇది థాంక్స్గివింగు వారం. అమెరికా ( అదుగో, చూశారా మళ్లీ అమెరికా అంటోంది1 ప్చ్.), ఇంతకీ ఇదీ అమెరికా అధ్యక్షులవారు ఒక సీమకోడిని క్షమించేసి, ఆకాశంలోకొదిలేసి, మరో సీమకోడిని కోసుకు తినే శుభదినం. మరి నేను కూడా సాంప్రదాయం పాటించి అన్ని కోళ్లనీ సాధుభావంతో వదిలీయాలి. ఎలాగా కోడ్ని తినను కనక అన్నిటినీ గాలికొదిలేస్తే పోలే …

క్షమ కవచము. క్రోధమది శతృవు, జ్ఞాతి హుతాశనుండు, మిత్రము దగు మందు …  అన్నారు కదా.

అంచేత మరో వ్యాఖ్యోడి కత కూడా నా కవచానికి దృష్టాంతంగా చెప్తాను. 

ఈమధ్య నేను రాసిన ఇంగ్లీషుపుస్తకంమీద వచ్చిన సమీక్ష మీద రెండు వ్యాఖ్యలొచ్చేయి అది తెలుగులో రాసి వుండవలసిందని. నాకు తోచిన సమాధానం ఏదో నేను చెప్పుకున్నాననుకోండి. అందులో ఒకాయన నిజంగానే పుస్తకం చదివి మాటాడుతున్నట్టు కనిపించింది. బాగానే వుంది.

రెండో బుజ్జితండ్రికి మాత్రం పుస్తకం చదివే లక్షణమూ, ఓపికా వున్నట్టు కనిపించలేదు. కనీసం సమీక్ష కూడా సరిగ్గా చదవలేదు. నాకంటే తనకే ఎక్కువ హైక్యూ వుందని ఋజువు చెయ్యాలని కాబోలు హోరుమంటూ మొదలెట్టాడు ప్రశ్నల జోరు. ఏదో ఓ వ్యాఖ్య రాసి పారేయడమే అతగాడిలక్ష్యమేమో మరి. పుస్తకం చదవని కాడికి అది తెలుగులో వుంటేనేమిటి స్వహీలీలో వుంటేనేమిటి అనిపిస్తోంది నాకు.

ఈ ఉత్త (రాల) రచయితలు బాగా చదువుకున్నవాళ్లు, మంచి వుద్యోగాల్లో వున్నవాళ్లు. ఎందుకు ఇలా తమ అమాయత్వాన్ని (మూర్ఖత్వం అంటే బాగుండదు కదా) పత్రికల్లో అంతర్జాలంలో ప్రదర్శించుకుంటారు.?

ఈమధ్యనే విన్నాను అమెరికా (మళ్లీ అమెరికా మాట! :) లోనే ఆటిజమ్అన్న ఒక రకం మానసిక తత్త్వం అనుకుందాం దాన్నిగురించి. ఆలోపం వున్నవాళ్లలో కొందరు అతి చిన్నవిషయాలు చొక్కా బొత్తాలు పెట్టుకోడంలాటివి చెయ్యలేరు. కానీ కొన్ని ఇతర విషయాల్లో ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనంలాటి కళల్లో అద్వితీయమైన ప్రతిభ చూపుతారు. లేదు లేదండీ. నేను మనవాళ్లని ఆటిస్టిక్ అనడంలేదు. ఊరికే గుర్తొచ్చింది, చెప్పానంతే. :p .

మనిషి మెదడు చాలా చిత్రమయినదిట. అందులో చాలా చిన్నచిన్న అరలుంటాయిట. ఆటిజమ్ వున్నవాళ్లలో జరిగేది అదే. ఒక భాగం పని చేసినట్టు మరొక భాగం పని చెయ్యదు. ఈ వాదన ఈవ్యాఖ్యలాళ్లకి ఆన్వయించి చూచుకుంటే, కొందరికి తమ రంగాల్లో గొప్ప ప్రతిభావిశేషాలు చూపినా, వాఖ్యానాలు రాయడానికి కూర్చున్నప్పుడు వేపకాయంత వెర్రి తన్నుకొస్తుందేమోనని నా అనుమానం.

పాఠకమహాశయులారా! నన్ను అర్థం చేసుకోరూ దయ చేసి. నేను కూడా ఆకోవలోకే రావచ్చు కీబోర్డు చేపట్టి ఇటువంటి  టపాలు రాయడానికి కూచున్న సందర్భాలలో.

చివరిమాటగా ఇందుమూలంగా చేరువయిన అభిమానులకీ, ఈటపాలవల్ల ప్రజ్వరిల్లిన చిరాకుతో నారచనా వ్యాసంగానికీ ముడిసరుకు సరఫరా చేస్తున్న పుణ్యమూర్తులకీ ధన్యవాదాలు.  :).  


(నవంబరు 28, 2008. )

 

ఊసుపోక – చెత్త భ్రమణం

(ఎన్నెమ్మ కతలు 20)

 

భూమి గుండ్రంగా  నుండును.

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడిచుట్టూ దీర్ఘవృత్తంలోనే తిరుగును.

మనం వస్తువులు పారెయ్యం. పారబోసేది వారబొయ్యమని సామెత.

పిల్లలు కంచాల్లో వదిలేసిన కూరలూ అన్నాలూ అయ్యో పారేస్తామా అంటూ తినేసేవారు తల్లులు. ఆ తరవాత వొళ్లు చేస్తోందని బాధ పడేవాళ్లు కూడా లెండి. ఇంకా మిగిలిపోయిన వంటకాలూ, పాతబట్టలూ పనివాళ్లకీ ముష్టివాళ్లకీ పారేసేవాళ్లు. నలుగురు పిల్లలున్న ఇళ్లలో చిన్నపిల్లలు సాధారణంగా అక్కయ్యల పరికిణీలకీ, అన్నయ్యల చొక్కాలకీ తిరుగులేని వారసులు.

చెత్త భ్రమణంలో అంటే మనం సృష్టించే చెత్తని మళ్లీ ఉపయోగించుకునే విధానం. అందులో రెండు కోణాలున్నాయి.

ఒకటి పైన చెప్పినట్టు ఎవరింట్లో వాళ్లూ, ఎవరిదేశంలో వాళ్లూ సద్వినియోగం చెయ్యడం.

రెండోది పొరుగుదేశాలకి ఎంతో ఔదార్యంతో బట్వాడా చేసేయడం. అది కూడా చాలా తెలివితేటలతో.

అరవయ్యో దశకంలో అమెరికావారికి గోధుమ ముమ్మరంగా పండింది. అప్పుడే వారిబుద్ధికి మరో ఆలోచన తట్టింది.  పొరుగుదేశాలని జయించాలంటే వాళ్లభాష నేర్చుకోవాలీ అని (ఇది మరో ఇంగ్లీషువాడు కనిపెట్టిన సిద్ధాంతం అని మనకి తెలుసు కదా. అంటే ఇది ఐడియా రిసైకిలింగు). దాంతో యూయస్ గవర్నమెంటాళ్లు యూనివర్సిటీలలో పరభాషలు నేర్పడానికి బోలెడు గ్రాంటులిచ్చేశారు (అదే ఎ.ఐ.ఐ.యస్ సంస్థ చేసే పని). ఆ పరభాషా చదువులకోసం హడావుడిగా మీరు ఇండియాలో ప్రచురించిన పుస్తకాలన్నీ మేం కొనేస్తాం అని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెసు ఆఫీసొకటి ఢిల్లీలో పెట్టేసి పుస్తకాలన్నీ పోగేయడం మొదలెట్టారు.

చెత్తభ్రమణం అని కదూ మొదలు పెట్టేను. వస్తున్నా అక్కడికే.

మన పుస్తకాలు కొనడానికి వాళ్లు విచ్చుడాలర్లు ఇచ్చే ఉద్దేశంలో లేరు. మాకు మిగిలిపోయిన గోధుమలు మీకిచ్చేస్తాం అప్పుకింద. వాటికి బదులు మీ పుస్తకాలు మాకు పంపించండి అని బార్టరింగు చేసేరు. దీనికే ఇండియా వీట్ లోన్ ప్రోగ్రాం అని పేరు. అలాగే పాలపొడి కూడా. పశువులమీద తెగ రిసెర్చీలు చేసేసి, పాలు ఉధృతంగా ఉత్పత్తి చేసేసి, దిక్కుమాలిన దేశాలకి రవాణా చేసేసేరు తమ హృదయాల్ని సహారా ఎడారి అంత వెడల్పు చేసుకుని.

మన భూగోళంచూట్టు తిరిగే తదితర చెత్తభ్రమణాలు ఐడియాల రూపంలో …  

విస్తరాకులు పోయి కాయితపు కంచాలొచ్చేయి.

ఎక్కడినించీ? అమెరికానించే

గుడ్డసంచులు పోయి ప్లాస్టిక్ సంచులొచ్చేయి

ఎక్కడినించీ?

కుండల్లోనూ కూజాల్లోనూ మంచితీర్థం పోయి, సీసాలొచ్చేయి.

ఎలా అనుకున్నారూ?

మరి కొన్నాళ్లకి, ఇలా కాయితాలు పళ్లేలకి వాడితే చెట్లు నాశనమయిపోతున్నాయి అంటూ రివర్స్ ఆలోచనలు చేయడం మొదలయింది ఈమధ్యనే. వృక్షములను రక్షించవలె అనీ తానతందానా మొదలయింది.

ఈమధ్య అమెరికాలో నీళ్లసీసాల వాఢకం తగ్గిద్దాం అంటున్నారు. ప్రతి సీసా కొనుక్కునే బదులు అదే సీసాలో కుళాయి నీళ్లు నింపుకు తాగండి అని కూడా సలహాలిస్తున్నారు.

రెష్టారెంటుల్లో సీసాలకి బదులు గ్లాసుల్లో నీళ్లు పెడుతున్నారు బల్లలమీద. ఎంత నవ్య నూతన ఐడియోవో, హాహా

ప్లాస్టిక్ సంచులు మానేసి గుడ్డ సంచులు వాడమంటున్నారు అమెరికాలోనే.

మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే అనుకుంటున్నట్టున్నారు అదే బాగుంటుందనీ ..

మరో సంగతి. అమెరికాలో సంచులు కూడా మళ్లీ  పెట్టుబడీవిధానంలో భాగమే. గుడ్డసంచులు వాతావరణానికి ఆరోగ్యం అన్న నెపంతో ప్రతి షాపువాడూ తనషాపుపేరు అచ్చొత్తించిన సంచీలు వూరికే ఇవ్వడం కాదు అమ్ముతున్నారు. సంచీమీద లాభం. ఆ సంచీమీద ఆషాపు పేరుంటుంది కనక మరొక ప్రచారసాధనం. అవి చూస్తే నాకు నాచిన్నప్పుడు ఫలానావారి ధర్మం అంటూ బీదవారి చొక్కాలమీద కనిపించే దృశ్యం గుర్తొస్తుంది.  

ఈపూటవంటకి ఇంట్లో కూరల్లేవు. బజారుకెళ్లి నాలుగు వంకాయలు తీసుకురండి అని అమ్మ చెప్తే, పైపంచె దులిపి బుజాన వేసుకు, చెప్పులేసుకుని, ఆచేతిసంచీ ఇలా తే అని గుడ్డసంచీ అందిపుచ్చుకు బజారుకి బయలుదేరే నాన్నలు మళ్లీ కనిపించకపోవచ్చు.

ఆలోచిస్తే విస్తరాకులకున్నంత  రిసైకిలింగు పవరు మరే వస్తువుకీ లేదనిపిస్తోంది. చెట్లనుంచి తీసుకున్న అడ్డాకులు విస్తరి కుట్టుకుని, వాటిల్లో భోంచేసి, పారేస్తే, నోరు లేని పశువులు మేస్తాయి. మళ్లీ వాటి పేడ పిడకలు పొయ్యిలోకి పనికొస్తాయి గాస్ పొయ్యిలు కొనుక్కోలేనివాళ్లకి. అలా అన్నం వొండుకుని ఆకుల్లో తిని  …..

ఏంటో … ఇలా ఆలోచిస్తూంటే నాకు ఈ చెత్తభ్రమణం నిజంగా కనిపెట్టింది మనమే అనిపిస్తోంది. ఏ అమెరికన్ కంపెనీ అయినా ఓ విస్తరాకుల కంపెనీ, ప్రారంభించగలరేమో కనుక్కోవాలి …..

 

(నవంబరు 2008. )

ఊసుపోక -అభిమానాలకి కొలమానాలు

(ఎన్నెమ్మ కతలు 18).

అమెరికాలో పెద్ద పండుగ క్రిస్మస్. థాంక్స్ గివింగ్ కూడా పెద్దదే కానీ క్రిస్మస్ హడావుడి ఎక్కువ. ఎందుకంటే చలికాలం వచ్చేసుంటుంది కదా అప్పటికి ముమ్మరంగా. మంచూ, చలీ, … చెత్త పారేయడానికి గడప దాటాలన్నా పులివేషం వేసినట్టు కోటూ, బూటూ తొడగడానికే ముప్పావుగంట ముస్తాబు కావాలి. Continue reading “ఊసుపోక -అభిమానాలకి కొలమానాలు”